[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని సరికొత్త ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]స[/dropcap]త్రం చాలా బాగుంది. విశాలంగా దేవతలందరూ ఒకవైపు కొలువుదీరి ఉన్నారు. వినాయకుడు, శివుడు, లక్ష్మీనారాయణులు, దత్తాత్రేయుడు, ప్రతి ఒక్కరికీ ఒక చిన్న గుడి, ఒక పూజారి.
‘స్టోర్ రూం’లో అన్నీ సర్దుకున్నారు. స్టోర్ రూం ఇన్‌ఛార్జి డోన్ రాముడు. వంటశాలలో గాడిపొయ్యిలు రడీగా ఉన్నాయి. నారాయణప్ప తన బృందంతో దిగిపోయాడు. ఓర్వకల్లుకు మనిషిని పంపి అరిటాకుల కట్టలు తెప్పించారు. వాటిని భోజనాలకు, టిఫిన్లకు వేరు సైజుల్లో కట్ చేసి పెట్టుకున్నారు వంటవాళ్లు. మరుసటిరోజు పెళ్లికూతుర్ని చేశారు వాగ్దేవిని. పెండ్లికళ పూర్తిగా సంతరించుకుందామె వదనంలో.
సాయంత్రానికి పెళ్లివారు దిగారు. కడపనుండి గుత్తి వరకు దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి, గుత్తినుండి బస్సులో వచ్చారు. బస్టాండు నుండి జట్కాల్లో రిక్షాల్లో వాళ్లను విడిదికి తీసుకువచ్చారు. సత్రానికి ఒకవైపు మూడు గదులు వారికి విడిదిగా కేటాయించారు. విడిదిలో వారు దిగి ముఖాలు కడుక్కునే సరికి కాఫీలు పట్టించుకొని వెళ్లారు. పతంజలి, వసుధ అందరికీ గ్లాసులో కాఫీ పోసి అందించారు. అప్పటికెవరికీ ‘షుగర్లు’ లేవు. కాబట్టి చేదు కాఫీ ఎవరూ అడగలేదు. చిన్నపిల్లలకు పాలు కూడ సప్లయ్ చేశారు.
రామ్మూర్తి పతంజలిని చూసి నవ్వుతూ పలుకరించాడు. “ఏమోయ్! బావమరిదీ! ఎలా వున్నావు” అంటూ భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు. అతని స్పర్శ వెచ్చగా, ఆత్మీయంగా అనిపించింది. పతంజలి వెంటే తిరుగుతున్న వసుధను చూచి “ఎవరీ పిల్ల?” అన్నాడు.
“మా మేనత్త కూతురు. వసుధ” అన్నాడు పతంజలి వసుధను చేయిపట్టి ముందుకు లాగుతూ.
“నమస్కారమండి!” అన్నదా అమ్మాయి వినయంగా.
“వెరీగుడ్!’ అన్నాడు రామ్మూర్తి. “బావకు ‘వెరీగుడ్’ అనేది ఊతపదంలా ఉందే” అనుకున్నాడు పతంజలి.
“ఊ! అయితే ఏమిటి సంగతి?” అన్నాడు పెళ్లికొడుకు వాళ్లిద్దరివైపు సాభిప్రాయంగా చూస్తూ, కళ్లెగరేస్తూ.
ఇద్దరూ సిగ్గుపడ్డారు.
టిఫిన్లయ్యాయి. గోధుమరవ్వ (బన్సీ రవ్వ అంటారు) ఉప్మా, చట్నీ, పొడి, నెయ్యి, గుండిగల్లో చేయడం వల్ల అద్భుతంగా ఉంది. పెళ్లివారు ముఫ్పై నలభైమంది ఉంటారు. ఆడపెళ్లివారు దాదాపు నూరు మంది. ముహూర్తం రోజుకు ఊరివాళ్లు అంతా కలిసి రెండు వందల యాభై మంది అవ్వొచ్చుననుకున్నారు.
9 గంటలకు ‘ఎదుర్కోళ్లు’ వేడుక ప్రారంభించారు. వంద అడుగుల దూరం ఉండేలా ఒకవైపు పెళ్లికొడుకు బృందం, ఒకవైపు పెళ్లికూతురి బృందం. వాగ్దేవి వంగపండు రంగు పట్టుచీరలో మెరిసిపోతుంది. మెగలిపూలతో జడకుట్టారు. రామ్మూర్తి స్నఫ్‌కలర్ ప్యాంటు, తెల్లని పాలనురగ లాంటి టెరికాటన్ షర్టు వేసుకొని హుందాగా ఉన్నాడు.
ఇక మొదలయింది హడావుడి. అమ్మాయిని ‘నాలుగు అడుగులు వేయించండని’ వాళ్లూ, అబ్బాయే ముందుకు రావాలని వీళ్లూ. వాళ్లవైపు ఒకాయన గడుగ్గాయిలా ఉన్నాడు. ఎదుర్కోళ్లు జరిపించటంలో ఎక్స్‌పర్ట్‌లా ఉన్నాడు.
“మేం కడపనుంచి సుమారు నూట యాభై మైళ్లు వచ్చిండాం. మీరే రావాల ముందుకు” అని అరుస్తున్నాడు.
పెళ్లికూతురి వైపు డోన్ రాముడు చిన్నాన్న రంగంలోకి దిగాడు.
