జ్ఞాపకాల తరంగిణి-28

0
4

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]ఎ[/dropcap]వరేమన్నా ఈ వైజయంతి చిన్న సైజు విజ్ఞానసర్వస్వం, రిఫరెన్స్ గ్రంథం. సభల్లో పాల్గొన్న వారి జీవిత విశేషాలు, వారి ఉపన్యాసాల సారాంశం, సభా విశేషాలు, సభలు జరిగిన తీరుపై పత్రికల విమర్శ, శ్రోతల స్పందన, ఏభైఏళ్ళ తెలుగు పత్రికల వార్తారచనలో వచ్చిన మార్పులు ఇట్లా ఎన్నెన్నో విశేషాలు పాఠకులకు తెలుస్తాయి. ఇందులో అపూర్వమైన కొన్ని ఫొటోలు వేశాము. ఆ రోజుల్లో నెల్లూరు పౌరులు ఈ జయంతుల సభలకు హాజరై శ్రద్ధగా ఉపన్యాసాలు వినేవారు. కొంచెం ఆలస్యంగా వస్తే టౌన్ హాల్ మేడమీద గ్యాలరీలో కూర్చోవలసి వచ్చేది. కాలేజి అధ్యాపకులు, విద్యార్థులు కూడా సభలకు వచ్చేవారు.

సభలో పాల్గొనను వచ్చిన గుర్రం జాషువ, దేవులపల్లి కృష్ణశాస్త్రి వంటి పండితులు రామరెడ్డి గారి బంగళాలోనే దిగేవారు. రామరెడ్డి గారు అస్పృస్యతను పాటించేవారుకాదు. వారు 1921లోనే జాతీయోద్యమంలో జైలుకు వెళ్లారు. వారింట్లో ఒక దళిత యువకుడు వంట చేసేవాడు.

కవిత్రయ కవితా వైజయంతిని మూడు భాగాలుగా విభజించాము. 1912 నుంచి వర్ధమాన సమాజం స్వయంగా నిర్వహించిన సభలు, 1936 నుంచి తిక్కవరపు రామిరెడ్డి గారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన తిక్కన జయంతులు, 1958 నుంచి 1970 వరకు కవిత్రయ జయంతులుగా చేసిన సభలు. ఆంధ్రదేశంలోని పేరున్న పండితులంతా ఈ సభల్లో పాల్గొన్నారు. ప్రతి ఏడు మూడు జయంతులలో అధ్యక్షత వహించిన పండితులు, ప్రధాన ఉపన్యాసకుల ఉపన్యాస సారాంశం ఇందులో ఇచ్చాము. ఈ పుస్తకానికి సంపాదకులుగా పనిచేసిన మేము ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రిక, నెల్లూరు స్థానిక పత్రికలలో వచ్చిన ఉపన్యాస సారాంశాలను సేకరించి పుస్తకంలో చేర్చాము. సజీవంగా ఉన్న పండితులు కొద్దిమంది ఉపన్యాస పాఠాలను పంపించారు. 1969 తిక్కన జయంతికి శ్రీశ్రీ అధ్యక్షులు, తుమ్మల సీతారామ్మూర్తి ఉపన్యసించి తిక్కన పేర సన్మానం గ్రహించారు. ఇలాగే నన్నయ, ఎర్రాప్రగడ, జయంతులకు కూడా ఒక పండితులు అధ్యక్షులు, మరొక పండితులు ఉపన్యసించి సన్మానం స్వీకరించేవారు. రామరెడ్డి గారు జీవించినంతవరకు వారి బంగళాలోనే పండితులకు విడిది, ఎవరైనా ఒకరు వేరేగా మిత్రుల ఇళ్లల్లో ఉంటామంటే అలాగే ఏర్పాట్లు చేసేవారు. 1969లో శ్రీశ్రీని మద్రాసు నుంచి తీసుకొని వచ్చి, తిరిగి మద్రాసు పంపే బాధ్యత నాకు పెట్టారు. ఈ అనుభవాన్ని వ్యాసంగా రాశాను.

