అన్నింట అంతరాత్మ-18: పరిమళంతో అలరించే ‘చందనాన్ని’ నేను!

7
3

[box type=’note’ fontsize=’16’] జీవులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం గంధం అంతరంగం తెలుసుకుందాం. [/box]

నేను ఎంచక్కా మా స్నేహితులు కర్పూరం, అగరొత్తులతో ముచ్చట్లాడుతుంటే హఠాత్తుగా చందన, పరిమళ ఇద్దరూ పరుగెత్తుతూ వచ్చి హారతిపళ్ళేన్ని తగిలారు. అంతలో వాళ్లమ్మ కస్తూరి పళ్లెం పడకుండా నేర్పుగా ఆపింది. ‘హమ్మయ్య’ అనుకున్నాం నేను, నా మిత్రులు. ఇంతకు ముందే ఈ ఇంట్లో పరిమళ పుట్టినరోజు వేడుక ముగిసింది. సంప్రదాయ కుటుంబం కావడంతో పుట్టిన రోజు అంటే కేకులు కోసి, కొవ్వొత్తులు ఆర్పి పార్టీ చేయకుండా హారతి ఇచ్చి, అతిథులకు సంప్రదాయ పిండివంటలు, పళ్లతో ఆతిథ్యమిస్తారు. 

ఇంతలో రామచంద్రంగారు వచ్చి పడక్కుర్చీలో కూర్చున్నారు. “తాతయ్యా! తాతయ్యా! గంధం ఎందుకు పూసుకుంటారు?” అడిగింది చందన. పక్కనే ఉన్న పరిమళ కూడా “అవును… ఎందుకు?” కళ్లతోనే ప్రశ్నించింది. నా గురించే అడగడంతో చెప్పొద్దూ నాకు సంతోషంతో కూడిన గర్వం కలిగింది. నాకు మంచి వాసన ఉంటుందని నా పక్కనే ఉండే పసుపు, కుంకుమలు తరచు పొగడుతుంటాయి. అందరూ నా వాసనను ఆస్వాదిస్తే, నేను ఆ పొగడ్తలను ఆస్వాదిస్తుంటాను. 

తాతగారు బదులిస్తూ “ఎందుకంటే గంధం మంచి వాసన కలిగి ఉంటుంది. పైగా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. పూర్వం నుంచి కూడా అతిథులకు చేసే గౌరవ, మర్యాదలలో గంధం పూయడం ఒకటి. అన్నట్లు నీ పేరు కూడా అదే.. చందనం అంటే గంధమే. చెల్లి పేరు పరిమళ కదా, అంటే సువాసన అని అర్థం తెలిసిందా?” అంటుండగానే నానమ్మ సత్యవతి ప్రవేశించి ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. 

“మరి నానమ్మ అప్పుడప్పుడు నన్ను యోజనగంధి అని పిలుస్తుంటుంది. అది కూడా పేరేనా” అమాయకంగా అడిగింది పరిమళ. “స్నానం చేయమంటే చలిగా ఉంది చేయనంటూ మొండికేస్తుంటే ఇంకేమంటారేం” అంది నానమ్మ నవ్వుతూ. “సత్యవతీ! నిజానికి సత్యవతి పేరున్న నువ్వే యోజనగంధివి. భారతంలో మత్స్యరాజు కుమార్తె సత్యవతి సహజంగానే మత్స్యగంధి. ఆమెకు ఓ ముని వరం వలన కొన్ని యోజనాల వరకు వ్యాపించేంత పరిమళం ఆమె సొంతమవుతుంది. ఆ రకంగా ఆమె యోజనగంధి అయింది. అయితే ఆ పదాన్ని నేటికాలంలో వ్యంగ్యంగా దుర్వాసన అనే అర్థంలో వాడుతున్నారు” అన్నారాయన. 