“నాయనా! రెండడుగులు వేయి. భోజనాలకు వేళవుతుంది” అన్నాడు రామ్మూర్తి దగ్గరకు వెళ్లి.
రామ్మూర్తి ఒక అడుగు వేశాడు. వెంటనే అడ్డుకున్నాడు చాలని. పెళ్లికూతురి దగ్గరకు వెళ్లి “ఏం అమ్మాయీ, ఇప్పుడే ఇంత బెట్టు చేస్తే ముందు ముందు మావాడిని మాట్లాడనిచ్చేట్టులేవే” అన్నాడు సీరియస్‌గా వాగ్దేవి బెదిరిపోయి తల్లివైపు చూసింది. తల్లీతండ్రీ నవ్వుతూండటం చూసి నిమ్మళపడింది.
అట్లా అటులాగి యిటు లాగి పదడగుల దూరంలోకి వచ్చారిద్దరు. అక్కడ పంతాలు తారాస్థాయికి చేరాయి. మార్కండేయ శర్మ కూతురు చేయిపట్టుకుని నాలుగడుగులు వేయించాడు. రామ్మూర్తి రెండడుగులు వేశాడు. వసుధ ప్రక్కనే నిలబడి.
“మామా, ఇంక చాలు. వదినె చాలా అడుగులు వేసింది” అన్నది.
వధూవరులిద్దరూ తనివి తీరా చూసుకుందామంటే జనం అడ్డంవస్తున్నారు. అప్పటికి ఫోటోలు వీడియోల హడావుడి పెళ్లి తంతను అధిగమించే పరిస్థితి ఇంకా రాలేదు.
పతంజలి రామ్మూర్తి వద్దకు వెళ్లి, “బావా! రండి! ప్లీజ్!” అన్నాడు. ప్రాధేయపడుతూ. అదే సమయానికి వాగ్దేవి ఒక చూపు విసిరింది. “ఇక చాలు వచ్చేయండి” అనే సందేశం వెళ్లింది పెళ్లి కొడుక్కు.
ఇద్దరూ ఒకేసారి ముందుకు నడిచి అభిముఖంగా నిలబడ్డారు.
‘ఎక్స్‌పర్ట్’ తన పనయిపోయినట్లు ప్రక్కకు వెళ్లిపోయాడు.
వరుడు వధువు దండలు మార్చుకున్నారు.
ఒక్కసారిగా కోలాహలం చెలరేగింది. గంధపు పొడి యిరువైపుల చల్లుకున్నారు. పన్నీరు బుడ్లు స్వైర విహారం చేశాయి. పన్నీరు గంధం కలిసిన ఒక విధమయిన సువాసన ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
ఎదుర్కోళ్ల తర్వాత ఇద్దర్నీ కూర్చోబెట్టి చిన్న తతంగం నడిపారు. తర్వాత భోజనాలకు కూర్చునేసరికి పదిన్నరయింది. క్రిందనే భోజనాలు. వరుసగా కూర్చునేందుకు వీలుగా, ఒకటిన్నర అడుగు వెడల్పుతో అల్లిన సిరి చాపలు పరిచారు. ముందు బంతిలో పెళ్లివారు, పెద్దవయసువారు, చిన్నపిల్లల తల్లులు, పిల్లలు కూర్చున్నారు. అరిటాకులు పరచి నీళ్లు పెట్టారు. అరిటాకు అగ్రభాగం ఎడమవైపుండాలి. మొదట ఉప్పు, పన్యారం (పెసరపప్పు నానబెట్టి, దాంట్లో కొబ్బరికోరు, కారం ఉప్పు కలిపిన వ్యంజనం) వడ్డించారు. మామిడికాయ పప్పు, వంకాయకూర, కందిపచ్చడి, చిత్రాన్నం (పులిహోర), ఆకు చుట్టూ వడ్డించారు. స్వీటు జాంగ్రీ, అప్పడాలు, రంగు రంగుల వడియాలు, అన్నం ఏవి ఎక్కడ వడ్డించాలో శాస్త్రం ఉంది. వంట బ్రాహ్మలు కాకుండా మార్కండేయ శర్మ బంధువులు కూడ వడ్డనకు దిగారు. పతంజలి, వసుధ పోటీలు పడి వడ్డించారు. మగవాళ్లందరూ పట్టు పంచెలు కట్టుకొని, పైన ఉత్తరీయం కప్పుకున్నారు. ఎదుర్కోళ్ల చీరలు మార్చి ఆడవారు వేరే చీరలు ధరించారు.
అందరికీ ‘పరిషేచనం’ వేసిన తర్వాత మార్కండేయ శర్మ, “భోజనకాలే భగవన్నామస్మరణా, గోవిందా, గోవింద!” అని గట్టిగా అరిచాడు. అందరూ భోజనానికి ఉపక్రమించారు. వధూవరులను ఒకచోట పీటలు వేసి కూర్చోబెట్టి అరటాకుల చుట్టూ ముగ్గు కర్రలు, పసుపు కుంకుమలు వేసి, ప్రమిదలతో దీపాలు పెట్టారు.
అన్ని బంతులు లేచేసరికి పదకొండున్నర దాటింది. మరుసటి రోజు ఉదయం 11:08 నిమిషములకు ముహూర్తం, అందరూ నిద్రలకొరిగారు. ఉదయాన్నే వధూవరులు మంగళస్నానాలు చేసి మధుపర్కాలు ధరించారు. వాగ్దేవితో గౌరీపూజ చేయించారు పురోహితులవారు. ఆయన మార్కండేయ శర్మకు బంధువే. ఆయన పేరు యజ్ఞ రామయ్య శాస్త్రి. తాడిపత్రి ఆయనది. చిన్నప్పటినుండి శర్మ పిల్లలను చూచినవాడాయన. కొంత హాస్య ప్రవృత్తి ఎక్కువ ఆయనలో.
