[box type=’note’ fontsize=’16’] “ఆనాటి సినిమా మన జ్ఞాపకాల మూట. ఆనాటి లేత జీవితాన్నీ, తలపుల్నీ, ఆశల్నీ, ఆశయాలనీ విహంగ వీక్షణం చేయించే ఆనందాల రౌండ్ అప్ అనుకోవచ్చు” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి ‘రంగుల హేల’ కాలమ్‌లో. [/box]
[dropcap]సి[/dropcap]నిమాలు మన తండ్రుల తరం నుండీ మన జీవితాల్లో చాలా ముఖ్య పాత్ర వహించాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా మన తరంలో అయితే అవి ఆక్రమించిన భాగం అన్నిటికన్నా చాలా పెద్దది. మనం చూసిన సినిమాల ముద్ర మనం చదివిన పుస్తకాలకన్నా గాఢమైనది. అవి మనకి టీచర్స్, నేస్తాలు, ప్రియురాళ్లు, ప్రియులు, అమ్మలు, నాన్నలు. వేయేల? సమస్త బంధాలనూ కలగలుపుకున్న ప్రియాతి ప్రియ, గౌరవ ఆత్మీయ బంధువులు సినిమాలు.
సినిమాల ప్రభావం మన తరం వారిపై అమోఘంగా ఎలా ఉందంటే, కనిపించని గురువులవి. అసలు మనకి లోకజ్ఞానం, మనోవికాసం కలిగించినవి ఖచ్చితంగా సినిమాలే. మన కుటుంబాలలాగే సినిమాలో కుటుంబాలు ఉండడం మనకి మన ఇంట్లోని పెద్దలపై నమ్మకం,గౌరవం పెంచాయి. ఇతర దూరపు బంధువులతోటి అనుబంధాల పట్ల మర్యాదనూ కలిగించాయి. మన రోజుల్లో సినిమా అంటే కేవలం వినోదం కాదు. ఒక గొప్ప ఎడ్యుకేషన్.
మనకి చిన్నప్పటి లవకుశ, యశోద కృష్ణ, నర్తనశాల లాంటి సినిమాలు చూడడం వల్లనే పౌరాణిక గాథల పట్ల ఒక పునాది పడింది. అందువల్లనే వాటికి సంబంధించిన పాఠ్యాంశాలూ, పుస్తకాలూ చదివినప్పుడు బాగా అవగాహనా ఏర్పడింది. ఏ సినిమా ఎప్పుడు ఏ థియేటర్‌లో ఎవరితో వెళ్ళామో గుర్తుచేసుకోవడం ఇప్పటికీ తియ్యని అనుభూతే. పెద్దవాళ్ళతో టౌన్‌కి వెళ్ళినప్పుడు మార్కింగ్ షో, మాట్నీ, ఫస్ట్ షోతో కలిపి మూడు మూవీలు చూసేసేవాళ్ళం.
పిల్లలకి రాయితీ లిచ్చిన హిందీ, తెలుగు సినిమాలని టీచర్లు దగ్గరుండి చూపించేవారు. అవన్నీ’సరిగా చదువుకోకుండా అల్లరి చిల్లరిగా తిరగ కూడదు’ అనే నీతి ఉన్నవే ఉండేవి. మర్నాడు క్లాస్‌లో ఆ సినిమాలో కథ గురించీ మనం నేర్చుకోవాల్సిన విషయాల గురించీ టీచర్లు వివరించేవారు. ‘జ్యోతి జలే’ అనే హిందీ సినిమా, ‘బాలరాజు కథ, మాతృ దేవత’ కూడా అలా చూసినవే. పెద్దవాళ్ళు పిల్లలకు పనికట్టుకుని ‘లేత మనసులు’ చూపించారు. అది చూసిన మా పిల్లమూకకందరికీ ముఖ్యంగా ఆడపిల్లలకి అందులోని ‘కోడి ఒకా కోనలో.., పిల్లలూ దేవుడూ’ అనే పాటలు రెండూ కంఠతా ఉండేవి.
