“అస్తిత్వనదం ఆవలి తీరాన” మునిపల్లె రాజు

0
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ మునిపల్లె రాజు గారిపై విశ్వర్షి వాసిలి డా. వాసిలి వసంత్ కుమార్ రచించిన వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము. [/box]

అస్తిత్వనదం ఈవల… ఆవల

[dropcap]అ[/dropcap]స్తిత్వనదం ఈవలితీరాన జీవిస్తూ అస్తిత్వనద ఆవలితీరాలను అక్షరీకరించిన గొప్ప కథకుడు, అస్తిత్వాన్ని ఆరగించిన జీవనపథికుడు మునిపల్లె రాజు గారు. అచ్చమైన తెలుగు లోగిలిలో శ్వాసించినవారు. తెలుగు కథను మాజికల్ రియలిజంలో తడిపి, తమదైన కథనరీతితో ఒక అరుదైన గౌరవం దక్కించినవారు. ఆధ్యాత్మిక దుఃఖాన్ని, ఆధిభౌతిక దుఃఖాన్ని, ఆధిదైవిక దుఃఖాన్ని కథలకు మూడు ముఖాలుగా చేసుకున్న తెలుగువారి అద్వితీయ కథకులు మునిపల్లె రాజు.

2014 సంక్రాంతి నాడు నాకు రాసిన ఒక సుహృల్లేఖలో “మానవుడి అంతస్సీమల్లోని అస్తిత్వ వేదనల్ని పరిశీలించటం ఒక్కటే నాకు తెలుసు” అని అంటారు “అస్తిత్వనదం ఆవలి తీరాన” కథా సంకలనానికి 2006 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందుకున్న మునిపల్లె రాజు గారు. “కలలు కనే అమాయకుల వల్లనే ఈ లోకంలో యింకా సౌందర్యం, మానవతారాగం నిలిచి వున్నాయి. ఈ వ్యక్త ప్రపంచం వెనక ఇంకో గొప్ప అవ్యక్త ప్రపంచం వున్నది.” అని శతధా నమ్మిన కథలరాజు మునిపల్లె రాజు.

“నా బాల్యం ఒక కల.

నా బాల్యం ఒక పువ్వుల వల.

నా బాల్యం విధి విసిరిన గాలం.”

అంటూ తమ చిన్ననాటిని కలగాను, వలగాను, గాలంగాను నెమరువేసుకుంటూ చివరిక్షణం వరకు తరించిన పదహారణాల తెలుగు కథకుడు, కవి. నిజానికి మునిపల్లె వారి బాల్యం “రెండు ప్రపంచ యుద్ధాల మధ్య చిరువిరామ దశకం.” రాజుగారి మాటల్లోనే చెప్పుకోవాలంటే “1930 దశకంలో నా మొదటి బాల్యదశ తెనాలి అనే చిన్నపట్నంలో… అక్షరాభ్యాసమూ ఆ నల్లరేగడి గడ్డమీదనే. రెండు ప్రపంచ సంగ్రామాల మధ్య సంధికాలం అది. ఆర్థికమాంద్యం అని చరిత్ర నామకరణం చేసిన పరదాస్యపు దినాలు.” అవి.

తొలి క్షణం నుండి తుది క్షణం వరకు…

మునిపల్లె రాజు పుట్టింది మార్చ్ 16, 1925న గుంటూరు జిల్లాలోని తెనాలి సమీప గ్రామమైన గరికపాడులో. తండ్రి హనుమంతరావు, తల్లి శారదాంబ. 1943 నుంచి 1983 వరకు నాలుగు దశాబ్దాల పాటు భారత రక్షణ శాఖలో వివిధ హోదాలలో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత సికింద్రాబాద్లోని సైనిక్‌పురిలో స్థిరపడ్డారు. ఇంటి పేరు మునిపల్లె. ఇంట పెట్టిన పేరు బక్కరాజు. ఒంట బట్టించుకున్న పేరు మునిపల్లె రాజు. కలం మాత్రం తొంభై శాతం ‘మునిపల్లె రాజు’గానే కదిలినప్పటికీ అప్పుడప్పుడూ ‘మునీంద్ర’గానూ కదిలేది. ‘రాజుగారు హృదయమున్న మార్క్సిస్టు, జీవితం తెలిసిన సైంటిస్టు, అన్నింటినీ రంగరించగల ఆల్కెమిస్టు’గా కథకుల కథకుడు. ఊహ తెలిసే మూడేళ్ల ప్రాయం నుండి మరో తొమ్మిది దశకాల సుదీర్ఘ జీవితంలో అనేక వ్యూహాల్ని, వ్యవహారాల్ని, వ్యక్తిత్వాల్ని అనుశీలించి – భౌతికయానాన్ని పరిపూర్తి చేసుకుంది 2018 ఫిబ్రవరి 24న – సైనిక్‌పురి లోని స్వగృహంలో.

‘మునిపల్లె రాజు కథలు’, ‘పుష్పాలు–ప్రేమికులు–పశువులు’, ‘దివోస్వప్నాలతో ముఖాముఖి’, ‘అస్తిత్వనదం ఆవలితీరాన’ ఆయన కథాసంపుటాలు. ‘అలసిపోయినవాడి అరణ్యకాలు’, ‘వేరొక ఆకాశం వేరెన్నో నక్షత్రాలు’ వారి కవితా సంపుటాలు. “జర్నలిజంలో సృజనరాగాలు”, “సాహితీ మంత్రనగరిలో సుస్వరాలు” వారు ప్రచురించిన వ్యాస సంపుటాలు. రాసిన ‘పూజారి’ నవల పూజాఫలంగా వెండితెర వెలుగయింది.

పీఠం కాదు కదా పీట కూడా లేని మునిపల్లె

“విచిత్రం! నాకొక పీఠం వుందని ఉహించాడు కాబోలు / నిజానికి నాకొక పీట కూడా లేదు గదా!” అని అంటారు మునిపల్లెవారు ఒకానొక సందర్భంలో. అవును, కవితాగాలంతో గమ్యాన్ని గవేషించేవాడికి, కలల ఆకారాలతో కాలాన్ని కొలిచేవాడికి, దిగులు మేఘాలతో దిగంతాల్ని కమ్మివేస్తున్నవాడికి ఏ పీఠమూ అలంకారప్రాయం కాదు. ఏ పీటా కుదురుగా కూర్చోనివ్వదు. అటువంటి జీవికి అడుగడుగునా తారసపడేది ప్రశాంత జీవనసరళిని అల్లకల్లోలం చేస్తున్న వర్తమాన అస్థిరతే. నిజానికి అది ప్రతిప్రాణి నిస్సహాయ స్థితే. అవగాహన ఉన్న ఏ పథికుడినైనా వేధించే జగత్తే.

ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక వేదనల నుండి పుట్టుకొచ్చిన సామాజిక స్పృహ, జీవన స్పృహల కథన చమత్కృతే మునిపల్లె కథల కాన్వాస్. అవి సుదీర్ఘ స్వప్న జీవిత నిశిలో అంతర వ్యోమయానం చేసిన బ్రతుకు కథలు. “ఆ పరిభ్రమణల రహస్య ప్రకంపనలను” బహు చక్కగా అభివ్యక్తీకరించే మాధ్యమం మునిపల్లె మాజికల్ రియలిజం. అందుకే వారి కథలు స్థలాతీతమైనవి, కాలాతీతమైనవి అయ్యాయి. ఏ సంక్షుభిత మేథోవాదం నీడకో, అరాచకవాదం నీడకో, నిహిలిజం నీడకో చేర్చదగ్గవి కావు. అవి భౌతిక వాస్తవాలతో అంతర్లీనమైన అతిలోకవాస్తవాల వెలికితీత. అవి అద్భుత వాస్తవికాలు కాబట్టి మాజికల్ రియలిజం పీఠాన్ని అధిష్టించాయి. అందుకే తమ కథలు “అదృశ్య పృచ్ఛకుడి ప్రశ్నలకు సమాధానాలుగా వెలువడ్డా” యంటారు మునిపల్లె రాజు. పైగా వాటిని అద్భుత మాయావాదరసాలుగా పరిగణిస్తారు. “ఆధునిక సంక్లిష్ట జీవన సమస్యల పరిధిలో ఇముడిస్తూ” తమ కథల రచన సాగిందంటారు.

కథావీథిలో తొలి, మలి అడుగులు

‘కలం పట్టి రచయితను అయిపోయాను’ అని అనుకునే ప్రతి ఒక్క కలంజీవి తన తొలి రచనతోనే అక్షరవనంలో విత్తు నాటి – అందరికీ అందని దాన్ని, అందని ఆంతర్యాన్ని, అందని అందాన్ని, అందని సత్యాన్ని… తానొక్కడే అందుకున్నట్లుగా, తానొక్కడే దర్శించినట్లుగా గర్వపడకపోతే నాలుగు కాలాలపాటు తన కవితలనో, కథలనో, నవలలనో, నాటకాలనో పాఠకలోకంలో వెదజల్లటం సాధ్యపడదు. కాబట్టే ప్రతి రచయిత దృష్టిలో తన తొలి రచన ఒక నూతన ఉపనిషత్తు. ఒక నిషా. ఆ నిషానే తనను లబ్దప్రతిష్ఠునిగా చిత్రించుకుంటుంది, తన సంతకానికి ఎంతో ప్రాముఖ్యాన్ని ఊహించుకుంటుంది – అని అంటూ రచయితగా తమ అనుభవాలను నెమరువేసుకుంటారు ఏడుదశాబ్దాలపాటు కలం పట్టిన మునిపల్లె రాజు ‘నా తొలి రచనలో నేను’లో.

ఈ నేపథ్యంతో చూస్తే – బక్కరాజుగా మునిపల్లెరాజు తొలి రచన ఉదాత్త ఆశయ ప్రకంపనతో వెలికివచ్చింది కాదు. అది తెలుగు మాస్టారి మీది కోపంతో రాసింది. అలనాటి ఆ కథకు ప్రేరణ తామస ప్రవృత్తి. అది లిఖిత పత్రికకే పరిమితం.

ఇక మలి కథ… అచ్చుకెక్కిన మొదటి కథ – హైస్కూల్ విద్యార్థిగా రాసింది. దీనికి నేపథ్యం దుఃఖం, నిస్పృహ. నిజానికి ఈ తొలి, మలి కథలు బాలరాతలు. అయినా, అంతర్ముఖీనం కావటానికి ఉపకరించిన రచనలు. కథకుడే అనికాదు, కవే అనికాదు, ఏ రచయిత అయినా తాను స్వయంగా జీవనగతిలో దుఃఖానుభూతిని పొందాలి. ఇతరుల దుఃఖంలో తాను పాలుపంచుకోవాలి. అప్పుడే విలువైన భావనాస్ఫూర్తి కలుగుతుంది. అప్పటి నుండి ప్రతి రచనా సర్వమానవ ప్రేమతో సాగుతుంది. అలా రచయిత వైతాళికుడవుతాడు. కులాలతో, మతాలతో, రాగాలతో, ద్వేషాలతో ఏ కాలంలోని రచయితా భాగస్వామ్యం తీసుకోకూడదు. కలం పడితే సత్యం సత్యంగానే దర్శనం కావాలి. “వేదనా పూరితమైన లోకాన్ని, ఆధ్యాత్మిక భౌతిక కల్లోలాన్ని దార్శనికుడిగా విశ్లేషించి, తన పరిసరాల్ని క్షాళితం చేయాలనే సంకల్పంతో ఉద్యమించటం అత్యవసర అవసరం”. “అప్పుడు వ్యక్తమయ్యేదే – తొలి రచన అనిపించుకుంటుంది. తత్పూర్వం వచ్చినవి – వ్రాతలు మాత్రమే” అన్న కలం తత్వాన్ని జీర్ణించుకున్న కథారచయిత మునిపల్లె రాజు.

