[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
సమరే బధబన్ధాది మ్లేఛ్ఛరాజా; ప్రపేదిదేవ!
సంప్రాప హేమరత్నాది పునః కశ్మీరభూపతి: ||
(కల్హణ రాజతరంగిణి VII.175)
త్రిలోచనుడికి సహాయంగా వెళ్ళి, ఓడి, తిరిగివచ్చిన తుంగుడిని సంగ్రామ రాజు ఏమీ అనలేదు. మౌనంగా ఉండిపోయాడు. కానీ రాజ్యంలో తుంగుడి పట్ల నిరసన పెరిగింది. రాజుకు తుంగుడి వ్యతిరేకంగా చెప్పేవారు అధికమయ్యారు. చివరికి ఒకరోజు రాజు సమక్షంలోనే అతడి శత్రువులు తుంగుడిపై దాడి చేసి నరికివేశారు. అతని అనుచరులు తిరగబడకుండా తుంగుడి శరీరాన్ని ముక్కలు చేసి వీధుల్లోకి విసిరేశారు. దాంతో తుంగుడి సమర్థకులు రాజ్యం వదిలి పారిపోయారు. మిగతావారు లొంగిపోయారు. లొంగనివారిని హతమార్చారు. తుంగుడి తరువాత అతడి స్థానాన్ని దుష్టులు ఆక్రమించారు.
ఇక్కడి నుంచీ కశ్మీరు చరిత్ర చూస్తే ఒక స్థిరమైన రాజు కనిపించడు. ప్రతి ఒక్కరు రాజ్యాధికారం కోరి కుట్రలు చేయటం కనిపిస్తుంది. కూటములుగా ఏర్పడి రాజును బెదిరించటం లేదా తమ మాట వినేవాడిని అధికారిని జేసి తాము పరోక్షంగా ప్రజలను దోచుకోవటం కనిపిస్తుంది. ప్రజలను పట్టించుకోక, కేవలం తమ స్వార్థం, తమ సౌఖ్యం చూసుకోవటం కనిపిస్తుంది. స్థిరమైన పాలన కనిపించదు. దీనికి తోడు, మహమ్మద్ గజినీ ఓడి కశ్మీరంలో అడుగిడక వెనుతిరిగినా, ఆయన మతం మార్చినవారు కశ్మీరు చుట్టూ ఉన్నారు. వారు చీటికీ మాటికీ కశ్మీరంపై దాడిచేసి చీకాకు పరచటం కనిపిస్తుంది. కశ్మీరుపై అధికారం కోసం మ్లేఛ్ఛ మూకలతో చేయి కలిపి కశ్మీరు రాజులతో పోరాడటం కనిపిస్తుంది. అంతేకాదు, భారతదేశం నలుమూలల నుంచి మతం మారినవారు అవకాశాలు వెతుక్కుంటూ కశ్మీరు చేరటం కనిపిస్తుంది. అల్లకల్లోలమైన జలంలో చేపలు సులభంగా కనిపిస్తాయంటారు. అలా అల్లకల్లోలంగా ఉన్న కశ్మీరంలో, అసమర్థులైన రాజుల పాలనలో అవకాశాలను వెతుక్కుంటూ మ్లేఛ్ఛ వీరులు కశ్మీరం చేరటం, ఉన్నత, నిర్ణయాత్మక స్థానాలు పొందటం కూడా చూడవచ్చు. అంటే, నెమ్మదిగా కశ్మీరం మ్లేఛ్ఛమయం అయ్యేందుకు వాతావరణం అనుకూలమవుతోందన్నమాట. భారతీయ రాజులు దురాశపరులై, పెద్దలు వివేచన శూన్యులై , స్వార్థానికి ప్రాధాన్యం ఇవ్వటంతో స్వతంత్రంగా నిలచిన కశ్మీరు, పరాయి పాలనలోకి దిగజారటం, సంపూర్ణంగా రూపాంతరం చెందటం గమనించవచ్చు. తుంగుడిని, అతడి కొడుకుని చంపించిన తుంగుడి సోదరుడు నాగుడు సర్వాధికారి అయ్యాడు. తుంగుడి కోడలు, షాహి కూతురు స్వఛ్ఛందంగా సతీసహగమనం చేసింది.