ఇక సగం చూసి నిద్రపోగా తిరిగి రావడం తెలీని సినిమాలు వదిలేస్తే, ‘మనుషులు మారాలి’ లాంటి బరువైన సినిమాలో ‘చీకటిలో.. కారుచీకటిలో ’ అన్న పాట ఇప్పటికీ దుఃఖాన్ని రేపుతుంది. అలాగే వరకట్నంలో ‘ఇదేనా మన సంప్రదాయమిదేనా?’ పాట కూడా. మా సంగీతం టీచర్లు ‘వేణుగానమ్మూ వినిపించెనే.. చిన్ని కృష్ణుండూ కనిపించాడే’, ‘మొక్కజొన్న తోటలో’ అనే పాటలకి అభినయం కూడా నేర్పించేవారు. చుట్టాలింటిలోనో, సెలవులకి ఊరెళ్ళినప్పుడో ఎవరైనా అడిగీ అడక్కుండానే, పాట పాడమంటే డాన్స్‌తో సహా తప్పులో ఒప్పులో చేసేసే వాళ్ళం. అంతా నవ్వుతుంటే మేమూ నవ్వేసేవాళ్ళం. సరిగా చెయ్యలేదేమో అన్న అనుమానమే లేదు.
అప్పట్లో యువత మీద సినిమాల ప్రభావం, ఆ తర్వాత నవలల ప్రభావం బలంగా ఉండేది. అనేక విషయాల్లో అంటే టీన్ ఏజ్ పిల్లలకి కలిగే అల్లిబిల్లి ఆలోచనలకు కూడా ఒక రూపం కల్పించినవి సినిమాలే! అప్పటి కాలేజీ రోజుల చర్చల్లో ఈ రెండు విషయాలే ఉండేవి. అనేక నవలల్లో పేజీలకు పేజీలు ఆ రోజుల్లో వచ్చిన నవలలపై విశ్లేషణ లాంటి సంభాషణ లుండేవి. ఆ సంభాషణలు అర్థం కావడం కోసం వెంటనే లైబ్రరీకి పరిగెత్తి ఆ నవల వెతుక్కుని చదివేవాళ్ళం.
మనం మన కాలంలో వచ్చిన సినిమాలే కాక మనం పుట్టకముందు వచ్చిన సినిమాలను కూడా వారానికి రెండు చొప్పున కవర్ చేసేసాం, మన ఊళ్లలో అవే వచ్చేవి కాబట్టి. ఆ నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలం సినిమా కథలకీ, గొప్ప దర్శక నిర్మాతలకీ, గొప్ప నటులకీ ఒక స్వర్ణ యుగం. ఆ సినిమాలు ఇప్పుడు చూస్తే మన ఊరి విందుభోజనం చేసినట్టుంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ స్క్రిప్ట్! ఒక్క అనవసరపు మాట లేకుండా, పకడ్బందీగా రాసిన స్క్రీన్ ప్లే! ఎంత కాలం కసరత్తు చేసి ఉంటారో కదా దాని మీద! మొదటి సీన్ నుండీ చివరి సీన్ వరకూ హాయిగా సాగిపోయే కథలవి.
కొన్ని సినిమాలయితే పూర్తిగా నీతిని బోధించడానికి తీసినవే. ‘తాతా మనవడు, బడిపంతులు, పండంటి కాపురం, అత్తగారూ కొత్తకోడలూ’ లాంటివి. అందరూ అద్భుత నటులే. సహాయ పాత్రలు కూడా ఎంతో గౌరవంగా, బావుండేవి. గంభీరమైన తండ్రి పాత్రలూ, మెత్తని తండ్రిపాత్రలూ, గయ్యాళి అత్తలూ, అమాయకపు అమ్మలూ, అందమైన కోడళ్ళూ, చిలిపి హీరోలూ, సున్నితమైన హాస్యం పండించే హాస్య నటీనటులూ.. అబ్బో ఆ ఘనత చెప్పతరం కాదు.
ఇల్లరికం అనే సబ్జక్టు తీసుకుంటే ఆ పేరుగల సినిమాలో బాధ్యత కలిగి ఇల్లరికం ఉండే అల్లుడు, మావని ఏడిపిస్తూ ఇల్లరికం అల్లుడు పాడుకునే హాస్యపు పాటతో సహా సినిమా సూపర్ హిట్. ఇలాగే అనేక సినిమాల్లో పాటలు రసగుళికలు. మధుర స్వరాల గాయనీ గాయకుల పాట తెరపై గోరింటలా పండేది. రేడియోలో నిత్యం అవే పాటలు వింటూ మురిసిపోయేవాళ్ళం. అప్పట్లో రేడియోలో వచ్చే అన్ని సినిమా పాటలూ పెద్దా, చిన్నాఅందరికీ నోటికి వచ్చిఉండేవి.
