[dropcap]ఏ[/dropcap]కోదరులుగ పెద్ద చిన్న తేడాలను బట్టి అన్నదమ్ములు, అక్కచెల్లెల్ల మధ్య పరస్పర ప్రేమాభిమానాలు అధికార గౌరవ మర్యాదలుంటాయి. పెద్దవారెవరయితే వారిని అగ్రజులుగా పెత్తనాన్ని అంగీకరించారు. ప్రశ్నించి తృణీకరించడమన్నది జరగడం తాత్కాలికమే అవుతుంది. చంపదగినంత తప్పు చిన్నవారు చేసినా క్షమించి వదిలేయడం అగ్రజత్వం ధర్మంగా భావించింది. పురాణకాలం నుంచి మనకు ఉదాహరణలు కనిపిస్తాయి. అవినీతికి పాల్పడినా రక్తపాశం బంధుత్వాన్ని అయుష్టమైనా సమర్థిస్తుంది.
పురాణ కాలం నాడు పాండురాజు, దృతరాష్ట్రుల సంతానము అన్నదమ్ముల్లా పాండవులుగ, కౌరవులుగ తప్ప కలిసి 105గురు ఐకమత్యంగా ఉండలేకపోయారు. అయినా వారిలో వారు సుఖదుఃఖాలు పంచుకున్నారు. జ్ఞాతివైరము నహజమైనా అన్నదమ్ముల అనుబంధంగా 105 మందిమి అనే నీతితో చిత్రసేనుడి బందీగా దుర్యోధనుడిని తప్పించి అనుబంధమే చూపడానికి తమ్ముళ్లపై అగ్రజత్వము చూపాడు ధర్మరాజు. అర్జునుని విషాదయోగము సోదరబంధుత్వ ఛాయ ద్వనిస్తుంది. మరణానంతరము జ్ఞాతులందరికీ యుద్ధ భూమిలో వీరమరణము చెందిన అందరికీ తర్పణాలు, పిండ ప్రధానము చేశాడు. తల్లి కుంతి ద్వారా కర్ణుడు అగ్రజుడవుతాడని తెలిసి విలవిలలాడిపోయాడు ధర్మరాజు. ఆడువారి నోట రహన్యము దాగదనే శాపాన్ని కుంతి, తల్లిగా అనుభవించినా స్త్రీ జాతికంతకూ వర్తింపచేసిన ధర్మరాజుది ఏకోదర జనన సోదరాభిమానమే!
తమ్మళ్ళని తెలిసిన తరువాత దుర్యోధనుని వీరాభిమాని కర్ణుడు అర్జునుని మీద మాత్రము కసి ఉంచుకుని నలుగురు తమ్ముళ్లను చేతికి చిక్కినా చంపకుండా వదిలేసి ఏకోదర బంధుత్వ న్యాయధర్మమును వదలలేకపోయాడు.
సుధేష్ణ భారతంలో కీచకుడికి అక్క.. ద్రౌపది విషయంలో గట్టిగానే మందలించి పెద్దరికం చూపింది. కాని తమ్ముడి కోరికను మరల్చ లేకపోయింది. దుష్ట మరణమే రాసిపెట్టి ఉంటే వాడి చావు వాడు చచ్చినా లాభమే అనుకుంది. మహారాణి అధికారాన్ని ప్రయోగించి శిక్షించడానికి బదులుగా మధిర తెమ్మనే వంకన పంపిస్తానని ప్రయత్నము కీచకుడికే వదిలింది. తమ్ముడి కోరిక అధర్మం. సోదర ప్రేమ సైరంద్రి విషయంలో వంచనకు తావిచ్చి రాజ్య క్షేమకారణ కోణంలో మహారాణిగ వంచన సమర్థించుకుందనిపిస్తుంది. నిగమశర్మ అక్కకు లొంగి పెద్దరికాన్ని తాత్కాలికంగా నైనా ఆమె చెప్పిన నీతులకు పరివర్తన చూపడం గౌరవంగా మంచి నడవడితో మెలిగాడు.
