యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 14: అగిరిపల్లి

0
4

[box type=’note’ fontsize=’16’] కృష్ణా జిల్లాలో భక్తి పర్యటనలో భాగంగా అగిరిపల్లి లోని శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

కృష్ణా జిల్లాలోని ఈ క్షేత్రంలో శ్రీ నరసింహ స్వామి అన్ని చోట్లా దర్శనమిచ్చే సింహం తలతోకాక, పులి తలతో కనిపిస్తారు.  అందుకే వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి అని పేరు.  స్వామి వెలసిన కొండ పేరు శోభనాచలం.  అందుకని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి అని వచ్చిందని కొందరంటే, స్వామి సకల శుభాలు కూర్చేవాడు, అందగాడు కనుక ఆ పేరు అని ఇంకొందరంటారు.  

అగిరిపల్లి ఒక ప్రణాళిక ప్రకారం కట్టిన ఊరు.  శోభనాచలం అనే కొండకింద చతురస్రాకారంలో నిర్మింపబడిన ఈ ఊరు చుట్టూ నాలుగు వీధులున్నాయి.  వీటి మూలల్లో నాలుగు కొలువు మండపాలున్నాయి.  వీటిలో పెద్దదాన్ని కొటాయి అంటారు.  ఉత్సవాల సమయంలో శ్రీ నరసింహస్వామి దేవేరితో సహా ఊరేగుతూ వచ్చి ఇక్కడ కొలువు తీరుతారు.

పూర్వం శుభవ్రత మహారాజు శివ కేశవులను దర్శించాలనే ఆకాంక్షతో ఈ కొండ మీద తపస్సు చేశాడుట.  ఆయన తపస్సు ఫలించి శివ కేశవులు ప్రత్యక్షమయితే భక్తులను కాపాడుతూ అక్కడే కొలువుదీరమని కోరాడుట.    ఆ రాజు మాట మన్నించి శివ కేశవులు ఆ కొండమీద కొలువు తీరారు.  అయితే శ్రీ మహా విష్ణువుని నరసింహస్వామి రూపంలో కనిపించమని కోరగా ఆ రూపంలోనే స్వయంభూగా అక్కడ అవతరించాడు.  రాజు గారి పేరుతో ఆ కొండను శోభనాచలం అన్నారు.

ఇంకొక కధ ప్రకారం భూలోక సంచారానికి వచ్చిన శివ కేశవులు ఇక్కడి వాతావరణానికి ముగ్ధులై స్వయంభూలుగా అవతరించారు.  అప్పుడీ ప్రదేశమంతా కీకారణ్యం అవటంతో, సహజసిధ్ధంగా భక్త వరదుడైన శ్రీ నరసింహస్వామి అరణ్యానికి ముఖ్య జంతువులైన సింహం, పులి  సమ్మిశ్రిత రూపాలతో  వెలిశారని కధనం.

ఇక్కడ పూజారిగారు చెప్పినదాని ప్రకారం కొండమీద నరసిహస్వామి 13వ శతాబ్దంలో వెలిశారు.  పక్కన అమ్మవారిని తర్వాత ప్రతిష్టించారు.  కింద గుడి 400 ఏళ్ళ క్రితం కట్టబడింది.  

నిజాం నవాబుల కాలంలో ఇక్కడివారికి స్వామి కలలో కనిపించి నేను ఫలానా చోట వున్నాను, పూజ, నైవేద్యం చెయ్యమంటే వాళ్ళు కొంతకాలం చేశారు.  తర్వాత శక్తిచాలక నవాబులనాశ్రయించారు.  వారి పరీక్షలకి స్వామి సత్యం చూపించారుట.  వారు ఈ చుట్టుపక్కల పరగణాలను రాసిచ్చారు.  నవ నారసింహ క్షేత్రాలలో ఇది ఒకటి.  స్వామి వ్యాఘ్ర రూపంతో ఇక్కడ ఒక్కచోటే దర్శనమిస్తారు.

కొండకింద ఆలయంలో ఆలయానికి వున్న ఆస్తుల వివరాలు, ఉత్సవాలు చేయించే దాతల పేర్లు వివరంగా బోర్డులమీద రాసి పెట్టారు.  

కొండ మీద నరసింహస్వామిని దర్శించటానికి భక్తులు 650 మెట్లు ఎక్కాలి.  ఆ పైన కొలువుతీరిన కొండ మల్లేశ్వరస్వామిని దర్శించటానికి ఇంకో 100 మెట్లు ఎక్కాలి.  పూజారులు రెండు పూటలా ఈ మెట్లన్నీ ఎక్కి, శివ కేశవులకు సకల ఉపచారాలూ చేసి వస్తారు.  అన్ని మెట్లు ఎక్కలేని భక్తుల కోసం స్వామి దేవేరి రాజ్యలక్ష్మీ దేవితో సహా కింద ఆలయంలో ప్రతిష్టించబడ్డారు.  ఉపాలయాలలో గోదాదేవి, వేణు గోపాలస్వామి, వరదరాజస్వామి, ఆంజనేయస్వాములు దర్శనమిస్తారు.

ఇక్కడ వున్న పుష్కరిణిని వరాహ పుష్కరిణి అంటారు.  ఈ స్వామిని సేవిస్తే సకల భయాలూ దూరమవుతాయని, గ్రహ దోషాలు పోతాయని, దీర్ఘ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.

పూర్వం  నూజివీడు సంస్ధానీశ్వరుల సమయంలో ఈ ఆలయం అత్యంత వైభవోపేతంగా విలసిల్లింది.  వారు ఈ ఆలయానికి అనేక భూములు వగైరాలిచ్చారు.    ఆ సమయంలో జరిగిన ఉత్సవాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు.  

ఉత్సవాలు

శ్రావణ, మాఘ మాసాలలో పవిత్ర అధ్యయనోత్సవాలు జరుగుతాయి.  కార్తీక శుధ్ధ ఏకాదశినుంచి బహుళ పాడ్యమి దాకా శివ కేశవులకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.  ఇవేకాక మిగతా పండగల సమయంలో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి.

ప్రతి    రధసప్తమికి ఇక్కడ తిరునాళ్ళురధోత్సవం జరుపుతారు. లక్షకు పైగా జనం ఈ ఉత్సవాలకు    హాజరు అవుతారు.. ప్రతి కార్తీక పౌర్ణమికి ఈ ఊరి కొండ మెట్ల మీద దీపాలంకరణ నేతితో చేస్తారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here