ఒక సినిమా అందరికీ ఒకే మెసేజ్ ఇవ్వదు. తీసుకున్న వాళ్ళ స్థాయిని బట్టి అది రకరకాల సందేశాలు ఇస్తుంది. పదహారేళ్ళ వయసులో మా కజిన్స్ అందరమూ ‘మరో చరిత్ర’ చూసి బుగ్గల మీద ఏడుపు చారలతో బైటికి వచ్చాము. బరువెక్కిన గుండెలతో ఎవరికీ మాటల్లేవు. ఆడపిల్లల్ని సినిమాలకు దగ్గరుండి తీసుకెళ్లే బాడీగార్డ్ లాంటి పిన్నిగారొకరుండే వారు మావూళ్ళో. మేమంతా మౌనంగా ఇంటికి నడుస్తుంటే ఆవిడ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ “తల్లీ తండ్రీ చెప్పిన వాడిని చేసుకుంటే హాయిగా బతికేది. ప్రేమా, దోమా అంటూ అన్యాయంగా చచ్చిపోయింది చూశారా?” అంది మాతో. ‘ఇలా కూడా ఆలోచిస్తారా?’ అనుకుంటూ మేమంతా ఆశ్చర్యంతో నోళ్లు తెరిచాం. ఆవిడకి అర్థమయిన సంగతి అది.
జీవితాన్ని దూదిపింజెలుగా విప్పి, విప్పి చూస్తే మన జీవితాలన్నీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సినిమాని పోలి ఉంటాయి. మానవ జీవితాలన్నీ ఒకటేనేమో! సాగర సంగమంలో జయప్రద చేయిపట్టుకుని దుఃఖం ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న కమల్ హాసన్ లాంటి సంఘటనలు మనకీ ఉంటాయి. మనకి అర్హత ఉన్నప్పటికీ ప్రమోషన్ ఇవ్వక్కరలేదని సంబంధిత ఆఫీసర్ గారు ఫైల్‌లో అన్యాయంగా రాసేసాక, మనం ఆశ వదిలేసుకున్నాక ఎం.డీ. గారు ‘ఫలానా కారణంతో ఆమెకి ప్రమోషన్ ఇవ్వండి’ అని రాసి పంపిన ఫైల్ లోని కాగితాన్ని మన కళ్ళతో మనమే చూసినప్పుడు కళ్లనీళ్లు పర్యంతం కాక మరేమవుతాం? ప్రేమనగర్‌లో “లతా ఎందుకు చేసావీ పని” అని ఏఎన్నార్ అన్నపుడు వాణిశ్రీ గుండె పగిలినట్టుగా ఒక్క మాటకే గుండె ముక్కలైన సందర్భాలు మనకి మాత్రం ఉండవా?
హిల్ స్టేషన్లో నాయికా నాయకులు పొగమంచులో పాడుతూ ఉంటే వాళ్ళతోబాటే మనకూ చలేసేది గుర్తుందా? ఎన్నెన్నో మధుర జ్ఞాపకాలు సినిమాల్లో కలిసిపోయి శిలాజాల్లా ఉండిపోతాయి మనకి అప్పుడప్పుడూ గుర్తు చేస్తూ. ముఖ్యంగా కొన్ని పాటల్లో కొందరు ఆప్తులు నిక్షిప్తమై ఉంటారు కూడా. అసలు సినిమాలే లేకపోతే మనమంతా ఎప్పుడో గుంపులు గుంపులుగా పిచ్చాసుపత్రిలో ఉండేవాళ్ళం కాదూ! నిజం చెప్పండి! నేనైతే మాత్రం అంతే. అవుండబట్టి ఇంకా బతికున్నాం. కాస్త ఊపిరుంది మనకి. కాదనగలరా? నేటి సినిమాలు ఈ తరం కోసమైతే, నాటివి మన కోసమే మరి.
