గడసరి గయ్యాళి సూర్యకాంతం

11
3

[dropcap]18[/dropcap]-12-2021 శ్రీమతి సూర్యకాంతం వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఆమె తెలుగు సినిమా ప్రేక్షకులకు సూరమ్మత్త, సూరేకారం, సూర్యాకాంతమ్మ అని హడలు పుట్టిస్తుంది. కోపాన్నే కాదు సంతోషాన్నీ ఎడమ చేత్తోనే వ్యక్తపరుస్తుంది. ఆ పేరు తమ కూతుళ్ళకి పెట్టుకోవాలంటేనే భయపడిపోతారు తల్లిదండ్రులు. ఆమె దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి కూడా ప్రేక్షకులు భయపడేవారు. ఫంక్షన్లలో ఆమె ప్రక్కన కూర్చోవాలన్నా వారికి భయమే! అయితే తెర వెనక ఆమె సాత్వికురాలు, సినిమా పేద టెక్నీషియన్ల పిల్లల చదువుకు సాయమందించే, పెళ్ళిళ్ళలో తాళిబొట్లు కొనిచ్చే మంచి మనసున్న మహిళామూర్తి. వేషాలు దొరకని చిన్న నటులకు అన్నం పెట్టే అన్నదాత. మహామనిషి. ఆమే పొన్నాడ (పెద్దిభొట్ల) సూర్యకాంతం.

ఈమె 1924 అక్టోబర్ 28వ తేదీన మద్రాసు ప్రెసిడెన్సీలోని గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటరత్నమ్మ, పొన్నాడ అనంతరామయ్యలు. 14 మంది పిల్లలలో 10 మంది చనిపోగా నలుగురు మిగిలారు. ఈమె చివరి సంతానం కావడంతో గారాబంగా పెరిగింది.

ఆరేళ్ళ వయసులోనే పాడేది, నాట్యం చేసేది. బూచోడని భయపెడితే బూచి లేడు ఏమి లేడు ఫో అని ఎడమచేత్తో సైగ చేసి అందరినీ నవ్వించేదట. ఒక్కో స్కూలులో ఒక్కొక్క క్లాసు చదివేదట.

ఆ రోజుల్లో కాకినాడలో బాలాంత్రపు ప్రభాకరరావు ఆల్ గర్ల్స్ డ్రామా కంపెనీ నడిపేవారు. ఈమెకి సతీసక్కుబాయి నాటకంలో పురుష పాత్ర ఇచ్చి నటింపజేశారు ఆయన. ఆమె విగ్రహం, నడక, రూపు, హుందాతనం పురుష పాత్రధారణకు సరిపోయేవి. తులాభారం, సక్కుబాయి, చింతామణి వంటి నాటకాలలో పురుష పాత్రలను ధరించి ప్రేక్షకులను అలరించారు. ఆ ఊరులో మాత్రమే నాటకాలలో నటించేవారు. వేరే ఊళ్ళకి వెళ్ళేవారు కాదు.

ఈమెకు విషయాల పట్ల శ్రద్ధ, ధ్యాస, ధ్యానం, పట్టుదల ఎక్కువగా ఉండేవి. ఇవన్నీ ఈమెని ఏకసంధాగ్రాహిని చేశాయి. ఒకసారి న్యాయవాది యం.వెంకట రమణయ్య గారు ఈమెకి ఒక కఠినమైన పద్యాన్ని చదివి వినిపించారు. తప్పులు లేకుండా చెప్పిన ఆమెకి ఆశీర్వాదాలు అందజేశారు.

ఈమె హిందీ సినిమాలలో నాయికగా నటించాలని అనుకునేవారు. 1944 డిసెంబర్ నెలలో చెన్నపట్టణం (నేటి చెన్నై) చేరుకున్నారు. జెమిని వారి చంద్రలేఖ సినిమాలో గ్రూపు డ్యాన్సర్ వేషం లభించింది.