మరుపూరు కోదండరామరెడ్డి గారు వర్ధమాన సమాజ కార్యదర్శి గోపాలకృష్ణను తన పలుకుబడితో సాహిత్య అకాడమీ సభ్యుణ్ణి చేసారు. ఆ రోజుల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలకు అకాడమీకి సభ్యులను ఎన్నిక చేసుకొనే ప్రక్రియలో వోటుండేది. మా వర్ధమాన సమాజానికి కూడా ఓటుండేది. రెడ్డిగారు గోపాలకృష్ణను నిలబెట్టి ఓట్లు వేయించి అకాడమీ సభ్యుణ్ణి చేశారు. అంతా మంచిగా, హనీమూన్ లాగా జరిగిపోతున్నప్పటి సంగతి. వైజయంతి ప్రచురణ వల్ల గోపాలకృష్ణ చాలా ఇబ్బందులు పడ్డాడు. అతని స్నేహితుడు కావడంవల్ల నేనూ చాలా ఇబ్బందులు పడ్డాను. అతన్ని వర్ధమాన సమాజ కార్యదర్శి పదవి నుంచి దింపేవరకు కోదండరామరెడ్డిగారు నిద్రపోలేదు. “గోపి పేరులో గో పొతే మిగిలేది ‘అతను’’ అని రెడ్డిగారు రాస్తే, గోపాలకృష్ణ (గోపి అని నెల్లూరులో అతన్ని పిలిచేవారు) “పెద్దాయన క్రోధండరామరెడ్డి” అని జవాబిచ్చాడు. మా నెల్లూరులో వేదంవారి కాలంనుంచి పండితులు రెండు గ్రూపులుగా ఉండేవారు. ఒకరంటే ఒకరికి పడదు, అసూయలు, తగాదాలు, తిట్టుకోడాలు.. ఆ సంప్రదాయమే మావరకు కొనసాగిందేమో?

పెన్నేపల్లి గోపాలకృష్ణ గారు

1972 ప్రాంతంలో వర్ధమాన సమాజంలో కార్యవర్గంలో ఖాళీ ఏర్పడితే, నన్ను సభ్యుణ్ణిగా తీసుకున్నారు. నాకు డాక్టరేట్ 1971 సెప్టెంబర్ 3న అవార్డయింది. జిల్లాలో అతి పిన్నవయసులో ఆ పట్టా పుచ్చుకున్నందుకు బంగోరె నన్ను అభినందిస్తూ జమీన్ రైతులో వ్యాసం రాశాడు. అందుకు కొందరు ఆక్షేపిస్తూ, ఏదో ఒక సంస్థానం మీద పరిశోధించి, ఒకాయన పిహెచ్.డి తెచ్చుకొంటే పత్రికలో ఇంత ఆర్భాటం చెయ్యాలా అని ఎత్తిపొడుస్తూ జమీన్ రైతు పత్రికకు లేఖ రాశారు. మరువారం కూడా స్థానిక చరిత్రల మీద పరిశోధన ఎంత ముఖ్యమో వివరిస్తూ అతను జవాబుగా మరొక వ్యాసం రాశాడు. నా తరవాత ఐదేళ్ళకు కాబోలు సి.వి రామచంద్రరావు గారు పిహెచ్.డి తెచ్చుకున్నారు.

