వినూత్నము, విభిన్నమయిన సంచిక కథల పోటీ 2022 ప్రకటన

0
3

[dropcap]సం[/dropcap]చిక కథల పోటీ 2022….
సంచిక ఒక విభిన్నము, వినూత్నము అయిన కథల పోటీ నిర్వహిస్తోంది.
ఈ కథల పోటీలో ఎంపికచేసిన కథలకు చెరో వెయ్యి చొప్పున 20 బహుమతులుంటాయి. అంటే మొత్తం రూ.20,000/- బహుమతులన్నమాట!!!!
విభిన్న కథల పోటీ….
ఈ పోటీకి పంపే కథల్లో సామాన్యమయిన కథాంశాలుండకూడదు.
కథాంశం వినూత్నమయి, విచిత్రమయి వుండాలి.నిత్య జీవితంలోని మామూలు సంఘటనలనే వినూత్న దృష్టితో సృజనాత్మకంగా సృజించవచ్చు. 
ఈ విభాగంలో సైన్స్ ఫిక్షన్ కథలు, హిస్టారికల్ ఫిక్షన్ కథలు, పౌరాణిక ఫిక్షన్, ఫాంటసీ కథలు, అబ్సర్డ్ కథలు, అబ్స్‌ట్రాక్ట్ కథలు, ప్రతీకాత్మక కథలు, మెటాఫోరికల్ స్టోరీ  ఇలా ప్రక్రియ ఏదయిన కథ ఆసక్తికరంగా వుండాలి. పాఠకుడిని సంభ్రమాశ్చర్యాలలో ముంచుతూ, ఆలోచనలు రేకెత్తిస్తూ ఆనందం కలిగించాలి. అయితే, ఎంత ఫాంటసీ లోకాలలో విహరించినా లాజిక్ రహితంగా మాత్రం వుండకూడదు. అంటే రొటీన్, మూస కథలు కాక, ఊహకు పదనుపెట్టి, కాల్పనిక లోకాల్లో విశృంఖలంగా విహరించి సృజించిన ఏ కథనయినా ఈ పోటీకి పంపవచ్చు.
ఇంకేం.. మీ సృజనాత్మక విహంగం రెక్కలు విప్పుకుని అనంతమయిన సృజనాత్మక రోదసిలో విహరించనీయండి.

ఆకులో ఆకాశం చూడవచ్చు.
నక్షత్రంతో భూమిపైని ఇసుకరేణువు చెట్టాపట్టాలువేసుకుని ఆండ్రొమీడా గెలాక్సీలో విచిత్రమయిన జీవులతో విచ్చలవిడిగా నృత్యం చేయవచ్చు.
మీరు టైపు చేసే కంప్యూటర్ తెరపైని అక్షరాలకు ప్రాణంవచ్చి అవి తమ గోడు వినిపించవచ్చు. కాథోడ్  రే లతో అవి కత్తి యుద్ధం చేయవచ్చు.
ఇతర గ్రహాలనుంచి విచిత్రమయిన జీవులు వచ్చి మన మెదళ్ళను దొంగిలించుకుపోయి వేరే మెదళ్ళు అమరిచి పోవచ్చు.
శ్రీకృష్ణుడు బృందావనంలో వినిపించే వేణుగానానికి తన్మయులై నక్షత్రాలు దిగివచ్చి నృత్యం చేయవచ్చు.
కల్పన ఏదయినా, ఊహ ఏదయినా అర్థవంతంగా, ఆసక్తికరంగా, తార్కికంగా వుండాలి. సందేశాలు, నీతులు అంతర్లీనంగా, ప్రతీకాత్మకంగా వుంటే మంచిది. అంతేగానీ, సందేశాలు, నీతులు, సామాజిక స్పృహల కోసమే కథ రాయాలనుకోవద్దు.
కాస్సేపు అన్నీ మరచి అద్భుతమయిన సృజనాత్మక లోకంలో విహరించండి. పాఠకులను విహరింపచేయండి.
ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చు. కథల నిడివి పరిమితిలేదు. మీకు సంతృప్తి కరంగా రాయండి. అలాగని నవల పంపి కథ అనవద్దు.
ఎంపికయిన కథలతో పాటూ పంపిన కథలన్నీ సంచికలో ప్రచురితమవుతాయి.
బహుమతి పొందిన కథలతో పాటూ ఎంపిక చేసిన మరో అయిదు కథలను చేర్చి మొత్తం 25 కథల సంకలనం సంచిక ప్రచురిస్తుంది. బహుమతులు ప్రకటించే సమయంలో సంచిక ఆ కథ ఏ విభాగానికి చెందిందో నిర్ణయించి ఆ విభాగంలో బహుమతి ప్రకటిస్తుంది. అంటే ఎంతగా విభిన్నమయిన కథ రాస్తే బహుమతి పొందే అవకాశం అంత అధికంగా వుంటుందన్నమాట!.
అయితే, మొత్తం 20 బహుమతులలో 5 నుంచి 8 బహుమతులలో యువ రచయితలకు ప్రాధాన్యం వుంటుంది. అంటే 12 బహుమతులకు వయసుతో నిమిత్తం లేదు. కానీ, వీలును అనుసరించి 5 నుండి 8 బహుమతులు 50ఏళ్ళలోపు రచయితలకు ప్రధానంగా వుంటాయి. కాబట్టి 50,  అంతకన్నా తక్కువ వయసున్న రచయితలు హామీ పత్రంలో తమ వయసును తెలపాల్సివుంటుంది. అందుకు ఎలాంటి ఋజువు చూపనవసరంలేదు. కేవలం వయసు ఎంతో రాస్తే చాలు. ఇది యువ రచయితలను ప్రోత్సహించే ఉద్దేశంతో చేసిన ఏర్పాటు.
కథలను సంచికకు మార్చ్ 10వ తేదీలోగా చేరేట్టు పంపాలి.
కథలను ఈ మెయిల్  sanchikastorycompetetion@gmail.com కు  కానీ పోస్టులో Plot No32, HNO 8-48, Raghuram nagar colony, Aditya Hospital Lane, Dammaiguda, Hyderabad-83  అడ్రసుకు కానీ పంపాలి. రచయితపేరు, ఫోను నంబరు, ఈ మెయిల్ తప్పనిసరిగా రాయాలి. హామీ పత్రం తప్పనిసరి. కథపైన 2022 కథల పోటీకి అని స్పష్టంగా రాయాలి.
ఏవైనా సందేహాలుంటే 9849617392  నంబరుకు ఫోను చేయవచ్చు.
రచయితలు ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొని  తెలుగు కథ చుట్టూ బిగుసుకున్న ఉక్కుపిడికిలి పట్టు సడలేందుకు,  తెలుగు సాహిత్యంలో విభిన్నమయిన కథలకు ప్రాధాన్యం కలిగించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ పోటీని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. విజయవంతం చేయాలని అభ్యర్ధిస్తున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here