పిచ్చుకల చెట్టు

0
4

[dropcap]”రం[/dropcap]డి, కూర్చోండి. అంతా కలసి ఇలా వచ్చారు. నాతో ఏం పనో చెప్పండి. నేను చెయ్యగలిగేది ఏమన్నా వుంటే చేస్తాను” అన్నారు చిట్టిబాబు గారు.

వచ్చిన వాళ్లంతా ఒకళ్ళ ముఖాలు మరొకరు చూసుకున్నారు కాని ముందుగా ఆయనతో మాట్లాడటానికి ఎవరూ ధైర్యం చేయలేదు.

“మొహమాటపడొద్దు, వచ్చిన పని చెప్పండి అన్నారు” ఆయనే మళ్లీ. ఈలోగా గాజు గ్లాసుల్లో అందరికి మజ్జిగ తెచ్చారు ప్రసన్న లక్ష్మి గారు, ఒక ట్రేలో పెట్టుకుని. ప్రతి గ్లాసులోనూ మజ్జిగ పైన ఒక చెంచాడు వెన్న పైకి తేరి కనపడుతూ వున్నది.

“అయ్యో! మీరు తెచ్చారా? ఎందుకంత శ్రమ పడుతున్నారు?” అంటూ వెంకట్ లేచి గభాల్న ఆమె చేతిలో ట్రే అందుకున్నాడు.

“బయట ఎండగా కూడా వున్నది. అందరూ ఈ మజ్జిగ తాగండి. ఇంట్లో అందరూ బాగున్నారుగా” అంటూ పలకరించి ఆవిడ లోపలికెల్లి పోయారు.

“ఏం లేదండీ, బిళ్లజువ్వి చెట్టు కింద ఒక రేకుల షెడ్డేసుకుందామని ఆలోచిస్తున్నాం. తాపీమేస్త్రీని కనుక్కుంటే నలభైవేల పైచిలుకే ఖర్చువుతుందని చెప్పాడు. మీలాంటి వాళ్లందరూ తలా కాస్త సాయం చేస్తే కాని ఆ పనవదు” అంటూ తన మాటలు ఆపాడు వెంకట్.

“జువ్వి చెట్టు క్రింద నీడ బాగానే వుంటుంది. ఇంకా దాని కింద రేకుల షెడ్డేమిటి? ఆ షెడ్డులో ఏం చేస్తారు. మీరంతా? ఎన్నేళ్ల నాటి చెట్టో, బాగా వత్తుగా గుబురుగా పెరిగి అక్కడి చోటంతా ఆక్రమించుకున్నది. చెట్టు క్రిందంతా జనం కూర్చోవటానికి పెద్ద గచ్చు అరుగూ కట్టేవుంది” అన్నారు చిట్టిబాబుగారు.

“నీడా బాగానే వుంది, కూర్చునే అరుగూ బాగానే వున్నది. ఎటొచ్చీ చెట్టు మీద వుండే వందలాది పక్షుల గోలే పడలేకపోతున్నాం. పిచ్చుకల దగ్గర్నుంచి కొంగల దాకా దాని మీచే గూడు కట్టుకుంటున్నాయి. గుడ్లు పెట్టి పిల్లల్ని పొదగడం చేస్తున్నాయి. నానాటికి వాటి సంఖ్య పెరిగిపోతుంది. వాటన్నంటి రెట్టల వాసన భరించలేక పోతున్నాం. వానొస్తే చెట్టు దగ్గరకే ఎల్లలేకపోతున్నాం. అరుగంతా పక్షి రెట్టలే. పొలిగట్టి పట్టుకుని రోజు ఒకళ్లం ఊడ్చినా ఏమీ వుపయోగం వుండటం లేదు. అందుకని చెట్టు కొమ్మలన్నీ కొట్టిస్తే పక్షులన్నీ ఎల్లిపోతయ్యి. చెట్టుకు వచ్చిన చిగురు వచ్చినది వచ్చినట్లు గిల్లేస్తే చెట్టు మొదలు దానంతటదే ఎండిపోతది. ఆ సోట్లో ఎండబడకుండా ఆరుగుమీద ఓ రేకుల షెడ్డేస్తే వాడకానికొస్తది” అంటూ వివరించాడు వినోద్,

“ఏంటక్కడ మీరు చేసే పని, పేకాడుకోవటమేగా?” అన్నారు కొంచెం తీవ్రంగా చిట్టిబాబుగారు.

