జ్ఞానపీఠ్ పురస్కారాన్ని స్వీకరించిన తొలి భారతీయ మహిళ శ్రీమతి ఆశాపూర్ణా దేవి

4
3

[dropcap]జ[/dropcap]నవరి 8వ తేదీ శ్రీమతి ఆశాపూర్ణా దేవి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

ఆమె ఆడపిల్లల చదువును వ్యతిరేకించిన అమ్మమ్మ గారింట్లో పెరిగారు. ప్రైవేటు మాస్టారు ఇంటికి వచ్చి సోదరులకు పాఠాలను నేర్పేవారు. తెర వెనక అజ్ఞాతంగా ఉండి, ఏకలవ్య శిష్యరికం చేసి అక్షర జ్ఞానాన్ని పొందారామె. అయితే తల్లిదండ్రులు విద్యని ప్రోత్సహించేవారు కావడం ఈమెకు లభించిన గొప్ప వరం.

తండ్రి పిల్లల కోసం అనేక గ్రంథాలు సమకూర్చి పెట్టారు. వాటిని చదివి అర్థం చేసుకోవడమే కాదు, తను వ్రాయడం మొదలు పెట్టి, అపరిమిత స్త్రీవాద సాహిత్యాన్ని వెలువరించిన గొప్ప విదుషీమణి. భారత ప్రభుత్వం ఉత్తమ సాహిత్యానికి ఇచ్చే గొప్ప ‘జ్ఞానపీఠ పురస్కారాన్ని’ స్వీకరించిన తొలి మహిళగా చరిత్రను సృష్టించారు. ఆమే శ్రీమతి ఆశాపూర్ణా దేవి.

ఈమె నాటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని కలకత్తా సమీపంలోని పోటోల్డొంగ్‌లో 1909వ సంవత్సరం జనవరి 8వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు సరళాసుందరి, హరీంద్రనాథ గుప్తలు. తల్లి పుస్తక ప్రియురాలు. తండ్రి సి.లాజరస్ అండ్ కో వారికి ఫర్నిచర్ డిజైనర్‌గా వ్యవహరించేవారు.

ఆశ మేనమామ గారింట్లో పుట్టి పెరిగారు. ఆడపిల్లలకు అక్కడ చదువుకునే అవకాశం లేదు. ఆశ సోదరులకి ప్రైవేటు మాస్టార్లు ఇంటికి వచ్చి పాఠాలు చెప్పేవారు. ఆశ వాటిని విని చదువుకునేవారు. ఆ విధంగా స్వీయ అభ్యసనం ద్వారా విద్యను నేర్చారు.

హరీంద్ర పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలను చదివించాలని ఆకాంక్షించారు. అందు కోసం కలకత్తా నగరానికి తమ కుటుంబంతో సహా నివాసాన్ని మార్చారు. వివిధ గ్రంథాలయాల నుండి వివిధ రకాల గ్రంథాలు, పుస్తకాలను తెప్పించేవారు. ఈ గ్రంథాలను చదివి విద్యావంతులయిన కుమార్తెలను చూసి ఆయన గర్వించేవారు. ఆ రోజుల్లోనే ఆడపిల్లల చదువు కోసం నివాసాన్ని మార్చిన ఆ తండ్రి గొప్పదనానికి గర్వించాలి, ప్రశంసించాలి. ఈ రోజుల్లో కూడా ఆడపిల్లలను చదివించకూడదనుకునే తల్లిదండ్రులకు ఈ తండ్రి గురించి చెప్పాలి.

ఆశ సోదరీమణులతో కలిసి స్వీయ అభ్యసనం చేశారు. పుస్తకపఠనం ఆమె విజ్ఞానాన్ని సుసంపన్నం చేసింది. ఆమెకు కూడా పద్యాలు, కవితలు, కథలు వ్రాయాలనే కోరికని కలగజేసింది.

ఈమె వ్రాసిన కవితలో మార్పులు చేయమని చెప్పి, ఒక రూపాన్ని కల్పించి పత్రికకు పంపించమని ప్రోత్సహించారామె సోదరీమణులు.

బైరర్‌డాక్ (ది కాల్ ఫ్రమ్ ది అవుట్‌సైడ్) అనే కవితని రహస్యంగా ‘శిశుసతి’ పత్రికకి పంపించారు. ఈ పత్రికా సంపాదకులు రాజకుమార్ చక్రవర్తి ఈమెను ప్రోత్సహించారు. తమ పత్రికకు రచనలు పంపించమని కోరారు. ఈ ప్రోత్సాహంతోనే ఈమె విస్తృతంగా రచనలు కొనసాగించారు. బెంగాలీ సాహితీ ప్రపంచంలో తనకి ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బెంగాలీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వనితారత్నంగా పేరు గడించారు.

1924లో శ్రీకాళిదాస్ గుప్తాతో ఈమె వివాహం జరిగింది. కొడుకు సుశాంత్, కోడలు నూపూర్, మనవరాళ్ళు శతరూప, శతదీపలతో ఆనందంగా జీవితాన్ని కొనసాగించారు.