కశ్మీర రాజతరంగిణిలో పలుమార్లు ’సతి’ ప్రసక్తి వస్తుంది. ’సతి’ అన్నది స్వఛ్చందంగా జరిపే చర్య తప్ప బలవంతాన జరిపిన చర్యగా అనిపించదు కల్హణుడి రాతల్లో. పైగా రాజవంశం వారు తప్ప ఇతరులు ’సతి’ జరిపినట్టు కూడా కనపడదు. దిద్దరాణి వ్యవహారంలో ఆమె, ముందు స్వఛ్ఛందంగా ’సతి’కి సిద్ధపడి, తరువాత విరమించుకోవటం కనిపిస్తుంది. ’సతి’ని ఒక రాజకీయ నాటకంలా వాడుకోవటం కూడా గమనించవచ్చు. అంటే ’సతి’ అన్న ఆచారం ఒక స్వఛ్ఛందమైనది, రాజ వంశీకులకు మాత్రమే పరిమితమైనదిగా తోస్తుంది. ఇది సామాన్యులకు ప్రాకటం స్వఛ్ఛందం నుంచి తప్పనిసరి అయి బలవంతపు చర్యగా దిగజారటం కాలక్రమేణా సంభవించి ఉంటుంది. ఈ విషయమై భారతీయ సమాజ పరిణామ క్రమాన్ని నిష్పక్షపాతంగా అధ్యయనం చేయాల్సిన అవశ్యకత ఉంది. మన గతం గురించి ఉన్న అపోహలు, అపప్రధలను విశ్లేషించి నిజాల నిగ్గు తేల్చాల్సి ఉంటుంది. తుంగుడి కోడలు సతిసహగమనం ఆచరించింది. కానీ తుంగుడి భార్య కశ్మీరు వదిలి ’రాజౌరి’ లో నివాసం ఏర్పరచుకుంది. ’సతి’ ఆచారం నిర్బంధం కాదనీ, స్వఛ్చందం అని అనేందుకు ఇది ఒక ఆధారం.
తుంగుడి భవనాన్ని భద్రేశ్వరుడు ఆక్రమించుకున్నాడు. ఇతడు భూతేశ్వరుడు ఇతర దేవుళ్ళ సంపదను కొల్లగొట్టాడు. సంగ్రామ రాజు మూర్ఖులను, దుష్టులను మాత్రమే నమ్మి అధికారం కట్ట బెట్టాడనేందుకు కల్హణుడు ’పార్దుడి’ ఉదాహరణ చూపుతాడు. స్త్రీలోలుడు, లోభి, దుష్టుడు, అయిన పార్థుడిని నగరాధికారిని చేశాడు. అతడు పవిత్ర శివలింగాలకు చెందిన ధనాన్ని కొల్లగొట్టాడంటాడు కల్హణుడు. ఇంకా ఇలాంటి మూర్ఖులు, పనికిమాలిన వారంతా ఉన్నత స్థానాలు పొందారు. వీరిని తురుష్కులతో పోరాడేందుకు పంపితే వారు భయంతో పారిపోయి వచ్చారు. ఇలా రాజు నమ్మకూడనివారిని నమ్మి అర్హత లేని వారికి ఉన్నత స్థానాలు ఇస్తూండటంతో దరదులు, దివిరులు, దామరులు ప్రాధాన్యం సంపాదించుకున్నారు. అధికారం కోసం అర్రులు సాచసాగారు.