“పేకాటంటే ఏదో కాలక్షేపానికే. డబ్బుల్తో పందెం పెట్టి ఏం కాదు.” అంటూ నసిగాడు మరొకతను.

“ఇవాళ కాలక్షేపంగా ఆడిందే రేపు డబ్బులాటగా మారుతుంది. ఆ బిళ్లజువ్వి మొక్కలు నాటింది మా తాత రామయ్య గారు. ఊరి మధ్యలో చేరిన పదిమందికి నీడ వుండాలని ఆ పని చేశారు. ఆయనెపుడో భద్రాచలం వెళితే అక్కడ అలాంటి చెట్లు ఎక్కువ నీడనిస్తూ బాటసారులకు ఉపయోగపడటం చూశారట. వారి చుట్టు ప్రక్కల గాలించి రెండు చిన్న మొక్కల్ని వేళ్లతో సహా పీకి జాగ్రత్తగా ఇంత దూరం తెచ్చి వారిని ఇక్కడ నాటారట. ఆ మొక్కలు రెండూ కలిసి పెరిగి పెద్ద మానులా తయారయ్యాయి. ఆ చెట్టు క్రింద పది మంది కూర్చోవటానికి వీలుగా గానుగ సున్నంతో, గచ్చు చేయించారు. దాన్నెవరూ బిళ్లజువ్వి చెట్టని పిలవరు మనూళ్లో. పిచ్చుకల చెట్టనే పేరే అందరికీ తెలుసు” అంటూ తన మాటలు ఆపారు.

“అవునండీ రామయ్య గారే తెచ్చి పెంచారని మా పెద్దాళ్లు చెప్తావుంటారు. ఆయన చాలా బలంగా కూడా వుండే వారంటండీ. మన ఊరి గుడి గాలిగోపురం తొమ్మిది వాకిళ్లతో బాగా ఎత్తుగా వుంటది. ఆయన ఈ ప్రక్కన నుంచుని ఆ ప్రక్కకు గాలిగోపురం మీద నుంచి కొబ్బరి కాయొకసారి, తాటికాయొకసారి అవలీలగా ఇసిరేశారంటండీ”.

“అదే కాదు. కుస్తీ పట్లు కూడా మా బాగా పట్టేవారని మా పెద్దార్లూ అంటా వుంటారు” అని మరొకతను చెప్పాడు.

“అవునవును” అంటూ చిరునవ్వు నవ్వారు చిట్టిబాబు గారు.

