కావ్య-8

0
4

[box type=’note’ fontsize=’16’] డా. ఇందు ఝున్‌ఝున్‍వాలా హిందీలో రచించిన ‘కావ్య’ అనే నవలని అదే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఆర్. ఉమా శర్మ. [/box]

[dropcap]కా[/dropcap]నీ నీరజ్ నా మాట వినకుండా నా దగ్గరకు రాబోయాడు. నేను అతన్ని వారిస్తూ – “మీరు పిల్లల్ని కలవాలని వచ్చారు, అంతవరకూ బాగానే ఉంది. నాతో మరలా సంబంధం పెట్టుకోవాలని అనుకోవద్దు. ఆ బంధం ఏనాడో తెగిపోయింది.” అన్నాను.

ఇంటి ఓనర్ బాబాయ్ నీరజ్‌ను సాయంత్రమే చూశారు. అందుకే నన్ను పిలిచి “జాగ్రత్తగా ఉండు, కొంచెం ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను పిలు, నేను వస్తాను” అని చెప్పారు కూడా. “రాత్రి అతను వెళ్లకపోతే నేను మధ్యలో ఉన్న తలుపు తీసి ఉంచుతాను. పిలువు నన్ను, నేను వస్తాను” అని చెప్పారు.

అరవాల్సిన అవసరం నీరజ్ కల్పించలేదు. ఊరకే నిద్రపోయాడు. పొద్దున్నే లేచి వెళ్లిపోయాడు. అపుడు నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నా.

‘ఇంట్లో ఇన్ని మిఠాయిల డబ్బాలు ఎక్కడివి? అని నాన్న అడిగార’ని పిల్ల ద్వారా తెలిసింది. అమ్మ పని చేసే ప్రెస్ వాళ్ళు పంపించారు అని వారు సమాధానం చెప్పారట.

నా గురించి, ఉద్యోగం గురించి తెలుసుకుంటున్నాడని తెలిసింది, దానివల్ల పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అని నాకు అర్థం అయింది. పొదున్నే పనంతా చేసి పిల్లలను స్కూల్‌కు పంపి నేను ప్రెస్‌కు వెళ్ళాను. మరలా సాయంత్రానికల్లా నీరజ్ ఇంట్లో కనిపించాడు.

ఇంటి ఓనర్‌కు కూడా చాలా కోపం వచ్చినా ఊర్కున్నాడు. నేను కూడా నీరజ్‌తో –  “ఇలా సాయంత్రం వచ్చి, పొద్దున పారిపోవటం, దొంగ లాగా రావటం ఏమీ బాగా లేదు” అన్నాను.

ఆ రోజు నుంచి నీరజ్ ఇక రానే లేదు.

***

ఛాలెంజ్ నా జీవితంలో అడుగడుగునా నా కోసం ఎదురుచూసేదేమో అన్నట్టు అనిపిస్తుంది. ట్యూషన్ బాగా జరుగుతూ ఉంది. ఒక రోజు జరిగిన సంఘటన వల్ల వద్దు అనుకుంటూనే వారి ట్యూషన్ వదిలి పెట్టవలసిన అవసరం వచ్చింది. ఆ ఇద్దరు పిల్లల అమాయకపు మాటలు నేను ట్యూషన్ మానేసేందుకు కారణం అంటే తప్పు కాదు మరి. పిల్లలు మంచివారు, అమాయకులు కూడా, వారి కుటుంబసభ్యులు కూడా చాలా మర్యాదస్థులు.

ఒక రోజు నేను వారిద్దరికీ పాఠం చెబుతూ ఉన్నాను. ఇంతలో వాళ్ళ నాన్నగారు ఆ గదిలోకి ఏదో పని మీద వచ్చారు. అంతలో చిన్న పాప వారి నాన్న దగ్గరకు వెళ్ళి గట్టిగా పట్టుకొని – “నాన్న. ఈ మేడమ్ గారు అమ్మ అయితే ఎంత బాగుంటుంది” అని అంది.

అది వింటూనే అతను కూడా నా వైపు చూసి తటపటాయిస్తూ బయటకు వెళ్ళాడు. నా పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. నేను మరుసటి రోజు వారి ఇంటికి పాఠం చెప్పటానికి వెళ్లలేక పోయాను. వారు మా ఇంటికి రెండవ రోజు వచ్చి అడిగారు, అప్పుడు నేను – “నాకు టైమ్ ఉండడం లేదండీ, నేను ట్యూషన్ చెప్పలేను” అని అన్నాను. ఆయన నా సంకోచాన్ని అర్థం చేసుకున్నారు. వారి కూతురు తప్పుకు నన్ను క్షమాపణ అడిగారు.

మా పిల్లల లాలనా పాలనా అంతా ఇంటి ఓనర్ గారి అమ్మాయిలు చూస్తూ ఉన్నారు. నాకు రాత్రనక, పగలనక పని ఉండేది. నాకు ఒక రకంగా ఒక కుటుంబం దొరికినట్టు అయింది.

ఈ మధ్యలో నాన్న మిత్రుడు ఒకరు స్కూల్లో టీచర్ పోస్ట్‌కు దరఖాస్తు చేయమని సలహా ఇచ్చారు. నాకు కూడా ప్రెస్ పనులతో విసుగొస్తోంది. ప్రెస్ పనులు రాత్రి పగలు తేడా లేకుండా చేయటం కొంచెం కష్టంగా కూడా ఉంది. పిల్లలకు సమయం కేటాయించ లేకపోతున్నాను. ఏదైనా సరైన ఉద్యోగం కోసం నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను.

నాన్నని ఆసుపత్రిలో చేర్పించారని తెలిసి చాలా బాధ కలిగింది. అది కేవలం బాధ అంటే సరిపోదు. అది భరించలేని దుఃఖం. ఈ సారి పూర్తిగా అనాథనయ్యాను. నాన్న ఆసుపత్రిలో అంతిమ శ్వాస విడిచారు. తల్లిని, తండ్రిని పోగొట్టుకున్న ఆడపిల్ల, మిగిలిన ఎంతమంది బంధువర్గం ఉన్నా, అనాథ మాత్రమే.