రాక్షసప్రేమ వికృతంగా అనిపిస్తుంది. హిడింబి చెల్లెలిగా హిడింబాసురుని భీముని చేతిలో చచ్చేలా చేసింది. భీముని పెండ్లాడి సద్యోగర్భము దాల్చి ఘటోత్కచునికి జన్మనిచ్చింది. కాని శూర్పణఖ సీతను చంపి రామలక్ష్మణులులో ఒకరిని సొంతము చేసుకోవాలనుకుంది. ముక్కు, చెవులు కోయించుకుంది. కాని ప్రతీకారంతో రగిలిపోయి అన్న రావణాసురునికి చెల్లెలి మమకారముతో పశుకాంక్షను రేపగలిగింది. వినాశకాలే విపరీతబుధ్ధి. సోదరిప్రేమ రావణుడు పెద్దరికంగా సమర్ధించుకోవడం హర్షణీయం అవలేదు. అవినీతి ప్రోత్సాహం ఖండించి మందలించని అన్న అనిపించాడు.
రామాయణంలో తల్లులు వేరైనా పాయసం నాలుగు భాగాలు నలుగురు సోదరులు రామలక్ష్మణ, భరత శతృఘ్నులు ఏకోదరులుగ అనిపించి ఆదర్శ అన్నదమ్ముల ఐకమత్యాన్ని చాటారు. వాలి సుగ్రీవులు వైరములో రాజ్య కాంక్ష. వాలి పెద్దవాడిగ మమకారం చంపకుండా సుగ్రీవుని వదిలిపెట్టి ఋష్యమూకముపై తలదాచుకోనిచ్చి శాపకారణాన్ని సాకుగా ఊరుకునేలా చేయగలిగింది. అది వానరసోదరప్రేమ.
లక్ష్మణుడు అన్న ఆజ్ఞ ధిక్కరించలేక వదినను అడవిలో వదిలివచ్చి అన్న పెద్దరికమే శిరోధార్యంగ లోకానికి సందేశాన్నివ్వడం మానవసోదరప్రేమ. రహస్య సమావేశంలో ఎవరు లోపలికి ప్రవేశించినా మరణశిక్ష విధిస్తానని మాట ఇచ్చి యమధర్మరాజుతో ముచ్చటిస్తున్న రాముడు సోదరప్రేమకు కట్టుబడలేదు. శాపమిస్తాడన్న భయంతో దుర్వాసముని రాకను చెప్పడానికి లక్ష్మణుడు వచ్చాడు. రాముడు శిక్ష తప్పదన్నాడు. రాజాజ్ఞగ కూడ గౌరవమిచ్చి లక్ష్మణావతారము చాలించి వైకుంఠానికి చేరుకున్నా అది అన్నపట్ల అంకిత భావమే కనిపిస్తుంది. ధిక్కారణ లేదు.
రాక్షన సోదరప్రేమ పెద్దరకాన్ని తాత్కాలికంగా ధిక్కరించినా రక్తపాశం వదులుకోలేదు. రామరావణ యుధ్ధంలో కుంభకర్ణుని మేల్కొలిపాడు రావణుడు. కుంభకర్ణుడు పరభార్యాపహరణము తప్పని మందలించాడు. కాని సోదరప్రేమకు లొంగి యుధ్ధం చేశాడు. విభీషణుడు ఎదురుపడితే చంపకుండా హేళన చేసి వదిలేశాడు. విభీషణుడి రామభక్తిభావన గొప్పదనిపిస్తుంది. అయినా హేళనకు గురైన సోదరబంధుత్వము పశ్చాత్తాపంతో కుమలకపోలేదు. ధర్మ సంస్థాపన జరిగింది. అందుచేత ధర్మ విజయం సాధించి సోదరులకు సద్గతులు కలిగించిన తమ్ముడిగా ఆదర్శసందేశమే అవుతాడు. అధర్మపరులైనపుడు అన్నదమ్ములనైనా సంస్కరించే ప్రయత్నంలో నింద పడైనా ప్రయత్నం చేయాలి. నాశనము తప్పనపుడు ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి తప్పదు. కురుక్షేత్ర యుద్ధ సందేశమూ ఇదే.
రక్తపాశము గొప్పది. అన్నదమ్ములు ఒకరిని మించి ఒకరు అభ్యున్నతి సాధించడంలో అసూయలు సహజము. కాని చంపుకునే స్థాయిలో జరిగినా క్రియలో రక్తపాశము అనుబంధానికే లొంగిపోతుంది. అందుచేత అధర్మాన్ని గుర్తించగలిగిన అనుబంధ సందేశాత్మక ఐక్యతాభావము మరింత గొప్ప సందేశాలను ఇవ్వగలగాలన్నది ఈ వ్యాస రచనోద్దేశం.