ఒకే సినిమా మన వివిధ జీవిత దశల్లో వివిధ రకాలుగా అర్థం చెబుతుంది. చదువుకునే రోజుల్లో సినిమాల్లోని హీరో, హీరోయిన్ పాత్రలమీదే మన ధ్యాస ఉండేది తప్ప ఇతర పాత్రలమీద కాదు. ఇప్పుడు మన వెనక మరో తరం వచ్చేశాక మనలాంటి తల్లితండ్రులుగా, అత్తామావయ్యలుగా ఉండే సహాయపాత్రల్లోని పాత్రధారులపై చూపు మళ్లిస్తే అవి కూడా ఎంత బాగా తీర్చిదిద్దబడ్డాయో తెలుస్తుంది. అందుకే సినిమా ఎన్నటికీ వన్నె,విలువా తరగని నిధి. ఆనాటి సినిమా మన జ్ఞాపకాల మూట. ఆనాటి లేత జీవితాన్నీ, తలపుల్నీ, ఆశల్నీ, ఆశయాలనీ విహంగ వీక్షణం చేయించే ఆనందాల రౌండ్ అప్ అనుకోవచ్చు. ఆ సినిమాల్లో మన వారి విఫల ప్రేమలో, సఫల ప్రేమలో కూడా ఒకోసారి కనబడుతూ ఉంటాయి.
ఇక అద్భుతమైన పాటల లొకేషన్స్ మన జీవితంలోని ముఖ్య సంఘటనలకన్నా బాగా గుర్తుంటాయి. ఆ పచ్చని కొండలూ, సెలయేళ్ళూ, అందమైన ఉద్యానవనాల్లో మరింత అందమైన జంటలూ, మధురగాయకులు పాడిన తియ్యని పాటలూ మనకు జీవితంపై మమకారాన్ని పెంచి మనల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించాయి కాదూ! ఆ పాటలు కొన్ని వ్యక్తిత్వ వికాస గీతాలు, కొన్ని తాత్విక గీతాలు ఇంకా జాలివి, జాలీవీ కూడా ఉండేవి. ‘ఎవరికి వారే ఈ లోకం రారూ ఎవ్వరూ నీకోసం!’ పాట దుఃఖ ఘడియల్లో మనల్ని గుండెకి హత్తుకుంటుంది. ‘కల కానిది పాట’ ఎంత ధైర్యాన్నిస్తుందో! దూరమైపోతున్న మిత్రులను తల్చుకున్నప్పుడు ‘ఎవరెవరో ఎదురౌతారు. గుండె గుండెతో ముడిపెడతారు. ఘటనుంటే కలిసుంటారు. గడువైతే విడిపోతారు. ఆగిపోతూ… సాగిపోయే రాదారిపయనం బతుకు’ పాట జారే కన్నీటిని ఆపుతుంది.
అప్పట్లో అక్క కోసమో, స్నేహితురాలి కోసమో ప్రేమించిన హీరోని త్యాగం చేసే హీరోయిన్ల సినిమాలెక్కువుండేవి. ఇక ఆ సినిమాలు, ఆ త్యాగం వల్ల ఏర్పడిన కష్టాలమయంగా ఉండేవి. అవన్నీ చూసి విరక్తి చెందిన నేను, ఒకసారి లంచ్ టైంలో వీర లెవెల్లో “నేను గానీ, ఎవరినైనా గానీ, ప్రేమిస్తే గిస్తే అలా ఎవరికోసమో బోడి త్యాగాలు చెయ్యను” అని బెంచి పై కొట్టి చెప్పాను. “ఆహా, నువ్వేనేంటి! మహా! మేం మాత్రం చేస్తామా? మేమూ చెయ్యం!” అని నా వీపు మీదొకటి ఇచ్చి, మా క్లాస్ ఫ్రెండ్స్ కూడా బల్లలపై బాదారు. అసలలాంటి అవకాశమే మాకెవరికీ రాలేదనుకోండి. ఇంటర్‌లో మొదలు పెట్టి డిగ్రీ పూర్తి కాకుండానే ఒకరి తర్వాత మరొకరు అంతా అత్తారిళ్ళకి జంపే. ఒక్కళ్ళు కూడా మిగిలితే ఒట్టు.
