జామ్

0
6

[dropcap]చు[/dropcap]ట్టూతా అన్నీ శబ్దాలే. ట్రాఫిక్ జామ్ అనేది గమ్మత్తుగా ఉంటుంది. ముందర ఆగిపోయిన వాడిని వెనకున్న వాడు హార్న్ నొక్కి ముందరికి పొమ్మంటూ ఉంటాడు. అతని ఉద్దేశంలో తన ముందర ఆగిపోయినవాడు అర్జంటుగా సమాధిలోకి వెళ్ళిపోయి ఎవరినీ పట్టించుకోకపోవటం వలన అలా జరిగిందన్న మాట! నేనున్న రోడ్డంతా కార్లు, బస్సులు, అటువైపు ఉన్న రోడ్డంతా దీనికి రెండింతల వ్యవహారం. ద్విచక్రవాహనాలు నడుపుతున్నవారు కూడా హాయిగా మొబైళ్ళు చూసుకుంటారు. నేను చెయ్యవచ్చు, కారులో ఉన్నాను పైగా. ఇప్పుడిప్పుడే ఏదీ కదలదని అర్థమైపోయింది మరి. అద్దానికి ఆనుకుంది ఈ మొబైల్. దీనిని చూడాలన్నా విస్తుగొస్తున్నది. ఏ సంబంధమూ కుదరటం లేదు. ముందరకొచ్చిన అమ్మాయిలు వీడియోలో కనిపించి అదోలా ముఖాలు పెట్టి బాయ్ అని చెప్పి మాయమవుతున్నారు. మనిషి ఆలోచనలన్నీ ఇదిగో, ఈ జామ్‍లో ఇరుక్కున్నట్టు ఇరుక్కొని ఉన్నాయి. ఎక్కడికీ పోవు, ఇక్కడికి రావు. జీవితమే ఓ జామ్. అలవాటుగా మాట్రమోనీ లోకి వెళ్ళి అవీ ఇవీ స్క్రాల్ చేసాను. ఓ అమ్మాయి ఎందుకో లైన్ లోకి వచ్చింది… చిత్రంగా ‘హాయ్’ అంటోంది. నేనూ వీడియో కాల్ ఆన్ చేసాను. కళ్ళు పెద్దవి చేసింది.

“మీ పేరేంటి?” అడిగాను.

“జామ్”

“అంటే?”

“జాహ్నవి మల్లిక… అందరూ జామ్ అంటారు. ఇదిగో నా వెనుక కనిపిస్తున్న ట్రాఫిక్ జామ్‌లాగా!”

“బాగుంది. నేనూ జామ్‍లో ఇరుకొనున్నాను. మీరెక్కడా?”

“కూకట్‍పల్లి…”

“ఓ నేనూ అక్కడే. ఇంతకీ మీ పేరు?”

“మాజ్. జామ్‌ను అటు మారుస్తే!”

“సూపర్. డికోడ్ చేస్తే?”
“మాగంటి జనార్దన్”

“ఊ… మాట్రిమోనీ వాళ్ళు సెలెక్షన్‍లో ఉంచారు కాబట్టి ఇద్దరం పెళ్ళి గురించి ఆలోచించవచ్చు”

“ఆలోచించి ఆలోచించి జీవితం మీద విరక్తి కలిగింది”

“ఊ… మైండ్ జామ్ అయింది. కదా?”

“అవును. అ… అంటే!”

“ఏం లేదు. ప్రస్తుతం నా పేరు మీ మనసులోకి వెళ్ళింది. ఏమంటారు?”

“మీ ప్రొఫైల్ బాగుంది”

“మీది కూడా… అ… ఒకే!”

“అంతేనా?”

చిత్రంగా నవ్వింది.

“ఏంటి? Outstanding అనాలా?”

“అంత లేదు”

“ఊ… ఇంతకీ మీ కారు నంబరు…”

“5178”

“ఓ… నేను మీ వెనకాలే ఉన్నాను. TVS Jupiter!”

వెనక్కి తిరిగాను. హెల్మెట్ రియర్ మిర్రర్‍కి తగిలించి ఉంది. జుట్టు ప్రక్కకి తప్పిస్తోంది, నేను చూడాలని కామోసు. ఎందుకో నవ్వాను. చిన్నగా సిగ్గు పడ్డట్లుంది. కాకపోతే అది నా కల్పనేమో! ఎందుకో నిట్టూర్చాను.

“నచ్చలేదు కదూ!”, అడుగుతోంది.

ఆశ్చర్యం వేసింది.

“అయ్యో, అలాక్కాదు. అయినా ఇది కామడీగా ఉంది. మనం ట్రాఫిక్ జామ్‍లో ఉన్నాం”

“Marriage అంటేనే అది. అటూ పోలేం, ఇటూ పోలేం!”

