[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
స షాహిదేశః సామాత్యః సభూభృత్స పరిచ్ఛదః।
కమభూత్కిము ఎ నా భూదితి సంచిన్త్య తేధునా॥
(కల్హణ రాజతరంగిణి 7, 69)
[dropcap]మ[/dropcap]హమ్మద్ గజనీ సేనలను ఎదుర్కునేందుకు త్రిలోచనపాలుడు కశ్మీర రాజు సహాయం కోరాడు. త్రిలోచనపాలుడికి సహాయంగా వచ్చిన తుంగుడు, త్రిలోచనపాలుడు చెప్పిన మాట వినకుండా తొందరపడి దాడి చేశాడు. పరాజయం పాలయి, శత్రువుకు వెన్ను చూపి పారిపోయి వచ్చాడు. తుంగుడే కనుక అనుభవజ్ఞుడయిన త్రిలోచనపాలుడి మాట విని ఆయన పథకం ప్రకారం యుద్ధం చేసి ఉంటే, ఫలితం మరో రకంగా ఉండేది. కానీ తుంగుడు తన మాట వినకుండా యుద్ధం చేయటం, ఓడిపోవటం గమనించిన త్రిలోచనపాలుడు కొంత సైన్యాన్ని యుద్ధరంగంలో శత్రువులను నిలువరించేందుకు వదిలి, మిగతా సైన్యాన్ని తీసుకుని యుద్ధరంగాన్ని వదిలాడు. దాంతో త్రిలోచనపాలుడు సైన్యం వెంట ఉన్నా, రాజ్యం లేని రాజయ్యాడని వ్యాఖ్యానించాడు కల్హణుడు. అంతేకాదు, ఈ ఓటమితో ‘హిందుషాహీ’ రాజుల పాలన అంతమయిందని వ్యాఖ్యానిస్తాడు. ఈ సందర్భంగానే తురుష్క సేనల ఆధిపత్యానికి వీలునిచ్చాడు తుంగుడు అని వ్యాఖ్యానిస్తాడు. ఈ వ్యాఖ్య అర్ధం కావాలంటే రాజతరంగిణిలో లేని విషయాలను ప్రస్తావించుకోవాల్సివుంటుంది.
మహమ్మద్ గజనీ కశ్మీరంలో ‘లోహారం’ దాటి రాలేకపోయాడు. కానీ తాను అడుగుపెట్టిన ప్రాంతాలలో ప్రజలను మతం మార్చటం, మారని వారని చంపటం చేశాడు. యువకులను, పిల్లలను, మహిళలను బానిసలుగా తన దేశానికి తీసుకువెళ్ళాడు. గజనీ బజారుల్లో అమ్మేశాడు. ఎలాగో వారూ మతం మారిపోయారు.
సైన్యంతో శివాలిక్ పర్వత ప్రాంతాలకు పారిపోయిన త్రిలోచనపాలుడు అక్కడ తనందంటూ ఓ చిన్న సామ్రాజ్యాన్ని స్థాపించాడు. హస్తినాపురం రాజధానిగా అతను సామ్రాజ్యాన్ని స్థిరపరుచుకుని తాను కోల్పోయిన సామ్రాజ్యాన్ని తిరిగి సాధించాలని విఫల ప్రయత్నాలు చేశాడు. రాజా శర్వ, చాంద్‌రాయ్ వంటి స్థానిక రాజులు త్రిలోచనపాలుడు తమ ప్రాంతంలో రాజ్యం ఏర్పాటు చేసుకోవటాన్ని నిరసించారు. వారు త్రిలోచనపాలుడితో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇక్కడే త్రిలోచనపాలుడి గొప్పతనం తెలుస్తుంది. తోటి రాజులతో త్రిలోచనపాలుడు యుద్ధానికి సిద్ధపడలేదు. ఎందుకంటే, సమస్త భారతీయ సమాజానికి శత్రువయిన వాడు పొంచి ఉన్నప్పుడు తమలో తాము కలహించుకోవటం ఆత్మహత్యా సదృశం అని అతనికి తెలుసు. అందుకని ఇతర రాజులు తనతో శత్రుత్వం వహించినా, త్రిలోచనపాలుడు వారితో మైత్రి నెరపాలని ప్రయత్నించాడు. వారు కయ్యానికి కాలు దువ్వినా తాను సహనం వహించాడు. చివరికి చాంద్‌రాయ్ కూతురిని