[box type=’note’fontsize=’16’]’సాగర ద్వీపంలో సాహస వీరులు’అనే పిల్లల నవలను ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. [/box]
[dropcap]ద[/dropcap]శరథుని మనుమ సంతతి చక్కగా రాజ్యపాలన చేయసాగారు. ఒకరోజు అయోధ్య నగర దేవత కుశునకు కలలో కనిపించి “నీ పూర్వికులు పాలించిన అయోధ్యను జనరంజకంగా పాలనచేయి” అని కోరడంతో, కుశావతి పట్టణాన్ని బ్రాహ్మణులకు ధారబోసి, అయోధ్య పాలించసాగాడు. ఒకరోజు కుశుడు పరివారసమేతంగా వచ్చి, సరయూనదిలో జలక్రీడలు ఆడుతుండగా కుశుని చేతినుండి ‘చైత్రాభరణం’ జారి నీటిలో పడిపోయింది. అది అగస్త్యమహర్షి నుండి తన తండ్రి స్వికరించి తనకు ఇచ్చిన దివ్య ఆభరణం. దానికొరకు ఎంతవెదికించినా ప్రయోజనం లేకపోవడంతో కోపగించిన కుశుడు తన ధనస్సులో గరుడాస్త్రాన్ని సంధించి నదికి ఎక్కుపెట్టాడు.
“రక్షించండి మహావీరా, ఇదిగో మీ ఆభరణం, నేను కుముదుడు అనే నాగరాజును. పాతాళలోక నివాసిని. ఈమె నా చెల్లెలు ‘కుముద్వవతి’. తమరు ఈమెను వివాహం చేసుకోవాలని నా మనవి” అని చేతులు జోడించాడు. వారి వివాహనంతరం కొంతకాలానికి వారికి ‘అతిథి’ అనే కుమారుడు జన్మించాడు. అన్ని విద్యలు నేర్చిన అతిథికి నిషద రాజకుమార్తెతో వివాహం జరిపించారు. వీరికి ‘నిషాదుడు’ జన్మించాడు.
‘దుర్జయుడు’ అనే రాక్షసుడు ఇంద్రునితో యుధ్ధనికి రాగా ఇంద్రుడు కుశుని సహాయం కోరాడు. తమ వంశ ఆచార ప్రకారం శరణాగతులను రక్షించడం ఆచారం కనుక కుశుడు దుర్జయునితో పోరాడుతూ అతన్ని సంహారించి తనూ ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్య కుముద్వతి నాటి ఆచార ప్రకారం సతీసహగమనం చేసింది. నిషాదునికి ‘నలినాక్షుడు’, అతనికి ‘నభుడు’, అతనికి ‘పుండరీకుడు’, అతనికి ‘క్షామధన్వుడు’, అతనికి ‘దేహనీకుడు’, అతనికి ‘అహీనగుడు’, అతనికి ‘పారియాత్రుడు’, అతనికి ‘శీలుడు’, అతనికి ‘ఉన్నభుడు’, అతనికి ‘వజ్రనాభుడు’, అతనికి ‘శంఖణుడు’. అతనికి ‘వ్యుషితాశ్వుడు’, అతనికి ‘విశ్వసహుడు’, అతనికి ‘హిరణ్యనాభుడు’, అతనికి ‘కౌసల్యుడు’, అతనికి ’బ్రహ్మిష్ఠుడు’, అతనికి ‘పుత్రుడు’, అతనికి ‘పుష్యుడు’, అతనికి ‘ధ్రువసంధి’, అతనికి ‘సుదర్మనుడు’, అతనికి ‘అగ్నివర్ణుడు’ జన్మించారు.
వ్యాధిగ్రస్థుడు అయిన అగ్నివర్ణుడు మరణించేనాటికి అతని భార్య గర్బవతి, ఆమె రాజ్యపాలన స్వీకరించింది. మంత్రులు, రాజోద్యోగుల అండదండలతో రాజ్యపాలన కొనసాగించింది” అన్నాడు విజయుడు.
విజయుడు ఆలా అనగానే శిలగా ఉన్న రాజకుమారులు నలుగురు నిజరూపాలు పొందారు.
”విజయోస్తూ వీరకుమారులారా, విద్యావేత్తలేకాదు, స్త్రీలను గౌరవించే మీలాంటి వారు నిత్యవిజయోస్తులై వర్ధిల్లుతారు. మేము గంధర్వ కాంతలం. శుభమస్తు, మీప్రయాణంలో సముద్రం కనిపిస్తుంది, దానిపై ప్రయాణం చేయండి ఇరువురికి శుభకరం జరుగుతుంది.” అని దీవించి అదృశ్యమై పోయారు.