అలా బాల రచయితగా బక్కరాజు నిజంగా బక్క రచయితనే. వారి మాటల్లోనే చెప్పుకోవాలంటే – “పరిశీలన నుండి పరివేదనను అనుభవిస్తూ – అంతర గాంధారంగా ఒక అవగాహన – ఆ గాంధారం నుండి జనిత మవుతూన్న జన్య జనక రాగాలకు శాస్త్రీయ రూపకల్పన చేయగల పరికరాలు – లభించక, ఆ మరుదినమే తండ్రి వడిలో కూర్చొని మూకీ సినిమాలో అసాధారణ సాహసకృత్యాలు తిలకించి – తన అన్వేషణను మరిచి జీవితానందనోత్సవంలో తిరిగి – చిందులు వేస్తున్నా – హృదయభారతిలో ఒక చిరుజ్యోతి వెలిగిందని గుర్తించకపోవటమే – భవిష్యత్తులో యువకుడైనప్పుడు పునఃపునః ఆ దీప దర్శనం లభించటమే ఒక రచయిత జననానికి నాంది.”

ఇలా పరిశీలన, పరివేదనల నుండి పుట్టిన మునిపల్లె రాజు డెబ్భైయేళ్ల సుదీర్ఘ కలంయానంలో రాసిన కథలు మహా అయితే మూడు వందలు. అయితే దొరుకుతున్నవి వంద మాత్రమే.

అతి నిరాడంబర కలంజీవి

చేతిలో సిగరెట్టు… గళ్ళ లుంగీ… దానిపైన ఒక వదులు షర్ట్… ఒక సన్నపాటి చిరునవ్వు… గేటు వేస్తూనో, తీస్తూనో ఓ మూడేళ్లపాటు ఓ వ్యక్తి పరిచయం. మహాఅయితే నేను అద్దెకుంటున్న ఇంట్లో పైన అద్దెకుంటున్న ఓ సాదా సీదా గృహస్థు. ఇంకా చెప్పుకోవాలంటే మా పెద్దమ్మాయి ప్రత్యూష స్నేహితురాలు శ్రీలు తాతగారు ఈ సిగరెట్టు మనిషి. ఒకసారి మా నాన్నగారు శార్వరి గారు తమ ‘అరవింద సావిత్రి’ పుస్తక ఆవిష్కరణ సభకు ‘మీపైనున్న రాజుగారిని పిలిచావా’ అని అడిగారు. ‘ఎందుకు వారిని పిలవటం’ అన్నాను. ‘అదేమిటి, అంత పెద్ద రచయితను పిలవకపోవటమేమిటి?’ అన్నారు. అప్పుడు తెలిసింది వారు ‘మునిపల్లె రాజు’ గారని.

నేను నా జీవన ఘర్షణలో వేగిపోతున్న దశ అది. అస్తిత్వ సంఘర్షణపై పరిశోధన చేస్తున్న రోజులవి. ‘అస్తిత్వనదం ఆవలితీరాన’ వంటి అద్భుత కథలు రాసిన ఒక మహాకథకుడిని పసిగట్టలేని పసితనపు పరిశోధక వ్యక్తిత్వం నాది. సిగ్గుపడ్డాను. అలా సిగ్గుతో మెలితిరుగుతూ కాలక్షేపం చేయకుండా అప్పటినుండి వారు కనిపించినప్పుడల్లా బాతాఖానీ… దాంతోపాటు వారి సాహిత్య జీవితంతో సహవాసం… ఆ తరువాతి దశకంలో వారు తమ స్వగృహాన్ని చేరటం… చివరివరకు వారిని సైనిక్ పురిలోని ఇంట కలిసినప్పుడల్లా రెండు మూడు గంటల పాటు ఆంధ్రా పారిస్ అయిన తెనాలి సాహిత్య వీధుల నుండి… ఫ్రెంచ్ రొమాన్స్ అందే పారిస్ సాహిత్య వీధుల వరకు… ఎన్నో ఎన్నెన్నో కబుర్లు. ఎన్నో చారిత్రక, సాంస్కృతిక అంశాలను కలబోసుకునేవారం.

ఇలా కొన్ని వందల గంటల మా స్నేహపూర్వక సాహితీ సమీక్షలలో -ఏనాడూ మునిపల్లె రాజు గారు ఏ ఒక్క కవినికానీ, ఏ ఒక్క కథకుడిని కానీ పల్లెత్తు మాట అనటం నేను చూడలేదు. కథలు, కథన రీతులు, ఇతివృత్తాలు, వాటిలో ఇమిడిన సాహిత్యవాదాలు, తత్వాలు మా మధ్య చర్చకు వచ్చేవే తప్ప కలం పట్టిన వ్యక్తులు కానీ, వారి వ్యక్తిగత జీవితాలు కానీ మా మాటలలో దొర్లేవి కావు.

పైకి మునిపల్లె రాజుగారు అతి సామాన్యుడిలా కనిపించినా వారి చూపు చాలా నిశితంగా ఉండేది. నా మాటలలో చెప్పాలంటే వారి చూపులు నా అస్తిత్వాన్ని గాలం వేసి పట్టుకునే దిశలో వేటాడుతుండేవి, వెంటాడుతుండేవి. ఆయన తమకు తాముగా తమ కథలని గురించి, తమ రచనల గురించి మాట్లాడేవారు కాదు. వారితో సమావేశాలు ఒక సమీక్షకుడితోనో. ఒక చారిత్రకుడితోనో సమావేశమైనట్లుగా సాగేవి. స్వవిషయంలో బహు గోప్యత వారిది. తానొక రచయితను అని చెప్పుకోనంత గోప్యత వారిది. మనసా, వాచా, కర్మణా వారిలో నిలదొక్కుకున్న ఆ నిరాడంబరతే వారి అస్తిత్వ జీవనం, కలం జీవనం.

సామాజికుడిగా, రచయితగా, పౌరుడిగా రాజుగారి అనుశీలనం, అధ్యయనం బహు గొప్పవి. కట్టుకోవటానికి, కప్పుకోవటానికి రెండుజతలు చాలు అనుకుని జీవితాంతం ఆచరణలో పెట్టిన నిరాడంబరత వారిది. కోట్లమందికి జీవితబీమా లేని భారతదేశంలో పుట్టిన తనకు మాత్రం జీవితభీమా ఎందుకు అంటూ ఏనాడూ బీమాల వెంటపడని జీవన యాత్రికులు. దాచటం తెలీనివారు. బాకీపడనివారు. గుప్తదానాలే తప్ప వార్తలకెక్కే దానాలు చేయనివారు. నాకు తెలిసీ వారి జీవిత చివరి దశకం – 2012లో – దాదాపు లక్షన్నర అరియర్స్ వచ్చినప్పుడు ఆ మొత్తానికి మరికొంత మొత్తం కలిపి తమ సమగ్ర సాహిత్య ప్రచురణలలో భాగంగా అప్పటివరకు వచ్చిన నాలుగు కథాసంపుటాలను ‘మునిపల్లె రాజు అత్యుత్తమ కథాకృతులు’, ‘మాజికల్ మునిపల్లెతో ముఖాముఖి – అస్తిత్వనదం ఆవలితీరాన’ పేరిట రెండు ఉద్గ్రంథాలుగా ప్రచురించారు.

‘అస్తిత్వనదం ఆవలితీరాన’ కథా సంపుటానికే 2006వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడెమి – విశిష్ట పురస్కారంతో మునిపల్లెవారిని సత్కరించింది. 1993 లో నూతలపాటి సాహితీ సత్కారం, జ్యేష్ఠ లిటరరీ అవార్డ్ లభించింది. 1994 లో రావిశాస్త్రి మెమోరియల్ లిటరరీ ట్రస్ట్ అవార్డ్ లభించింది. దరిమిలా అనేక అవార్డులు.

ఇక – వారి కథాప్రపంచంలోకి వెళ్లేముందు వారి జీవితాన్ని కాస్త పరికిద్దాం.

మునిపల్లె జీవన చిత్రం

మన బక్కరాజుది బాల్యం నుండీ కరుణార్ద్ర హృదయం. తన ఈడు పేదపిల్లలని చూసి ఇట్టే కరిగిపోయే పెద్దమనసు. ముఖ్యంగా వారాల పిల్లలన్నా, వారితో గడపటం అన్నా, వారికి సహాయం చేయటం అన్నా బక్కరాజు ముందుండేవాడు. తన దగ్గరున్నది ఏదైనా ఇతరులతో పంచుకోవలసిందే. ఒకసారి ఎవరో సైడ్ కాలవ మురికినీట్లో పిల్లవాడిని తోసేస్తే ఆ పిల్లవాడికి తన చొక్కా దానం చేసిన పసిహృదయం బక్కరాజుది. దానం అనే పదం కూడా ఉచ్ఛరించటానికి ఇచ్చగించని పెద్దమనసు. తండ్రితో మూకీ సినిమాలు చూసేవాడు. వెండితెరపై కనిపించే సాహసకృత్యాలను ఇంటి సామాన్లకొట్టంలో చేయ సాహసించినవాడు. ఆటలంటే ఇంట్లోనుండి తుర్రుమనేవాడు.

యుక్తవయస్సులో దేశంలో జరుగుతున్న సత్యాగ్రహమంటే విపరీతమైన మోజు. భగత్ సింగ్ అంటే ఆరాధన. సత్యాగ్రహంలో పాల్గొన్నవారిపై లాఠీచార్జి జరిగినా, వారి అరెస్ట్ వార్తలు విన్నా దిగులు చెందేవాడు. రంగస్థలం అంటే మక్కువ ఎక్కువ. తెనాలిలో ప్రదర్శనలిచ్చిన ప్రతి కళాకారుడితో స్నేహాన్ని పెంచుకున్నవాడు. బ్యాండ్ మేళాన్ని ఎంతగా అభిమానించేవాడో అంతే మక్కువతో ఆధ్యాత్మిక కీర్తనలను తలకెక్కించుకున్నవాడు. నూనూగు మీసాల మునిపల్లె రాజుకి హిమాలయాలన్నా, ఆ మహిమాలయ మహాత్ములన్నా, వారి మహత్తులన్నా ఎంతో ఇష్టం. అప్పుడే గుడిపాటి చలం సాన్నిధ్యాన్ని ఇష్టపడటమూ జరిగింది. బహుశా ఆ చలం ప్రభావమూ, హిమాలయాల ప్రాభవమూ, ఆధ్యాత్మిక ప్రబోధాలూ బక్కరాజుని కథాప్రపంచంలోకి అడుగులు పడేలా చేసుంటాయి. అందుకే వారి కథలు ఒక ప్రత్యేక వస్తువుతో, ఒక విశిష్ట కథనంతో సాగుతుంటాయి. చివరికి వారి పాత్రల వ్యక్తిత్వాలు, వారి చలనస్వభావాలూ ఒక గొప్ప తాత్వికసంపన్నమై ఉంటాయి.