ఇంకా జీవితంలో ఇంకా ఏమి మిగిలి ఉంది దేవుడా? అని ఆలోచిస్తూ ఉండిపోయా. ఆ రాత్రి నా కన్నీటి ధార నాన్నకు అశ్రు నివాళి అంటే తప్పు కాదు. నాన్న నా కోసం చేసిన ప్రయత్నాలు, నా ఉద్యోగం కొరకు అందరినీ సహాయం అడిగేవారు. గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నాన్న నాకు నీడ లాగా కాపాడుతూ ఉన్నారు. నాన్న పూర్తిగా అలిసిపోయారు. ఇపుడు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఇపుడైనా ఆయనకి శాంతి కలగాలని కోరుతున్నాను.

నాన్న ప్రేమకు బదులు ఇంకా కొన్ని జన్మలు ఎత్తినా తీర్చలేను. ప్రతి జన్మలోనూ ఆయనే నా నాన్న గా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను. నాన్న నన్ను ఒక స్థిరమైన ఉద్యోగంలో చూడాలని కలలు కన్నారు. ఒక ఉద్యోగం బెనారస్ లోని రెసిడెన్షియల్ స్కూల్‌లో వచ్చింది. అక్కడే పిల్లలు చదువుకోవచ్చు, పైగా నేను కూడా అక్కడే పని చేయవచ్చు అనుకున్నా. కానీ నాన్న అందుకు ఒప్పుకోలేదు. ఆ స్కూల్ సిటీకి దూరంగా ఉండటం వల్ల, నేను అక్కడ ఉండటం అంతా సురక్షితం కాదని నాన్న అభిప్రాయం. ఆయన ఆ ఉద్యోగం వద్దని అన్నారు.

ఇప్పుడు నా గురించి అంతలా ఆలోచించేవారు ఎవరూ లేరు. అమ్మానాన్న ఉన్నంత వరకే అభిమానాల అర్థం ఉంటుందని వారు లేనప్పుడు మాత్రమే తెలుస్తుంది. అప్పటికి సమయం మించి పోతుంది. కేవలం ఒక నిటూర్పు విడిచి మరలా మన జీవితం వైపు అడుగులు వేయక తప్పదు.

నీరజ్ నన్ను బలవంతంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పుడు కూడా ఏదో మూలలో నాన్న ఉన్నారు అన్న ఊహ శక్తినిచ్చేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు మరి. నేను అనాథనయ్యాను అనే భావనే నా మనసును కలిచివేస్తోంది.

***

1990 సంవత్సరం.

అమ్మానాన్నల లోటు జీవితాంతం ఏడ్చినా తీరదు. కానీ నా పిల్లల కొరకు నేను బ్రతకాలి కదా, నా ఉద్యోగ ప్రయత్నాల వేట కొనసాగుతూ ఉంది. ఒకరోజు ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఉద్యోగం దొరికింది.

కొన్ని రోజులు అక్కడ ఉద్యోగం చేశాను. మనసుకు నచ్చింది. ఆ రోజుల్లో జరిగిన ఒక సంఘటన చెప్పి తీరాలి. సమాజంలో దొంగతనం, దోపిడీల సనగతి మనకు తెలిసిందే. వాటిని కంట్రోల్ చేయటానికి ఒకసారి సిటీలో కర్ఫ్యూ పెట్టారు.

15 ఆగస్ట్, స్వాతంత్ర దినం, మొత్తం సిటీలో కర్ఫ్యూ ఉంది. నాకు అంతకు ముందే జండావందనం సంబంధించి నాకు బాధ్యతను హెడ్ మాస్టర్ గారు ఇచ్చారు. ఇపుడు కర్ఫ్యూలో స్కూల్‌కు వెళ్లలేని పరిస్థితి. కానీ జెండా వందనం చేయకుండా ఉండడానికి మనసు ఒప్పలేదు. నా బాధ్యతలను నేను విస్మరించలేను, అసలే మొండి స్వభావం నాది. ఏది ఏమైనా జెండా వందనం చేయాలి అని నిర్ణయం తీసుకున్నా. అలాగే నీరజ్‌తో కూడా వైవాహిక బంధం అదే మొండి పట్టుదలతో జీవించాను. నీరకు మనసు ఇచ్చానో లేదో ఖచ్చితంగా చెప్పలేను కానీ శరీరం మాత్రమే అప్పగించాను. కానీ నీరజ్‌కు నా మనసుతో సంబంధం ఉండేది కూడా కాదు. అతని ధోరణి వేరేగా ఉండేది.

స్కూల్ దగ్గరలో ఉన్న నాతో పాటు పని చేసే మరొక టీచర్ సహాయంతో జెండా వందనం చేయాలి అనుకున్నా. ఆమెను ఒక టైమ్‌లో స్కూల్‌కు రమ్మని చెప్పాను, నేను కూడా తయారు అయ్యాను. ఎలాగో దైర్యం చేసి ఇంటి బయటకు వచ్చాను. పోలీసులు కనబడితే దాక్కొని ముందుకు వెళుతూ ఉన్నాను.

నేను చిన్నప్పటి నుంచి పుట్టి, పెరిగిన ఊరు కావటంతో చాలా చిన్న చిన్న సందు గొందులు కూడా బాగా తెలుసు నాకు. దాక్కొని ఎలాగో స్కూల్ దగ్గరగా రాగలిగాను. ఇంతలో ఒక పోలీసు అడిగారు, నేను చూడటానికి కొంచెం అమాయకంగా ఉండటం వల్లనో, చిన్నప్పటి నుంచి నాటకాలలో ప్రవేశం ఉండటం వల్లనో ఆయనకు వెంటనే చెప్పాను, కర్ఫ్యూ వల్ల నేను మా స్నేహితురాలి ఇంటిలో ఉండవలసి వచ్చిందని; కానీ మా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గరే అని, ఇంటికి వెళ్తున్నాను అని.