“ఒక పెద్ద చెట్టు అలా ఊరి మధ్యలో వుంటే ఊరందరికి ఆక్సిజన్ అందుతున్నట్లే. అలా ఆ చెట్టు ఊర్లో వారి ఆరోగ్యం బాగుపడ్డానికి ఉపయోగపడుతుంది. దాన్నే మీరు నరికేస్తే చెట్టు నీడనూ, మంచి గాలినీ పోగొట్టుకుని కాలుష్యం బారిన పడతాం. మనమేం దానికి నీళ్లూ, మేత వేసి పెంచటం లేదు. వాన నీటిని పీల్చుకుని, భూమిలోపల నీరు వుండేటట్లు చేస్తున్నది. దాన్ని నరికేస్తే గాలి వేడెక్కుతుంది. చల్లనిగాలి, ఆరోగ్యం కోసం ఇంకా ఎక్కువ చెట్లను ఊళ్లో పెంచుదాం. ఎన్ని ఎక్కువ చెట్లుంటే అన్ని ఆక్సిజన్ యంత్రాలు మన దగ్గరున్నట్టే అని చెప్తున్నారు. నాలుగు గింజలు ఏరుకుని తిని పంట మొక్కల్ని ఎన్నో రకాల చీడపీడల్నుంచి పిచ్చుకలు కాపాడతాయి. పిచ్చుకలు ఇప్పటికే అంతటా బాగా తగ్గిపోయాయి. మసూళ్లోనయినా వాటిని బతకనిద్దాం. మీరే అంటున్నారు పిచ్చుకల దగ్గర్నుంచి కొంగలదాకా గూడ్లు కట్టుకుని వుంటున్నాయని, చిన్నచిన్న పురుగుల్ని తిని వాటి మానాన అవి బతుకుతాయి. మీరంతా కొద్దో, గొప్పో చదువుకున్నాళ్ళేగా? పరిస్థితి అర్థం చేసుకోండి. మీకు కాలక్షేపం కావాలంటే మనమంతా కూర్చూని రోజూ కొంచెం సేపు మాట్లాడుకుందాం. నా దగ్గర ఎన్నో పుస్తకాలున్నాయి, తీసుకెళ్లి చదువుకోండి”.

“మీరింక సిటీకెళ్లరా? ఇక్కడే వుండిపోతారా?” వినోదుకు ధర్మసందేహమొచ్చింది.

“ఉద్యోగం కోసం సిటీలో వున్నాం ఇన్నాళ్లు. మా నాన్నగారూ, ఆయన చివరి దశలో ఇక్కడే వున్నారు. నేనిప్పుడు రిటైరైపోయాను. కాలుష్యం తక్కువగాను, ప్రశాంతత ఎక్కువ గాను వుండే నా ఊళ్లోనే, పెద్దవాళ్లు కట్టించిన ఇంట్లో వుండాలని ఇక్కడి కొచ్చేశాం. ఇక పూర్తిగా ఇక్కడే వుండి పోతాం” అన్నారు.

ఆయన ధోరణి అర్థమయి “సరే, వెళ్లివస్తాం” అంటూ వెంకట్ బృందం బయటకు నడిచింది.

“ముసలాడు మరీ చాదస్తంగా మాట్లాడుతున్నాడురా. చేతి నిండా డబ్బులున్నోడు. మన పని కోసం ఐదూ, పదివేలన్నా ఇవ్వకపోతాడా అనుకున్నాను. మనకే నీతులు చెప్పి చెట్టును కొట్టనే వద్దు అని పాఠం చెప్పి పంపాడు” అన్నాడు కోపంగా రాము.

“అలా కాదులే. ఆయనన్న దాంట్లో పాయింటున్నది. మనమూ కాస్త ఆలోచించాలి. ఇప్పుడు ఎవరిళ్లకు వాళ్లు పోదాం. ఈ పనిమీద చందాలంటూ ఇక ఎక్కడికీ పోవద్దు” అన్నాడు వెంకట్.

చిట్టిబాబు గారు రిటైరై తన ఊరు వచ్చే ముందే ఇల్లంతా రిపేరు చేయించుకున్నారు. ఇంటిపైన రెండు గదులూ వేయించుకున్నారు. హాలంతా అద్దాల అల్మారాలు పెట్టించుకున్నారు. వాటిలో బాల సాహిత్యం నుంచి భగవద్గీత వరకు పుస్తకాలు అమర్చుకున్నారు. పెరట్లోను, ఇంటి చుట్టూతా పూలచెట్లతోపాటు పళ్ల చెట్లూ, ఔషధంగా వుపయోగపడతాయి అనుకున్న మొక్కలు నాటుకున్నారు. ఇక్కడి కొచ్చాక ప్రసన్నలక్ష్మిగారికి బాగా పని ఎక్కువయింది.

“లక్ష్మీ! అలసటగా వుంటే మొక్కల పని మానెయ్. నేను చూసుకుంటాను” అన్నారు చిట్టిబాబుగారు.

