[box type=’note’ fontsize=’16’] శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారి గురించి శ్రీ ప్రయాగ రచించిన ఈ విశిష్ట వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము. మూల రచన ‘అభ్యుదయ’ పత్రిక 1946 అక్టోబరు సంచికలో ప్రచురితం. [/box]
[dropcap]”ఈ[/dropcap]నాడు నా ఆశలు ఫలిస్తున్నాయి. నా మనస్సు నిండుగా వుంది.”
“ఈ విద్యాలయం అభివృద్ధి చెందుతుంది. రెండు మూడేళ్ళలోనే ప్రజావిశ్వకళా పరిషత్తుగా పెంపొంది తీరుతుంది.”
“ఇది ఆంధ్రదేశ చరిత్రలో అపూర్వమైన సంస్థ…. మనకు సంస్థయే ప్రధానం. మనం ముందుకు నడుద్దాం”
అని ఆంధ్ర సాహిత్య పాఠశాల ప్రధానాధ్యాపకులు శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారన్నారంటే అది అకస్మాత్తుగా అన్నమాట కాదు. శ్రీ శర్మగారు తమ జీవితాన్ని ప్రజా విజ్ఞానాభివృద్ధి కోసం అంకితం చేశారు. చిన్ననాటి నుంచీ కటికదారిద్ర్యంతో బాధపడుతూ కూడా, ఆంధ్ర జాతీయ విజ్ఞానాన్ని పెంపొందించడం కోసం తమ సర్వశక్తుల్నీ వినియోగించారు. జీవితంలోని ఒడుదుడుకులను పాటించే స్వభావం కాదు శర్మగారిది. జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకొని ముందడుగు వేయడమే శర్మగారి స్వభావం. ఆయనది ఎప్పుడూ ముందుచూపే. ఆయన జీవితమే నేటి యువ రచయుతలకు ఆదర్శం. ఆయన సందేశమే విజ్ఞానజ్యోతి.
శ్రీ శర్మగారు 1891లో మినుమిలించిపాడు అగ్రహారంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. ఆంగ్లవిద్య నభ్యసించాలనే కోరికవుండేది. కాని డబ్బులేదు. కనుక మొదట ఉచితంగా సంస్కృత విద్యనే అభ్యసించారు.
అయినా శర్మగారు తమ కోరికను చంపుకోలేదు. తమ మేనమామ శ్రీ అయ్యగారి ఉమామహేశ్వరరావుగారి వద్ద వుంటూ, ఆంగ్ల విద్యాభ్యాసం మొదలుపెట్టారు. మేనమామగారు ప్రభుత్యోద్యోగి – మాటిమాటికీ ట్రాన్స్‌ఫర్లు. ఒక ఊరు కాదు, ఒక పేట కాదు…. ఇలా మేనమామగారితో ఊరూరా తిరుగుతూ, తమ విద్యాభ్యాసానికి కలుగుతున్న విఘాతాలనన్నిటినీ ఎదుర్కొన్నారు శర్మగారు. ఆయన పట్టుదలకు పట్టువిడుపులు లేవు. తమ 16వ సంవత్సరానికల్లా స్కూల్ ఫైనల్‍దాకా నెట్టుకొచ్చారు.
అవి ‘వందేమాతరం’ ఉద్యమ ప్రభావం దేశాన్ని ముంచెత్తిన రోజులు. బిపిన్ చంద్రపాల్ చిలకమర్తి లక్ష్మీనరసింహం గార్ల దేశభక్తి సందేశాలు ప్రతి చెవిలోనూ గింగురుమన్న రోజులు. భారతజాతి ఒక్కసారిగా జాగృతిచెందిన రోజులు….
ఈ జాతీయోద్యమ ప్రభావం శర్మగారిలో నూతన శక్తులను ప్రకోపింప జేసింది. ఆంధ్రప్రజల విజ్ఞానాన్ని పెంపొందించడం ద్వారానే, దాస్య శృంఖలాలను పటాపంచలు చేయగలమనీ అన్ని విషయాలూ ప్రజలకు తేటతెల్లంగా చెప్పి ప్రజల్లో చైతన్యం కలిగించాలనీ శర్మగారు అనుకొనేవారు.
