[dropcap]ఆ[/dropcap] రోజు శుక్రవారం. ఆదిలక్ష్మి పూజ ముగించుకుని పిల్లలకు అన్నం పెడదామని అనుకుంటూ ఏదో చప్పుడు కావడంతో మధ్యగదిలోకి వచ్చింది. స్నేహ బీరువాలో బట్టలన్నీ అటూఇటూ చేస్తోంది. కొన్ని బట్టలు జారి కింద పడ్డాయి. ఆదిలక్ష్మికి చిరాకొచ్చింది.
“ఏమిటే బట్టలన్నీ అలా చేస్తున్నావ్? ఏం కావాలి?” అంది.
“కిందటేడాది కుట్టిచ్చిన పట్టుపరికిణి కావాలి. అది స్కూలుకు వేసుకువెడతాను.”
“ఇప్పుడెందుకు పట్టుపరికిణీ, బడిలో ఏమైనా విశేషమా?”
“ఏంలేదు. ఇవేళ సివిల్ డ్రెస్ కదా! మా క్లాసులో అందరం పట్టుపరికిణీలు వేసుకు వెడదామని అనుకున్నాం.”
“ఆ… ఆ… అనుకుంటావ్… ఇంతలేసి పిల్లలున్నారో లేదో ఫలాన డ్రెస్ వేసుకురావాలని అనుకోవడమా… చాల్లే ఆ పసుపురంగు గౌను వేసుకువెళ్ళు బాగుంటుంది” అంది ఆదిలక్ష్మి.
“అహ పట్టుపరికిణి వేసుకోకుండా వెడితే మా ఫ్రెండ్స్ వెక్కిరిస్తారు.”
“ఏమి వెక్కిరించారో నాతో వచ్చి చెప్పు వాళ్ళకి నేనొచ్చి జవాబు చెబుతాను.”
“అబ్బా అదికాదమ్మా…” తల్లికి ఎలా చెప్పాలో స్నేహకి అర్థం కాలేదు.
“చాల్లే వేషాలు, పిల్లలందరూ కలిసి ఎలా చదువుకోవాలి మంచి విషయాలు ఎలా నేర్చుకోవాలి ఇది మానేసి డ్రెస్సులు, ఫ్యాషన్‍లు బాగుంది. పక్కకు జరుగు.”
స్నేహను ఒకచేత్తో పక్కకు తోసి, వంగి కిందపడ్డ బట్టలన్నీ బీరువాలో సర్దసాగింది ఆదిలక్ష్మి.
“అమ్మా జడవేస్తావా…” అంటూ వచ్చింది రవళి.
“అక్కను చూడు బడికి ఎంత సింపుల్‍గా వెడుతుందో. ఏనాడూ అది ఈ రంగు బట్టలు వేసుకుంటాను, ఇలా తయారవుతాను అనలేదు.”
ఆదిలక్ష్మి స్నేహ వేసుకోవలసిన పసుపురంగు గౌను తీసిచ్చి రవళికి జడ వెయ్యసాగింది. స్నేహకు ఉక్రోషంగా వుంది. క్లాసులో ఈ టాపిక్ తెచ్చిందే తను. అలాంటిది తను పట్టుపరికిణి కాకుండా గౌను వేసుకువెడితే బాగుంటుందా? కానీ తల్లి తన మాట వినేటట్టు లేదు. పోనీ బడి మానేస్తే… లేదు బడికి వెడితేనే మంచిది.
ఈవేళ సంగీతం పిరియడ్ ఉంది. క్రిందటి వారం టీచర్ నేర్పిన పాట బాగుంది. మళ్ళీ ఈరోజు అదే పాట ప్రాక్టీస్ చేయిస్తారు. తను ఇంట్లో వున్నా అమ్మ ఇంకో ఉపన్యాసం మొదలుపెడుతుంది. ‘అక్క ఎప్పుడూ ఇలా బడి మానలేదు. జ్వరం వచ్చినా బడికి వెడతాను’ అనేది… అంటూ. స్నేహ మౌనంగా స్కూలుకి తయారైంది.
“ఏమిటమ్మా స్నేహతో వాదన” అడిగింది రవళి.
జరిగింది చెప్పింది ఆదిలక్ష్మి.