“లేదులెండి, కాస్త మోకాలు నెప్పిగా వుంటే కాస్సేపు కూర్చున్నాను. ఈ పూల మొక్కల మధ్య తిరుగుతుంటే తెలియని ఆనందం కలుగుతుంది. మన పిల్లల్తో వున్నట్లే వుంటున్నది” అన్నారామె జాజితీగను పైకి పాకిస్తూ

***

“ఆ చిట్టిబాబు మాటల్తో ఈ వెంకట్ గాడు బొత్తిగా కాడి కింద బారేశాడు. పేక ఆట్టానికి రావట్లేదు. వెంకట్ గాడికి తోడు వినోద్ గాడు. అడెనకాల తోకలాగా తయారవుతున్నాడు. ఈ ఇద్దరూ కల్సి చెరువొద్దున నత్తగుల్లల్ని ఏరిపోస్తారులా వుంది థూ……. పనికిరాని నాయార్లు” అంటూ రాము మండిపడుతున్నాడు. అక్కడున్న మిగతా వాళ్లు ఏం మాట్లాడలేదు.

***

“వెంకట్! రా, కూర్చో. వినోద్ కూడా వచ్చాడా? అచ్ఛా. కాస్సేపు ఇంట్లో కూర్చుందామా?” అనడిగారు చిట్టిబాబుగారు.

“పొలాల వైపుకు పోదాం రండి మాస్టారూ” అన్నాడు వెంకట్. ముగ్గురూ పొలందారి పట్టారు. పొలం పని మీద ఇష్టంతో ఒక ఏభై సెంట్ల నేలలో ప్రొద్దు తిరుగుడు మొక్కల్ని సాగుచేస్తున్నారు చిట్టిబాబుగారు. తోటంతా ఏపుగా వుండి మొగ్గతొడిగింది.

“ఆవు మూత్రం ఉపయోగించే విత్తనశుద్ధి చేశాను. యూరియా లాంటి ఎరువులేం వాడలేదు. పశువుల పేడనే నీళ్లలో కలిపి పోయించాను, పురుగు మందులు చల్లితే తేనె కోసం పూల మీద వాలే సీతాకోకచిలుకలు, తేనేటీగల్లాంటివి చచ్చిపోతున్నాయి. అవే లేకపోతే పూలకు పరపరాగ సంపర్కం జరగదు. అది జరక్కపోతే గింజల దిగుబడీ వుండదు. మరలా నష్టం మానవ జాతికే.” అన్నారు వివరంగా చిట్టిబాబుగారు.

“మా వెంకట్ ఏ ముహూర్తాన మిమ్మల్ని మాస్టారూ అన్నాడోగాని నిజంగా మీరు మాస్టారి లాగే మాకు అన్నీ వివరంగా చెప్తున్నారు” అన్నాడు వినోద్.

“ప్రస్తుతం వున్న సమస్యల్లో పర్యావరణ సమస్య ఒకటి. మన చుట్టూ వున్న మొక్కలు, జంతువులు, మనుషులూ, గాలి, నీరు, భూమి అంతా ఒక దానికొకటి పెనవేసుకొని వుంటాయి. వీటిల్లో ఏది సరిగా లేకపోయినా, దేనికి ఇబ్బంది కలిగినా మొత్తం పర్యావరణమే దెబ్బతింటుంది. కాబట్టి మనం ప్రకృతినంతా సమతుల్యత లోపించకుండా కాపాడుకోవాలి. ఈ పొద్దుతిరుగుడు తోటనే చూడండి. నేలను గుల్లబరిచే వానపాములు వుండాలి. మంచి గాలీ, నేలలో తేమా కావాలి. మొక్క ఏపుగా పెరగటానికి ఎరువునిచ్చే పశువులు కావాలి. పూత వచ్చి పుష్పించిన తర్వాత నాణ్యమైన గింజల దిగుబడి జరగాలి. అది కావాలంటే కీటకాలు వుండాలి. కీటకాలు పువ్వు పువ్వు మీద వాలి పుప్పొడి నంటించుకుని మరొక పువ్వుకు చేరవేసి పరపరాగ సంపర్కం జరపాలి. ఇలా అన్నింటి సహకారముంటేనే విత్తన దిగుబడి బాగా వస్తుంది.” అన్నారు. ఆ మాటల్ని వెంకట్, వినోద శ్రద్ధగా వింటున్నారు.

