సాగర ద్వీపంలో సాహస వీరులు-7

0
4

[box type=’note’fontsize=’16’]’సాగర ద్వీపంలో సాహస వీరులు’అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]

[dropcap]“అ[/dropcap]య్యా ఈ వయసులో ఇలా అరణ్యమార్గాన ప్రయాణం చేయవలసిన అవసరం ఏమి వచ్చింది? ఎన్నో క్రూరమృగాలు సంచరించే అడవిలో ప్రయాణం చేయడం ప్రమాదం కదా” అన్నాడు విజయుడు.

“కన్నబిడ్డల ఆదరణకు నోచుకోని మేము ఉండి ప్రయోజనమేమిటి? మరణించి ఆకలితో ఉన్న రెండు జంతువుల పొట్టనింపిన పుణ్యమైనా మాకు దక్కుతుంది” అన్నాడు వృధ్ధుడు.

“అయ్యా ఇవిగో పది బంగారు నాణాలు, మీ జీవితాంతం సుఖంగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ హాయిగా జీవించండి” అని నాణాలు వృధ్ధునికి అందించాడు జయంతుడు.

“నాయనలారా నేను యాచకుడను కాను, ఎవరూ ఎవరివద్దా ఉచితంగా ధన సహాయం పొందకూడదు. మీరు నాకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తాను. ఇక్కడకు దక్షణంగా కొద్దిదూరం వెళితే పాతాళ లోయ అనే ప్రదేశం వస్తుంది, ఆ ప్రదేశంలో భగవతిదేవి అమ్మవారి ఆలయం ఉంది. మీ కోరిక తెలియజేస్తు ఆ దేవిని వేడుకొండి. మీ కోరిక ఎంతటి అసాధ్యమైనా తప్పక నెరవేరుతుంది. వెళ్ళి రండి శుభమస్తు” అని దీవించిన ఆ వృధ్ధ దంపతులు వెళ్ళిపోయారు.

అలా మిత్రులు ఇరువురు కొందూరం ప్రయాణం చేసాక వారిని, బందిపోటు దొంగలు చుట్టుముట్టారు. “బాటసారులూ, మీ వద్దనున్న విలువైన ఆభరణాలు, ధనం వస్తువులు అక్కడపెట్టి మీ ప్రాణాలు కాపాడుకొండి” అన్నాడు దొంగల నాయకుడు.

“అయ్య నాయకా, ఇదిగో బంగారు మెహిరీల చేతిసంచి. ఇక్కడ నేలపై ఉంచుతున్నాను, మమ్మల్ని జయించి ఈ బంగారు నాణాలతోపాటు మావంటిపైనున్న ఆభరణాలు కూడా మీరు తీసుకోవచ్చు” అన్నాడు ఒరలోనుండి కత్తిని తీస్తూ విజయుడు.

అతని మాటలు వింటూనే దొంగలంతా భయంకరంగా రంకెలు వేస్తూ, వారిపై దాడికి దిగారు. కొంతసేపటి పోరాటంలో దొంగలు అధిక సంఖ్యలో గాయడటంతో, గాయపడిన వారిని తీసుకుని దొంగలు పారిపోయారు.

సంజె చీకట్లు కమ్ముకు రావడంతో, ఆ రాత్రి తాము విశ్రాంతి పొందడానికి అనువైన చెట్టును ఎంచుకుని పడక ఏర్పాటు చేయసాగాడు జయంతుడు.

ఎంత గాలించినా ఆ ప్రాంతంలో ఎటువంటి ఫలాలు లభించలేదు విజయునికి. తిరిగి వస్తుండగా చాలా ఎతైన మామిడి చెట్టుపై కోతికూర్చుని ఉంది.నవ్వుకున్న విజయుడు చిన్న రాయి తీసి కోతికి తగలకుండా దానిపైకి విసిరాడు. కోపంతో కోతి ఒక మామిడి పండును తుంచి విజయుని పైకి విసిరింది. ఒడుపుగా మామిడి పండును అందుకున్న విజయుడు మరో చిన్నరాయిని కోతి పైకి విసిరాడు, కోతి మరో పండు తుంచి విజయుని పైకి వేసి పళ్ళన్నికనిపించేలా ఇకిలించింది.