నారద నారది సినిమాలో సహాయనటి పాత్రని పోషించారు. ‘గృహప్రవేశం’ (L.V. ప్రసాద్ దర్శకత్వం) భానుమతి గారి భరిణి వారి ‘రత్నమాల’ సినిమాలలో చిన్న పాత్రలను ధరించారు.

‘సౌదామిని’ సినిమాలో కథానాయిక పాత్రకు ఎంపికయారు. అయితే ఈమె కారు ప్రమాదానికి గురయ్యారు. ముఖానికి గాయాలయ్యాయి. తరువాత లావవడంతో నాయిక పాత్రలో నటించలేక పోయారు.

‘ధర్మాంగద’ సినిమాలో మూగ, కుంటి అమ్మాయిగా నటించి మెప్పించారు.

1950లో హైకోర్టు న్యాయవాది పెద్దిభొట్ల చలపతిరావు గారితో ఈమె వివాహం జరిగింది. ఈ దంపతులకు పిల్లలు లేరు.

‘సంసారం’ సినిమాలో అత్త పాత్ర. అదీ తరువాత కాలంలో ఎన్నో చిత్రాలలో తనకి జోడీగా నటించిన హాస్యనటుడు రేలంగికి అత్తగారుగా నటించడంతో సూర్యకాంతమత్త, సూరేకారమత్తకు నాంది పలికింది.

సాధారణంగా అత్తలంటే కోడళ్ళని ఆరళ్ళు పెట్టే అత్త అనే అనుకుంటాం. కాని ఈ గుండత్త కోడళ్ళనే కాదు – అల్లుళ్ళనీ ఇబ్బందుల పాయేసే అత్తగానూ నటించి రికార్డు సృష్టించడం సినిమా రంగంలో ఓ విశేషం.

పెళ్ళి చేసి చూడు, బ్రతుకు తెరువు, దొంగరాముడు, భాగ్యరేఖ, అప్పు చేసి పప్పుకూడు, కృష్ణలీలలు, శాంతి నివాసం, ఇద్దరు మిత్రులు, రక్త సంబంధం, నర్తనశాల, చదువుకున్న మూగ మనసులు, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, గోరంత దీపం, కార్తీక దీపం, పెళ్ళి బంధువులొస్తున్నారు జాగ్రత్త వంటి సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలలో జీవించారు.

చెల్లెలు, అక్క, ఆడపడుచు, వదిన, తోడికోడలు, అమ్మమ్మ, నానమ్మ వంటి వైవిధ్యభరిత పాత్రలలో విభిన్న రసాలను తన నటనలో పండించారు.

ఈమె ధరించిన ఎక్కువ పాత్రల రూపకల్పన ప్రత్యేకంగా ఉంటుంది. గడుసుతనం, దుష్టత్వంతో మొదలయిన పాత్రలు చివరకు పరివర్తన చెంది మంచిగా సాత్వికంగా మారతాయి. ఈ విధంగా మారే తీరులో ఈమె వివిధ రసాల పోషణ అద్వితీయం, అపురూపం, అజరామరం.

ఎడమ చేతి వాటం, చూపుల్లో చురుకుదనం, కరుకుదనం, నిప్పులు కురిపించడం ఈమె నటనకు పరాకాష్ట. సంభాషణలు పలికే తీరు, మూతివిరుపు, వెక్కిరింపు, వెటకారాలను ఈమె కాక ఎవరు ప్రదర్శించగలరు? కుడి చెయ్యి నడుం మీద పెట్టి, ఎడమ చెయ్యి మెలికలు తిప్పుతూ, శాపనార్థాలు పెడుతున్న ఆమెను చూస్తుంటే కోపం కాదు. నవ్వు వస్తుంది. సినిమా చివరి సన్నివేశాలలో సాత్వికంగా మారిపోయి జాలి చూపులు, ప్రశాంతంగా, పశ్చాత్తాపంతో, ఒక్కొక్కసారి పిచ్చిపట్టినట్లు అమాయకపు చూపులతో కనిపించే ఆమెని చూస్తే — ఆ నటనని వర్ణించనెవరితరం?

