స్వేచ్ఛ

1
4

[box type=’note’ fontsize=’16’] లేఖిని సంస్థ నిర్వహించిన 2021 దీపావళి కథల పోటీలలో ఎంపికైన కథ ‘స్వేచ్ఛ’. రచన అద్దేపల్లి జ్యోతి. [/box]

[dropcap]”వ[/dropcap]రలక్ష్మి ఎవరొచ్చారో, చూడు” అంటూ బయట నుండి ఆయన అరిచిన అరుపుకి పరుగున వచ్చాను లోపలి నుండి బయటకి, చేతిలో పని వదిలి. గుమ్మంలో నా చిన్ననాటి నేస్తం బ్యాగ్‌తో… నన్ను చూసి నవ్వుతూ చంద్ర,

తనని చూడగానే, “హాయ్ చంద్ర, ఎలా… ఉన్నావ్…” అంటూ వాటేసుకున్నాను, ఆనందంగా.

“కోడలు వస్తున్నా నీ హడావుడి తగ్గలేదు” అంది చంద్ర నవ్వుతూ.

“కోడలు వచ్చేసిందే, నువ్వు పెళ్లికి రాకుండా రిసెప్షన్‌కి వచ్చావ్” అంది చిరుకోపంగా.

“పెళ్లిలో బిజీగా ఉంటావని రిసెప్షన్‌కి వచ్చా” అంది నవ్వుతూ.

“లోపలకి తీసుకెళ్తావా? గుమ్మంలోనే మాట్లాడతావా?” అన్నారాయన మమ్మల్ని చూసి నవ్వుతూ.

“అయ్యో లోపలికి రావే, కంగారు ఆనందంతో లోపలికి రమ్మని కూడా అనలేదు చూసావా” అన్నాను హడావిడి పడుతూ

“అందుకే అన్నాను, నీ హడావుడి తగ్గలేదు అని” నవ్వింది చంద్ర.

“రా కోడలిని పరిచయం చేస్తా” అంటూ గదిలోకి తీసుకెళ్లి “కోడలు సౌమ్య” అని చంద్రకి చెప్పి, “నా చిన్ననాటి స్నేహితురాలు చంద్రకళ” అంటూ పరిచయం చేశాను.

“పెళ్లికి మీరు వస్తారని ఎదురు చూసింది అమ్మ” అన్నాడు ప్రవీణ్.

“అనుకున్నాను కానీ, పెళ్లిలో బిజీగా ఉంటారని ఇప్పుడు వచ్చాను” అంది చంద్ర.

“ఇప్పుడు ఇలా అంటున్నాడు కానీ, నీకు శుభలేఖ వేయాలంటే నా దగ్గర అడ్రస్సు నీ ఫోన్ నెంబరు లేదు, నీ పెళ్లి కార్డు కనబడింది. ఆ అడ్రస్‌కి రాసి పంపుతుంటే 30 ఏళ్ల క్రితం కార్డు మీద ఉన్న అడ్రస్‌కి పంపుతున్నావ్ ఇంకా అక్కడే ఉంటారా, నీ పిచ్చి గాని, అంటూ ఒక కార్డు వేస్ట్ పోస్ట్, స్టాంపులు వేస్ట్, పోస్ట్ చేయడం వేస్ట్ అంటూ నసిగాడు. నువ్వు కార్డు అందగానే నా నెంబర్‌కి ఫోన్ చేసి మాట్లాడావు కదా, అప్పుడు చూడాలి వాడి ఫేస్, నువ్వు పంపడం ఆవిడ ఫోన్ చేసి వస్తాను అనటం అబ్బో, సూపర్ అమ్మా, నువ్వు నీ ఫ్రెండు అంటూ కవర్ చేసుకున్నాడు” అన్నాను నవ్వుతూ.

“ఎందుకు అవి, ముందు టిఫిన్ పెట్టు ఆంటీకి” అన్నాడు ప్రవీణ్ గిల్టీగా ఫీలవుతు.

నేను చంద్రతో ఎన్నో సంవత్సరాల కబుర్లు చెబుతూ, మధ్యమధ్యలో రిసెప్షన్‌కి కావలసినవి సర్దుతూ అవధానం చేస్తున్నాను. మధ్యాహ్నం భోజనాలు ఫంక్షన్ హాల్‌లో. “అన్నీ రెడీ చేసుకుని వెళ్ళిపోవడమే, మళ్ళీ వెళ్ళి రావటం పెట్టకు” అన్నారు ఆయన.

‘అలాగే’ అని, ఆ విషయం సౌమ్యకి చెప్పి “రిసెప్షన్లో పెట్టుకునే నగలు, చీరలు అన్ని సర్దుకుని భోజనానికి వెళ్ళిపోదాం” అని. ప్రవీణ్‍ని “నీ బట్టలు కూడా సర్దుకో” అన్నాను. “మోహన్, నీ బట్టలు తీసుకో. అక్కడ అది లేదు ఇది లేదు అంటే ఇంట్లో మర్చిపోయి, అంటే నాన్న సంగతి తెలుసుగా అందరి ముందు తిడతారు” అన్నాను.