సాధారణంగా జరిగేది ఇదే. అధికారి బలహీనుడై దుష్టులపై ఆధారపడితే ప్రజలు రాజు పట్ల విముఖులౌతారు. చేవగలిగిన వారు రాజ్యం వదలి పోతారు. చేతకాని వారు మిగిలిపోతారు. దాంతో రాజ్యం బలహీనమవుతుంది. పరుల చేతుల్లోకి జారిపోవటం సులభమవుతుంది. కల్హణుడు చెప్తున్న విషయాల ద్వారా రెండు విషయాలను ప్రధానంగా గ్రహించవచ్చు. కశ్మీరుపై తురుష్కుల ప్రభావం చాప క్రింద నీరులా విస్తరించటం గమనించవచ్చు. కల్హణుడు రాజతరంణిలో స్పష్టంగా ఈ విషయం ప్రస్తావించకున్నా, (కల్హణుడి దృష్టి రాజ్య వ్యవహారాలపై కేంద్రీకృతమై ఉండటంతో, సామాజిక పరిణామాలపై అంతగా దృష్టి పెట్టక పోవటం వల్ల) ఈ సమయంలో పర్షియన్లు, ఇతరులు రాసిన గ్రంథాల వల్ల కశ్మీరులో పెరుగుతున్న తురుష్కుల ప్రభావం రాచ వ్యవహారాల్లో కనిపిస్తున్నదని అర్థమవుతుంది. మహమ్మదీయ మతం స్వీకరించిన పలువురు కశ్మీరు చేరటం, వివిధ స్థాయిలలో స్థిరపడటం వల్ల, కొందరు అధికారులకు వారు చేరువ అవటం వల్ల, వారి ప్రవర్తనను ప్రభావితం చేయటం కనిపిస్తుంది. అందుకే దేవాలయాలను కొల్లగొట్టటం దేవాలయ ధనాన్ని అనుభవించాలని ఆశపడటం పలువురిలో చూడవచ్చు. ఇది ఎనిమిదవ తరంగంలో వచ్చే ’తురుష్క హర్షుడి’ లో ఉచ్చ స్థాయికి చేరింది. మరో పరిణామం, అర్హతతో సంబంధం లేకుండా అధికారానికి ఆశపడటం. ఏది చేసైనా, ఎలాగైనా, ఎవరితోనైనా చేతులు కలిపి అధికారం సాధించాలని తాపత్రయ పడటం, అవసరమైతే కశ్మీరుకు శత్రువులైన వారితోనూ చేతులు కలిపి కశ్మీరు రాజును దెబ్బ తీయాలని ప్రయత్నించటం, ఎవరినీ లెక్క చేయకపోవటం, గౌరవం లేకపోవటం వంటి వికృతులన్నీకశ్మీరులో స్థిర పడటం గమనించవచ్చు. రాజును విష్ణు స్వరూపంగా భావించి, నియమ నిబంధనలను గౌరవించి, తార్కికంగా ఆలోచించే సమాజం, స్వార్థం, క్షణిక లాభం తప్ప మరో విషయంపై దృష్టి లేని సమాజంగా పరిణామం చెందటం గమనించవచ్చు.
రాజు సంగ్రామ సింహుడు బలహీన మనస్కుడై ఉండటంతో రాణి శ్రీలేఖ అక్రమ ధనార్జన వైపు మళ్ళింది. అక్రమ సంబంధాలకు దిగజారింది. శక్తిమంతురాలైంది. క్రీ.శ 1028 లో సంగ్రామ రాజు మరణించటంతో ’హరిరాజు’ రాజయ్యాడు. ఈయన చక్కగా పాలన ఆరంభించాడు. కశ్మీరుకు మళ్ళీ మంచిరోజులు వస్తున్నాయని ఆశించేలోగా కేవలం 22 రోజుల పాలన తరువాత హరిరాజు మరణించాడు. ఈయనను రాణి శ్రీలేఖ నే సింహాసనంపై ఆశతో చంపించిందని అంటారు. అతని మరణం తరువాత తాను సింహాసనం అధిష్టించేందుకు సర్వం సిద్దమై రాణి రాజ సభ చేరేసరికి ఏకాంగులు, ఇతర శక్తిమంతులు, ’అనంతుడి’ని రాజుగా సింహాసనంపై నిలిపారు.
కశ్మీరుకు చెందిన శక్తివంతమైన మహిళల జాబితాలో ’రాణిశ్రీలేఖ’ కూడా చేరుతుంది. ఈమె వ్యక్తిత్వం విశిష్టమైంది. రాజు బ్రతికి ఉండగానే అక్రమ సంబంధాలు కొనసాగించింది. ఐశ్వర్యంపై ఆశపడింది. అక్రమరీతిలో సంపాదించింది. రాజు అనుమతితో అత్యంత శక్తిమంతురాలై రాజ్య వ్యవహారాలు చక్కబెట్టింది. భవిష్యత్తులో ఈమె కశ్మీరు పాలనలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి విశిష్టమైన మహిళల గురించి మన చరిత్ర పుస్తకాలు ప్రస్తావించకపోవటం మన చరిత్ర అధ్యయనంలో పెద్ద దోషం. భారతీయ మహిళలు అణచివేతకు గురయ్యారు, ఇదంతా మనువు చలవ అంటు, భారతీయ ధర్మం దోష భూయిష్టమంటూ, పళ్ళు పట కొరికే ఆధునిక అభ్యుదయ విజ్ఞాన, భారతీయ ధర్మ వ్యతిరేక వాదులంతా ఒకసారి మన చరిత్రను నిష్పాక్షికంగా అధ్యయనం చేస్తే వారి ఆవేశం, ద్వేషం, వ్యతిరేకతలు ఎంత అనౌచిత్యమో బోధపడుతుంది. శ్రీలేఖనే కాదు, భవిష్యత్తులో ఎనిమిదవ తరంగంలో వచ్చే ’కోటరాణి’ గురించి కూడా వీరు తెల్సుకోవాల్సి ఉంటుంది. కశ్మీరుకు చెందిన విశిష్ట మహిళల జీవితాలు, వ్యక్తిత్వాల అధ్యయనం ఒక చక్కని అంశం.
