[dropcap]మ[/dropcap]నసుంటే సంఘర్షణ తప్పదు
బ్రతుకులో గెలవాలంటే
రాజీల పర్వాన్ని
రాసుకోకా తప్పదు…
అయినా మనసెందుకో
ప్రశ్నల శరాల్ని విరివిగా
సంధిస్తూనే ఉంటుంది..
సమాధానం లేని సవాళ్లను
నిర్దయగా విసిరేస్తూనే ఉంటుంది..
పరిస్థితుల ప్రభావమని
నచ్చజేప్పబోయిన ప్రతిసారి
ఓడిపోయావని గేలిచేస్తూ
ఒప్పుకోమని వేధిస్తుంది
జీవితాన్ని ముందుకు నడిపించాలంటే
మనసుతో యుద్ధం అనివార్యమే
కన్నీటి శిక్షని గుప్తంగా స్వీకరించినా సరే
జీవనసంద్రాన నవ్వుల నావలా
పయనం సాగించాల్సిందే…!!