“ఏమే! పెళ్లికూతురా! ఎదుర్కోళ్లు తర్వాత మీ ఆయనతో ఏదో చెపుతున్నట్టున్నావ్!” అన్నాడాయన.
“అదేంలేదు మామా!” అన్నది వాగ్దేవి ఆటపట్టిస్తున్నాడని తెలుసుకుని.
కాశీయాత్ర వేడుక మొదలయింది. వరుడు అలిగి నేను కాశీకి వెళ్లిపోతానన్నాడు. బావమరిది బ్రతిమాలుకొని తీసుకురావాలి. కొత్త ఛత్రి (గొడుగు), కొత్త చెప్పులు, కొత్త బట్టలు సమర్పించి, కాళ్లు కడగాలి. పతంజలికి ఇదంతా సరదాగా ఉంది. చెవులకు దారపు కుండలాలతో రామూర్తి వింతగా కనిపించాడు. ఏమీ బెట్టు చేయకుండానే ‘కాశీ’ నుండి తిరిగి వచ్చేశాడు.
సరిగ్గా 11 గంటల 08 ని॥లకు వధూవరులు పరస్పరం తలలపై జీలకర్ర బెల్ల పెట్టుకున్నారు. వసుధ పట్టుపావడా, జాకెట్ వేసుకొని మ్యాచింగ్ ఓణీ వేసుకొని మెరిసిపోతుంది. పెళ్లికూతురు ప్రక్కనే కూర్చుంది. పతంజలి తెల్లని పాంటుమీద నీలంరంగు గళ్ల టీషర్టు వేసుకున్నాడు. నీవు బాగున్నావంటే నీవు బాగున్నావని కళ్లతోనే సందేశాలు పంపుకున్నారు.
సరిగ్గా 11:30 ని॥లకు మంగళసూత్రధారణ జరిగింది. తాళిబొట్టు మెడలో పడిన మరుక్షణం రామ్మూర్తి ఎంతో సన్నిహితుడైనట్లు అనిపించాడు వాగ్దేవికి.
ఉదయం టిఫిన్ల కార్యక్రమం పూర్తయింది. ‘ఉగ్గాని, బజ్జీ’ చేయించారు. రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పాపులర్ టిఫినది. బొరుగులు (మరమరాలు) నానపెట్టి, పచ్చిమిరపకాయలు, కొబ్బరికోరు, పుట్నాలపొడి వేసి చేస్తారు. దానికి కాంబినేషన్ మెత్తని పకోడి.
తర్వాత చదివింపులు. పెళ్లికూతురివైపు డోన్ రాముడు, వాళ్లవైపు ఎదుర్కోళ్ల ఎక్స్‌పర్ట్ కల్యాణవేదికకు చెరోవైపు కూర్చున్నారు. చిన్న నోట్‌బుక్స్ లో పేర్లు, వాళ్లిచ్చిన మొత్తం నోట్ చేసుకుంటున్నారు. ఫోటో ఫ్రేములు, చిన్న చిన్న వెండి భరిణలు, దీపపు సెమ్మెలు తెచ్చినవారు డైరెక్ట్‌గా వధూవరులకే ఇచ్చేస్తున్నారు.
అంతా అయింతర్వాత లెక్కపెట్టి ఒక కవర్లో పెట్టి మృత్యుంజయ శర్మకిచ్చాడు డోన్ రాముడు. “మొత్తం ఎనిమిది వందల డెభై ఎనిమిది రూపాయలు వచ్చింది, అన్నయ్యా!” అన్నాడు శర్మ సంతోషించాడు.
పన్నెండున్నరకు భోజనాలు ప్రారంభమయ్యాయి. బ్రాహ్మణేతరులందరికీ వేరే బంతి. మొత్తం నాల్గు బంతులు లేచాయి. వాంగీబాత్, భక్ష్యం, పాలు, మసాలవడ, పాలకూర పప్పు, మజ్జిగ పులుసు, చారు, మామిడికాయ ముక్కల పచ్చడి. కందిపొడి, నెయ్యి మార్కండేయ శర్మ, వర్ధనమ్మ డోన్ రాముడు, పతంజలి, బంతుల వెంట తిరుగుతూ, “నిదానంగా భోంచేయండి. నిదానంగా భోంచేయండి! ఇదిగో యిక్కడ వాంగీబాత్ మారు వడ్డించండి. ఇటువైపు మళ్లీ మజ్జిగపులుసు రాలేదు! అన్నం రావాలి!” అంటూ పర్యవేక్షిస్తున్నారు.
చివర్లో చిక్కని మజ్జిగ వచ్చింది. దాంట్లో పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేశారు. కొత్తిమీర, కరివేపాకు సన్నగా తురిమి, వేసి, పోపు పెట్టారు. కొంతమంది చేతులో పొయించుకొని ఒకటే జుర్రుకోవడం.
