మధురమైన బాధ – గురుదత్ సినిమా 2- ‘సౌతేలా భాయి’

2
5

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం గురుదత్ గారి ‘సౌతేలా భాయి’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

శరత్ చంద్ర నవల ‘బైకుంఠర్ విల్’ ఆధారంగా తీసిన ‘సౌతేలా భాయి’

[dropcap]”కా[/dropcap]గజ్ కే ఫూల్” సినిమా అపజయం తరువాత గురుదత్ దర్శకుడిగా తన పేరు స్క్రీన్ పై ఉండడానికి ఇష్టపడలేదు. అందుకే “సాహెబ్ బీవీ ఔర్ గులాం” సినిమాకు దర్శకత్వ భాద్యతలను అబ్రర్ అల్వీకి ఇచ్చారని అంటారు. ఆ సినిమా తరువాత ఇతర దర్శకుల సినిమాలలో నటించేవారు.  అలా నటించిన సినిమాలలో చాలా వరకు అమాయకమైన పల్లెటూరి వ్యక్తి పాత్రలు, సాత్వికమైన పాత్రలే ధరించేవారు. కేవలం నటుడిగా   ఉండిపోవడంతో ఆ సినిమాలలో గురుదత్  ఆత్మ కనిపించదు.  ఇతర దర్శకుల దర్శకత్వంలో, పెద్ద నటులెవ్వరూ లేకుండా వీరు నటించిన ‘సౌతేలా భాయి’ అనే ఈ సినిమా మాత్రం వీరికి మంచి పేరునే తీసుకువచ్చింది. ఇది ఆ సంవత్సరం మంచి వసూళ్లు సాధించిన సినిమాగా కూడా చెబుతారు. గురుదత్ నటన కూడా బావుంటుంది. ఆ పాత్రకు సరిగ్గా సరిపోయారాయన. ఈ సినిమాకు మహేశ్ కౌల్ దర్శకత్వం వహించారు. శరత్ చంద్ర నవల బైకుంఠర్ విల్ ఆధారంగా తీసిన సినిమా ఇది. 

బైకుంఠ్ మజుమ్దార్ అనే ఒక వ్యాపారస్తుడి భార్య, గోకుల్ మూడు నెలల పసికందుగా ఉన్నప్పుడే మరణిస్తుంది. ఆ బిడ్డకు ఏడాది వయసు వచ్చిన తరువాత అతను మరో వివాహం  చేసుకుంటాడు. భార్య భవాని గోకుల్ ను తన సోంత బిడ్డలా చూసుకుంటుంది. గోకుల్ కూడా ఆమెకు మాలిమి అవుతాడు. తల్లి కొడులిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. తరువాత భవానికి మరో కొడుకుగా వినోద్ పుడతాడు. వినోద్ అంటే గోకుల్ కు ఎంతో ప్రేమ. చిన్నప్పటి నుండి గోకుల్ మెత్తని మనసు కలవాడు. నిజాయితీపరుడు. క్లాసులో అందరూ పుస్తకాలు చూసి కాపీ కొట్టి పాస్ అయినా తాను మాస్టారు చెప్పారని ఆ పని చేయకుండా పరీక్ష తప్పుతాడు. మళ్ళీ అతన్ని స్కూల్ కి పంపేకన్నా వ్యాపారం నేర్పితే ఆ ఇంటికీ, తన వ్యాపారానికి అండ అవుతాడని, అతని నిజాయితీ అతన్ని నలుగురికి ఉపయోగపడేలా మార్చగలదని నమ్మి బైకుంఠ్ గోకుల్ ని చిన్నతనంలోనే తనతో పనికి తీసుకు వెళతాడు. గోకుల్ కష్టపడి ఆ వ్యాపారాన్ని ఎంతో అభివృద్దిలోకి తెస్తాడు. తమ్ముడిని కలకత్తా పంపించి పెద్ద చదువులు చదివిస్తాడు.