“మీ వాళ్లకు నా మీద బాగా కోపంగా వుండి వుంటుంది. చెట్టు కొట్టనివ్వలేదు, చందా కూడా ఇవ్వలేదని బూతులు కూస్తా వుండి వుంటారు అవునా?” అని అడిగారు చిన్నగా నవ్వుతూ. వాళ్లిద్దరూ మాట్లాడలేదు. “ఊరి బాగుకోసం ఏదైనా ప్లాన్ చేసుకోండి. నా వంతు సాయం తప్పకుండా వుంటుంది. మళ్లీ రేపు కలుద్దాం” అంటూ వెళ్లిపోయారు.

***

బిళ్ళజువ్వి చెట్టు నరికితే వన సంరక్షణ సంస్థ వారికి రిపోర్ట్ చేస్తారన్న భయంతో ఆగాడు కాని లేకపోతే ఈ పాటికి వంతంగానైనా నలుగురు కూలీలను మాట్లాడి ఆ చెట్టును రామూ నరికించేవాడే. షెడ్డు పేరు చెప్పి వసూలయిన చందాలలో కొద్దో, గొప్పో మిగుల్చుకోవాలని చూశాడు. అది వీలు పడక కోపంతో బుసలు కొడుతున్నాడు.

పంచాయితీ వార్డు మెంబర్లంతా పూనుకుని సర్పంచ్ సహాయంతో పనివాళ్లను తీసుకుని ఊరంతా వున్న మురుక్కాలవలు, చెఱువులు పూడిక తీయించాలని చిట్టిబాబుగారు సలహా ఇచ్చారు. ఈ పనుల ప్రారంభానికి జడ్.పి.టీ.సీ., యమ్.పి.డి.సీ కూడా వచ్చారు.

“నిజంగా ఇవి చాలా మంచిపన్లు, అలా చేస్తే కాలవల్లో నీరు బాగా పారుదలయ్యి మురికీ, దోమలూ తగ్గి, మలేరియాలు, చికెన్ గునియాలూ రావు. ప్రతి ఒక్కరూ మీ వంతు సాయం మీరు చెయ్యండి” అని పిలుపునిచ్చారు. “అంతే కాకుండా చెఱువు పూడిక కూడా తియ్యించండి. చెఱువంతా తూటికాడ, గుఱ్ఱపుడెక్క ఆకే పరుచుకునుంది. ఆవి తీసేస్తే వర్షపు నీరు బాగా నిల్వ వుంటుంది. చేపలూ పెరుగుతాయి. ఇప్పుడైతే నత్తలూ, జలగలే వున్నాయి” అని చిట్టిబాబు గారు సలహా ఇచ్చారు. వర్షపు నీరు నిల్వ వుంటే పశువులకు చాలా ఉపయోగంగా వుంటుందని ఊర్లోని పెద్దవారూ ఒప్పుకున్నారు.

వెంకట్ బృందం ఉత్సాహంగా పని మొదలు పెడదామనుకున్నారు. రామూ మాత్రం బాగా వ్యతిరేకించాడు. “ఇదంతా గవర్నమెంట్ చేయించాలి. మేమెవరు ఆ పనుల జోలికి రాం, చెఱువు మా ఇంటి వైపే వున్నది. మా కొచ్చిన నష్టమూ, తొందర ఏదీ లేదు. గవర్నమెంట్ చేయించినప్పుడే చేయించుకుంటాం. మా బజారు వాళ్లెవరూ వీటి జోలికి రారు. ఊరు ప్రెసిడెంటునూ శుభ్రం చేయించమని మేం దేబిరించం. ఆయనకా మాత్రం తెలియదా? ఆయనకు తెలిసి చేసినప్పుడే చేయించుకుంటాం” అన్నాడు మొండిగా.