తన కొడుకు భీమపాలుడికిచ్చి వివాహం చేయమని అభ్యర్థించటానికి దూతగా తన కొడుకునే పంపాడు. కానీ చాంద్‍రాయ్ దూతగా వచ్చిన త్రిలోచనపాలుడి కొడుకు భీమపాలుడిని నిర్బంధించాడు. కానీ త్రిలోచనపాలుడు యుద్ధానికి దిగలేదు. సహనం వహించాడు. ఇది చాలా గొప్ప విషయం. నిజానికి, భారతదేశ చరిత్రలోని అతి గొప్ప దార్శనిక రాజులలో త్రిలోచనపాలుడి పేరు అగ్రస్థానంలో ఉండాలి. కానీ మన చరిత్ర పుస్తకాలలో త్రిలోచనపాలుడి ప్రసక్తి ఉండదు. ఉన్నా, గజనీని ఎదురించిన చివరి ‘షాహీ’ రాజుగా మాత్రమే ఉంటుంది. కానీ బలవంతుడయిన శత్రువును ఎదుర్కునేందుకు తమలో తాము కలహాలు మాని కలిసికట్టుగా పోరాడాలన్న దూరదృష్టిని ప్రదర్శించాడు త్రిలోచనపాలుడు. అంతేకాదు, ఇతర రాజులు ఎంతగా రెచ్చగొట్టినా, కయ్యానికి కాలు దూసినా, సహనంతో వ్యవహరించి వారు నిజాన్ని గ్రహించేట్టు చేశాడు. నెమ్మదిగా చాంద్‌రాయ్‌కి త్రిలోచనపాలుడి ఉద్దేశం అర్థమయింది. శత్రువును ఎదుర్కోవటంలో నిజాయితీ అర్థమయింది. ఫలితంగా తాను నిర్బంధించిన భీమపాలుడికి తన కూతురినిచ్చి వివాహం చేశాడు.
ఈసారి మహమ్మద్ గజనీ భారత్‌పై దాడి చేసినప్పుడు త్రిలోచనపాలుడు యుద్ధాన్ని మహమ్మద్ గజనీ రాజ్యంలోకి తీసుకెళ్ళాడు. చండేల రాజు విద్యాధరుడి పైకి మహమ్మద్ గజనీ దాడికి వెళ్ళినప్పుడు, త్రిలోచనపాలుడు, శర్వ, చాంద్‌రాయ్ సేనలు సింధునది ప్రాంతంలోని మహమ్మద్ గజనీ ఆక్రమిత ప్రాంతాలపై దాడి చేశాయి. దాంతో విద్యాధరుడిపై దాడిని మానుకుని ఘజినీ గంగా నదివైపు మళ్ళేడు. ఇదే సమయానికి త్రిలోచనపాలుడు విద్యాధరుడి సహాయం కోరాడు, గజనీని తరిమేందుకు. అయితే విద్యాధరుడి సేనలు త్రిలోచనపాలుడికి సహాయంగా వచ్చే లోపలే గజనీ సేనలతో త్రిలోచనపాలుడు తలపడ్డాడు. యుద్ధం చేసినట్టు చేసి, గజనీని కశ్మీరు లోయల్లోకి లాగాలని ప్రయత్నించాడు. కానీ ఈ యుద్ధంలో తీవ్రంగా గాయపడి త్రిలోచనపాలుడు మరణించాడు. నిజంగా విధి వక్రీకరిస్తే, ఎవరెంత వీరులయినా, ఎంత చక్కటి పథకాలు వేసినా ఫలితం ఉండదని త్రిలోచనపాలుడి పరాజయం నిరూపిస్తుంది.
విద్యాధరుడి సేనలు గంగకు ఆవలివైపు మోహరించి ఉన్నాయి. లక్ష సైన్యం, 640 ఏనుగులతో విద్యాధరుడు గజనీ కోసం ఎదురు చూస్తున్నాడు. యుద్ధంలో ఓడిపోయి, వెన్నిచ్చి పారిపోతున్నట్టు త్రిలోచనపాలుడు విద్యాధరుడి సేనలవైపు గజనీని తీసుకువెళ్తున్నాడు. వారి పథకం ప్రకారం త్రిలోచనపాలుడిని వెన్నంటి వస్తున్న గజనీని అనూహ్యంగా విద్యాధరుడి సేనలు చుట్టుముట్టాలి. దాంతో గజనీని హిందూ సేనలు చుట్టుముడతాయి. గజనీ ఆటకడుతుంది. పథకం బాగానే ఉంది. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు.
