బంగారుతల్లి

1
3

[box type=’note’ fontsize=’16’] లేఖిని సంస్థ నిర్వహించిన 2021 దీపావళి కథల పోటీలలో ఎంపికైన కథ ‘ బంగారుతల్లి’. రచన చెంగల్వల కామేశ్వరి. [/box]

[dropcap]“ఏ[/dropcap]మండోయ్! సుబ్బలక్ష్మి గారిల్లు ఇదేనా!” అంటూ ఖంగ్ మని వినిపించిన గొంతు విని, సోఫాలో నడుంవాల్చి మద్యాహ్నపు మగతనిదురలో ఉన్న సుబ్బలక్ష్మి, గదిలో ఐప్యాడ్‌లో సినిమా చూస్తున్న గుర్నాధం ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.

గభాలున లేచి ఓరవాకిలిగా వేసిన తలుపు తెరిచి “ఎవరూ!” అనడిగిన సుబ్బలక్ష్మిని తేరిపారా చూస్తూ, “నేను సుబ్బరావమ్మని, మీ ఇంట్లో నెల వంటకు అడిగారట కదా! మీ మేనత్త రమణమ్మగారు మీ ఇంటి ఎడ్రస్ ఇచ్చారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కాని, నా కళ్ల జోడు పగిలిపోయింది, కొందామంటే డబ్బులు లేవు” అంటూన్న సుబ్బరావమ్మని మాటలకి విషయం అర్థమైంది.

పచ్చగా, బొద్దుగా ఎత్తుగా ఉండి తెల్లగా పండిపోయిన జుట్టు, మడాల మీదకు కట్టిన ఎరుపునేతచీర, అదేరంగు రవిక వేలుముడితో ఏ అలంకరణ లేకున్నా కళ కళలాడే మోములో చిరునవ్వుతో ఉన్న ఆమెని చూడగానే అచ్చం అత్త చెప్పినట్లే ఉంది అనుకుంటూ,

“రండి! ఇప్పుడే భోజనాలయ్యాయి. అలా నడుము వాల్చానిపుడే!” అంటూ కూర్చోమన్నట్లు కుర్చీ చూపించింది సుబ్బలక్ష్మి.

“ఆ కుర్చీలు గిర్చీలు నాకొద్దమ్మా! నాకు కింద కూర్చోవడమే అలవాటు” అంటూ నేలపైన చతికిలపడింది సుబ్బరావమ్మ. ఆవిడ కన్నా తను కనీసం ఇరవయ్యేళ్లు చిన్న అయినా తను అలా కూర్చోలేదు. ఇంచుమించు డెభ్బై ఏళ్లున్న ఆవిడ అలా కింద కూర్చుంటే, ఆశ్చర్యమేసింది సుబ్బలక్ష్మికి.

వచ్చినది “ఎవరా!” అనుకుంటూ తొంగి చూస్తున్న గుర్నాధాన్ని చూసి; “ఈవిడ సుబ్బరావమ్మ గారు. మా అత్తయ్య పంపించిందిట, మన శిరీష డెలివరీ అయి అది మళ్లీ అత్తారింటికి వెళ్లేవరకు ఒకారునెలలయినా వంటకు ఎవరైనా కావాలనుకున్నాము కదా!” అని చెప్పిన భార్యామణి మాటలకి సరే అన్నట్లు తలపంకిస్తూ,

“ఓ… అలాగా!” అంటూ తను కూడా హాలులోకి వచ్చి, “మా పిన్నిగారు చెప్పారు మీరు ఆవిడకి బాల్య స్నేహితురాలని. మీకిక్కడ ఏ ఇబ్బంది ఉండదు. హాయిగా మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు. ఇప్పుడు మేమిద్దరమేనమ్మా! అబ్బాయివాళ్లు అప్పుడప్పుడు వచ్చివెడుతుంటారు. ఎల్లుండి మా అమ్మాయి కాన్పుకి వస్తోంది. వచ్చేవాళ్లు వెళ్లేవాళ్లు ఎక్కువ! మా సుబ్బులుకి పని ఎక్కువయిపోతుంది. అసలే మోకాలి నొప్పి, బిపి, సుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్” అంటూ ఏకరువు పెడుతున్న గుర్నాధం మాటలకి చిర్రెత్తింది సుబ్బలక్ష్మికి.