తన వంతుగా అనంతుడు రాజవటంతో శ్రీలేఖ ఆశాభంగం చెందినా రాజ్యాధికారంపై ’ఆశ’ను వదలలేదు. ఈలోగా అనంతుడి తండ్రి వైపు బంధువు విగ్రహరాజు, రాజ్యంపై ఆశతో సైన్యం తీసుకుని వచ్చాడు. లోహరం నుంచి శ్రీనగరం దరిదాపులను చేరి ద్వార నగరాన్ని కాల్చి వేశాడు. రెండున్నర రోజులలో శ్రీనగరం చేరాడు. ’లోతిక మఠం’ లో సైన్యంతో విడిది చేశాడు. రాణి శ్రీలేఖ పంపిన సైన్యం ఆ మఠాన్ని సంపూర్ణంగా కాల్చి బూడిద చేసింది.ఆపై శ్రీలేఖ తిరుగులేని అధికారిగా ఎదిగింది. నిరంతరం ఆమె ధ్యాస ధన సంపాదనపైనే. ఓ వైపు రాణి శ్రీలేఖ పరోక్షంగా రాజ్యం చేస్తూ ధనార్జనలో మునిగి ఉండగా, మరోవైపు రాజు అనంతుడు బాల్యం దాటి ఎదిగాడు. అతడికి రుద్రపాలుడు, ఇతర షాహి రాకుమారులతో గాఢ స్నేహం. వారు రాజుతో తమ సాన్నిహిత్యాన్ని సాకుగా తీసుకుని రాజ్యాన్ని కొల్లగొట్టసాగారు. అనంగపాలుడు, కేతాలుడు అనేవారు బంగారు విగ్రహాలను పగులగొట్టి బంగారాన్ని కరిగించేందుకు రాత్రింబవళ్ళు తహతహలాడేవారు. ఇది విశ్లేషించాల్సిన అంశం.
అనంతుడి సన్నిహితులు షాహి రాజవంశానికి చెందినవారు. షాహి వంశస్తులు తురుష్కుల నెదిరించి నిలిచినవారు. చివరికి గజినీ దండయాత్రల సమయంలో షాహి సామ్రాజ్యం తురుష్కుల వశం అయింది. షాహి వంశస్తులు అనేకులు చెల్లా చెదురయ్యారు. పలువురు కశ్మీరులో తలదాచుకున్నారు. వీరిపేర్లు రుద్రపాల, దిద్దపాల వంటివి జయపాల, త్రిలోచనపాల వంటి షాహి రాజుల పేర్ల కొనసాగింపులు వీరు కశ్మీరులో తలదాచుకున్న వారని చెప్పకనే చెప్తాయి. వీరు తురుష్కుల క్రౌర్యాన్ని చూశారు. వారు మందిరాలను ధ్వంసం చేసి సంపదను తస్కరించటం చూశారు. అలాంటి దృశ్యాలు ఎలాంటి వారిలోనైనా దైవం పట్ల చులకన భావం కలిగిస్తాయి. జీవితం అనుభవించటం తప్ప క్షణికమైన జీవితంలో మరొకటి లేదన్న భావనను కలుగజేస్తాయి. కాబట్టి ఇలాంటి తురుష్క ప్రభావిత షాహి రాజ వంశస్తులు బంగారు విగ్రహాలను కరగించి బంగారం సాధించాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు. వారికి ప్రాణభయం, తమ స్వార్థం తప్ప దైవభీతి, పాప భీతి లేకపోవటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఈ రకమైన మానసిక, సామాజిక విశ్లేషణను విస్మరించి చరిత్ర రచయితలు మందిరాలను, విగ్రహాలను ధ్వంసం చేసే సంస్కృతి కశ్మీరంలో ఆరంభం నుంచి ఉందని వ్యాఖ్యానించి ’మేము సైతం భారతీయ చరిత్రను దిగజార్చడంలో మావంతు రాయినొక్కటి విసిరివేశామూ’ అని సంతోషిస్తారు. అందుకే ఇక్కడ కల్హణుడు ఓ అద్భుతమైన ఉపమానం వాడేడు. కర్ణుడు దుర్యోధనుడికి తన శౌర్యం చూపి పక్కదారి పట్టించినట్టు రుద్రపాలుడు అనంతుడికి చెడు అలవాట్లు నేర్పి తప్పుదారి పట్టించాడు అంటాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరోక్షంగా తురుష్క ప్రభావం కశ్మీరును దిగజార్చటం.