“సౌమ్య పాదాలకు పసుపు రాయాలి” అంది అక్క.

సరే అని పసుపు గిన్నె పక్కన పెట్టుకుని ఆమె కాళ్ళ దగ్గర కూచుని పసుపు రాస్తుంటే, “అబ్బో భలే అత్తగారు” అంది చంద్ర అబ్బురంగా చూస్తూ.

“నాకు కూతుళ్ళు లేరు. నాకు కోడళ్ళే కూతుళ్ళు, నాకు అలాంటి తేడాలు లేవు, అత్తగారిగా హోదా చూపించాలి, ఒక మెట్టు పైన ఉండాలి అని అనుకోను” అన్నాను.,

“బాగుంది అందరూ అంటారు మాటలు వరకు, నువ్వు చేతలో కూడా చెప్తున్నావ్, వెరీగుడ్” అంది చంద్ర మమ్మల్ని ముచ్చటగా చూస్తూ.

రిసెప్షన్ బాగా జరిగింది, నా ఫ్రెండ్స్‌కి పరిచయం చేశాను కాకినాడ నుండి వచ్చింది నా బాల్య స్నేహితురాలు అని.

అంత దూరం నుండి బాగానే వచ్చింది, అని మా స్నేహాన్ని మెచ్చుకున్నారు అందరూ.

మా చిన్నప్పుడు మేము వాళ్ల ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళం. మా అమ్మగారు గారెలు వేస్తే వేడిగా పట్టుకుని పైకి వెళ్లి ఇచ్చేది, చంద్ర తలంటుకుంటే దువ్వెన్న పట్టుకుని కిందకు వచ్చేది, అమ్మ చిక్కు తీసేది, వాళ్ళు మేము చాలా బాగా ఉండే వాళ్ళము. వాళ్ళు ఓనర్స్‌లా ఉండేవారు కాదు, కలుపుగోలుగా ఉండేవారు. ‘ఏం కావాలన్నా అడగండి’ అంటూ అంకుల్ చాలా సహాయంగా ఉండేవారు.

నా చిన్నతనంలోనే నాన్నగారు పోయారు, అమ్మ కష్టపడి అన్నయ్యలని అక్కని నన్ను పెంచింది అని, ఆయనకి మా పట్ల సానుభూతి. ఆయన అందరితో అలాగే ఉంటారు, మా మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపేవారు. నేను టెన్త్, చంద్ర ఎయిత్ క్లాసు. నేను తనకి అన్నీ చెప్పేదాన్ని డౌట్ వస్తే.

“అయిగిరి నందిని పాట పాడుతుంటే బావుంది అన్నావని నీకు నేర్పాను, గుర్తుందా.” అన్నాను.

“గుర్తుంది కానీ, ఇప్పుడు పాడమనకే” అంది నవ్వుతూ చంద్ర.

“అప్పుడు ఆ చదువుల పరీక్షలే అమ్మో అనుకుని భయపడే వాళ్ళం. జీవితం ఇంకా పెద్ద పరీక్ష పెడుతుంది అనేది తెలీదు అని. మీ అమ్మ నాన్న చాలా మంచివాళ్ళు. తర్వాత ఎన్ని ఊళ్ళు మారినా మీలాంటి ఓనర్స్ కనబడలేదు అని మా అమ్మ అస్తమాను మిమ్మల్ని తలుచుకునేది, మీ అమ్మ వాళ్ళని అడిగానని చెప్పు” అన్నాను.

“సరే గాని పడుకో, అలిసిపోయావు, రేపు చెప్పుకుందాం” అంది చంద్ర పడుకుంటూ.

***

కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది. మా మోహన్‌కి కూడా పెళ్లి కావడం, వాడికి అమ్మాయి పుట్టింది అని నేను అమెరికా వెళ్ళటం. మా వారు “పెద్దాడు ఇండియాలో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు కదా, మామ గారు పోయారు అని ఇక్కడికి వచ్చి చిక్కుకు పోయారు కదా వాడు ఉండగా నేను వదిలి రాలేను అక్కడ అవసరం కదా నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను” అన్నారు.

చంద్రకళకి మనవడు పుట్టాడు, ప్రవీణ్‍కి ఇద్దరు అబ్బాయిలు. చాలా అల్లరి వాళ్ళు. కప్‌బోర్డ్లు కూడా ఎక్కేస్తారు స్పైడర్ మాన్ అంటూ. ఎటూ తెలియని వయసు ఎవరో ఒకరు కూడా ఉండాల్సిందే, అందుకే నేను కూడా కాదు కూడదు అనలేకపోయాను, ఆయన అంటే కొంత జడుస్తారు పిల్లలు. మోహన్ వర్క్ ఫ్రం హోమ్‌లో ఉన్నా, కోడలు వంటలో ఉన్నా ఆయన మనవళ్ళని చూస్తారని.

చంద్ర నాన్నగారు కాలం చేశారు, ఆయన వెంటనే వాళ్ల అమ్మగారు ఏడాది తిరక్కుండా ఆయన మీద బెంగతో వెళ్ళిపోయారు. “50 ఏళ్ల అనుబంధం, సహచర్యం, 60 వ పెళ్లి రోజు ఘనంగా చేద్దామనుకున్నా” అంటూ బాధపడింది.

