[box type=’note’ fontsize=’16’] డా. ఇందు ఝున్‌ఝున్‍వాలా హిందీలో రచించిన ‘కావ్య’ అనే నవలని అదే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఆర్. ఉమా శర్మ. [/box]
[dropcap]ఇం[/dropcap]టి యజమానికి అద్దె బాకీ పెట్టబట్టి చాలా నెలలు కావస్తూ ఉంది. ఆయన మాత్రం మా పరిస్థితిని చూసి ఎన్ని రోజులు ఆగుతారు? నీరజ్ ప్రవర్తనలో ఇసుమంత కూడా మార్పు లేదు కదా. ఎప్పుడూ ఇంటి పట్టున ఉంటే పురుషుడి మానసిక స్థితి బలహీనం కావటంతో పాటు ఇంట్లో ఉన్న భార్యా పిల్లలు కూడా స్వేచ్ఛగా ఉండలేరు. ప్రతి ఒక్కరికీ వారిదే అయిన కొంత వైయక్తిక స్వేచ్ఛ కూడా అవసరం.. ప్రతి విషయంలో ఇంకొకరు తల దూర్చటం కొంతవరకు ఎవ్వరికీ ఇష్టం ఉండదు కదా.
నీరజ్ తాను ఉద్యోగం చేయనని చెప్పేశాడు. నేను చేస్తూ ఉంటే సహించలేడు కూడా. ఇదెక్కడి చోద్యం, అలా కూర్చొని తినడానికి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు లేవు కదా. పూట పూటకు దిక్కులు చూస్తూ బ్రతికే పరిస్థితి. పైగా రోజూ అయ్యే గొడవల వల్ల కొంత విసుగ్గా ఉంటుంది. అందువల్ల ప్రెస్‌కి వెళ్ళటం మానేశాను. అప్పుడప్పుడూ ఇంటి యజమానికి కొంత డబ్బు పోగు చేసి ఇచ్చేదాన్ని. ఇపుడు ఆ వెసులుబాటు కూడా లేకుండా పోయింది.
ఇంతలోనే నీరజ్‌కీ ఇంటి యజమానికి పెద్ద గొడవే అయింది. ఇక వేరే గత్యంతరం లేక ఇల్లు మారవలసి వచ్చింది. ఇల్లు వదిలి వెళ్ళే ముందు బాకీ ఉన్న అద్దె బదులు ఇవ్వాలి కదా. దాని కోసం నీరజ్ నామీదే ఆధారపడి ఉన్నాడు. నేనే ఏదైనా చేసి డబ్బులు తేవాలి. కానీ ఎలా? ఎక్కడినుంచి తేవాలి? ఎవరిని అడగాలి? అలా చూస్తే నేను మా అమ్మానాన్నలను కూడా ఇది కావాలి అని ఏనాడూ అడిగి ఎరుగను. అలాంటిది ఇప్పుడు ఇతరుల ముందు దేహీ అని చేతులు చాచాలంటే, నా మీద నాకు అసహ్యంగా ఉంది.
నా దగ్గర ఏదైనా నగలు ఉంటే అమ్మి లేదా తాకట్టు పెట్టి తెచ్చేదాన్ని. నా పెళ్లి అయిన సందర్భంలో నగల మాట కూడా రాలేదు. అటు పుట్టినింటి వారు, ఇటు అత్తవారింటి వారు ఇద్దరూ నగలు పెట్టలేదు. అంతలో నాన్న ఇచ్చిన ఒక ఉంగరం గుర్తొచ్చింది. నాన్న తన గుర్తుగా ఇచ్చిన ఉంగరం అది. నాన్న నాకు నగలు ఏదైనా కొనివ్వాలని అనుకున్నారు, కానీ అంతలో నాన్న రిటైరు కావటంతో నేనే వద్దని చెప్పాను. ఇంట్లో చెల్లెళ్ళు-తమ్ముళ్ళ కార్యాలు కావాలి. ఇప్పుడు ఏమీ వద్దు అని చెప్పాను. నాన్న బలవంతంగా ఇచ్చిన ఉంగరం అది.
ఈ రోజు మొదటిసారి స్త్రీ ధనం ఆవశ్యకత గురించి అర్థం అయింది. ఒక స్త్రీకి పుట్టినిల్లు ఎంత అవసరం, వారి మద్దతు ఎంత అవసరం, ఎంత ముఖ్యమో అర్థం కాసాగింది. కానీ పిల్లల కోసం నాన్న ఇచ్చిన ఉంగరాన్ని అమ్మక తప్పలేదు. వచ్చిన డబ్బులతో బాకీ తీరింది. రామనగర్ ఇల్లు వదిలి 1987లో మరలా మదేసర్ లోని ఇంటికి తిరిగి రావటం జరిగింది. అది నాన్నగారికి తెలిసిన వ్యక్తి ఇల్లు, నన్ను బిడ్డ లాగా పలకరిచేవారు. ఆయన ఎవరినా తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేవాడు కాదు. సిద్ధాంతాలు ఉన్న వ్యక్తి ఆయన. ఎవరికైనా తన వంతు సాయం అందించే స్వభావం ఉన్నవారు.
వారి ఇంట్లో ఒక ముసలి అమ్మ కూడా ఉంది. నా పిల్లలను బాగా మాట్లాడిస్తూ వారికి కథలు అవి చెప్పేది. వారు ఆమె కథలు వింటూ ఉండేవారు. ఆయనకు ఇద్దరు చక్కని అమ్మాయిలు ఉన్నారు. వారు కూడా నన్ను, పిల్లల్ని బాగా పలుకరించేవారు.
అంతా బాగానే ఉంది కానీ ఏ ఇల్లు మారినా నా నుదుటి రాత మాత్రం అలాగే ఉంది. డబ్బు సమస్య అలాగే ఉంది.