ఎన్నో ఊహలు వుండేవి. కాని దారిద్య్రం వెన్నాడుతూనే వుండేది. స్వతంత్ర జీవనోపాధి ఏదైనా చూసుకోవలసిన అవసరం వచ్చింది. ఉద్యోగం కోసం శర్మగారు దిక్కులు పట్టుకు దేవులాడారు. తిరిగినన్నాళ్ళూ కూడా నిలవని చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరి పనిచేశారు. కాని ఎప్పటికప్పుడే నిరుద్యోగం. ఎప్పటికప్పుడే దారిద్య్రం…. ఏది ఏమైనా సరే శర్మగారు గుండెచెదరని మనిషి! ఏమీ నిరుత్సాహపడలేదు. నిరుద్యోగ బాధనూ, దారిద్య్రబాధనూ ఎదుర్కొన్నారు. తమ ఆశయాన్ని మననం చేసుకుంటూనే వున్నారు. దారిద్ర్యపాశాలు ఆయనను ఎక్కడికక్కడ వెనక్కు గుంజుతూనే వున్నాయి. కాని ఆయన ముందుకు ఉంకిస్తూనే వున్నారు.
పెద్దాపురం జమీందారుగారి పనిమీద 1911లో శ్రీ శర్మగారు మద్రాసు వెళ్ళి, అక్కడ ‘ఆంధ్రులచరిత్ర’ వ్రాస్తున్న ‘చరిత్ర చతురాననులు’ శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారితో పరిచయం చేసుకున్నారు. ఇక తమ జీవితాన్ని చారిత్రక పరిశోధనకు అంకితం చేయడానికి నిశ్చయించుకున్నారు. వీరభద్రరావుగారి వద్దనే వుండి, ‘ఆంధ్రుల చరిత్ర’కు సంబంధించిన పరిశోధనల్లో కృషి చేయబూనుకున్నారు. ‘కన్నమరా’ లైబ్రరీలోని అముద్రిత గ్రంథాలను ఎత్తి వ్రాయడమే అప్పుడు శర్మగారి నిత్యకృత్యం. ఉదయం లగాయతు రాత్రిదాకా, ఆ పుస్తకాలు చుట్టూ వేసుకొని, విసుగూ విరామం లేని ఒకటే పని. దీనికిగాను ఆయనకు నెలకు రూ15/-లు జీతం.
కాని వీరభద్రారావు గారు కూడా ధనవంతులు కారు. తాము దారిద్ర్యంతో క్రుంగి కృశించిపోతున్నప్పటికీ, ఆంధ్రజాతి చరిత్రను త్రవ్వి తలకెత్తుదామనే మహాదాశయంతో తమ సర్వస్వాన్ని బలిదానం చేసిన మహనీయుడు. ఆరు 15 లయినా శర్మగారికి ఆయన ప్రతినెలా ఇవ్వగలిగేవారు కాదు. ఈ విషయంలో శర్మగారికి కూడా అట్టే బాధకలిగేది కాదు. రాత్రి భోజనానికి హోటలుకు వెళ్ళకపోయినా, ఉదయం మాత్రం లైబ్రరీకి తప్పక హాజరయ్యేవారు.
అప్పట్లో ‘ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం’ కోసం పరిశోధనలు సాగిస్తున్న శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారు శర్మగారి కృషినీ, కార్యదీక్షనూ గమనించారు. ఆయనే శర్మగారిని పలుకరించారు.
ఆ వ్యక్తి లక్ష్మణరావుగారని తెలియగానే శర్మగారి హృదయం ఆశ్చర్య సంభ్రమాలతో నిండిపోయింది. ఆంధ్రవిజ్ఞాన సర్వస్వాన్ని తన హృదయసీమలో కుదురుకొల్పిన ఆ కొమర్రాజు పండితుడేనా? తన ప్రక్కన కూర్చొని, తండ్రిలాగా కష్టసుఖాలడుగుతున్నాడు! మహామహుల మన్ననలందుకొన్న ఆ మహనీయుడేనా? తనతో స్నేహంగా సమభావంతో సంప్రదిస్తున్నాడు!
ఆయన ఎక్కమంటే మాత్రం? తాను ఆయన ప్రక్కన గుర్రపుబగ్గీలో ఎక్కడమెలాగు? ఆయనెక్కడ? తానెక్కడ? ఎలాగైనా తప్పలేదు శర్మగారికి. ఆయనకు లక్ష్మణరావు గారు బగ్గీలోనే కాదు, ఆంధ్ర వైజ్ఞానిక రంగంలోనే అర్ధాసనం ఇచ్చారు. తన తర్వాత తనంత విజ్ఞానవేత్తను ఆంధ్రజాతికి సమర్పించారు.