‘ఇంక ఆపండి. నేనేదో రోగిష్టిదాన్ని అన్నట్లు చెప్పతున్నారు. ఏ రోగాలున్నా, ముప్పొద్దులా మీకు చేసిపెడుతూనే ఉన్నాగా! ఎట్టకాలానికి పట్టపగలు అన్నట్లు ఇన్నాళ్లకి నా అవస్థ చూసి అబ్బాయీ కోడలూ చెప్పబట్టి వంటకి మనిషిని పెట్టుకోవడానికి ఒప్పుకున్నాను. ఇప్పటికి కూడా ఒక ఏభై మందికి చులాగ్గా వండి పాడేయగలను. మీరెళ్లి మీ రెండో పెళ్లాం ఆ ఐప్యాడ్‌ని ఉద్ధరించండి!” అని ఝణఝణలాడించేస్తుంటే వాళ్లమాటలు వింటూ. వస్తున్న నవ్వు ఆపుకోలేక ‘ఏంటో ఈ మార్జాల దాంపత్యాలు ఎక్కడ చూసినా ఇలాగే వాదించుకుంటారు. మళ్లీ ఒకరిని విడిచి ఒకరుండలేరు.’ అనుకుంటూ –

“బాబూ! మీరెళ్లి మీ పని చూసుకోమ్మా! మీ సుబ్బులుతో నేను మాట్లాడుతాను” అని చనువుగా మాటకలిపిన సుబ్బరావమ్మని చూస్తే, ఇంట్లో మనిషిలా అనిపించింది. ఆ దంపతులకి. “బ్రతికి చెడ్డదాన్నే కాని చెడ్డదాన్ని కానమ్మా! పొద్దున్న వచ్చి సాయంకాలం దాకా మాత్రమే ఉంటాను. ఎవరింట్లోనూ నేను ఉండనమ్మా! నాకు ఎవరూ లేకపోయినా, ఒక్కదాన్నే ఉండటం అలవాటు అయిపోయింది. వంటిల్లు చూపించమ్మా! ఒక్కసారి అన్నీ చూపిస్తే చాలు!” అంటూ నిలబడిన సుబ్బరావమ్మని చూసి “పదండి ముందు కాఫీ త్రాగుదాము!” అంటూ వంటింటిలోకి దారితీసింది సుబ్బులు.

ఆరోజు సుబ్బులు సుబ్బరావమ్మకి వంటిల్లుని ఎలా చూపించిందో! ఏమో కాని సుబ్బరావమ్మ చక్కగా అల్లుకుపోయింది. అస్తమానూ ఏదో వంక పెట్టి పని ఎగ్గొట్టే పనిమనిషిని సైతం కంట్రోలులో పెట్టి పని చేయించుకునేది. కేవలం వంటపని మాత్రమే కాకుండా వంటిల్లు, గ్యాస్ స్టౌ, సింక్ నీటుగా అద్దంలా ఉంచడం; సరుకులు ఏం కావాలన్నా ముందే చూసుకుని తనొచ్చేప్పుడు తెచ్చేసి, ఆ బిల్ సుబ్బలక్ష్మికి ఇచ్చి ఆ డబ్బులు తీసుకునేది.

ఎవరొచ్చినా, ఏం వండమన్నా, ఉత్సాహంగా వస్తువులు వేస్ట్ కాకుండా రుచిగా శుచిగా వండిపెట్టి ఆప్యాయంగా వడ్డించే సుబ్బరావమ్మలో అమ్మతనం ఉట్టిపడేది. కూతురు శిరీష శ్రీమంతానికి కావలసిన సారె వస్తువులు అన్ని స్వయముగా చేసివ్వడమే కాక, అమ్మమ్మ లాంటి దాన్ని, నేను ఇచ్చినదాన్ని కూడా తీసుకోమని, శిరీషకి వెయ్యి రూపాయలు ఇచ్చిన సుబ్బరావమ్మ ప్రేమాభిమానాలు చూసి, ఏమనాలో అర్థం కాలేదు. సుబ్బులుకి, గుర్నాదానికి. వద్దంటే నొచ్చుకుంటుంది అనుకుని ఊరుకున్నారు.