ఒక రోజు అనుకోకుండా నాన్నగారి మిత్రుడు గిరిధారీ బాబాయ్ కనిపించారు. “మా ఇంటికి దగ్గరగా ఉన్న స్కూల్‌లో ఒక ఉద్యోగం ఉంది, చేస్తావా” అని అడిగారు. స్కూల్‌కు సంబంధించిన లెక్కలు చూసే ఉద్యోగం ఆట అది. నేను వెంటనే ఆయనకు ఓకే చెప్పాను. ఆ ఉద్యోగంలో చేరిన తరువాత కొంత డబ్బు రాసాగింది. రెండు పూటలా తినడం అనేది పెద్ద విలాసంగా ఉండే రోజులు అవి. అలా ఎన్నోరోజులు జరగవు అని నాకు కూడా బాగా తెలుసు. గిరిధారీ బాబాయ్ పిల్లలని అదే స్కూల్‌లో ఫీజు లేకుండా చేరిపించారు. ఫీజు కాకుండా కూడా ఎన్నో ఖర్చులు కూడా ఉంటాయి కదా, పిల్లల యూనిఫార్మ్, పుస్తకాలు ఇలా వాటి కొరకు కూడా డబ్బులు కావాల్సి వచ్చేవి.
మా నాన్నగారు పోస్ట్ మాస్టర్‌గా పని చేశారు. మేము ఐదుగురు పిల్లలు. అపుడు మాకు అర్థం అయ్యేది కాదు. ఇద్దరి పిల్లల ఖర్చుకే నేను ఇంతలా సతమతమవుతూ ఉన్నాను. నాన్న మా అందరికీ అన్నీ సమయానుసారంగా ఎలా చేసేవాడో కదా అనిపిస్తుంది.
నేను అర్ధాకలితో నిద్ర పోగలను. పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతే నా మనసు బాధ పడుతుంది. ఏది ఏమైనా వారికి ఏ కొరత రాకూడదని నాకు అనిపిస్తుంది. అలా చేయలేక పోతే నేను బ్రతికి ఉండి కూడా ప్రయోజనం లేనట్టే.
ఎలాగో ఒక సంవత్సరం గడిచింది. నీరజ ఐదు సంవత్సరాలు, పింకూకి నాలుగు ఏళ్ళు వచ్చాయి. ఇద్దరినీ చూస్తేనే చాలా బలహీనంగా ఉన్నారని ఇట్టే చెప్పేయవచ్చు. వారికి కడుపు నిండా తినేందుకు అన్నమే లేకుంటే పౌష్టిక ఆహారం అనే ప్రసక్తే రాదు కదా. వారిని చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది.
***
1988 సంవత్సరం.
పనీర్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. నాన్న పనీర్ ఇంటికి తెస్తే ఆ రోజు పండుగ కన్నా ఎక్కువ సంతోషం అయ్యేది మాకు. మేమందరం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు సంతోషంగా తినేవారం.
ఒక రోజు నాకు బాగా గుర్తు ఉంది. నెలాఖరు రోజులు అవి. నేను నాకు పనీర్ కూర కావాలని మొండికేశాను. ఆ నెలలో అన్నయ్యకు ఆరోగ్యం బాగా లేక డబ్బులు బాగా ఖర్చు అయ్యాయి. ఆ సంగతి నాకు ఏ మాత్రం అర్థం కాలేదు. నా మొండితనం, నా తిండి మాత్రమే నాకు ముఖ్యం అన్నట్టు పట్టు పట్టాను.
నాన్న నా కోరిక మేరకు పనీర్ కొనుక్కొని వచ్చాడు. కానీ అమ్మకు నా మీద కోపం వచ్చింది. అపుడు అమ్మ మనసులోని వేదన నాకు ఏమాత్రం అర్థం కాలేదు. పైగా నాన్నకి నేనంటే ఉన్నంత ఇష్టం అమ్మకి లేదని అనుకున్నాను.
కానీ ఈ రోజు ఆనాటి అమ్మ పరిస్థితిని చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాను. నాన్న తన మందులకు బదులుగా మా కోరికలను తీర్చేవాడు అని తెలిసి ఇపుడు గొంతు నులిమినట్టు అవుతుంది. అందుకే అమ్మ నాన్నతో కొట్లాడేది కాబోలు, నాన్న మందుల కన్నా పనీర్ కూర ముఖ్యం కాదు కదా.
పిల్లలకు బాల్యం అంటే మంచి ఆహారం, బొమ్మలు, ఆటలు, ఇంకా చక్కని జ్ఞాపకాలు మాత్రమే ఉండాలి. కానీ నేను నా పిల్లలకు ఇలాంటి బాల్యాన్ని ఇవ్వలేకపోతున్నా.
ఇలా ఆలోచనలలో మునిగి ఉన్న నేను నీరజ్ రాకతో ఈ లోకం లోకి వచ్చాను. అపుడు – “ఇలా జీవితాంతం గడపడం చాలా కష్టం. నువ్వు ఉధ్యోగం చేయవు, నన్ను కూడా చేయనివ్వవు. ఇలా అయితే కనీసం పిల్లలకు తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాము. నేను నాలుగు రోజులు అయినా ఉపవాసం ఉండగాలను. కానీ పిల్లలు చిన్నవారు. వారిని ఎలా పెంచాలి?” అన్నాను.
అలా అంటూండగానే ఒకసారిగా నీరజ్ ఆవేశంతో ఊగిపోతూ గట్టిగా అరవసాగాడు. “నీకు ఇంట్లో ఉండబుద్ధి కాదు, వీధులు పట్టుకొని తిరగాలి మరి. ఉద్యోగం పేరుతో బయట షికార్లు కావాలి. నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. నువ్వు ఆ రోజు షేక్ మాటలు విని ఆయనను సంతోషపెట్టి ఉంటే ఈ రోజు ఈ గతి మాకు పట్టి ఉండేది కాదు కదా. పెద్ద సతీ సావిత్రి లాగా ఫోజు పెట్టావు ఆ రోజు. నువ్వు ఏమీ పెద్ద అందగత్తెవి కూడా కాదు, మరి ఎందుకు నీకు అంతా టెక్కు? నీ అందం మీద అంతగా గర్వపడే లాగా ఏమీ లేవు నువ్వు.” అన్నాడు
నేను వింటూ ఉన్నాను. నేను ఏనాడూ వెంటనే సమాధానం, మాటకు మాట చెప్పి ఎరుగను. కొంచెం సమయం తీసుకొని గానీ మాట్లాడను. నీరజ్ అలాగే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మౌనంగా ఉండడం చూసి అతనికి మరింత ఆవేశం రాసాగింది. నా దగ్గరకు వచ్చి నా నుదుటిన్న ఉన్న సింధూరాన్ని తుడిచి వేశాడు. “నా పేరు, నా సహవాసం ఇక పై వద్దు. నా గురించి నువ్వు నుదుటన సిందూరం కూడా పెట్టుకోడం నాకిష్టం లేదు. నా తాళి కూడా తీసి వేయి. ఇక మీదట నేను నీతో ఉండదలుచు కోలేదు.” అన్నాడు.