బి.ఏ లో గోల్డ్ మెడల్ సంపాదించి ఊరు చేరిన వినోద్ ని చూసి గోకుల్ ఎంతో గర్వపడతాడు. తమ్ముడు కోరినట్లు ఎం. ఏ లా కూడా చదివించాలని సిద్దపడతాడు. కాని బైకుంఠ్ వినోద్ వస్తువులలో మధ్యం సీసా చూసి బిడ్డ ఏ దారిలో ఉన్నాడొ గ్రహిస్తాడు. అతను జమిందారి బిడ్డలతో స్నేహం చేస్తున్నాడని తెలుసుకుని అతని అలవాట్లకు అడ్డుకట్ట వేద్దామనుకుంటాడు. కాని గోకుల్ మాత్రం తమ్ముడిని పట్నం పంపి చదివించవలసిందే అని పట్టుబడతాడు. తమ్ముడిని కూడా వ్యాపారంలోకి రమ్మని తండ్రి అడుగుతున్నాడని తెలుసుకుని అతన్ని కాదని తమ్ముడిని పట్నం పంపిస్తాడు. తమ్ముడు తిరిగి వచ్చేసరికి అతనికో మంచి ఇల్లు ఉండాలని ఒక పెద్ద ఇల్లు కూడా కడతాడు. 

వినోద్ మాత్రం పట్నం వెళ్ళి చదువు పక్కన పెట్టి మందు మగువలకు అలవాటు పడతాడు. ఈ లోపల బైకుంఠ్ ఆరోగ్యం దెబ్బతింటుంది. మరణించబోయే ముందు ఆస్తి అంతా గోకుల్ పేరున రాసి భార్యతో సంతకం చేయుంచి ఒక విల్లు తయారు చేస్తాడు. గోకిల్ కి తమ్ముడు ఏదో ఒక రోజు మారతాడని అప్పుడు అతనికి న్యాయం చేయమని చెప్పి మరణిస్తాడు. గోకుల్ భార్యకు ఆశ ఎక్కువ. ఆమెకు ఆ అస్థి అంతా తామె అనుభవించాలని ఉంటుంది. అన్నదమ్ములను వేరు చేసి గోకుల్ ని తనవైపుకు తిప్పుకోవాలన్నది ఆమె కోరిక. ఆమెకు ఆమె తండ్రీ, తమ్ముడు సహయపడుతుంటారు. మెతకవాడైన గోకుల్ భార్యకు గట్టిగా బుద్ది చెప్పాలని ప్రయత్నించిన ప్రతి సారి ఆమెదే పై చేయి అవుతూ ఉంటుంది. బైకుంఠ్ మరణించాక గోకుల్ మామ బావమరిది ఆ ఇంట చేరతారు. వారి అలుసు చూసుకుని గోకుల్ భార్య అత్తగారికి నరకం చూపిస్తూ ఉంటుంది. 

తండ్రి  చనిపోయాడనే కబురు వినోద్ కు తెలియకుండా ఉంచుతారు ఈ అన్నదమ్ముల కలయిక గిట్టని వారు. తమ్ముడి దగ్గరకు గోకుల్ ఆ ఊరి మేస్టారును తండ్రి మరణవార్త చెప్పమని పంపుతాడు. ఆయన గోకుల్ ఇచ్చిన డబ్బు తీసుకుంటాడు, ఆ డబ్బుతో జల్సాలు చేస్తాడు కాని పట్నంలో వినోద్ ని కలిసి విషయం చెప్పడు. పైగా వినోద్ గురించి అబద్దాలు చెబుతారు. తమ్ముడిని ప్రేమించే గోకుల్ మాస్టారుకి బుద్ది చెప్పి తానే తమ్ముడికి కబురు చేర్చాలని అతని కోసం ప్రయత్నిస్తుంటాడు. వినోద్ స్నేహితులు అతన్ని అన్న మీద కేసు వేయమని బలవంతం చేస్తూ ఉంటారు. ఈ లోపు తండ్రి శ్రాద్ద కర్మలకు వినోద్ ఇంటికి వస్తాడు. తల్లితో వేరు పడవలసిన పరిస్థితి వస్తుంది. పెద్ద కొడుకుగా అన్ని భాద్యతలు గోకుల్ నిర్వహిస్తాడు. వ్యాపరం పై గోకుల్ మామగారి పెత్తనం పెరుగుతుంది. నమ్మకమైన నౌఖర్లను తీసి వేసే పనిలో ఉంటాడు ఆయన. భవాని దీన్ని ఆపుతుంది. ఇది గమనించి ఆమె ఇల్లు వదిలి వెళ్ళవలసిన పరిస్థితులు సృష్టిస్తారు ఆ తండ్రీ కూతుర్లు. 