చిన్ననాట తెనాలి గ్రంథాలయంలో చదవని పుస్తకం లేదు. అన్నయ్య మునిపల్లె పిచ్చిరాజును చూడటానికి వెళ్లినప్పుడల్లా రాయచోటి గ్రంథాలయంలోని పుస్తకాలను చదవకుండా వదిలింది లేదు. ఇలా గ్రంథాలయాలనే కాదు ఎక్కడికి వెళ్లినా, ఏ పుస్తకం కంటబడ్డా, ఎవరు ఏ పుస్తకం ఇచ్చినా చదవందే వదిలేవారు కారు. ఇంట ఆర్థికస్థితి బాగులేకున్నా పుస్తకాలు చదవటం ఆపింది లేదు. చివరివరకు డబ్బులే కాదు, పుస్తకాలను సైతం దాచుకోవటం తెలీనివారు. దాచుకోవటం తెలీదుకానీ తమకే కనక ఒక కోటి రూపాయల లాటరీ తగిలితే ఆ డబ్బుతో జైమిని ఖేట సర్వస్వం, అంగీరసుని మేఘోత్పత్తి, వసిష్ఠుని ప్రపంచలహరి, శాక్యాయనుడి లోహతంత్ర, బోధాయనుడి ధాతుసర్వస్వం, ఆంగీరసుని కారక ప్రకరణం, భరద్వాజుని ఆకాశతంత్రం, అగస్త్యుని శక్తి తంత్రం, వరాహమిహిరుని బృహత్సంహితలపై పరిశోధనలు జరగటానికి అనువుగా ఒక భారతీయ పురాతన విజ్ఞాన పరిశోధక సంస్థను ఏర్పాటు చేయాలనే అభిలాషతో ఉండేవారు. వీరికి భారతీయ పురాతన గ్రంథాలపై ఎంత మక్కువో – ఆధునిక గేయాలు, కవితలు, పద్యాలు అన్నా అంతే ఇష్టం. అనిశెట్టి, అజంతా, తిలక్, బైరాగి, శ్రీశ్రీ, విశ్వనాథ, దాశరథి, దేవులపల్లి … వీరికి ముందువరసలోని కవులు, రచయితలు. పాత పాటలు, న్యూ థియేటర్ చిత్రాలు అన్నా ఎంతో ఇష్టం.

ఇక్కడే మనం మునిపల్లెవారి నాలుగు మాటలను ఒక్కసారి ఆలకిద్దాం –

“తెనాలి సాంస్కృతిక, సంస్కరణోద్యమాలతో మా కుటుంబానికున్న సన్నిహిత అభినివేశమే మున్ముందు నన్ను సాహిత్యలోకంలోకి ప్రవేశపెట్టినవి… ఒక పినతండ్రి ఇంట్లో బ్రహ్మసమాజ గీతాలు, ఇంకో పినతండ్రి గారింట్లో ఆయనతోపాటు స్కూళ్ల ఇన్స్పెక్టర్ అయిన చింతా దీక్షితులుగారి బాలగేయాలు, ఆయన ఇంకో సహోద్యోగి చలంగారింట్లో భావకవుల నిట్టూర్పులు. సృష్టి నుంచి శబ్దరహస్యాన్ని విడగొడుతున్నట్లుగా లక్షిందేవమ్మగారి సాంప్రదాయ కీర్తనలు… జాషువా కవి ఫిరదౌసి, బుచ్చి సుందర్రామశాస్త్రిగారి సతీస్మృతి విషాదనాదాలు మా ఊళ్ళోనే విన్నాను. ఆ ప్రాథమిక పాఠశాలలో విద్యసాగుతున్నప్పుడే చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి సన్మాన సభలో ఆశుకవితలు, విశ్వనాథవారి సభలో కిన్నెరసాని సెంటిమెంటల్ పాటలు – ఆలకించిన అదృష్టంతో కవిత్వం రాయాలనే సంకల్పం… ” కలిగింది.

ఇలా 1940 ప్రాంతంలో శ్రీకారం చుట్టిన బక్కరాజు అక్షరం తొలి నాటినుండీ అడుగులు వేసిందే కానీ ఏడు దశాబ్దాలపాటు కథారచనలో ఎంతలా అనుభవం సంపాదించుకున్నా ఏనాడూ తొట్రుపడలేదు, పరిగెత్తే ప్రయత్నమూ చేయలేదు.

మొత్తానికి కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాన్ని కథలకు అందుకున్నప్పటికీ సాహిత్యరంగ ప్రవేశం కవిత్వంతోనే. తొలి పద్యం “ఎంత దయో దాసులపై, పంతంబున మకిరిబట్టి బంధింపగా శ్రీకాంతుడు చక్రం బంపెను, దంతావళి రాజుగాయ దత్తాత్రేయా”. మలి పద్యం “చిన్న చెంబుతో నీళ్లు, శీకాయ ఉదకంబు”. ముచ్చటగా మూడో పద్యం “తేరా పలకా బలపము / ఇయరా అయవారి చేతికి / ఇంపులరంగా”. ఇలా ప్రారంభమైన మునిపల్లె వారి కవితా ప్రస్థానం విప్లవగీతాలవైపూ మళ్లింది. అటుపిమ్మట వారి కలం అధివాస్తవిక పద్యాలవైపూ తిరిగింది. నిజానికి ఇప్పటివరకు జీవితమంతా స్వప్నయుగమే. బాల్యం తర్వాత అన్నీ ఎదురు దెబ్బలే. ఎన్నెన్నో విషాదాలే.

అవును, నేను మునిపల్లె రాజు గారితో సమావేశమైనప్పుడల్లా నాటి దెబ్బల ప్రతిధ్వనులను వినిపిస్తుండేవారు. వారిని కలిసిన ప్రతీ సందర్భమూ అనేక చారిత్రక ఘటనల నెమరువేతనే. ఎందరో సాహిత్యకారుల సాహిత్య ప్రస్థాన సమీక్షనే. వారి విమర్శనం సాహిత్య శిల్ప రామణీయకమే. నిజానికి, తెనాలి మాట రాకుండా సమావేశం ముగిసేది కాదు. తెనాలి రచయితలు, కళాకారుల శేముషీవైభవాన్ని తలచుకోకుండా మా సంభాషణలు ముందుకు సాగేవి కావు. ఎవరినీ వ్యక్తిగా ఆయన దూషించిన సందర్భం నేను ఎరుగను. వారి మాటలు రచనలపై ఎక్కుపెట్టి సాగేవే కానీ ఎవరినీ వేలెత్తి చూపించిన సందర్భాలు నాకు తారసపడలేదు. బహుశా, రచయితల్నే కాదు… మానవత్వమున్న ప్రతిమనిషినీ ఆయన ప్రేమించినంతగా మరొకరు ప్రేమించలేరేమో అనిపిస్తుంటుంది. ఒక్క మనుషులనే కాదు, తాను పుట్టిన మట్టినీ ఆయనెన్నడూ మరువలేదు. తన భరతజాతిని స్మరించని రోజు లేదు. సనాతనాన్ని ఎంతగా ప్రేమించారో నూతనత్వాన్నీ అంతగా స్వాగతించారు. తన కథలలోని ప్రతి పాత్రనూ ఒక ప్రత్యేక తాత్వికతతో రూపింపచేసారు. బాహ్య సౌందర్యం కంటే అంతర్ జగత్తుపైనే దృష్టి నిలిపారు. వారినుండి వారి అపరిమిత మమతను, గాఢ సానుభూతిని విడగొట్టి చూడలేము. వారి ప్రతికథా ఒక చిత్రశాలనే మరిపిస్తుంది. అన్నీ సజీవ చిత్రాలే. ప్రతి చిత్రానికీ ఒక చారిత్రక నేపథ్యం. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే వారి కథాసంపుటాలు చారిత్రక చిత్రశాలలు.

అందుకే కాబోలు ఒక చోట “ఎవరు వింటారీ అలసిపోయినవాడి ఆరణ్యకాలు / ఏనాటి మాట – ద్వాపరయుగ నైమిష సత్రయాగాలు”అని. అలనాటి ద్వాపరయుగం నుండి ఈ వర్తమానయుగంలోకి వచ్చి – “సకల దీన లోక వ్యథార్థానుభూతులు నా కాలం కొలతలు / నను బంధించిన లోహపు తలుపులు” అనీ అంటారు. ఆ తలుపులను తీసుకుని “కాలం ఇంకని నది – వంపుల సడి / కాలం మార్మిక గతి – తెగని తంత్రి” అని అంటూనే “శబ్దం వెనుక మరో రహస్య శబ్దం /దృశ్యం వెనుక ఇంకో అదృశ్య దృశ్యం” అని తమ తలపులు మనముందుంచుతారు.

వృత్తి జీవనం

పదవులతో పోటీ పడకుండా తృప్తిగా ఏపనైనా చేసుకుంటూ సంతృప్తిపడటం తెలిసినవారు మన రాజు గారు. 1941-42 లోనే వారి తొలి సంపాదన విశాఖపట్నంలోని ఒక కంపెనీకి ఎకౌంట్స్ రాసిపెట్టటంతో ప్రారంభమైంది. ఆ తర్వాత బ్రిటిష్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీరింగ్ విభాగంలో సర్వే పనులు నేర్చుకున్నారు. పిదప మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో ఉద్యోగం… పదవీ విరమణ.

నవలా ‘పూజారి’ మునిపల్లె

మునిపల్లె రాజు 1952 లో రాసిన ఒకే ఒక నవల ‘పూజారి’. సుప్రసిద్ధ దర్శకులు బి.ఎన్‌. రెడ్డి ‘పూజాఫలం’గా తెలుగు తెరకు మలిచిన నవల ఇది. మునిపల్లె వారి తాత్వికత, అంతర్దృష్టి నవల ఆరంభంలోనే గాఢంగా పరిచితమవుతుంది. ఆలనా పాలనా లేని పార్క్‌ దగ్గర అద్భుతంగా ప్రారంభమవుతుంది ఈ నవల.

నవలా నాయకుడు మధు పెద్ద జమీ వారసుడు. తల్లీతండ్రీ లేకపోవటంతో తాత దగ్గిర పెరిగినవాడు. క్షయవ్యాధితో ‘నిరాశా వేదాంతి’ అయినవాడు. అయినా సంగీతాన్ని, కళాశాలను జీవితాంతం ప్రేమించినవాడు.

