ప్రేమ పరిమళం-19

0
3

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘ప్రేమ పరిమళం‘ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”ఫో[/dropcap]టోలన్నీ చాలా బాగున్నాయి అనిందితా!”

“అవునా! అన్నీ దీపుగాడే తీశాడు సార్”

“నేను తెచ్చిన చీర ఎలావుంది?”

“సూపరుంది చీర. అయినా మీ సెలక్షన్ ఇంత బాగుంటుందని ఊహించుకోలేక పోయాను సార్! అయినా, బ్లౌజ్ ఏంటి? అంత కరెక్ట్‌గా నాకు పర్‌ఫెక్ట్‌గా సరిపోయేలా ఎలా తీసుకున్నారు?”

అవతలి వైపు ప్రేమ్ సాగర్ బిగ్గరగా నవ్వసాగాడు.

విస్తుబోయింది అనిందిత. “ఎందుకు నవ్వుతున్నారు?”

“ఏం చెప్పమంటావ్? ఆ షాపింగ్ రోజు నా పాట్లు గుర్తొచ్చి నవ్వొచ్చింది మేడమ్! మొత్తం మీద నీవు కట్టుకుంటే ఆ చీరకే అందమొచ్చినట్లుగా వుంది.”

“మీరూ వచ్చింటే బాగుండునని అమ్మనాన్న కూడా అనుకున్నారు.”

“ఫర్వాలేదు అనిందితా! ముందు ముందు మీయింటికొచ్చే రోజులు వుండనే వుంటాయిగా. తప్పకుండా వస్తాను. సరేనా?”

“మిమ్మల్ని చూడాలని మా దీపుగాడు తెగ ఉత్సాహాపడుతున్నాడనుకొండి”

“అవునా, ఇక నా చిన్నారి బావమరిదిని చూడడానికన్నా ఓ రోజు తీరిక చేసుకొని తప్పకుండా వస్తాను అనిందితా! ఒక్క క్షణం శారదమ్మగారు ఫోన్ చేస్తున్నారు. ఫ్లీజ్, ఆవిడతో మాట్లాడి, మళ్ళీ ఫోన్ చేస్తాను” అంటూ ఫోన్ కట్ చేసి శారదాదేవి ఫోన్ ఎత్తాడు ప్రేమ్.

“హలో, ప్రేమ్. ఎవరితో మాట్లాడుతున్నావ్? ఇంతవరకు ఎంగేజ్డ్ వస్తుంది?”

“మరే వేరే కాల్లో వున్నానమ్మా..” అర్ధోక్తిలో ఇగిపోయాడు.

“నాకు తెలుసులే దొంగా! నీవు అనిందితతోనే మాట్లాడుతున్నావనీ” నవ్విందావిడ.

“మీరు కులాసాగానే వున్నారు కదమ్మా. ఏం అలసి పోలేదుకదా!?”

“భలేగా అడుగుతున్నావు ప్రేమ్. కార్లో వెళ్ళి తిని, మళ్ళీ కార్లోనే తిరిగొస్తిని. ఇక అలసి పోవడానికి ఆస్కారమెక్కడుంది? మొత్తం మీద ఇవాల్టి నిశ్చితార్థం కార్యక్రమం బాగానే జరిగింది. నీవో యింటి వాడివి కాబోతున్నందుకు నాకు తెగ ఆనందంగా వుంది. నీ బుడత బావమరిది బహు ఉత్సాహాంతో ఫోటోలు తీశాడు. పంపించారా నీకు?”

“ఊ,..” అని చిన్నగా మూలిగాడు ప్రేమ్ సాగర్.

“ఫోటోలకన్నా ప్రత్యక్షంగా చూస్తుంటే అనిందిత ఎంతో బాగుంది ప్రేమ్! అందచందాలలో, సుగుణాలలో నీకు తగిన ఇల్లాలిలావుంది. నా మనస్సంతా అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. అమ్మాయ్‌కి నీవు తెచ్చిన చీర నిజంగా ఎంత బాగుందో! మా ప్రేమ్ సాగర్ బాబుది ఇంత గొప్ప సెలక్షనా? అని అనుకోకుండా వుండలే పోయాను సుమా! ఇక పోతే మీ అత్తమామలు కూడ నెమ్మదస్తులే. అతిశయం, ఎలాంటి ఆడంబరాలు లేని మధ్య తరగతి కుటుంబీకులు. ఇక ఇంకో ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి…”

“ఏంటమ్మా అది?” ఆత్రంగా అడిగాడు ప్రేమ్.