“సర్లెండి, నేనూ చెప్పగలను, అల్లసాని పెద్దన మనుచరిత్రలో వరూధినిని ‘పాటలగంధి’గా వర్ణించారు అంది సత్యవతి. “పాటల అంటే ఏంటి?” అడిగింది చందన. “పాటల పుష్పాలు.. ఓ రకం పూలు” చెప్పి, “మరో విషయం గుర్తుకొస్తోంది. పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఓసారి ద్రౌపది తనకు సౌగంధిక పుష్పాలు కావాలని కోరింది. వెంటనే భీముడు వెళ్లి యక్ష, గంధర్వులను ఓడించి కుబేరుడి వనంలో ఉన్న సౌగంధిక పుష్పాలను తీసుకొచ్చి ద్రౌపదికి ఇచ్చి ఆమె ముచ్చట తీర్చాడు. అంటే ఆ పుష్పాల సుగంధం ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు” అంది సత్యవతి.

అంతలో కస్తూరి వచ్చి “ఇప్పుడంటే గంధం పొడిని కొంటున్నాం కానీ ఇది వరకు ప్రతి ఇంట్లో గంధం చెక్క, సాన ఉండేవి. ఇప్పటికీ మా అమ్మా వాళ్లింట్లో ఉంది. మా నాన్నగారు పూజ చేసేటప్పుడు స్వయంగా గంధపు చెక్కను, సానమీద అరగదీసి గంధం తీసి వాడుతారు. అదే మంచిగంధం. దేవుడికి పూజ చేసేటప్పుడు ‘శ్రీగంధాం ధారయామి’ అని గంధాన్ని అద్దుతారు. దేవుడికి చేసే ఉపచారాల్లో అదొకటి. తిరుమలలో అయితే గంధం తీయడానికి ఏకంగా ఒక గది ఏర్పాటుచేశారు. గంధం చర్మ సమస్యలకు కూడా పనిచేస్తుంది. ఇదివరకు వేసవిలో చెమటకాయలు వచ్చినా గంధం తీసి పూసేవారు. అదెంతో ఉపశమనంగా ఉండి, చెమటకాయలు తగ్గిపోయేవి కూడా. ముఖానికి మొటిమలు ఉన్నా కూడా గంధం వాడితే తగ్గిపోతాయి. చర్మం నునుపుగా కూడా తయారవుతుంది” అంది కస్తూరి. 

‘అబ్బో! నా వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయా’ అనుకున్నాను. మా స్నేహితుల వైపు ‘విన్నారా?’ అన్నట్లు చూశాను. వాళ్లు నా వంక ఒకింత అసూయగా చూశారు. 

అంతలో రామచంద్రయ్యగారు “అష్టగంధాలు అని ఎనిమిది రకాలున్నాయి. అవి కర్పూరం, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, గంధం, శ్రీగంధం” అన్నారు. కర్పూరం నా మిత్రుడే, అగరుబత్తులు కూడా నా మిత్రులే. గంధం నేనే, శ్రీగంధం కూడా మా జాతే అయి ఉంటుంది. ఇంక కస్తూరి, పునుగు తెలియవనుకుంటుంటే నా మనసులోని మాట కనుగొన్నట్లుగా చందన అడగనే అడిగింది. 