ఈ రోజు నీరజ్ అన్నీ హద్దులను దాటివేశాడు. పదేళ్ళుగా అన్నీ భరించి అలిసిపోయాను. నా తప్పు లేకున్నా క్షమించమని ఎన్ని సార్లు నీరజ్‌ను అడిగినానో లెక్కలేదు. తాను ఎన్ని చేసినా అన్నిటినీ క్షమించినాను. కేవలం పిల్లల కొరకు నీరజ్ అన్నీ దురాలవాట్లను కూడా నేను భరించాను. మా అమ్మానాన్నలకు ముద్దుబిడ్డగా పెరిగిన నేను ఇలాంటి భర్తతో దుర్భర జీవితాన్ని చూశాను, ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు. అందుకు కేవలం మా అమ్మానాన్న ఇచ్చిన సంస్కారం తప్ప మరొకటి కాదు.
ఎప్పటి లాగానే ఈ రోజు కూడా అతన్ని వారించలేదు మరి. నిండా మునిగిన వాడికి చలి లేదు అన్నట్టు ఇంతకన్నా నా జీవితం పాడవటానికి ఇంకా ఏమీ మిగల్లేదు కూడా. ఏడుస్తూ “ఈ సిందూరాన్ని తుడిచేయ్, నా తాళి బొట్టు కూడా నువ్వే తీసేయి. వీటిని మోస్తూ మోస్తూ నేను కూడా అలిసి పోయాను.” అన్నాను
ఈ గోల పెరిగి పెద్దదై ఇంటి యజమాని వచ్చాడు. చిన్న మామయ్య గారు కూడా వచ్చారు. అందరూ నన్ను సమాధానపరచేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వారికి నేను చాలా మొండిదాన్ని అని తెలుసు, కానీ నేను పెళ్లి అయిన దగ్గర నుంచి పూర్తిగా నా చిన్నతనపు స్వభావాన్ని మరచిపోయాను. జీవితం ఎటు తీసుకొని వెళ్తే అటు వెళుతూ ఉన్నాను. ఇన్ని రోజులు నీరజ్ కూడా తనకు కావాల్సి వచ్చినట్టు నన్ను ఆడించాడు.
కానీ ఈరోజు నాలో సహనం పూర్తిగా చచ్చిపోయింది. నేను ఇక మీదట దాన్ని సహించబోను.
బాబాయ్ గారికి అర్థం అయింది నా పరిస్థితి. నన్ను వేరే గది లోకి తీసుకొని వెళ్ళి ప్రేమగా “ఇప్పుడు ఏం నిర్ణయం తీస్కున్నావు? నీరజ్‌తో కలిసి ఉంటావా? లేదా వేరేదైనా?” అని అడిగారు.
నేను – “బాబాయ్, నాకు ఇతనితో కలిసి జీవించాలని లేదు. గత పది సంవత్సరాల నుంచి నేను పడ్డ శారీరిక, మానసిక వేదనను మీకు మాటల్లో చెప్పలేను. గంగలో నిండా మునిగాను. నీరజ్ చేసిన నిర్వాకాలు చెప్పి మీ మనసు కష్టపెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు.” అన్నాను.
బాబాయ్ గారు నన్ను చిన్నతనం నుంచి చూశారు. నాన్నగారు కూడా నా గురించి ఆయనకు చెప్పేవారు నేనొక నిర్ణయం తీసుకున్నాను అంటే దానికి కట్టుబడి ఉంటాను అని. “అయింది ఏదో అయింది, ఇక మీదట నేను నా పిల్లల కోసం కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటూ ఉన్నాను. నేను వెనక్కు తిరిగి చూడాలని అనుకోవటం లేదు.” నేను అన్నాను.
అమ్మ నా చిన్నతనం నుంచి నా మొండితనం గురించి చెప్పేది. కానీ పెళ్లి అయ్యాక నేను నా మొండితనం పూర్తిగా మరచిపోయాను. ఒక్కోసారి కూడా నీరజ్‌కి ఎదురు జవాబు ఇవ్వడంలేదు సరికదా, నా దుఃఖాన్ని పెదవి చాటున దాచి జీవించాను. నీరజ్ నా సిందూరాన్ని తుడిచేసి, నా తాళి తీసే ప్రయత్నం చేసినప్పుడు కూడా – నీరజ్‌ను క్షమించమని అడగమని నాకే చెబుతున్నారు. నేను ఏ తప్పు చేయకుండా కూడా పడ్డ మానసిక వేదనను ఎవరూ అర్థం చేసుకోలేరు కూడా. కానీ నాలో ఓపిక నశించి పోయింది. నాలోని మొండితనం బుసలు కొడుతూ పైకి లేచింది. “చాలా క్షమాపణలు అడిగాను, ఇక మీదట నాకు అడిగే శక్తి, ఓపిక లేవు, నా మానాన నన్ను బ్రతుకనివ్వండి ” అన్నాను నేను.
ఇంత పెద్ద నిర్ణయం ఒక నిమిషంలో ఎలా? ఎవరైనా తీసుకోగలరా? ఆ రోజు అలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగాను? ఏదో ఒక శక్తి నాలో వచ్చినట్టు, పూనకం పూనిన దానిలా చెప్పాను. కానీ ఒక ఆడది, ఇద్దరు పిల్లలను పెట్టుకొని జీవించడం అంటే మాటలు కాదు. కానీ నా దగ్గర ఏదైనా ఉంటేగా కోల్పోవటానికి, కాబట్టి నాకు భయం లేదు. అనే ఒక మొండి దైర్యం తప్ప నా దగ్గర ఏదీ లేదు. నా దగ్గర దాచుకునేందుకు డబ్బులు లేవు, నగలు లేవు. నా ఆస్తి అంతా నా ఇద్దరు పిల్లలే.