“ఏంటంటే రేపొద్దున మీ ఇద్దరికి వివాహాం అయ్యాక, ఏవైన చిన్న చితక గిల్లికజ్జాల్లాంటివి మీ భార్యాభర్తల మధ్య వచ్చినా, అనిందితకు నిన్ను దండించడానికి ఏ ఆయుధమూ అక్కరలేదు. తనకున్న ఒత్తైన బారెడు జడని సత్యభామలా చేత్తో గిరగిరా తిప్పుతూ ఒకటి రెండు దెబ్బలేస్తే చాలు.. నీవు జాగ్రత్త సుమా!” నవ్వుతూ చమత్కారంగా హాస్యంగా అంటున్న శారదాదేవి మాటలకు ఒక్కసారిగా పడిపడి నవ్వాడతను హాయిగా.

“అవునమ్మా. నిజమే మీరన్నది. ఎంత పెద్ద జడో! పల్లెలో మొదటిసారి ఆమెని చూసినప్పుడే ఆ జడని చూసి ఓ క్షణం విస్తుపోయానంటే నమ్మండమ్మా!” అంటూ మళ్ళీ నవ్వసాగాడు ప్రేమ్ సాగర్.

ఆ తర్వాత పెళ్ళి ఎలా ఎక్కడ అట్టహాసం, ఆడంబరాలు లేకుండా సింపుల్‌గా జరిగితే బాగుంటుందో ఆ విషయమై వాళ్ళిద్దరూ చాలా సేపు మాట్లాడుకోసాగారు.

***

దీపును చూడడానికీ, అనిందిత వాళ్ళమ్మ నాన్నగారి యిష్ట ప్రకారంగా ఓ రోజు చెప్పా పెట్టకుండా సడన్‌గా వాళ్ళింటికి వచ్చాడు ప్రేమ్ సాగర్. అదే రోజు ఆశ్రమ వార్షికోత్సవం కూడా కాబట్టి, వాళ్ళని తీసుకెళ్ళడానికీ కూడా వీలుగా వుంటుందని ప్లాన్ వేసుకొని మరీ వచ్చాడతను. తీరా వచ్చాక ప్రేమ్ సాగర్‌ని చూసి వాళ్ళంతా ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకీ లోనైనారు. దీపు సంతోషమే సంతోషం! వాడి ఆనందానికి హద్దులే లేవన్నట్లుగా వుంది.

సుశీలైతే మరీ ఏం తోచక తత్తరపాటుతో హడావుడి పడిపోతూ “నిల్చునే వున్నారు. కూ.. కూర్చొండి బా..బూ” నోరు పెగల్చుకొని ఎలాగో అంది. ఇంట్లోని వాళ్ళందరి పరిస్థితి అలాగే వుంది. “సారీ, మీరేం కంగారు పడకండి. ఫ్రీగా వుండండి. నేనైతే మీకు సర్‌ప్రైజ్ చేద్దామని కనీసం ఫోనైనా చేయకుండిలా వచ్చినందుకు మిమ్ముల్ని ఇలా హడావిడిలో పడేస్తానని అనుకోలేదు. ముఖ్యంగా మీకు… సారీ అత్తయ్యగారూ!” రెండు చేతులూ జోడించి వినయంగా సుశీలకు నమస్కారం చేశాడు ప్రేమ్ సాగర్ చిరునవ్వు ముఖంతో.

“నమస్కారం బాబూ” అంటూ ఆవిడెలాగో గొంతు పెగల్చుకుంది.

