[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
“అమ్మా, ఆకలి..” స్వీటీ పిలుపు
“అరగంట క్రితమేకదే టిఫిన్ తిన్నావూ..” నా జవాబు
“అది టిఫినాకలి..”
“ఓ అరగంటాగు.. అన్నం పెట్టేస్తాను..”
“అది అన్నం ఆకలి..”
“మరి.. ఇదేమాకలి..” విసుగ్గా నా గొంతు
“ఇది ‘ఏదైనా’ ఆకలి..” స్వీటీ నవ్వుతూ ఇచ్చే జవాబు..
“ఏదైనా అంటే..”
“ఏదైనా..”
“ఒక ఇడ్లీ ఉంది తిను..”
“అది టిఫిను కదా..”
“పులిహార ఉంది కాస్త తిను..”
“అబ్బా.. పులిహార ఏదైనా ఎందుకౌతుందీ!”
“మరి ఏదైనా అంటే..”
“కాసేపు నోరు ఆడ్డాని కమ్మా..” చెల్లెలికి సాయం వచ్చేడు బాబీ.
నీరసం వచ్చేసింది నాకు. పిండిమరలా ఈ నోరాడ్డం ఏమో కానీ తనకి మటుకు అన్నిరకాలుగానూ నీరసం వచ్చేస్తోంది.
ఈ మహమ్మారి వచ్చి ఎప్పుడైతే మనుషులందరూ ఇంట్లోనే ఉండి ఆఫీసుపనులూ, స్కూలుపనులూ కానిచ్చేస్తున్నారో అప్పటినుంచీ ఇంట్లో ఇల్లాళ్లకి అసలు ఖాళీ అంటూ లేకుండా పోయింది.
ఈ “ఏదైనా” అన్న పదార్ధానికి ఒక సమయం, సందర్భం అంటూ ఉండదు. పిల్లల మూడునిబట్టి ఆ “ఏదైనా” స్వరూపం మారిపోతుంటుంది. ఒకసారి చిప్స్, ఇంకోసారి చాకలెట్స్, మరోసారి జంతికలు, ఇంకోసారి చిక్కీ, ఇంకోసారి మసాలా పల్లీలు, అవి అయిన కాసేపటికే పాప్ కార్న్….. ఇలా అది ఏ రూపమైనా పొందుతుంటుంది. ఇదివరకు అంటే మగవాళ్ళు ఆఫీసులకీ, పిల్లలు స్కూళ్ళకీ సవ్యంగా సమయానికి వెళ్ళివచ్చే రోజుల్లో వారానికోసారి ఒక స్వీటూ దాంతోపాటు జంతికలో, మిక్స్చరో చేసి పడేస్తే వారంరోజులూ నోరాడించడానికి సరిపోయేది. కానీ ఎప్పుడైతే అందరూ వాళ్ల వాళ్ళ పనులు ఇంట్లోంచే చేసుకోవడం మొదలెట్టేరో అప్పట్నించీ ఈ “ఏదైనా..” అనే పదార్ధం విశ్వరూపం దాల్చేసింది. ఆరారగా ఈ “ఏదైనా”లు అందిస్తూ, మధ్యే మధ్యే పానీయాలు సమర్పించుకుంటూ ఈ రెండేళ్ళనించీ ఇంటి ఇల్లాళ్ళ పని రెండింతలయింది. ఒకవేళ ఆ ఇల్లాలుకూడా ఉద్యోగిని అయిందంటే ఇంక ఆమె పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కే.
దానికితోడు అదేవిటో నలభీముల వారసులు కొందరు యూట్యూబులో రకరకాల కొత్త కొత్త వంటకాలు ఎలా చెయ్యాలో అప్లోడ్ చేసేస్తున్నారు. కొంతమంది పాతవంటలు కొత్తరకంగా చెయ్యడం చెపుతుంటే, ఇంకొంతమంది కొత్తవంటలు సులభంగా ఎలా చెయ్యాలో చూపిస్తున్నారు.