నా జీవితం ఒక తెరచిన పుస్తకం.
ఆ పుస్తకం లోని ప్రతి పేజీ నా దుఃఖానికి అద్దం పడుతుంది.
ప్రతి పేజీ ఇంకొకరికి జీవిత పాఠమే.
నీరజ్ నా జీవితాన్ని ఒక ఆటగా మార్చి వేశాడు. నా జీవితం నవ్వులపాలు కావటానికి నేను కూడా కారణం అయ్యానేమో. ఆనాడే నేను ఎదురు తిరిగి ఉంటే ఇంత జరిగేది కాదేమో. నాకంటూ నా జీవితంలో ఏదీ మిగల లేదు. నా కుటుంబం ఏనాడో నన్ను దూరం చేసుకుంది. మా అమ్మానాన్నలకు కూడా నేను ఏనాడో పరాయిదాన్ని అయిపోయాను. జీవితం అంటేనే అర్థం కానీ సమయంలో జీవితపు చేదు అనుభవాల విషాన్ని మింగాను.
పోగొట్టుకునేందుకు ఏదీ లేనప్పుడు, వస్తుందని ఆశ కూడా లేదు. నా గురించి నేను ఏనాడు ఆలోచన కూడా చేయనే లేదు. ఇప్పుడు నేను కేవలం నా పిల్లల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాను.
ఇపుడు నా మనసు స్థిరంగా ఉంది. నా నిర్ణయాలలో ఆటుపోట్లు లేవు. అలలు లేని సాగరం లాగా నా మనసు ప్రశాంతంగా అనిపించింది. అప్పుడు నీరజ్ కోపంతో గది లోకి వచ్చి “నువ్వు త్క్షణమే నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు, పిల్లలు నాతో ఉంటారు” అన్నాడు.
నేను ఒక క్షణం అవాక్కయిపోయి నీరజ్‌ను చూడసాగాను. ఏనాడూ పిల్లలు తిన్నారా? లేదా? అని అడిగలేదు. ఇపుడు పిల్లలు తనతో ఉంటారు అని అంటూ ఉన్నాడు. కనీసం వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారో కూడా నీరజ్‌కు తెలియదు, అలాంటిది పిల్లల బరువు బాధ్యతల గురించి నీరజ్ మాట్లాడుతూ ఉంటే నవ్వు వచ్చింది.
అక్కడే ఉన్న ఇంటి ఓనర్ బాబాయ్ గారు – “ఈ ఇల్లు నీది ఎప్పుడయింది? నువ్వు ఎవరు కావ్యను ఇంటి నుంచి వెళ్ళు అనేందుకు? పైగా పిల్లలు ఎప్పుడు నీ పిల్లలు మాత్రమే అయ్యారు? నీకు ఎక్కడికి పోవాలనిపిస్తే అక్కడికి వెళ్ళు. కావ్య నా కూతురు, ఆమె ఇక్కడే ఉంటుంది. ఇది నా బిడ్డ ఇల్లు. పిల్లలు కూడా తనతోనే ఉంటారు. ఇంకోసారి కావ్య మీద చేయి వేస్తే బాగుండదు.” అన్నారు.
ఇంటి ఓనర్ మాటలకు కోపం వచ్చినా చేసేది లేక రోషంతో నీరజ్ “ఇప్పుడు వెళుతున్నాను, నేను వచ్చి నా పిల్లలను తీసుకొని పోతాను, అప్పుడు ఏ దేవుడికి చెప్పుకుంటావో నేను చూస్తాను”.. అన్నాడు.
మా ఇంటి ఓనర్ తల్లి గారు పిల్లలిద్దరినీ అక్కున చేర్చుకొని గది లోపలికి తీసుకొని వెళ్లింది. ఇక నేను… శూన్యం లోకి చూస్తూ నుంచున్నాను.
***
నా జీవితం లోని రెండు పెద్ద రాత్రులు అంటే ఆ రోజు రాత్రి, నేటి రాత్రి. ఆ రాత్రులు నా జీవితం మొత్తాన్ని ఒక యాత్ర లాగా నా కళ్ల ముందు నిలిపిన రాత్రులు.
నా జీవితం మొత్తం ఒక సినిమా లాగా నా కళ్ల ముందు నిలిచింది. నీరజ్‌తో నా పరిచయం, జైల్లో అమ్మానాన్నలను ప్రశ్నించిన తీరు. స్త్రీ సంరక్షణా గృహం లోని హింస, నీరజ్‌తో బలవంతపు పెళ్లి, పెళ్లి తరువాత భయంకరమైన రాత్రులు, జీవితంతో ఒప్పందం, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నా మాతృత్వాన్ని అనుభవించలేని పేదరికం, నీరజ్ మోసాలు, నీరజ్ దూరలవాట్లు, ముఖ్యంగా ఏ స్త్రీ సహించలేని అంటే తన భర్తను ఇంకో స్త్రీ తో పంచుకోవటం, నీరజ్ రాసలీలలు, ఏ తప్పు చేయకున్నా కూడా నడిరాత్రి ఇంటి నుంచి గెంటివేయబడటం, షేక్‌కు తన భార్యను అప్పజెప్పే ప్రయత్నం, ఇన్ని పరిస్థితులను తనను తాను సంభాళించుకుంటూ వెళ్ళే కావ్య.
ఈ రోజు వీటన్నింటి నుంచి ముక్తి పొందుతున్న కావ్య,
తనకు తాను తెచ్చుకున్న స్వతంత్రాన్ని అనుభవిస్తున్న కావ్య,
మొదటి సారిగా స్వేచ్ఛా వాయువు తీసుకుంటున్న కావ్య!