నిజానికి ఆమెకు కంగారుతో కాళ్ళు చేతులు ఆడ్డం లేదు. కాబోయే అల్లుడు, ఓ జిల్లా అధికారైన కలెక్టర్ గారు ఇలా హటాత్తుగా చెప్పాపెట్టకుండా ఇంటికి రావడం వలన కొంచెం యిబ్బందిలో పడిపోయిందామె.

కొంచెం నిబ్బరంగా వున్నది అనిందిత, పాండురంగమే మాత్రమే.

“ఫర్వాలేదు బాబూ! మీరు వచ్చారు. అదే మాకందరికీ ఆనందం. యింకా నిల్చునే వున్నారు. కూర్చోండి” పాండురంగం మర్యాదగా పూర్వకంగా అన్నాడు.

సుశీల గబగబా మంచినీళ్ళిప్పించింది అనిందితతో.

“నీవు మాత్రం చాలా కూల్‌గా వున్నావు కదూ అనిందితా!”నీళ్ళు తాగి ఖాళీ గ్లాస్ ఆమెకిస్తూ నవ్వాడు ప్రేమ్.

“అవును సార్!మా యిల్లేలా తెల్సింది మీకు?”

“అదేం ప్రశ్న అనితా! డ్రైవర్ రంగకు తెలుసుకదా మన యిల్లు” తండ్రి అన్న ఆ మాటతో కూతురికి బుర్రలో లైట్ వెలిగింది.

“అవునుకదా నాన్నా? నేనా విషయమే మర్చిపోయాను” నవ్వింది అనిందిత. దీపు మాత్రం వచ్చినప్పటినుంచి ప్రేమ్ సాగర్‌ని అంటిపెట్టుకునే వున్నాడు. వాడికి వాళ్ళ బావ బాగా నచ్చాడు.

“ఏం దీపూ! నీ చదువెలా సాగుతుంది? ఏ క్లాస్ చదువుతున్నావ్?” స్నేహా పూర్వకంగా భుజం చుట్టూ చేయి వేసి ప్రేమగా దగ్గరికీ తీసుకొని మరీ అడిగాడు.

“నేనిప్పుడు సెకండు క్లాస్ చదువుతున్నాను. మా క్లాస్‌లో నేనే ఎప్పుడూ ఫస్ట్ సెకండ్‌లో వస్తుంటాను బావగారూ!” అప్పుడే వరస కూడా కలిపేసి వుత్సాహాంగా అన్నాడు దీపు.

“గుడ్, వెరీ గుడ్! దీపూ. ఎప్పుడూ ఇలాగే చదవాలి”వాడి భుజం తట్టి మెచ్చుకుంటూ కుర్చీలో నుంచి లేచాడు. “ఏం అనిందితా! నీ గది చూపించవా?” అడిగాడామెను ఓరకంట చూస్తూ.

“రండి వెల్‌కమ్” అని నవ్వుతూ ముందుకు దారి తీసింది. పాంట్ జేబుల్లో రెండు చేతులూ పెట్టుకొని ఆమె వెనకాలే వెళ్ళసాగాడు.

తోకలా వాళ్ళ వెంటే వెళ్ళబోతున్న దీపుని వెనకనుంచి పాండురంగం వాడి చేయి పట్కొని ఆపి, కళ్ళతోనే సైగ చేశాడు వద్దని.

“నీవిలా రావోయ్, చెప్తాను” అంటూ పాండురంగం కొడుకుని వంటింట్లోకి తీసుక వచ్చాడు. “ఇదిగో, మీ అమ్మ మొట్టమొదటిసారి ప్రేమ్ సాగర్ బాబు… అదే నీకు కాబోయే బావగారి కోసమని టిఫిన్ చేస్తుంది కదా! అవి మనం ప్లేట్లలో సర్ది రెడీగా పెడ్దాం. అక్కతో మీ బావ ఏదో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడానికి గదిలో కెళ్ళారు. మనం వాళ్ళ మధ్యలో వెళ్ళితే బాగోదు కదా! అందుకని నేను నిన్ను వెనక్కి పిల్చాను దీపూ!” నెమ్మదిగా సన్నని గొంతుతో గుసగుసగా వివరించాడు పాండురంగం.

