జ్ఞాపకాల పందిరి-92

31
3

[box type=’note’ fontsize=’16’]”కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నా పుస్తకాలకు ముందుమాటలు రాసిన సాహితీమూర్తులు

[dropcap]పు[/dropcap]స్తక ప్రపంచంలో, అది నవల అయినా, కథ అయినా, కవిత్వం అయినా వ్యాసం అయినా, పుస్తకానికి రచయిత కంటే అనుభవజ్ఞులైన రచయితల చేత, పండితుల చేత, ఇతర పెద్దల చేత ముందుమాట రాయించుకోవడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం ఎప్పటినుండో ఇప్పటివరకూ కొనసాగుతున్నది. ఒక ప్రసిద్ధ రచయిత ముందుమాట కోసం నెలలు, సంవత్సరాలు ఎదురు చూసిన పెద్ద రచయితలు కూడా వున్నారు. దీనిని బట్టి ముందుమాటకు రచయిత ఎంతటి విలువనిస్తాడో అర్థం అవుతుంది. అసలు ముందుమాట ఎందుకు?ముందుమాట ఏమిటీ?

పుస్తకం రాయడంలో రచయిత ఉద్దేశం ఏమైనప్పటికీ, ముందుమాట రాసేవారు మాత్రం పుస్తకాన్ని మొత్తం క్షుణ్ణంగా చదివి, అన్ని రకాల పాఠక మహాశయుల్ని దృష్టిలో ఉంచుకుని, పుస్తకం లోని సారాన్నీ, రచయిత ఎన్నుకున్న అంశాన్ని, శైలిని, రచయిత ఎన్నుకున్న భాషా విధానం, ఇలా అనేక అంశాలు దృష్టిలో పెట్టుకుని, పుస్తకాన్ని చదివించేలా చేయడమే ముందుమాట ఉద్దేశం. అందుచేత ముందుమాటలు అలవోకగా ఆషామాషీగా రాసేవి కాదు. చాలామంది ముందుమాటలు కూడా సాహిత్య ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. అందుకే కొందరు ప్రసిద్ధ రచయితలు రాసిన ముందుమాటలు పుస్తక రూపంలో దర్శనమిస్తుంటాయి. అవి సాహిత్య ప్రయోజనం కలిగి ఉండడం వల్ల లేత.. లేత.. పరిశోధకులకు ఉపయుక్త గ్రంథాలుగా నిలుస్తాయి.

ముందుమాట – అనే అంశం ఈ మధ్యకాలంలో పట్టాలు మార్చుకుని మరో మార్గం వైపు ప్రయాణించే పరిస్థితులు కూడ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు “నీ పుస్తకానికి నేనే ముందుమాట రాస్తాను” అని వెంటపడే పెద్దలూ వున్నారు. పుస్తకానికి ముందుమాట రాయమని, రాసిన తర్వాత, పుస్తక ప్రచురణ నిమిత్తం చందాలు వసూలు చేసే రచయితలూ వున్నారు. వీరికి మరింత భిన్నంగా, డబ్బులు తీసుకుని, ముందుమాటలు రాసి ఈ అంశాన్ని వాణిజ్య పరం చేసిన మహానుభావులు కూడా వున్నారు. ఏ రూపంలో ముందుమాట వచ్చినా, ఎంతటి పెద్దలు ముందుమాట రాసినా, కేవలం పొగడ్తలకు లేదా తెగడ్తలకు చోటివ్వకుండా, రచనలోని ముఖ్య ఉద్దేశాన్ని, రచయిత రచనాశైలిని పాఠకుడికి సమగ్రంగా, సరళతరంగా అందించగలగాలి. అప్పుడే ఆ ముందుమాటకు, తద్వారా రచనకు, రచయితకు విలువ పెరుగుతుంది.