భోజనాల తర్వాత బయటి వాళ్లు వెళ్లిపోయారు. దగ్గరిబంధువులంతా ఉండిపోయారు. ఆ రోజు రాత్రికే సత్రంలో ఒక గదిలో శోభనం ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
మంగళసూత్రధారణ తర్వాత, కొన్ని హోమాలు చేయించారు యజ్ఞ రామయ్యగారు వధూవరులతో.
సాయంత్రం వాగ్దేవితో సినిమాకు వెళదామని ప్రతిపాదించాడు రామ్మూర్తి. పెద్దలూ సరేనన్నారు. రిక్షా పిల్చుకొని వచ్చాడు పతంజలి.
సరిగ్గా వాళ్లు రిక్షా ఎక్కే సమయానికి తయారయ్యాడు చిన్నోడు పాణిని. “నేనూ పోతా సినిమాకు అక్క, బావతో” అని ఒకటే ఏడుపు. ఎవరు ఎంత చెప్పినా వినడే.
చివరికి రామ్మూర్తి అన్నాడు “పోనీ రానివ్వండి! చిన్న పిల్లవాడు వాడి సరదా ఎందుకు కాదనాలి!”
వాగ్దేవి భర్తవైపు అభిమానంగా చూసింది అతని సంస్కారానికి ముగ్ధురాలై. ఐదునిమిషాల్లో తయారై వచ్చి రిక్షాలో అక్క ఒళ్లో కూర్చున్నాడు చిన్నోడు.
నవరంగ్ టాకీసుకు వెళ్లారు. ‘ఏక్‌ఫూల్ దోమాలి’ అనే హిందీ సినిమా ఆడుతోంది దానిలో.
“హిందీ సినిమానా! నాకు అర్థం కాదండీ” అన్నది వాగ్దేవి.
“లక్షణంగా అర్థమవుతుంది. నేను చెబుతాను పద!” అన్నాడు మనోహరుడు.
సినిమా బాగానే ఉంది. మధ్యలో అర్థంకానిచోట వివరించాడు రామ్మూర్తి. ఇంటర్వెల్‌లో వేరుశనగ విత్తనాలు, శొంఠి పిప్పరమెంట్లు పాణినికి చాక్‌లెట్లు, సోడాలు తెచ్చాడు. సోడా గ్యాస్ ముక్కుల్లో చెవుల్లోకి పోయి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు పాణిని. అయినా సోడా మొత్తం తాగి విజయవంతంగా అక్కవైపు చూశాడు. చిట్టి మరదిని బాత్‌రూం కూడా పిల్చుకొని పోయివచ్చాడు బావ.
సినిమా పూర్తయ్యేసరికి గాఢనిద్రలో ఉన్నాడు పాణిని. ఆ పిల్లవాడిని భూజానికెత్తుకుని, బాల్కనీ మెట్లన్నీ దిగి, క్రింద రిక్షా వరకు మోసుకొచ్చాడు రామ్మూర్తి. వాగ్దేవి నొచ్చుకుంటూంటే
“సర్లే, వాడేమి పరాయివాడా!” అన్నాడతడు. వాగ్దేవి కళ్లు చెమర్చాయి.
రాత్రికి ‘బువ్వంబంతి’ పీటలు వేసి, చుట్టూ పూలతో ముగ్గులతో అలంకరించి, నాలుగయిదు ఆకులు పరచి పదార్ధములన్నీ వడ్డించారు వధూవరులకు. ఒకరి ఎంగిలి ఒకరు తినిపించుకున్నారు. ఇద్దరికీ ఎప్పటినుండో పరిచయమున్నట్లుగా అనిపించసాగింది.
కొందరు పాటలు అందుకున్నారు. మృత్యుంజయశర్మ రుక్మిణీ కల్యాణం లోని
“ఆ ఎలనాగ నీకు తగు, భామినికిన్ తగుదీవు…..
ఇంత మంచి దగునే దాంపత్యము”
అనే పోతనగారి పద్యాన్ని రాగయుక్తంగా పాడాడు. వసుధ కూడ పాడింది. “జననీ, శివకామిని! జయశుభకారిణి” అంటూ ‘నర్తనశాల’ లోని పాట. పాట పూర్తవుతూనే పతంజలివైపు చూసింది. ప్రశంసగా చూశాడు.
“బాగాపాడతావే” అన్నాడు.
“సంగీతం నేర్చుకుంటున్నాలే” అంది.
“సంగీతం నేర్చుకుంటే సరా! గాత్రం బాగుండొద్దూ! నీ గొంతు బాగుంది వసుధా” అన్నాడు మనస్ఫూర్తిగా.
“నీవూ ఏదైనా పాడు బావా!” అంది.
“తలనిండ పూదండ దాల్చినరాణి
మొలక నవ్వులతోడ మురిపించబోకే”
అంటూ ఘంటసాల వారి ప్రయివేటు గీతం అందుకున్నాడు అద్భుతంగా ఉందన్నారంతా.
“ఆ తండ్రి కొడుకు కదా మరి” అన్నది మేనత్త.
మరుసటి రోజు ‘అప్పగింతలు’ జరిగాయి. వర్ధనమ్మ ఏడుపు ఆపుకోలేక అవస్థపడుతూంటే, మృత్యుంజయ శర్మ కళ్లల్లో కూడ నీళ్లూరాయి. వాగ్దేవి వెక్కి వెక్కి ఏడ్చింది. పతంజలి కూడ ఏడ్చాడు.
“బాగుంది! నేనేదో చేసినట్లుగా నాకు గిల్టీగా అనిపిస్తూంది!” అన్నాడు రామ్మూర్తి. వాతావరణం తేలికపడింది.