“అవునవును నిజమే నాన్నా!” ఏదో పెద్ద తెలిసిన వాడిలా తల పంకించసాగాడు దీపు.

గదిలోకెళ్ళాక ఓమారు చుట్టుతా కలియ చూశాడు ప్రేమ్ సాగర్. చాలా నీట్‍గా వుందా రూమ్. మంచంపై చక్కటి దుప్పటి పర్చివుంది. గోడవారగా షెల్ప్‌లో బుక్స్ అన్నీ వరసగా చక్కగా సర్ది వున్నాయి.

ఆమె వెనకాలే నిల్చున్నతను “ఓ, వెరీ నైస్ అనిందితా నీ రూమ్…” అంటూ అప్రయత్నంగా ఆమె జడ వంక ఓమారు చూసి నవ్వుతూ ఆ జడని చేతిలోకి తీసుకొని గుప్పిట్లో పట్టుకొని “వావ్! నిజమే, దెబ్బ బాగా బలంగానే తుగులుతుంది” అంటూ చిలిపిగా నవ్వాడు.

అనిందిత గిరుక్కున వెనుదిరిగి అతనికి అభిముఖంగా తిరిగేసరికి, అతని చేతిలోని జడ కూడా ఎడంభుజం మీదిగా ముందుకొచ్చింది.

“ఎందుకు నవ్వుతున్నారు? ఏదో దెబ్బంటున్నారేమిటి?” అతని వైపు, తన జడ వైపు పదే పదే చూడసాగింది. అల్లరిగా నవ్వుతున్న అతని కళ్ళకేసి చూసేసరికి సిగ్గుతో ముఖం ఎర్రబారింది. గుండె ఉద్విగ్నంగా కొట్టుకోసాగింది. మొదటిసారిగా అతని చెయ్యిపై తన కుడి చెయ్యి వేసి జడ విడిపించుకోబోయింది. ఆ స్పర్శతో మధురమైన పులకింతతో ఒళ్ళతా జలదరించి నట్లైందామెకు. ఆమె చేయిపై తన మరో చేయి గూడా వేసిపట్టుకున్న ప్రేమ్ సాగర్ ఆమెకు మరింత సన్నిహితంగా తగిలేలా దగ్గరగా జరిగాడు. అతని బట్టల్లోని నుంచి వస్తున్న పె‌ర్‌ఫ్యూమ్ పరిమళాలు తనకు ఆహ్లాదభరితంగా ఏదో మత్తులో తేలిపోతున్నట్లుగా అన్పించసాగింది.

“మా శారదాదేవమ్మ గారు నీ జడ గురించి ఏమన్నారో తెలుసా?” రహస్యంలా ఆమె చెవి దగ్గర గుసగుసగా అన్నాడు నవ్వుతూ.

“ఏమన్నారు?” అరమోడ్పు కన్నుల్లో సిగ్గుల మొగ్గలా ముడుచుక పోతూ అడిగింది. ఆవిడన్న మాటలే చెప్పేసరికి, “అలా అన్నారా ఆంటీగారు?” అంటూ పకపకా బిగ్గరగా నవ్వసాగింది. ఆమె నవ్వులో అతనూ శృతి కలిపాడు.

వాళ్ళిద్దరి నవ్వులు ఉల్లాసభరితంగా హాల్లోకి వినిపిస్తుంటే సుశీలా పాండురంగం చిరునవ్వుతో ఒకరిమొఖాలొకరు భావగర్భితంగా చూసుకోసాగారు.

అలా నవ్వుతున్న అనిందిత సుందరమైన ముఖారవిందాన్ని ప్రేమ్ ఓక్షణం పరవశంగా మైమరుపుతో చూసి, ఆ మరు నిముషములో ఆమె జడని వదిలేశాడు. కాని విస్తుబోయి చూస్తున్న అతని చేతిని మాత్రం వదలకుండా పట్టుకొని “పదండి” అంటూ అతనితో పాటు నడుస్తూ హాల్ లోకి వచ్చారు.