1912 సరికల్లా శ్రీ వీరభద్రరావుగారు తమ ‘ఆంద్రుల చరిత్ర’ను ముగించుకొని రాజమండ్రికి వెళ్ళిపోయారు. కాని శర్మగారు మాత్రం లక్ష్మణరావుగారి ప్రోత్సాహం వల్ల సంవత్సరం పాటు ‘ఆంధ్రవిజ్ఞాన సర్వస్వంలో’ పనిచేశారు.
1913లో మళ్ళీ రాజమండ్రి వచ్చి శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారితో కలిసి శర్మగారు చరిత్ర పరిశోధన సాగించారు. నాటకాలూ, నవలలూ, కథలూ వ్రాయనారంభించారు.
అవి కథలతో నిండివుండే రోజులు కావు. ఏదైనా ఉద్యోగం చెయ్యాలి. ‘ఏదో గవర్నమెంటు ఉద్యోగం ఇప్పిస్తాం చేస్తావా లేదా’ అని బంధువులు పోరుపెడుతున్నారు. కాని గవర్నమెంటు ఉద్యోగం చెయ్యకూడదని శర్మగారి పట్టుదల. గవర్నమెంటు ఉద్యోగం పనికిరాదు. ఇతరత్రా పనికావాలి. ఏదన్నా పుస్తకాల షాపులో… పత్రికాఫీసులో… జీతాలమాట… ఇస్తే పది, ఇవ్వకపోతే అదీలేదు. ఇలా శర్మగారు కొంతకాలం గడిపారు.
కాలం గడ్డుగానే ఉంది. శర్మగారు జీవితంలో అనేక కఠోర ఘట్టాలను చవిచూశారు. అవన్నీ ఆయన జీవితానుభవాలు. అవే ఆయన మేధస్సుకు పరిణతినీ, హృదయానికి వైశాల్యాన్నీ కలిగించాయి.
మళ్ళీ ఎలాగైతేనేం రూ.15ల ఉద్యోగం దొరికింది. 1914 నుంచీ 1918 దాకా శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహారావు గారి ‘దేశమాత’ పత్రికా సంపాదకులుగా శర్మగారు పనిచేశారు. ఈ కాలంలోనే శర్మగారు తమ పరిశోధక వ్యాసాలను వెలువరించ నారంభించారు.
తరువాత ఆయన ఆంధ్రాభ్యుదయ గ్రంథమాలను స్థాపించి, తమ ‘ఆంధ్రవీరులు’ శ్రీ చిలుకూరి నారాయణరావు గారి ‘ప్రాచీన విద్యాపీఠములు’ శ్రీ భావరాజు వెంకట కృష్ణరావుగారి ‘ప్రాచీనాంధ్ర నౌకాజీవనము’ మున్నగు ఉత్తమ చారిత్రక గ్రంథాలను ప్రచురించారు. ఒక్కొక్క గ్రంథాన్నే ప్రచురించడమూ; మళ్ళీ మద్రాసువెళ్ళి కొత్తకొత్త పరిశోధనలు చేసి రావడమూ, మళ్ళీ గ్రంథప్రచురణా…. ఇదీ కార్యక్రమం! ఇందువల్ల వారు ఆర్జించిందేమీ లేదు. ఈనాటికీ మనం ప్రథమ శ్రేణిలో లెక్కించే ఆ గ్రంథాలకు ఆనాడున్న చందాదార్లు 180 మంది అని చెబితే చాలు, నాడు వారి ఉత్తమాదర్శ కృషికి ఎంత ప్రోత్సాహం వుండేదో తెలుస్తుంది. వారు ఎన్నో కష్టాలకోర్చి, ఎంతో కష్టపడి ఆంధ్ర జాతీయ విజ్ఞానాభివృద్దికై కంకణం కట్టుకొని పనిచేశారో తేటతెల్లమవుతుంది.
ఇది ఇలా వుండగా, 1922 లో చిత్రాడలో జరిగిన ఆంధ్ర పరిశోధక మహామండలి సభకు అధ్యక్షులుగా వచ్చిన శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారు శర్మగారిని మద్రాసు వచ్చి ‘ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం’లో పాల్గొనవలసిందిగా కోరారు. శర్మగారు కూడా సమ్మతించారు. కాని 1923లో తీరా శర్మగారు మద్రాసు వెళ్ళేసరికి ఆ మహాపురుషుడు మరిలేడు. తాను కొనసాగించిన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్నీ, తన ఉత్తమాదర్శాలనూ ఆంధ్రజాతికి సమర్పించి ఆయన అస్తమించాడు.