ఒక మామూలు దంతవైజ్ఞానిక వ్యాసాల రచయితగా నేను నా మొదటి పుస్తకం ‘దంతసంరక్షణ’ నవభారత్ బుక్ హౌస్, విజయవాడ వారు (పి.ప్రకాశరావు గారు)ప్రచురించినప్పుడు, నా పుస్తకానికి ముందుమాట డా. సమరం (సెక్స్ సైన్స్ ఫేమ్ ) గారు రాశారు. డా. సమరం గారు అప్పటికే ఈనాడు దినపత్రికలో వారం వారం ‘సెక్స్ సైన్స్’ శీర్షికతో వ్యాసాలు రాస్తూ పాఠకలోకంలో మంచి పేరు తెచ్చుకున్నారు. వారి ప్రోత్సాహమే నా చేత వ్యాసాలు రాయించింది.

నా రెండవ పుస్తకం ‘చిన్నపిల్లలు – దంతసమస్యలు’ మొదటి ముద్రణకు మా గురువుగారు (బి.డి.ఎస్.లో) ప్రొఫెసర్ పి. రామచంద్రారెడ్డి గారు ముందుమాట రాసి ఆశీర్వదించారు. నన్ను వ్యాసాలు రాయమని, కవిత్వం రాయమని ప్రోత్సహించేవారు. ఆయన నాకు గురువు, మార్గదర్శి మాత్రమే కాకుండా, నాకు శ్రేయోభిలాషి కూడా.

అలాగే నా మొదటి కథల పుస్తకం ‘కెఎల్వీ కథలు’ పుస్తకానికి ముందుమాటలు రాసిన మహానుభావులు నలుగురు. నలుగురూ నాకు ఆత్మీయులే!

అందులో మొదటివారు, ప్రసిద్ధ నవల/కథా రచయిత డా. అంపశయ్య నవీన్ గారు. తన మొదటి నవల పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ఆయన.

నవలా రచయిత డాక్టర్ అంపశయ్య నవీన్ (హన్మకొండ) గారితో.
సాహితీ వేత్త శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ బాబు, హన్మకొండ.

తర్వాత శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ గారు చక్కని ముందుమాట రాసి ఇచ్చారు. పరిశోధనల డిగ్రీ లేకపోయినా ఎంతో మంది పరిశోధకులకు గురుతుల్యుడు ఆయన. పేరు ముందు ప్రత్యేక బిరుదులు అవసరం లేని మహా పండితుడు ఆయన.

నా మొదటి కథల పుస్తకానికి మరో ముందు మాట రాసిన మహానుభావుడు ప్రొఫెసర్ బన్న ఐలయ్య గారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో (వరంగల్) హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటుగా కొనసాగి ప్రస్తుతం, ఆర్ట్స్ &సైన్స్ కళాశాల (సుబేదారి)కు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంతోమంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకుడు మాత్రమే కాక, మంచి ఉపాద్యాయుడు, రచయిత, అద్భుతమైన ఉపన్యాసకుడు. ఆయనను నాకు మొదట పరిచయం చేసిన వారు స్వర్గీయ డా. పి. వి. రమణ గారు. బన్న ఐలయ్య గారు నాకు మంచి స్నేహితులు కావడం విశేషం!

డాక్టర్ బన్నా ఐలయ్య గారితో (ప్రిన్సిపాల్, ఆర్ట్ & సైన్స్ కాలేజీ, హన్మకొండ)

ఇక చివరి వ్యక్తి నాకు ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనే మడిపెల్లి దక్షిణామూర్తిగారు. ఈయన ఆకాశవాణి (కడప/వరంగల్/హైదరాబాద్)లో అనౌన్సర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ప్రియమిత్రుడు, శ్రేయోభిలాషి.

మడిపెల్లి దక్షిణామూర్తి (హైదరాబాదు) గారితో

రేడియో ఇంటర్వ్యూ లకు నాలోని బెదురును చెదరగొట్టిన సహృదయుడు శ్రీ దక్షిణా మూర్తి. స్నేహానికి/సహాయానికి, మారుపేరు ఈ శ్రీ మడిపెల్లి.