“తాతయ్యా! మా అమ్మ పేరు కూడా కస్తూరే కదా, అది కూడా ఒక గంధమేనా? అది ఎలా తయారుచేస్తారు” అడిగింది పరిమళ. వెంటనే తాతగారు అందుకుని “కస్తూరి, కస్తూరి మృగం నుంచి లభిస్తుంది. ఇవి సైబీరియా నుంచి హిమాలయాల వరకు ఉన్న పర్వత ప్రాంతాలలో ఉన్నాయి. మన దేశంలో అసోంలోని పైన్ అడవుల్లో కనిపిస్తాయి. సుగంధభరితమైన ద్రవాన్ని విడుదల చేయడం వీటి ప్రత్యేకత. కస్తూరి మృగాలు లేడి జాతికి చెందినవే అయినా వీటికి కొమ్ములు ఉండవు. చూడటానికి లేళ్లకంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి. మగ కస్తూరి మృగం నుంచే ఈ పరిమళ ద్రవం తయారవుతుంది. తాజాగా ఉత్పత్తి అయినప్పుడు కస్తూరి కొంచెం పలచగా ఉండి, కొంత కాలానికి గట్టిపడుతుంది. చిత్రం ఏమిటంటే ఆ పరిమళం తన నాభి అంటే బొడ్డునుంచే వస్తుందనే విషయం వాటికి తెలియక, ఆ వాసన ఎక్కడ నుంచి వస్తుందో తెలుసుకోవడానికి అడవంతా తిరుగుతూ వెదుకుతుందట. ఆ తిరిగే సమయంలో అవి ఒక్కోసారి ఏదో ఒక పులికి బలయిపోవటం కూడా జరుగుతుంది” వివరించారు. 

“నానమ్మా! గంధం, కస్తూరి గురించి వింటుంటే నాకు, నువ్వు నేర్పిన త్యాగరాజ కీర్తన.. 

గంధము పుయ్యరుగా 

పన్నీరుగంధము పుయ్యరుగా 

అందమైన యదు నందను పై 

కుందరదన లిరవొందగ పరిమళ ॥గంధము॥

తిలకము దిద్దరుగా 

కస్తూరి తిలకము దిద్దరుగా.. 

గుర్తుకొస్తోంది” అంది చందన. 

“అదే, చెప్తావా లేదా అని చూస్తున్నాను. బాగానే గుర్తుంచుకున్నా వు. జయదేవుడు రచించిన ‘చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి’ గీతంలో కూడా నీలమోహనుడు మేనుకు చందనం పూసుకున్నట్లుగా వర్ణించాడు. అన్నట్లు నాకు ఇంకో సరదా పాట గుర్తుకొస్తోంది. మా చిన్నప్పుడు పిల్లలు, 

బావా బావా పన్నీరు 

బావను పట్టుక తన్నేరు 

వీధి వీధి తిప్పేరు 

వీశెడు గంధం పూసేరు 

అని పాడేవారు” అంది సత్యవతి. 

“భలే ఉందే” అంటూ చందన, పరిమళ ఫక్కున నవ్వారు. నాకూ నవ్వు వచ్చింది. నా పక్కనే పన్నీరు కూడా ఉంటుంది కాబట్టి అదీ నా నేస్తమే. పన్నీరు బుడ్డి ఎంత అందంగా ఉంటుందో. బంధువులపై, అతిథులపై పన్నీరు చిలకరించడం సరదాగా ఉంటుంది. ఇంక నన్నయితే వచ్చిన మహిళల మెడక్రింద.. కొంతమంది చుబుకానికి అటు, ఇటు పూస్తుంటారు. 

నేనిలా అనుకుంటుండగానే కస్తూరి గొంతు వినిపించింది.. “అత్తయ్యా! సీతారాములు కల్యాణం చూతము రారండీ.. పాట మీకు తెలుసుగా. అందులో శ్రీరాముణ్ణి పెళ్లి కొడుకును చేయడం వర్ణిస్తూ .. 

సంపగి నూనెను కురులను దువ్వి.. కురులను దువ్వి 

సొంపుగ కస్తూరి నామము దీర్చి.. నామము దీర్చి 

చెంపగవాకి చుక్కను పెట్టి.. 

అని రాశారు సముద్రాల సీనియర్. ఇందులో సంపంగి నూనెను ప్రస్తావించారు. సంపంగి నూనె అత్యంత ప్రియమైనది. ‘మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె’ అని సామెత ఉంది. అందులో చేతిలో పైసా లేకున్నా డాబు ప్రదర్శించే వైనమే కాదు, సంపెంగ నూనెపై ఉండే మోజును కూడా గుర్తించాలి’ అంది. 