‘ఆహారదాత సుఖీభవ’ అంటూ జయంతునికి ఓ పండు ఇచ్చి, తను ఓ పండు తిని ఆ చెట్టుపై నిద్రపోయాడు.

తెల్లవారుతూనే తమ ప్రయాణం కొనసాగించారు మిత్రులు ఇరువురు. అప్పుడే గుర్రలపై రాత్రి తమచేతిలో ఓడిపోయిన దొంగలు చేతిలో వెలుగుతున్న కాగడాలతో మిత్రులను చుట్టుముట్టారు.

“జయంతా వీళ్ళు మనతో పోరాడటానికి రాలేదు, ఏదో మనకు ఆపద తలపెట్టివచ్చారు. పగటి పూట కాగడాల వెలుగుతో పని ఏముంటుంది?” అన్నాడు విజయుడు.

దొంగలు మిత్రులు ఇరువురి చుట్టు మంటలు పెట్టారు. క్షణాలలో ఆ ప్రాంతం అంతా అగ్ని శిలలు వ్యాప్తి చెందాయి. పెద్దగా నవ్వుతూ దొంగలు గుర్రాలపై వెళ్ళిపోయారు.

మంటల్లో విజయుడు, జయంతుడు చిక్కుకు పోయారు.

***

“అమ్మాయ్ ఇలా దిగులు పడితే ఏం లాభం. సముఖములో ఉన్నప్పుడు ఏమో సిగ్గులు, ఇప్పుడేమో దిగులు, విరహం పడటం ఏం బాగాలేదు. త్వరలో వాళ్ళు వాళ్ళ రాజ్యం చేరతారు. మిమ్మలను చేపడతారు” అన్నాడు ఇకఇక.

ప్రేమగా చేతిలోనికి తీసుకుని ఇకఇకను మృదువుగా నిమిరి ముద్దు పెట్టింది సుగంధి.

“అమ్మాయ్ నేను విజయుడిని కాదు” అన్నాడు ఇకఇక.

“ఛీ పో” అంటూ సిగ్గుతో నవ్వింది సుగంధి.

***

“యువరాజా అక్కడ చూడండి” అన్నాడు జయంతుడు .

అక్కడ సమీపంలోని ఆలయ కోనేరు కనిపించింది. మిత్రులు ఇరువురు పరుగు పరుగున వెళ్ళి కోనేటి నీళ్ళలో దూకారు.

“జయంతా పిరికిపందలు, మనతో పోరాడలేక ఇలా అడవికి నిప్పుపెట్టి వాళ్ళు సురక్షిత ప్రదేశానికి పారిపోయారు” అన్నాడు విజయుడు.

“యువరాజా, ఇంతపెద్ద కోనేరు దాటి మంటలు ఇటువైపుకు రావు, కాకుంటే అడవి మంటలు తగ్గే వరకు మనం ప్రయాణం చేయలేము” అన్నాడు జయంతుడు.

మరికొద్ది సేపటికే పెద్దపెట్టున వర్షం కురవసాగింది. అప్పటి వరకు ఎగసిపడిన అగ్నిజ్వాలలు వర్షంతో ఆగిపోయాయి.

ఆ రాత్రికి దేవాలయంలో ఉండి ఉదయం ప్రయాణం చేస్తుండగా.. కొంతదూరంలో ఓ పర్ణశాల కనిపించింది. అక్కడ ఒక మునీశ్వరుడు విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నాడు.

అక్కడకు వెళ్ళిన మిత్రులు ఆ మునీశ్వరునికి నమస్కరించి,

“స్వామి మేము సదానంద స్వామి వారి శిష్యులం. అంగదేశ రాజ కుటుంబీకులం. రితధ్వని మునివర్యుల ఆశీర్వాదం కోసం వెళుతూ దారిలో భగవతి మాత ఆశీస్సులు తీసుకోవడానికి వెళుతుండగా తమరి దర్శనం లభించింది” అన్నాడు విజయుడు.