“ఏమిటి స్నేహ ఇలాంటివి అలవాటు చేసుకుంటే చదువుమీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఏం తిన్నామో… ఏం కట్టామో అన్నట్టు వుండాలి” అంది రవళి.
“అదీ అలా చెప్పు” అంది ఆదిలక్ష్మి.
“స్నేహా…” రవళి ఏదో చెప్పబోయింది.
“నేను గౌను వేసుకున్నాను పద” స్నేహ కాస్త కోపంగా అనేసి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
అన్నం తింటున్నా అక్కా, అన్నల మాట వింటున్నా ఆమెకు చిరాగ్గా వుంది. ఆమె ఓరగా అక్కను చూసింది. బాగానే తయారైంది. ఆకుపచ్చ వైలెట్ రంగుల్లో పరికిణీ, ఓణీ, జాకెట్, మెడలో సన్నటి గొలుసు. ఆమెకింకా రిస్టు వాచ్ కొనలేదు. చెరొక చేతికి ఒక్కో బంగారు గాజు. అన్న కూడా మంచి ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు. ఎటొచ్చీ తనే బాగాలేదు. అక్క తనకి ఇన్ని చెబుతుంది.
మరి సంహిత. సివిల్ డ్రెస్ వేసుకునే శుక్ర, శనివారాలు సంహిత వేసుకునే బట్టలు చూడటానికి రెండు కళ్ళూ చాలవు. ఆ కలర్ కాంబినేషన్, ఆ ఖరీదు ఎవరి ఊహకు అందదు. అక్కగారు తనకి చెప్పే ఈ మాటలన్నీ సంహితకు చెప్పదా? లేకపోతే అలా తయారయ్యే లైసెన్స్ సంహితకు మాత్రమే వుందా?
“అబ్బా స్నేహ ఇదంతా కోపమే… ఆరవ తరగతి చదివే మీకు డ్రెస్‍ల గురించి పెద్ద మీటింగా… ఏనాడో మీ క్లాసందరూ మాకు చెప్పకుండా ఏ సినిమాకో చెక్కెయ్యరు కదా!…” చెల్లెల్ని ఏడిపించసాగాడు రవి.
***
“రవళి మనం సినిమాకు వెడదాం” అంది సంహిత.
“ఇది ఫిబ్రవరి నెల తెలుసా?” అంది రవళి.
“తెలుసు. జనవరి వెళ్ళింది, మార్చి రాబోతుంది. ఇప్పుడూ ఫిబ్రవరి నడుస్తోంది. అంటే ఈ వూళ్ళో, ఎవరూ ఈ నెలలో సినిమాలు చూడరా…”
“అహ అదికాదు. వచ్చే నెలలోనే మన పరీక్షలు. పరీక్షలు ముందు పెట్టుకుని సినిమాలు చూడటానికి మా యింట్లో పంపించరు.”
“ఓస్ అంతేకదా! వాళ్ళతో చెప్పవద్దు.”
“అమ్మో అలా ఇంట్లో చెప్పకుండా ఎలాగ నాకు చాలా భయం.”
“అబ్బా అలా ప్రతిదానికి భయపడితే ఎంజాయ్‍మెంట్ ఎలాగోయ్. ఈ స్కూల్‍లో మన విద్యార్థి దశ అయిపోతోంది అవునా. సరదాగా, చిలిపిగా చేసిన పని ఏదైనా వుందా నీకు. హోంవర్క్ చేయడం టీచర్లు మెచ్చుకుంటే సంతోషం, వాళ్ళు తిడితే దుఃఖం… ఇంతేనా బడిలో జ్ఞాపకాలు? పైగా ఈ జూన్‍తో మా నాన్నగారికి ట్రాన్స్‌ఫర్ కావచ్చు, అప్పుడు నువ్వే కాలేజీయో, నేనే వూళ్ళో కాలేజీయో… అందుకని సరదాగా సినిమా చూద్దాం. ఏమంటావ్?”
ఏమంటుంది రవళి అప్పుడే సంహిత మాటలు ఆమెపై ప్రభావం చూపిస్తున్నాయి.
“మాట్లాడవేం రవళి”
“ఎప్పుడు వెడదాం. స్కూలు మానేస్తే బాగుండదు.”
“అహ… హా స్కూలు మానవద్దు. ఏదో శలవురోజు వెడదాం. ఎవరికీ చెప్పొద్దు.”