గోకుల్ తన శక్తి మేరా తల్లిని వెళ్ళకుండా ఆపాలని చూస్తాడు. కాని కోడలు చేసే అవమానాలు తట్టుకోలేక భవాని చిన్న కోడుకుతో వేరు వెళ్ళిపోతుంది. కాని అతనితో ఉంటున్నప్పుడు వినోద్ అలవాట్లను గమనించి భర్త ఆ విల్లు ఎందుకు రాసాడొ అర్ధం చేసుకుని అతన్ని సమర్ధిస్తుంది. తను ఇంటలేక గోకుల్ పడుతున్న బాధను మౌనంగా అసహాయంగా గమనిస్తూ ఉండిపోతుంది.  చివరకు తన మంచితనంతో తమ్ముడిని మార్చుకుని గోకుల్ తల్లి మనసుకు ప్రశాంతతను తీసుకురావడం సినిమా ముగింపు. మారుటి అన్నగా ప్రపంచం ఎన్నో రకాల పరీక్షలకు గురి చేసినా గానీ, తల్లి మీద ప్రేమను నిలుపుకుని ఆమె కోసం జీవించిన గోకుల్ గా గురుదత్ నటన బావుంటుంది. అప్పటి దాకా ఆయన చేసిన మిగతా అన్ని సినిమాలలో కన్నా కాస్త పెద్ద గొంతుతో, లౌడ్ డైలాగ్ డెలివరితో, గురుదత్ ఈ సినిమాలో నటించడం కనిపిస్తుంది.

మహేశ్ కౌల్ సినిమాలలో  మొదట గేయ రచయితగా,  మాటల రచయితగా ప్రవేశించారు. తరువాత దర్శకుడిగా కొన్ని మంచి సినిమాలు తీసారు. ఫిల్మిస్తాన్ సంస్థతో కూడా పని చేశారాయన. గురుదత్ నటించిన ఈ సినిమాకి దర్శకుడుగా వ్యవహరించక ముందు, గురుదత్ తీసిన “కాగజ్ కే ఫూల్” లో ఆయన మామగారిగా ఒక పాత్రలో నటించారు కూడా. ఈ సినిమాకు సంగీతం అందించిన అనిల్ బిస్వాస్ విద్యార్దిగా ఉన్నప్పుడు క్రియాశిలక రాజకీయాలలో పాల్గొంటూ అప్పట్లో కలకత్తాలోని టెర్రరిస్ట్ కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తి. చిన్నప్పటినుండి మంచి తబలా వాద్యకారునిగా పేరు ఉన్న వీరు హిందీ సినీ రంగంలో స్టూడియోల కాలం నుండి అంచెలంచలుగా పైకి ఎదుగుతూ ఉన్నతమైన స్థానానికి చేరుకున్నారు. ఈ సినిమాలో వీరు పాటలు పాడారు కూడా. వీరితో పాటు సుమన్ కళ్యాణ్పుర్, మన్నాడే, మీనా కపూర్, లతా మంగేష్కర్లు కూడా నేపద్యగానం అందించారు. 