“సంతోషం నాయనలారా, నా పేరు పూర్ణానందుడు. ఈ ఆశ్రమంలోనికి వచ్చిన ప్రతి క్రూరమృగం కుందేలులా ప్రవర్తిస్తుంది. హాయిగా ఈ రోజు మా అతిథులుగా ఉండండి.” అని చెప్పి, “దేవి” అని పర్ణశాల కేసి పిలిచాడు.

చేతులు తుడుచుకుంటూ వచ్చిన స్త్రీని చూస్తూనే “మాతా నమస్కారం” అన్నారు మిత్రులు ఇరువురు.

“రితధ్వని ముని వారి ఆశీర్వాదానికి వెళుతున్నారట, ఈరోజు మన అతిథులుగా ఇక్కడే ఉంటారు. వీరికి భోజన సదుపాయిలు ఏర్పాటుచేయి. మన శిష్యుల తోటే కలసి రాత్రి శయనిస్తారు” అన్నాడు పూర్ణానందుడు.

“శిష్యులారా ఈ రోజు మనకు అనుకోని ఇద్దరు అతిథులు వచ్చారు. అసలు అతిథి అంటే ఎవరు అనేది ఈ రోజు పాఠంగా చెప్పుకుందాం!”

తమ ఆయుథాలు దూరంగా ఉంచి, విద్యార్థుల సరసన విజయుడు, జయంతుడు కూర్చొన్నారు.

“కంటికి కనిపించని దేవుళ్ళు ఎందరు ఉన్నా…. ఈ నేలపై నడయాడే దేవుళ్ళు నలుగురు అని ఉపనిషత్తులు చెపుతున్నాయి. జన్మనిచ్చి, విద్యాబుద్దులు చెప్పించే జననీ జనకులు ఇలలో కనిపించే మొదటి దైవాలంటూ…. మాతృదేవోభవ, పితృదేవోభవ అని తెైత్తిరీయ ఉపనిషత్తు అంటుంది. వీరి తరువాత మూడవ దైవంగా ఆచార్యదేవోభవ అని గురువును ప్రస్తుతిస్తుంది. నాల్గవ దైవమే అతిథి అని గృహస్థు ఇంటికి తిథి చూడకుండా అరుదెంచే అతిథిని అతిథిదేవోభవ అని పేర్కొంది.

‘అతిథి యశ్చ స్వాధ్యాయ ప్రవచనేన’

అతిథులు సత్కరింపతగినవారని వారనీ,-వారి ప్రవచనాలు అనుసరింప తగినవనీ, శాస్త్రం చెపుతుంది. అతిథిగా వచ్చి గృహమునందు ఆ రాత్రి తల దాచుకోవడానికో… నివసించడానికో వచ్చిన వారిని ఆహ్వానించాలి.

‘వైశ్వా నరః ప్రవిశత అతిథి బ్రాహ్మణో గృహన్

తస్యై తాంగ్ శాంతి కుర్వంతి హరవైవస్వతోదకమ్!’

క్షుధార్తి, దాహార్తి బాధల నుండి విముక్తి కోరి యింటికివచ్చిన అతిథి సాక్షాత్తు భగవత్ స్వరూపుడని శాస్త్రం చెపుతుంది.

ఏ దినమైనా ఎక్కడా నిలకడగా ఉండడు కనుక అతను అతిథి అవుతాడు.

‘ఉపస్థితం గృహే విద్యార్బాగ్యా యత్రాగ్ని యో అపివా,

పాదాలు కడుగుటకు నీళ్ళిచ్చి, సముచిత మర్యాదలతో ఆసనం ఇచ్చి పంచభక్ష్య పరమాన్నములతో కాకున్నా, కనీస వ్యంజనాదులతో కూడిన భోజనం పెట్టాలి. అతిథిని సాక్షాత్తు భగవంతుని రూపంగా తలంచి వారిఎడల భక్తిశ్రధ్ధలతో మసలుకోవాలి. ఈరోజుకు పాఠం స్వస్తి.” అన్నాడు పూర్ణానందుడు.