శర్మగారి హృదయం బరువెక్కింది. ఆ గురుమూర్తి వదలిన కార్యభారం తమదే. ఆయన బాధ్యతలు తమవేనని స్వీకరించారు. ఆ ఆశయసిద్ధికోసం దీక్షవహించారు.
విజ్ఞానచంద్రికా గ్రంథమండలి తరుపున ‘లక్ష్మణరాయ వ్యాసావళి’ని ప్రచురించారు. 1924 నుంచీ 16 సంవత్సరాలు ‘ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం’ కోసం ఎడతెగని కృషిచేశారు. కాని ఆయన మేధస్సుకరగించి వెలువరించిన అమూల్య రత్నాలు ఇంకా ఆంధ్రప్రజలకు అందకుండా, ఏ పత్రికా కార్యాలయపు బీరువాల్లోనో మూలుగుతున్నాయి.
1940 నుంచీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చారిత్రక పరిశోధక పండితులుగా పనిచేస్తూ, శ్రీ శర్మగారు (1) Forgotten Chapter of Andhra Country (2) History of the Reddy Kingdoms అనే గ్రంథాలు వ్రాసారు.
ఆయన చదువని గ్రంథం లేదు. సాధించని శాసనం లేదు. పరిశోధించని చారిత్రక రహస్యం లేదు.
ఆయన ఇప్పటికి 30 శాసనాల దాకా టీకా టిప్పణులతో సహా ప్రకటించారు. చారిత్రక విశేషాలను వివరిస్తూ ప్రజలకు అర్థమయ్యే భాషలో రెండు మూడువందల వ్యాసాలు వ్రాసారు. ఇప్పటికి వీరు ప్రచురించిన చారిత్రక గ్రంథాలు. 1. ఆంధ్రవీరులు 2. అమరావతీ స్థూపములు 3. చారిత్రక వ్యాసములు 4 Forgotten Chapter of Andhra Country 5. History of the Reddy Kingdoms.
నేటి మన చారిత్రక పరిశోధకుల్లో శర్మగారు అగ్రగణ్యులని అందరికీ తెలుసు. కాని ఆయనే నాటకాలూ, నవలలూ, కథలూ, కావ్యాలూ, పాటలూ, పద్యాలూ వ్రాసారంటే ఏదో కొత్తగా వుంటుంది. ఇందుకు కారణం ప్రఖ్యాత చారిత్రక పరిశోధకులైన శర్మగారు తమలోని కవినీ, కథకుణ్ణీ మరుగుపరచడమే ననిపిస్తుంది.
కాని, 1914లోనే ఆయన ‘పాదుకాపట్టాభిషేక’ నాటకాన్ని ప్రదర్శించుకొన్న ఆంధ్రదేశం ఆయనలోని కవినీ కథకుణ్ణీ సందర్శించింది. ఆ రోజుల్లోనే ఆయన వ్రాసిన ‘రోహిణీ చంద్రగుప్తము’ అనే నవల, ‘చిన్నకథలు’ ‘వివేకము గల మంత్రి’ ‘దేశోద్దారకులు’ మొదలైన గ్రంథాలు వెలువడ్డాయి. ఆయన పద్యాలూ, పాటలూ ‘భారతి’ మొదలైన పత్రికల్లో అనేకం ప్రచురించబడ్డాయి.
శ్రీ శర్మగారికి సంస్కృతాంధ్రాంగ్లేయ భాషల్లోనేగాక, ప్రాకృతాది భాషల్లోను అఖండ పాండిత్యం వున్నది. అంధ్రదేశ చరిత్రను గూర్చి ఆయన తరచని విషయం లేదు. ఆంధ్రుల వర్తక వ్యాపారాలు, ఆంధ్రప్రజాజీవితం, ఆంధ్రుల శిల్ప వాస్తుకళా విశిష్టత, ప్రదర్శనశాలలు, అనాదృతవాఙ్మయము… ఒకటేమిటి – ఆంధ్రజాతీయ విజ్ఞాన సర్వస్వానికి ఆయన పట్టుగొమ్మ. ఆంధ్ర జాతీయాభ్యుదయానికై ఆయన దీక్ష అచంచలం.