నా కన్నీళ్లతో ఆ పోలీసు కరిగిపోయాడు. ఎలాగో స్కూల్ లోకి వెళ్లగలిగాను. నాతోటి టీచర్ కూడా రావటంతో పని సులువైంది. మేమిద్దరమే జెండా వందనం చేసి, జనగణమన పాడి ఇంటికి వచ్చాము. ఇంటికి తిరిగి రావటం కూడా చాలా కష్టమైన పని, అయినా చాలా జాగ్రత్తగా ఇంటికి రాగలిగాను. తరువాత మా హెడ్మాస్టర్ గారికి ఈ విషయం తెల్సి నన్ను మెచ్చుకున్నారు కూడా.

***

కొన్ని నెలలలో నాకు మహాబోధి సొసైటీ నుంచి ఒక కబురు వచ్చింది. ఇప్పుడు ఎవర్ని సలహా అడగాలనేది నాకు అర్థం కాలేదు. బాబాయ్ గారు, నీరజ్ ఫ్రెండ్స్ చెప్పిన సలహా పాటించి ఇంటర్వ్యూకి వెళ్ళాను. చాలా భయంగా ఉంది, కానీ ఎక్కడో ఆ భగవంతుడు నా మీద దయ చూపించడం మొదలు పెట్టాడు అనిపించింది.

అక్కడ ఉన్న ఆఫీసర్ నా దరఖాస్తు చదివి అందులో మా నాన్నగారి పేరు చదివి ఆశర్యపడ్డారు. ఆయన కూడా నాన్నతో పాటు పోస్టాఫీసులో పని చేశారట, నన్ను కూడా చిన్నతనంలో ఎత్తుకున్నానని కూడా ఆయన చెప్పారు.

ఆయన నా గురించి అన్నీ వివరంగా అడిగారు, అప్పుడాయన “చూడమ్మా, ఇక్కడ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ పిల్లలు హాయిగా నెమ్మదిగా ఇక్కడ ఉండొచ్చు. మీ మీద చేయి కూడా ఎవరూ వేయలేరు. వంట ఒకటి మాత్రం నువ్వు చేసుకోవాలి, అంతే.” అన్నారు.

ఆయన నాన్న స్నేహితుడు కావటంతో ఆయనను నేను బాబాయ్ గారు అని పిలిచేదాన్ని, పిల్లలు ఆయనని తాత అని పిలిచేవారు. అక్కడ నా సంగీతం, అభినయం కూడా బాగా పనికి వచ్చాయి.

అక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కొరకు ఒక వ్యక్తి కావాల్సి ఉంది. నా అంకితభావం వల్ల నాకు స్కూల్ లోనే కాక ఆఫీసు పని కూడా అప్పగించారు.

మా అన్నయ్య కొడుకు టైపింగ్ ఇన్‌స్టిట్యూట్ పెట్టాడు, వాడు నాకు టైపింగ్ నేర్చుకోమని సలహా ఇచ్చాడు. సరేనని, నేను అప్పుడప్పుడూ కొంచెం టైపింగ్ నేర్చుకున్నాను కూడా. నేర్చుకున్న ఏ విద్య కూడా వృథాగా పోదు. మహాబోధి సొసైటీలో టైపింగ్‌కు సంబంధించి చాలా పని ఉండేది.

బాబాయ్ గారు నన్ను “నీకు టైపింగ్ వచ్చా?” అని అడిగారు.

నేను “కొంచెం వచ్చు” అని చెప్పాను. ఆయన వెంటనే ఒక లెటర్ రాయమని చెప్పారు. అంతే, నేను సమయం దొరికినప్పుడల్లా టైపింగ్ చేస్తూ ఉండేదాన్ని. జర్నలిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో డిక్టేషన్ లేకుండా కూడా లెటర్స్ టైపింగ్ చేసేదాన్ని. మహాభోధి ముఖ్యులు నా పనిని మెచ్చుకోవటం ప్రారంభించారు.

నా పని పెరిగిందనే చెప్పాలి. సగం పూట స్కూల్ పని, మిగతా సగం పూట ఆఫీసు పని, ఇలా పూర్తిగా పనిలో మునిగి పోయాను. నా పిల్లల కోసం నాకన్నీ సమ్మతమే అనుకున్నా. అలాగే నా సంగీత పరిజ్ఞానం కూడా అందరికీ నచ్చింది. చిన్న చిన్న ఖర్చులు కూడా కలిసి వచ్చేవి. జీవితం సుజావుగా నడుస్తూ ఉంది.

ఇది జీవితానికి పూర్తి స్థాయిలో సహాయం చేయదని నాకు తెలుసు. ఏదైనా మంచి ఉద్యోగం కావాలి అని నాకు ఉండేది. వాటి ప్రయత్నాలు కూడా చేసేదాన్ని. అక్కడ ఉన్నప్పుడు నీరజ్ మిత్రులు, బాబాయ్ గారు కూడా వచ్చేవారు నన్ను కలువటానికి. వారు కొన్ని ప్రభుత్వ పాఠశాలలలో పనిచేసేందుకు దరఖాస్తులు కూడా తెచ్చి ఇచ్చేవారు.

నాకు ఒక పెర్మనెంట్ ఉద్యోగం ఉంటే బాగుంటుందని బాబాయ్ గారు కూడా అభిప్రాయపడేవారు. నీరజ్ ఒక సంవత్సరం తరువాత మమ్మల్ని కలిసేందుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలియలేదు. రోజంతా పిల్లలతో ఆడుకుంటూ ఉండిపోయాడు. నాకు కొంత భయంగా ఉన్నా, ఊర్కున్నాను. మరలా తనతో జీవితం కొనసాగించమని అడిగాడు, కానీ అప్పటికే నేను మనసు గట్టి చేసుకున్నా, ఇపుడు ఒంటరిగా జీవితం అలవాటు అయింది.

నేను ఇదివరకటి, రాత్రి గదిలోనుంచి బయటకు కూడా రాలేని కావ్యని కాదు. అప్పటిలా, బేలగా ప్రతి దానికి ఏడ్చే కావ్యని కాదు.

