[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
అది శ్రావణమాసం. పండుగల మాసం కూడా.
శ్రీపీఠంలో ఉత్సవాలకు లోటు లేదు. అందునా శ్రావణమాసమంతా వేణుగోపాలుని సన్నిధిలో ఆరాధనలు, ఉత్సవాలే. పరిచిన పందిళ్ళలో హరికథలు, నాటకాలు, శ్రీకృష్ణుని మీద నృత్యాలు ఒకటేమిటి…
ప్రతిరోజు ఉదయం యతివరేణ్యుల ఆరాధన ముగిసినాక తీర్థగోష్ఠి, సాయంత్రం భాగవతం ప్రవచనం ఉంటాయా మాసమంతా. అది మన అజ్ఞానం త్రుంచటానికి దేవదేవుడు కృష్ణునిగా అవతారమెత్తిన మాసం కదా.
ఆలయమంతా బృందావనమవుతుంది. అప్పన్నపల్లె రేపల్లె ఇక. అక్కడి వారు గోపజనులంతగా శ్రీకృష్ణుని భక్తులు. ఆరోజు ప్రవచనానికి ముందు నారాయణయతి అందరిచే భజన చేయిస్తున్నారు.
“రామ శ్రీరామ కోదండ రామ
ఎంతో రుచిరా ఎంతో రుచిరా
శ్రీ రామ ఓ రామ శ్రీ రామ శ్రీరామ
నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను
కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను
పతిత పావన నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా”
అంటూ భద్రాచల రామదాసు కీర్తన భజన చేయించారు.
తరువాత ఆయన భాగవతంలో దశమస్కందంలో శ్రీకృష్ణుని లీలలను వర్ణిస్తుంటే వినే భక్తజనుల హృదయాలన్నీ బృందావనాలే అయ్యాయి.
ఆ కృష్ణాష్టమికి జనులు ఊర్ల నుంచి వస్తారు, ఆ వేడుకలు చూడటానికి, శ్రీ వేణుగోపాలుని, నారాయణ యతుల దర్శనానికి.
వచ్చిన వారు ఎక్కడక్కడ డేరాలేసుకు ఉండటము కూడా కద్దు. ఎడ్లబండ్లు కట్టుకు వస్తారు. కృష్ణాష్టమి రోజున ఆ స్వామిని చూచి తీరవలసినదే తప్ప వర్ణించలేం.
అప్పన్నపల్లె పులకరిస్తుంది ఆ తిరనాళ్ళకు.
ఆ ఏడాది కూడా జనం తెగవచ్చారు.
అందరికీ మంచినీరు, ఉచిత భోజనం ఆశ్రమంలో తక్కువ కాకుండా చూసుకుంటున్నారు.
ఆ అష్టమి రోజు ఉదయం ప్రత్యేక ఆరాధనలు జరుగుతున్నాయి దేవాలయంలో. నారాయణ యతి అక్కడే కూర్చొని చూస్తున్నారు జరుగుతున్న కార్యక్రమమంతా.
***
వాసుదేవుడు పరమ పేద భక్తుడు. అతను కృష్ణుని మనసావాచా నమ్మి జీవిస్తూ ఉండేవాడు. అతని వృత్తి చెప్పులు కుట్టుకోవటం. అతనికి అప్పన్నపల్లె వేణుగోపాలుడు బృందావన కృష్ణుడే. వాసుదేవుని నివాసం రాజమండ్రి ఎగువన. దాదపు యాభై మైళ్ళ దూరం.
అతను ప్రతి యేడు భక్తిగా పాదరక్షలు కూడా లేకుండా నడిచి, అప్పన్నపల్లె వచ్చి వేణుగోపాలుని, నారాయణ యతిని దర్శించి వెళతాడు. దూరం నుంచి దర్శించటం తప్ప యతిని దగ్గరగా చూసిందిలేదు. వయస్సు పెద్దదవుతోంది.
కృష్ణ నామం తలుచుకుంటూ కాలి నడకన బయలుదేరాడు. వయోభారంతో నడక కష్టమైంది. నుదుటన తిరునామం, తలపాగా, చిరిగిన జబ్బా, పంచెతో కాళ్ళకు చెప్పులు సైతం లేక కష్టం మీద అప్పనపల్లె చేరాడు.
ఆ రోజే కృష్ణాష్టమి. ఊరంతా తిరునాళ్ళ సందడి.
పాటలు, కృష్ణుని భజనలు. వాసుదేవునికి మతిపోయింది. అంత జనం అతను ఊహించలేదు.
నెమ్మదిగా ఒక దగ్గర ఆగి రెండు అరటిపళ్ళు కొనగలిగాడు. అతని వద్ద మరి పైకం కూడా లేదు.