కాబోయే భార్యాభర్తలైన వాళ్ళిద్దర్నలా చూసిన పాండురంగం దంపతులకు కన్నుల పండుగైంది. వాళ్ళమనస్సంతా సంతోష తరంగాలలో మునిగి తేలియాడసాగింది. త్వరగా… అతి త్వరలో పెళ్ళి ముహూర్తం పెట్టించాలని దృఢంగా నిర్ణయించుకున్నాడాయన.

***

ఆ రోజు ఆశ్రమ వార్షికోత్సవానికి అనిందితని, దీపుని తీసికెళ్ళి కార్లో మళ్ళీ వాళ్ళని దించి వెళ్ళాక ప్రేమ్ సాగర్ నుంచి ఓ ఫోన్ కాల్ కూడా లేదు. బహుశా వర్క్‌లో బిజీగా వున్నారేమోనని అనుకుందామె.

ఆ మరుసటి వారంలో శారదాదేవిగారినీ, ప్రేమ్ సాగర్‌ని కలిసి మాట్లాడుకొని పెళ్ళి ముహూర్తం నిర్ణయించారు పాండురంగం దంపతులు… బ్రాహ్మాణుల సమక్షంలో.

చాలా నిరాడంబరంగా నిర్ణయించిన శుభలగ్నానికి అనిందితా ప్రేమ్ సాగర్‍ల వివాహం దేవాలయంలో… దేవుని సమక్షంలో లక్షణంగా, శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్ఛారణలతో జరిగింది. వివాహ బంధంతో భార్యాభర్తలైనారు. ఆ తర్వాత రిజిష్టర్ మ్యారేజ్ కూడా జరిగింది.

వాళ్ళ పెళ్ళి అయ్యాక ఓవారం పది రోజులు గడిచాక ఓ రోజు ఉపసర్పంచ్ రాయప్పకి ఫోన్ చేసింది అనిందిత. భార్యాభర్తలిద్దరూ కలిసి పుష్పాల గూడెంకు వెళ్ళారు. ఆ నవ యువ కలెక్టర్ల జంటకు ఘనమైన స్వాగతం లభించింది. ఊరు ఊరంతా వాళ్ళని చూడ్డాన్కి తరలి వచ్చారు. చుక్కమ్మ, అంగవాడీ టీచర్, స్కూల్ టీచర్స్ యిద్దరూ, యాదగిరీ, భూదేవమ్మ, సత్యవతి, ఆమె కోడలు, దొరస్వామి అంతా వచ్చారు. అందర్నీ పేరు పేరున పలుకరించింది నవ్వు ముఖంతో అనిందిత.

“సర్పంచమ్మ రాలేదు. లేరా దొరస్వామిగారూ?”

“లేదు చిన్న మేడమ్! కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళింది.”

“మరి మీరు వెళ్ళలేదేమిటి?”

“ఇక్కడ వ్యవసాయం, పొలం పనులు వదిలి నేనెలా అమెరికా వెళ్ళగలను చిన్నమేడమ్!” అంటూ శంకరితో ఓ బుట్టలో రెండు అందమైన గులాబీమాలలు తనతోపాటు తెచ్చి యిద్దరికి చేరొకటి యిచ్చి ఒకరి మెళ్ళో ఒకరు వేసుకోమని చెప్పాడు దొరస్వామి.

“ఇప్పుడివి అవసరమా దొరస్వామి గారూ?”వారించబోయిందామె.

ఆయన వినలేదు. ఊరి జనాలు కూడా వినలేదు.

“మీ పెళ్ళికి రాలేదు కదమ్మా! అందుకని మేమిప్పుడు ఈ వేడుక చూడాల్సిందే” అంటూ వాళ్ళంతా పట్టుపట్టారు.

ఇక చేసేదేమీ లేక ముచ్చటగా వాళ్ళ ముందు పూల దండలు మార్చుకున్నారు అనిందితా ప్రేమ్ సాగర్.

సత్యవతి మనసారా యిద్దర్ని అభినందించింది. దొరస్వామి యిచ్చిన టీ పార్టీ ముగియగానే, అందరికీ బైబై చెప్పి చేతులూపుతూ వెళ్ళి కార్లో కూర్చున్నారు.