ఈమె తొలిరోజుల్లో బాలల కోసం రచనలు చేశారు. బాలల కథలు, నవలలు కూడా వ్రాశారు. 1938లో తొలిసారిగా అచ్చయినది ‘చోటో ఠాకూర్ దాస్ కాశీ యాత్ర’ (గ్రేట్ అంకుల్ కాశీకి వెళ్ళాడు) అనే బాలసాహితీ గ్రంథం. ‘చుటి టే చోటా చుటీ’, ‘కాగజ్ తో పరోనా’, ‘పరార్ ఛేలే’ పేరు పొందిన బాల సాహితీ సంపుటాలు.

‘ఆనంద్ బజార్’ పత్రిక గొప్పతనం మనకందరికీ తెలుసు. ఈ పత్రికలోని ‘పూజ’ శీర్షికలో ఈమె వ్రాసిన ‘పత్ని! ఓ ప్రేయసి’ కథ ముద్రించబడింది.

‘ప్రేమ్ ఓ ప్రయోజన్’ ఈమె మొదటి నవల.

ఈమె కాలాతీత వ్యక్తి. నాటి సమాజ పరిస్థితుల పరిధిని దాటి ముందుకు వెళ్ళి ఆలోచించేవారు. మిత స్త్రీవాది. మహిళలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా రచనలు చేశారు. ఈ రచనలు సాహితీ ప్రియులైన అమ్మాయిలను జాగృత పరచేవి.

ఈమె నిబరన్ చంద్ర, చివరి కర్మలు, ది ట్విలైట్ మూమెంట్, ది జార్జట్ శారీ వంటి చిన్న కథలతో కథా సంపుటిలను ముద్రించారు. ఈ కథలలో బెంగాలీ ప్రాంతానికి చెందిన గ్రామీణ, పట్టణ స్త్రీలకు చెందిన గాథలు దర్శనమిస్తాయి. ఆయా ప్రాంతాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల ప్రస్తావన కనిపిస్తుంది. కొంత వ్యంగాన్ని జోడించి ఈమె ఈ కథలను వ్రాశారు. సున్నితమైన సంభాషణలు, కొసమెరుపుతో చదువరులకు ఆసక్తిని కలిగిస్తాయి. రచనలో నైపుణ్యం, కథనంలో చతురత కనిపిస్తాయి. సంభాషణలలో వాక్చాతుర్యం అద్వితీయం, అపురూపం, అబ్బురం కలిగిస్తాయి. బెంగాలీ పురుషాధిక్య సమాజంలో స్త్రీలు దోపిడీకి సరయిన అంశంతో ఈమె సృజించిన కథలు పాఠకులని కన్నీళ్ళ పర్యంతం చేస్తాయి.

ఆమె సాహితీ సృజనలో ప్రసిద్ధి పొందిన త్రయం ప్రథమ ప్రతి శ్రుతి,సువర్ణలత, బకుల్ కథలు. 20వ శతాబ్దంలో మారుతున్న బెంగాల్ గ్రామీణ, పట్టణ పరిసరాలలో జీవనం కొనసాగించిన ఒకే కుటుంబంలోని మూడు తరాల స్త్రీల జీవిత చిత్రణ ఇది. ఈ ముగ్గురు విభిన్న మనస్తత్వాలు గలవారు. వైవిధ్యభరిత జీవితాలను గడిపిన వారే!

1934లో ప్రథమ ప్రతిశ్రుతి, 1967లో సువర్ణలత, 1974లో బకుల్ కథలను ప్రచురించారు. ఈ నవలాత్రయం 1976లో జ్ఞాన్ పేర్ పురస్కారాన్ని అందుకుంది.

‘ప్రథమ ప్రతిశ్రుతి’లోని సత్యవతి కనీసం డాబా పైకి కూడా వెళ్ళే స్వేచ్చ లేని మహిళ. కుటుంబం వారి హింసకు గురైన అభాగ్యురాలు. ‘సువర్ణలత’ ఈమె కుమార్తె. బాల్యవివాహమైనా కుటుంబపు ఆనందాన్ని, సంతోషకరమైన జీవితాన్ని పొందింది. ‘బకుల్ కథ’లోని అనామికాదేవి స్వయం సమృద్ధిని సాధించిన స్త్రీ వాద రచయిత్రి. ఈమె పాత్ర తప్పుదారిన నడిచిన స్త్రీవాద పాత్రగా సృజించారు ఆశాపూర్ణాదేవి. తోటి స్నేహితురాళ్ళకి కూడా సాయం చేయదు. నిష్కామ ప్రియురాలు, స్వార్థపరురాలు.

మొత్తానికి స్వాతంత్ర్యం రాకముందు నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పాతికేళ్ళ వరకు కొంత మంది మహిళలు ముఖ్యంగా మూడు తరాలకు ప్రాతినిధ్యం, వహించిన నవలలు ఇవి.