వీధి పంపు దగ్గర శరీరం శుభ్రం చేసుకున్నాడు. వేణుగోపాలుని కోవెల బయట జనం. సముద్రంలా ఉన్నారు. నడచిన అలసట, ఆకలి, జ్వరం వలన కలిగిన మగత, బీదరికపు అధైర్యం వాసుదేవుని కృంగదీసింది. కోవెల బయట చెట్టు క్రింద కూలబడిపోయాడు.
కన్నులలో నీరు. ‘కన్నయ్యా ఇంత వరకు ఈ కాయం లాగాను. ఈ జనాలను చూస్తుంటే భయమేస్తోంది. నీ దగ్గరకు రాలేను. ఇక్కడ్నుంచే నీకు దండాలు. స్వామి నీకు ఇక్కడ్నుంచే దండాలు. అంత దూరం నుంచి వచ్చాను. ఇక ఓపిక లేదు. నన్ను నీవే పిలుచుకో’ ఇలా పరిపరి విధాలా తపన పడ్డాడు. కళ్ళ నుంచి నీరు. చెట్టు క్రింద మగతగా పడుకుండిపోయాడు వాసుదేవుడు.
***.
దేవాలయంలో పూజలు, హారతులతో హడావిడిగా ఉంది. వస్తున్న ప్రజలు వేణుగోపాలుడి దర్శనముతో, నారాయణ యతిని దర్శించి వెడుతున్నారు. ఆనాటి సాయంత్రము ఉట్టికొట్టే వేడుక ఉంది. భజనలు ఒక ప్రక్క, ఈ పూజలొక్క ప్రక్క. నారాయణ యతి అంతేవాసిని పిలిచారు.
అతనికి చెవిలో “చూడు, బయట చెట్టు క్రింద ఒక వృద్ధుడు ఉన్నాడు. అతను ఈ జనాలను చూసి భయపడి అక్కడే ఉండిపోయాడు. అతడిని లేపి తీసుకురా…” అన్నారు.
అంతేవాసి బయటకు వెళ్ళి చూస్తే చెట్టు క్రింద చిరుగు బట్టలతో ఉన్న వాసుదేవుడు కనపడ్డాడు. అతను మగతలో జోగుతున్నాడు. “సామీ, కన్నయ్య…” అంటూ కలవరిస్తున్నాడు.
అంతేవాసి తట్టిలేపాడు వృద్ధుణ్ని. కన్నులు తెరిచిన వాసుదేవుణ్ని నెమ్మదిగా లేపి లోపలికి తీసుకుపోయాడు.
అసలు జరుగుతున్నది అర్థం కాలేదు వాసుదేవునికి. కలలో లాగా నడిచి వెళ్ళాడు. లోపల భువనైకమోహనంగా వేణుగోపాలుడు ఉన్నాడు. మరో ప్రక్కగా నారాయణ యతి కనిపించారు. ఆ జన సముద్రంను తాకకుండా విడిగా అతనిని నారాయణ యతి వద్దకు చేర్చాడు, అంతేవాసి. వాసుదేవుడు కన్నుల నీరుతో నారాయణయతికి సాష్టాంగము చేసాడు.
“తాతా! చూడు కన్నుల నిండుగా… చూడాలన్నావుగా…” చిరునవ్వుతో అడిగాడు నారాయణ యతి.
కన్నుల నీరు అడ్డం పడుతుండగా వాసుదేవుడు “సామీ! మీరు నా కన్నయ్య. మీరే కృష్ణసామి. మీరే నా కులదైవము. మీకన్నీ తెలుసు…” అన్నాడు పొగిలి పొగిలి ఏడుస్తూ.
“ఊరుకో తాత! పెద్ద వయస్సులో కాలి నడకన వచ్చావు. ఉండు నాలుగు రోజులు లిక్కడ. నీకు ఆరోగ్యం కూడా నెమ్మదిస్తుంది…”
“సామీ! నా సామీ! నీవే కట్టెను కడతేర్చు!” అన్నాడు కన్నీరు తుడుచుకుంటూ.
“తాతా! నాకేదో తెచ్చినట్టున్నావు?” అన్నారు నారాయణ యతి చిరునవ్వుతో.
వాసుదేవుడు ఆ హడావుడికి మరచిన రెండు అరటిపళ్ళు నారాయణ యతి ముందు పెట్టాడు.
ఆయన చిన్నగా నవ్వి, అంతేవాసి వైపు చూసి సైగచేసారు.
అతను వచ్చి ఆ అరటిపళ్ళు తీసుకొచ్చాడు. అవి వేణుగోపాలునికి నివేదించి తెచ్చి నారాయణ యతి ముందర పెట్టాడు.
(సశేషం)