గజనీకి వెన్నిచ్చి పారిపోతున్నట్టు, విద్యాధరుడి సేనల వైపు తీసుకువెళ్తున్న త్రిలోచనపాలుడు తప్పని పరిస్థితులలో గజనీతో తలపడాల్సి వస్తుంది. పోరులో గాయపడి త్రిలోచనపాలుడు మరణించాడు. దాంతో సమష్టి భారతీయ సేనలు గజనీని ఎదుర్కొని మట్టుపెట్టాలన్న పథకం ఆచరణలోకి రాకుండానే ఆవిరై పోయింది. పర్షియన్ చరిత్రకారులు త్రిలోచనపాలుడు యుద్ధంలో మరణించలేదని, అతని సైన్యం తిరుగుబాటు చేసి చంపిందని రాశారు. కానీ శత్రువులు సైతం త్రిలోచనపాలుడి నిజాయితీకి, దేశభక్తికి ముగ్ధులై, వైరం మాని అతడితో చేతులు కలిపినప్పుడు, అతని సైన్యం తిరుగుబాటు చేస్తుందన్నది అర్థం లేని విషయం.
ఏదో ఒక రకంగా భారతీయ రాజుల గొప్పతనాన్ని తగ్గించాలని, విదేశీ చరిత్ర రచయితలు చేసిన అనేక వక్రీకరణల్లో ఇదొకటి. ఆ కాలం నాటి పర్షియన్ చరిత్ర రచయితలు, త్రిలోచనపాలుడి శౌర్యాన్ని, భీమపాలుడి వీరత్వాన్ని వేనోళ్ళ పొగుడుతూ రాశారు. కానీ ఫరిస్తా, త్రిలోచనపాలుడి గొప్పతనాన్ని చులకన చేశాడు. అతని రచనను ఆంగ్లంలోని అనువదించిన ‘బ్రిగ్స్’ దానికి మరింత రంగులు జోడించాడు. దాంతో త్రిలోచనపాలుడి గొప్పతనం మసకబారిపోయింది. భావితరాలకు త్రిలోచనపాలుడి గురించి ఏమీ తెలియని దుస్థితి నెలకొంది. త్రిలోచనపాలుడి శౌర్యం అర్థం చేసుకున్న గజనీ విద్యాధరుడితో సంధి చేసుకున్నాడు.
త్రిలోచనపాలుడి తరువాత భీమపాలుడు రాజయ్యాడు. ఇంతలో మళ్ళీ మహమ్మద్ గజనీ దండయాత్ర చేశాడు. ‘లాహ్‌కోట్’ ఓటమిని భరించలేని గజనీ ముందుగా కశ్మీరుపై దాడి చేశాడు. కానీ ఎంత ప్రయత్నించినా ‘లాహ్‌కోట్’ను గెలవలేకపోయాడు.
భీమపాలుడు తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకునేలోగా, మళ్ళీ గజనీ దాడికి వచ్చాడు. గజనీతో తలపడటానికి సిద్ధమవుతున్న చాంద్‌రాయ్‌ని యుద్ధం చేయవద్దని వారించాడు భీమపాలుడు. తండ్రి పద్ధతినే అవలంబించాడు. చాంద్‌రాయ్, భీమపాలుడు కోటను ఖాళీ చేసి అడవులకు పారిపోయారు. ఖాళీగా దొరికిన కోటను చూసి గజనీ పిచ్చిపట్టినట్టు ప్రవర్తించాడు. దారుణ మారణ కాండను కొనసాగించాడు. చంపినవారిని చంపాడు. మతం మారిన వారిని మార్చాడు. మారని వారిని బానిసలుగా తీసుకెళ్ళాడు. యుద్ధంలో భీమపాలుడు మరణించాడు. భీమపాలుడి రాజ్యానికి ముస్లిం ప్రతినిధిని పాలకుడిగా నియమించాడు. దీనితో ‘షాహి’ పాలకుల పాలన అంతమయింది. భీమపాలుడి భార్యా, పిల్లలు కశ్మీరులో ఆశ్రయం పొందారు. తరువాత వారికి అజ్మీరు రాజు ‘జాగీరు’ ఇవ్వటంతో, కశ్మీరు వదిలి వెళ్ళారు. అంటే, చరిత్రలో చెప్తున్నట్టుగా భారతీయ రాజులు ఒకరితో ఒకరు పోరాడుకునే అనైకమత్యం వల్ల తురకలు భారతదేశంపై ఆధిపత్యం సాధించలేదు. రాజులు కలిసికట్టుగా పోరాడేరు. ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. సానుభూతితో వ్యవహరించారు. కానీ వ్యక్తుల అహంకారం, విధి తోడ్పడక పోవటం వల్ల తురకలు భారతదేశంలో వ్రేళ్ళూనగలిగారు.