“ఏంటో జీవితం ఎన్నో అనుభవాలు, ఎన్ని దుఃఖాలు, తప్పదు. మనం ఉన్నంత కాలం మన తల్లిదండ్రులు ఉండరు. మనసు సరిపెట్టుకో, మనవడిలో అందర్నీ చూసుకో” అంటూ ఓదార్చాను,

సాన్వి ముద్దు చేష్టలతో ఆడపిల్ల మురిపం తీరుతోంది నాకు. పట్టు లంగా మువ్వల పట్టీలు గొలుసులు గాజులు వేసి నా ముచ్చట తీర్చుకుంటుంటే కాలమే తెలియలేదు. ఆరు నెలలు గడిచిపోయాయి.

పెద్ద వియ్యంకుడి సంవత్సరీకాలకి కొడుకు కోడలు మావారు వెళ్ళారు. వచ్చాక జ్వరం మూడు రోజులైనా తగ్గలేదని డాక్టర్‍కి చూపిస్తే కరోనా అని, లంగ్స్ పాడైపోయాయి, హైదరాబాదులో ప్లాస్మా ట్రీట్మెంట్ చేయించాలని చెబితే నాకు కాలు చేతులు ఆడలేదు. ఇది ఎక్కడ గొడవని, వెళ్దాం అన్నాను. నేను చిన్నోడు అప్పటికప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ తీసుకుని ఇండియాకి వచ్చేశాము. కానీ ఆయనని చూడనివ్వలేదు, లక్షలు ఖర్చుపెట్టారు పిల్లలు. కానీ, మూడో రోజుకి సారీ చెప్పారు డాక్టర్లు, నా జీవితం అగమ్యగోచరం అయిపోయింది. స్మశానానికి వెళ్లి చూసాము. ఎంత విషాదం భర్తని ముట్టుకోకుండా దూరం నుంచి కడసారి చూపు చూడటం. కరోనా విలయ స్వరూపం, ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటుందో, కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. జరిగిన విషాదాన్ని మనసు అంగీకరించటం లేదు. షష్టిపూర్తి ఘనంగా చేసుకుని సొంత ఇంట్లో రెండేళ్లు సుఖంగా సంతోషంగా ఉన్నాం అంతే, ఆరు నెలల వియోగం శాశ్వతం అయిపోతుందని అనుకోలేదు. మనసు కళ్ళు ప్రవహిస్తూనే ఉన్నాయి. 15 రోజుల తర్వాత చంద్ర ఫోన్ చేసింది,

“మీ అబ్బాయి మెసేజ్ చూసి చాలా బాధపడ్డాను సో, సారీ. ధైర్యంగా ఉంటూ, పిల్లలకు ధైర్యం చెప్పు” అంటూ స్వాంతనగా మాట్లాడింది.

సంవత్సరం గడిచింది. అబ్బాయిలు ఇద్దరు అమెరికా వెళ్లిపోయారు, నేను రాను అన్నానని, నన్ను ఇండియాలో వదిలి. కాలం చంద్రని ఒంటరిని చేసింది. “నేను, నువ్వు మా ఫ్రెండ్స్ శ్యామల, నాగమణి కూడా ఒంటరివాళ్లే. మనం నలుగురం కలిసి ఉందాం. మనకు చేతనైన సహాయం అవసరమైన వారికి చేద్దాం, స్వేచ్ఛగా బ్రతుకుదాం, చిన్నప్పుడు అమ్మ నాన్న తర్వాత భర్త పిల్లల అదుపు ఆజ్ఞలలో బ్రతికాము. ఇప్పుడైనా మనకోసం మనం బతుకుతూ, అవసరమైనవారికి సాయం చేద్దాం” అని; “మన కళలకు మెరుగు పెడదాం. నేను బాగా ఆర్ట్ వేసేదాన్ని, నువ్వు కవితలు బాగా రాసే దానివి. శ్యామల క్రాఫ్ట్ బాగా చేస్తుంది. నాగమణి టీచర్‌గా చేసింది, చుట్టుపక్కల పిల్లలకి ఫ్రీగా విలువలతో కూడిన చదువు చెబుతోంది. చేయూత అని పెట్టి మనం మన చేతనైనంత పదిమందికి సాయంచేద్దాం” అంది.

“సరే మాది పెద్ద ఇల్లు, మీరంతా మా ఇంటికి వచ్చేయండి. అందరం కలిసి మనం అవసరమైనవారికి చేయూతనిద్దాం, జీవితాలు సఫలం చేసుకుందాం” అన్నాను ఉత్సాహంగా.

“నేను నా మనవలు అనుకోకుండా పరిధిని పెంచుకుందాం, అయితే నేను ఆ ప్రయత్నంలో ఉంటాను, శ్యామలని, నాగమణిని, తీసుకొని మీ ఇంటికి వస్తాం” అంది చంద్ర ఆనందోత్సాహాలతో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here