అప్పటికే తూర్పున సూర్యుడు ఉదయించాడు. ఆ రాకుమారులు వీరికి దన్యవాదాలు తెలియ జేసి తాము విదర్భ, అవంతి, మగధ, కళింగ రాజ్యాల రాజకుమారులమని దేశాటనకు వచ్చి ఇలా శిలలుగా మారామని వారి వివరాలు తెలియజేసి తప్పక తమ రాజ్యాలకు వచ్చి ఆతిథ్యం స్వీకరించ వలసినదిగా ఆహ్వానించి తమ రాజ్యాలకు బయలుదేరి వెళ్ళారు.
ఆ ప్రాంతం లోని విశేషాలు తిలకించడానికి మిత్రులు ఇరువురూ బయలుదేరారు.
దారిలో అడ్డుగా ఉన్న చిన్నచిన్న ముళ్ళ చెట్టు కొమ్మలు కత్తితో తప్పిస్తు ముందుకు వెళుతున్న వారికి అక్కడ కొద్దిపాటి మైదానంలో కనిపించిన దృశ్వం ఆశ్చర్యం కలిగించింది. అక్కడ గడ్డిమేస్తున్న దుప్పిని ఆకాశం నుండి రివ్వున వచ్చిన రాక్షసి పక్షి అవలీలగా తన కాలిగోళ్ళతో నొక్కిపట్టి మోసుకు వెళ్ళిపోయింది. ఆ దృశ్యం చూస్తునే ఈ అడవి ఎంత ప్రమాదకరమైనదో ఊహించారు మిత్రులు.
ఆ రోజు పరిసరాలలోని అడవిని అంతా పరిశీలించి, సమీపంలోని జలపాతంలో స్నానమాచరించి, ఆ పరిసరాలలో లభించిన పనస, రేగి, నేరేడు, బొప్పాయి, అరటి వంటి వివిధ ఫలాలు ఆరగించి ఆ రాత్రి పెద్దచెట్టపై పడకలు ఏర్పాటు చేసుకుని నిద్రించారు మిత్రులు.
ఉదయం మిత్రులు తమ ధనస్సు, అంబులపొదిని, నారసంచులు తయారు చేసుకుని వీపుభాగాన అమర్చుకుని బయలుదేరారు.దారిలో ఎక్కడా వారికి మానవ సంచారంకానీ, ప్రమాదకరమైన జంతువులు కాని కనిపించలేదు.
దొరికిన ఫలాలు ఆరగిస్తూ, మూడు రోజుల ప్రయాణ అనంతరం సముద్రతీరం చేరుకున్నారు.
***
అనంతరం సముద్రయానం చేయదలచినవారు, నిల్వ ఉండే పండ్లను, మంచినీరు పలురోజులకు సరిపడా సిధ్ధం చేసుకుని, అడవిలో ఎండి ఒరిగిన దుంగలు (చెట్లు) ఒకచోటచేర్చి వాటంన్నింటిని అడవితీగలతో గట్టిగా కట్టి తెప్పలా ఏర్పాటు చేసుకుని సముద్ర ప్రయాణం ప్రారంభించారు. మిత్రులు ఇరువురు తెడ్లు వేయసాగారు. నాలుగురోజుల రోజుల ప్రయాణం అనంతరం రాత్రి సమయంలో సంభవించిన గాలివానలో చిక్కుకున్న వారి తెప్ప ముక్కలైయింది. దొరికిన తుంగలను గట్టిగా పట్టుకున్న మిత్రులు సముద్రంపైనే విడి పోయారు. చెరోపక్కకు అలల ధాటికి ప్రయాణిస్తూ రెండురోజులు మంచినీరు, ఆహారం లేకుండా దూరంగా ఉన్నఒక దీవి చేరుకున్నారు.
తను ఆ దీవిలో అడుగుపెడుతూనే తన మిత్రుడి కొరకు ఆ పరిసరాలన్నిచూసాడు విజయుడు.
చిక్కగా ఉన్న అడవి ప్రాంతమైన దీవిలో తను ఉన్నట్లు గ్రహించాడు. తనలాగే మిత్రుడు జయంతుడు కూడా ఇదే దీవిలో ఎక్కడో చిక్కుబడి ఉంటాడని ఊహించి, పేరు పెట్టి పెద్దగా పిలిస్తే ఆ అడవిలోని పరిసర ప్రాంతాలలో ఉన్న క్రూరమృగాలకు, ఆటవికులకు తన ఉనికి తెలుస్తుందని ఊహించి జయంతుని వెదుకుతూ నడకసాగించాడు విజయుడు.