చాలా ఉత్సాహంగా ఉన్నప్పుడు మంచి పాట వింటే ఫ్రెండ్‌ని కలిసినంత జోష్ వస్తుంది. మనకి దిగులుగా ఉన్నప్పుడు విన్నపాట నేస్తంలా మన వీపు నిమురుతుంది. మన దిగులంతా చేత్తో తీసేసినట్టవుతుందప్పుడు. అలాంటి పాటల్ని పనులు చేసుకుంటూ వినకూడదు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కుర్చీలో కూర్చుని ఏకాంతంగా వినాలి. ఒకో పాట, ఆనాటి సినిమాని గుర్తుచేసి రోజంతా ఉల్లాసంగా ఉండేట్టు చేస్తుంది. ఆ విధంగా మన జీవితం సినిమాలతో జన్మాంతర బంధంలా ముడి పడిపోయింది. వాటినుండి మనల్ని ఎవ్వరూ విడదియ్యలేరు.
సంక్రాంతి, ఉగాది లాంటి పండగలకు ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో అని ఎదురు చూసేవాళ్ళం. “పండగ రోజు ఆడపిల్లలు కొత్తబట్టలేసుకుని ఇంట్లో తిరగకుండా ఈ సినిమాలేమిటీ?” అని పెద్దవాళ్ళు కోప్పడినా ఎలాగో వారిని బతిమాలి, బిక్కమొహాలు వేసి “సరే పొండి” అనిపించుకునే వాళ్ళం. మార్నింగ్ షో కెళ్ళినవాళ్లు మాటినీ కెళ్ళేవాళ్ళకి రోడ్ మీద ఎదురొస్తే అక్కడే సినిమా ఎలావుందో చెప్పేసుకునేవాళ్ళం. కొందరు కొంటె కోణంగులు, “కథ చెప్పొద్దూ” అని చెవులు మూసుకునే వాళ్ల చెయ్యి లాగి చెవిలో కథ చెప్పి ఏడిపించేవారు.
ఒకో సినిమా కోసం రోజంతా ఖర్చు పెట్టేవాళ్ళం. పది మైళ్ళ దూరంలో ఒక థియేటర్ ఉండేది. అక్కడికి మా ఊరికంటే కాస్త కొత్త సినిమాలొచ్చేవి. వాటి కోసం ఒక కజిన్ బ్రదర్‌ని బతిమాలి ఒక సెలవు రోజు పొద్దున్నే బయలుదేరి రేవు దాటి పక్క గోదావరి జిల్లాకి వెళ్లి, ఆ సినిమా చూసి అదేదో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నట్టు బడాయిగా చెప్పుకునేవాళ్ళం.
ఇప్పుడొచ్చే సినిమాలు చూడాలంటే భయం. పిల్లలు వందలు, వేలు ఖర్చుపెట్టారే పాపం అనుకుంటూ తప్పక చూస్తే ఏడుపొస్తుంది. మర్నాడు యుట్యూబ్‌లో ఓ పాత సినిమా చూస్తే గానీ ఆ బాధ తీరదు. ఓటీటీలో చూడమని పాస్వర్డ్ లిచ్చి వెంటబడుతుంటే చూసినపుడు ఒకోసారి మంచి సినిమాలు దొరుకుతుంటాయి. ఓటీటీ లోని కొన్ని సినిమాల సీన్లూ, ఊతపదాలూ మనకి చేదు తిన్నట్టుగా ఉంటాయి. అదో ఇబ్బంది. ఒకోసారి వాళ్ళకి గొప్పగా ఉన్నవి మనకి నచ్చవు. ఆ మాటంటే “మీరింతే! ఎదగరు” అంటూ మళ్ళీ పిల్లలచేత మొట్టికాయలు పడతాయి.
ఒంటరిగా సాయంసంధ్యను చూస్తుంటే ‘ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ…ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ’ పాట, ‘కుంకుమ పూసిన ఆకాశంలో…ప్రణయ సంధ్యారాగాలూ’ పాట మదిలో మెదులుతాయి. మిత్రులను తల్చుకుంటూ ‘స్నేహబంధమూ ఎంత మధురమూ’ పాట గుర్తుచేసుకోని వారుంటారా! పాటలు వింటూ పని చేస్తుంటే శ్రమ తెలీదు. వేరే ధ్యాస లేకుండా మమేకమై పాటలు విన్న తర్వాత ధ్యానం చేసినంత రిలీఫ్‌గా కూడా ఉంటుంది. ఒక గొప్ప పాట మన దుఃఖాన్ని మరిపిస్తే, మరొకటి మధురానుభూతుల్ని నెమరువేయిస్తుంది. మరికొన్ని వ్యక్తిత్వ వికాసాన్ని కల్గించి కర్తవ్యాన్ని బోధిస్తాయి. ఒకో పాత సినిమా పాట మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కోలా మడిచిపెట్టిన జ్ఞాపకాల మూట కదా! ఆనాటి లేత జీవితాన్నీ, తలపుల్నీ, ఆశల్నీ, ఆశయాల్నీ విహంగ వీక్షణం చేయించే ఆనందాల రౌండ్ అప్ బాటలా పాటలు.