ఇక మధు ఇంటి కిందిభాగంలో అద్దెకు దిగిన అమ్మాయే ప్రీతి. ఇంటి దగ్గిర ప్రీతి, కళాశాలలో శ్రీరాం మధుకు ఇష్టులు. ఇద్దరూ ఆశ, ఆత్మబలాలకు ప్రతీకలు. అయితే ప్రీతి నిష్క్రమణ మధును నిరాశపరస్తుంది. ఇలావుండగా జమీ గుమాస్తా రామకృష్ణయ్య కూతురు సుశీల – మధునీ, జమీని ఒక క్లిష్ట పరిస్థితి నుంచి రక్షించటం … ఆ క్రమంలో వారిద్దరూ దగ్గిరవ్వటం జరుగుతుంది. డిఫాటిజమ్‌ ధోరణిలో సాగిన నవల. మధులోని అపరాధ భావాన్ని మునిపల్లెవారు అక్షరీకరించిన తీరు పాఠకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. రేపటిని నేడే ఆవిష్కరించగల దార్శనిక రచయిత మునిపల్లెవారని ఈనవల చెప్పక చెపుతుంది.

కవిగా మునిపల్లె …

“కవిత్వం మానవుడికి సాంస్కృతిక చైతన్యంతో సంక్రమించే మాతృభాష – జీవుని ఆత్మ ఘోషను అభివ్యక్తీకరించ గలిగిన హృదయ భాష. మానవాళి పురాస్మృతులకు, సమకాలీన కల్లోల జగతీ స్పందనలకు అనువైన వాహిక కవిత్వమే. అది స్వేచ్చాజీవి. మూసబోసిన ఆకృతిలో అది ఇమడలేదు.” కవిత్వానికి మునిపల్లె రాజు ఇచ్చిన నిర్వచనం ఇది. నిజానికి వారి కవితాపంక్తులు అనుభవాలతో వంగిన విల్లు నుండి ఎక్కుపెట్టిన అస్త్రాలే.

మునిపల్లె రాజు తమ “జర్నలిజంలో సృజనరాగాలు” అన్న వ్యాససంపుటంలో 2005 వ సంవత్సంరంలో రాసిన మూడు కవితలను “సాహితీ పుటలకు పనికిరాని మూడు పద్యాలు” అంటూ ప్రచురించారు. ఈ మూడింటిలో “వీచిన కవితలు” అన్న కవితలో –

“ద్వేషంతో చెప్పేవన్నీ ‘దోహాలు’ కాలేవు

ద్వైదీభావంతో రాసేవన్నీ ద్విపదలు కాలేవు

ఆక్రోశంతో ఆలపించింది అరణ్యక మెట్లా అవుతుంది

ఉక్రోషంతో ఉటంకించేదంతా ఉపనిషత్తవుతుందా?

రెచ్చగొట్టేదంతా రేషనలిజం కాదు కాదు

రచ్చబండ రగడంతా రాజ్యాంగపు రచనౌతుందా?”

అని అంటూనే

“విప్లవ పదకోశంలో విషాదం కూడా ఒక ఆశ్వాసం

వట్టి చిలుకపలుకుల్తోనే నిలుస్తుందా ఆ విశ్వాసం?”

అని ప్రశ్నిస్తాడు. పనిలో పనిగా

“కుకవి కవితలకు కుటిలుడే కితాబు నిస్తాడు”

అంటూ అయిదు పదాలతో ఒక విమర్శనాస్త్రాన్ని సంధిస్తాడు సమీక్షకులపైనా, విమర్శకులపైనా.

మరొక కవిత “ఏక్ తార తరంగాలు”లో –

“అభద్రతా భావంనుండే అద్భుత సత్యం ఆవిర్భవిస్తుంది

భయగ్రస్త శాక్య యువరాజు గౌతమ బుద్ధుడు కాలేదా?”

బోధివృక్ష బుద్ధుడి విషయంలో వాస్తవాన్ని చిత్రికపడుతూ ఆలోచింపచేసే ఒక ప్రశ్న ఇది.

ఇదే కవితలో మరోసందర్భంలో –

“నుదురు ముడతలు పడిందా నడుం వంగిపోయిందా

ఇంకెందుకీ పుష్పహారాలు, మరెందుకీ కిరీట ధారణ”?

వర్తమాన వాస్తవ అక్షర చిత్రం ఇది.

“నిశ్శబ్దం ఒక ప్రశ్న భూమి” అన్న కవితలో

“కౌరవ సభలో ద్రౌపది ప్రశ్నకు పెదవులు విప్పని నిశ్శబ్దం

నిశిలో, స్మశానపు చితిలో కపాలమోక్షం తదుపరి నిశ్శబ్దం”

అంటూ నిశ్శబ్దాన్ని పలకరిస్తూ –

“మౌనంగా, వేదనగా, జ్ఞానవీచికగా, నివురుకింద దీపకళికగా –

నా అంతర్యుద్ధ వేదిక వలయం చుట్టూ అశాంత భూమికగా -“

‘మహాప్రశ్న’కు రహస్య సమాధానులుగా వారి కథలు, వారి పాత్రలు మనముందు సాక్షాత్కరిస్తుంటాయి.

మరో కవితలో –

“అందరికీ హీరో నేనే ! బాల్యానికి బంగరు మేనా !

బతుకంతా పర్వదినంబని భ్రమ చెందిన బాల్యం అది !”

అని అంటూ –

“ఆ పిమ్మట బ్రతుకేమన్నది ?” అని ప్రశ్నిస్తూ –

“అంతా శూన్యం! అంతటా ప్రశ్నరణ్యం !

ఎటు తిరిగినా ఎదురు దెబ్బ !

అడుగడుగునా అపార విషాదం”

అంటూ మనల్ని అంతర్ముఖుల్ని చేస్తారు మునిపల్లెవారు.

జర్నలిజంలో సృజనరాగాలు

మునిపల్లె రాజు గారి 87 వ్యాసాల సంకలనం “జర్నలిజంలో సృజనరాగాలు”. ఇందులో ఆదూరి సత్యవతీదేవి, ఏల్చురి విజయరాఘవరావు, అనిశెట్టి అప్పారావు, మధురాంతకం మహేంద్ర, భరాగో, రామతీర్థ, శ్రీవిరించి, మధురాంతకం రాజారాం, అక్కిరాజు రమాపతిరావు, ఆదూరి వెంకట సీతారామచంద్ర మూర్తి, అజంతా, ఆకెళ్ల రవిప్రసాద్, జింబో రాజేందర్, శారద, ఎ. సూర్యప్రకాష్, డి. రామలింగం, కాళీపట్నం రామారావు, కె.బి. లక్ష్మి, పోరంకి దక్షిణామూర్తి, కోడూరు ప్రభాకర రెడ్డి, బి. నరసింగ రావు, డి. సుజాతా దేవి, చాసో, వుప్పల నరసింహం, రావిశాస్త్రి, శీలా వీర్రాజు, పి. చంద్రశేఖర ఆజాద్, తిలక్, పోలాప్రగడ సత్యనారాయణమూర్తి, శ్రీపతి, సారాష గుప్తా, శ్రీరాగి, జానమద్ది హనుమచ్చాస్త్రి, దాశరథి రంగాచార్య, వాకాటి పాండురంగారావు, పులికంటి కృష్ణారెడ్డి, చల్లా రాంబాబు, తుమ్మల వెంకట్రామయ్య, కాశీభట్ల వేణుగోపాల్, ముక్తవరం పార్థసారథి, శార్వరి, అంబళ్ల జనార్దన్, పోయెట్ రాజు, మాడభూషి రంగాచార్యులు, అంపశయ్య నవీన్, టి. సంపత్కుమార్, కేతు విశ్వనాథరెడ్డి, సత్యం మందపాటి, మిన్నికంటి గురునాథశర్మ, పెంగ్విన్ రంగారావు, పోలి విజయరాఘవ రెడ్డి, గోఖలే, బి.వి.ఎస్. రామారావు, వడలి రాధాకృష్ణ, సుంకర వెంకుమాంబ, టి.వి. రామనరసయ్య, కొట్టి రామారావు, సి. వేదవతి, ఆలూరి బైరాగి, ఆవంత్స సోమసుందర్, ముదిగొండ సుజాతారెడ్డి మొదలైన రచయితల సాహిత్య ప్రస్థానాన్ని, వారి రచనలపై సమీక్షలను, వారి రచనావిశేషాలను మునిపల్లెవారి దృక్పథంలో చూడగలం. ఈ వ్యాసాలలో చిన్నపాటి విమర్శను సైతం చూడగలం.

ఈ పుస్తకంలో “దిగులు మేఘాల నుంచి తొంగిచూసిన లోపలివర్షం” అన్న వ్యాసంలో జింబో రాజేందర్ కవిత్వాన్ని గురించి “జింబో కవితా శైలిలో ఎక్కడా నినాదాడంబరం, పదాడంబరం, విప్లవ ప్రగల్భాల విశేషం మచ్చుకైనా కానరాదు. అతని జిజ్ఞాస ప్రస్థానం సాత్విక పరిభాషలోనే నడిచిపోతుంది. అన్నీ సహజ వాక్యలయలే. అలంకృతులు, ఉద్దీప్తులు బొత్తిగా మృగ్యం.” అని కవిగా జింబో కవిత్వాన్ని అనుశీలిస్తూ “ఈ కవికి ఇంకొంచెం అహం ఉంటే అనౌచిత్యం కాదనే నా విశ్వాసం” అంటూ కవి జింబోలోకి తొంగిచూస్తారు. ఇంకొంత లోతులకి వెళ్లి “జింబో పొయెటిక్ మెడిటేషన్ కు ఇంకొంత మార్మికత అవసరం” అని కవి జింబో బాధ్యతను సూచనాప్రాయం చేస్తారు “లోపలి వర్షం” కవితాసంకలనాన్ని జల్లెడపడుతూ సమీక్షకుడిగా మునిపల్లె రాజు.

