జ్ఞాపకాల పందిరి-91

23
3

[box type=’note’ fontsize=’16’]”కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నేను క్రైస్తవుడినేనా..!!

[dropcap]మ[/dropcap]తాలూ-మతసామరస్యాలూ అనే అంశాలు అవగాహన లోనికి వచ్చేసరికి సమాజం అన్ని విషయాలలోనూ కులాలుగా, మతాలుగా, ప్రాంతీయవాదులుగా విడిపోవడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఎవరి కులాన్ని వారు, ఎవరి మతాన్ని వారు, ఎవరి ప్రాంతాన్ని వారు బలపరచుకోవడం మొదలు పెట్టేశారు. ‘మనమంతా ఒక్కటే, మన ద్యేయం ఒక్కటే..!’ అన్న మూలసూత్రం మూలన పడిపోయి, అది ఒక నినాదంగా మిగిలిపోయింది. సాహిత్యం, కవిత్వం, సాహిత్య సాంస్కృతిక సంస్థలు సైతం, కులాలవారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోవడం భవిష్యత్తు ఊహించనంత భయాందోళనలకు గురి కావడం అందరూ గమనిస్తున్న విషయమే. ఇలాంటి సున్నితమైన విషయాలను వ్యతిరేకిస్తున్న వారూ వున్నారు, సమర్థిస్తున్నవారూ వున్నారు, విశేషం ఏమిటంటే ఈ రెండు పక్షాలూ మేధావి వర్గానికే చెందినవారు కావడం. ఈ పరిస్థితి రాజకీయంలోకి కూడా ప్రవేశించి, ఓటర్లను కులాలవారీగా, మతాల వారీగా, ప్రాంతాలవారీగా విడదీసి లెక్కగట్టడం బాధాకరమైన విషయం.

ఇది రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి, ప్రపంచ శాంతికి ఎంతవరకూ ఉపయోగం, ఎంతవరకూ అపాయకరం అన్నది తిరిగి మేధావులే నిర్ణయించవలసి వుంది. మన భారతదేశం హిందూ దేశంగా కొనియాడబడుతున్నప్పుడు, ఇతర మతాలూ మన దేశంలోకి ఎలా ప్రవేశించాయో విశ్లేషించుకుంటే చాలా బాధాకరమైన విషయాలు బయట పడతాయి, అందుచేత ఇలాంటి విషయాల గురించి పరిశోధనలు చేయరు, చేసినా ఆ ఫలితాలు సామాన్య ప్రజానీకానికి చేరనివ్వరు. అందుచేత అసలు విషయాలు ఎప్పటికీ మరుగున పడే ఉంటాయి. మా నాయన స్వర్గీయ కామ్రేడ్ కానేటి తాతయ్యగారు, మా ఇంటికి ఎవరైనా క్రిస్టియన్స్ (మా బంధువులే కావచ్చు) వస్తే, వారిని ముందుగా ఒక ప్రశ్న వేస్తే; వారు తికమక పడి పోయేవారు.

ఆ ప్రశ్న ఏమిటంటే “అసలు క్రైస్తవ మతం మన దేశం లోనికి ఎలా వచ్చిందో తెలుసునా?’’ అని. మాకు బాగా చిన్నతనం, ఆయన ప్రశ్న విన్నాక నా మట్టుకు నాకు ఏమి అనిపించింది అంటే ఇది మనదేశానికి సంబందించిన మతం కాదని. నాకు తెలిసి ఆయన అడిగిన ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చెప్పేవారు కాదు. చివరికి ఆయనే సమాధానం కూడా చెప్పేవారు.