కొంతమంది ఆరోగ్యానికి ప్రాముఖ్యత నిస్తుంటే ఇంకొంతమంది రకరకాల రుచులని చూపెట్టి ఊరిస్తున్నారు. చాలా సులభంగా యూట్యూబ్ చూసే పిల్లలు అవన్నీ చూసి “ఇదిచెయ్యి, అది చెయ్యి” అంటూ వాళ్లమ్మల వెనకాల పడుతున్నారు. అంతేకాకుండా వాట్సప్ గ్రూపులొకటి.. స్నేహితుల గ్రూపులు, చుట్టాల గ్రూపులు, కేవలం వంటలు మాత్రమే చేసే గ్రూపులు ఇలా బోల్డు గ్రూపులు. వాటిలో రోజూ బ్రెక్ ఫాస్ట్ దగ్గర్నించీ రాత్రి డిన్నర్ వరకూ అన్నీ ఫొటోలతో సహా అప్లోడ్ చేసెయ్యడం. అవి చూసి మిగిలినవాళ్ళు “ఆహా…ఓహో..” అంటూ పొగిడెయ్యడం.. ఇవన్నీ చూస్తున్న ఇంట్లో మగాళ్ళూ, పిల్లలూ అలాంటి కొత్తరకాలు చెయ్యమంటూ ఇంటి ఇల్లాళ్ల వెనకాల పడడం చూస్తుంటే నాలాంటి మామూలు గృహిణి పరిస్థితి ఎవరితో చెప్పుకునేదీ!
ఆలోచిస్తున్న నాకు వెంటనే ఏడాదిక్రితం వదిన చేసిన పని గుర్తొచ్చింది. అప్పుడుకూడా లాక్ డౌన్ సమయంలో ఇలాగే ఇల్లాళ్ళందరూ ఇంట్లోవాళ్ళు కోరినవి చేసి పెట్టలేక, ఏం చెయ్యాలో తోచక కొట్టుకుంటుంటే అందరినీ కలిపి వదిన ఒక జూమ్ మీటింగ్ పెట్టింది. ఆ జూమ్ మీటింగ్ లో వదిన దీనికి ఒక పరిష్కారం సూచించింది. అదేమిటంటే ఇల్లాళ్ళమందరం కలిసి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదివిన సైంటిస్టులకి ఒక వినతిపత్రం సమర్పించాలి. ఆ వినతిపత్రంలో ఏముంటుందంటే వేరే గ్రహాలకి వెళ్ళే ఆస్ట్రొనాట్స్ వాళ్ళు తినడానికి బ్రెక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాప్స్యూల్స్ లాగా మార్చుకుని తీసికెడతారు కదా… అలాగే ఇంట్లోవాళ్లకి కూడా వాళ్ళేదడిగితే అది, అన్నిరకాలూ కాప్స్యూల్ ఫార్మ్ లోకి మారేలాగా రీసెర్చ్ చేసి, కంపెనీలకి ఆ ఫార్ములా లమ్మి, వాటిని అతి తొందరలో మార్కెట్ లో ప్రవేశపెట్టేలా చూడమని. అలా మార్లెట్లోకి అన్ని రకాల తిండిపదార్ధాలూ కాప్స్యూల్స్ లాగా వచ్చేస్తే హోల్ సేల్ గా కొనేసుకుంటే ఈ “ఏదైనా” బాధ తప్పుతుందంది మా వదిన. అందరికీ వదిన చెప్పిన ఈ పరిష్కారం బలే నచ్చేసింది. దానికి తోడుగా కొంతమంది ఇంకొన్ని చేర్చేరు.. అవి వరసగా…
- కాప్స్యూల్ నోట్లో వేసుకోగానే ఆ పదార్ధమే తింటున్న రుచి నాలుకకి తగలాలి.
- కాప్స్యూల్ నోట్లో పడగానే ఆ పదార్ధం వాసన ముక్కుకి తగలాలి.
- కళ్ళకి ఆ పదార్ధమే తింటున్నట్టు కనపడాలి..
పైవన్నీ జరిగినట్లు కళ్ళూ, ముక్కూ, నాలుకా మెదడుకి సంకేతాలు పంపించాలి. అప్పుడు ఆ తిన్న మనిషి తృప్తి పడినట్టు కడుపులోంచి తేనుపు రావాలి..
అంటే ఇడ్లీ కాప్స్యూల్, పచ్చడి కాప్స్యూల్, సాంబార్ కాప్స్యూల్ కనక వేసుకుంటే నాలుకకి వాటి రుచీ, ముక్కుకి సాంబార్ వాసనా వచ్చి, అవి వేసుకోగానే కడుపులోంచి ఇడ్లీ సాంబార్ తిన్నట్టు తేనుపు రావాలన్న మాట.