మధ్యాహ్నం భోజనాలు చేసి వియ్యాలవారు వెళ్లిపోయారు. రామ్మూర్తి మూడు నిద్రలకని ఉండిపోయాడు. సాయంత్రం కాఫీలయ్యాక, జట్కాల్లో, రిక్షాల్లో రైల్వేస్టేషన్ చేరుకొని డోన్ లోకల్ ఎక్కి వెల్దుర్తి చేరుకున్నారు. వెల్దుర్తి స్టేషన్ నుండి యింటివరకు భజంత్రీ వాద్యాలతో మెళ్లో పూలదండలతో ఊరేగింపుగా యింటికి వెళ్లారు. దోవపొడుగునా జనం వాళ్లను చూడటానికి వచ్చారు.
“అల్లుడు సామి బాగున్నాడు” అని కితాబిచ్చారు.
తర్వాత మూడు రోజులూ మరింత దగ్గరయ్యాడు పతంజలి బావకు. రోజూ సాయంత్రం తోటకు తీసుకొని వెళ్లేవాడు. మూణ్నిద్రల తర్వాత అమ్మాయిని అల్లుడిని తీసుకొని అందరూ కడపకు బయలుదేరారు. కడపలో రామ్మూర్తి వాళ్లింట్లో ‘దత్తవ్రతం’ చేసుకున్నారు వధూవరులు.
వసుధావాళ్లు కడపనుండి ప్రొద్దుటూరు వెళ్లిపోతూంటే పతంజలికి ఏదో లోటుగా అనిపించింది.
“బావా! వెళ్లొస్తాం!” అంటూ వెళ్లిపోతున్న వసుధ కళ్లలో కూడ స్పష్టంగా బాధ తెలిసింది పతంజలికి.
“బావా! M.P. ఇంటర్మీడియట్ వివరాలు చెప్తానన్నావు!” అని గుర్తు చేశాడు పతంజలి. “అవున్రా! మర్చేపోయాను!” అంటూ తన బ్యాగ్‌లోంచి ప్రాస్పెక్టస్ తీసి యిచ్చాడు రామ్మూర్తి.
రెండ్రోజుల్లో రామ్మూర్తి పనిచేసే చిత్తూరులో కొత్త కాపురం ప్రారంభిస్తారు నూతన దంపతులు. మృత్యుంజయ శర్మ సకుటుంబంగా వెల్దుర్తికి వచ్చేశాడు.
కడప నుంచి వచ్చిన మరుసటిరోజే ప్రాస్పెక్టస్ తీసుకుని శంకరయ్య సారు యింటికి వెళ్లాడు పతంజలి. విషయం చెప్పాడు. చాలా సంతోషించాడాయన టెంత్ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ ఉంటే ఒకేసారి పరీక్షలన్నీ వ్రాయవచ్చునని ఉంది అందులో. దరఖాస్తు నమూనా ఇచ్చి ఉన్నారు. టెన్త్ ఒరిజినల్, టి.సి., రెండు ఫోటోలు, నలభై రూపాయలకు “రిజిస్ట్రార్, ప్రీ యూనివర్సిటీ బోర్డ్, భోపాల్ పేరుట డి.డి. తీసి పంపాలి. రిజిస్ట్రేషన్ ఐనట్లు లెటరుతోబాటు, ఒరిజినల్ సర్టిఫికెట్, ఐడికార్డు పంపుతారు. అప్పుడు నూట యాభై రూపాయలకు డి.డి. తీసి “డైరెక్టర్, కరస్పాండెన్స్ కొర్సెస్” పేరిట పంపుతే స్టడీ మెటీరియల్, నమూనా ప్రశ్నా పత్రాలు, అసైన్‌మెంట్లు వస్తాయి. వచ్చే సం॥ జూన్‌లో పరీక్షలుంటాయి. పరీక్షా కేంద్రం మద్రాసులో ఉంది, దక్షిణ భారతానికంతా అదొక్కటే. “బాగుందిరోయ్, పతంజలీ! ఇంకేం, కట్టు పరీక్షకు” అన్నాడు శంకరయ్యసారు. “తప్పకుండా సార్, మీ సహకారం కావాలి” అన్నాడు పతంజలి.
“నీకు చేయకపోతే ఎవరికి చేస్తాను బాపనయ్యా!” అని ప్రోత్సహించాడాయన.
సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం తీసుకోవాలని అనుకున్నాడు. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కంపల్సరీ. ఆర్ట్స్ గ్రూపులో హిస్టరీ ఎకనమిక్స్, సోషియాలజీ తీసుకోమని సూచించాడు సారు. రేపు ప్రొద్దున ఐఎఎస్‌కు వెళ్లినా బేస్ ఉంటుందనీ చెప్పాడు.
“నేను, అయ్యేయెస్సా?” అని నోరెళ్లబెట్టాడు పతంజలి.
“నీకేంరా, నీవు చెయ్యగలవు” అన్నాడు సారు. తనమీద ఆయనకున్న నమ్మకానికి పతంజలి చలించిపోయాడు.
“మీ ఆశీర్వాదముంటే” అన్నాడు వినయంగా.
మొత్తం కోర్సు ఇంగ్లీషు మీడియం. సంస్కృతం జవాబులు కూడ ఇంగ్లీషులోనే వ్రాయవచ్చు.