“అలాగే”
ఇద్దరూ క్లాసులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య రవళి లంచ్ కోసం ఇంటికి వెళ్ళినా త్వరగా వచ్చేస్తోంది స్కూలుకి. ఒక్కోరోజు స్నేహను కూడా వదిలేసి తను సంహితతో కబుర్లు చెప్పడానికి వచ్చేస్తోంది. ఇద్దరూ నోరు నొప్పి పుట్టేలా మాట్లాడుకుంటారు. లంచ్‍లో పిల్లలు చెట్ల కిందా, వరండాల్లో తింటుంటారు. సంహిత తన చోటు నుండి, క్లాసులో నుండి కదలదు. లంచ్ ముగించి ఏదో చదువుతుంది. అవి క్లాసు బుక్స్ మధ్య పెట్టి చదివే నవలలు, మేగజైన్స్, ఏమైనా కావచ్చు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతుంది. ఇంతలో ఫాతిమా వచ్చింది. రవళిని సంహిత పక్కన చూసి ఆగిపోయింది.
“రా… ఫాతిమా… ఏమిటా బుక్” ఏమీ తెలియనట్టే అడిగింది సంహిత.
“నీ బుక్ నా బుక్స్‌లో కలిసిపోయింది, సంహితా అది యిద్దామని.”
“అలాగా నేను చూసుకోనేలేదు, థాంక్స్” అంది సంహిత.
“ఈ మధ్య ఇలా జరుగుతుందేమిటి? మీ యిద్దరి బుక్స్ ఇలా కలిసిపోతున్నాయి” అప్పుడే వచ్చిన కృపామణి అంది.
ఫాతిమాకు ఏం చెప్పాలో తెలియలేదు.
“ఫాతిమాకు కంగారు ఎక్కువ ఇందాక తెలుగు నోట్స్ టీచర్ దిద్దుతున్నప్పుడు కలిసిపోయాయి” అంది సంహిత.
రవళికి ఇవేమీ వినిపించడం లేదు, కనిపించడం లేదు. సంహితతో సినిమాకు వెళ్ళాలంటే ఇంట్లో ఏ అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తోంది.
***
రవళి, సంహిత సినిమా చూస్తున్నారు. మంచి కలర్, చక్కటి పాటలు. రవళికి కాస్త భయం తగ్గి సినిమాలో లీనమవుతున్నవేళ. సంహిత ప్రక్కగా ఎవరో కూర్చున్నారు. గుసగుసగా మాట్లాడుతున్నారు. రవళి చిన్నగా ముందుకు వంగి చూసింది. ఎవరో మగవాడు. సంహిత మీదకి వంగి మాట్లాడుతున్నాడు. ఆమె చెయ్యి అతని చేతుల మధ్య ఉంది. రవళికి మర్చిపోయిన మళ్ళీ కంగారు మొదలైంది. అతడెవరు? అతడిని కలవడానికే ఈ సినిమా ప్రోగ్రాం వేసిందా? అందుకే హిందీ సినిమా, అందులో మ్యాట్నీ సెలక్ట్ చేసిందా?
“వెంటవెంటనే ఉత్తరాలు రాయమని ఎన్నిసార్లు చెప్పాలి?” అంటున్నాడతను.
“రాస్తున్నానుగా… భార్గవ్…”
“ఆమె నీకు అందజేయడం లేటవుతోందా…. మన…”
అతని మాటలు, సంహిత మాటలు కలిసిపోతున్నాయి. సరిగా వినబడటం లేదు. రవళికి నిలువెల్లా చెమటలు పడుతున్నాయి. రెండు నిమిషాల్లో ఇంటర్వెల్ అనగా అతడు వెళ్ళిపోయాడు.
“ఎవరు సంహితా అతను. ఇలా అయితే నేను సినిమాకి వచ్చేదాన్ని కాదు” అంది రవళి. ఆమె కావాలని సంహితతో కోపంగా మాట్లాడలేకపోతుంది.
“మా కజిన్… ఢిల్లీలో వుంటారని చెప్పానే అతనే…”
“అయితే ఇంటికే రావచ్చుగా, ఇలా కలుసుకోవడం ఎందుకు?”
“మాకు వాళ్ళకు కొంచెం ఆస్తి తగాదాలు వున్నాయి. అందుకే తను మా యింటికి రాలేదు.”