అప్పుడు నీరజ్‌కి నేను ఒంటరిగా బ్రతుకలేను అనిపించేది. కానీ అతనికి తెలియదు కాలం అన్నీ నేర్పుతుందని.

ఆరోజు అతన్ని నేను కొంచెం గుచ్చుకునేలాగా మాట్లాడాను, ఇంకో సారి నన్ను కలవటానికి రావద్దని కూడా చెప్పాను.

అది నీరజ్‌తో నా ఆఖరు కలయిక….

***

1993 సంవత్సరం.

మూడు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఇంతకు ముందు నేను అప్లై చేసిన సంస్థల నుంచి ఇంటర్వ్యూలు రాసాగాయి.

నా కోసం జీవితం కొత్త బాటలు వేస్తూ కనిపించసాగింది. నాకు కేంద్రీయ విద్యాలయంలో అధ్యాపకురాలిగా ఉద్యోగం దొరికింది. నా మొదటి పోస్టింగే గువాహాతిలో అయింది. అంతే జీవితం ఒకసారిగా కొత్త దిశలో పయనం ప్రారంభింఛింది.

పిల్లలు కూడా పెద్దవారు అవుతున్నారు. ఇలాగే సంవత్సరాలు గడుస్తూ పోయాయి…

పిల్లలకి తండ్రి ప్రేమ, వాత్సల్యం తెలియదు. అది నేను వారికి ఇవ్వలేని సత్యం. నా పిల్లలు కూడా ఏనాడూ నన్ను నాన్న గురించి ఏనాడూ అడుగలేదు. వారికి ఏవిధంగా ఆ విషయం గురించి తేడా అనిపించలేదు. నేను వారికి అమ్మానాన్నల ఇద్దరి ప్రేమను ఇవ్వాలని ప్రయత్నం చేశాను. కానీ నేను విఫలం అయ్యాను.

నా పిల్లలు నా కన్నా ఎక్కువ భావనాత్మకంగా వ్యవహరించారు. నా పట్ల వారు చూపించే అభిమానం, ప్రేమ చెప్పలేను. వారి ప్రేమ నా జీవితానికి ఇంధనంగా పనిచేస్తుంది.

ఒకసారి వాళ్ళు తమ స్నేహితులతో మాట్లాడుతుండగా విన్నాను, వారికి ఖచ్చితంగా నాన్న లేని లోటు ఉందని, నాకు అర్థం అయింది.

స్కూల్లో అందరి పిల్లల తండ్రులు వచ్చినపుడు వారికి ఖచ్చితంగా వాళ్ళ నాన్న లేని లోటు బాధపెట్టేది. మిగతా పిల్లలు వారి తల్లిదండ్రులతో పిక్నిక్‌లకు వెళ్ళినపుడు వారు చాలా మనసు చిన్నబుచ్చుకున్నారు. వారి మాటలు విని నా అసహాయతకు కళ్ల నుంచి కన్నీరు ఆగేది కాదు.. నేను కూడా పిల్లలు వారి నాన్నతో హాయిగా ఉండాలి అనుకున్నా, కానీ అలా జరుగలేదు.

నేను నా చిన్నతనంలోని ఎన్నో విషయాలను ఏ రోజుకారోజు నాన్నతో పంచుకునేదాన్ని. అలాంటి అనుభవం నా పిల్లలకు లేదు. నేను ఐదవ తరగతి చదివే రోజుల్లో మా స్కూల్లో ఒక హిందీ టీచర్ ఉండేవారు, ఆయనకు ఎవరి పేర్లు గుర్తు ఉండేవి కావు. ఏదో ఒక కొత్త పేర్లతో మమ్మల్ని పిలిచేవారు. ఒక క్లాస్మేట్ పేరు మూలచంద్ అయితే సార్ మాత్రం ఎప్పుడూ జడచంద్ అని పిలిచేవారు. దీపికా అనే అమ్మాయిని దియాబాతీ అని పిలిచేవారు.

ఆ రోజులు చాలా హాయిగా ఉండేవి. స్కూల్లో జరిగినవి అన్నీ నాన్నకు చెప్పేదాన్ని. స్కూల్లో భోజనానికి సమయం ఇచ్చినపుడు మేము మాత్రం త్వరగా తిని అచ్చెందరాళ్ళు ఆడేవారం. మా అందరి బ్యాగులో ఐదు-ఐదు అచ్చెందరాళ్ళు ఉండేవి. ఒకోసారి భోజన సమయం అయిపోయి గణగణ మని గంట కొట్టినా కూడా వినిపించేది కాదు. అంతలా ఆటలను ఆడేవాళ్ళం.

మాస్టారు గారు వచ్చి అరిచేవారు. ఆయనను చూసి మేము పరిగెత్తి వెళ్ళేవాళ్లం. అప్పుడు మాస్టారు గారు అందరికన్నా మొదలు అచ్చిందరాళ్ళు ఆడుతున్న అమ్మాయిని నుంచోబెట్టేవారు. ఆడపిల్లలకు పెద్దగా పనిష్మెంట్ ఉండేది కాదు. రెండు చెవులు పట్టుకొని నిలబడమని చెప్పేవారు.

కానీ మగ పిల్లల్లకు మాత్రం విచిత్రమైన పనిష్మెంట్ ఇచ్చేవారు. వాళ్ళకి మాస్టర్ గారి ఈ ప్రవర్తన నచ్చేది కాదు. నేను మాస్టర్ గారికి ఇష్టమైన శిష్యురాలిని. ఒకసారి నేను ఈ విషయం గురించి అడిగాను కూడా. ఆయన నవ్వి, “ఆడపిల్ల అంటే ఆదిశక్తి, మీ మీద చేయి ఎత్తగలనా?” అని అన్నారు.