కాళీపట్నం రామారావు “ఇల్లు” కథను సమీక్షిస్తూ, విశ్లేషిస్తూ సాగిన మునిపల్లెవారి విమర్శక లోతులను చూడండి – “గీర్వాణయుగం నుండి గతితార్కిక భౌతికవాదం వరకూ – కథా చిత్రాలలో కాలచక్రగతి కాళీపట్నం రామారావుగారి ఇల్లు … కలికాలపు మధ్యతరతి మనిషి కతల్నీ, వెతల్నీ తన కమండలంలో రంగరించి నింపుకొని, ఆ అశ్రుధారల్ని కథానికా సాహిత్యపథంలో చిలకరిస్తూ – పూలమొక్కల్నీ మహావృక్షాల్నీ పెంచి వాటి సౌరభాల్లో, నీడల్లో నడిచిపోయే పథికుల్ని ఆలోచనల్లోనూ ఆవేదనల్లోనూ ముంచెత్తిన సిద్ధుడు… కాళీపట్నం రామారావు మాష్టారు… మొపాసా నుంచి మూరేవియా దాకా కథాసాహిత్యం కరతలామలకం అయినా, పాశ్చాత్య ఛాయలకు ప్రభావితుడు కాకుండా, ప్రాచ్య వేదాల పనసలు వల్లిస్తూ, తను పుట్టిన ధార్తినుండే ఉత్తేజం పొంది, తను దుఃఖంతో పరిశీలించిన వేదనార్తుల గాథల్నే తెలుగు పాఠక లోకానికి అందించిన గరళకంఠుడు – కాళీపట్నం…” అంటూ కథకుడుగా కారా మాష్టారి అభినివేశాన్ని అక్షరీకరించిన మునిపల్లె రాజు అంతటితో ఆగక ‘ఇల్లు’ కథను ఆసాంతం అవలోకించి ఆ ‘కథావస్తువు’ను “సాధారణ జీవితసత్యం వెనుక దాగివున్న అసాధారణ తాత్విక గాథను, మెలోడ్రామాల పల్టీలు విసర్జించి, వెలికి తీయటం”గా చెప్తూ “ఈ క్లాసికల్ ఉదాత్తత ఆయన కథల్లో కొట్టవచ్చినట్లు వినిపించే విశేషం” అని అంటారు. ఇక కారా మాష్టారి ‘శిల్పనిర్మాణా’న్నిఅనుశీలిస్తూ “జీవితంలో ఒక వాస్తవిక సంఘటనను చేపట్టి, దాని నుండి నేర్పుతో కదిలిపోయి – కవితా విచారణతో కలిపి – కళాత్మక కల్పనా సాహిత్య స్రవంతిలో ముంచివేయటం” కారావారి శిల్ప నిర్మాణంగా చెప్తూ “తాను కేవలం సూత్రధారుడు. తన వ్యాఖ్యానం ఉండదు. ఆ పని చేసేది అతని పాత్రలే.” అంటూ “కాళీపట్నం వారిది – డిలేడ్ యాక్షన్ టైం బాంబు శిల్పం. ఎప్పుడు పేలుతుందో తెలియదు. పేలినప్పుడు ఆ ప్రదేశాన్నే కాకుండా, యావత్తు కాలచక్ర పరిభ్రమణాన్ని స్తంభింపచేస్తుంది.” అంటూ కారావారి కథానికా శిల్పనిర్మాణాన్ని అక్షరీకరిస్తారు. అలాగే కారావారి శైలీ విన్యాసాన్ని “మంద్ర గంభీరంగా అడుగులు వేస్తూ, గతాన్నీ, వర్తమానాన్నీ ముందు వెనుకలు చేస్తూ, పూర్వాంధ్ర మాండలీకాన్ని జంకులేకుండా జొనిపిస్తూ, ముందుకు నడిచే వాక్య నిర్మాణం. ఆ విషయాల్లో మాష్టారు చాలా గడసరి” అంటూ కారా కథన చాతురిని విశదపరుస్తూ కథానికా లక్షణాల్నీ తమదైన దృక్పథంతో మన ముందుంచుతారు.

మునిపల్లెవారి వ్యాస శీర్షికలు ఎంతో తాత్త్విక గంభీరతను పొదువుకుని ఒక చిత్రమైన అనుభూతి నిస్తాయి. “గోదావరిలోయ నుండి మూసీ తీరానికి కథాప్రస్థానం”గా శీలా వీర్రాజును, “మరణం ఒక కామా, మరణం ఒక కోమా”గా వాకాటి పాండురంగారావును, “కష్టజీవికి అటూ ఇటూ ఆసరాగా నిలిచిన కథలకాపు”గా పులికంటి కృష్ణారెడ్డిని, “సీమ వేదనలకు ఆధునిక భాష్యాలు”గా కేతు విశ్వనాథరెడ్డిని, “వేదఘోషల గోదావరి! వేదనాత్మల గోదావరి!”గా బి.వి.ఎస్. రామారావుని, “చిరునామా ఇచ్చిపోని మనిషి”గా డి. రామలింగాన్ని, “ముళ్లకిరీటంతో వెళ్ళిపోయిన”వాడిగా అజంతాను, “చలువ పందిరి కింద కథా శ్రవణం” అంటూ మధురాంతకం రాజారాంను, “వెన్నెల వృక్షం మీద వాలిన పక్షులు : ఒక చిద్రూపలక్ష్మి కవితలు” అంటూ ఆదూరి సత్యవతీదేవిని, ఇలా దాదాపు అరవైమంది సాహితీమూర్తుల అక్షర అభినివేశాన్ని “జర్నలిజంలో సృజనరాగాలు”గా అక్షరాలాపన చేశారు మునిపల్లె.

సాహితీ మంత్రనగరిలో సుస్వరాలు

“సాహితీ మంత్రనగరిలో సుస్వరాలు” అన్నది మునిపల్లె వారి మరో వ్యాస సంకలనం. ఇందులో 77 వ్యాసాలు ఉన్నాయి. ఇందులోని “విషయసూచిక కూర్పు ఒక పాత్రికేయుడి ఆత్మాశ్రయ లాటరీ పద్ధతి.” తాము అక్షరీకరించిన సాహితీవేత్తలను గురించి “పెద్ద లేదు… చిన్న లేదు… బిరుదుల్లేవు… భూషణాలు లేవు. ఉన్నదల్లా మహాగౌరవమే” అని తమ మనసులోని మాటను విషయసూచిక ముందు రెండుమాటలుగా చెప్పారు.

“జీవితాన్ని ఇంత కూలంకషంగా, ఇంత నిశితంగా పరిశీలించిన ప్రొఫెసర్ రచయితా నాకెక్కడా తటస్థించలేదు. తన పరిశీలనానుభవాన్ని – గుండుసూదుల వంటి వాక్యాల చురుకు వ్యంగ్యాలతో అభివ్యక్తీకరించిన భావుక-ఆచార్యుడు నాకెక్కడా తగలలేదు. దంతపు భవనపు అద్దాల కిటికీ వెనక కూర్చొన్న వాడయితే – తన కథల్లో లంపెన్ వర్గాల జీవన మూలాల్నీ, జానపదుల జీవభాష మాండలికాల్నీ – అంత పదునుగా మనకు చెప్పగలిగేవాడా? వ్యంగ్యం, హేళనోక్తి పాతకారు బంధం మధ్య – అసాంఘిక పెద్దమనుషుల్ని, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల ఆహార్యాన్ని – ఏ సైంటిస్ట్ – వేదాంతి – యిదివరలో తెలుగు కథలు రాశాడు? అన్ని ఉపమేయాలు, అన్ని ఉపమానాలు – ఎక్కడిదీ భాషాఖని? ఎన్నోసార్లు పాఠకుడిగా ఆశ్చర్యపోయాను. కథకుడిగా – నోరు వెళ్లబెట్టాను.” అంటూ కవనశర్మను మనకు పరిచయం చేస్తూ కథాసాహిత్యంలో కవనశర్మ స్థానాన్ని ‘సప్తతి కాలరథం’గా ధృవీకరిస్తారు.

అలాగే – పెద్దిభొట్ల సుబ్బరామయ్యను ‘అస్తిత్వవేదన ధ్వనీ – ప్రతిధ్వనీ’గా అక్షరీకరిస్తూ – “సంప్రదాయ సాహిత్యంలో అలంకారాలను, ఆధునిక సాహిత్యపు ఐడియాలజీలను, ఆధునికాంతర సాహిత్య పునాదియైన అనుభవాలను, అన్ని నినాదాలనూ, నిర్దేశాలనూ, నిర్ణయాలనూ – తృణీకరించి, తన అంతఃకరణే ఎక్కుబెట్టిన ధనుస్సుగా, దాని విన్యాసమే తన అభివ్యక్తీకరణ సారాంశంగా – కథలల్లిన మహా కథకుడుగా, ఎవరేమని రాసినా కూసినా – పెద్దిభొట్లవారు నాకొక పొగమంచు వెనక ‘మిస్టిక్’గానే గోచరిస్తారు” అంటారు.

ఇక “అంబుల పొదిలో ఒక ఉదారవాది”గా అంపశయ్య నవీన్‌ను, “వెన్నెల్లో గోదారి చందం”గా పోరంకి దక్షిణామూర్తిని, “చిరంతన చింతనాశీలి”గా చింతా దీక్షితులును, “ఒక పూర్ణ నదీశాంత ప్రవాహం”గా సి. వేదవతిని, “తెనాలి సాహితీనందనవనంలో పుష్పించిన సంపెంగ సౌరభం”గా విహారిని, “అంతరాత్మను మేల్కొలిపే కథకుడు”గా గొరుసు జగదీశ్వరరెడ్డిని, “ఒక ఇక్షు సముద్రపు తాత్విక కెరటం”గా గిడుగు రాజేశ్వరరావును, “ఆ కొసన ఆందోళన – ఈ కొసన అభద్రతా వత్తిళ్ల వడిలో మానవ ప్రస్థానాన్ని” చూపిన వాసిలి వసంతకుమార్‌ను “సాహితీ మంత్రనగరిలో సుస్వరాల”ను చేశారు మునిపల్లె రాజు గారు తమ నిశిత పరిశీలనతో.

ఆయన – ఆయన కథలు

ఇక ఆయనను – ఆయన కథాప్రపంచాన్ని చుట్టివద్దాం – పదండి.

ఆయనకు నటించటం తెలీదు.

ఆయనకే కాదు – ఆయన కథలకూ, ఆ కథల పాత్రలకూ నటించటం ఏమాత్రం తెలీదు.

కారణం – ఆయనకు జీవితం అంటే తెలుసు … జీవించటం ఇష్టం.

అలాగే ఆయన కారెక్టర్స్‌కూ జీవితమూ, జీవించటమూ తెలుసు.

వెరసి – ఘర్షణా, సంఘర్షణా తప్పని జీవులు.

ఆయనా, ఆయన పాత్రలూ బ్రతుకు జీవుడా అనుకోవు.

వీరూ వారూ కలిసి – బ్రతికించాలి, బ్రతికింపచేయాలి అని తపించారు.

అందుకే –

ఆయన సాదాసీదాగా కనిపించేవారు.

మనకు తెలిసిన కథకులకు ఉండే పైపూతలేవీ ఆయనలో కనిపించేవి కావు… మైమరపు ఏ కోశానా ఉండేది కాదు. కనువిప్పుతో వందల కథలు రాసినా నేలను తాకిన బ్రతుకులతోనే కలం కదిలించారు.

ఆయన పాత్రలను నేలమీద నడిపిస్తూ అప్పుడప్పుడూ విహంగయానం చేయించేవారు. అయితే వాటివి పుష్పక విమానాల ప్రయాణం కాదు… ఆధ్యాత్మిక మండల యానం.

ఆ శూన్యాకాశ తీరాల నుండి మళ్లీ తటాలున నేలను తాకుతాయి ఆ పాత్రలు… అద్భుతం అనిపించేలోపు వాస్తవంలోకి వస్తాయి.

