[dropcap]ఎన్.[/dropcap]కె. బాబు సంపాదకత్వంలో వెలువడిన నాలుగవ కథల సంకలనం ‘నాకు నచ్చిన నా కథ-4’. ఇందులో 44 మంది రచయితల 44 కథలున్నాయి. ఇవి రచయితల సహకారంతో ప్రచురిస్తున్న సంకలనాలు. తెలుగులో ఎన్ని కథల సంకలనాలు వస్తే అంత మంచిది. చక్కని కథలను ఎంపిక చేసి చదవాల్సిన కథలుగా పాఠకులకు పరిచయం చేసే నిష్పాక్షిక సంకలన తయారీ వ్యవస్థ తెలుగులో లేకపోవటం ఒక పెద్ద లోపం. కొందరు ప్రతి సంవత్సరం ఓ కథల సంకలనం వెలువరిస్తూ ‘ఉత్తమ కథల’ను తమ గుప్పిట్లో బంధించారు. ప్రతి సంవత్సరం వెలువడే ఆ సంకలనంలో తప్పనిసరిగా కొందరు రచయితల కథలు ఉండటంతో పాటుగా, ఆ సంకలనంలో కొందరు రచయితల కథలే ఎంపిక అవుతాయి. దాంతో ఇతర రచయితలకు తమ కథలను సజీవంగా నిలుపుకునేందుకు, తమ కథలను పాఠకుల వద్దకు చేర్చేందుకు సహకార పద్ధతిలో సంకలనాలు ప్రచురించక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులలో రచయితల ఆకాంక్షలను ఆచరణలోకి తర్జుమా చేసి ఇలాంటి సంకలనాలు పాఠకులకు అందిస్తున్న ఎన్.కె. బాబు అభినందనీయులు.
ఈ పుస్తకానికి ముందుమాటలో అట్టాడ అప్పలనాయుడు “కథల ద్వారా పాఠకులలో చైతన్యం కలిగించాలని కొందరు కథలు రాస్తారు. కథల ద్వారా పాఠకులను రంజింపజెయ్యాలని మరికొందరు రాస్తారు. ఈ సంకలనం ఇలా రెండు విధాల రచనలూ ఉన్నాయి. రంజింపజేసి, చైతన్యం రగిలించే కథలూ ఉన్నాయి” అంటారు.
ఈ సంకలనంలోని 44 కథలలో యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి వంటి పేరున్న రచయితల కథలున్నాయి. అడపా రామకృష్ణ, దాట్ల దేవదానం రాజు, కూర చిదంబరం, వియోగి వంటి సీనియర్ రచయితల కథలున్నాయి. వీరితో పాటుగా తరచుగా కనిపించే రచయితలు, ఇప్పుడిప్పుడే కథలు రాస్తున్న రచయితలు కథలూ ఉన్నాయి. విభిన్నమైన కథల సంకలనం ఇది.
మనిషి మనసు సముద్రం కంటే, ఆకాశం కంటే లోతైనదని ప్రదర్శిస్తుంది అమరజ్యోతి కథ ‘పాదముద్రలు‘. ‘ఉక్కు సంకల్పంతో విజయ కేతనాన్ని ఎగురవేయండి’ అని స్ఫూర్తి నిచ్చే సందేశం స్ఫూర్తి అనే పాత్ర ద్వారా ఇప్పించే కథ అద్దేపల్లి జ్యోతి కథ ‘స్ఫూర్తి‘. అడపా రామకృష్ణ ‘నాకు నువ్వు నీకు నేను‘ కథలో ‘త్యాగం’ ప్రధానాంశం. బెహరా ఉమా మహేశ్వరరావు కథ ‘అనుభవం‘ ముసలి తల్లిదండ్రులను వారి సంతానం పనిమనుషులుగా చూసే కథ. బళ్ళా షణ్ముఖరావు కథ ‘ఫోటో‘, ఫోటో ద్వారా చక్కటి జీవిత సత్యం చెబుతుంది. ప్రజాస్వామ్యం వచ్చినా వ్యక్తుల పాలన పోలేదని చూపించే కథ బొడ్డ కూర్మారావు కథ ‘పెద్దోళ్ళు‘.
అధ్యాపకుడికి విద్యార్థికి నడుమ ఉన్న సున్నితమైన సంబంధాన్ని ప్రదర్శిస్తుంది డి. రమాదేవి కథ ‘నువ్వొస్తావని‘. పిట్ట మనసు ద్వారా గొప్ప సందేశం ఇస్తుంది దాట్ల దేవదానం రాజు కథ ‘గోదారి గట్టుంది‘. ఎవర్ని ఎవరు పెళ్ళి చేసుకున్నా ఏమనుభవిస్తారు? అన్న ప్రశ్న వేస్తుంది దేవరాజు రవి కథ ‘శేష ప్రశ్న‘. డా. డి.వి.జి. శంకరరావు కథ ‘ప్రయాణం‘ కథ దారి తెలియటానికీ, సరైన దారిలో ప్రయాణించటానికీ నడుమ ఉన్న తేడాను సున్నితంగా చూపిస్తుంది. కష్టపడే మనిషికి రెక్కలే దేవుడు అని ప్రదర్శించే కథ డా. ఎం. సుగుణారావు రచించిన ‘దేవుడు‘. పత్రికల లౌక్యం ఎత్తి చూపిస్తుంది డా. మూలా రవికుమార్ కథ ‘విఫలం-దౌత్యం-లౌక్యం‘.