“మరి ఇలా కలుసుకుంటే ఊళ్ళో అందరూ ఏమనుకుంటారు. ఇంట్లో తెలిస్తే బాగుంటుందా?”
“ఈ వూళ్ళో చాలామందికి నేను తెలియదు. మా కుటుంబాల మధ్య గొడవలు పోవాలనే మేము ప్రయత్నిస్తున్నాము. మాతో పాటు మా అన్నయ్య కూడా ఇందులో వున్నాడు. తను చెబితేనే మేము ఇలా కలుసుకున్నాము.”
“అన్నయ్యంటే ఆ రోజు కారు డ్రైవ్ చేశాడు ఆయనే కదూ!”
“అవును. తను కాకినాడలో మెడిసిన్ చదువుతున్నాడు. మేము ముగ్గురం ఈ రెండు కుటుంబాలను కలపాలని ట్రై చేస్తున్నాము. అబ్బా ఏమిటోయ్ నామీద అంత అనుమానమా?”
“అయ్యయ్యో అదేం లేదు సంహిత”
“మరి… మామూలుగా వుండు. సినిమాని ఎంజాయ్ చెయ్యి”
ఇంటర్వెల్ అయిపోయి లైట్లు ఆరిపోయిన అయిదు నిమిషాలకు అతను మళ్ళీ వచ్చాడు. మళ్ళీ సంహిత, అతను కబుర్లు రవళికి గుసగుసలు వినిపించసాగాయి. ఆమె సినిమా ఏమీ చూడలేదనే చెప్పాలి. సినిమా ఇంకా పావుగంట వుందనగా అతడు బయటికి వెళ్ళిపోయాడు. క్లైమాక్స్ చూడకుండానే సంహిత, రవళిని బయటకు తీసుకొచ్చి రిక్షా ఎక్కించి తనూ ఎక్కింది.
“ఎక్కడికి సంహితా! నేను మా యింటికి వెడతాను.” అంది రవళి.
“నేను వచ్చి దింపుతాను.”
ఆమె రవళిని ఇంటి దగ్గర దింపి ఆదిలక్ష్మిని పలకరించింది.
“ఇదిగోనండి మీ రవళి. పాపం అన్నం తిని ఎండలో వచ్చి మా యింట్లో నాకు రాని లెక్కలన్నీ చెప్పింది. శలవురోజు ఇంట్లో వుండకుండా మా యింటికి వచ్చిందని మీరు కోప్పడతారని చెప్పింది. అందుకే నేను మీకు క్షమాపణ చెబుదామని వచ్చాను.”
ఆ వినయానికి ఆదిలక్ష్మి పొంగిపోయింది. “ఆ మాత్రం దానికి క్షమాపణ ఎందుకమ్మా… వూరికే కబుర్లేసుకోకుండా కలిసి చదువుకున్నారు. ఆ… కాఫీ ఇస్తానుండు.”
“లేదండీ రిక్షాని నిలబెట్టాను మళ్ళీ వచ్చి మీ యింట్లో భోజనమే చేస్తాను. వస్తా స్నేహ, రవళీ… మరోసారి థ్యాంక్యూ” ఆమె వెళ్ళిపోయింది.
“కలుపుగోలు పిల్ల” ఆదిలక్ష్మి మురిసిపోయింది.
“నువ్వూ, సంహితా ఏ సినిమాకి వెళ్ళారక్కా” స్నేహ అడిగిన ప్రశ్నకు ఉలిక్కిపడింది.
ఆమె సంహిత వెళ్ళిపోగానే స్నానం చేసి తల్లి ఇచ్చిన టిఫిన్, కాఫీ ముగించి ఏదో వారపత్రిక తీసుకుని డాబామీద కూర్చుని చదవసాగింది. మనసు ఇప్పుడిప్పుడే మామూలు స్థితికి వస్తోంది. ఆ టైములో స్నేహ ప్రశ్న.
“సినిమా ఏమిటే సినిమా లేదు… ఏం లేదు” అంది కాస్త బుకాయింపు ధోరణిలో.
“నీకు అబద్ధాలు చెప్పడం రాదక్కా. అన్నయ్య ఊళ్ళో లేడు కాబట్టి సరిపోయింది. నువ్వూ, నేనూ, అమ్మా సంహితతో మాట్లాడుతున్నాం. అన్నయ్యే వుంటే బయటకు వెళ్ళి రిక్షావాణ్ణి ఒక్కమాట అడిగాడనుకో, మొత్తం బయటకు వచ్చేది.”