ఇంకా ఆవిడా చేసే అమృతంలాంటి వంట తింటూ రోజుకొకసారైనా ఆవిడా చేతి రుచులను మెచ్చుకోకుండా ఉండలేకపోయేవారు. శిరీష పురిటి సమయంలో దగ్గరుండి సుబ్బులుకి అనుభవం లేకపోయి కంగారు పడుతుంటే అన్నీ తానై శిరీష నొప్పులు పడేప్పుడు కూడా దగ్గరుండి అందరికి ధైర్యం చెప్పి శిరీషకే పురుడు వచ్చాక బాలింతరాలికి పత్యం వంట చేసి పెట్టడమే కాక, పసిపిల్లకి చక్కగా స్నానం చేయించి, సాంబ్రాణి పొగ వేసి, తను చేసిన అక్కులు బొట్టు, చేసిన కాటుక పెట్టి, తయారు చేయడం, ఇలా ఒక అమ్మమ్మలా సంరక్షణ చేయడం చూసి, తామెంత డబ్బులు ఇచ్చినా, ఇటువంటి పనితనం పదిమంది పెట్టులా చేయడం, అందరికీ అబ్బురంగా ఉండేది.

ఆమె గురించి సుబ్బలక్ష్మి మేనత్త రమణమ్మ ముందుగానే చెప్పింది. పెద్ద జమీందారు కుటుంబంలో పుట్టినా, భర్త ఆమెకి నిండా ఇరవయ్యేళ్ల వయసులోనే, పెళ్లయిన నాలుగేళ్లకే, ఆమె భర్త సాంబశివరావు పాము కరిచి చనిపోయాడు, అంతకు ముందే, ఒక బాబు పుట్టి పోవడంతో, పుట్టిల్లు చేరింది. అత్తింటివారిచ్చిన ఆస్తంతా, సొంతన్నయ్యే మాయచేసి, సంతకాలు పెట్టించి, ఆస్తి కాజేయడమే కాక, ఎంత చాకిరీ చేసినా, వితంతువు అన్మ వివక్షత , ఇంటిల్లపాదీ అవమానిస్తుంటే తట్టుకోలేక, ముప్పయవ ఏట ఇంటినుండి బయటకు వచ్చేసింది. తనకొచ్చిన మిషన్ పని మాత్రమే కాక, ఊరగాయలు, వడియాలు అప్పడాలు స్వయంగా తయారు చేసుకుని, హాస్టల్స్‌కి, హోటల్స్‌కి అందించడం, ఇళ్లకు క్యారేజీలు, ఇస్తూ, గత నలభయ్యేళ్లుగా కష్టపడి ఎంతో డబ్బు సంపాదించింది. కానీ, తనలా ఇబ్బంది పడే ఆడవారెందరికో, తన దగ్గరే ఆశ్రయమిచ్చి, తనలాగే స్వయంప్రతిపత్తితో, వారంతటవారు నిలబడేంతగా వారిని తీర్చి దిద్ది, పంపించేసేది. అలా ఆమె ఇంటిలో ఎప్పుడూ కొందరు విధివంచితలు ఉంటారు. వారందరి పోషణ బాద్యత చూస్తున్న సుబ్బరావమ్మ విషయం తెలుసుకున్న సామాజిక సంస్థలు కొన్ని ఆమె వద్దకు వచ్చి ఆమె చేస్తున్న సామాజిక సేవ కళ్లార చూసి ఆమెకు ఏవో ఆవార్డ్‌లు ఇస్తామని పిలిస్తే కూడా తిరస్కరించింది.

“మనిషిగా మనిషికి సేవ చేయాలి. అదే నేను చేస్తున్నాను. నేను ఏ సేవా ఎవరికి ఫ్రీగా చేయలేదు. నా బ్రతుకు తెరువుకి నేను ఒక మార్గం వేసుకున్నాను. ఇది మనం నడవాల్సిన ‘రాచబాట’. ఒకరి ముందు ‘దేహీ!’ అనకుండా చెడ్డ పనులు చేయకుండా, స్వాభిమానముతో బ్రతకాలి. అలా బ్రతికాను. ఆ దారే అవసరమైనవారికి చూపించాను!” అన్న ఆమె మాటలు ఎందరికో స్పూర్తిదాయకమై ఆమెనొక మదర్ థెరెస్సాలాగ అభివర్ణిస్తారు.

“ఆమెకి ఇలా మీకు అవసరముందని చెప్తాను. ఆమెకి వీలయితే ఆమే వస్తుంది. లేదా ఎవరినయినా పంపిస్తుంది. ఎవరొచ్చినా వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకుండా ఉంటే చాలు. ఎవరెంతిస్తే అంతే తీసుకుంటుంది!” అని చెప్పిన రమణమ్మ మాటలు నచ్చాకే ఆమెని పంపించమని చెప్పారు.