అప్పటికే సాయంత్ర సమయం కావడంతో అడవి జంతువుల అరుపులు వినిపించసాగాయి. రాత్రికి తను విశ్రమించడానికి అనువైన ప్రదేశం వెదుకుతూ ముందుకు వెళ్ళసాగాడు. ఆకలి, దాహంతో చెట్లకు ఉన్న పండ్లు తింటూ కొద్దిదూరంలో పారుతున్న సెలఏటిలో దాహం తీర్చుకుని స్నానంచేసి, తన ప్రయాణం కొనసాగించాడు.
అలా కొద్దిదూరం ప్రయాణం చేసాక ఆ పరిసరాలలో కొద్దిదూరంలో అలికిడి కావడంతో అక్కడకు వెళ్ళి ఒక చెట్టుచాటునుండి చూడగా నడుము భాగం నుండి గుర్రంలా ముందుభాగం మనిషిలా ఉన్నవ్యక్తి జంతువులను తరుమూతూ వెళుతున్న వింత ప్రాణిని చూసి ఆశ్చర్యపోయిన విజయుడు తన ప్రయాణం కొనసాగించాడు. కొద్దిదూరంలో తనకు సురక్షితం అనిపించిన పెద్ద వేప చెట్టుపైన రెండు కొమ్మల మధ్యన కొని కొమ్మలు అడ్డంగా వేసి వాటిపైన చిన్నచిన్న కొమ్మలను పరచి ధనస్సు బాణాలు తలకింద పెట్టుకుని కత్తిని కుడిచేతివైపు ఉంచుకుని నిద్రపోయాడు.
కొంతసేపటి తరువాత తనను ఎవరో బలంగా అదిమిపెడుతున్నట్లు అనిపించిన విజయుడు కళ్ళు తెరిచాడు. అప్పటికే తను ఓ పెద్ద కొండచిలువ నోట్లోకి వెళుతున్నట్లు గ్రహించి, అతికష్టంపైన తనకత్తిని తననోటితో పట్టుకున్నాడు. కొద్ది కొద్దిగా విజయుని మింగుతూ వచ్చిన కొండచిలువ అతని తలభాగాన్ని మింగబోయింది. విజయుని నోటిలో ఉన్నకత్తి కొండచిలువ నోటిని మింగినప్పుడు దాని నోరు తెగసాగింది. రెండు సార్లు మింగిన కొండచిలువ నోరు చీలిపోవడంతో విజయుని వెలుపలకు వదలి తాను చెట్టుపై నుండి కిందపడి మరణించింది. అప్పటికే తెల్లవారడంతో చెట్టుదిగిన విజయునికి “కాపాడండి, రక్షించండి” అని ఎవరో కీచుగొంతుకతో అనడం తనకు చేరువలోని పొదలమాటున వినిపించింది. అక్కడకు చేరిన విజయుడు అక్కడి దుృశ్యం చూసి ఆశ్చర్యపోతూ, ఒరలోనుండి కత్తిదూసాడు.
***
అదే దీవిలో సుదూరంగా చేరిన జయంతుడు, జంతువుల అరుపులు ఆలకిస్తూ వాటికి దూరంగా వెళుతూ తను ఉండటానికి సురక్షితము అనువైన ప్రదేశం ఉందేమోనని అన్వేషణ చేస్తూ, ఆహారం లభించేస్తుందేమోనని పరిసరాలను పరిశీలిస్తూ వెదకసాగాడు. కొంత సమయం గడచింది. అలా వెదుకుతూ అడవిలోనికి కొంతదూరం వెళ్ళిన జయంతుడికి అక్కడ కనిపించిన దృశ్యం ఆశ్చర్యం కలిగింది. మానవసంచారం ఊహించలేని ఆద్వీపంలో జయంతునికి కొద్దిదూరంలోని శిధిలావస్ధలో ఉన్న ఆలయాన్ని చూసి అక్కడకు వెళ్ళాడు, ఆలయ పరిసరాలలో ప్రవహిస్తున్న నీటిలో స్నానమాచరించి అందుబాటులోఉన్న, పొగడ, పున్నగా, మందార, మాలతి పుష్పాలతో గుడిలో గ్రామదేవతలలో ఒకరైన పోలేరమ్మదేవత విగ్రహం ఉంది. అంటే ఈపరిసరాలలో గతంలో నాగరీకులైన ప్రజలు నివసించారన్న మాట, ఏ కారణం చేతనో వారంతా ఈ ప్రాంతాన్ని వదలి వెళ్ళోరో అనుకుంటూ, అమ్మవారిని పూజించి తన మిత్రుడిని త్వరలో కలుసుకునేలా అనుగ్రహించమని వేడుకుని ఆలయంలో నుండి వెలుపలకు వస్తున్న అతనికి, దూరంగా కనిపించాయి, అక్కడకు చేరుకుని చేతికి అందిన పలురకాల పండ్లతో ఆకలి తీర్చుకుంటున్న సమయంలో ఆకాశంలో బ్రహ్మాండమైన గరుడ పక్షి ఆహారంకొరకు తిరుగుతూ ఉండటం గమనించిన జయంతుడు పక్కనే ఉన్న చెట్లకిందకు వెళ్ళాడు. ఆ గరుడపక్షి పిల్ల ఏనుగును సైతం తేలికగా మోసుకు పోయేలా ఉంది.