ఆ రోజుల్లో వర్ధమాన సమాజం కార్యవర్గ సభ్యుల్లో వి.ఆర్. కళాశాల ఆంగ్లోపాధ్యాయులు ఎస్.ఎం. మాలకొండారెడ్డి గారు, మరొక అధ్యాపకులు వేదం వెంకట్రామన్ గారు, తదితరులున్నారు. నేలనూతల శ్రీకృష్ణమూర్తి గారు గౌరవ గ్రంథాలయాధికారిగా చాలా కాలం కొనసాగారు. 1973లో కాబోలు వి.ఆర్. కళాశాల అధ్యాపకులు సి.వి. రామచంద్రరావు కావలి రామస్వామి ‘డెక్కన్ పోయెట్స్’ను మళ్ళీ ఎడిట్ చేసి ముద్రణకు సిద్ధం చేస్తే, వర్ధమాన సమాజ ప్రచురణగా కమిటీ దాన్ని పునర్ముద్రణ చేయడానికి తీర్మానం చేసింది. ఆ సంతోష సమయంలో మా గోపి – కార్యదర్శి. “ఈసారి మన పురుషోత్తం థీసిస్ ప్రచురిద్దాము” అని అన్నారు. వెంటనే వేదం వెంకట్రామన్ గారు “నేను కూడా ఒక చెత్త పుస్తకం రాస్తా, వెయ్యండి” అన్నారు. నేను ఏడాది క్రితమే కొత్తగా సర్వోదయ కాలేజీలో చేరాను. నా వయసు 32 సంవత్సరాలు. ఆయనేమో నాకు లెక్చరర్. మా ఇంటి సమీపంలోనే వారి ఇల్లు. వారి తమ్ముడు నా సహాధ్యాయి, రోజూ వారి ఇంటిముందునుచే నేను వెళ్ళాలి. నేనూ ఆవేశపరుణ్ణే, కానీ సమాధానం చెప్పకుండా నా సంస్కారం అడ్డుపడింది. ఇక ఆ రోజు తర్వాత నేను ఎన్నడూ వారిని విష్ చెయ్యలేదు. ఎదురుపడితే చూడనట్లు వెళ్లిపోయేవాణ్ణి. వారు, నేను ఇద్దరం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత, దీర్ఘకోపం మంచిది కాదని, హైదరాబాదు నుంచి వచ్చిన పండితులు వారిని చూడాలని కోరితే వెంటపెట్టుకొని వెళ్లాను. వారు కూడా ఏమీ జరగనట్లు నడుచుకున్నారు. 2010లో గురజాడ లభ్య సమగ్ర రచనల సంపుటం ఎడిట్ చేస్తున్న సమయంలో ఆంగ్ల ఛందస్సుల విషయమై కొన్ని సందేహాలు తీర్చుకొను వారిని సంప్రదించాను. ఆ విషయం పుస్తకాల్లో పేర్కొన్నాను కూడా. వేదం వెంకటరాయ శాస్త్రీ, గురజాడ రాసుకొన్న ఉత్తరాలు కొన్ని ‘గురుజాడలు’లో చేర్చాను. వేదం వెంకట్రామన్ గొప్ప ప్రాకృతభాషా పండితులు. వారు రచించిన కాదంబరి విమర్శకు సాహిత్య అకాడమీ నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి లభించింది.

ప్రతాప రుద్రీయం నాటకకర్త వేదం వెంకటరాయశాస్ట్రి గారి తమ్ములు వేదం వెంకటాచలయ్యరు వెంకట్రామన్ గారి తాతగారు. అయ్యరుగారు గొప్ప వ్యక్తిగత గ్రంథాలయం ఏర్పాటుచేసుకొన్నారు. వెంకట్రామన్ గారు ఆ అమూల్య గ్రంథాలను పూనా భండార్కర్ సంస్థకు బహూకరించారు. వెంకటాచలయ్యరు మహాభారతం మీద గొప్ప పరిశోధనలు చేసి ఇంగ్లీషులో వేయి పుటల నోట్స్ రాసుకున్నారు. వెంకట్రామన్ గారు తాతగారి నోట్సును ఓపికగా డిసైఫర్ చేసి, కాపీ చేసి, డిజిటీకరణ చేయించారు. పదవీ విరమణ చేసిన తర్వాతనే ఈ బృహత్కార్యం తలపెట్టి దాదాపు పదేళ్లకు పూర్తిచేసి, తాతగారి జ్ఙానభాండాగారాన్ని ముందుతరాల వారికి అందించి పండిత పరిశోధకుల కృతజ్ఙతలకు పాత్రులయ్యారు. వారు షుమారు 82 సంవత్సరాల వయసులో ఆనందంగా ఇహలోకం విడిచిన ధన్యజీవి.

వేదం వెంకట్రామన్ గారు

ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళాను. మరుపూరు కోదండరామరెడ్డి గారి ఏకయిక కుమారులు తరుణేందు శేఖర్ రెడ్డి నా ప్రాణస్నేహితుడు. తన తండ్రితో నాకు మాటలు లేకున్నా, తాను నన్ను విడిచిపెట్టలేదు. అందువల్ల కోదండరామరెడ్డి గారి ఇల్లు ‘అపర్ణ’కు నిరాఘాటంగా వెళ్ళేవాణ్ణి.