సుబ్బరావమ్మ చేతి చలవతో, కూతురు శిరీష చక్కగా పురుడు, బాలింతపత్యం, బారసాల, అన్నీ పూర్తయి అత్తారింటికి వెళ్లిపోయింది. బారసాలకు వచ్చిన కుటుంబసభ్యులు, బంధువులు అందరి నోటా ఒకటేమాట! ‘మనింట్లో సుబ్బరావమ్మగారుంటే చాలు! నిశ్చింతగా ఉండొచ్చు’ అని. కొందరు చాటుమాటుగా, “మా ఇంటికొచ్చేయండి. నెత్తిమీదెట్టుకుని చూసుకుంటాము” అని కూడా చెప్పారు. అందరికీ ఆమె చిరునవ్వు, “చూద్దాములెండి!” అన్నమాట మాత్రమే జవాబు లభించింది.

శిరీష అత్తారింటికి వెళ్లిన వారం రోజులకు “అమ్మా సుబ్బులూ! వచ్చిన పని అయింది . మీ అత్తయ్య చెప్పినట్లుగా ఆరునెలలు మీ ఇంట్లో ఉన్నాను. మరి రేపు వెళ్లొస్తాను.! అన్న సుబ్బరావమ్మ మాటకు బెంగటిల్లిపోయారు. సుబ్బలక్ష్మి, గుర్నాధం.

“అయ్యో ఎందుకు పిన్నీ! మీరు వెళ్లడం! మా ఎమ్మెల్యే నా ఫ్రెండ్ కదా! మీకు వృధ్దాప్య పెన్షన్. ప్రభుత్వ పధకంలో రెండు బెడ్ రూమ్‌ల ఫ్లాట్ కూడా ఇప్పించమని చెప్పాను. ఈ నెలలో అన్నీ అయిపోతాయి. ఇంక మీరు కష్టపడకండి. మీరొకరు ఉన్నంతమాత్రానా మా ఆస్తులు ఏమీ కరిగిపోవు. ఇక్కడే ఉండండి” అనడిగిన గుర్నాధం మాటలు, చేతులు పట్టుకుని “మీరే పని చేయొద్దు, మా అమ్మలా మా ఇంట్లో ఉండండి చాలు” అని అర్ధిస్తున్న సుబ్బలక్ష్మి ని దగ్గర తీసుకుని,

“వద్దమ్మా! నన్ను బలవంతపెట్టకండి. ప్రభుత్వ పథకాలకు నేను ప్రలోభపడను. అవి మనకెందుకు? కష్టపడేవారికి ఏ పథకాలు అక్కరలేదు. అవి తీసుకుని ఆ పార్టీలకి ఋణపడను. వాటి అవసరం నాకు లేదు. ఉచితంగా తీసుకున్నవేవీ, మనసుకి ఆనందానివ్వవు. నా ప్రాణమున్నంతవరకు నా ఒళ్లు నాకు సహకరిస్తున్నంతకాలం నేను పనిచేస్తాను. నా అవసరం ఎవరికున్నా, నేను వెడతాను. చేస్తాను. అందులోనే నాకు ‘భుక్తి’, ‘ముక్తి’, ‘జీవన అనురక్తి’ ఉంటుంది. రేపన్న ఆశ రేపటి పనిలోనే ఉంటుంది. మళ్లీ మీ శిరీష రెండో పురిటికి ముందు చెప్పండి. మళ్లీ ఇంకో ఆరునెలలు వచ్చి ఉంటాను.” అని చేతులు జోడించిన ఆ మానవతామూర్తిని చూసి గుర్నాధం మనసులో సుబ్బరావమ్మ మంచితనానికి ముగ్ధులయ్యాడు.

‘ఎంత గొప్ప వ్యక్తిత్వం! ఎంత డబ్బున్నా, తనది తనకే తమవారికే, ఇంకా ఏమయినా కావాలి! అనే వ్యామోహం, తనకన్నీ ఉన్నాయి కాబట్టి తన మాటే అందరూ వినాలి. ఎవరి మాటా తాను వినను అనే అహంకారాలు, వీటన్నింటినీ పక్కకు పెట్టి, తనదైనమార్గంలో ఒక రాజబాట వేసుకున్న సుబ్బరావమ్మ ఏ ఆదర్శాలకూ తీసిపోని మహత్తర మహోన్నత వ్యక్తిత్వం. సర్వదా అభినందనీయం అనుసరణీయం! ఇటువంటి బంగారు తల్లులుండబట్టే భారత దేశానికి ఇంత గొప్పపేరు’ అనుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here