తరచుగా మా నాయన దీని గురించి మాట్లాడినదానిని బట్టి నేను గ్రహించింది ఏమిటంటే, ఆనాడు ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం మనదేశానికి వచ్చినా ఇక్కడ వాళ్ళు గుర్తించిన ‘అస్పృశ్యత’ అంశంతో దళిత వర్గాలకు జరుగుతున్న వివక్షతను సొమ్ముచేసుకునే ప్రయత్నంలో, సమాజంలో చిన్నచూపుకు గురి అవుతున్న వర్గాలను దగ్గరకి తీశారు. వాళ్ళ చదువు విషయంలో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. పాఠశాలలు ప్రారంభించి ఉచితంగా చదువు అందించారు. ఆసుపత్రులు నిర్మించి ఉచితవైద్యం అందించారు, మంచి తిండి, బట్ట సమకూర్చారు. ఇంత దగ్గరితనంతో, ప్రేమాభిమానాలు అందించడమే కాక సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశం కల్పించడంతో, ఆయా పేదవర్గాలలో అనూహ్యమైన స్పందన దానికదే వచ్చేసింది. అలా వారి మాటకు విలువ దక్కింది, వాళ్ళు చెప్పకుండానే ఎక్కువమంది క్రైస్తవం వైపు మొగ్గు చూపడం జరిగిపోయింది. ఆంగ్లేయులకు మాత్రం ‘మత ప్రచారకులు’గా అపకీర్తి దక్కింది. ఈ సమాచారం తెలుసుకున్న తరువాత, విద్యాపరంగా వారు చేసిన మహత్తర సేవలకు గుర్తుగా ఇప్పటికీ, తూర్పు గోదావరి జిల్లాలోని, సఖినేటిపల్లిలో వున్న ‘లూథరన్ హై స్కూల్’; పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో వున్న ‘మిస్సమ్మ ఆసుపత్రి’ చిన్న ఉదాహరణలు మాత్రమే! ఎంతోమంది పేదపిల్లలు లూథరన్ హై స్కూల్‌లో చదువుకుని పెద్ద పెద్ద హోదాలలో స్థిరపడిన వారు వున్నారు.  అందులో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా వున్నారు. మిస్సమ్మ ఆసుపత్రిని ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలూ వినియోగించుకోగలగడం గమనించ దగ్గ విషయం!

ఇటువంటి కొన్ని ప్రజోపయోగకరమైన పనులు సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించడంలో ఆశ్చర్య పడనక్కరలేదు. ఆ పరిస్థితులు రావడానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

ఇటువంటి నేపథ్యంలో మాది నూటికి నూరుశాతం ‘నాస్తిక కుటుంబం’. మా వూరిలో ‘చర్చి’ ఒక్కటి కూడా లేదు. మా పక్క గ్రామమైన రామరాజులంక’ (మా అమ్మమ్మ వూరు)లో మాత్రం ఒక చర్చి ఉండేది. ఆ గ్రామంలో తొంబై శాతం పైన క్రైస్తవులు ఉండేవారు. ఇక్కడ వింత ఏమిటంటే మా అమ్మ ‘చొప్పల’ వారి ఇంటి ఆడపడుచు. వారిది క్రైస్తవ కుటుంబం. కానీ మా అమ్మ కానేటి (చొప్పల) వెంకమ్మ వచ్చి నాస్తిక కుటుంబంలో పడింది. అది ఎలా జరిగిందో తెలీదు కానీ మా ఇంట్లో ‘దేవుడు’ అనే పదం అసలు వినిపించేది కాదు. మా మేనమామలు, పెద్దమ్మ, పిన్ని, క్రైస్తవం లోనే ఉండేవారు. నేను పెద్దగా ఎదిగి కాస్త లోకజ్ఞానం వచ్చిన తర్వాత కూడా, ఈ మతాల సమస్య నన్ను ఇబ్బంది పెట్టలేదు. పైగా అన్ని మతాలను నేను గౌరవించేవాడిని,

ముస్లింలలో, క్రైస్తవులలో, హిందువులలో నాకు మంచి మిత్రులు ఉండేవారు. స్నేహానికి తప్ప మరి ఏ ఇతర అంశాలకు ప్రాధాన్యత నిచ్చేవాడిని కాదు. అయితే ఈ మత సమస్య నాకు పెళ్లి సమయంలో అంకురించింది. నాకు నచ్చిన అమ్మాయి, క్రైస్తవ మతస్తురాలు కావడంతో సమస్య ఉత్పన్నమైంది. అవతలి వాళ్లకి నేను క్రైస్తవుడిని కాకపోవడం వల్లనే ఇబ్బంది వచ్చింది. వాళ్ళ కుటుంబంలో తొంబై తొమ్మిది శాతం నా పట్ల వ్యతిరేకత వచ్చింది. మతం తప్ప అన్ని విషయాలలోనూ నేను వాళ్లకు నచ్చాను. మతపిచ్చి ఎంత లోతుగా వేళ్లూనుకుందో అప్పుడే నాకు అర్థం అయింది.

