[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
భావయన్త్ర నిసర్గ భుంగురత రాస్తిష్టన్తి నేతే చిరం చేతః కాచ ఘటస్య తస్య ఘటతే దీర్ఘో యమేకో గుణః।
యత్తస్మిన్నిహిత ప్రరూఢి నగలత్యాయాతి నమ్లానతాం ధత్తే నాపచయం చమత్కృతి వచో గీర్వాణగంగా పయః॥
(కల్హణ రాజతరంగిణి 7, 483)
[dropcap]క[/dropcap]లశుడిని బంధించాలని అనంతుడు చేసిన విఫల ప్రయత్నం రాణి సూర్యమతికి ఆగ్రహం కలిగించింది. ఆమె భర్తని తిట్టి కొడుకు దగ్గరకు వెళ్ళింది. అయితే, కలశుడికి కాపలాగా ఉన్న బిజ్జుడు రాజును చూసేందుకు ఒక్కొక్కరికే అనుమతినివ్వటం అనంతుడికి ఆగ్రహం కలిగించింది. అతడి అహం దెబ్బతిన్నది. దాంతో అతడు అన్నీ వదలి విజయేశ్వర క్షేత్రానికి బయలుదేరాడు.
శ్రీనగరం వదిలి వెళ్తున్న అనంతుడిని, అతడి భార్య సూర్యమతిని పద్మపురం వద్ద పెద్దలు, బ్రాహ్మణులు ఆపారు. అనంతుడికి నీతులు చెప్పారు. అతడు కోపంతో ఇలా అన్నీ వదిలి వెళ్లటం తన సంతానం చెడును బహిరంగం చేయటమే అన్నారు. పైగా ధనం అంతా వదలి కట్టుబట్టలతో వెళ్ళటం వల్ల సాధించేదేమీ లేదని, ధనం వెంట తీసుకువెళ్ళమని సలహా ఇచ్చారు. ఇదే సమయానికి కలశుడు, అతని భార్యతో వచ్చి అనంతుడిని వెనక్కి రమ్మని బ్రతిమిలాడేడు. అనంతుడు, కలశుడి మాట కాదనలేక వెనక్కు వచ్చాడు కానీ అతడి ఆగ్రహం తగ్గలేదు. శ్రీనగరం చేరిన అనంతుడు కదల్చలేని భవనాలను తప్ప, మిగతా ఆస్తినంతా మూట కట్టుకుని నది దాటి ఆవలి వైపు భార్య కోసం ఎదురుచూస్తూ ఆగాడు.
ఇక్కడి నుంచి జరిగే సంఘటనలు కశ్మీరు భవిష్యత్తుపై తిరుగులేని ప్రభావం చూపించాయి. భారతీయ ధర్మంలో తల్లిదండ్రులు దైవసమానులు. రాజు విష్ణువు. అందుకనే పితృవాక్యపరిపాలనకు అంత ప్రాధాన్యం. కుటుంబాన్ని పోషించే తండ్రి కుటుంబానికి దైవం. రాజ్యాన్ని పాలించే రాజు ప్రజలకు దైవం. ప్రాచీన భారతంలో ఆధికారం ఒక బాధ్యత. దైవదత్తమైన పవిత్ర బాధ్యత. అందుకే ధర్మం కోసం యుద్ధాలు జరిగాయి తప్ప అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలు లేవు. కశ్మీరు చరిత్రలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
రాజుకు వారసులు లేకపోతే, మంత్రులు, పెద్దలు, కొన్ని సందర్భాలలో ప్రజలు, ఉత్తమమైన వాడిని, అర్హతలున్న వాడిని రాజుగా ఎంచుకోవటం కనిపిస్తుంది. అంతే తప్ప, రాజుకు వారసులు లేరు కాబట్టి, ‘రాజ్యాన్ని కబళిద్దాం’ అన్న దురాలోచనలు, కుట్రలు, కుతంత్రాలు కనబడవు. కానీ కాలక్రమేణా విదేశీ సంపర్కంతో పరిస్థితిలో మార్పు గమనించవచ్చు. అధికారం కోసం ఏమైనా చేయటం, ఎవరితోనైనా చేతులు కలపటం, రాజు అంటే లెక్క లేకపోవటం కనిపిస్తుంది. దాంతో రాజు అంటే ‘దైవం’ అన్న భావన మిగిలింది తప్ప రాజు ప్రజలకు తండ్రి లాంటి వాడని, రాజ్యాధికారం ఒక బాధ్యత అన్న భావన అడుగంటింది. ఎలాగొలా అధికారం సాధించిన వారు బాధ్యతలను విస్మరించి సౌఖ్యలాలసలో, ధనార్జనలో సర్వం మరచిపోవటం, ప్రజలను పీడించటం కనిపిస్తుంది. దీనికి తోడు తండ్రి కొడుకుల నడుమ అధికార పోరు జరగటం కూడా ఆరంభమయింది. ఈ తండ్రి కొడుకుల పోరును ఆధారం చేసుకుని, అధికారంపై ఆశ కలవారు ఏదో ఓ వైపు చేరి కుట్రలు చేయటం ఆరంభమయింది. దాంతో ఇరుగుపొరుగున ఉన్న రాజ్యాలు కశ్మీరు రాజకీయాలలో జొరబడి కశ్మీరు అధికారం కోసం పోటీ పడటం మొదలయింది. ఫలితంగా కశ్మీరు రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా బలహీనమవటం వేగవంతమయింది. ఈ అల్లకల్లోల పరిస్థితులలో శక్తివంతుడయిన వాడు అధికారాన్ని అందుకునే వీలు కలిగింది. ఇది కశ్మీరు భవిష్యత్తుపై తిరుగులేని రీతిలో ప్రభావం చూపించింది. దీనికంతటికీ కలశుడు, అనంతుల నడుమ ‘పోరు’ నాందీ ప్రస్తావన లాంటిది.
అనంతుడు ఐశ్వర్యం సర్వం తీసుకుని విజయేశ్వరక్షేత్రం చేరుకున్నాడు. దారికి రెండు వైపులా ప్రజలు కన్నీళ్ళతో ఒకప్పటి రాజుకు వీడ్కోలు తెలిపారు. అనంతుడితో పాటు, మంత్రులు, అధికారులు, సైనికులు కూడా అనంతుడిని అనుసరించారు. రాజపుత్రులు, దామరులు కూడా అనంతుడికి అండగా నిలబడ్డారు. ఇది కలశుడిలో అభద్రతా భావాన్ని పెంచింది. ఎందుకంటే, శ్రీనగరం ఖాళీ అయిపోయింది. శక్తిమంతులు అయినవారంతా అనంతుడి వైపు వెళ్ళిపోయారు. అతడి సలహాదారులంతా అనంతుడి నుంచి రక్షణ అవసరం అని నూరిపోయటంతో కలశుడు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అనంతుడి పైకి దాడికి బయలుదేరాడు.
ప్రశాంతంగా దైవ ప్రార్థనలో శేష జీవితం గడుపుతున్న అనంతుడిపైకి కలశుడు దండెత్తి రావటం, అందరిలో నిరసన కలిగించింది. అనంతుడి ఆగ్రహాన్ని మరింత పెంచింది. దాంతో ప్రశాంతమయిన విజయేశ్వరక్షేత్రం యుద్ధభూమిలా మారింది. కానీ పుత్రవాత్సల్యంతో సర్వం మరిచిన సూర్యమతి యుద్ధం జరగనివ్వలేదు. కొడుకు దగ్గరకు బ్రాహ్మణులను దూతలుగా పంపింది. అనంతడు స్వచ్ఛందంగా కలశుడికి రాజ్యం అప్పజెప్పాడన్న విషయం గుర్తు చేసి, అనంతుడి ఆగ్రహావేశాలకు బలి కావద్దని, తండ్రి కొడుకుల నడుమ చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునేవారి కపట నాటకాల ప్రలోభంలో పడవద్దని హెచ్చరించింది. తల్లి పంపిన సందేశం విన్న కలశుడు సైన్యంతో కశ్మీరు తిరిగి వెళ్ళిపోయాడు. దాంతో తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం తప్పిపోయింది. కానీ వైరం, ద్వేషభావనలు, అభద్రతా భావనలు సమసిపోలేదు.
