[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]సా[/dropcap]విత్రమ్మ చాలా గాభరాగా ఉంది. హాల్లో సోఫాలో కూర్చున్న ఊహని కాస్త ఓదారుద్దామని చూస్తే ఆ పిల్ల మహా నిష్పూచీగా, కాలు మీద కాలు వేసుకుని, చేతిలో మొబైల్‌ను చూసుకుంటోంది.
‘ఇదేంటీ పిల్ల! అసలీ పిల్లకి మొగుడంటే భయం లేదా! నలుగురిముందూ ఏదైనా అనకూడని మాట అంటాడేమోననే బెదురే లేదా! బహుశా ఆ పిల్ల మొగుడు ఏమీ అనడేమో. ఆ.. అయినా ఏ మొగుడైనా సరే ఆ పిల్ల చేసిన తెలివితక్కువ పనికి కోపం చేసుకోకుండా ఉంటాడా నా పిచ్చి కానీ.. ఎంత మరుపైతే మాత్రం ఆటోమాటిక్ తాళం పడిపోయే తలుపుని, చేతిలో తాళంచెవి లేకుండా బయటకొచ్చి తలుపేసుకుంటారా! ఇప్పుడీ తలుపు తియ్యడానికి పాపం ఆ కుర్రాడు ఎన్ని అగచాట్లు పడుతున్నాడో! ఈ పిల్ల మటుకు ఎంచక్కా నేనిచ్చిన వేడి వేడి కాఫీ ఊదుకుంటూ తాగేసి, తీరుబడిగా మొబైల్ చూసుకుంటోంది. అయినా ఇంతసేపు ఆ మొబైల్‌లో ఏం చూసుకుంటోందో.. బహుశా బాబీగాడిలా గేమ్స్ కానీ ఆడుతోందేమో..’
ఆలోచిస్తున్న కొద్దీ సావిత్రమ్మకి బుర్ర వేడెక్కిపోతోంది. ఆవిడ కాపరానికొచ్చి యాభయేళ్ళైంది. అప్పటి రోజుల్లో మొగుడేమైనా అంటాడేమోనని ముందే భయపడిపోయి, అగ్గగ్గలాడిపోతూ అన్నీ అందించేవారి కోవలోకి చెందినావిడ. ఏ తప్పూ జరగకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా, రంధ్రాన్వేషణలో సిధ్ధహస్తుడైన శేషగిరి ఏదో లోపం వెతికి మరీ సావిత్రిని నలుగురిలో నానామాటలూ అనేసేవాడు. ఎదురు సమాధానం చెపితే ఇంకా రెచ్చిపోతాడని గుడ్లనీరు కుక్కుకుంటూండేది సావిత్రి.
అప్పటికీ ఇప్పటికీ శేషగిరి స్వభావం అలాగే ఉంది. సావిత్రి మటుకు ఇప్పుడిప్పుడే ఈ మధ్యనే పెళ్ళైన వాళ్లని చూసి కాస్త కాస్త జవాబు చెప్పడం నేర్చుకుంది. ఆమాత్రం జవాబు చెప్పినందుకే శేషగిరి భార్య తన అదుపు తప్పిపోతోందని ఫీలైపోతుంటాడు. కానీ ఈ పెద్దవయసులో భార్యమీద ఆధారపడనిదే తన పనులు అవవు కనక తనలో తనే గింజుకుంటూంటాడు. అందుకే సావిత్రికి ఊహని చూస్తే అంత ఆశ్చర్యం.
ఆర్ధికస్వేచ్ఛ వల్ల ఊహ అలా ఉందనుకోడానికి ఆమె ఉద్యోగస్థురాలు కాదు. ఏది కొనాలన్నా మొగుడు శేఖర్ డబ్బుతోటే. అలాంటప్పుడు ఇదివరకటి రోజుల్లో అయితే కాస్త స్వతంత్రంగా భార్యలేమైనా ఖర్చు పెడితే భర్తలు అంతెత్తున లేచేవారు, “డబ్బేమైనా చెట్లకు కాస్తోందనుకుంటున్నావా! సంపాదించేవాడికి తెలుస్తుంది డబ్బు విలువ..” లాంటి డైలాగులు చాలామంది మొగుళ్ళనోట సాధారణంగా వచ్చేవే. అభిమానం ఉన్న ఆడవాళ్ళు ఆ మాటలకి మనసు చిన్నబుచ్చుకుని, వాళ్లకి కావల్సినవి ఎంత అవసరమైనవైనా కొనుక్కునేవారు కాదు. కానీ ఈ రోజుల్లో సంపాదన ఉన్నా లేకపోయినా అమ్మాయిలందరి అభిప్రాయం మొగుడనేవాడు ఒక ఏటీఎమ్ కార్డ్ లాంటివాడని ఊహని చూస్తే అర్ధమైపోయిందావిడకి.
సావిత్రమ్మకి పెద్దలు చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది.. అదేమిటంటే “భర్త చేసిన పుణ్యంలో సగభాగం భార్య కొస్తుంది..” అని. మరి భార్య చేసే పుణ్యంలో ఇసుమంతైనా భర్తకి వెళ్ళదనే అర్ధం కదా! అలాంటప్పుడు భర్త కన్న భార్యకే ఎక్కువ పుణ్యం జమవుతుంది కదా!.. అలాగే రోజులని బట్టి ఆ పుణ్యం అని ఉన్నచోట సంపాదన అని పెట్టుకుంటే ఈనాటి చాలామంది అమ్మాయిల మనస్తత్వం తెలుస్తుంది అనుకుందావిడ. ఈ రోజుల్లో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ సంపాదన వున్నా సరే ఇంటి ఖర్చులన్నీ మొగుడి క్రెడిట్ కార్డ్ మీద వేసేస్తుంటారు.. పైగా ఇల్లు నడపవలసింది మొగవాడే కదా అని సూక్తులు కూడా చెప్తారు.