“ఇప్పుడేం చేద్దాం?”

“ఏదీ చేసేందుకు లేదు.ఇందులో చెబుతున్నాడు. ఇప్పుడప్పుడే చీమ కూడా కదలదు!”

“మనం టచ్‍లో ఉందాం”

“ఇప్పుడు మటుకు చేసేదేమీ లేదు కదా!”

“అంతే?”
“ముందరకి వెళదాం”

“వెళ్లలేం కదా!”

“రోడ్డు మీద కాదు. Marriage విషయంలో”

“ఓ. చెప్పండి. అన్నీ సైట్‍లో చూసారు కదా?”
“అవును. నాకు సరిపోయాయి. మీకు?”

అరికాలి క్రింద చెమట్లు పడ్తున్నాయి. బ్రేక్ బదులు యాక్సెలరేటర్ నొక్కుతానేమోననిపించింది.

“బాగానే ఉన్నాయి”

“ఓ. థాంక్స్ అండీ. పెద్దవాళ్లకి చెప్పండి. ట్రాఫిక్ జామ్‍లో పెళ్లి కుదిరింది, అనండి”

“మా వాళ్లకి ఏ ఇబ్బందీ లేదు. ఈ రోజుల్లో ఇక్కడికి పెళ్ళికీ రాలేరు!”

“Nice. మరి ప్రొసీడ్ అయిపోదాం. ఇక్కడో సైట్ ఉంది. Details పంపించాను. ముహూర్తం ఇప్పుడే వచ్చేస్తుంది!”

నాకు కూడా పంపించింది. ఇంతలో స్క్రీన్ మీద కొబ్బరి బోండాం కనిపించింది. ముహూర్తం దాని మీద వ్రాసి ఉంది. అరె! అది ఈ రోజే, ఇప్పుడే!

“ఇదేంటి? నన్ను ఆట పట్టిస్తున్నారా?”

“కాదు. ఇది నిజం. ఈరోజు ఇప్పుడున్న ముహూర్తం వల్లనే ఇంత ట్రాఫిక్ జామ్!”

“ఇప్పుడు ఎలా?”

“ఎలా అంటే? పెళ్ళి చూపులైపోయాయి. మాటలైపోయాయి, తాంబూలాలు స్క్రీన్ మీద ముహూర్తంతో పాటున్నాయి. ఇంకేం కావాలి?”

“ఇదేంటండీ? పెళ్ళా ఇప్పుడెలా?”

“వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి. మీ వాళ్ళకి మీరు, నా వాళ్ళకి నేను”

“శభాష్”

ఇద్దరం అలాగే చేసామ్. అంతా కలలా ఉంది. ఓ సమస్య సులువుగా solve అవుతోంది. పూర్తిగా నిర్వేదం కలిగిన తరువాత మెల్లగా అన్నీ సద్దుకుంటాయని ఎక్కడో చదివాను.

ఇంతలో అందరూ వీడియోలోకి వచ్చారు.

“ఏంటిరా? ట్రాఫిక్ జామ్‍లో పెళ్లా?”

“అవును. నాతో పాటు ఇరుక్కున్న అమ్మాయితో పెళ్లి.”

“ఉండుండు. పురోహితుడిని కాల్ లోకి తెస్తాను…”

వీళ్లు మాట్లాడుతుండగా అమ్మాయి చెప్పింది.

“ఇదిగోండి, బాండ్ మేళం వాళ్లు మన ప్రక్క రోడ్డు మీద అటు పోతూ ఆగి ఉన్నారు. బండి మీద ఉన్న నంబరుకు చేసాను. మీరు ఫోన్‍పేలో వాళ్లకి అయిదువేలు ఇవ్వండి. ఈ ఖర్చు మగ పెళ్లి వారిదే”

ఫోన్‍పే లోంచి డబ్బులు పంపించాను. వాళ్ళు వెంటనే మేళం ప్రారంభించారు. ముహూర్త బలం అంటే ఏమో అనుకున్నాను. అందరూ ఇటు చూస్తున్నారు. వాళ్ళనీ, వీళ్ళనీ బ్రతిమాలుకుని అమ్మాయి తన బండీ లాక్కొచ్చి నా కారు పక్కన నిలబడింది. వీడియోలో పెళ్లి మంత్రాలు వినిపిస్తున్నాయి.

“అయ్యా, జీలకర్ర, బెల్లం…” అన్నాడు ఆ పురోహితుడు.

చుట్టూతా చూసాం. కొద్దిగా ముందర ఒకాయన స్కూటర్ వెనుక పూలు, తమలపాకులు ఓ సంచీలో పెట్టుకొనున్నాడు. అమ్మాయి ఏదో మాట్లాడి తమలపాకులు, చెరుకుగడ తెచ్చింది. కిటికీ లోంచి అందించింది.