ఆయనది వజ్రసంకల్పం. కాని, హృదయం నవనీత కోమలం. ‘నిండు మనమ్ము నవ్యనవనీత సమానము. పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము’ అనే మాట ఆయనకే వర్తిస్తుంది.
ఆయన తారామండలాన్ని అధిష్టించిన మహాపండితుడు. కాని ప్రజల్లోకి వచ్చి ప్రజావిజ్ఞానాభివృద్ధికై నిరంతరం కృషిచేస్తూ, ప్రజాభిమానాన్ని చూరగొన్న దేశసేవకుడు.
ఆయనను ఎరిగిన వారిలో ఆయన ప్రేమ చూరగొనినవారూ లేరు. ఆయనను ప్రేమించనివారూ లేరు. ఆయనలో మానవత్వం, సజీవ చైతన్యం తొణికిసలాడుతూ వుంటాయి.
అనేక అగ్నిపరీక్షలను ఎదుర్కొన్న జీవితానుభవమూ, అనేక మహాత్కార్యాలను సాధించిన కార్యదీక్షా కలిసి, ఆయన కనుకొలకుల్లో విషాదబాష్పాలకూ ఆనంద భాష్పాలకూ పొత్తు కుదిర్చాయి.
ఆయన హృదయం కలవాడు, ప్రేమమూర్తి. ఆయన ‘నెయ్యపు పయస్సులు దిద్దిన తీయకైత’ లను కీ.శే. శ్రీ కొంపల్లి జనార్దనరావుగారు ఆయనకే కాన్కయిచ్చారు.
‘నీకిది పూవుగాన్క, కరుణింపుమి ఓ మధుమూర్తి, సంతత
మ్మౌ కమనీయతల్ విరియునట్టిద; నీ తొలిసంజులూరు ప్రే
మా కృతియొల్కు దీవనలకై ఎదమూలమురేగి సంపదల్
వ్రేకలు మూదలింప మధురించు నదీపద సన్నిధిన్ చెలీ!”
(భారతి 1930)
“డిగ్రీలు లేని పాండిత్యమ్ము వన్నెకురాని ఈ పాడు కాలానా”, “చాడీలకు ముఖ్యప్రశంసల కీర్ష్యకు స్థానమైనట్టి లోకాన” తన “అచ్ఛతర కమనీయ శీలజ్యోత్న అడవిగాచిన వెన్నెలగుచు చెలగి;” తన “చరిత్రజ్ఞాన నిర్మలాంభఃపూర మూషర క్షేత్ర వర్షోదకమయి”న శర్మగారికి శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు ‘ఆంధ్ర ప్రశస్తి’ని సమర్పిస్తూ-
‘నీవనుకోనులేదు, మరి నేనిదిచెప్పను లేదుగాని, అ
న్నా వినవయ్య, నేటికిది నా చిరుపొత్తము నీకు నంకితం
బై వెలయింపజేతు; హృదయంబులు నీకునునాకు మాతృదే
శావిలదుఃఖ దారితములై శ్రుతిగల్పెవిషాద గీతికన్’
‘ఇది నీకై యిడినట్టి నాయుపదమ్ మున్నేనాడొ ఘాసాగ్రముల్
పదునై ఆంధ్రవిరోధి కంరదళన ప్రారంభసంరంభ మే
చు దినాలన్ మరి తోడి సైనికులమైచూరాడు ప్రేమంబులో
నిది లేశంబనియైన చెప్పుటకు లేవే నాటి స్వాతంత్ర్యముల్’
‘గౌరిశంకరాఛ్ఛశృంగ – తుంగము త్వదీయము మనస్సుపొంగి, తెలుగు
నాటి పూర్వచరిత్ర కాణాచియెల్ల – త్రవ్వి తలకెత్త లేదె!….’
అని సత్యనారాయణగారు తమ హృదయం విప్పి చెప్పుకొన్నారు.
శర్మగారు కవి, విమర్శకుడు, కృతికర్త, కృతిభర్త, కథకుడు, చారిత్రక పరిశోధకుడు, మహాపండితుడు, ప్రజాసేవకుడు – ఇదే ఆయనలోని విశిష్టత!
ఆయన కష్ట సహిష్ణుత, కార్యదీక్ష, సమభావం, సౌహార్దం – యువరచయితలకు ఇవే ఆదర్శాలు! ఆంధ్రసాహిత్యాభ్యుదయానికీ ఆంధ్ర జాతీయాభ్యుదయానికీ ఆయన జీవితాదర్శమే వెలుగుబాట!
– ప్రయాగ