దీని గురించి ఈ మధ్య తన తమ్ముడు అన్నమాట సావిత్రమ్మకి గుర్తొచ్చింది.
“సంపాదనపరులైన ఈనాటి భార్య ఒక మాట అంటూంటుందక్కయ్యా మొగుడితో… అదేమిటంటే.. ‘నువ్వు సంపాదించేది మన డబ్బు, నేను సంపాదించేది నా డబ్బు..’ అని.. ‘మన డబ్బు’కి ఇద్దరూ లెక్కలు చెప్పుకోవాలి కానీ ‘నా డబ్బు’ అనుకుంటే ఎవరికీ లెక్కలు చెప్పక్కర్లేదుకదా!..” అది విని హమ్మో.. హమ్మో.. ఇప్పటి ఆడపిల్లలు ఎంత తెలివి మీరిపోయేరూ అనుకుందావిడ.
ఇప్పుడీ ఊహని చూస్తే ఎవరో గుండెలు తీసిన బంటుని చూస్తున్నంత గాభరాగా ఉంది సావిత్రమ్మకి. ఆవిడ అనుభవాన్ని బట్టి చూస్తే శేఖర్ ఫోన్ లోనో లేకపోతే స్వయంగా వచ్చో ఊహని అలా చూసుకోకుండా ఆటోమెటిక్ లాక్ వేసేసినందుకు నానామాటలూ అనెయ్యాలి. కానీ రాలేదే… ఫోన్ చేసి కనీసం కసిరినట్టైనా కూడా లేదే..
చెప్పేదేదో మొగుడితో చెప్పేసి వాడి పాట్లు వాణ్ణి పడమని ఈ పిల్ల హాయిగా, రిలాక్సడ్‌గా కూచుని, మొబైల్‌లో గేమ్స్ ఆడుకుంటోంది. రోజులిలా మారిపోవడానికి కారణాలేవిటీ అనుకుంటే ఈ మధ్యనే టీవీలో ఒక ఫామిలీ కౌన్సిలర్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు గుర్తొచ్చా యావిడకి.
ఈ రోజుల్లో పెళ్ళికొడుకుల సంఖ్య కన్న పెళ్ళికూతుళ్ళ సంఖ్య తక్కువుందిట. డిమాండ్ అండ్ సప్లై ప్రకారం ఆడపెళ్ళివారి చెయ్యి పైనుందిట. అందుకని పాత రోజుల్లోలా కాకుండా ఇప్పుడు ఆడపెళ్ళివారు కండిషన్లు పెడుతున్నారుట. అందులోనూ ఒక్కరూ ఇద్దరే పిల్లలవడంతో పెళ్ళికూతురు తల్లితండ్రులు “మా అమ్మాయిని గారంగా పెంచాము..” అనడమూ, తల్లయితే ఏకంగా “ఖరీదైన కారూ, బంగ్లా లేకపోతే మా అమ్మాయి ఉండలేదు..” అనడమూ.. తర్వాత ఏకంగా ఆ అమ్మాయే “మీ ఇంట్లో ముసలాళ్ళుంటారా..” అనడగడమూ జరుగుతున్నాయిట.
పైగా చట్టాలన్నీ కూడా అమ్మాయిల భద్రతవైపే ఉన్నాయని ఆ కౌన్సిలర్ చెప్పారు. పెళ్ళైన అమ్మాయిలు కారణం ఉన్నా లేకపోయినా ఆ చట్టాలను వాడుకుంటున్నారుట. దానివల్ల చాలామంది పెళ్ళైన అబ్బాయిలు గొడవ లెందుకని లొంగిపోతున్నారుట.. ఆ అలుసు చూసుకుని అమ్మాయిలు ఇష్టారాజ్యంగా నదుచుకుంటున్నారుట. ఇవన్నీ విన్న సావిత్రమ్మకి శేఖర్ కూడా అలా ఊహకి లొంగిపోయిన వాడేనేమో అనిపించింది. అయ్యే ఉంటాడు. అదేకనక యాభైయేళ్ళ కిందటి మొగుడై ఉంటే ఆయన అరిచే అరుపులూ, తిట్లతో ఈపాటికి టాపు లేచిపోయుండేది.
ఊహని చూస్తుంటే సావిత్రమ్మకి ఒకేసారి ఆనందం, ఈర్ష్య కూడా కలిగేయి. ఆనందం ఎందుకంటే ఈ అమ్మాయి మొగుడంటే భయమనేదే లేకుండా ఎంచక్క హాయిగా ఉన్నందుకు. మరింక ఈర్ష్య ఎందుకంటే తను ముందే పుట్టేసి, యాభయేళ్ళ క్రితమే పెళ్ళి చేసేసుకున్నందుకు.
ఎవరో పెద్దాయన “నేనెక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు..” అన్నట్టు
“నేను కూడా ఒక యాభైయేళ్ళు లేటుగా పుట్టి, నా పెళ్ళి కూడా ఇలాంటి రోజుల్లో జరిగితే ఎంత బాగుండునూ..” అనుకుంటూ నిట్టూర్చింది పాపం సావిత్రమ్మ.