“ధనమేరా అన్నిటికీ మూలం” అనే పాట రాగానే “వినండర్రా ఈ పాట” అనే తాతయ్యలూ “ఏవిట్రా నన్ను జూనియర్ సూరేకాంతం అంటున్నావట అందరిదగ్గరా? ఎలా ఉంది వళ్ళు?” అనే అత్తలూ, “నువ్వలా అంజలీదేవిలా మెతగ్గా ఉండకూడదే” అనే మావయ్యలూ, “ప్రతిదానికీ నువ్వలా హీరోయిన్‌లా అపార్థం చేసుకొని చావకు!” అంటూ విసుక్కునే అక్కయ్యలూ, “ఇదిగో నువ్వలా హేమలతలా గొంతు వణికిస్తూ మాట్లాడకు. నాకు చిర్రెత్తుకొస్తుంది” అనే చిన్నాన్నలూ, “ఎవడే వీడూ? ఆర్ నాగేస్సర్రావ్ లాగున్నాడే” అనే బామ్మలూ ఇలా ఎందరి నోళ్ళలోంచో సినిమా ప్రస్తావనలూ ఉండేవి అప్పట్లో.
మన జీవితాల్ని ఒక్కసారి అవలోకనం చేసుకుంటే అందులో మన బంధుమిత్రులతో పాటు అనేక సినిమాలుంటాయి. వాటిల్లో ఉండే ప్రేమ సన్నివేశాలూ, కామెడీ సీన్‌లూ, గుండెల్ని మెలిదిప్పే దుఃఖ సన్నివేశాలూ, ఇంకా అనేక తాత్విక గీతాలూ, ప్రేమ గీతాలూ, జాలీ పాటలూ, జాలిపాటలూ.. ఎన్నెన్నోమరపురానే రావు కదా! మన జీవిత చక్రంలోని వివిధ అంకాల్ని కొన్ని సినిమాలు గుర్తుచేస్తూ ఉంటాయి. ఇక పాటల లొకేషన్‌లు మన జీవితాల్లోని ముఖ్య సంఘటనల కన్నా బాగా గుర్తుంటాయి. ఆ మంచుకొండలు, అందమైన ఉద్యానవనాలూ, మధుర గాయకుల స్వరాలూ మన సొంతం. జీవితంపై మమకారాన్ని పెంచిన సజీవ నేస్తాలు కదా సినిమాలు.
స్నేహం గొప్పతనం చెప్పే సినిమాల్లో స్నేహితాలపై విలువైన మాటలుండేవి. వాటిని పుస్తకాల్లో రాసుకునే వాళ్ళం. సంభాషణా ప్రధాన సినిమాల్లోని డైలాగులు ఒకళ్ళకొకళ్ళు అప్పచెప్పుకునేవాళ్ళం.ఒక నవల సినిమాగా తీస్తే ‘కథ మనకి తెలుసోచ్’ అని ఆనందపడేవాళ్ళం. ఆ సినిమా రాగానే చూసేసి అసలు కథని ఎక్కడ ఎలా మార్చారో ఒక కాన్ఫరెన్స్ పెట్టి చర్చించేవాళ్ళం. ఇప్పుడు సిటీల్లో నిరంతరం బిజీగా జీవితాలు గడిపే మనకి, కాలేజీలో చదువుకుంటూ కూడా అప్పుడెంత తీరికగా ఉండేవాళ్ళమో తల్చుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మనకవి బంగారు రోజులు. ఆ రోజుల తీపి గురుతులు ఆనాటి సినిమాలు. అప్పటి సినిమా పాటల్లోని సరళ సాహిత్యం మనకి సాహిత్యాభిరుచిని కలిగించింది. ఎన్నో జీవితపాఠాల్ని అలవోకగా నేర్పిన సినిమాకి వేల, వేల వందనాలు. కోటి అభివందనాలు.