కరనాగభూతం కథలు – 7 గుణపతి ప్రేమ

0
3

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడి కోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! ఒకో దేశం ఒకో వ్యవస్థను పాటిస్తుంది. వ్యవస్థల్లో ఏది మంచిదో, ఏది చెడ్డదో తెలుసుకుందుకు, ఇతరులు చేసే ప్రచారంపై ఆధారపడకూడదు. ఎందుకంటే ప్రచారాలవల్ల ఘనత మోసానికే దక్కే అవకాశం ఉంది. వెనుకటికి గుణపతి అనేవాడి విషయంలో ఇలాగే జరిగింది, ఇప్పుడు నీకా కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

అనగనగా ఒక ఊళ్లో గుణపతి అనే పేదరైతు. పేరుకు తగ్గట్లే సద్గుణసంపన్నుడు. వీలైనంతలో ఇతరులకి సాయం చెయ్యడమే తప్ప, అవసరానికి ఎవరిముందూ చేయి చాచని అభిమానవంతుడు. భార్య పద్మ అన్నివిధాలా అతడికి తగ్గ ఇల్లాలు. ఆ దంపతులకు ఓ కొడుకు, కూతురు. ఇద్దరూ తలిదండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తూ పెరిగి పెద్ద ఔతున్నారు.

ఎల్లకాలం రోజులు ఒక్కలా ఉండవు కదా! ఒకరోజు రాత్రి పద్మ పెరట్లో ఆరేసిన బట్టలు తేవడానికి వెళ్లి, ఉన్నట్లుండి కెవ్వున అరిచింది. గుణపతి పరుగున వెళ్లి చూసేసరికి, ఆమె నేలమీద స్పృహ లేకుండా పడి ఉంది. అతడామెను ఎత్తుకుని లోపలకు తీసుకొచ్చి మంచంమీద పడుకోబెట్టి ఉపచారాలు చేశాడు. ఎప్పటికీ ఆమె కళ్లు తెరవకపోయేసరికి, అతడు కంగారుపడ్డాడు. పిల్లలకామెను అప్పగించి, తను వెళ్లి వైద్యుణ్ణి పిల్చుకొచ్చాడు. వైద్యుడామెను పరీక్షించి, “ఇది అరుదైన జబ్బు. ఐనా దీన్ని తగ్గించే మందు నాకు తెలుసు. అది వాడితే  పది రోజుల్లో జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది. మందుకి రోజుకి వంద వరహాలౌతుంది. నువ్వు డబ్బు సిద్ధం చేసుకునొస్తే, నేను మందు తయారు చెయ్యడం మొదలెడతాను” అన్నాడు.

వైద్యుడు బాగా డబ్బు మనిషని గుణపతి విని ఉన్నాడు. కానీ తనవంటి పేదరైతునుంచి మరీ వెయ్యి వరహాలు గుంజాలనుకుంటాడని ఊహించలేదు. ఇప్పుడేం చెయ్యాలి? తనవద్ద అంత డబ్బు లేదు. అప్పు తెచ్చినా, తీర్చడం తనకు ఈ జన్మకు సాధ్యం కాదు. అందుకని గుణపతి వైద్యుడికి తన పరిస్థితి చెప్పుకుని, వేరే మార్గముంటే చెప్పమని వేడుకున్నాడు.

వైద్యుడు నవ్వి, “నీ భార్య జబ్బుకైతే మందైనా ఉంది. నా భార్య రెండేళ్లుగా తలనొప్పితో నరకయాతన పడుతోంది. ఏ మందు వాడినా ఫలితం లేక చేతులెత్తేశాను. చివరికో బైరాగిని ఆశ్రయిస్తే, ఆయనో దీక్ష గురించి చెప్పాడు. ఆ దీక్ష చేస్తే ఎంత పెద్ద రోగమైనా తగ్గడానికి మందు వాడక్కర్లేదు. చిల్లిగవ్వ ఖర్చుండదు. ఐతే తెలిసి ఎన్నడూ అబద్ధమాడనివాడికే ఆ దీక్ష ఫలిస్తుంది. నువ్వలాంటివాడివని నాకు నమ్మకమే కాబట్టి, నీకా దీక్ష గురించి చెబుతాను” అని ఆయన చెప్పిందిది:

ఊరి చివర కొండమీద వేణుగోపాలస్వామి ఆలయముంది. మూడు రోజులు రోజూ ఉదయం, సాయంత్రం- నడిచి కొండెక్కాలి. గుడికి నూటెనిమిది ప్రదక్షిణాలు చేసి అప్పుడు స్వామిని దర్శించుకుని ఇంటికెళ్లాలి. ఆ మూడు రోజులూ అన్నపానాదులు లేకుండా కటిక ఉపవాసం చెయ్యాలి. అప్పుడు మూడోరోజు రాత్రి స్వామి నిద్రలో కనబడి, జబ్బు తగ్గే మార్గం చెబుతాడు.

“ఈ దీక్ష పాటిస్తాను. కానీ ఈ మూడురోజుల్లోనూ నా భార్యకేమైనా ఐతే?” అన్నాడు గుణపతి కలవరంగా.

వైద్యుడు అతడి భుజం తట్టి, “దిగులు పడకు. నువ్వీ దీక్ష చేసే, ఆ మూడు రోజులూ నీ భార్యకు నేను ఉచితంగా వైద్యం చేస్తాను” అని ధైర్యం చెప్పాడు. గుణపతి అతడికి నమస్కరించి, “నీ సాయం ఈ జన్మకు మరువను” అన్నాడు.

గుణపతి మర్నాడుదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి వైద్యుడికోసం ఎదురు చూస్తున్నాడు. వైద్యుడు వచ్చి అతడికి ఆరు గుళికలిచ్చి, “ఇవి ఉదయమొకటీ, రాత్రి ఒకటీ నీ భార్య నోట్లో ఉంచి గోరువెచ్చని మంచినీళ్లు తాగించాలి. నువ్వు గుడికెళ్లి వచ్చేక ఆమెచేత బియ్యపు జావ తాగించు. రాత్రి గుడికెళ్లి వచ్చేక ఆమెకు ఫలరసం ఇవ్వు. స్పృహ లేకపోయినా ఆమె పానీయాలు సేవించగలదు. మధ్యలో ఏమైనా సమస్య వస్తే నాకు చెప్పు. అవసరమైతే మందు మారుస్తాను” అని వెళ్లాడు.

తర్వాత గుణపతి ఊరిచివర కొండవద్దకు వెళ్లాడు. నడిచి కొండెక్కాడు. గుడి చుట్టూ నూటెనిమిది ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్లాడు. రోజంతా పచ్చిమంచినీళ్లు కూడా తాగలేదు.

గుణపతి భార్యకు అంతు తెలియని జబ్బేదో వచ్చిందనీ, అందుకని అతడు తనవంతుగా దీక్ష చేస్తున్నాడనీ, దీక్ష పూర్తయ్యేవరకూ అతడి భార్యకు వైద్యుడు చాలా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా చేస్తున్నాడనీ, ఊరంతా ప్రచారమైంది.

కొందరు పద్మ పరిస్థితికి జాలిపడ్దారు. గుణపతికి ఆమెపట్ల ఉన్న ప్రేమకు ఆశ్చర్యపడ్డారు. అన్నింటికంటే ఎక్కువగా వైద్యుడి ఉదారబుద్ధి గురించి ఊరంతా విడ్డూరంగా చెప్పుకున్నారు. ఇప్పుడు గ్రామస్థులు ఆయన ఎదురైతే ఆగి వినయంగా దణ్ణాలు పెడుతున్నారు. గతంలో ఇలా ఎప్పుడూ జరక్కపోవడంవల్ల- వైద్యుడికీ ఘనత ఎంతో సంతోషం కలిగించింది.

మొదటిరోజు గుణపతి బాగానే ఉన్నాడు. రెండోరోజుకి బాగా నీరసమొచ్చింది. ఐనా పట్టుదలగా దీక్ష  కొనసాగించాడు. మూడోరోజు ఉదయం నిద్ర లేచేసరికి నీరసంతో అతడికి అడుగు పడ్డమే కష్టమైంది. ఐనా భార్యకు మందివ్వడానికి వెళ్లినప్పుడు, ఆమె పరిస్థితి చూసి, ఆమెకు నయం కావడానికి తగిన మనోబలాన్ని సమకూర్చుకున్నాడు. ఐనా కూడా ఆ సాయంత్రం గుడికెళ్లి ఇంటికొచ్చేసరికి అతడికి వంట్లో సత్తువ పూర్తిగా నశించినట్లయింది. వస్తూనే మంచంమీద వాలిపోయాడు.