తల్లిదండ్రులతో. రచయిత శ్రీమతి (నిలబడ్డ వారిలో కుడి)అరుణ

అమ్మాయి (ఇప్పుడు నా శ్రీమతి) నన్నే చేసుకుంటానని పట్టుపట్టడం, అమ్మాయి తల్లి కూతురికి అనుకూలంగా మారడంతో సన్నివేశం సుఖాంతం వైపు మళ్లింది. నేను కూడా తగ్గి క్రైస్తవ వివాహానికి తలఒగ్గక తప్పలేదు. పెళ్లి వరకూ అంతా సజావుగానే సాగిపోయింది.

క్రైస్తవ పద్ధతిలో రచయిత వివాహం

తర్వాత ఆచార వ్యవహారాలతో ఆమెకు సమస్య వచ్చిపడింది. పెళ్లి సమయానికి నేను మహబూబాబాద్ ఆసుపత్రిలో పని చేస్తున్నాను. ‘బొట్టు’, చర్చికి వెళ్లడం విషయంలో ఆంక్షలు విధించేవాడిని. కొన్నాళ్ల తర్వాత నేను చేస్తున్న పని సరియైనది కాదని నాకే అనిపించింది. నన్ను ప్రేమించి, నా మీద నమ్మకంతో నా అడుగులో అడుగు వేసి నా కూడా వచ్చిన వ్యక్తిని అలా వేధించడం, మానసికంగా హింసించడం సబబు కాదనిపించింది. తక్షణమే నా ఆంక్షలు తొలగించి ఆ విషయాలలో ఆమెకు స్వేచ్ఛను ఇచ్చాను. నా మూర్ఖత్వానికి నేనే సిగ్గుపడ్డాను, అలాగే బాధపడ్డాను కూడా. ప్రతి క్రిస్మస్‌కు విజయవాడ వెళ్ళేవాళ్ళం, అలాగే ప్రతి సంక్రాంతికి, మా పెద్దక్క (దక్షిణ విజయపురి, నాగార్జున సాగర్) దగ్గరికి వెళ్ళేవాళ్ళం. పండగ కోసం అనే కాక, నా పుట్టిన రోజు ‘భోగి’ పండుగ రోజున వచ్చేది, అందువల్ల అలా ఆ సమయం అక్క దగ్గర గడిపేవాళ్ళం.

హన్మకొండ వచ్చిన తర్వాత నా శ్రీమతిని కారులో నేనే చర్చికి తీసుకు వెళ్ళేవాడిని. అయినా నన్ను ఎవరూ క్రిస్టియన్‌గా గుర్తించేవారు కాదు. కానీ మా పిల్లల పెళ్లిళ్లతోనే,నా స్నేహితులు చాలామంది నేను ‘ఫలానా’ అని తెలుసుకున్నారు. కొందరు ఆశ్చర్యపోయారు, ఎందుకో నాకు ఇప్పటికీ తెలియదు. మేము మా స్వార్థం కోసం చేసిన పని వల్ల ఏ రూపంలోనూ పిల్లలకు ఇబ్బందులు రాకూడదన్నదే నా అభిమతం. అందుకే నేను మతం విషయంలో మొండి వైఖరి ప్రదర్శించలేదు. సంసారం చల్లగా, ఆనందంగా సాగిపోవడమే ముఖ్యం అన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం వల్ల, ప్రతివిషయము లోనూ పరస్పర అవగాహనా, ఆలోచనా విధానం మా ఇద్దరిలోనూ ఉండడం మూలానా ఎలాంటి సమస్యలకూ తావు లేకుండా పోయింది. అందుచేత నేను ఏమిటో నాకు బాగా తెలుసును, ఇతరులు ఏమనుకున్నా నాకు అభ్యంతరం ఉండదు.

రచయిత కూతురి క్రైస్తవ వివాహం
క్రిస్మస్ సంబరాలలో రచయిత కుటుంబం
రచయిత కూతురు, అల్లుడు, మనవరాలు ‘ఆన్షి’

సంసారంలో సుఖశాంతులే ముఖ్యమని భావించేవారిలో నేనూ ఒకడిని. ఎలాంటి ఇజాన్ని తలకు చుట్టుకోకుండా, చేతనయినంత సహాయం ఏదో రూపంలో సమాజానికి అందించాలన్నదే నా ధ్యేయం! నేను బ్రతికి ఉన్నంత కాలం ఇదే కొనసాగుతుందేమో!

ఇప్పటికీ ఈ అరవై ఎనిమిదేళ్ల వయసులోనూ నేను అనుకుంటాను, ఇంతకీ నేను క్రైస్తవుడినేనా? ఏమో..!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here