కాలవలు శుభ్రపడ్డాయి. మురుగు వాసనా, దోమలు తగ్గాయి అనుకున్నారు ఊర్లోని జనం. ఆ సాయంత్రం నుండి పెద్ద వర్షమే పడుతున్నది. బంగాళాఖాతంలో వాయుగుండం పడిందని, కోస్తా అంతటా భారీవర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా వుండాలని వాతావరణ శాఖ ప్రకటించింది. రాత్రి పొద్దుపోయే కొందికి ఈడురుగాలీ, గాలితో పాటు వర్షమూ ఎక్కవయింది. కరెంటు పోయింది. ఇళ్ళలో వున్న జనం బయటికొచ్చి చూసే వీలు కూడా లేక లోపలే వుండిపోయారు. ఇన్వర్టర్ సదుపాయమున్న కొద్దిమంది ఇళ్ళలో మాత్రం దీపాలు వెలిగాయి. చెఱువుకు నాల్గు వేపులా ఇళ్లున్నాయి. చెఱువు కట్టను అన్ని వేపులా ఆక్రమించుకుని చెఱువు ఎండినప్పుడు దాంట్లోని మట్టినే తవ్వి పోసుకుని మెరక చేసి దాని మీద ఇళ్ళూ, వాకిళ్ళూ కట్టేసుకున్నారు. చెఱువంతా అల్లుకున్న తీగలూ, కాడలతో ఆకుపచ్చని తివాసీ పరిచినట్టుగా వున్నది. ఆ తీగలకు పూసిన సరంగు పూలు పచ్చ తివాసీపై అద్దిన నీలి పూల లాగా వున్నాయి. అంతకంతకూ చెఱువులోకి వచ్చి పడే నీటి ప్రవాహం ఎక్కువయింది. బలహీనమైన చెటువు కట్ట తెగిపోయి నీరంతా నెమ్మదిగా ఊర్లోకి రాసాగింది. చావిళ్లలో కట్టేసిన పశువులు పలుపుతాళ్లు తెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ, గిరగిరా తిరుగుతూ కట్టుగొయ్యను పెకలించాలని పెనుగులాడుతున్నాయి. వర్షపు చప్పుడు పశువుల అరుపులను మింగేస్తున్నది.

మొదటగా రామూ వాళ్ల ఇల్లే వున్నది. ఇల్లు కాస్త మెరుగ్గా వున్నా, చావిడి పల్లంలోనే వున్నది. వరిగడ్డి వామి, జనపకట్టె వామి అడుగు నుంచి నీళ్లలో నానుతున్నాయి. వేగంగా వీచే గాలికి వాముల మీదున్న గడ్డి ఎటో కొట్టుకుపోసాగింది. పశువుల చావిడి పూరిది రావటంతో ఒక పక్కకు జరిగింది. పశువులన్నీ గాబరాతో మరింతగా అరవటం మొదలు పెట్టాయి. బ్యాటరీ లైటు వేసుకుని చావడి దగ్గరకొచ్చి చూసిన రామూ తండ్రికి పరిస్థితి అర్థమయ్యింది. పశువుల తాళ్లు విప్పబోతే వర్షపు నీటికి తడిసి, అవి గిరగిరా తిరగటంతో కట్టుగొయ్యకున్న తాళ్ళు బిగుసుకుపోయాయి. బ్యాటరీ లైటు చంకలో ఇరికించుకుని ఆ వెలుగులో రెండు చేతులుపయోగించి అతి కష్టం మీద పశువుల మెడ తాళ్లు విప్పగలిగాడు. అవి అరుచుకుంటూ పరుగెత్తుకు పోయాయి. ఇంటి ముంగిట్లోకి మోకాళ్లలోతు నీళ్లు వచ్చాయి. అవి ఇంకా పెరిగే సూచనలే కనపడుతున్నాయి, అనుకుంటూ ఇంట్లో కొత్త అందరూ మంచాలెక్కి భయంభయంగా కూర్చున్నారు. “మనం కూడా ఎవరింటిపైనా, నీళ్లకు దూరంగా వెళ్లాల్సి వుంటుంది. సిద్ధంగా వుండండి” అన్నాడు.