“ఈ ఊరంటే నాకెంతో యిష్టం అనిందితా!” కారు డోరేస్తూ అన్నాడు ప్రేమ్ సాగర్.

“ఎందుకు?”ఎదురు ప్రశ్న వేసిందామె.

“ఎందుకంటే, ఏం చెప్పాలి? నేనారోజు ఇక్కడికి రాకుండా వుండింటే నీవు నాకు దక్కేదానివా? అందుకనీ…ఇష్టం”

“ఓహో, మీరు ఆ రూట్లో వచ్చారా!” భర్త వంక ఓరగా చూసింది.

***

కాలచక్రంలో ఓ రెండు సంవత్సరాలు గిర్రున తిరిగి పోయాయి. నూతనంగా ఏర్పాటైన ఓ జిల్లాకి ప్రథమ కలెక్టర్‌గా అనిందితకు ఫోస్టింగ్ వచ్చింది.

భార్యాభర్తలిద్దరూ ఒకే రాష్ట్రంలో వేరు వేరు జిల్లాల్లో నిత్యనూతనంగా పని చేస్తూ, సమాజ అభివృద్ధికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తున్నారు ప్రజలకి.

మరో రెండు సంవత్సరాలు గడిచే సరికి అనిందిత అందమైన చక్కటి ఓ పాపకు జన్మనిచ్చి తల్లి అయింది. హాస్పిటల్లో శారదాదేవి, ప్రేమ్ సాగర్, సుశీలా పాండురంగంతో పాటూ దీపు కూడా వచ్చాడు. అందరూ ఆనందోత్సాహాలతో వున్న ఆ సమయంలో వాడికి మాత్రం ఎప్పుడెప్పుడు అక్క పాపని చూద్దామా అన్నతంగా తహతహగా వుంది.

అక్క పక్కలో పండుకొని ముద్దుగా వున్న పాపని దీపు తాకీతాకనట్లుగా సుతారంగా తగిలి చూస్తూ “ఎంత బాగుందమ్మా, అక్క పాప… నాకు చెల్లి” నిండైన సంతోషంతో నవ్వుతూ అంటున్న వాడి మాటలకు లోలోన సుశీలా పాండురంగం ఒక్కసారిగా వులిక్కిపడినట్లైనారు. ఆ మరుక్షణమే –

“అవునవును… నీకు చెల్లి లాంటిదే లేవోయ్!”అంటూ నవ్వుతున్న ప్రేమ్ సాగర్‌తోపాటు అందరూ అతని నవ్వులో శృతి కలిపారు.

అనిందిత మాత్రం అరమోడ్పు కన్నులతో వున్న తన చిన్నారి పాప వంక మాతృ ప్రేమతో మైమరుపుగా నవ్వుతూ చూస్తుంది.

—: అయిపోయింది :

***

అంకితం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తొలి ముఖ్యమంత్రి అయిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పల్లెల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడమే కాకుండా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇచ్చే పథకం అమలు చేసి, పుష్కలంగా నీళ్ళు ఇస్తూ, రైతుబంధు కూడా యిస్తూ వ్యవసాయానికి పెద్దపీట వేశారు. పల్లెసీమలే దేశానికి వెన్నుముక లాంటివని అంటారు. అలాంటి గ్రామాలను ‘పల్లెప్రగతి’, ‘హరిత హారం’ లాంటి కార్యక్రమాలతో సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులకందరికీ మా కోడలు గురిజాల గాయత్రితో పాటు నా యీ నవల ‘ప్రేమ పరిమళం’ అంకితం.

~

మా కోడలు గాయత్రి గ్రామ కార్యదర్శిగా, పల్లెల లోని జనాలతో మమేకమై, అంకిత భావంతో పని చేసి ఉత్తమ కార్యదర్శిగా మెదక్ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా సన్మానం పొందింది ఒకప్పుడు. ప్రస్తుతం తానిప్పుడు  H .W .O. గా (బి సి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్)గా మెదక్ జిల్లా లోని నర్సాపూర్ లో పని చేస్తున్నది.

-రచయిత్రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here