అడవిలో జంతువులకు తెలిసింది మూడే విషయాలు. మెదటది తమ ప్రాణాలు రక్షించుకోవడం, రెండవది ఆహారాన్ని సంపాదించుకోవడం, మూడవది తమ సంతానాన్ని ఉత్పత్తి చేయడం.. ఇవి తప్ప వాటికి మరేది తెలియదు. జంతువులకు ఆలోచనాశక్తి ఉండదు.
నడుస్తున్న జయంతునికి దూరంగా తోడేళ్ళ అరుపులు వినిపించాయి.
తోడేళ్ళు చాలా ప్రమాదకరమైన జంతువులు. తమకంటపడిన ఏ ప్రాణిని చంపకుండా వదలవు. అవి ఎప్పుడూ గుంపుగా ఆహార అన్వేషణ చేస్తాయి. ఎంతటి బలమైన ప్రాణిఅయిన వాటికి ఆహారంగా మారవలసిందే. వాటి అరుపులకు వ్యతిరేక దిశలో వేగంగా నడుస్తునే పరిసరాలను గమనిస్తూ, రాత్రి తాను బస చేయడానికి అనువైన ప్రదేశం అన్వేషిస్తుండగా దూరంగా ఉన్న కొండల దిగువ భాగంనుండి పొగరావడం గమనించిన జయంతుడు ‘అక్కడ పొగవస్తుంది అంటే ఆ పరిసరాలలో మానవులు నివాసం ఉండి ఉంటారు’ అనుకుంటూ ఆ దిశగా వేగంగా నడుస్తూ వెళ్ళగా, అక్కడకు కూతవేటు దూరంలో ఒక కోయగూడెం కనిపించింది. గూడెంకేసి వెళుతుండగా, కొందూరం నడిచాక చిన్నపాటి వాగు కనిపించింది. అది చాలా స్వచ్ఛంగా నీతి అడుగున రాళ్ళు కూడా కనిపించేలా స్వచ్ఛంగా ఉంది. దాహం తీర్చుకొని, గూడెంకేసి బయలుదేరి కొంతదూరం ముందుకు వెళ్ళాడు. అక్కడ కోతిని చుట్టుకున్న కొండచిలువ కనిపించింది.
బాధతో కోతి విలవిలలాడుతూ కిచ కిచ లాడసాగింది. కోతిని మింగబోతున్న కొండచిలువ తలను ఒడుపుగా చేజికించుకున్నాడు జయంతుడు. శ్వాస అందని కొండచిలువ భయం, కోపంతో కోతిని వదలి జయంతుని శరీరాన్ని చుట్టుకుంది గట్టిగా, దాని బారినుంది తప్పించుకున్న కోతి పక్కనే ఉన్న ఈతచెట్టు ఆకులు తుంచుకువచ్చి జయంతుని భుజంపై చేరి కొండచిలువ కంటిలో ఈత ఆకులు గుచ్చింది. బాధతో కొండచిలువ జయంతుని వదలి పొదలలోనికి వెళ్ళిపోయింది.
వేగంగా వెళ్ళిన కోతి ఎండు సొరకాయ బుర్ర నిండుగా మంచినీళ్ళు తెచ్చి జయంతునకు ఇచ్చింది. దాహం తీర్చుకుని స్ధిమిత పడిన జయంతుని ముందు పండిన పనసకాయ తెచ్చిఉంచింది. కోతి తెలివితేటలకు ఆశ్చర్యపోతూ ఆ పండు తన వద్ద ఉన్న చురకత్తితో కోసి కొన్ని పనస తోనలు కోతికి అందించి తనూ తిన్నాడు. కొంతసేపటి అనంతరం జయంతుని చేయి పట్టుకుని ఓ చెట్టువద్దకు తీసుకువెళ్ళి చెట్టుపైకి ఎక్కమని తొందరపెట్ట సాగింది కోతి. చెట్టు ఎక్కిన జయంతుడు గుబురుగా ఉన్నఆకులు ఉన్నకొమ్మపై సురక్షితంగా కూర్చున్నాడు. కోతికూడా అతనికి చేరువలోకూర్చుంది.