రామూకు నిద్ర మత్తెగిరిపోయింది. ఇంట్లో వున్న డబ్బు, బంగారం, పత్రాలు వాళ్లమ్మ ఒక చేతి సంచిలోకి సర్దింది. వరండా దాటి, గడపలు దాటుకుని వేసివున్న తలుపుల సందుల్లో నుంచి నీళ్లు లోపలకి రాసాగాయి. ‘ఇంకా నీళ్లు ఎక్కువ వస్తే బయటికి పోవటం కష్టమవుతుంది. ఇప్పుడే వెలుపలికి పోతే మంచిద’న్న ఉద్దేశంతో వున్నారు.

చెఱువుకట్ట చుట్టూ పెద్ద పెద్ద చెట్లుండేవి. ఆ చెట్లే వుంటే మట్టి కోసుకుని పోకుండా ఆపేవి. బలహీనమైన చెఱువు కట్టలూ, మేట వేసిన చెఱుపూ నీటినంతా బయటికి నెట్టేసింది. ఫలితంగా గొడ్డూ, గోదా, మనుషులూ నీటి ప్రవాహంలో చిక్కుకుపోవాల్సి వచ్చింది. వర్షపు నీరుతో పాటు తన తప్పిదమూ చాలా వుందని రామూ కర్థమయింది. మూర్ఖంగా ఆలోచించి చిట్టిబాబు గారిలాంటి వారు చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టాడు.

రెండు రోజులకు వర్షం తెరిపిచ్చింది. ఒరిగిపోయిన గోడలూ, పడిపోయిన పూరి చావిళ్లూ, పెంకులెగిరిపోయిన ఇళ్లూ, మట్టి కొట్టుకుపోయిన డాబా ఇళ్లతో వేళ్లతో సహా పెల్లగిలిన చెట్లతో ఊరి దృశ్యమే మారిపోయింది. కట్లు తెంచుకుపోయిన పశువులు ప్రాణాలతో వున్నాయో లేదో వెతుక్కోవాలి. తడిచిన వస్తువులన్నింటిని ఆరబెట్టుకోవాలి.

మానవుడి దురాశ వలన చేసే పొరపాట్లతో ప్రకృతి వ్యవస్థలో మార్పులు కలిగి వాటి దుష్ఫలితాలను అనుభవించవలసి వస్తున్నది. బిళ్లజువ్వి చెట్టు చుట్టు ప్రక్కల వున్న ఇళ్లకు గాలి తీవ్రత ఏం తాకలేదు. వేగంగా వీచే గాలి తీవ్రతను చెట్టు ఆపిందని జనం అనుకుంటున్నారు.

జువ్విచెట్టు మీద ఎప్పటిలాగే పక్షుల రొద వినపడుతూనే వున్నది. చెట్టు క్రిందంతా గచ్చు కాబట్టి ఆసాముల పుల్లల మండెల్లో నుంచి తెచ్చుకున్న పుల్లలు పెట్టి నిప్పురాజేసి పొరుగూరు నుండొచ్చిన కూలీలు అన్నం వండుకుంటున్నారు. పంచాయితీ వర్కర్లుతో పాటు వెంకట్, వినోదూ ఇల్లిల్లు తిరిగి పరిస్థితి తెలుసుకుంటున్నారు. వాళ్లతో పాటు రామూ కూడా చేరాడు. సహాయ కార్యక్రమాలు ఎలా అందించాలో ఎప్పటికప్పుడు చిట్టిబాబు గారు వీళ్లకు సలహాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here