ఆ రోజు అక్కడ విశ్రాంతి పొంది బయలుదేరుతున్న మిత్రులకు కొన్ని రొట్టెలు మూటకట్టి ఇచ్చింది పూర్ణానందుని భార్య.

మిత్రులు ఇరువురు పూర్ణానంద దంపతులకు పాదాభివందనం చేసుకుని, తమ ప్రయాణం కొనసాగించారు.

అలా కొంతదూరం ప్రయాణం చేసాక దారిలో పలు వాహనాలపై కర్రల బోనుల్లో పలురకాల జంతువులు బంధింపబడి ఉన్నాయి. ఆ జంతువులు అన్నింటిని బంధవిముక్తులను చేసి తమ ప్రయాణం కొనసాగిస్తూ, భోజన సమయంలో ఒక సెలయేటి వద్ద రొట్టెలమూట విప్పాడు జయంతుడు. భోజనానంతరం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మరలా తమ ప్రయాణం కొనసాగించి సాయంత్రానికి పాతాళలోయ పరిసరాలకు మిత్రులు చేరారు.

“మిత్రమా కొత్తప్రదేశం, అందునా లోయలో ప్రయాణం ప్రమాదం. ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం” అన్నాడు విజయుడు.

ఎండుపుల్లలు, కట్టెలు సేకరించి నెగళ్ళు వేసి, ఆ పరిసరాలలో దొరికిన ఫలాలు తిని నెగడుకు చేరువలో నిద్రపోసాగారు మిత్రులు.

మరుదినం భగవతి మాత దర్శనం చేసుకుని తమ ప్రయాణం విజయవంతం అవ్వాలని కోరుకున్నారు మిత్రులు.

అలా రెండు రోజులు ప్రయాణం చేసిన మిత్రులు శాంభవిమాత ఆలయం చేరిన మిత్రులకు అక్కడ నలుగురు రాజకుమారులు శిలా విగ్రలుగా ఉండటం గమనించి ఆశ్చర్యపోయారు.

శాంభవిమాతను పూజించి అక్కడి చెట్లకు ఉన్న మధుర ఫలాలను భుజించి, ఆ రాత్రి అక్కడి మండపంలో విశ్రమించారు. అలసటగా ఉండటం వలన నిద్రించారు. అలా కొంతరాత్రి గడచిన అనంతరం, కొందరి యువతుల కిలకిలా నవ్వుతూ ఆలయ కోనేటిలో జలకాలాడుతున్న శబ్ధం వినిపించడంతో ఇద్దరు మిత్రులకు మెలకువ వచ్చింది. కాని స్నానం చేస్తున్న స్త్రీలను చూడటం తప్పు కనుక కోనేటికి అభిముఖంగా కూర్చున్నారు.

కొంత సమయం మాటలు చెప్పుకుంటూ, స్నానం చేసిన అనంతరం – పొడిబట్టలు ధరించిన వచ్చిన ఆ స్త్రీమూర్తులు మిత్రులను చూశారు.

‘‘ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? స్త్రీలు స్నానం చేస్తున్నప్పుడు అక్కడకు రాకూడదని తెలియుదా?” అన్నది ఓ స్త్రీ.

“తల్లి మేము అంగ రాజ్య నివాసులం, సదానందస్వామి శిష్యులం. రితధ్వని ముని ఆదేశంతో శాంభవిమాత దర్శనం చేసుకునేందుకు వచ్చాము. లోకానుభవం కొరకు మేము దేశాటన చేస్తూ బాటసారులుగా వెళుతూ మార్గం మధ్యలో విశ్రాంతి కొరకు ఇక్కడ విశ్రమించాము. మీ నవ్వులతో మాకు మెలకువ వచ్చింది. పరస్త్రీ తల్లితో సమానం కనుక కోనేటికి అభిముఖంగా తిరిగి కూర్చున్నాము’’ అన్నాడు విజయుడు.

‘‘ఈ బుద్ధి లేకనే పలువురు మేము స్నానం చేస్తున్న సమయంలో వచ్చి ఇలా శిలగా మారిపోయారు’’ అన్నదో యువతి.