“అవునవును” అంది అత్తగారు. వెంటనే తాతగారు, ‘పిల్లలూ! గంధం గురించి ఓ ప్రసిద్ధ గేయం కూడా ఉంది. కవిరాజు, హేతువాది అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి స్వాతంత్ర్యోద్యమకారులను ప్రోత్సహిస్తూ రాసిన గేయమది.

వీరగంధము తెచ్చినారము 

వీరుడెవ్వడొ తెల్పుడీ 

పూసిపోదుము మెడను వైతుము 

పూలదండలు భక్తితో.. 

ఎంతో చక్కటి గేయం..” అన్నారు. 

ఇంతలో పరిమళ “తాతయ్యా నువ్వేదో పునుగు అన్నావు. నాకు తినే పునుగులు గుర్తొచ్చాయి. దాని గురించి చెప్పు” అడిగింది. తాతయ్య నవ్వి “అది తినే పునుగు కాదు.. పునుగు పిల్లి అనేది ఓ జంతువు. వీటిలో ముప్ఫయ్ ఎనిమిది జాతులున్నాయి. కానీ కేవలం ఆసియా జాతి పునుగు పిల్లి విశిష్టమైంది. అంతరించి పోతున్న అరుదైన జీవుల జాబితాలో ఇది కూడా ఉంది. మన తెలుగునాట శేషాచలం అడవుల్లో రెండో, మూడో పునుగు పిల్లులు ఉన్నాయంటారు. పునుగు పిల్లి గ్రంథుల నుండి ‘పునుగు’ అనే ద్రవ్యం స్రవిస్తుంది. తిరుమలలో శ్రీనివాసుడికి ప్రతి శుక్రవారం అభిషేకం అనంతరం పునుగుతైలం పూయడం వాడుకగా వస్తోంది. గతంలో శ్రీవారి సన్నిధిలో నాలుగైదు పునుగు పిల్లులను సంరక్షించేవారు. కానీ ఆ తర్వాత వన్యప్రాణి సంరక్షణ చట్టాలు అందుకు అనుకూలం కాకపోవడంతో వాటిని అక్కడి జంతు ప్రదర్శనశాలకు తరలించారు” చెప్పారు. 

అంతలో చందన వాళ్ల నాన్న అచ్యుత్ వచ్చాడు. “గంధం గురించి చెప్పుకునేటప్పుడు గంధం చెక్కల స్మగ్లింగ్ గురించి చెప్పుకోకపోతే ఎలా? గంధం చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ వీరప్పన్ ముప్పయి ఆరేళ్లపాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించి, ఎందరినో హతమార్చి తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు రెండువేల నాలుగులో వీరప్పన్, అతని అనుచరులను కాల్చి చంపారు. ఈ ఆపరేషన్‌కు అయిన ఖర్చు దాదాపు వందకోట్ల రూపాయలు. భారతదేశ చరిత్రలోకెల్లా అత్యధిక వ్యయంతో కూడిన ఆపరేషన్ ఇదే” వివరంగా చెప్పాడు. “అమ్మో” ఒకేసారి అన్నారు చందన, పరిమళ. ‘ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారన్నమాట. పరిమళాలందించే చెట్లకు దుష్టుల పీడ తప్పదా’ అనుకొని బాధపడ్డాను. 