ఇలా ఆధ్యాత్మిక అద్భుతాలను వాస్తవంలోకి ఒంపటం చేతనైన కథారచయిత మునిపల్లె రాజు. ఎంతటి చిన్న కథలోనైనా ఈ మాజికల్ రియలిజం మనల్ని అప్రతిభుల్ని చేస్తుంది.

ఒక పక్క వాస్తవం… దానికి ‘అద్భుతం’ అనిపించే తాలింపు. ఆ వంటకంతో వేల సంవత్సరాల పురాణ పాత్రలు, ఋషి ప్రోక్తాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆత్మిక రచనలు మునిపల్లెకు దిగివస్తాయి.

తెలుగు నాట మునిపల్లె కథ

వేల యేళ్లనాటి వ్యాసులవారి కథలు మనకు తెలుగు కథలుగా పరిచయం. ఆ సంస్కృత కథలను తెనిగించిన నన్నయాదుల కథలకూ వెయ్యేళ్లు నిండాయి. మొత్తానికి వ్యాసులవారు సంస్కృత కథకుడయితే నన్నయాదులు ఆంధ్రీకరించిన తెలుగు కథకులు. వారివి తెనుగు సేత మాత్రమే. పురాణాల తర్వాత వచ్చిన ప్రబంధాలలోను కథలున్నాయి. అవి తెలుగు కథలే అయినప్పటికీ కవిత్వీకరించిన కథలు. కాబట్టి అసలు సిసలు తెలుగు కథ మన భాషలో వచ్చింది వందేళ్ల క్రితమే. ఇక్కడ మన భాష అంటే మన తెలుగు భాష అనికాదు. మనం నిత్యవ్యవహారంలో ఉపయోగించే భాష.

ఇటువంటి వ్యావహారిక తెలుగులో వచ్చిన వందేళ్ల తెలుగు కథలలో మునిపల్లె రాజుగారు డెబ్భైయేళ్లు తమ ఖాతాలో వేసుకున్నవారు.

ఓ డెబ్బై ఏళ్ల క్రితం – 1951 లో – ‘భారతి’ పత్రికలో – “శ్మశానం చిగిర్చింది” అని ఒక కథ … పాఠకుల కనుబొమలు ముడిపడేలా చేసిన ఆ కథ మునిపల్లె రాజు గారిది. ఈ కథ ముగింపులో ఒక వాక్యం – “శ్మశానంలో బూడిదంతా మాయమైపోయింది. పచ్చగా, మృత్యుసన్నిధిలో కల్యాణాన్ని పాడుతున్నది.”

ఈ ఒక్క వాక్యం చాలు, ఏడు దశకాల మునిపల్లె రాజు గారి కథాప్రస్థానానికి గమ్యం ఏమిటో, గమనం ఏమిటో చెప్పుకోవటానికి. శ్మశానంలోని పచ్చదనాన్ని, మృత్యుసన్నిధిలోని కల్యాణాన్ని కళ్లముందుకు తెచ్చుకోగలిగితే మాజికల్ రియలిజం అంటే తెలిసివస్తుంది.

నిజానికి ఇదే మునిపల్లెవారి తొలి కథ కాదు. కానీ కథారచనలో ప్రసవ వేదన నుండి బయటపడ్డ తర్వాత వెలుగులోకి వచ్చిన కథ ఇది. అమ్మ వొడిలోను, బామ్మల పక్కలలోను, అమ్మలక్కల కబుర్లలోను, పెద్దమనుషుల ప్రవర్తనలోను, గ్రంథాలయ పుస్తక అరలలోను తల దూరుస్తూ – అడుగులు వేస్తూ – నడకలు సాగిస్తూ – వీరు చెప్పిన కథలు, తను విన్న కథలు, తాను చూసిన కథలు … వెరసి తనలో సుడులు తిరుగుతున్న కథలు, తనలోనే దాచుకున్న కథలు – చాలానే ఉండిఉంటాయి. అవన్నీ పాతికేళ్ల ప్రాయపు ప్రసవ కథలే.

ఇలా నిక్కర్ల రాజు, పైజమాల రాజు రాసిన రాతలు ఏమైతేనేం? మనకు కావలసింది కథల రాజు ‘మునిపల్లె రాజు’. ఈ కథల రాజు కథకుల రాజు ఎలా అయ్యాడన్నది మనకు ముఖ్యం. నిన్నమొన్నటిదాకా ప్యాంటు షర్ట్ తోనే కనిపించిన రాజు గారిని ప్రత్యక్షంగా చూడనివారికి – వారు పంచెకట్టుతో ఉండేవారనుకొనేవారికి – వారి మాజికల్ రియలిజం తెలియనట్లే. నిజానికి మునిపల్లెవారు ఎంత సాదా సీదా వ్యక్తి అయినప్పటికీ తెలుగు కథాసాహిత్యంలో కథక చక్రవర్తి… కథకుల కథకుడు.

మునిపల్లె రాజు గారివి చెప్పక చెప్పే కథలు… వినిపించకుండా కనిపించే కథలు… రాసిన కథలు వాసిగల కథలు… చేవగల కథలు – చేయితిరిగిన కథలు… సుడులు సుడులుగా మనలో నిరంతరం కదలాడే కథలు.

తొలినాటి కథలనే చూద్దాం – 1951 లో “శ్మశానం చిగిర్చింది”, 52 లో “తమస్సులో తపస్సులు”, “వారాల పిల్లాడు”, “బిచ్చగాళ్ల జెండా”, 53 లో “చిరంజీవి”, 54 లో “అరణ్యంలో మానవయంత్రం”, 56 లో “ఆమె పేరు అమ్మ”, 57 లో “బడుగు పేదను బాబయ్యా” – ఈ కథల పేర్లను చూస్తుంటేనే మునిపల్లె కథాప్రస్థానం ఎటువంటిదో అర్థమవుతుంటుంది.

ఇతివృత్తపరంగా దాచటం అన్నది వారి కలానికి నప్పని విషయం. సమకాలీన కథకుల నుండి దోచుకోకుండా వారి కలం కదిలేది. పైగా ప్రతి కథలోనూ ఆయన సూత్రధారిలా కాక పాత్రధారిలా ఉంటారు. జీవితాన్ని, సంఘటనను, సంఘర్షణను సునిశితంగా ఆవిష్కరిస్తారు. పాత్రల్లో తాను వొదిగిపోతారు. పాత్ర చిత్రణలో తమ వ్యక్తిత్వాన్ని ఒంపేస్తారు. పాత్ర గమనంలో తమ తాత్వికతను రంగరిస్తారు. ప్రపంచంలో బహుముఖీనంగా పరచుకున్న ప్రేమను ఒడిసి పట్టుకుని కథా నిర్మాణం సాగిస్తారు.

ప్రతీకథలోను వారి అన్వేషణ, అవగాహన, అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్నవాటిని ఆవిష్కరించటం, ఆ ఆవిష్కరణలో ఒక వాస్తవికతను, ఒక తాత్వికతను కలగలపటం – అనే సుగుణాలు ఉంటాయి. మనకు తెలిసిన వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలు, దేశాలు, సంస్కృతులు కథ పుట్టినప్పటినుండి పెరుగుతూ పోయి, ముగింపుకు వచ్చేవరకు మన కళ్ల ముందు తారాడుతుంటాయి. పైగా, ఆ కథలలో వైయక్తిక కాల్పనికత, తాత్విక దృక్పథం, సానుకూల వైఖరి, సమకాలీన చరిత్ర, ఉద్వేగాలు, ఉద్రేకాలు, స్వార్థాలు, రాజకీయాలు, అరాచకాలు, అమానుష వర్తనాలు – ఒక్కటేమిటి – గత వందేళ్లుగా మానవధర్మాల్ని తిరగరాస్తున్న ధోరణులన్నీ ఉంటాయి.

అయినా – మునిపల్లె రాజు – వ్యక్తిగా, కథకుడిగా ఆశాజీవి. మానవ వైఫల్యాలన్నీ విజయంవైపు ఆముఖమై ఉంటాయన్న అచంచల విశ్వాసం గల సామాజిక జీవి. కారణం భారతీయ తాత్వికతలో, సనాతన సంస్కృతిలో, హైందవ ధార్మికతలో వారి కలం ఆనవాళ్లుండటమే… వారి కాళ్లు నిలదొక్కుకుని వుండటమే… వారి కళ్లు కాలగమనం నుండి మరలకుండటమే. వారిది అంతర్ముఖత్వం … అస్తిత్వ చింతన. వెరసి వారివి మాజికల్ రియలిజం కథలు. అందుకే వారి వాస్తవిక కథనం వెనుక మరొక అద్భుత కవనం ఉంటుంది.

గ్రాంథికం నుండి వ్యావహారికం పురుడుపోసుకున్న నాటి నుండి వ్యావహారికమే తెలుగు సొగసు అనుకుంటున్న నేటిదాకా తెలుగు భాషా పటిమను తెలియ జెబుతూ – లౌక్యం తెలీని కథకుడి అలౌకిక కథనరీతులుగా – మునిపల్లె రాజుగారి కథలు ఇప్పటికీ ఎప్పటికీ కాలరేఖలే.

మునిపల్లె రాజు అత్యుత్తమ కథాకృతులు

‘మునిపల్లె రాజు కథలు’ అనే తొలి కథా సంపుటాన్ని, ‘పుష్పాలు-ప్రేమికులు-పశువులు’ అనే మలి కథా సంపుటాన్ని కలిపి మునిపల్లె రాజు సమగ్ర సాహిత్యంలో భాగంగా “మునిపల్లె రాజు అత్యుత్తమ కథాకృతులు” పేరిట కణ్వస గ్రంథమాల 2012 లో ప్రచురించింది.

ఇందులో-

తొలి విభాగమైన “మునిపల్లె రాజు కథలు”లో వారాల పిల్లాడు, లక్ష్మీ ఉపాసకుడు, బిచ్చగాళ్ల జెండా, కస్తూరి తాంబూలం, విశాఖ కనకమహాలక్ష్మి, తమస్సులో తపస్సులు, చెప్పుల దానం, జయమూ-అపజయమూ, అరణ్యంలో మానవ యంత్రం, జెట్టీ, భోగం మనిషి, సవతి తమ్ముడు, దొడ్డమ్మ వారసులు, జ్ఞానధార-దానధార, ఇంటి తనఖా దస్తావేజు, యశోద కొడుకు అనే 16 కథలు ఉన్నాయి.

రెండవ విభాగమైన “పుష్పాలు-ప్రేమికులు-పశువులు”లో రాధారాణి కలలు, మాతృదర్శనం, వెండి కుంకుమ భరిణ, ఆవలి పక్షం, కుటుంబ గౌరవం, ఒక బాకీ తీరలేదు, మహాబోధి ఛాయలో, మనుషులూ-దేవతలూ, నా ఇంటర్వ్యూ పోయింది, కుడిచేయి-ఎడమచేయి, బానిసలు, రాగమ్ నీలాంబరి, శ్మశానం చిగిర్చింది, జీవితం-జీవితం, సరోజ, బడుగు పేదను బాబయ్యా, ఆమె పేరు అమ్మ, చిరంజీవి, కొత్త ప్రమిదలో చిన్న దీపం, పుష్పాలు-ప్రేమికులు-పశువులు అనే 20 కథలు ఉన్నాయి.