గురుదత్ కి తల్లిగా ప్రణోతి ఘోష్ నటించారు. వీరు కాకుండా, అసిత్ సెన్ , కన్హైయాలాల్ లు కూడా కనిపిస్తారు. గురుదత్ భార్యగా నటించిన బేలా బోస్ అప్పట్లో చాలా సినిమాలలో నృత్యాలు చేసేవారు. ఇదొక్కటే వీరు తమ సినీ జీవితంలో చేసిన ప్రధాన పాత్ర. గురుదత్ సినిమాలలో ఈ సినిమా ప్రస్తావన ఎక్కువగా రాదు కాని ఇది వారు చేసిన మంచి సినిమాలలో ఒకటి. గురుదత్ ఇతర సినిమాలలోని విషాదం ఇందులో ఉండదు. గురుదత్ తన కెరిర్ ఆఖరిలో చేసిన సినిమాలలో చాలా సున్నితమైన యువకుని పాత్రలు వేసారు. గంభీరమైన పౌరుషమైన పాత్రలు వీరు ఎప్పుడూ చేయలేదు. ఈ సినిమాలో కూడా మనకు వీరి పాత్రలోనే కాకుండా స్వభావసిద్దంగా కూడా వీరిలోని  సున్నితత్వం కనిపిస్తూనే ఉంటుంది. అప్పటి సినీ క్రిటిక్స్ గోకుల్ పాత్రలో గురుదత్ నటనను ప్రశంసించారు. ఈ సినిమాకు 1962లో ఉత్తమ మూడవ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. గురుదత్ అభిమానులను తప్పకుండా అలరించే సినిమా ఇది.

సున్నితమైన అనుబంధాన్ని చాలా మృదువుగా చూపిస్తారు గురుదత్ తన సినిమాలన్నిటిలో కూడా. ఈ సినిమాలో తల్లితో అటువంటి అనుబంధాన్ని చూస్తాం. తన పుట్టిన రోజు నాడు తల్లి ఆశీర్వాదం తీసుకుందాం అని ఆమె ఉండే ఇంటికి అతను వచ్చినప్పుడు అతని నటనను గమనించండి. అలాగే, తమ్ముడిని తాగుబోతుగా చూసినప్పుడు కోపంతో నిస్సహాయంగా అతని పై చేయు చేసుకుంటున్న సీన్, తల్లి తనను వదిలి వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు ఆయన చూపించిన హావభావాలు నిశితంగా గమనించాలి. మనసు లోతులలోని విషయాలను అవతలి వాళ్ళు గుర్తుంచాలనే తపన ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. కాని పెదవి విప్పి తనకేం కావాలో చెప్పలేని నిస్సహాయత కూడా ప్రతి క్షణం కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఒక సందర్భంలో అనవసరంగా కోపంగా అరుస్తున్న గోకుల్ ని సున్నితంగా తన వద్దకు పిలిచుకుని అతని తల్లి “నీ మనసు నాకు తెలుసు ఎందుకంతగా కోపాన్ని పెంచుకుంటున్నావు” అని దగ్గరకు తీసుకున్నప్పుడు ఒక చిన్న పిల్లవానిగా ఆమె దగ్గర అతను పొందే సాంత్వన గురుదత్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. తనకేం కావాలో చెప్పలేకపోవడం గోకుల్ పాత్ర స్వభావం అయినా, గురుదత్ స్వభావం కూడా అదే అయి ఉంటుంది అన్న భావన వీరి పట్ల వీరి అభిమానుల మనసులో నిలిచిపోయిన నిజం. అందుకే వీరు చేసిన సినిమాలలో గోకుల్ పాత్ర కూడా వీరి వ్యక్తిత్వానికి దగ్గరగా నిలిచిన పాత్ర అనిపిస్తుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here