‘గుండమ్మ కథ’లో సవతి కూతుర్ని ఇబ్బందులకు గురిచేస్తూ, కన్నకూతురి పట్ల ప్రేమను కనపర్చడంలో ఈమెకు ఈమే సాటి. సవతి అల్లుడిని ఆరళ్ళు పెట్టడం, కన్నకూతురుకి అల్లుడు పెట్టే బాధలు భరించలేకపోవడం, ఇంటి పెత్తందారీగా ఒక వెలుగు వెలిగినప్పటి ఆనందం, విలన్లు తనని గెస్ట్ హౌస్‌లో బంధించినప్పటి బాధ, దుఃఖం, చివరకు మంచి వ్యక్తిగా మారినప్పటి భావం-ఇన్ని రకాల భావాలను ఆమె నటన, సంభాషణల ద్వారా ఆ పాత్రని పండించిన తీరు అనితర సాధ్యం. ఈ ఒక్క సినిమా చాలు ఆమె నటనా ప్రాభవానికి.

ఇద్దరు మిత్రులు, మంచి మనసులు, గోవుల గోపన్న మొదలయిన సినిమాలలో స్వాత్రిక పాత్రల అభినయం చూడ ముచ్చట గొలుపుతుంది.

అత్తగారు-కొత్త కోడలు, వరకట్నం, ఇల్లు ఇల్లాలు మొదలయిన చిత్రాలలో కోడళ్ళను ఆరళ్ళు పెట్టే అత్తగారి పాత్రలు చూస్తే కొత్తగా కోడళ్ళు కాబోయే వారికి భయమేస్తుంది.

ఇల్లరికం, వెలుగు నీడలు వంటి చిత్రాలలో అల్లుళ్ళనీ ఇబ్బందులు పెట్టి అవమానాలకు గురి చేస్తుంది.

ఇద్దరమ్మాయిలు, ఇల్లు-ఇల్లాలు వంటి చిత్రాలలో సవతి పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తుంది.

తోడికోడళ్ళు సినిమాలో చిన్న కోడలిని చూసి అసూయ పడుతూ, పెద్ద కోడలికి చాడీలు చెప్పే తీరు, అర్ధరాత్రి దొంగ తిండి తినే సన్నివేశాలలో చాలా సహజంగా నటించారు.

మాయాబజార్ సినిమాలో హిడింబి పాత్ర ఈమె నట జీవితంలో ప్రత్యేకమైన పాత్ర. తోడికోడలు సుభద్రని ఓదార్చే సన్నివేశాలు, ‘సుపుత్రా!’ అంటూ ఘటోత్కచుని కోపాన్ని తగ్గించి “శ్రీకృష్ణుని దర్శనం చేసి స్తోత్రం సేయరా సుపుత్రా” అనే ఉద్బోధలు తమాషాగా ఈమె ధరించిన మిగిలిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది.

తిక్క శంకరయ్య, జరిగిన కథ వంటి సినిమాలలో ఆధునిక మహిళగానూ నటించి మెప్పించారు.

‘జయభేరి’ సినిమాలో ఆపద్ధర్మంగా నాట్యం చెయ్యాలని నాట్యం నేర్చుకోమని నేర్పుతారు రేలంగి గారి గ్రూపు వారు. కొన్ని విచిత్ర భంగిమలు నర్తించి “అమ్మా కాళ్ళు నొప్పులే!”, “మావా కాళు నొప్పులే!” అంటుంటే నవ్వాపుకోలేం. ‘సెక్రటరీ’ సినిమాలో అక్కినేనితో కలిసి స్టెప్పులు వేసి నవ్వించారు.

‘దసరాబుల్లోడు’ సినిమాలో పిసినారితనంతో భర్తకి, దత్తపుత్రుడికీ కారం మెతుకులు పెట్టే పాత్రలలో జీవించడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య.