“ఇంగ్లీషులో బాగా కృషి చెయ్యరా. అది నిన్ను అత్యున్నత శిఖరాలకు తీసుకు వెడుతుంది. రోజూ ‘హిందూ’ చదువు. కఠిన పదాలకు అర్థాలు ప్రతిదానికీ డిక్షనరీ చూడనక్కరలేదు. ఒక పదం మూడు నాలుగుసార్లు తారసపడితే సందర్భాన్ని బట్టి దానర్థం ఇదీ అని మనమే నిర్ధారించుకోవచ్చు. ‘హిందూ’ ఎడిటోరియల్‌లోని ఒక పేరా తీసుకొని, వాక్య నిర్మాణాన్ని క్షుణ్ణంగా విశ్లేషించుకో. ప్రతి ఆదివారం రాత్రి నా వద్దకురా. ఏదో ఒక టాపిక్ మీద ఇంగ్లీషులో మాట్లాడుకుందాం. రేడియోలో ఇంగ్లీషు వార్తలు ప్రతిరోజు విను. చక్కని ఉచ్ఛారణ, శైలి పట్టుపడతాయి” అన్నాడాయన.
ఆయన చెప్పింది శ్రద్ధగా విన్నాడు పతంజలి. తననుద్ధరించవచ్చిన సాక్షాత్ శంకర స్వరూపుడిగా భాసించాడాయన. పాదాలకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు.
ఇంట్లో తండ్రికి విషయమంతా వివరించాడు పతంజలి. ఆయన ‘సరే’ అన్నాడు. ‘సంస్కృతం’ తీసుకోవడం ఆయనకు నచ్చింది. ఆ భాషలో ఆయన పండితుడు.
దరఖాస్తు నమూనా ప్రకారం తెల్లకాగితం మీద టైపు చేయించుకొని పంపవచ్చు. అలాగే చేశాడు. నెగెటివ్ జాగ్రత్తగా ఉంచుకున్నాడు కాబట్టి అగస్టీన్‌కిచ్చి కర్నూలు పంపి ఫోటోలు తెప్పించుకున్నాడు. దశరథ విజయవాడ లయోలాలో చేరాడు. హాస్టల్లో ఉంటాడు. అగస్టీన్, కర్నూలు ‘కోల్స్’లో చేరాడు. క్రిస్టియన్లకు అందులో ఉచితం ఫీజులు. అల్లాబక్ష్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరాడు. అందరూ M.P.C. గ్రూపే. దరఖాస్తు పంపిన ఇరవై రోజులకు రిజిస్ట్రేషన్ ఐనట్లు లెటరు, S.S.C. ఒరిజినల్ పంపేశారు. అప్పుడు నూట ఏభై రూపాయలు డి.డి. తీసి పంపాడు. వెల్దుర్తిలోనే ఆ మధ్య స్టేట్ బ్యాంక్ బ్రాంచి పెట్టారు కాబట్టి సమస్య లేదు.
తర్వాత నెల రోజులకు స్టడీమెటీరియల్ వచ్చింది. ఇంగ్లీషు ఒక పేపర్ వంద మార్కులకు, ప్రోజ్, పొయిట్రీ, గ్రామర్ నాండిటెయిల్డ్ టెక్స్ట్. సంస్కృతం కూడ అంతే కాని నాన్‌డిటెయిల్డ్ టెక్స్ట్ లేదు. గ్రూపు సబ్జెక్టులు మాత్రం ఒక్కొక్కటి రెండు పేపర్లు, షార్ట్ క్వశ్చన్స్, ఎస్సే క్వశ్చన్స్.
మంచి రోజు చూసి నరసింహస్వామికి దీపారాధన చేసి, అష్టోత్తరం, పురష సూక్తంతో అభిషేకం చేసి చదువు ప్రారంభించాడు పతంజలి. తొలిపాఠం, తొలి గురువు తండ్రే. సంస్కృతంలో ‘కాదంబరి’ గ్రంథంలోని “కథాముఖమ్” అనే పాఠం. కిరాతార్జునీయం (భారవి)లో 24 శ్లోకాలు, శిశుపాల వధ (మాఘుడు) లోని 20 శ్లోకాలు, శబ్దమంజరిలోని 20 శబ్దాలకు విభక్తి టేబుల్స్, ‘సమాస కుసుమావళి’ 8 సమాసాలు, 6 అలంకారాలు ప్రిస్క్రైబ్ చేయబడ్డాయి.
మార్కండేయశర్మ ‘రాజీ’ పడే వ్యక్తి కాదు. ప్రతి శ్లోకానికి ఖండాన్వయం, దండాన్వయం, తాత్పర్యం వివరించేవాడాయన. ఆయనకు సంస్కృతంలోని పంచకావ్యాలు కరతలామలకాలు. వాటి వ్యాఖ్యానం అద్భుతంగా వ్రాసి, ఆ మహాకవుల కవిత్వంలోని గాఢత్వాన్ని, నైశిత్యాన్ని లోకానికి విశదపరచిన ‘మల్లినాధసూరి’ గొప్పతనం గురించి రోజూ చెప్పేవాడాయన కొడుక్కు. ఆయన పేరే తమ్ముడికి పెట్టినట్లు అవగతమయింది పతంజలికి. ఆయన చేసిన వ్యాఖ్యానానికి “దీపశిఖావ్యాఖ్య” అని పేరని తండ్రి చెప్పారు. శ్లోకంలోని ప్రతి పదానికి “అమరకోశం”లోని నానార్థాలు ఉటంకించాడాయాన. స్టడీమెటీరియల్‌లో ఇవన్నీ లేవు. ఇంగ్లీషులో తాత్పర్యాలున్నాయంతే.