ఈ సమయంలో త్రిభువనుడు పెద్ద సైన్యం తీసుకుని యుద్ధానికి వచ్చాడు. అనంతుడికి అండగా ఏకాంగులు నిలబడ్డారు. అనంతుడు కూడా అనూహ్యమైన రీతిలో శౌర్యం ప్రదర్శించి త్రిభువనుడి సైన్యాన్ని ఊచకోత కోశాడు. ఓడి ఆశ్రయం కోరిన త్రిభువనుడిని ఆదరించాడు అనంతుడు. ఇంతలో బ్రహ్మరాజు అనేవాడు దామరులు, దరదులు, ఏడుగురు మ్లేఛ్ఛ రాజులతో చేయి కలిపి కశ్మీరుపై దాడికి వచ్చాడు. మ్లేఛ్చ రాజులు అంటే కశ్మీరు పరిసర ప్రాంతాలలో ఉన్న పలు మతం మారిన తెగల అధికారులు. ఈ సందర్భంగా జరిగిన సంకుల సమరంలో రుద్రపాలుడు గొప్ప ధైర్యం ప్రదర్శించాడు. అనంతుడు సైతం వీరోచితంగా పోరాడి శత్రువులను నిర్జించాడు. ఈ సందర్భంలో కల్హణుడు రాస్తాడీ శ్లోకం. మ్లేఛ్ఛ రాజులను చంపటం, దొరికిన వారిని బంధించటం చేశారు కాశ్మీర సైనికులు. కశ్మీర రాజుకు బంగారం, వజ్రాలు లభించాయి. అంటే మ్లేఛ్ఛ రాజులను సంకెళ్ళు వరిస్తే, కశ్మీర రాజును ఆభరణాలు వరించాయన్నమాట.
అయితే అనంతుడికి బయట వారినుంచే కాదు స్వంత సోదరుడు ఉదయ వత్యుడి నుంచి కూడా సమస్యలు బయలుదేరాయి. ఉదయ వత్యుడు శక్తివంతమైన బ్రాహ్మణులను తనవైపు తిప్పుకుని సమస్యలు సృష్టించాడు. కానీ బ్రాహ్మణులను రాజు తనవైపు త్రిప్పుకోవటంతో ఉదయవత్యుడు శక్తిహీనుడయ్యాడు. ఇక్కడ కూడా కశ్మీరు బ్రాహ్మణుల వ్యక్తిత్వ రాహిత్యాన్ని గమనించే వీలు చిక్కుతుంది. వీరు త్వరగా ప్రలోభాలలో పడటం, రాజద్రోహానికి పాల్పడటం మళ్ళీ రాజు దానాలిచ్చి, బంగారం బహుమతిగా ఇవ్వటంతో వీరు రాజువైపుకు మళ్ళి తమను నమ్మినవాడికి ద్రోహం చేస్తూ తమ బుద్ధిహీనతను, అవిశ్వసనీయతను, లోభత్వాన్ని, వ్యక్తిత్వరాహిత్యాన్ని సృష్టించేశారు. అయితే యుద్ధాలలో, రోగాల వల్ల షాహి రాజవంశానికి చెందిన వారందరూ మరణించారు. వారి మరణంతో ’షాహి’ వంశం కశ్మీరంలో అంతరించింది. ’షాహి’ వంశ రాజుల మరణంతో అనంతడిపై వారి ప్రభావం అదృశ్యమయింది. ఇప్పుడు అసలు అనంతుడు వెలికివచ్చాడు. అ రాణి సూర్యమతి ప్రభావం అతడిపై ఎంతగా ఉందంటే, అతడు రాణి సూర్యమతికి ప్రతిబింబంలా వ్యవహరించాడు.