‘అందాల రాముడు’ సినిమాలో పుల్లట్లు అమ్మే పాత్రలో నటించారు. షూటింగ్ సమయంలో పడవలోనే అందరికీ వండి పెట్టడం నిజంగా విశేషమే!

సహనటి ఛాయాదేవితో ఈమె జుట్టు పట్లు, నీళ్ళలో బిందెలతో పోట్లాటలు నాటి సినిమాలలో హాస్యపు సన్నివేశాలను సుసంపన్నం చేసేవి.

అమెరికాలో డాలర్ బజ్జీలమ్మినా, మనదేశంలో పుల్లట్లు అమ్మినా, ఇంట్లో ధాన్యం, అపరాలు దొంగతనంగా అమ్ముకున్నా ఆ పాత్రలలో ఆమె నటన అనితర సాధ్యం.

ముత్యాల ముగ్గు సినిమాలో భర్త చాలా మంచివాడని నమ్మి- చివరకు అతను దుర్మార్గుడని తెలిసి చూసిన ఏహ్యపు చూపు అద్వితీయం.

ఈమె నటించిన చివరి సినిమా యస్.పి.పరశురాం. చిన్ని వ్యాసంలో ఎన్ని పాత్రలని విశ్లేషించగలం?

ఈనాటికీ ఈమె నటించిన పాటలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉండడం విశేషం. ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమాలో “ఏమిటి ఈ అవతారం — చాలును మీ పరిహాసం, ఈ సొగసంతా మీ కోసం” పాట, భార్యాభర్తలు సినిమాలో “చూచి చూచీ కళ్ళు కాయలూ కాచాయి — చుక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు” అనే ప్రేమ గీతాలలో (రేలంగి గారితో) ఈమె హొయలు, వగలు చూసి నవ్వుకోవడానికి రెండు కళ్ళూ చాలవు.

‘లక్షాధికారి’ సినిమాలో “అచ్చమ్మకు సీమంతమాయెనే” పాటలోనూ ముఖం విసుగ్గా పెట్టి మూతి విరవడం, ఎడమ చేత్తో విసుగ్గా విసిరి కొట్టడం ఈమెకు మాత్రమే ప్రత్యేకం.

ఇలా పాటల చిత్రీకరణలోనూ నిర్మాతలు, దర్శకులు ఈమెని విలక్షణ నటిగానే చూపించారు. ఇవన్నీ ఆయా సినిమాలని హాస్యంతో అలరించి, ప్రేక్షక శ్రోతలను నవ్వులలో ముంచెత్తాయి.

“నువ్వు తెలుగు భాషకి చేసిన అన్యాయం ఒకటుంది. ‘సూర్యకాంతం’ అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు” అని ఆమెతో అన్నారు ప్రముఖ సినీనటుడు స్వర్గీయ గుమ్మడి వెంకటేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో.

స్వర్ణయుగం నుండి వర్ణయుగపు తొలిరోజుల వరకు యస్వీరంగారావు-సూర్యకాంతం, రమణారెడ్డి -సూర్యకాంతం, రేలంగి – సూర్యకాంతం, గుమ్మడి- సూర్యకాంతం జంటగా నటించిన సినిమాలు విజయవంతమయ్యాయి. ఈనాటికి నవ్వుల పువ్వులను పూయిస్తున్నాయి. ఆ సినిమాలను సునంపన్నం చేసి చిరంజీవులని చేశాయి.

 

ఆ రోజుల్లో కొత్త సినిమా వస్తుందంటే గుండక్క ఉందా? సూర్యకాంతం ఉందా? అని ప్రేక్షకులు, సినిమా పంపిణీదారులు ప్రశ్నించేవారట.