ఆ రాత్రి కలలో అతడికి వేణుగోపాలస్వామి కనిపించి, “భక్తా! నీ దీక్షకి మెచ్చాను. భార్యపట్ల నీకున్న ప్రేమానురాగం అపూర్వం. రేపు ఉదయం నీవు వైద్యుడింటికి వెళ్లు. ఆయన ఇంటి పెరట్లో పారిజాత వృక్షముంది. చెట్టుకున్న పువ్వులన్నీ నేల రాలినా, ఒకే ఒక పువ్వు ఇంకా చెట్టుకే ఉంటుంది. అది నేల రాలకుండా జాగ్రత్తగా నీ చేత్తోనే కోసి వైద్యుడికివ్వు. ఆయన వద్దనున్న మందారతైలంలో ముంచి ఇమ్మను. ఆ పువ్వుని ఎవరు చప్పరిస్తే వారికి ఎలాంటి జబ్బయినా క్షణాలమీద మటుమాయమౌతుంది. ఇదంతా నువ్వు ఎంతో జాగ్రత్తగా చెయ్యాలి. ఎందుకంటే- ఈ వైద్యం ఒక్కరికే, ఒకసారికే పని చేస్తుంది. పొరపాటున నువ్వు పారిజాతాన్ని పోగొట్టుకున్నావా, నెల్లాళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి దీక్ష చెయ్యాలి. అప్పుడు వైద్యం మారుతుంది. అదేమిటో అప్పుడే తెలుస్తుంది” అన్నాడు.

మర్నాడుదయం నిద్ర లేస్తూనే గుణపతి రాత్రి వచ్చిన కలని గుర్తు చేసుకున్నాడు. స్వామి తనని అనుగ్రహించాడనీ, తన భార్య మళ్లీ మామూలు మనిషి ఔతుందనీ గ్రహించి మహదానందపడ్డాడు. ఆ సంతోషమే సగం బలం కాగా త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని, తల స్నానం చేసి వైద్యుడింటికి వెళ్లాడు. అప్పటికి వైద్యుడు అతడికోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. గుణపతి చెప్పింది విని అతణ్ణి పెరట్లో పారిజాత వృక్షంవద్దకు తీసుకెళ్లాడు. తూలి పడబోతున్న గుణపతిని జాగ్రత్తగా పట్టుకుని ఆపాడు. గుణపతికి నీరసంతో కళ్లు మసక బారుతున్నట్లు గ్రహించి, తనే శ్రద్ధగా చెట్టుని పరిశీలించి, ఇంకా తొడిమకు అంటి ఉన్న ఓ పారిజాత పుష్పాన్ని చూశాడు. అప్పుడు గుణపతి దాన్ని జాగ్రత్తగా కోసి వైద్యుడికిచ్చాడు. తర్వాత ఇద్దరూ ఇంట్లోకెళ్లారు.

అప్పుడు గుణపతి ఊహించని విశేషం జరిగింది. వైద్యుడా పారిజాత పుష్పాన్ని మందార తైలంలో ముంచి తన భార్యని పిలిచాడు. గుణపతి నివ్వెరపోయి చూస్తుండగా, వెంటనే ఆ పుష్పాన్ని తన భార్య నోట ఉంచాడు. మరుక్షణమే వైద్యుడి భార్య, “నాకిప్పుడు ఎంతో హాయిగా ఉంది. నా తలనొప్పి మాయమైంది. నువ్వు నాకు భర్తవు కాదు, దేవుడివి” అంటూ అతడికి చేతులు జోడించింది.

దానికి వైద్యుడు నవ్వి, “నేను నీకు భర్తనే కానీ దేవుణ్ణి కాను. నాకే అంతుపట్టని నీ జబ్బు తగ్గించిన దేవుడు ఈ గుణపతి. నీవు చేతులు జోడించాల్సింది ఇతడికి” అన్నాడు. ఆమె వెంటనే గుణపతికి చేతులు జోడించి లోపలకు వెళ్లిపోయింది.