“అన్నట్లు సింహాచల క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వరాహ నరసింహస్వామి ఎప్పుడూ పూర్తి చందనం పూతలోనే ఉంటాడు. ఏడాదికి ఒక్క రోజు.. అక్షయ తృతీయ నాడు ఆ చందనాన్ని తొలగిస్తారు. అంటే ఆ ఒక్క రోజే కేవలం పన్నెండు గంటల పాటు భక్తులకు స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది. విగ్రహం నుంచి తొలగించిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. నిజరూప దర్శన సమయాన్ని ‘చందనయాత్ర’ లేదా ‘చందనోత్సవం’ అంటారు. ఆ తర్వాత అభిషేకం నిర్వహించి, ఆ పైన నూట ఇరవై కిలోల చందనాన్ని లేపనం చేస్తారు. దాంతో స్వామి వారు మళ్లీ నిత్యరూపంలోకి మారుతారు. ఈ చందనపు పూత సంవత్సరానికి నాలుగుసార్లు అంటే అక్షయ తృతీయతో పాటు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడు మణుగులు చొప్పున స్వామి వారికి సమర్పిస్తారు. ఇందుకోసం తమిళనాడు మారుమూల ప్రాంతం నుంచి తెప్పించిన ‘జాజిపోకల’ అనే మేలురకం కలపను తెప్పించి, వాటినుంచి తీసిన గంధాన్నే వాడతారు. ఇది చాలా పెద్ద ప్రక్రియ” వివరించింది నానమ్మ. 

అది విని దైవానికి నేనెంతో దగ్గర అన్నట్లు గర్వపడుతుండగా.. “మరి ఇందాక నాకు కొత్త గౌను వేసి పర్‌ఫ్యూమ్ రాశారుకదా. మరి అది కూడా సువాసన ఇచ్చేదేకదా, దాన్ని దేంతో తయారు చేస్తారు? వాటి గురించి విశేషాలు చెప్పు తాతయ్యా” అడిగింది పరిమళ. 

“సరే, విను. అసలు ఈ పరిమళ ద్రవ్యాల ఫ్యాక్టరీ నాలుగువేల ఏళ్లనాడే సైప్రస్ దీవిలో మొదలైందని చరిత్ర చెపుతోంది. అయితే దీనికంటే ముందే ఈజిప్షియన్లు తమ సంస్కృతిలో భాగంగా పరిమళద్రవ్యాలను తయారు చేశారని, వాటిని భద్రపరచడానికి రాయి, గాజు పాత్రలను కూడా రూపొందించారని తెలుస్తోంది. ఇక ‘అత్తరు’ అనేది ప్రాచీన పర్షియన్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం సువాసన. మనదేశంలో అత్తరు తయారీ గురించి చెప్పాలంటే బృహత్ సంహితలోనే దీని ప్రస్తావన ఉంది. మహాజనపదాల కాలం నుంచి అత్తరు తయారీ ఉంది. మహాజనపదాల్లో ఒకటైన గాంధారకు ఆ పేరు రావడానికి కారణం అక్కడ పరిమళద్రవ్యాలు తయారు కావడమే. రకరకాల అత్తరులను వివిధరకాల పూలు, వనమూలికలతో తయారుచేస్తారు. కొన్ని రకాల తైలాలను కలప జాతుల నుంచి కూడా సేకరిస్తారు. వివిధ సుగంధ పుష్పాలను వేడిచేసి, వాటినుంచి తైలాన్ని తయారు చేస్తారు. మనదేశంలో కనౌజ్ అత్తరు తయారీకి పేరొందింది, దీన్ని పరిమళ ద్రవ్యాల రాజధాని అని కూడా పిలుస్తారు. అత్తరును ఎంతకాలం భద్రపరిస్తే అంత ఘాటు వాసన కలిగి ఉంటుంది. ముస్లిమ్‌లకయితే ప్రతి సందర్భంలోనూ అత్తరు వాడకం తప్పనిసరి. గతంలో సాయిబులు అత్తరును వీధుల్లో తిరిగి అమ్మేవాళ్లు. అత్తరు సాయిబు వస్తే సందడే సందడి. సాహిత్యంలో కూడా పరిమళాల ప్రస్తావన ఎక్కువే. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు రచించిన ‘గులాబీ అత్తరు’ కథ ఎంతో ప్రసిద్ధికెక్కింది” అన్నారు.