ఉండుండి అనిపించసాగింది, నీరజ్‌ను నేను కలిసానా? అది కేవలం భ్రమనా? ఏదో ఒక భయం. నీరజ్‌కు ఉన్న పలుకుబడితో పిల్లలను తీసుకొని వెళ్తాడేమో అని భయంగా ఉంది. పిల్లలిద్దరూ నిద్రలో ఉన్నారు, వారిని చూస్తూ ఆలోచనల తరంగాలలో మునిగి తేలుతూ రాత్రంతా గడిపాను.
వీటన్నిటి మధ్య మొదటిసారిగా ఏదో స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్న భావన, ఎంతో పెద్ద బరువు గుండె నుంచి తీసివేసిన భావన కలుగసాగాయి. కానీ ఈ స్వతంత్రం బలవంతపు పెళ్లి నుంచి మాత్రమే కానీ న్యాయస్థానం పరంగా ఇంకా నేను నీరజ్ భార్యాభర్తలు గానే ఉన్నాము.
కానీ నేడు నేను అనుభవిస్తున్న స్వేచ్ఛ ఎటువంటింది అంటే నాకిష్టమైన విధంగా మాట్లాడే స్వేచ్ఛ, నాకిష్టమైన విధంగా ఏదైనా చేసే స్వేచ్ఛ. ఇంకా చెప్పాలంటే ఏది చేయాలంటే అది చేసే స్వేచ్ఛ. మనసు నిబ్బరంగా ఉంది. ఏదో నాటకం చూసే ప్రేక్షకురాలి లాగా నా జీవితాన్నీ నేను చూసుకుంటూ ఉన్నాను. ఈ రోజు గడిచిన రోజుల గురించి చింత లేదు, రేపటి భయం లేని ఒక నిష్కలమైన స్థితిలో మనసు, దేహం ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాయి.
తెల్లవారింది, ఇపుడు ఎలా, ఏమిటి?
ఏమో, నేను లేనపుడు నీరజ్ నా పిల్లలను ఎత్తుకొని పోతే? వాళ్ళు లేకుండా నేను నా జీవితాన్ని ఊహించనూ లేను ఏనాడు.
మా అమ్మానాన్నల నుంచి విడిపోయి, నా అస్తిత్వాన్ని కోల్పోయి పది సంవత్సరాలు జీవించాను. ఒక దశాబ్దం అంటే తక్కువ కాలం కూడా కాదు, ఒక దశాబ్దంలో ఎన్నో మార్పులు వస్తాయి. అలాగే నా జీవితంలో కూడా ఒక దశాబ్దం ఇలా గడిచింది అని నేను అనుకొను. అందులోని ప్రతి రోజు నాకు ఒక పాఠం, గుణపాఠాన్ని నేర్పాయి.
ఈ రోజు నీరజ్ నా పిల్లలను నా నుంచి తీసుకొని పోతాడేమో అన్న భయానికి నాకు వణుకు పుడుతుంది. మరి నన్ను ఎంతో ప్రేమగా పెంచిన మా అమ్మానాన్నల ముందే అలా బలవంతంగా ఎత్తుకొని పోతూ ఉంటే వారి మనసు ఎంత క్షోభించి ఉంటుంది కదా. వారి భావనలను నేడు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నాను.
లెబనాన్ రచయిత ఖలీల్ గిబ్రాన్ చెప్పిన- “పిల్లలను తల్లి తండ్రులు కనరు, పిల్లలే తల్లి తండ్రులను ఎంపిక చేసుకుంటారు. వారే తల్లి తండ్రులకు కావలసిన పాఠాలు కూడా నేర్పిస్తారు” అని ఎక్కడో చదివిన మాటలు కావ్యకు గుర్తు రాసాగాయి.
పక్కలో పడుకున్న నీరజ నిద్రలో కదిలింది, నా ఆలోచనల తరంగాలనుంచి బయట పడ్డాను. లేచి ఇంటిని తేరిపార చూశాను. ఇల్లంతా చిందరవందరగా ఉంది. అద్దంలో నా మొహాన్ని చూసుకున్నా. నా మొఖం నాకు కొత్తగా అనిపించిది. కాళ్ళు వాచిపోవటం అనేది నాకు కొత్త కాదు.
ఆ రోజు మాత్రం కొత్తగా నా కళ్ళలో ఎన్నో ప్రశ్నలు, వాటికి జవాబు వెదికే మనసు…..
రేపటి గురించిన భయం ఒక వైపు, రేపటిని సర్ది బతుకగలనన్న నమ్మకం ఒక వైపు…
వేడిగా ఒక టీ తాగితే కానీ శరీరం మాట వినదు అనుకుంటూ వంటిట్లోకి నడిచాను. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది.
తలుపు తీసి చూడాలంటే కూడా ఏదో భయం, నీరజ్ ఏమైనా వచ్చి పిల్లలను తీసుకొని పోతే అన్న భయంతో ఉన్నా. అంతలో బయటినుంచి మాటలు వినిపించాయి. “అమ్మా, కావ్యా, తలుపు తీయి” నాన్న గొంతు విని ఒక్కసారిగా పరిగెట్టుకొని వెళ్ళి తలుపు తీశాను. కానీ చిన్నప్పటి లాగా నాన్నను కౌగిలించుకోలేక పోయాను. నాన్న మొఖం పాలిపోయి ఉంది.
దుఃఖం, బాధా ఆయన ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నాయి.
ఆయన కళ్ళు కూడా రాత్రంతా నిద్ర పోయినట్టు లేవు. నాన్నగారితో పాటు నా చిన్న తమ్ముడు కూడా వచ్చాడు. వాడి చేతిలో యేదో ఉంది, బహుశా టిఫిన్ మరియు కొన్ని పళ్ళు ఉండొచ్చు. అపుడు అనిపించింది బాబాయ్ గారు రాత్రే చెప్పి ఉంటారు అని. నాన్నగారి కాళ్ళకు నమస్కారం చేసి ఇంట్లోకి తీసేకొని వెళ్ళాను.