ఈ మాటను నేను నాన్నగారికి చెప్పినపుడు ఇంట్లో అందరూ సంతోషించారు. కానీ ఇలాంటి సంఘటలన్నీ నా పిల్లల జీవితాలలో కల లాగా మాత్రమే ఉండిపోయాయి. కానీ మాస్టర్ గారి ప్రవర్తన వల్ల నేను నేర్చుకున్నది కూడా అదే, నేను కూడా స్కూల్‌లో ఏనాడూ ఆడపిల్లలను అవమానించే లాగా మాట్లాడలేదు, మగ పిల్లలకు వారిని ఎలా ట్రీట్ చేయాలో చెప్పిస్తూ ఉన్నాను. ఎక్కడో నాలాంటి జీవితం ఏ ఆడపిల్లకు ఉండకూడదు అని కూడా నా మనసులో ఉండేది.

ఒకసారి నేను ఇంట్లో లేనప్పుడు పింకూ నీరజను కొట్టాడు. వాడు చాలా తుంటరి పిల్లాడు. నీరజ ముఖం మీద ఒక చార కూడా పడింది. ఇంటికి తిరిగి వచ్చి చూస్తే పింకూని బాగా హెచ్చరించాను, ఇంకో సారి అలా చేయవద్దని. దానితో పాటు – ఆడపిల్లలు అమ్మవారి స్వరూపం అని, వారిని బాధ పెట్టరాదని కూడా నచ్చచెప్పాను.

మాస్టర్ గారి ఆలోచన ఈ సమాజానికి కూడా ఎంత ఉపయోగకరమైనది. నా బిజీ లైఫ్ కూడా వారికి సన్నిహితం కావటానికి అవకాశం అయింది. వారిద్దరూ అక్క-తమ్ముడు మాత్రమే కాకుండా మంచి స్నేహితులు అయ్యారు. వయసుకు మించి ఆలోచించే బుద్ధిమంతులు కావటం నాకు సంతోషాన్ని ఇచ్చింది.

***

గువాహాటీ తరువాత నా పోస్టింగ్ చండీగడ్‌కు అయింది. ఆ తరువాత 2005లో పాట్నాకు – ఇలా వేరే వేరే ప్రదేశాలలో నివసించే అవకాశం కలిగింది. నాకు అన్నీ ప్రదేశాలలో మంచి-మంచి వ్యక్తుల సహకారం దొరికింది. మంచి రోజులు నా జీవితంలో మొదలైయాయి అనిపిస్తోంది.

పిల్లలు పెద్దవారు అయ్యారు. కొడుకు డిల్లీ వెళ్ళాడు. ఆ తరువాత కొన్ని రోజులకు నీరజ కూడా డిల్లీ వెళ్లింది. ఇద్దరూ చదువులో ఒకరికి ఒకరు పోటీగా ఉండేవారు. అలాగే చదువు అయిన వెంటనే నీరజకు హైదరాబాద్‌లో ఉద్యోగం కూడా దొరికింది.

2005లో కేంద్రీయ విద్యాలయ సంస్థల రాష్ట్రీయ పురస్కారం నాకు లభించింది. మానవ హక్కుల మంత్రి అర్జున సింగ్ గారి చేతుల మీదుగా అవార్డ్ తీసుకుంటూ ఉంటే నా కళ్ల వెంబడి కన్నీరు, కానీ ఆ కన్నీరు నాకు మరింత ఆనందాన్ని కలిగించింది. నాకు అవార్డ్ రావటం పిల్లలకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

అంతే నేను వెను దిరిగి చూడలేదు. 2006 లో నా మొదటి కవితా సంగ్రహం ‘సఫీనా’ అచ్చయింది. 1997 నుంచి కూడా నా కవితలు, ఇంటర్వ్యూలు అప్పుడప్పుడూ అచ్చయ్యేవి.

ఇపుడు సినిమాలో వలె ఒక విరామం దొరికినట్టు నాకు అనిపించసాగింది.

2008 సంవత్సరం!

నీరజా వచ్చి రజనీ చందర్ గురించి చెప్పింది. అతను నీరజతో పాటు పని చేస్తాడట. అతను ఒక దక్షిణ భారతీయుడు. అతని అమ్మానాన్నలు కూడా చాలా మంచివారు. నీరజకు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు. వారు కూడా వరకట్నం పేరు మీద కేవలం నీరజను మాత్రమే అడిగారు. వేరే ఏదీ వద్దు అని చెప్పటం వారి సంస్కారాన్ని సూచిస్తుంది.

పెళ్లి చాలా నిరాడంబరంగా ఒక గుడిలో చేశాము. ఆ రోజు నీరజ్ నాకు చాలా గుర్తొచ్చాడు. నీరజ కూడా తన నాన్నని గుర్తు చేసుకొని ఉంటుంది, కానీ నాకు తెలియకుండా జాగ్రత్త పడింది. వధూవరులు సప్తపది నడుస్తూండగా నా కళ్ళు అప్రయత్నంగా వాకిలి వైపు చూడసాగాయి. నీరజ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కదా? కనీసం ఎక్కడ ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో కూడా తెలియదు. నీరజ వివాహంతో నా అతి పెద్ద కర్తవ్యం తీరినట్టుగా అనిపించింది.

ఆడపిల్లను ఒక అయ్య చేతిలో పెట్టినపుడు ఏదో గుండెల మీద భారం తగ్గినట్టు అనిపించింది. కానీ ఇంట్లో, మనసులో ఒక రకమైన శూన్యత వ్యాపించింది. బిడ్డను సాగనంపిన తరువాత ప్రతి అమ్మానాన్నలకు ఇలాగే అవుతుందేమో.

***

ఒక రోజు ఏదో పని మీద నేను బ్యాంకుకు వెళ్ళాను. అపుడు తెలిసింది నాకు విడాకుల కొరకు దరఖాస్తు ఇవ్వటం తప్పనిసరి అని. నీరజ్‌ను కలిసి ఎన్నో యుగాలు అయినట్టు ఉంది. అతని గురించి ఆలోచించక యెన్నో సంవత్సరాలు అయ్యాయి. మహాబోధి తరువాత నీరజ్‌ను కలువలేదు. కానీ న్యాయస్థానం వేసే ఒక ముద్ర మాత్రమే బాకీ ఉన్న వైవాహిక సంబంధం మాది. అయినా ఇపుడు ఏమి మిగిలి ఉందని అందరూ చెబితే డైవోర్స్ పేపర్ మీద సంతకం చేసేశా.