‘అబ్బ! పరిమళ జాతులు ఎన్నెన్ని ఉన్నాయో’ అనుకుంటుండగా అచ్యుత్ అందుకుని “సుగంధాలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదూ.. అందుకే ఇష్టమైన వారికి ఇచ్చే బహుమతుల్లో పరిమళ ద్రవ్యాలు తప్పనిసరిగా ఉంటాయి. వారివారి వ్యక్తిగత ఇష్టాలను బట్టి ఆయా పరిమళ ద్రవ్యాల రకాలను ఎంచుకుంటారు. అంతేకాదు, ఆయా కాలాలకు తగ్గట్టుగా కూడా పరిమళ ద్రవ్యాలున్నాయి. ఇక మహిళలకు, పురుషులకు వేర్వేరు పరిమళ ద్రవ్యాలున్నాయి. ఇప్పుడయితే డియోడరెంట్ వాడకం ఎక్కువైంది. ప్రతి ఇంట పరిమళ ద్రవ్యాలు (పర్‌ఫ్యూమ్‌లు) మాత్రమే కాదు, అగర్‌బత్తీలు, రకరకాల ధూపాలు, కర్పూరం వాడకం మామూలే. ఇంకా చెప్పాలంటే సాంబ్రాణీ కూడా చెప్పుకోవచ్చు. గతంలో చిన్న పిల్లలకు స్నానం చేయించాక తప్పనిసరిగా సాంబ్రాణీ పొగవేసేవారు. జుట్టు తడి ఆరడంతోపాటు మంచి వాసన కూడా వస్తుంది.” అన్నాడు. 

“‘సాంబ్రాణి’ ఎక్కడి నుంచి వస్తుంది?” చందన అడిగింది. “ఇది స్టైరాక్స్ జాతికి చెందిన చెట్ల బెరడు నుంచి తయారు చేసిన జిగురుగా ఉండే పదార్థం. సాంబ్రాణి పొడిని నిప్పుల్లో వేస్తే తెల్లటి పొగ వచ్చి, మంచి వాసన చుట్టూరా వ్యాపిస్తుంది. సాంబ్రాణిని అగరుబత్తీల తయారీలో కూడా వాడుతారు. గుగ్గిలం కూడా ఇలాంటిదే.” చెప్పాడు అచ్యుత్. 

మా సుగంధాల ప్రపంచం ఎంత విస్తారమైందో. మనుషుల్ని మా పరిమళాలతో అలరింపజేస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంటుంది. అయితే కొంతమంది బద్దకంతో స్నానం చేయకుండా పరిమళద్రవ్యాలు అద్దుకుని తిరుగుతుంటారు. అది ఆరోగ్యకరం కాదని చెప్పాలనుంది. అలాగే ఇన్ని రకాల సుగంధాలను వాడుతున్నారు గానీ, ఈ మనుషులు అసలైన పరిమళాన్ని మరిచిపోతున్నారు. ‘ఓ మనిషీ! నీ మనసును స్వార్థం, అసూయ, అమానుషత్వం అనే దుర్వాసనలతో నింపుకుని, మేనికి మాత్రం పరిమళాలు అద్దుకుంటున్నావు. విద్యాగంధం ఉన్నా సంస్కారాన్ని విస్మరిస్తున్నావు. అలాకాక చక్కని సంస్కార సుగంధాన్ని ధరించు, మనసును మంచి, మానవత్వం అనే పరిమళంతో నింపుకో.. నా మాట మనుషులకు వినబడితే బాగుండు’ అనుకుంటుండగా ఆ పాత మధురగీతం ఒకటి వినపడింది… 

ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం.. 

ఎన్నియుగాలైనా ఇది ఇగిరిపోని గంధం.. ఇగిరిపోని గంధం.. 

మళ్లీ నా పేరే.. ఆనందం వెల్లువై మరింతగా పరిమళించాను. 

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here