నాన్న నన్ను ఏమీ అడుగలేదు. అడిగి ఉంటే ఏమి చెప్పాలి, ఏమి దాచాలి అన్న ప్రశ్న వచ్చేదేమో. ఇపుడు నా జీవితం ఏదీ దాచటానికి వీలు లేని పుస్తకమే అయింది. ఆ పుస్తకం లోని పేజీలు కూడా చెల్లాచెదురయ్యాయి.
మా నాన్నగారు చాలా తెలివైనవారు; పైగా నేనంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ కూడా. నాతో పేరుకు దూరంగా ఉన్నమాటే కానీ నా చేయి ఆయన ఏనాడూ విడువలేదు. ప్రతి నిమిషానికి సంబంధించిన వివరాలు తెల్సుకునేవారు. నాకు కూడా వాటి గురించిన సమాచారాలు తెలిసేవి. నాన్నకు నా మీద ఉన్న అనురాగంతో నా మనసు ఉప్పొంగి పోయేది. నాన్నగారు – “పిల్లలను తీసుకొని ఇంటికి పోదాం పద” అన్నారు. నాన్న అలా అనేటప్పటికి నా కంటి నీరు ఏదో ఆనకట్ట తెగిన నది లాగా పొంగటం ప్రారంభించింది. ఆ ప్రవాహానికి అడ్డు లేదు నేడు. నేను ఆ రోజు వెక్కి వెక్కి ఏడవాలి అని అనిపించింది కానీ నా చిన్న తమ్ముడు కూడా ఉండటంతో తమాయించుకున్నాను.
నాన్న భుజాల మీద తల ఉంచి నింపాదిగా నిద్ర పోయిన క్షణాలు, ప్రతి బాధకు ఆయన భుజాల మీద ఓదార్పు పొందిన క్షణాలు అన్నీ గుర్తుకు రాసాగాయి. నా కన్నీటి విలువ నాన్నగారి కన్నా ఇంకా ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. నా బాధలు చూసినా ఆయన పెదవుల మీద ఒక నైరాశ్యంతో కూడిన నవ్వు పులుముకొని నాతో నవ్వుతూ మాట్లాడేవారు నాన్న.
నేటి వరకు ఇంటిలో నేను కార్చిన కన్నీరు విలువ లేనిదిగా ఉండేది. నా కన్నీరుని చూసిన వారు, వాటిని అర్థం చేసుకునేవారూ ఎవరూ లేరు.
ఆరోజు నాన్న నన్ను ఇంటికి రమ్మని చెప్పిన క్షణంలో కూడా ఏడ్చాను. కానీ నాన్న బలహీనమైన భుజాల పైన నాతో పాటు నా ఇద్దరి పిల్లల బరువు వేయటం ఎంతవరకు సబబు అని నాకనిపిచ్చింది. వయసు మళ్లిన తండ్రికి ఆసరాగా లేకపోయినా ఆయనకు మరింతగా భారం కావటం నాకు ఇష్టం లేదు. అన్నయ్య కూడా ఉద్యోగం చేస్తున్నాడు. నాన్న రిటైరెమెంట్ తర్వాత అన్నయ్యే ఇంటి బరువు భాధ్యతలను చూసుకుంటూ ఉన్నాడు. ఇపుడు నేను కూడా ఆ లిస్ట్‌లో చేరి అన్నయ్యకు మరింత బరువు పెంచడం నాకు సుతారామూ ఇష్టం లేదు.
మా బరువు బాధ్యతలు చూసుకోవాలసిన నీరజ్ ఏనాడూ వాటిని తన బాధ్యతలుగా భావించక పోవటం నా దురదృష్టం. ఈ పది సంవత్సరాలలో నేను తన నుంచి ఏనాడూ ఏదీ ఆశించలేదు. నీరజ్‌కి నేను ఏనాడూ తన బాధ్యతల గురించి గుర్తు చేయలేదు, అటువంటిది నాన్న, అన్నయ్యలు ఎందుకు అనవసరంగా నా వల్ల సతమతమవ్వాలి?
నాన్న తన బాధ్యతగా నాకు మంచి చదువు చెప్పించారు, సంస్కారం నేర్పించారు. తన చేతనయినట్టు నన్ను చక్కగా చూసుకున్నారు. తన చేతిలో నేను ఉన్నంత వరకూ నాకు ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నారు. కానీ ఈ రోజు నేను ఆయన బాధ్యత కాదు. ఆయనకు బరువవటం నాకు ధర్మం కాదు.
తల్లిదండ్రులు పిల్లల జీవితానికి జీవితాంతం బాధ్యులు కారు. వారికి చదువు, సంస్కారాలు నేర్పి వారిని సరి అయిన దారిలో నడిపేవారకు మాత్రమే వారి బాధ్యత ఉంటుంది. అంతే గానీ వారి జీవితాంతం పిల్లల కొరకు పోరాటం చేయరాదు. ప్రకృతి లోని అన్నీ ప్రాణుల వలె, పక్షుల వలె, మనుషులు కూడా తమ సంతానానికి, రెక్కలు వచ్చేవరకు మాత్రమే ఆసరాగా ఉండాలి. పక్షి ఒకసారి ఎగరటం నేర్చుకుందో ఆ రోజటి నుంచి తల్లి తండ్రుల పాత్ర ముగుస్తుందనే చెప్పాలి.
నేను రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి కూడా వచ్చి ఉన్నందున నాన్నతో – “లేదు నాన్న, ఇప్పుడు నేను మీతో ఇంటికి రాలేను. మీరు నాకు చెప్పించిన చదువు, సంస్కారాలు చాలు నాకు నా కాళ్ళ మీద నిలబడడానికి. నేను నా పిల్లలను చక్కగా చదివించి ప్రయోజకులను చేయగలనన్న నమ్మకం నాకు ఉంది. ఏదైనా ఉద్యోగం చేసి బ్రతుకగలను.” అన్నాను.
అన్నయ్య కూడా నన్ను ఇంటికి రమ్మని అన్నారు – “గుడియా? ఎలా బ్రతుకుతావు? నువ్వొక్కదానివే కాదు, నీతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.”