“చాల్లే వాడు మాత్రం సంహిత ఇంటినుండే వచ్చాం అని చెబుతాడు” అంది రవళి.
“లేదులే నిజం నాకు తెలుసు. లెక్కలు చేశాం అని సంహిత చెబుతోంది. నీ లెక్కల బుక్ నీ బుక్స్ లోనే వుండిపోయింది. నువ్వు సినిమాకి తీసుకువెళ్ళింది సోషలు నోట్సు. అదీ సంహిత హ్యాండ్‍బాగ్‍లో వుండిపోయింది అవునా.”
“అంటే నేను లేనప్పుడు నా బుక్స్ చెక్ చేస్తున్నావన్నమాట” కోపంగా అంది రవళి.
“కోపం తెచ్చుకోకు. నీకు, సంహితతో సినిమాకి వెళ్ళాలనిపిస్తే యింట్లో చెప్పే వెళ్ళవచ్చుకదా! మీతో నీరజ కూడా వచ్చిందా?”
“రాలేదు” పరధ్యానంగా అనేసి నాలిక్కరుచుకుంది రవళి. స్నేహ నవ్వేసింది.
“చెప్పానుగా నీకు అబద్ధాలు ఆడడం రాదని. అక్కా మనింట్లో అబద్ధాలాడడం, మోసాలు చెయ్యడం చాలా నేరం అని అమ్మ చెబుతుంటుంది. అది నువ్వెలా మరిచిపోయావ్.”
“అబ్బా వదిలెయ్యవే, అమ్మకు తెలియనిది నీకెలా తెలిసింది సినిమాకు వెళ్ళినట్టు.”
“ఓ… ఇదో ప్రశ్నా నీ బట్టలనుంచి ఒకటే సిగరెట్ వాసన. మనం సినిమాకు వెడితే రాగానే అమ్మ ఆ బట్టలు మార్చుకొమ్మని మర్నాడు ఆ బట్టలు వుతికిస్తుంది. మర్చిపోయావా?”
రవళికి నోటివెంట మాట రాలేదు. స్నేహ మాట్లాడినవన్నీ నిజాలే… అప్పుడామె తనకంటే నాలుగేళ్ళు చిన్నదానిగా కాదు, పెద్దదానిలా మాట్లాడింది.
ఇంతలో కిందనుంచి ఆదిలక్ష్మి “స్నేహా! ఎక్కడున్నావ్? నీకోసం దుర్గ వచ్చింది” అని పిలిచింది.
స్నేహ కిందికి వెళ్ళిపోయింది. రవళి వారపత్రిక చదవలేకపోయింది. పల్లెనుంచి తాతగారు పంట డబ్బులు తీసుకువెళ్ళడానికి రమ్మని ఉత్తరం రాశారు. జగన్నాధంగారు తను వెళ్ళలేక రవిని పంపించారు. బహుశ రవి రేపు ఊరునుండి రావచ్చును. అతనికి యిదంతా తెలుస్తుందా? స్నేహకు ఉత్సాహం ఎక్కువ. రాగానే అన్నకి యిదంతా చెబితే. ఆమె డాబా దిగి స్నేహ కోసం చూసింది. ఆమె పెరటి అరుగుమీద కూర్చుని జామకాయలు తింటోంది.
“ఏమిటే ఈ పిచ్చి తిండి. మనం టిఫిన్ తిని పూర్తిగా గంట కూడా కాలేదు” అంది రవళి.
“నాకు తినాలనిపించింది, అయినా జామకాయ చాలా తియ్యగావుంది నీకు తీసుకురానా.”
“ఎక్కడివి, ఈ కాయలు?”
“అన్నయ్య తెచ్చాడు, మామ్మ పంపించారు”
అన్నయ్య వచ్చేశాడా…
“స్నేహా ఈరోజు జరిగినది అన్నయ్యకు చెప్పకు. అసలే వాడికి సంహిత అంటే అంత యిష్టం వుండదు.”
“ఛీ…. నేనలా బ్లాక్‌మెయిల్ చేసేదాన్ని కాదక్కా” అంది స్నేహ.
ఇది నాకంటే ఖచ్చితంగా పెద్దదే… అనుకుంది రవళి.
(ఇంకా ఉంది)