“చిన్న మస్తా’ అనే కథలో వితంతువు అయిన అత్తగారిని ఎగతాళి చేసి, వితంతువుని పెట్టే ఇబ్బందులే పెడ్తుంది కోడలు. నీకు ఇటువంటి పరిస్థితి వస్తే అని అనుకుంటుంది అత్త. కోడలిని మార్చాలని ఆశిస్తుంది. కాని విధివశాత్తు కొడుకు చనిపోతాడు. అప్పుడామె కోడలిని చక్కగా ఆదరించి భోజనం పెడుతుంది. వితంతువు బాధలను అర్థం చేసుకున్న తోటి మహిళ పాత్ర ఇది. అత్తగారి పాత్ర విమర్శకు లోనయిన కథ ఇది.

‘ద ఫస్ట్ ప్రామిస్’ అద్భుతమైన నవల. పురుషులతో సమానమైన హక్కులను పొందాలని ఆశిస్తూ పోరాడే మహిళల కథ ఇది. ఈ పోరాటంలో మహిళలకు ఎదురయ్యే సమస్యలకు దర్పణంగా నిలిచింది.

ఈమె వ్రాసిన కవితలు, బాల సాహిత్యం, కథలు, నవలలు పది సంపుటాలుగా వెలువడి పాఠకులకు అందుబాటులో ఉన్నాయి.

సనాతన సంప్రదాయాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, లింగవివక్ష, స్త్రీ పురుష అసమానత్వం, అవిద్య మొదలయినవి మహిళల వెనుకబాటుకి కారణాలని ఈమె గ్రహించారు. ఈమె జీవితం వీటికి ప్రతిబింబం కూడా! ఈమె వీటన్నింటినీ ఛేదించుకుని బయటపడి రచనలను కొనసాగించడం మహిళా లోకానికి గర్వకారణం. ఈమె రచనలు వ్యంగ్యంతో కూడిన సున్నితమైన వెటకారం. సునిశిత హాస్యాల మేళవింపుతో చదువుతుంటుంటే హాయినిస్తాయి. బాల్యవివాహాలు, బాల వితంతువులు, స్త్రీల మానసిక వేదన, గృహహింస, పితృస్వామ్య వ్యవస్థ, బహుభార్యాత్యం, కుటుంబ నియంత్రణ, నిరక్షరాస్యత, అజ్ఞానం, అనారోగ్యం మొదలయిన అనేక పార్శ్వాలలో మహిళల సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి. ఈ నాటికీ పూర్తిగా సమసిపోని పోరాటాలవి.

ఈమె సృజించిన పాత్రలన్నీ సజీవ చిత్రణలే! వీరిలో మనకు యుక్త వయస్కులు, నవ వధువులు, అమ్మ, అత్త, అమ్మమ్మ, నానమ్మ, వితంతువులైన, బాధాతప్త ద్రష్టులైన అభాగినులు కనిపిస్తారు.

సుమారు అర్ధ శతాబ్దం పాటు సాగిన ఈమె సాహితీ ప్రస్థానం అద్వితీయమైనది. వనితాలోకంతోపాటు పురుషుల ప్రశంసలను కూడా అందుకున్న విలక్షణ రచయిత్రి ఈమె.

ఈమెకి జబల్‌పూర్, రవీంద్రభారతి, బృందావన్, జాదవ్‌పూర్ మొదలయిన విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.

1954లో కలకత్తా విశ్వవిద్యాలయం లీలా బహుమతిని, 1966లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రెయిన్‌డ్రాప్ మెమోరియల్ బహుమతిని, 1966లోనే భుజన్ మోహినీ దాస్ బంగారు పతకాన్ని, 1988లో బాంగియా సాహిత్య అకాడమీ వారి ఫెలోషిప్ లభించింది.

1976లో భారత ప్రభుత్వం వారి అత్యున్నత సాహితీ పురస్కారం ‘జ్ఞానపీఠ అవార్డు’ను, అదే 1976లో ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందించి గౌరవించారు.

1995 జూలై 13వ తేదీన కనుంగో పార్క్ లోని గరియాలోని స్వగృహంలో మరణించారు.

భారత ప్రభుత్వ తపాలాశాఖ 1998వ సంవత్సరం జూన్ 5వ తేదీన ‘జ్ఞానపీర్ లిటరరీ అవార్డ్ విన్నర్స్’ శీర్షికతో ఒక స్టాంపును విడుదల చేసింది. రెండు రూపాయల విలువగల ఈ స్టాంపు మీద పైన శ్రీ బిష్ణుడే, శ్రీ తారాశంకర్ బందోపాధ్యాయ చిత్రాలను, దిగువ భాగంలో శ్రీమతి ఆశాపూర్ణాదేవి చిత్రాలను ముద్రించారు. ఈ ముగ్గురూ బెంగాలీ రచయితలే కావడం బెంగాలీలకు గర్వకారణం. భారతీయులుగా రచయిత, రచయిత్రులను గౌరవించడం మనకి కూడా!

జనవరి 8వ తేదీ ఈమె జయంతి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here