మానసికంగా నేను దృఢంగా ఉన్నప్పటికీ కోర్ట్ కేసులు అంటూ తిరగటం కొంచెం వేదనను కలిగించింది. చిన్నప్పటి నా అనుభవాలు కూడా అందుకు కారణం కావచ్చు.

అప్పటికే నాకు పాట్నా ట్రాన్సఫర్ అయింది. ఆ సమయంలో నా వదిన నాకు చాలా సాయం చేసింది. ఆమె నాతో బాటు కోర్ట్‌కు వచ్చేది. గవర్నమెంట్ పని అంటే ఒక పట్టాన తెగదు. నీరజ్ ఉండే చిరునామా కూడా నాకు సరిగా తెలియదు. మూడు-నాలుగు అడ్రెస్‌లకు పంపినా యెక్కడ నుంచీ కూడా ప్రత్యుత్తరం రాలేదు. కేస్ పెట్టి కూడా రెండు సంవత్సరాలు అవుతూ ఉంది. ఉన్నాట్టుంది వదిన చనిపోయింది. ఇంకోసారి జీవితంలో ఒంటరితనం…

కోర్ట్ వెంబడి తిరుగుతూ – తిరుగుతూ బాగా అలిసి పోయాను. నీరజ్ ఒకసారి కూడా కోర్ట్‌కి రాలేదు. నేను మా లాయర్ గారితో చెప్పేశాను, “ఇపుడు మా వదిన గారు కూడా లేరు. నేను ఇలా కోర్ట్ చుట్టూ తిరగలేను” అని. కేస్‌ను త్వరగా ముగించమని అభ్యర్థించాను.

***

2010 ఆగస్ట్ నెల, ఆ రోజు సోమవారం.

ఆ రోజు మా వివాహ రద్దు గురించిన నిర్ణయం చెప్పే రోజు. నాకు రకరకాలుగా అనిపిస్తోంది. నా జీవితంలో పెళ్లి అనే బంధం ఆ రోజు కూడా పేపర్ల మీద సంతకాల తోనే మొదలు అయింది, ఈ రోజు కూడా పేపర్ల మీద సంతకాలతో ముగుస్తోంది. నా జీవితం ఈ పేపర్ల మీద రాసినట్టుగా నడుస్తూ వస్తోంది.

అందరి జీవితాలలో పెళ్లి అంటే ఇలాగే జరుగుతుందా? లేక నా జీవితంలో మాత్రమే ఇలా జరిగిందా? నేను నీరజ్‌ను ప్రేమించానో లేదో అది వేరే విషయం. కానీ పెళ్లి అనే పేరుతో పది సంవత్సరాలు కలిసి ఉన్నాము కదా, పైగా జీవితాంతం కలిసి ఉంటామనే పేపర్ మీద సంతకాలు కూడా చేశాము ఆ రోజు.

చిన్నప్పటి కథలలో అమ్మ ఎప్పుడూ చెప్పేది, ఒక రాజకుమారుడు వస్తాడు, నిన్ను తీసుకొని వెళ్తాడు. అని అవి అన్నీ ఒట్టి కథలేనా? రాజకుమారుడు లేదు, రాణీ లేదు. పూల పల్లకీ తెచ్చి రాణిని తీసుకొని కూడా పోడు.

ఇలాంటి కథలు చిన్న పిల్లల మనసులో ఏవో ఆశలు పెంచుతాయనేమో నేను నా పిల్లలకు ఇలాంటి కథలు చెప్పనే లేదు. నాకు వారికి ఇలాంటి కథల అవసరం ఉందని కూడా అనిపించలేదు. కలలు చెదిరితే చప్పుడు కూడా రాదు. అలాగే జీవితం చెదిరితే కూడా ఏమీ తేడా తెలియదు బయటకు, కానీ వారి జీవితంలో మళ్ళీ వసంతం అనేది రానే రాదు.

జీవితంలో ప్రేమ నాకు కూడా కావాలి కదా, నాకు ప్రేమ దొరకలేదు, దొరికింది కేవలం, దుఃఖం, నొప్పి, బాధ, కన్నీరు మాత్రమే.

ఈ రోజు ఈ పేపర్ల మీద వేసిన గుర్తు ఇంకా ఏమి రుచి చూపించాలని తపన పడుతున్నాడో అన్నట్టు అనిపించింది. ఒంటరితనం ఒక శాపంలా నన్ను వరిస్తూ ఉంది. ఈ రోజు పిల్లలు కూడా తోడు లేరు. ఆలోచనల తరంగాల నుంచి బయటకు వచ్చి సమయం చూశాను. తెల్లవారుజామున ఐదు అయింది. కిటికీ లోనుంచి బయటకు చూసా. బయట పూర్తిగా వెలుతురు లేదు, అలాగాని చీకటి లేదు. చీకటి-వెలుతురు ఒకదానితో ఒకటి విడిపోతున్నట్టు అనిపించింది. వాటి రెండింటి సంగమం ఎన్నడూ కాదు. అవి ఎప్పుడూ కలిసి ఉండలేవు. నేను నీరజ్ కూడా అంతేనేమో. ఈ జన్మలో అతనితో సంబంధం న్యాయస్థానం పరంగా కూడా తీరిపోయినట్టే.

తెల్లవారుతున్నది, కొత్త ఉదయం వస్తోంది, బహుశా నా జీవితంలో కూడా కొత్త జీవితం ప్రారంభం అవుతున్న ఫీలింగ్.

మనసులో ఉన్న దుఃఖపు తెరలు తొలగి మనసు నిశ్చింతగా ఉంది. ఈ రోజు నేను కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను. జీవితంలో 53 వసంతాలు పూర్తి చేసుకున్న నేను మొదటి సారిగా నా ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుంటూ ఉన్నాను. అపుడు నన్ను నేను అడిగాను. ‘కావ్యా, నీకు ఏమి కావాలి?’ అని…

***

ఆ తరువాత……

2010 నుంచి 2017 వరకు.