మరుసటి రోజు వ్యాఖ్యానంతో సహా శ్లోకాలను అప్పచెప్పించుకునేవాడు మార్కండేయశర్మ. “శతశ్లోకేన పండితః” అన్నట్లు వంద శ్లోకాలను క్షుణ్ణంగా అభ్యసిస్తే చాలు పాండిత్యమబ్బుతుందని శాస్త్రం. రోజు రోజుకు సంస్కృత భాషలోని ‘రుచి’ తెలిసింది పతంజలికి. శ్రద్ధగా నేర్చుకొన్నాడు. పరీక్షవరకైతే ఇంతలోతుగా చదవాల్సిన పనిలేదు. ప్రశ్నలకు జవాబులను యింగ్లీషులో తయారు చేసుకుని ఆదివారం శంకరయ్య సారు దగ్గరికి వెళితే ఆయన కరెక్షన్స్ చేసి ఇచ్చేవాడు. గ్రూపుల్లో ఆజం సారు సలహాలిచ్చేవాడు.
సంస్కృత భాషాధ్యయనం వల్ల పతంజలి బుద్ధి మరింత నిశితమయింది. ఇంగ్లీషు మీడియంవల్ల ఆ భాషలో కూడ అభివృద్ధి చెందసాగాడు. ప్రతినెల, జరిగిన పాఠాలన్నీ రివిజన్ చేసుకునేవాడు. అలా చేసుకుని తీరాలని తండ్రే చెప్పాడు. విద్యపట్ల ఆయనకున్న అవగాహన గొప్పది. పునశ్చరణ లేకపోతే చదివిన చదువు నశిస్తుందనే విషయాన్ని వాల్మీకి తన రామాయణంలోనే చెప్పాడని అన్నాడాయన ఒకసారి.
అశోకవనంలో దుఃఖంతో కృశించిన సీతమ్మవారిని వర్ణిస్తూ, “అమ్నాయానాం అ యోగేన విద్యాం ప్రశిధిలామివ” అంటాడు మహాకవి. పునశ్చరణ లేకపోవడం వల్ల శిథిలమయిన విద్యవలె ఉన్నదట అమ్మవారు!
“ఉపమా కాళిదాసస్య” అంటారుగాని నాయనా, ఉపమాలంకారాలను అద్భుతంగా చెప్పగలవారిలో వాల్మీకిని మించినవాడు లేడని నా అభిప్రాయం అన్నాడు తండ్రి ఒకసారి. సిలబస్‌తో నిమిత్తం లేకుండా వాల్మీకిని చదవమన్నాడు. “అన్వయ క్లిష్టత ఉండదు సరళమయిన పదాలు నీకు ఎవరూ వివరించాల్సిన పనే ఉండదు.”
తోటకు పుస్తకాలు తీసుకుపోయేవాడు. నిమ్మతోటకు నీళ్లు పెట్టేటప్పుడు ఒక చెటుట పాదులోనికి, గెనం తెరిచి, నీళ్లు వదిలి, పాదు నిండటానికి పదినిమిషాలు పడుతుంది కాబట్టి ఆ పది నిమిషాల్లో చదువుకొనేవాడు. వేరుశనగ పంట టైంలో కూలీలంతో కాయలు తెంపించుకోడానికి వెళ్లినా పుస్తకాలుండాల్సిందే. హుబ్లీకి వెళ్లినా రైల్లో, మండీలో చదువుకునేవాడు.
ఛందస్సు మీద కన్ను పడింది పతంజలికి. ఒకసారి అడిగాడు “నాన్నా, నాకు ఛందోబద్ధంగా పద్యాలు రాయడం నేర్పించవూ?” అని తండ్రి సంతోషించాడు.
“నాయనా, జాగ్రత్తగా విను. గణాలు, గురువులు, లఘువులు లెక్కలు వేసుకుంటే పద్యాలు వ్రాయలేము. ప్రతి ఛందస్సుకు ఒక లయ (rythm) ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి. ఉత్పలమాల తీసుకో. “నానన నాన నాన నన – నానన నానన నాన నాననా” ఈ లయ ప్రకారం పదాలు వేసుకోవడమే. అదే చంపకమాల ఐతే, ఉత్పలమాలలోని తొలి గురువును రెండు లఘువులుగా మారిస్తే సరి. చూడు!
“నననన నాన నాన నన నానన నానన నాననాననా”
అదే శార్దూలమైతే
“నానానానన నాననాననన నానానాననానాననా”
మత్తేభానికి కి, తొలిగురువు రెండు లఘువులు అవుతుంది.
“నన నానానన నాన నాన నన నానానాననానాననా”
“ఛందస్సు కేవలం బాహ్య శరీరమే. ఆత్మ భావమని గుర్తుంచుకో. ఇది ఏ భాషా కవిత్వానికైనా వర్తిస్తుంది. తెలుగుకంటే సంస్కృత శ్లోకాలు వ్రాయటం సులభం అందులో యతిప్రాసలుండవు కాబట్టి. నేననుకోవడం ఇంగ్లీషు కవిత్వం వ్రాయడం మరింత సులభం. మన వచన కవిత్వంలా ఉంటుంది కదా! అసలు నీవే భావం వెలిబుచ్చినా అందులో ఏదో ఒక ఛందస్సుంటుంది చూడు” అన్నాడు మార్కండేయశర్మ.