బోనస్ జీవితాన్ని ఆనందంగా గడపటం నేర్పుతుంది జి.వి. శ్రీనివాస్ కథ ‘బోనస్‘. చక్కని మాండలికంలో గొప్ప సత్యాన్ని ప్రదర్శిస్తుంది గంటేడు గౌరునాయుడు కథ ‘ఆసర సాల‘. జక్కని గంగాధర్ రచించిన చక్కని కథ ‘ఇదిగో రిజల్టు‘. కె.వి. లక్ష్మణరావు కథ ‘సీత‘ ఒక మహిళ జీవితాన్ని ప్రదర్శిస్తుంది. కొంకేపూడి అనూరాధ కథ ‘దేవుడమ్మ‘ ఒక్క కూతురుని పోగొట్టుకుని పదిమందికి తల్లి అయిన మహిళ కథ. కూర చిదంబరం కథ ‘నీటి నీడ‘ చక్కటి కథ. ఎం.ఆర్.వి. సత్యనారాయణమూర్తి కథ ‘పరిమళం‘ అగరుబత్తీలు అమ్మే జబ్బార్ కథ. చక్కటి జీవన సహచరి లభించటం అదృష్టం అని నిరూపిస్తుంది మల్లాది వెంకట కృష్ణమూర్తి కథ ‘అందమైన భార్య‘. మల్లిపురం జగదీష్ కథ ‘బాకుడుంచాలి‘ ఆదివాసీల జీవితాలలో మనుషుల స్వార్థం చెలగాటమాడటాన్ని ప్రదర్శిస్తుంది.
మంజరి కథ ‘చూచిరాత‘ సృష్టికర్తని మించిన రచయిత లేడని నిరూపిస్తుంది. డబ్బు కన్నా మానవ సంబంధాలు మిన్న అని ప్రదర్శిస్తుంది మేడా మస్తాన్ రెడ్డి కథ ‘కనురెప్ప‘. అభివృద్ధి పేరిట జీవితాలలో జరిగే విధ్వంస దృశ్యం ఎన్.కె. బాబు కథ ‘దారి‘. పాణ్యం దత్తశర్మ కథ ‘నల్ల కలర్‘ ఆత్మవిశ్వాసం అంటే ఏమిటో చూపిస్తుంది.
పట్నాల ఈశ్వరరావు ‘అమ్మ కథ‘, పత్తి సుమతి కథ ‘మన జీనోమ్ మారాలి‘, మంగిపూడి రాధిక కథ ‘ప్యాకేజీ పెళ్ళి‘, రజనీ సుబ్రహ్మణ్యం కథ ‘గెలుపు‘, రావాడ శ్యామల కథ ‘సత్కారం‘ వంటి కథలు ఆసక్తికరంగా ఉండి ఆలోచింపజేస్తాయి.
పుస్తకాలు వదిలి సెల్‍ఫోన్‍లు పట్టిన తరాన్ని చూస్తూ పుస్తకాలు తమ ఉపయోగాన్ని తామే చెప్పే సృజనాత్మాక కథ ఎస్. హనుమంతరావు రచించిన ‘పుస్తకాల ముచ్చట్లు‘, లాక్‌డౌన్ నేపథ్యంలో సాగే కథ సలీం రచించిన ‘అమృతం‘.
జ్యోతి సుంకరణం ‘ఋణానుబంధం‘, కూరెళ్ళ శ్యామల ‘సరే‘, తెలికిచర్ల రామకృష్ణ కథ ‘తనివి తీరింది‘, వి. వెంకటావు ‘ఉత్త(మ) కథ‘, గంగాధర్ వడ్లమన్నాటి కథ ‘బావగారి భావచౌర్యం‘, యండమూరి వీరేంద్రనాథ్ ‘టాస్‘; యర్రంశెట్టి శాయి ‘ఈ గతం చెరగదు‘, నల్లా యోగేశ్వరరావు ‘అనివార్యం‘, వియోగి ‘చేతి చమురు‘, దాసరి రామచంద్రరావు ‘ఇంటికప్పు‘ వంటి కథలు ఆసక్తికరంగా చదివిస్తాయి.
ఈ రకంగా విభిన్నమైన రచయితలు ఎంచుకున్న విభిన్నమైన, విశిష్టమైన కథా సంకలనం ఇది.
***
నాకు నచ్చిన నా కథ-4 (కథలు)
సంపాదకులు: ఎన్.కె.బాబు
పుటలు: 326
వెల: ₹ 200/-
ప్రతులకు:
గురజాడ బుక్ హౌస్,
షాప్ నెంబర్ 1, ఎన్.జీ.వో. హోమ్,
తాలూకా ఆఫీస్ రోడ్
విజయనగరం – 535002
ఫోన్: 9440343479