కొత్త జీవితం మొదలు అయిందనే చెప్పాలి. కొత్త జన్మ అని చెప్పలేను.

నేను సారనాథ్‌లో ఉన్నాను. నేను సంపాదించిన ఆస్తి అంటే నా ఇద్దరు పిల్లల ప్రేమ, చాలా మండి శ్రేయోభిలాషుల స్నేహం తప్ప ఇంకా ఏదీ లేదు. ఇవే ఈ జన్మకు నా ఆస్తులు, అంతస్తులు. లోన్ తీసుకొని ఇల్లు కట్టాను. ఆ లోన్ కూడా తీరిపోయింది. ఉండటానికి ఇల్లు కావాలనిపించి అది చేశాను. అంతకన్నా ఏదీ కావాలని నాకు లేదు.

ఇపుడు సమాజం కోసం ఏదైనా చేయాలన్న సంకల్పం మొదలైనిది. నా దగ్గర డబ్బు లేదు కానీ ఏదైనా చేయాలన్న సంకల్పం, మనసు రెండూ ఉన్నాయి. నా శరీరం, మనసు రెండూ ఆ లక్ష్య సాధనకు కేటాయించాలి అనుకున్నాను.

కేంద్రీయ విద్యాలయం ద్వారా దొరుకుతున్న జీతం నాకు చాలు. సాహిత్యం మీద రుచి పెరిగింది. కవి సమ్మేళనాలలో పాల్గొనటం మొదలు పెట్టాను. కానీ అక్కడ కూడా నాకు ఒకటి తీవ్రంగా బాధించింది. ఎంత అభిరుచి, యోగ్యత ఉన్నా కూడా కవయిత్రికి లభించవలసిన మర్యాద దొరకటం లేదు అని నాకు అనిపించసాగింది. ఆ సమయంలో కవయిత్రులు చాలా తక్కువగా ఉండేవారు కూడా.

ఆ రోజుల అనుభవాలు కూడా విచిత్రంగా ఉన్నాయి. భారతీయ సమాజం లోని స్త్రీ జీవితం ప్రతి అడుగు లోనూ ఒక కొత్త సవాలును ఎదుర్కూక తప్పని స్థితిని గమనించాను. నేను ఒక స్త్రీగా , కవయిత్రిగా కూడా సాహిత్యం లోనూ, సమాజం లోనూ స్త్రీ స్థితికి బాధ పడ్డాను.

సాహిత్యంలోనైనా స్త్రీకి స్వతంత్రం దొరుకుతుందని ఆశించాను. కానీ పురుషాధిక్య సమాజం సాహిత్యంలో కూడా వారిదే పైచేయి అవటంతో కొంత నిరాశ ఎదురైంది. కానీ నేను నా ప్రయత్నం వీడలేదు.

ఒకసారి కవి సమ్మేళనం కొరకు నాకు వేరే సిటీ వెళ్లాల్సి వచ్చింది. నాతో పాటు బెనారస్ నుంచి ఒక కవి కూడా ఉన్నాడు. నేను ట్రైన్‌లో వెళ్ళాలి అని అనుకున్నా, కానీ ఆయన తనతో పాటు కారులో రమ్మని అన్నాడు. నేను అతని మాట విని కారులో వెళ్ళటానికి సిద్ధం అయ్యాను. ఒక స్త్రీకి పురుషుని అంతరంగాన్ని అర్థం చేసుకోవటానికి ఆట్టే సమయం పట్టదు కదా. నాకు అతని అంతరంగం అర్థం అయింది.

ప్రయాణం సగంలో నేను దిగి వెనక్కు రాలేను, దిగి వేరే కారులో వెళ్లనూ లేను. ఎలాగో వాడి మాటలను భరిస్తూ సిటీ చేరుకున్నా. అక్కడ హోటల్‌లో కూడా అతను ఒకే రూమ్‌లో మా సామాన్లు పెట్టించాడు. ఆ విషయం తరువాత నాకు తెలిసింది. కానీ నేను రూమ్ లోకి వెళ్లకుండా రిసెప్షన్ లోనే కూర్చోండి పోయా. కవి సమ్మేళనం సంబంధించిన వేరే వ్యక్తి సహాయంతో వేరే హోటల్‌కు వెళ్ళాను.

ఈ విషయాని అతను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. అతనికి నా ప్రవర్తన వల్ల కోపం వచ్చింది. పురుషాహంకారం చూపించాలని నా పేరు కవితా సమ్మేళనంలో చివరన పెట్టాడు.

నేను అంతా అర్థం చేసుకున్నా. నాకు అక్కడ వాతావరణం అంతా ఊపిరి ఆడనట్టుగా ఉంది. ఎలాగో కవి సమ్మేళనం ముగిసిన తరువాత త్వరగా బస్‌స్టాండ్ వెళ్ళి దొరికిన బస్ ఎక్కి ఇల్లు చేరుకున్నాను. ఇంటికి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చాను. నన్ను కవి సమ్మేళనానికి ఆహ్వానించిన వ్యక్తికి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పాను.

ఇలాంటివే అనేకం ఇతర కవయిత్రుల విషయంలో జరగటం నేను గమనిస్తూ ఉన్నాను. మనసుకు చాలా బాధగా అనిపించేది. ఒక కవయిత్రికి 50 సంవత్సరాలు అయినందున అవకాశం ఇవ్వక, 35 సంవత్సరాల ఆమెకు ఇస్తున్నాము అని చెప్పారట. ప్రజలు కవయిత్రి రచనలను వినటానికి రారు, ఆమెను చూడటానికి వస్తారు, కాబట్టి మిమ్మలను ఎంపిక చేయటం లేదని చెప్పాడట.

