[dropcap]హై[/dropcap]దరాబాద్‌లో పుస్తక ప్రదర్శన ఏర్పాటు సందర్భంగా డా.టి.రాధాకృష్ణమాచార్యులు ఈ కవితని అందిస్తున్నారు.
~
నాకైతే బతుకమ్మ పండుగ
మళ్ళీ వచ్చినంత సంబురంగా ఉంది
హైదరాబాద్ పుస్తక ప్రదర్శనం ఇది
వివిధ కళలు శాస్త్రముల పుస్తకాల సమ్మేళనం చూడగా
తీరొక్క పూల అందాలన్నీ
ముస్తాబైన రంగుల వేడుకలా
ఒక్కొక్క పుస్తకం కొలువుదీరింది
అమూల్య జ్ఞానాన్ని పంచే వేదికగా
తంగేడు పూల రంగూ వాసన
రంగరించిన గునుగు,గుమ్మడి, కట్లపూలు కుదరైన కలిమినిచ్చెను
ప్రతి కమ్మలో ఊపిరి దారాల చెలిమి కురిసేనిచట
మా పల్లె పాటలై ఆడేను బతుకమ్మ
అక్షరాలన్నీ అందెలుగా చిందులేసే
సాహిత్య సౌధాన జన పదమిచ్చట కవన కథా మేఖలే చదువులమ్మ తోట
ఆత్మీయ బంధాల కలివిడిలో పర్వం
విజ్ఞాన పిపాసక పుస్తక పాఠశాలిదే
అరుదైన జ్ఞానము నొందగ రమ్మని పిలిచె బాలలతో కూడి
దర్శించి మనసుతో పుస్తకమాలికల సంపదనంత చదువగా
ప్రతి పుస్తకం చేరాలి చదువేందుకు అన్ని మస్తిష్కాలకూ
ఆలోచనలు పదునైన జాగృతమౌ
సామాజిక సదనం
పండుగల నిధిలో జ్ఞాన వేడుక ఇది
తెలంగాణ సంతకమైన కలాల సృజనలో..