ఈ కథలలో “కస్తూరి తాంబూలం” కథ చాలా చిన్న కథ. సంఘటనలూ తక్కువే. ఒరిపిళ్లూ తక్కువే. “అయినా కథలో అత్యాశ్చర్యకరమైన మలుపు. కథలో శేషమ్మ ఒక బాలెంతరాలను బ్రతికించటానికి, వంశాంకురాన్ని నిలబెట్టడానికి, వానలో ముద్దై మరణిస్తుంది. ఈ మరణంతో మనిషి లోపొరల్లోని కస్తూరి పరిమళిస్తోంది.” నిజానికి, ఈ కథ చిన్నకథ లక్షణాలను, వాటిని ఇముడ్చుకొన్న లక్ష్యాన్నీ నిర్దేశిస్తోంది.

ఒక మాట కావొచ్చు, ఒక పాట కావొచ్చు, ఒక ఆట కావొచ్చు… మనల్ని నిలబెడుతుంది… రేకిస్తుంటుంది. ఆ స్మృతులే గతచరిత్రలు అవుతుంటాయి. ఆ స్మృతులకు కారణమైన దృశ్యాలే ఉపదేశాలు, ఆదేశాలు అవుతుంటాయి. అవే మనల్ని ముందుకు నడిపిస్తుంటాయి. వీటన్నిటి కలయికే మునిపల్లె వారి “సవతి తమ్ముడు” ఇతివృత్తం. అంతేకాక కథను ఎంత వేగంగా నడపవచ్చో ఈ కథానడకను బట్టి తెలుసుకోవచ్చు.

అస్తిత్వనదం ఆవలితీరాన

మునిపల్లె రాజు సమగ్ర సాహిత్యంలో భాగంగా 2012 లో కణ్వస గ్రంథమాల ప్రచురించిన మరో సంపుటం “మాజికల్ మునిపల్లెతో ముఖాముఖి – అస్తిత్వనదం ఆవలితీరాన” అన్న సంపుటం. “అస్తిత్వనదం ఆవలితీరాన” కథలకే మునిపల్లెవారికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.

ఈ సంపుటంలో – నిశ్శబ్దం ఒక పదం కాదు, అదృష్ట దేవత, వేరేలోకపు స్వగతాల్లో, నైమిశారణ్యంలో సత్రయాగం, నిష్క్రమణ పర్వం, సప్తతి మహోత్సవం, నా ఇంటర్వ్యూ పోయింది, చేనేత చిత్రం, ధర్మచత్రం, అస్తిత్వనదం ఆవలితీరాన, ఒక బాకీ తీరలేదు, మహాబోధి ఛాయలో, ఇద్దరు పిల్లలు, పూజారి, వీరకుంకుమ, పాముకాటు, ఉద్యోగ విరమణ, తిరుగు ప్రయాణం, విప్లవవాది, ఒక లవ్ స్టోరీ రాసిపెట్టండి సార్, నెత్తురుకన్నా చిక్కనిది, దివ్యజ్యోతి, దంపతులు, అంతా విషాదాంతం కాదు, అమావాస్య పున్నమి, కల్లోల గౌతమి చిట్టి ఆభరణం, వీరులూ వారసులూ, దివోస్వప్నాలతో ముఖాముఖి – అనే 28 కథలు ఉన్నాయి. వీటిల్లో “పూజారి” అన్న కథ పెద్దకథ.

ఈ కథల హారంలోని లాకెట్ “వీరకుంకుమ” అన్న కథ. దాదాపు అరవై ఏడు సంవత్సరాల క్రితం – 1953 లో – రాసిన – కనిపించే కథ ఇది. రాయలసీమలో కరవు కరాళనృత్యం చేస్తున్న నేపధ్యం ఈ కథేతివృత్తం. “ఈ హంపీ దిబ్బల మీద జీవం కురుస్తుంది మళ్లీ” అన్న ఆశావహ దృక్పథంతో సాగిన రచన. “ఆకలి నుండి, అన్యాయం నుండి మానవజాతికి విముక్తి లేదు” అన్న గాఢాభిప్రాయానికి వచ్చి “నీడ వలె కన్పించింది జీవితం. తెల్లనీడ ఈ పగలు, కనబడని నల్లనీడ రేయి” అని అంటాడీ కథకుడు. “మృత్యువుకు కూడా మృత్యువు వున్నది” అని తెలియచెప్పే కథ ఇది. “ఈ లోకపు ఆత్మ తన ఆత్మకు అగ్ని” అన్న విషయసాంద్రత గల కథ ఇది. ఇక ఈ కథ ముగింపు ఒక్క మునిపల్లె రాజుకే స్వంతం. కథకుడి బలమైన ముద్ర అన్నివిధాల కనిపించే కథ ఈ ‘వీరకుంకుమ’.

“పాముకాటు” కథ “వేలాది సంవత్సరాల వేదాంతం, నాగరికత ఎక్కడ దాగున్నది?” అని ప్రశ్నిస్తుంది. నిష్కృతిలేని విద్వేష కార్పణ్య జ్వాలలను కళ్లముందు నిలుపుతుంది. ఒకానొక మలుపులో “గాంధీజీ ఈ వ్యవస్థకు రెలెవెంట్ కాదు” అన్న ఆలోచనలో పడేస్తుంది.

“ఉద్యోగ విరమణం” కథ ద్వారా “పాశ్చాత్య వేదాంతం మన సంస్కృతిలో ఇమడదు” అని స్పష్టం చేస్తాడీ రచయిత. “నీ మనసు సవ్యంగా ఉంటే వృద్ధాప్యం నీ జోలికి రాదు” అన్న నిర్ద్వంద్వ గీత ఈ కథలో ప్రతిధ్వనిస్తుంది. ధనం మానవుడికి గులాంగా మారిన తీరును, ధనస్వామ్య అసమాన క్రూర బూర్జువా వ్యవస్థను కళ్లముందుకు తెస్తుందీ కథ. చివరికి “దుఃఖమే సరియైన గురువు” అన్న సాంద్రతను వెలికితీసిన కథ ఇది.

“తిరుగు ప్రయాణం” కథలో మన పురాణ పాత్ర అయిన భరతుడి ప్రస్తావన వస్తుంది. ఆ సందర్భంలో “గాంధీగారి కంటే ముందు సత్యాగ్రహం చేసినవాడు భరతుడు” అంటాడీ కథకుడు. ఈ కథలోని ఒక ముఖ్యపాత్ర దుర్గ. మృత్యువాతపడ్డ దుర్గను “నిద్రబుచ్చుతున్న శిశువును పండబెట్టినట్లు” ఆమె శవాన్ని గోతిలోకి చేర్చి శవనిద్రకు ఒక వినిర్మలత్వాన్ని కలగజేస్తారు మునిపల్లె రాజు.

“మానవుల మీద ఆకలికున్న విస్తృతాధికారాన్ని తలచుకుంటే హైందవ వేదాంతమే కాదు; జ్ఞానులు, విజ్ఞానులు, రాగులు, విరాగులు బోధించిన సకల ధర్మాలకు అర్థం గోచరిస్తుంది. విప్లవ జ్వాలల్నీ, విటు కత్తెల్నీ, ధర్మ జ్యోతినీ, అధర్మ యుద్ధాల్నీ, దానవులను, మానవులను అంత సులువుగా – ఇంక – ఏ శక్తి సృష్టించగలదు?” అని ప్రశ్నించే కథ “ఒక లవ్ స్టోరీ రాసిపెట్టండి సార్”. ఆకలి ముద్దను ప్రసాదంలా ఆరగించటం తెలిసిన మునిపల్లె రాజు ఈ కథలో “ఆకలి వెనకబడుతుంది, మనిషిగా బతకొచ్చు, అర్థంతో అన్ని వస్తువుల్ని చూడవచ్చు” అంటూ పాత్రకూ పాత్రకూ లంకె కుదురుస్తూ, ఒక మెరుపు మెరిపిస్తూ, ఆశగా కథను ముగిస్తారు.

మరికొన్ని కథలు –

“నెత్తురు కన్నా చిక్కని వేరే విలువల వలయంలో తన భర్త చిక్కుకుని వున్నాడని ఆమె ఎప్పటికీ తెలుసుకోలేదు… సత్తెకాలంనాటి మనిషి” అన్న రసానుభూతితో “నెత్తురుకన్నా చిక్కనిది” అన్న కథ సాగుతుంది.

“ఆమె లలాటాన్ని ముద్దిడుకుని నొసటికుంకుమ తన లలాటానికి పూసుకున్నాడు” అన్న అందమైన భావచిత్రంతో పాటు “మృత్యువుకు కూడా కొత్త నాగరికత నేర్పిన” కథ “దంపతులు”.

“అంతా విషాదాంతం కాదు” అన్న కథలో తాను ఇష్టపడ్డ సరోజిని మరొకరి భార్య అవుతుంది. ఆ భర్త అకాల మరణంతో మళ్లీ ఆమెను వివాహం చేసుకోవటం అనే ఇతివృత్తం ఈనాడు కొత్త కాకపోవచ్చు. కానీ ఈ కథకు ముగింపు మాత్రం ఎప్పటికీ నవనవోన్మేషమే. చూడండి – “స్కూల్ ఇన్స్పెక్టర్‌గా వచ్చిన విశ్వనాథం కలలోకి అనంతరామయ్యగారొచ్చి ‘వితంతు వివాహంపైన నమ్మకం ఉందా?’ అంటే కలలోనే జవాబు ‘ఉంది’ అని.” సరోజినిని విశ్వనాథం వివాహమాడాడు అని ఇలా అదృశ్యంగా చెప్పటం గొప్ప ముగింపు.

మునిపల్లె రాజు “కల్లోల గౌతమి చిట్టి ఆభరణం” కథ ఓ చిరు ప్రబంధ కథలా సాగిపోతుంది. అఖండ గోదావరి పెళ్లినాటి ముక్కు పుడక కనిపించకపోవటంతో గోదావరి అన్వేషణ ప్రారంభమై, గోదావరి పారే ప్రాంతాలన్నిటినీ కథేతివృత్తం చుట్టిరావటం చాల గొప్పగా ఉంటుంది. ఒక వెయ్యి రూపాయల నోటు చుట్టూ తర్వాతి కథంతా సుడులు తిరుగుతుంది.