తరుణేందు శేఖర్ రెడ్డి గారు

వారు రాతబల్ల ముందు కూర్చొని గంటల తరబడి రాసుకుంటూ ఉండేవారు. మా కళాశాల కొత్తగా నెలకొల్పబడింది. ప్రిన్సిపాల్ గారు కళాశాల గ్రంథాలయాన్ని అభివృది చేసే బాధ్యత నామీద ఉంచారు. కోదండ రామరెడ్డి గారు వృద్ధులయిన తరవాత, వారి గ్రంథభాండాగారాన్ని కళాశాలకు ఖరీదుచేశాము. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురించిన పుస్తకాలన్నీ మా గ్రంథాలయానికి చేరాయి. గొప్ప నిఘంటువులు, ఇతర పుస్తకాలు కూడా ఇచ్చేశారు. ఆ రోజుల్లో 12 వేల రూపాయలు కాబోలు ఇచ్చాము. నేను పీహెచ్.డి పరిశోధక విద్యార్థులకు పర్యవేక్షకుడిగా వ్యవహరించడానికి ఎస్.వి. యూనివర్సిటీ అనుజ్జ ఇచ్చేముందు, యూనివర్సిటీ తెలుగుశాఖ రీడర్ జి. నాగయ్య గారు, ఇంగ్లీష్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సమీక్షించడానికి కాలేజీకి వచ్చి ఈ గ్రంథాలన్నీ చూచి, సంతోషంగా అనుజ్జ మంజూరు చేయించారు. రెడ్డిగారి గ్రంథాలయం విలువైనదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. రెడ్డిగారి వైదుష్యం, బహుగ్రంథ రచన, హాస్యసంభాషణా చాతుర్యం గురించి మరొకసారి.

బంగోరె సహకారం, చొరవతో తిక్కవరపు పఠాభిరామరెడ్డి గారి ఫిడేలురాగాల డజన్, కయిత నాదయిత పుస్తకాలను వర్ధమాన సమాజం తరఫున పెన్నేపల్లి గోపాలకృష్ణ పునర్ముద్రణ చేశారు. నార్లవారు ఇంగ్లీషులో రచించిన ‘Vemana through the Western Eyes’ను 1971లో మరుపూరు కోదండరామరెడ్డిగారు ‘వేమన పాశ్చాత్యులు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. దీన్ని వర్ధమాన సమాజ ప్రచురించింది. ఆర్ధిక సహాయం నేదురుమల్లి జనార్దనరెడ్డి గారు అందించారు. పుస్తకం జనార్దనరెడ్డి గారి చిన్నాన్న, యన్.బి.కె.ఆర్. సంస్థల మూలపురుషులు బాలకృష్ణారెడ్డి గారికి అంకితం ఇవ్వబడింది. పుస్తకావిష్కరణ సభను వాకాడులో ఇంద్రసభ లాగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. నెల్లూరు నుంచి వాకాడు వెళ్లిరావడానికి మా నెల్లూరు రూటు బస్సుల యజమాని కె.వి.ఆర్. వెంకురెడ్డి గారు బస్సు ఏర్పాటు చేశారు. దాదాపు యాభయి మందిమి సభకు వెళ్లాము. ఆ రోజు రాత్రి మహా వైభవంగా పుస్తకావిష్కరణ జరిగింది. ఇక వారి ఆతిథ్యం, విందు చెప్పనలవి కాదు. రాత్రి 12 గంటలకు బయలుదేరి రెండుగంటలకు నెల్లూరు చేరాము.

రెండు రోజుల క్రితం మా మిత్రులు డాక్టర్ గుంజి వెంకటరత్నం గారు నెల్లూరుకు వచ్చినపుడు మహాభారత విజ్ఞాన సర్వస్వం అనే 1500 వందల పుటల బృహత్ గ్రంథాన్ని బహూకరిచారు. ఆ గ్రంథాన్ని చూచిన తరవాత మేము వర్ధమాన సమాజం తరఫున ప్రచురించిన కవిత్రయ కవితా వైజయంతి పుస్తకం గుర్తుకొచ్చింది. దీన్ని నేను మనసు ఫౌండేషన్ సహకారంతో స్కానింగ్ చేయించి జాగ్రత్తచేశాను కూడా. మనసు గతంలోకి వెళ్లి ఏవేవో జ్ఞాపకాలు తోసుకుని వచ్చాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here