నా మొండితనం ముందు అందరూ ఓడిపోయారు. కానీ వారందరి మద్దతు నాకు ఉంది. వారందరికి తెలుసు, ఇది నేను అనుకున్న్నంత సులభం కాదు అని. నాకు సరి అయిన ఉద్యోగం లేదు, డబ్బులు కూడా లేవు.
ఇంటి యజమాని నన్ను తన కూతురు లాగా చూసుకునేవారు. వారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారు పిల్లలను బాగా చూసుకునేవారు, ఆడించేవారు. కానీ వారికి కూడా నీరజ్ ఎప్పుడు వస్తాడో అని భయం ఉండేది. పిల్లలను స్కూల్‌కు పంపించేందుకు కూడా భయపడేదాన్ని. నేను కూడా చాలా రోజులు ఇంటిపట్టునే ఉన్నాను. ఇంటి ఓనర్ బాబాయ్ నన్ను ముందు వెనుక చూడకుండా తలుపు తీయవద్దు అని చెప్పేవారు.
ఆయన లాగా నీరజ్ బాబాయ్ గారు కూడా నా గురించి బాధ పడేవారు. ఆయన ఇపుడు సన్యాసం తీసుకున్నారు.
మా వదిన గారు నాకొరకు, పిల్లల కొరకు రకరకాలైన వంటలు చేసి తెచ్చేది. అన్నయ్య పిల్లల కొరకు పాలు, పండ్లు తెచ్చేవారు. నాన్న కూడా అప్పుడప్పుడు వచ్చేవారు.
భయపడినట్టు నీరజ్ రాలేదు కానీ నాలుగు రోజుల తరువాత మా మరిది వచ్చాడు. అతను నేను నీరజ్‌ని క్షమాపణ అడగాలని అన్నాడు.
“క్షమాపణా? ఎందుకు అడగాలి?” అని నేను అన్నాను.
వాడి దగ్గర ఆ ప్రశ్నకు జవాబు లేదు. వాడికి మొదలే నా మీద కోపంగా ఉంది, వాడు ఇంకా ఆ పల్లెలో జరిగిన విషయాన్ని మరచి పోలేదు అనుకుంటా.
అప్పుడు వాడు ఏం చేశాడో తెలుసా, వెంటనే ఇంటి ఓనర్ బాబాయ్ దగ్గరకు వెళ్ళి నన్ను, పిల్లలను ఇంటి నుంచి తరిమి వేయమని చెప్పాడు. అపుడు నేను తప్పకుండా నీరజ్ పంచన చేరతాను అని వాడి అభిప్రాయం.
బాబాయ్ గారు వాడిని చీవాట్లు పెట్టి -“నువ్వు మీ అన్నకు నచ్చచెప్పాల్సింది పోయి, ఒక ఆడదాన్ని, పిల్లలను బయటకు తరిమి వేయమని చెప్పడానికి సిగ్గుగా లేదూ?” అన్నారు.
మా మరిది పురుష అహంకారం బుసలు కొట్టింది. “మా అన్న మగవాడు, ఈ పనికి మాలిన ఆడది తనను తాను ఏం అనుకుంటోంది? ఇప్పుడు నా మాట వినలేదు అంటే దీని ఫలితం మీరందరూ అనుభవిస్తారు మరి” అని కోపంతో అన్నాడు.
వాడు బాబాయ్ గారి సంగతి తెలియకుండా నోటికి వచ్చింది వాగుతున్నాడు. బాబాయ్ గారు “నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఇంకోసారి నువ్వు గానీ నీ అన్న గానీ మా ఇంటికి వస్తే బాగుండదు. ఇప్పుడే మా ఇంట్లోంచి బయటకు నడు, ఇంకోసారి ఈ వీధిలో కనిపిస్తే కూడా బాగుండదు, ఏమనుకుంటున్నావో, నాకు కూడా చాలా మంది తెలుసు, ఏమి చేయాలో చేస్తాను, పద” అరుస్తూ అన్నారు.
మరిది వెళ్ళి పోయాడు, నా మనసులో భయం ఇంకా పెరిగింది. వాళ్ళు అందరూ గూండాలు, రౌడీలతో సంబంధం ఉన్నవారు. నా పిల్లలకు వీరి వల్ల ఏ ఆపదా రాకూడదు అని నా భయం.
నాన్నకు ఎంతసేపూ నా ఆలోచనే. వారు తన మిత్రులతో నా ఉద్యోగం గురించి అడిగేవారు. ఒక మిత్రుడు చెప్పిన విధంగా ఒక యూనివర్సిటీ లోని పేపర్లు, లెక్చర్ల వివరాలను తయారుచేసే పని దొరికింది. మరలా కొంత డబ్బులు రాసాగాయి. పిల్లలను స్కూల్‌కు పంపడం మొదలు పెట్టాను. కానీ ఆ పని నిమిత్తం రోజంతా బయట ఉండవలసి వచ్చేది.
పిల్లలు స్కూల్‌కు వెళ్ళిన తరువాత నేను పని చేసేందుకు వెళ్ళేదాన్ని. పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేసమయానికి నేను వచ్చేసేదాన్ని.
ఎలాగో ఇల్లు గడుస్తూ ఉంది. కొంచెం డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. రోజూ ఒక పూట భోజనం, అప్పుడప్పుడూ రెండు పూటలూ తినగలిగేదాన్ని. పిల్లలకు అమ్మ ఏదైనా తినిపిస్తుంది. నా పరిస్థితి ఆమెకు తెలుసు. నేను లడ్డూలు బాగా చేసేదాన్ని. అప్పుడప్పుడూ లడ్లు తయారు చేయమని కొందరు ఆర్డర్లు ఇచ్చేవారు. వారి ఆర్డరు చేసిన తరువాత కొన్ని నా పిల్లలకు కూడా దొరికేవి. జీవితం కూడా ఎంతో విచిత్రమైనది కదా. ఉన్నవారికి రంగుల కల అయితే లేని వారికి పగటి కల.
