[dropcap]ఆ[/dropcap]కాశం కాన్వసుమీద
క్రమం తప్పకుండా ఆ కుంచె
వర్ణచిత్రాలు గీస్తూనే ఉంటుంది,
ఏ దిగులు మేఘాలో కమ్మిన
వర్షపుచినుకుల వేళలందు తప్ప
చీకటి కౌగిటి నుండి ప్రపంచం
మెల్లమెల్లగా విడివడుతున్న
ఉదయసంధ్యలో
ఇంకా రాత్రి తాగిన విశ్రాంతి మత్తు వీడకముందే
తూర్పు దిక్కున తన పని మొదలెట్టేస్తుంది
నీలం రంగు నేపథ్యంలో
ఎరుపు పసుపు నారింజ వర్ణాల మిశ్రణంతో
ఊహకందని ఎన్నెన్నో ఆకృతుల్ని
ఉన్నపలంగా, అలవోకగా గీసేస్తుంది
అప్పుడప్పుడూ, అక్కడక్కడా
తేలిపోతున్న తెల్లని మేఘాల పరదాలతో
కనిపించీ కనిపించనట్టుగా కప్పేస్తుంది
వేకువలోని వణికించే చల్లదనం
ఎండవేడిమిగా మార్పు చెందే సమయానికి
వెలుగు రంగును చిక్కగా చిమ్మేసి
‘గీతల’ గీతాలాపనకు మంగళం పాడేస్తుంది
వర్ణచిత్రాలు కాన్వాసు తెల్లబోయేలా
తెల్లని “వెల్ల” వేసేస్తుంది
సాయంకాలనికి షరా మామూలే….
పడమటి సంధ్యలో కుంచె
తన ప్రదర్శన మళ్ళీ మొదలెడుతుంది
వెంట్రుకల వేళ్ళ కొసల్నుంచి
గమ్మత్తు గీతల్ని గబగబా గీసేస్తుంది
రంగుల్ని చిమ్మేస్తు బంగారు హంగులేస్తుంది
వేడిమి వెనుతిరిగి వెళుతూ
‘చలి’ చెలియ కౌగిట చేరేందుకై
చీకటింటి వాకిట నిలిచే సమయానికి,
నలుపురంగును
నాల్గు దిక్కులనిండా చిమ్మేసి
తన ‘వర్ణచిత్రాల గ్యాలరీ’ని మూసేసి వెళ్తుంది,
రేపు తెల్లారి మళ్ళీ,
తూరుపు గట్టున తెరుస్తానంటూ