‘‘తల్లి శిలగా మారిన వారికి నిజరూపం రావాలంటే ఏంచేయాలో చెప్పండి” అన్నాడు జయంతుడు.

“మేము అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెపితే, సరైన సమాధానానికి ఒకరు నిజరూపం పొందుతారు. లేకుంటే మీరు కూడా శిలా రూపం పొందుతారు” అన్నాదా యువతి.

‘‘ఏమిటా ప్రశ్నలు” అన్నాడు విజయుడు.

‘‘సూర్యుడు దేనిచే ఉదయించి, అస్తమిస్తాడు’’ అన్నది ఆ యువతి.

“ధర్మం చేత’’ అన్నాడు విజయుడు.

అప్పటి వరకు శిలగా ఉన్న ఓ యువకుడు తన నిజరూపం పొందాడు.

“సూర్యుని గుర్రాలు ఎన్ని వాటి పేర్లేమిటి?” అన్నది మరో యువతి.

“ఏడు. అనుష్టుప్, గాయత్రి, బృహతి, ఉష్ణక్, జగతి, త్రిష్టుప్, పంక్తి అనేవి” అన్నాడు జయంతుడు.

అప్పటి వరకు శిలగా ఉన్న రెండవ రాజకుమారుడు తన నిజరూపం పొందాడు.

“మహాభారతంలో శంతన మహారాజుకు గంగాదేవికి జన్నించిన అష్టవసువుల పేర్లేమిటి?” అన్నదో యువతి.

“వీరుంధరుడు, ధ్రవుడు, సోముడు, అహుడు, అనిలుడు, అగ్నిప్రత్యుఘుడు, ప్రభాసుడు(భీష్ముడు)” అన్నాడు విజయుడు.

“రఘువంశంతో ప్రారంభమై శ్రీరాముని సంతతిలోని లవ,కుశులలో శ్రీ రామావతార సమాప్తి అనంతరం కుశుని వివరాలు చెప్పాలి” అన్నది మరో యువతి.

“సూర్యుడు, వైవస్వతుడు, మనువు, ఇక్ష్వాకుడు, కుక్షి, వికుక్షి, పురంజయుడు, యోవనాశ్వుడు, మాంధాత, పురుకుత్సుడు, త్రనదస్యుడు, అరణ్యుడు, త్రిశంకుడు, హరిశ్చంద్రుడు, బాహుకుడు, అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భాగీరధుడు, నాభాగుడు, అంబరీషుడు, సింధుద్వీపుడు, నయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుదాముడు, కల్మషపాదుడు, అశ్మకుడు, మూలకుడు, ఖట్వాంగదిలీపుడు, రఘునృపాలుడు, అజమహారాజు, దశరధడు, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఇలాసాగిన సూర్యవంశంలో……. శ్రీరాముని సంతతి కుశ-లవుడు. తన ఆదేశం మేరకు లక్ష్మణుడు అవతార పరిసమాప్తి అయోధ్యా నగరం లోని సరయూనదిలో కావించడంతో, లవునికి ‘శ్రవస్తి’, కుశునకు ‘కుశపురం’, లక్ష్మణ సంతతి అంగదునికి ‘అంగదీయరాజ్యం’, ’చంద్రకేతునకు ‘చంద్రకేతు రాజ్యం’, భరతుని సంతతి తక్షకునకు ‘తక్షశిల’, పుష్కళునకు ‘పుష్కలావతి’ రాజ్యాలు, శత్రుఘ్నడి సంతతి సుబాహుకు ‘మధుర’, శత్రుఘ్నుని సంతితకి ‘విదీష’ రాజ్యాలను నిర్మించి అప్పగించిన శ్రీరాముడు భరత, శత్రుఘ్నల సమేతంగా అగ్నిని చేతపట్టి, అయోధ్య వదలి ఉత్తరదిశగా ప్రవహిస్తున్న ‘సరయు’ నదిలో అవతార సమాప్తి కావించారు.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here