కశ్మీరుకు చెందిన మరో విశిష్ట మహిళ రాణి సూర్యమతి. భర్త షాహి రాజవంశానికి చెందిన వారి ప్రభావంలో ఉండి దుష్ట కార్యాలు చేస్తున్నా తాను సత్కార్యాలు చేస్తూ వచ్చింది. రాజుపై దుష్టుల నీడ తొలగగానే రాజును తన ప్రభావం నీడలో దిగింపచేసి సఛ్ఛీలుడిగా మలచింది. అద్భుతమైన వ్యక్తిత్వం ఈమెది. కానీ ఈమె వ్యక్తిత్వంలో స్వాభావికమైన ఒక లోపం ఉంది. అది అవధులు మించిన పుత్ర వాత్సల్యం!
రాజు, రాణి మందిరాలు మఠాలు నిర్మిస్తూ పోయారు. బ్రాహ్మణులకు అగ్రహారాలు దానాలు చేశారు. ప్రజల కోసం పలు మఠాలు నిర్మించారు. ప్రజల సౌకర్యార్థం పలు చర్యలు చేపట్టారు. ఇంతలో వారి కుమారుడు మరణించాడు. దాంతో రాజు రాణి అన్ని సౌకర్యాలు వదిలారు. రాజభవనం వదిలారు. వారు సదాశివ మందిరంలో నివాసం ఏర్పరచుకున్నారు. డల్లకుడనే విదేశీయుడు రాజుకు ఉన్న గుర్రాల పిచ్చిని ఆధారం చేసుకుని రాజుకు చేరువయ్యాడు. అలాగే పద్మరాజు అనే మరో విదేశీయుడు ’తాంబూలం’ ద్వారా రాజు మనస్సు దోచాడు. ఎంతగా అంటే అతడు ఇచ్చిన తాంబూలం మోజులో పడి రాజు కాశ్మీరుకు చెందిన ఐశ్వర్యాన్ని అతడికి తాకట్టుగా పెట్టాడు రాజు. ఎప్పుడైనా రాజ సభ జరిగితే, ఆ సింహాసనం పద్మరాజు నుంచి అద్దెకు తెచ్చుకునేవాడు రాజు. ఇలాంటి పరిస్థితిలో రాణి సూర్యమతి రాజ వ్యవహారాలను తన అదుపులో తీసుకుంది. తన ధనంతో పద్మరాజు అప్పులు తీర్చి రాజ గౌరవం కాపాడింది . గుర్రాల ఎరతో రాజును దోస్తున్న డల్లకుడి అడ్డు తొలగించింది. ఈ రకంగా ఒకటొకటిగా సమస్యలను పరిష్కరిస్తూ రాణి రాజ్యం పగ్గాలను అదుపులోకి తీసుకుంది. ప్రజలను కన్నతల్లిలా పాలించింది. ఎవరికీ ఎలాంటి సమస్యలు రాకుండా పాలించింది. రాణి ఇలా రాజ్యకార్యభారం నిర్వహిస్తుంటే రాజు తన గొప్పలు చెప్తూ, రాణి ఎలా చెప్తే అలా వ్యవహరిస్తూ కాలం గడిపేడు. శివుడి భక్తిలో కాలం గడిపేవాడు. రాణి రాజులా వ్యవహరిస్తూ, రాజు రాణికి భార్యలా దాసోహం అని విధేయుడిగా ఉండటం ప్రజలలో ఎలాంటి నిరసన కలిగించలేదు సరికదా ప్రజలు సంతోషం వ్యక్తపరిచారు. ఇదీ భారతీయ మహిళ శక్తి, ఔన్నత్యం. ఇదీ భారతీయ సమాజ ఔన్నత్యం. ఒక మహిళ రాణి అయితే సహించక కుట్రలు పన్ని ఆమెని చంపేదాక నిద్రపోని ’జాతులు’ రాణిలో అమ్మను, దేవిని చూసి ఆనందించే , గౌరవించే భారతజాతి ఔన్నత్యం అర్థం చేసుకోలేదు. ఇష్టం వచ్చినట్టు దుర్వ్యాఖ్యానాలు చేస్తూ భారతీయులలో ఆత్మన్యూనత భావనను పెంచి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే, భారతీయులు ఏమాత్రం అధ్యయనం, పరిశీలన, విశ్లేషణ లేకుండా ఈ దుష్ప్రచారాన్ని నిజమని నమ్మటం!
(ఇంకా ఉంది)