త్రిలోచనపాలుడు, భీమపాలుల పోరాటం పరాజయంతో అంతమైనట్టు అనిపించినా, త్రిలోచనపాలుడు పలు సందర్భాలలో భారతీయ సమష్టి సేనలతో గజనీని ఎదుర్కొని, భారతీయుల శౌర్యం గజనీకి చూపించాడు. పలుమార్లు గజనీ ప్రాణాలు అరచేత పెట్టుకుని దేశం విడిచి పారిపోయేట్టు చేశాడు.
‘The Hindu Shahiya dynasty is now extinct, and of the whole house there is no longer the slightest remnant in existence. We must say that, in all their grandeur, they never slackened in the ardent desire of doing that which is good and right, that they were men of noble sentiment and noble bearing.’ అంటాడు అల్‌బెరూనీ, షాహీ వంశ వీరుల గురించి. భారతీయ చరిత్ర రచయిత మజుందార్ ‘The Shahi resistance and Trilochanapala’s foresight are the only things which ensured India is still a Hindu majority, on a sad note, this name is not known anywhere in India’ అంటాడు. కల్హణుడు రాజతరంగిణిలో అన్నది కూడా ఇదే.
‘షాహీ సామ్రాజ్యం, వారి వైభవం, ఉత్తమమైన మంత్రులతో, ఐశ్వర్యంతో అలరారిన వారి రాజ్యం, వారి భోగం గురించి భావితరాలకు ఏమీ తెలియదు. అసలు ఇలాంటి వీరులు, గొప్ప రాజులు, ధర్మనిరతులు నిజంగా ఉన్నారా అని భావితరాల వారు అపనమ్మకంతో ఆశ్చర్యపోతారు’ అని వ్యాఖ్యానించాడు త్రిలోచనపాలుడి గురించి కల్హణుడు. ఇలాంటి దేశభక్తులు, ధర్మభక్తులను విస్మరించిన జాతి, వీరులను భీరువులుగా, పోరాటపటిమను చేతకానితనంగా, గొప్పతనాన్ని బలహీనతగా నమ్మిన జాతి ఆ వీరుల వారసత్వాన్ని మరువటమే కాదు, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం లేక భౌతికంగా స్వేచ్ఛ పొందినా, మానసికంగా బానిసల స్థాయిలోనే ఉండిపోతుంది. ప్రస్తుతం మన చుట్టూ చూస్తే ఈ నిజం గ్రహింపుకు వస్తుంది. అందుకే ఓడిపోయి వెనుతిరిగిన తుంగుడు, భువిపై తురుష్క సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసిన వాడయ్యాడని విమర్శించాడు కల్హణుడు.
పైపైన చూస్తే గజనీతో పోరాడి ఓడి తుంగుడు వెనుతిరిగటం ఏ రకంగా భారతదేశంలో తురుష్కులు స్థిరపడటానికి తోడ్పడిందోననిపిస్తుంది. తుంగుడు ఓడి వెనుదిరిగితే, మొత్తం దేశంలో తురుష్కులు స్థిరపడడానికి అది దోహదం చేసిందని అనటం అతిశయోక్తి అనిపిస్తుంది. సరిగ్గా చరిత్ర తెలియకుండా, కశ్మీరు గొప్పతనాన్ని మరింత గొప్ప చేసి చూపించే అహంకారంతో చేసిన వ్యాఖ్య అనిపిస్తుంది. కాని తరచి చూస్తే, కల్హణుడి వ్యాఖ్య చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేసి, అవగాహన చేసుకుని చేసిన వ్యాఖ్యనో అర్థమవుతుంది.
