[dropcap]రా[/dropcap]మయ్య రామచిలుకతో ప్రజలకు జోస్యం చెబుతూ బతికేవాడు. అయినా తన చిలుక జోస్యంతో లోకానికి మేలు జరగాలని కోరుకునేవాడు.
చిలుక జోస్యం చెప్పించుకునే వారందరూ “నాకు డబ్బు ఎప్పుడు వస్తుంది?”, “నాకు కట్నం అనుకున్నంత వస్తుందా?”, “నాకు వ్యాపారం కలసి వస్తుందా?” వంటి ప్రశ్నలు అడిగి జోస్యం చెప్పించుకునేవారు. వారు అడిగే ఏ ప్రశ్న అయినా డబ్బుకు సంబంధించినదే అయి ఉండేది!
జనాల డబ్బు యావ చూసి రామయ్య విసిగి పోయాడు. ఏది ఏమైనా తన చిలుక జోస్యంతో వారిలో మార్పు తీసుకరావాలనుకున్నాడు.
అందుకే తన చిలుకకు వేరే విధంగా శిక్షణ ఇచ్చాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి వచ్చి “నాకు వ్యాపారం కలసి వస్తుందా?” అని అడిగితే ఆ వ్యక్తికి రామచిలుక ఒక అట్టముక్క ఇస్తుంది. మంచి ప్రణాళికతో వ్యాపారం న్యాయంగా చేస్తే బాగా కలసి వస్తుందని ఆ అట్టముక్కలో ఉంటుంది. నిజానికి చిలుక అటువంటి అట్టముక్క తియ్యాలంటే రామయ్య తన రెండు వేళ్ళు చూపిస్తే చిలుక ఆకుపచ్చ రంగు అట్టముక్క తీస్తుందన్న మాట. అది రామయ్య శిక్షణ.
“నాకు కట్నం బాగా వస్తుందా?” అని అడిగితే చిలుకకు రామయ్య మూడువేళ్ళు చూపుతాడు. అప్పుడు చిలుక నీలం రంగు అట్టముక్క తీస్తుంది. అందులో “కట్నం తీసుకోకు, మంచి అమ్మాయిని మాత్రమే పెండ్లి చేసుకో, పెళ్ళి తరువాత నీ జీవితం అద్భుతంగా ఉంటుంది” అని వ్రాసి ఉంటుంది.
అలా రామయ్య సమాజానికి మేలు చేసే రాతలే తన అట్టముక్కల్లో వ్రాయించి చిలుక జోస్యం చెప్పసాగాడు.
చిలుక జోస్యం వలన కొంతమంది అయినా మారి వాళ్ళు చేసే ప్రతిపని డబ్బుతో ముడిపెట్టకుండా న్యాయంగా బతుకుతారని రామయ్య ఆశ. రామయ్య ఆశించినట్టుగానే కొంతమంది చిలుక జోస్యం వలన మారారు!
ఇలా ఉండగా ఒకరోజు ఆ రాజ్యపు రాజుగారు తన పరివారంతో అటు వెళుతూ చిలుక జోస్యం చెబుతున్న రామయ్యను చూశాడు. చిలుక జోస్యం చెప్పించుకోవాలని ఆయనకు సరదా పుట్టి రామయ్య వద్దకు వెళ్ళి తనకు చిలుక జోస్యం చెప్పమన్నాడు.
వెంటనే రామయ్య ఆలోచించాడు. ఆయనకు మామూలుగా జోస్యం చెప్పడంకన్నా రాజుగారితో మరింత మంచి కలిగించే విషయాలు చెబితే ప్రజలకు మేలు జరుగుతుందని ఆలోచించాడు. అదిగాక ఆ విషయాలు వ్రాసిన అట్టముక్క తను తయారు చేయలేదు మరి. రామయ్య ఆయనకు నమస్కరించి ఈ విధంగా చెప్పాడు.
“మహారాజా, మీరు ఈ రాజ్యానికి అధిపతి. మీ జాతకం చెప్పాలంటే నా చిలుక మీ జాతకాన్ని పరీక్షించి రెండు రోజుల తరువాత చెబుతుంది. తమరు ఏమీ అనుకోకండి. దయచేసి తమ జన్మ తేదీ, నక్షత్రం నాకు చెప్పి వెళ్ళండి. రెండు రోజుల తరువాత చిలుకతో సహా నేను తమరి అంతఃపురానికి వస్తాను” అని నమ్రతగా చెప్పాడు.
రాజుగారి నవ్వి తన వివరాలు ఇచ్చాడు.
రోజా రంగు అట్ట ముక్కమీద రామయ్య ఈ విధంగా వ్రాశాడు. “ప్రజా సంక్షేమం కోసం చెట్లు విరివిగా నాటించాలి, యుద్ధాలు చేయటం కన్నా పొరుగు రాజ్యాలతో చక్కని చెలిమి అవసరం. ఆ రాజ్యాలలోని విజ్ఞానవంతుల నుండి విజ్ఞాన విషయాలు, కళలు మన రాజ్యంలోని యువకులు గ్రహించేటట్టు చేయాలి. అలాగే మనదేశపు కళల్ని వారికి తెలియచెయ్యాలి. అప్పుడు అంతా సుభిక్షం” అని వ్రాశాడు. అసలు ఇలా వ్రాయడానికి రామయ్య గురుముఖి అనే పండితుడి సహాయం తీసుకున్నాడు.
రెండు రోజుల తరువాత రామయ్య చిలుకతో సహా రాజుగారి అంతఃపురానికి వెళ్ళి పంజరాన్ని రాజుగారి ముందర పెట్టి “అమ్మా జగన్మాత, చిలకమ్మా రాజు గారు ఏంచెయ్యలో చెప్పవే” అని రెండు చేతుల్లో రెండు వేళ్ళు చూపించాడు. చిలుక వెంటనే మూడు అట్టలు కింద పారవేసి రోజారంగు అట్టముక్కను తీసి రాజా గారి ముందు పెట్టింది. రామయ్య ఆ అట్ట ముక్కను తీసి అందులోని సందేశాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు.
“భళిరా, భవిష్యత్తులో నేనేమి చెయ్యాలో నీ చిలుక చక్కగా చెప్పింది, నాకు మంచి ఆలోచన కలిగించింది” అంటూ రామయ్యను మెచ్చుకుని ఐదు బంగారు నాణేలు ఇచ్చి పంపాడు.
మూఢనమ్మకాలు కూడా మంచి చేసే విధంగా ఉండాలని మూఢనమ్మకాలు పాటించేవారు గానీ, వారివలన వేరేవారు గానీ బాగు పడితే అందరికీ మంచిదని రామయ్య నమ్మిన సూత్రం పనిచేసింది.