అప్పటికి గుణపతికి జరిగిన మోసం అర్థమయింది. అతడు వైద్యుడితో, “నువ్వు నన్ను దారుణంగా మోసగించావు. నీ భార్యకోసం దీక్ష చెయ్యలేక అది తెలివిగా నాచేత చేయించి ఫలితం పొందావు. అందుకు నాకేం బాధ లేదు. కానీ ఇప్పుడు నా భార్య గతేమిటి?” అని దుఃఖం అపుకోలేక బావురుమన్నాడు.

వైద్యుడు అతడి భుజం తట్టి, “నా భార్యకోసం నేనూ దీక్ష చేసేవాణ్ణే. కానీ మధుమేహరోగిని కావడంవల్ల ఉపవాసం నిషిద్ధం నాకు. కానీ ఆమె తలనొప్పికి వేరే మందు లేక, నిన్ను మోసం చెయ్యాల్సొచ్చింది. ఇప్పుడామె ఆరోగ్యం కుదుటపడింది కాబట్టి ప్రత్యుపకారంగా ఖర్చంతా నేనే భరించి నీ భార్య జబ్బు నయం చేస్తాను. కాబట్టి ఇందులో నీకు జరిగిన అన్యాయమేం లేదు” అన్నాడు.

ఆ తర్వాత మరో వారం రోజుల్లో పద్మ జబ్బు పూర్తిగా నయమైంది. అప్పుడామె వైద్యుడితో, “మీ భార్యకు నయమైందన్న కృతజ్ఞతతో, నా జబ్బు తగ్గించడానికి వెయ్యి వరహాలు ఖర్చుపెట్టిన మీరు నిజంగా దేవుడు” అని చేతులు జోడించింది. ఆ తర్వాత ఊళ్లో కూడా, భార్యపట్ల వైద్యుడికున్న ప్రేమ అపూర్వమని గ్రామస్థులు గొప్పగా చెప్పుకున్నారు. భార్యకోసం ఎంతో కష్టపడి దీక్ష చేసిన గుణపతి ప్రేమ గురించి ఇంటా బయటా కూడా ఎవరూ చెప్పుకోలేదు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “భార్యకు జబ్బు చేస్తే, దేవుడిమీద భారం వేసి, ఏమాత్రం ఖర్చులేని ఉపవాసాలూ, గుడి చుట్టూ ప్రదక్షిణాలూ చేశాడు గుణపతి. తన భార్య జబ్బు తగ్గినందుకు కృతజ్ఞతగా తను సంపాదించిన డబ్బులో వెయ్యి వరహాలు ఖర్చు చేశాడు వైద్యుడు. అతడి ప్రేమ గుణపతి ప్రేమకంటే గొప్పదే. అంతమాత్రాన గుణపతి చేసిన దీక్షకు గుర్తింపు లేకపోవడం న్యాయమేనా? తెలిస్తే నా ఈ సందేహానికి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “నిజాయితీపరుడికి మాత్రమే ఫలిస్తుందని తెలిసి ఆ దీక్షని వైద్యుడు చేపట్టలేదు. అంటే వైద్యుడు నిజాయితీపరుడు కాదు. కాబట్టి అతడికి మధుమేహం ఉన్నమాట నిజమయుండదు. పెళ్లాం కోసం కఠోరదీక్ష చేసేటంత ఓపిక అతడికి లేదు. అవకాశం రాగానే, ఆ దీక్షని గుణపతి చేత చేయించడానికి, వైద్యానికి వెయ్యి వరహాలు ఖర్చవుతుందని అబద్ధం చెప్పి ఉంటాడు. గుణపతి భార్య వైద్యానికి, అతడికి పెద్దగా ఖర్చేమయుండదు. కాబట్టి అన్నివిధాలా వైద్యుడి ప్రేమకంటే గుణపతి ప్రేమే గొప్పది. ఇక గుర్తింపు అంటావా, జనం నిజంకంటే ఎక్కువగా ప్రచారానికే విలువనిస్తారు. గుణపతి తన గురించి ప్రచారం చేసుకోడు. వైద్యుడు చేసుకుంటాడు. అతడికొచ్చిన గుర్తింపుకి అదీ కారణం” అన్నాడు.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 8వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here