“ఆయన పెళ్లికి వెడుతున్నాడట. ఇవి ఎలాగో అక్కడికి చేర్చలేడు, తీసుకోమన్నాడు”

“బాగుంది. చెరుకు గడేమిటి?”

“ఆ పేవ్‍మెంట్ మీద చెరుకు రసం వాడిని అడిగాను.”

“ఇప్పుడేం చేద్దాం?”

“ఇదే బెల్లం. జీలకర్ర సంగతి తరువాత చూద్దాం.” అంటూ తల వంచింది. నేనూ తల వంచాను. ఇద్దరం ఒకరి నెత్తి మీద ఒకరు తమలపాకులు, చెరుకుగడ పెట్టేసాం. జనం వింతగా చూస్తున్నారు. ఒకరిద్దరు వీడియో తీసేసారు. బాండ్ మేళం శబ్దం ఆకాశన్నంటింది. ఇదంతా బస్సులోంచీ, ఇతర వాహనాల్లోంచీ చూస్తున్నవారు చప్పట్లు కొట్టారు. ఓ కుర్రాడు పూలదండలు తెచ్చాడు. అదీ వ్యాపారమంటే! ఇద్దరం కిటికీలోంచే దండలు మార్చుకున్నాం.

“అయ్యా ఇంటికెళ్ళాక మంగళసూత్రం కట్టండి. మరల మంత్రాలు చదువుతాను” అన్నాడు పురోహితుడు.

“అక్కర్లేదు. ఇప్పుడే చెప్పండి” అన్నాను. కొద్ది రోజుల క్రితం తప్పిపోయిన పెళ్లి గుర్తుకొచ్చింది. నా తల్లిదండ్రులు నాతోనే ఉంటారు అని చెప్పినందుకు అమ్మాయి  నన్ను ఆఖరు క్షణంలో తిరస్కరించింది. ఆ మంగళసూత్రం కారులోనే ఉంది. అది తీసి మూడు  ముళ్ళు వేసేసాను. మంత్రాలు మారుమ్రోగాయి.

“నా కారులోకి వచ్చెయ్” అన్నాను.

“ఎలా? ఈ బండీ ఏం చేద్దాం?… ఉండండి” అంటూ ఎవరితోనో మాట్లాడింది. కొద్ది సేపట్లో ఓ బైక్ మీద ఉన్న ఇద్దరు కుర్రాళ్ళొచ్చి సహాయం చేసారు. నేనూ దిగి ఆ బండీని పేవ్‍మెంట్ మీదకి చేర్చాం.

జాహ్నవి కారులోకి వచ్చి కూర్చుంది.

“ఏజంట్ వచ్చి తీసుకుపోతాదు. అమ్మేసాను బండీని!”

“శభాష్”

ఇద్దరం సెల్ఫీ లోకి వచ్చాం. ఒకర్నొకరు చూసుకుని పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాం.

జామ్, మాజ్ ట్రాఫిక్ జామ్‍లో ఒకటయ్యాం. మెల్లగా బళ్లు కదిలాయి. మరో ప్రయాణం మొదలయింది. అందరూ మా వైపే చూస్తున్నారు.

మొబైల్‍లో లైవ్ టివిలో వార్తలు పెట్టాను. అందులో మేము, మా పెళ్లి – వరుసగా అలసట లేకుండా వీడియో కనిపిస్తోంది – ట్రాఫిక్ జామ్‍లో వివాహం…

ఫోన్లు ఇద్దరివీ మ్రోగుతూనే ఉన్నాయి. చుట్టూతా మోగ్రుతున్న ట్రాఫిక్ శబ్దాలే మేళతాళాల లాగా మా ఊరేగింపు సాగిపోయింది.

***

కారు ఎందుకో ఓ కుదుపు ఇచ్చింది. ఏమైందా అని చూసాను.

“ట్రాఫిక్ జామ్‍లో మంచిగ నిద్రపోయారు సార్”, అన్నాడు డ్రైవర్.

“అవునా?”
“ఈ జామ్‍ల వలన అందరికీ మెంటల్ వస్తోంది సార్”

“కరెక్ట్”

“మీరు కూడా నా నెత్తి మీద చెయ్యి పెట్టారు సార్”

“ఛా”

“నా మెడలో ఏదో కట్టబోయారు…”

చుట్టూతా చూసాను. నా బ్రతుకు ఏంటో చక్కగా అర్థమైంది. కాబ్ అలా పోతోంది. ఆ ప్రక్క పెద్ద హోర్డింగ్ ఉంది – ‘మాంగల్య – అందమైన కలలకు అసలు స్వరూపం!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here