మా తెలివికి మేమే మురిసిపోయేం. వెంటనే వినతిపత్రం తయారుచేసి, దానిమీద వెయ్యిమందికి పైదాకా గృహిణుల సంతకాలు సేకరించి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ గారికి ఆన్ లైన్ లో సమర్పించుకున్నాం. ఆ డైరక్టరుగారు ఎంత మంచివారో.. మా వినతిని తొందరలోనే పరిశీలిస్తామని హామీ ఇచ్చేరు.
అవునూ.. అప్పుడే ఏడాది దాటిపోయింది.. దాని మాటే మర్చిపోయేనేంటీ…ఆ డిపార్ట్ మెంట్ వాళ్ళు కనక ఈపాటికి ఆ కాప్స్యూల్స్ ని కనిపెట్టేసివుంటే ఎంచక్క కొని ఇంట్లో పడేసుకోవచ్చుగా…
నాకు ఎక్కడలేని హుషారూ వచ్చేసింది. వెంటనే వదినకి ఫోన్ చేసి దాని సంగతి ఏమైందని అడిగేను.
“దేని మాటా!” అంది వదిన అవతలనించి నీరసంగా..
“అదే వదినా ఆ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ కాప్స్యూల్స్ తప్పకుండా చేస్తానన్నాడుగా.. ఇంకా మార్కెట్లోకి రాలేదా..” నాకు ఆతృత ఆగటంలేదు.
“మార్కెట్ దాకా ఎక్కడ.. ఇంకా రీసెర్చే చేస్తున్నారుట..”
“ఇంకానా. ఇన్నాళ్ళెందుకు..నువ్వు గట్టిగా అడగలేదా!”
“అడక్కేం.. చాలా గట్టిగానే అడిగేను. అప్పుడాయన ఒక మాటన్నారు..”
“ఏవనీ..”
“మనం అడిగినవన్నీ చెయ్యాలంటే కాప్స్యూల్స్ చేస్తే సరిపోదుట.. ఏకంగా రోబో ని కనిపెట్టాలిట..”
“అదేంటీ!” ఆశ్చర్యపోయేను.
“అదే మరి.. మనం వినతిపత్రంలో చెప్పినవి చెప్పినట్టు అవాలంటే అవన్నీ లాబ్ లో అవవుట. వాటికోసం అవన్నీ చేసే చేసే రోబోని సృష్టించాలిట. అదెలా ఉండాలంటే దేవుడు ప్రతి ఇంట్లో తనుండలేక అమ్మని సృష్టించనట్టు ఆ రోబోని సృష్టించాలిట. అది తమవల్ల కాదని ఆ డైరెక్టర్ చేతులెత్తేసేరు..”
“అంతేనా!” నీరసంగా అడిగేను.
“అంతేకాదు.. ఇంకా చెప్పేరు. ఆఖరికి ఎంత బాగా చేసారనుకున్నా సైంటిస్టులు అమ్మలాంటి రోబోను మటుకు చెయ్యలేరుట. అది ఒక్క దేవుడికే సాధ్యమట,,”
“హారి దేవుడా! ఎంత పని చేసేవయ్యా…” అసంకల్పితంగా నా నోట ఆ మాట వచ్చేసింది.
ఆ మాట వినగానే వదిన “అలా ఎందుకనుకోవాలీ! మనలని తన అంశగా చేసిన దేవుడికి మనసారా దండం పెట్టుకుందాం..”
ప్రతి విషయాన్నీ పాజిటివ్ గా తీసుకునే వదిన మాటలకి నేను కాస్త స్థిమితపడి
“అలాగే అనుకుందాం.. కానీ ఓ దేవుడా.. తొందరలో మళ్ళీ ఆఫీసులూ, స్కూళ్ళూ తెరిచేలా చూడవయ్యా.. అనుకోవచ్చా..”
“అంతకన్నానా.. అందుకోసం మళ్ళీ అందరం కలిసి దేవుడికో వినతిపత్రం సమర్పిద్దాం..”
ప్రతిదానినీ హాస్యంగా మార్చే వదిన మాటలకి నాకు తెలీకుండానే నా పెదవుల మీదకి చిరునవ్వు వచ్చి చేరింది.
“అంతేలే.. అలాగంటూ రోజూ దేవుడికో దండం పెట్టుకుందాం..” అంటూ ఫోన్ పెట్టేసేను.