కొద్దిసేపటికి అక్కడికి తోడేళ్ళమంద ఊళ్ళ పెడుతూ వచ్చి ఆ ప్రాంతమంతా వాసన చూస్తూ, జయంతుడు ఉన్న చెట్టు వద్దకు వచ్చి చెట్టుపైకి చూస్తూ భయంకరంగా ఊళ వేయసాగాయి. కొంత సమయం అనంతరం తోడేళ్ళు తమ ఆహారం వెదుకుతూ వెళ్ళి పోయాయి. చెట్టు పైనుండి చూసిన జయంతునకు కొద్దిదూరంలో కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు.
***
పొదలచాటుకు వెళ్ళిన విజయునికి అక్కడ ఓ రామచిలుకను చుట్టుకున్న తాచు పాము కనిపించింది.
బలహీనస్వరంతో మానవభాషలో ఆ రామచిలుక ‘రక్షించండి’ అని వేడుకుంటుంది. చేతిలోని కత్తితో తాచుపాను గాయపరిచాడు విజయుడు. చిలుకను వదలి పాము పొదల్లోకి వెళ్ళిపోయింది.
“అమ్మయ్య సమయానికి వచ్చి రక్షించావు. నీకు నామప్పిదాలు. ‘ చావు తప్పి కన్నులొట్టబోయిందంటే ఇదా’?” అంది చిలుక.
“నువ్వు ఇకఇకవి కదూ, నేను విజయుడను. ఆరోజు చంపా రాజకుమారిని సుగంధిని, మంత్రి కుమార్తె భువనను నేను నా మిత్రుడు దొంగల బారినుండి కాపాడాము. అక్కడ వసంత మంటపంలో నామిత్రుడు జయంతుడుతో కలసి భోజనం చేస్తుండగా కథ కూడా చెప్పావు. నిన్ను నీ భార్య బెకబెకను అప్పుడే చూసాను” అన్నాడు విజయుడు.
“అయ్యా ‘తంతే బూర్లె బుట్టలో పడ్దట్లు’ ఉంది నా పరిస్ధితి. ఒకరోజు తనను ఓ డేగ తరుముతుండగా నా భార్య ప్రాణభయంతో ఎటో వెళ్ళిపోయింది. నా భార్య బెకబెకను వెదుకుతూ ఇలా వచ్చి ఈ పాము బారినపడ్డాను” అన్నాడు ఇకఇక.
తనూ జయంతుడు ఎలా విడిపోయామో వివరించాడు విజయుడు.
‘అల్లుడికి నేయి లేదు అల్లుడితో వచ్చినోళ్ళకు నూనె లేదు’లా ఉంది నా పరిస్ధితి. సాయంత్ర సమయం దాటుతుంది. ‘దీపం ఉండగనే ఇల్లు సరిదిద్దుకోవాలి’ అన్నట్లు పొద్దు ఉండగానే రాత్రి బస చేయడానికి సురక్షిత ప్రదేశం వెతకాలి. ఏది ఏమైనా నా ‘రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు’ ఈ మహారణ్యంలో నువ్వు నాకు తోడు దొరికావు. ‘ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు’ నా భార్య బెకబెకను కూడా పనిలో పనిగా వెదుకుదాం! దేవుడిలా నాకు నువ్వు కనిపించావు. నీ పేరులోనే విజయాన్ని పెట్టుకున్నావంటే నువ్వు చేపట్టే ప్రతి పనిలోను విజయం సిధ్ధిస్తుంది. ‘పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు’ కాదులే నన్న నీవెంట తీసుకువెళ్ళడం” అన్నాడు ఇకఇక.
“అలసటగా ఉంది కాసేపు ఆ చెట్టుకింద కూర్చుందాం” అన్నాడు విజయుడు.
చెట్టుకిందకు విజయునితో చేరిన ఇకఇక, “నీ అలసట తీరేలా ఇప్పుడు ‘అవ్వ నేర్పిన జీవితపాఠం’ అనే కథ చెపుతాను” అన్నాడు.
“నేను వద్దన్నా నువ్వు ఆపవుగా! అలాగే చెప్పు” అన్నాడు విజయుడు.
(సశేషం)