హిందూ షాహి రాజులు 150 సంవత్సరాలుగా తురుష్కుల వెల్లువకు అడ్డుగా నిలబడ్డారు. నిరంతర పోరాటం వల్ల బలహీనులయ్యారు. తురుష్కుల ఒత్తిడి తగ్గడం లేదు. ఈ సమయంలో త్రిలోచనపాలుడు కశ్మీరు సహాయం అర్థించాడు. సంగ్రామ రాజు తుంగుడిని సహాయంగా పంపాడు. తుంగుడు త్రిలోచనపాలుడికి సహాయంగా వచ్చాడు. అంటే, త్రిలోచనపాలుడి నేతృత్వంలో అతడు పోరాడాల్సి ఉంటుంది. కానీ తుంగుడు విచక్షణను పక్కన పెట్టి అహంకారంతో వ్యవహరించాడు. ఫలితంగా, ఓడి, వెనక్కు మళ్ళాల్సి వచ్చింది. తుంగుడు ఓడటం త్రిలోచనపాలుడి పరాజయానికి దారితీసింది. అంతే! ముంచుకొస్తున్న వెల్లువకు అడ్డు తొలగిందన్న మాట. తురుష్కుల వెల్లువ భారతదేశాన్ని ముంచెత్తటానికి ఎంతో కాలం పట్టలేదు. అంటే, తుంగుడు కనుక త్రిలోచనపాలుడికి అండగా నిలిచి ఉంటే, పరిస్థితి మరో రకంగా ఉండేదన్న మాట. కానీ అలా జరగలేదు. అందుకే తుంగుడు దేశం తురుష్కమయం అయ్యేందుకు మార్గం సుగమం చేసి కశ్మీరు వచ్చాడని వ్యాఖ్యానించాడు కల్హణుడు. అత్యంత ప్రాధాన్యం వహించే ఈ వ్యాఖ్యను అతిశయోక్తిగా కొట్టిపారేస్తారు చరిత్ర విశ్లేషకులు.
కానీ తుంగుడి ఓటమి ఫలితంగా సంభవించిన తదనంతర పరిణామాలను, రాజతరంగిణిలో కల్హణుడు చెప్పని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే, కల్హణుడి వ్యాఖ్యలోని సత్యం బోధపడుతుంది. త్రిలోచనపాలుడు తరువాత ఏమయ్యాడన్న విషయం కశ్మీరు చరిత్ర రచిస్తున్న కల్హణుడి పరిధి బాహిరం. అందుకని కల్హణుడు ఆ విషయాలు పొందుపరచలేదు. కానీ చరిత్రను అధ్యయనం చేస్తున్నవాడిగా కల్హణుడు తుంగుడి ఓటమి ప్రాధాన్యతను అర్థం చేసుకున్నాడు. దాని గురించి వ్యాఖ్యానించాడు. అందుకే నక్కలా ఓడిపోయి కశ్మీరం చేరిన తుంగుడిని రాజు సంగ్రామ సింహుడు ఏమీ అనక మౌనం వహించటాన్ని విమర్శిస్తాడు కల్హణుడు. తరువాత తుంగుడిని హత్య చేయించి, అతడి శవాన్ని ముక్కలు చేసి వీధుల్లోకి విసిరేయించాడు సంగ్రాముడు. తుంగుడి మరణం తరువాత స్వార్థపరులు, నీచులు, కీలకమైన స్థానాలు ఆక్రమించి ప్రజల పాలిట రాక్షసులయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గజనీ కశ్మీరంపైకి దాడికి వస్తుంటే అతడిని నిలువరిచేందుకు సంగ్రామ సింహుడు, ఇతర రాజులకు సహాయంగా కశ్మీర సైన్యాన్ని పంపాడు. వారు కూడా తుంగుడిలాగే శత్రువులకు వెన్ను చూపి కశ్మీరం తిరిగి వచ్చారు. గజనీ ‘లోహారం’ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని వెనుతిరిగాడు. కానీ అతను మతం మార్చి వదిలిన వారు కశ్మీరంలో మిగిలారు.
(ఇంకా ఉంది)