పతంజలికి యింకా ఇంకా వినాలనిపిస్తూంది.
“అయితే నాన్నా, మన కృష్ణశర్మమామ ఆధునిక వచన కవిత్వాన్ని కవిత్వమే కాదంటాడు?”
“అది తప్పు. భావ పరిపుష్టిగల ఏదైనా కవిత్వమే. ‘ఏకం రసాత్మకం కావ్యం’ అన్నాడు ఆనందవర్ధనుడు తన కావ్యాలంకార చూడామణిలో” రసాత్మకమయిన ఒక వాక్యమయినా ఒక కావ్యమే అని ఆయన అభిప్రాయం.
“కవి సామ్రాట్ విశ్వనాధ అంతటివాడు కూడ ఆధునిక కవిత్వాన్ని చిన్న చూపు చూడలేదు. ఆయన “కిన్నెరసాని పాటలు” అందుకు ఉదాహరణ. ఒకసారి ఏదో సందర్భంలో శ్రీరంగం శ్రీనివాసరావు.
“మీ ఛందో బందోబస్తులన్నీ బంద్” అని ఉటంకిస్తే విశ్వనాధ ఇలా అన్నారట.
“ఛందస్సు వద్దని ఛందస్సులో చెప్పాడు అమాయకుడు” అని.
ఇలాంటి చర్చలు పతంజలిలో మరింత జిజ్ఞాసను రేపేవి . వెల్దుర్తి లైబ్రరీలో చాలా పుస్తకాలుండేవి. ఆర్.కె. నారాయణ్ నవలలు ఒక్కొక్కటి చదివాడు. ఓ.హెన్రీ కథలు, రాజాజీ రామాయణం, భారతం (ఇంగ్లీషులో) చదివాడు. ఇంగ్లీషు భాష మీద మంచి పట్టు సంపాదించాడు.
ఒకసారి ఒక పద్యం రాసి తండ్రికి చూపాడు. తొలి పద్యం కాబట్టి వినాయకుడు, సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ. అది యిలా వచ్చింది.
“శుంభన్నిజ కృపద్య్రంబక
డింభకు డొనగూర్చు పరిబృఢీకృతవాణిన్
అంభోజోద్భవదారా
కుంభిని భవబిసము దృంచి కూర్చుతముదమున్”
తండ్రి దానిని విని నవ్వాడు. “నీ సంస్కృతమంతా చూపించావు కదరా! వినాయకుడిని, సరస్వతిని రాళ్లతో కొట్టినట్లుంది కాని పూలతో పూజించినట్లు లేదు” అన్నాడు.
పతంజలి ముఖం చిన్నబోయింది.
“బాగాలేదా నాన్నా” అన్నాడు.
“బాగుందిలే, తొలి ప్రయత్నం కద. భాషను వాడాలని తపన సహజం” అన్నాడు తండ్రి అప్పటికప్పుడు అశువుగా ఒక కంద పద్యం చెప్పాడు.
“అందము చిందగ కందము
పొందికగా చెప్పినపుడె పోకవియౌతాన్
మందులకు చెప్పనలవియె
కొందరు చెప్పంగలేరు కోవిదులైనన్”
“ఎంత బాగుంది!” అనుకున్నాడు పతంజలి. ఎంతయినా ఆయన అష్టావధాని అనుకున్నాడు. తల్లి పిలిచింది.
“ఏమిటమ్మా” అంటూ వెళ్లాడు.
“పద్యం బాగుంది నాయనా! బాగా రాశావు. మీ నాన్న స్థాయికి ఎదగాలంటే టైం పడుతుంది! నిరుత్సాహపడకు” అన్నదామె. పతజంలికి ఊరట దొరికింది.
చదువు అతి కష్టం మీద సాగుతూంది. ప్రతిరోజూ ఏవో పనులు ఆ పనుల మధ్య గ్యాప్‌లో చదువుకుంటున్నాడు పతంజలి. గేటు చేనులో గొర్లు ఆపించడం. గొర్లమందతో రాత్రికి ఇంత అని మాట్లాడుకుంటారు. ప్రతిరోజు రాత్రి గొర్లన్నిటినీ ఒక చోట చేర్చి ‘ఎరువు’ అందిస్తారు. అలా నాల్గయిదు రాత్రులు గొర్లను ఆపితే పొలం కవరవుతుంది. పొలమంతటికి ఎరువు లభిస్తుంది. కాని రోజూ పొలంలో పడుకోవాలి. వాళ్లతో బాటు. లేకపోతే మోసం చేస్తారు. సరిగ్గా నిలబెట్టరు.
రాత్రి 8 గంటలకల్లా భోజనం చేసి టైరు చెప్పులు, వేసుకొని, టార్చిపట్టుకొని, చలికి ఒక షోలాపూరు దుప్పటి భుజాన వేసుకొని వెళ్లాలి. అక్కడ తడికలతో, బోదె గడ్డితో చిన్న కట్టం వేయించుకొని, దాంట్లో పడుకోవాలి. మధ్యలో గొర్లు సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. కొట్టంలో లాంతరుంటుంది. దాని వెలుగులో చదువుకునేవాడు.
పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. నెలరోజుల ముందు తండ్రి అన్నాడు.
(సశేషం)