“వీరులూ-వారసులూ” అన్న కథ చేనేత కార్మికుల ఆకలియాత్రకు అక్షరనీరాజనం. “ఉదయమూ అస్తమయమూ మానవుల ఆకలికి కొలమానాలు” అని చెప్పే ఈ కథ “మగ్గమున్న ప్రతి ఇల్లూ ఆకటి ఆలయమే” అని కళ్లముందు మగ్గం పడుతుంది. ఇందులో తాయారమ్మ కుటుంబ ఆకలి తీర్చటం కోసం అమ్ముడుబోవటం తెలుసుకున్న భర్త “నీ ధర్మం వదలుకుని మాతృధర్మం నిర్వర్తించావ”నటం – “నమస్కారం – నీలో వున్న జననికి, నీలోని మానవత్వానికి, నీలోని తల్లికి” అనటం గొప్ప ముగింపు. రాయలసీమను పర్యటించి, అక్కడి కరువునూ, చేనేతపనివారి దుస్స్థితినీ ఆకళింపు చేసుకుని రాసిన కథ ఇది. అప్పట్లో ఆంధ్ర పత్రిక వార పత్రికలో ప్రచురింపబడింది.

“దివో స్వప్నాలతో ముఖాముఖి” కథ “తెలుగు కథకులందరికీ నివాళి”గా రాసిన కథ. “అక్షరం పలకటం లేదంటే ఆత్మదీపం వెలగలేదన్నమాట” అన్న మాటలు ఏపాత్రవైనా – పలికించినవారు మునిపల్లె వారే.

ముగింపు ప్రస్తావనలు

“ఎన్నటికీ తరగని భారతీయ గ్రామీణ పేదరికానికి, విజ్ఞానశాస్త్రం ఏ వ్యూహ నిర్మాణంతో – అడ్డుకట్ట వేయ నున్నది?

నరహంతకులైన మత ఛాందసవాదుల్ని – ఈ సైన్స్ అదుపులో పెట్టి వసుధైక మానవుణ్ణి తిరిగి ఉద్భవింప జేయగలదా?

ఎన్నో నిగూఢ జీవన రహస్యాల్ని పరిశోధించగలిగిన భారతీయ సాహిత్యం – ఈనాటి క్రూరత్వం ముందు తన శాంతి పాఠాన్ని వల్లించలేకపోతున్న దెందువల్ల?

ఈ ప్రశ్నలన్నీ నా మెదడును కలచివేస్తుంటాయ్. అన్నింటినీ మించిన విషాదం పర్యావరణ కాలుష్యం – ఉండనే వున్నది” అన్నవి మునిపల్లె వారి స్వగతాలే కాదు … మంత్రనగరిలో మునిపల్లెవారిని కట్టిపడేసిన వాస్తవనేపధ్యాలు కూడా. అందుకే మునిపల్లెవారివి బతుకు గతుకుల కథన రీతులే అయినా మాజికల్ రియలిజం కథ లనిపించుకున్నాయి.

మాజికల్ రియలిజం కథల రారాజు మునిపల్లె రాజు

కథారచయిత పేరు లేకుండా ఒక కథను ప్రచురించి ఆ కథారచయిత ఎవరో కనుక్కోమంటే కథను బట్టి, కథనాన్ని బట్టి, కథానిర్మితిని బట్టి, కథావిస్తృతిని బట్టి కథకుడు మునిపల్లె రాజు అని చెప్పేయగలం. ప్రతికథను మాజికల్ రియలిజంతో దిద్దితీర్చిన ఏకైక తెలుగు కథకుడు మునిపల్లె రాజు. కథను చదివి ఫలానా రచయిత కథ అని పాఠకుడు పసిగట్టేయగల కథనచాతురి ఉన్న తెలుగు కథకులు నూరేళ్ళ తెలుగు కథాచరిత్రలో ఏడాదికి ఒక్కరు మిగులుతారేమో?! అని అనుకుంటున్న నేపథ్యంలో మునిపల్లె రాజు గారు ఆ వందమంది కథకులలో ఒకరు. ఇలా తెలుగులో మాజికల్ రియలిజం కథలకు ఏకైక చిరునామా మునిపల్లె రాజు.

తమ కథలలో కానవచ్చే ‘మాజికల్ రియలిజం’ నేపధ్యాన్ని గురించి కేంద్ర సాహిత్య అకాడెమి ‘అవార్డు’ ఇచ్చిన సందర్భంలో మునిపల్లె రాజు “I propounded that Indian epics of Valmiki and Vyasa contain the essential elements of Magic Realism and that is not the Latin American Writers’ monopoly. My stories of this genre were well received.” అని స్పష్టం చేస్తూ “I crossed the domestic, national and international borders when depicting the existential angst of the man. I moved far away from sloganeering.” అని అంటారు. ఈ సందర్భంలోనే “Mine is a long sentimental journey from the twilight one of “creative isolation’ in my student days – to the present arena of ‘Co-Creativity…” అనీ అంటారు.

కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు ప్రకటించిన నాలుగు రోజులపాటు నిరంతరంగా ఫోన్ కాల్స్ వచ్చాయని, దాదాపు 1800 లేఖలను వివిధ వర్గాలనుండి అందుకున్నానని చెప్పుకున్నారు.

ఈ వేదిక నుండే మునిపల్లెవారు తమ కథన రీతుల గురించి, భాషా శైలి గురించి చెప్పిన అంశాలు మనం అవశ్యం గుర్తుంచుకోవలసినవి. తాము చూసిన ప్రపంచం, వేదనామయ అనుభవాలే తమను రచయితగా తీర్చిదిద్దాయంటూ “These experiences resulted in evolving my own style of expression. I tried to erase off the dividing line between Prose and Poetry. A lyrical and rhythmic sentence formation came effortlessly. I abandoned the linear and chronological style of narrative mode. Instead – the circular, the poetic and flash back – came hand to adequately express the inner struggles … I became confident that I am on the right track when I made the man’s struggling soul as the main theme for my fiction.”

అవును – మానవ వేదనలు, మానవతత్వ సంఘర్షణలు, మానవాత్మ ఘర్షణలు అస్తిత్వానికి పునాదులు, నేపధ్యాలు … అవే అస్తిత్వాన్ని నిలుపుకునే దశలో, దిశలో మార్గదర్శులు. ఈ తీరాన అస్తిత్వ వేదనను అనుభవించారు, అనుభూతించారు కాబట్టే తమ పాత్రలను మాజికల్ రియలిజం నీడన నిలిపి అస్తిత్వ నదం ఆవలి తీరానికి చేర్చగలిగారు, చేరగలిగారు మునిపల్లె రాజుగారు.

అస్తిత్వవేదనల నుండి ఆధునిక తెలుగు వాక్యాన్ని సుస్వర లయతో పల్లవింపచేసిన మునిపల్లె రాజు నేను రాసిన “లైఫ్ ఈజ్ ఎమోషనల్ : అయినా గెలవాల్సిందే”, “ఒత్తిడి ఇక లేనట్లే”, “ది విన్నర్ : గెలవాలి, గెలిపించాలి”, “మనకే తెలీని మన రహస్యాలు”, “56 ఆత్మదర్శనాలు” అన్న పుస్తకాలని సమీక్షించటం నా అదృష్టం.

ఇక, 2009 నవంబర్ లో నేను రాసిన మా నాన్నగారు శార్వరి గారి జీవిత కథను 260 పేజీలలో ఆవిష్కరించిన “మాస్టర్ శార్వరి : మిషన్ అండ్ విజన్” పుస్తకానికి మునిపల్లె రాజు గారు “ఆధునిక వ్యాసులవారి సత్యయోగదర్శనానికి అంతేవాసి శుకమునీంద్రుడి విశిష్ట వ్యాఖ్యానం” అంటూ తమ ముందుమాటలకు తిలకం దిద్దారు. ముద్రణలో నిండు ఆరు పుటలలో వ్యాపించిన వారి విశ్లేషణలో –

“ఒక విజన్ … ఒక చేతనామయ స్వప్నం. ఒక ‘మాన్యుడు’ దర్శించిన ఆశావహ స్వప్నాన్ని – ‘సామాన్యుడికి’ కూడా అందించేందుకు ఒక మిషన్ కావాలి. ఒక ప్రేమాన్విత ప్రయత్నం చేయాలి. దాని పరిభాష అందంగా ఉండాలి. ఆ శబ్దంలో ఒక మాంత్రికత ఉండాలి… ఈ గ్రంథకర్తను సరళసుందర కవితాత్మ ఆవహించింది. ఒక అమలిన సెలయేటి గీతంగా, ఆధ్యాత్మిక మార్మిక శబ్దజాలం మీది ఆచ్చాదనలను తొలగించిన ఒక ఆధునిక భావకవి రచించిన రమ్యమైన వచన కవిత్వంగా రూపొందింది… తన కవితాత్మతో పరవశుడై వివశుడై – Phrases with musical structure తో, శృతిలయల గజ్జెల నాట్య ప్రదర్శనగా – శార్వరి ‘మాస్టర్ శార్వరి’గా తన ఎరికా ప్రయత్నం లేకుండానే యెట్లా పరిణత చెందాడో – ఒక బయోగ్రఫీగా, ఆటో బయోగ్రఫీగా రచించిన గ్రంథకర్త డా. వాసిలి వసంతకుమార్… ఈ గ్రంథం ఒక మధురమైన దీర్ఘకవిత. ఒక పరంపర పతాకం. ఒక నివాళి. ఒక yoga symphony.”

ఇది ఆ మహాకథకుడు నా రచనకు ఇచ్చిన టెస్టిమోనియల్. ఈ సందర్భంలోనే – స్వోత్కర్షలా అనిపించినప్పటికీ – మునిపల్లెవారి మాటలను నెమరువేసుకోవాలనిపిస్తోంది. “నా చిన్నతనంలో, ఆపైన విద్యార్థి దశలో చలం ‘దైవమిచ్చిన భార్య’నూ, మునిమాణిక్యం ‘వక్రరేఖను’నూ, రచయిత పేరు జ్ఞాపకం రాని ‘Vijayanagar – a forgotten empire’ నూ, పందొమ్మిది నవలలనూ ఒకరి తర్వాత ఒకరికి stenographers కు dictate చేయగలిగిన మహా డిటెక్టివ్ రచయిత Edward Marston డిటెక్టివ్ నవలలనూ, దోస్తోవిస్కీ Crime and Punishment నూ, శ్రీశ్రీ, తిలక్, అనిశెట్టి, అజంతా, బైరాగి కవితలనూ, తిరుమల రామచంద్ర ‘హంపీ నుండి హరప్పా దాకా’, దాశరథి రంగాచార్య ‘జీవనయానం’ ఆత్మకథలను – ఎంత తమితో, ఉద్వేగంతో చదివానో – యీ పుస్తకం కూడా అంతగాఢంగా నన్నాకర్షించింది.” అని మునిపల్లె రాజు గారు నా పుస్తకాన్ని అందరు మహామహుల రచనల సరసన నిలపటం నాకూ ఒక ప్రపంచ సాహిత్య అవార్డును ఇచ్చినట్లుగా పరిగణిస్తూ – ఈ తీరాన అనుభవిస్తూ ఆ తీరాన్ని అక్షరాల్లో మనకు అందించి – అస్తిత్వనదాన్ని అధివసించిన మునిపల్లె వారికి వినమ్రంగా, ఆత్మీయంగా నా నమస్కారాంజలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here