ఇలాంటి మాటలు విని నా తల తిరిగినంత పని అయింది. సాహిత్యం అనే క్షీర సాగరంలో ఇలాంటి విష బిందువల వంటి ఆలోచనలు….

మన దేశం లోనే మన స్త్రీలకి మర్యాద, గౌరవం మనం ఇవ్వటం లేదంటే ఇతర దేశాల పురుషులకు మనం ఏమి చెప్పగలం? ఇదేనా మనం మన స్త్రీలకు ఇస్తున్న గౌరవ మర్యాదలు?

అపుడు నేను ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాను. అది కేవలం బెనారస్ లోనే కాదు భారతదేశం లోనే ఒక స్త్రీ చేసిన సాహసం అది. స్త్రీ సముదాయానికి కూడా న్యాయం, మరియు వేదిక దొరకాలని నా మొదటి అడుగు వేశాను.

ఈ సంకల్పంతో నేను 2011లో కవయిత్రుల సమ్మేళనం చేయటం ప్రారంభించాను. పురుషాధిక్య సమాజంలో ఈ అడుగు కూడా చాలా పెద్ద సంచలన్నాన్ని రేపింది. ఛాలెంజ్ చేయటం నాకు బహుశా ఆ దేవుడిచ్చిన వరం లాగా నేను భావిస్తూ ఇప్పటికీ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. అలాగే రాటు తేలిపోయాను కూడా. కొంతమంది విద్వాంసులు నా అభిప్రాయానికి మద్దతు పలికారు. దేశం మొత్తంలో నాకు తెలియదు కానీ బెనారస్‌లో ఇది పెద్ద సంచలనాన్ని రేపింది. మొదటి సమ్మేళనం అస్సీ ఘాట్ వద్దనే జరిగింది. ఈ రోజు అదే అస్సీ ఘాట్ సాంస్కృతిక కార్యక్రమాలకు పుట్టినిల్లు అయింది.

నా సంగీతం, నా సాహిత్యం, నా భావాలు, నా ఆలోచనలు, నా ప్రస్తుతం – అన్నీ కలిసి నా పేరు ప్రఖ్యాతులను ఆనాటి కాలం లోనే పెంచాయి. కొత్తగా వస్తున్న కవయిత్రులందరిని పైకి తేవటానికి ప్రయత్నంలో వారి ఆశీర్వాదాలు కూడా నాకు దొరికాయి.

అయితే ఈ సమ్మేళనాలకు అయ్యే ఖర్చు నేనే భరించేదాన్ని. కానీ కొంత కాలం లోనే కొందరు తమంతట తామే వచ్చి ఇచ్ఛాపూర్వకంగా సహాయం చేసేవారు.

***

2017 వ సంవత్సరం.

సమయం వేగంగా పరిగెడుతోంది.

నేను ఆస్ట్రేలియాలో కూతురు నీరజ దగ్గర ఉన్నాను. నాకు మనుమడు పుట్టాడు.

మా స్కూల్ నుంచి ప్రిన్సిపల్ సర్ ఫోన్ చేశారు. నా పేరు మీద ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒక లెటర్ వచ్చింది అని ఆయన చెప్పారు. “ఏమి చేయను? మీరు అనుమతి ఇస్తే చింపి చదువుతాను” అన్నారు.

అందులో ఏమున్నదో ఏమో? నాకేలా తెలుస్తుంది? నేను చూస్తే దేశంలో కూడా లేను. ఆ లెటర్‌ను ఓపెన్ చేసి చూడమని ప్రిన్సిపల్ గారికి చెప్పాను. ఆయన లెటర్ చదివి ఆ లెటర్‌ను ఫోటో తీసి వాట్సప్ ద్వారా పంపించారు. మా అల్లుడు గారు దాన్ని ప్రింట్ ఔట్ తీసి నా చేతులలో పెట్టారు.

వణుకుతున్న చేతులతో ఆ లెటర్ తీసుకున్నాను. నాకు నా మీద నమ్మకం కలగటం లేదు. అది నాకే వచ్చిందా? లేదా ఎవరిదైనా నాకు పంపారా? ఒకసారి చదివాను. నేను కలగనడం లేదు కదా అని ఇంకోసారి చదవ సాగాను.

భారతదేశం నుంచి, సర్/మేడమ్, శుభాకాంక్షలు కావ్యా, నువ్వు మా విద్యాలయం పేరును పెంచావు అని ప్రశంసలు.

నా కూతురు వెంటనే పింకూకి ఫోన్ చేసి చెప్పింది. ఇల్లంతా సంబరాలతో నిండి పోయింది.

నేను వరుసగా వస్తున్న ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నాను, ఒక చేతిలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన లెటర్…

మొట్టమొదటిసారిగా ఒక కాగితం నా జీవితంలో సంతోషాన్ని నింపసాగింది.

కళ్లలో జారుతున్న ఆనంద బాష్పాలు, ఆ ఒకొక్క అశ్రువు కోటి కోటి విలువ కలిగిన మణులు నా పాలిట. నా జీవితం లోని దుఃఖాన్ని ఎవరికి పంచలేదు, ఆ విషయం లో నేను చాలా పిసినారిని, …కానీ నేడు గొప్ప సుఖమైన క్షణాలు, నా పిల్లలతో మాట్లాడుతూ గడిపాను.

నాకు ఇప్పటికే అనేక సందర్బాలలో ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ ఇంత సంతోషం నేను అనుభవించలేదు.

‘రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా నా పేరు – కావ్య’.

నేను కలలో కూడా అనుకోలేదు. భగవంతుడు ఎంత బాధ పెడతాడో, అంతకు రెట్టింపు ఇస్తాడు అని నమ్ముతున్నాను నేడు. నా కఠిన పరిశ్రమకు సరి అయిన ఫలితం దొరికింది. నా జీవితానికి సార్థకత లభించింది.

నన్ను నొప్పించిన అందరినీ నా మనసులో ఏనాడో క్షమించాను. కానీ రాష్ట్రపతి అవార్డు తీసుకుంటున్న వేళ ఆ భగవంతునికి నా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలిని ఘటించాను.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here