కొన్ని రోజుల తరువాత ఒక ట్యూషన్ దొరికింది. ఒక చిన్న అబ్బాయి, వాడు చాలా గారాబంగా పెరిగిన అబ్బాయి. వాడికి చదువు చెప్పించడం చాలా కష్టమైన విషయమే సరి, కానీ నేను నాకున్న అనుభవంతో వాడికి పాఠం చెప్పగలిగాను. వాడితో ఆట ఆడుతూ, పాట పాడుతూ, తినిపిస్తూ ఇలా వాడితో పాటు ఉంటూ వాడికి పాఠం చెప్పేదాన్ని. అన్నీ చేసినా వాడు కొంత మాత్రమే నేర్చుకునేవాడు. నాకు సమయం వ్యర్థం అయ్యేది. కానీ డబ్బు కొరకు ఆ పాట్లు తప్పలేదు.
కొన్ని రోజుల తరువాత అదే ట్యూషన్‌లో ఇంకొక అధికారి పరిచయం అయ్యారు. వారి ఇద్దరు కూతుర్లకు కూడా ట్యూషన్ కావాలి అని అన్నారు. వారికి కూడా ట్యూషన్ మొదలు పెట్టాను.
ఈ రెండు ట్యూషన్లు ముగించి ఇంటికి రావటానికి సాయంత్రం అయ్యేది. ఇంటి ఓనర్ గారి అమ్మాయిలు పిల్లలిద్దరినీ బాగా చూసుకునేవారు. వారికి తినిపించి, తాగించి, వారిని చక్కగా చూసుకునేవారు.
ఇంకా భూమి మీద ఇలాంటి వారి వల్లనే ఏమో సూర్యచంద్రులు సకాలంలో ఉదయిస్తున్నారు, సమయానికి వర్షాలు వస్తూ ఉన్నాయనిపించేది. నా జీవిత నౌక వీరి దయ వల్ల కొంచెం కొంచెం ముందుకు సాగుతూ ఉంది.
నీరజ్ ఫ్రెండ్స్ నాకు చాలా దగ్గర అయ్యారు. నాకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా వారు చేసేవారు. నవలను చెక్ చేస్తూ ఉన్న సమయంలో నాకు ఒక ప్రెస్‌వాళ్ళతో పరిచయం ఏర్పడింది. నేను అక్కడ ప్రూఫ్ రీడింగ్ కూడా చేయటం మొదలు పెట్టాను. ఇలాగే మరి కొన్ని ప్రూఫ్ రీడింగ్ ఆర్డర్స్ నాకు రావటం మొదలు అయింది.
రాత్రంతా మేలుకొని పని పూర్తి చేసే గుణం ఉన్నందున నా పనిని అందరూ మెచ్చుకునేవారు. ఇపుడు పని ఎక్కువగా సమయం తక్కువగా అనిపిస్తుంది. నా యోగ్యత పెరుగుతూ ఉంది, నా పని ఒత్తిడి కూడా పెరుగుతూ పోయింది. నేను ఇపుడు యూనివర్సిటీ కొరకు గైడ్ చేయటానికి ప్రారంభించాను
ఇపుడు వేరే సమస్య లేదు కానీ కేవలం నేను నా పిల్లలకు సమయం ఇవ్వలేకపోతున్నాను. కానీ అది నా అసహాయత కూడా. పని చేయనే చేయాలి. నా పిల్లలు బాల్యంలోనే పెద్దవారు అయిపోయినట్టు అనిపిస్తుంది. వారు నన్ను ఏదీ కావాల్ని అడిగేవారు కాదు. వారికి నా మీద కోపం కానీ ఫిర్యాదు కానీ ఉండేవి కావు.
వదిన స్నేహం కూడా నన్ను చాలా సంతోషం పెట్టింది. ఈ మధ్య కాలంలో నాన్నగారు చాలా క్రుంగిపోయారు. ఆయన ఆరోగ్యం చాలా కుంటుబడింది, ఆయన ఒంటరితనం తోడు నా పరిస్థితి కూడా ఆయన మనసు బాధకు కారణం అయింది. ఆయన అనారోగ్యంగా కనిపిస్తున్నారు.
దీపావళి పండుగ సమయం, అన్నీ ప్రెస్ వాళ్ళు నా స్థితి గురించి తెలిసిన వాళ్ళే. అందరూ మా ఇంటికి స్వీట్స్ పంపించారు. నేను ఇంటిలో లేను. సాయంత్రం అయింది. చినుకులు పడుతూ ఉన్నాయి. ఇంట్లో మరియు బయట వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది.
ఇంటికి వస్తూనే పిల్లల కేరింతలు విని మనసు పులకరించింది. ఎంతో హాయిగా అనిపించింది. ఇంట్లోకి కాలు పెడుతూనే గుండె గుభిల్లుమంది. ఎదురుగా నీరజ్ కూర్చొని ఉన్నాడు.
నేను మానసికంగా బాగా దైర్యంగా ఉండటం వల్ల నాకు పెద్దగా భయం కలుగలేదు. నేను ఏమీ అనలేదు.
అంతలో నీరజ్ – “కొంచెం టీ ఇస్తావా?” అని అడిగాడు.
నేను మెల్లిగా వంటింట్లోకి వెళ్ళి టీ చేసి తెచ్చాను. రాత్రి చాలా సేపటి వరకు పిల్లలతో ఆడుతూ ఉన్నాడు. నేను అనుకున్నా, ఇక వెళ్ళి పోతాడు అని, కానీ వెళ్ళలేదు. అతనిమనసులో ఇంకా వేరే ఏదో ప్లాన్ ఉంది. పిల్లలు నిద్ర పోతూనే నా దగ్గరికి వచ్చాడు. ”నా దగ్గరికి ఇప్పుడు ఎందుకు వచ్చావు?” అడిగాను.
“నీ మొగుణ్ణి నేను, నీ మీద నాకు హక్కు ఉంది” అన్నాడు.
నీరజ్ మాటకు నాకు కోపం రాక పోగా నవ్వు వచ్చ్జింది. “నా మీద హక్కు ఒక సంవత్సరం క్రితమే పోగొట్టుకున్నావు. ఇక కర్తవ్యాల మాట అంటే నువ్వు నీ కర్తవ్యాలను ఎంత బాగా నిర్వర్తించావో నీకే బాగా తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు.” అన్నాను.
(సశేషం)