మరో కథల పుస్తకం ‘హగ్ మీ క్విక్’కు, కార్టూన్ రూపంలో, ప్రియమిత్రులు శ్రీ ‘సరసి’ ఆశీస్సులు అందించారు. నేను రాసిన రెండు పుస్తకాలకు (పనస తొనలు/చిలకపలుకులు) ముఖ చిత్రం వేసి ఇచ్చిన మహానుభావుడు సహృదయమూర్తి ఆయన.

శ్రీ సరస్వతుల రామనరసింహం (సరసి), హైదరాబాదు

ఆయన అసలు పేరు సరస్వతుల రామ నరసింహం. ఆయన కేవలం కార్టూనిస్టు మాత్రమే కాదు, మంచి చిత్రకారుడు, మంచి హాస్యకథా రచయిత కూడాను.

ఇదే పుస్తకానికి పద్యరూపంలో ఆశీస్సులు అందించిన మిత్రులు, మహా పండితులు, అవధాని, మంచి రచయిత పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు గారు.

పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గారు, అనంతపురం

తర్వాత, ‘చిలక పలుకులు’ పుస్తక వచ్చింది. ఇందులో ఇద్దరు ప్రసిద్ధ రచయిత్రులు, మహిళా మిత్రమణులు తమ ముందుమాటలు అందించారు. ఇదే రచయిత్రులు, నా మరో కథల పుస్తకం ‘నాన్నా పెళ్ళిచేయవూ..!’ పుస్తకానికి కూడా ముందుమాటలు రాశారు. అందులో మొదటివారు శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి. హైదరాబాద్ నివాసి అయినప్పటికీ, పిల్లల స్థిర నివాసం దృష్టిలో ఉంచుకుని ఎక్కువకాలం ఆస్ట్రేలియా దేశంలో గడుపుతున్నారు. కథలూ నవలలూ రాసినప్పటికీ, మంచి నవలా రచచయిత్రిగా పేరుపొందడమే గాక, అనేక సంస్థలనుండి సన్మానాలు, ప్రశంసలు అందుకుంటున్న సహృదయని, మిత్రమణి శ్రీమతి ఝాన్సీ.

నవలా రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారితో….

నా పుస్తకాలకు ముందుమాట రాసిన మరో మిత్రమణి డా (శ్రీమతి) సుశీల. వీరు గుంటూరు వాసి అయినప్పయికి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం వుంటున్నారు. ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసిన సుశీల గారు మంచి పరిశోధకురాలు. ఎంతోమంది తెలుగు పరిశోధక విద్యార్థులకు మార్గదర్శిగా తన సేవలు అందించారు. డా. సుశీల గారు మంచి రచయిత్రి, సమీక్షకురాలు. ఈ రెంటికీ మించి మంచి సాహిత్య విమర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు. వీటికి తోడు సుశీల గారు మంచి వక్త కావడం విశేషం.

డాక్టర్ సి.హెచ్. సుశీల గారు, హైదరాబాదు

నా పుస్తకాలకు ముందుమాటలు రాసిన వారందరూ, నేను అభిమానించేవారు నన్ను అమితంగా అభిమానించేవారు, ప్రేమించేవారూ కావడం నా అదృష్టం. వరంగల్ (హన్మకొండ) సాహితీ రంగంలో నా పేరు కూడా ఈ సందర్భంగా నమోదు కావడం నాకు గర్వకారణం. దీని వెనుక వున్న స్నేహితులకూ, సాహితీమూర్తులకు ఎప్పటికీ రుణపడే వుంటాను.

ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య, హైదరాబాదు

చివరగా మరొక సాహితీమూర్తి గురించి కూడా చెప్పాలి. రాబోయే నా మరో చిన్న పుస్తకానికి (ఆటవిడుపు – బాలగేయాలు) ముచ్చటైన ముందుమాట రాసి ఇచ్చి పుస్తకానికి పేరు కూడా సూచించిన, ప్రముఖ కవి, అనువాదకులు విమర్శకులు, మంచి వక్త, శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here