ఆమె ‘అన్నదాతే కాదు చిరుతిళ్ళదాత’ కూడా! తను స్వయంగా రకరకాల తినుబండారాలను వండి, క్యారియర్లలో తీసుకొచ్చి నటీనటులకు, టెక్నీషియన్లు అందరికీ పెట్టేవారట. సూర్యకాంతం గారి షూటింగ్ ఉందంటే చాలా మంది ఇంటి దగ్గరి నుండి భోజనం తెచ్చుకునేవారు కాదట.

నిర్మాతల దగ్గర నుండి తనకు అందవలసిన రెమ్యూనరేషన్ చిల్లుకానీతో సహా వసూలు చేసేవారట. ఈమె దానగుణం కూడా చాలా గొప్పది. అయితే అపాత్రదానం చేసేవారు కాదు. సద్వినియోగం చేసేవారికే దానమిచ్చేవారు. వృథా ఖర్చు ఆమెకి గిట్టేది కాదు.

తనకి సంబంధించిన వస్తువులు పాడైతే బాగుచేయించే పని ఎవరికీ అప్పజెప్పేవారు కాదు. స్వయంగా తనే పర్యవేక్షించేవారు. ఉదాహరణకి కారు పాడయితే చిన్న బోల్ట్‌తో సహా తనే దగ్గరుండి వేయించుకునేవారట. మెకానిక్ ఇంటికే వచ్చి బాగు చేసేవారట. ,

ఈమె థర్డ్ ఫారం మాత్రమే చదివారు. ఈమె బహుభాషా కోవిదురాలు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, మరాఠీ, ఇంగ్లీషు భాషలను మాట్లాడేవారు. జర్మన్, ఫ్రెంచ్ భాషలను కూడా నేర్చుకోవడం కొత్త భాషల పట్ల ఈమెకి గల ఆసక్తికి నిదర్శనం.

సహజ నటకళాశిరోమణి, హాస్యనటశిరోమణి, బహుముఖ నటనా ప్రవీణ, రంగస్థల శిరోమణి, అరుంగలైమామణి, వంటి బిరుదులు ఈమెకు లభించాయి.

ఈమెకు డిగ్రీ చదవాలనే కోరిక ఉండేది. అది తీరని కోరిక అయింది. కాని 1994 డిసెంబర్‌లో శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ఈమె ప్రతిభను గుర్తించి డాక్టరేట్ నిచ్చి గౌరవించారు.

1996 డిసెంబర్ 18 వ తేదీన చెన్నెలో మరణించారు. మధుమేహ వ్యాధితో ఈమె శరీరం కృశించిపోయింది. ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. సరయిన వైద్యం చేయించుకుంటే మరి కొంతకాలం జీవించి సినిమాలలో నటించే వారేమో?

తెలుగు సినిమా వెండి తెర మీద అత్తరికాన్ని చెలాయించిన అరుదయిన నటీమణి, ప్రత్యామ్నాయం లేని గుణ చిత్రనటి, సహజనటి సూర్యకాంతమ్మ.

ఈమె జ్ఞాపకార్థం 18-11-2021వ తేదీన ప్రత్యేక కవర్‌ని విడుదల చేసి గౌరవించింది భారత తపాలాశాఖ. ఈ కవర్ మీద క్యాన్సిలేషన్ ముద్ర కూడా ఆవిడదే కావడం విశేషం. ఈముద్రలో ఎడమ చేతిలో గడ్డం పుచ్చుకుని ఆశ్చర్యంతో, మెరుస్తున్న కళ్ళతో ఈమె కనిపిస్తారు.

కవర్ మీద ఎడమవైపు మూడు ఫోటోలను ఫిల్మ్ స్క్రిప్ మధ్యలో ముద్రించారు. ‘ఆంధ్రుల గడసరి అత్త’ అని తెలుగులో ముద్రించారు. తెలుగు, హిందీ, ఆంగ్లభాషలలో సహజనటి డా॥ సూర్యకాంతం’ అని ముద్రించి బహుభాషా కోవిదురాలైన ఆమెని గౌరవించడం ముదావహం.

డిసెంబర్ 18 వ తేదీ ఈమె వర్ధంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here