కలశుడు సైన్యంతో వెనుతిరిగిన తరువాత సూర్యమతి భర్త అనంతుడిని దూషించింది. సూర్యమతి మాటలు అనంతుడి మనసును గాయపరిచాయి. అతడు నిత్య జీవిత కార్యకలాపాల నుంచి విరమించి దైవధ్యానంలో సమయం గడపసాగాడు. కానీ శత్రుత్వం అన్నది ఒక్కసారి మనసులో ప్రవేశిస్తే సర్వనాశనం చేసి కాని సమసిపోదు అని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు. కలశుడు శ్రీనగరం చేరిన తరువాత ప్రతీకారపు చర్యలు ఆరంభించాడు. అనంతుడి సమర్థకులందరినీ ఏరి వేయటం ప్రారంభించాడు. వారి ఆస్తులను దోచుకోవటం, ఇళ్ళను తగులపెట్టటం, ఏదో సాకుతో జైళ్ళలో తోసి ఇబ్బందుల పాలు చేయటం ఆరంభించాడు. ఇది మనం ప్రస్తుత సమాజంలోనూ చూడవచ్చు. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాలలోనూ, నియంతృత్వ పాలనలోనూ తన వ్యతిరేకులను, వ్యతిరేకుల సమర్థకులను ఏదో ఓ రకంగా ఇబ్బందుల పాలు చేయటం ఆధునిక రాజకీయాలలో సర్వసాధారణమయిపోయింది. అందుకే నేర చరితులు, దోషులు అధికార పక్షాలలో చేరిపోవటం, వారిపై ఉన్న నేర పరిశోధనలు నిద్రపోవటం, మళ్ళీ ఎన్నికల సమయంలో పాత నేరాలను తిరగతోడటం వంటివే కాదు, నేర పరిశోధన నుంచి తప్పించుకోవటం కోసం ఏ పార్టీ అధికారంలోకి వచ్చే వీలుందో ఆ పార్టీలోకి దూకటం వంటి వికృతాలన్నిటికీ ఆరంభం కశ్మీరు రాజకీయాలలో గమనించవచ్చు. అయితే పురాణకాలంలో ప్రత్యర్థులను అనవసరంగా హింసించే వారిని ‘రాక్షసులు’ అనేవారు. తన సింహాసనానికి భంగం కలిగే వీలుందని కంసుడు, దేవకీ వసుదేవులను చెరలో పెట్టి హింసించినందుకు రాక్షసుడయ్యాడు. కానీ రాను రాను ఇలా ప్రత్యర్థులను బాధలు పెట్టి హింసించేవారు రాజకీయ నాయకులయ్యారు. ప్రజల భాగ్య విధాతలుగా మన్ననలందుకుంటున్నారు.
తన సమర్థకులను తన కొడుకు హింసిస్తున్నాడని తెలిసి కూడా అనంతుడు మౌనంగా ఉండాల్సి వచ్చింది. సూర్యమతి మాత్రం పుత్ర ప్రేమతో అంధురాలయి కొడుకు తప్పులన్నీ విస్మరిస్తూ వచ్చింది. అయితే ఒకరొకరుగా వచ్చి అనంతుడిని మళ్ళీ రాజ్యాధికారం స్వీకరించమని అభ్యర్థిస్తూండటంతో అనంతుడు యుద్ధం చేయాలన్న ఆలోచనలు చేశాడు. కలశుడి సైన్యంపై కానీ, వీరుల వీరత్వంపై కానీ అనంతుడికి నమ్మకం లేదు. సమయం వస్తే వారెవరూ కలశుడికి అండగా నిలబడరని అనంతుడికి తెలుసు. అందుకే యుద్ధానికి సిద్ధమయ్యాడు.
ఇదంతా గమనిస్తున్న సూర్యమతికి ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే తన వంశానికి హాని అని అర్థమయింది. అందుకని అనంతుడిని రెచ్చగొట్టింది. కలశుడిని గద్దె దింపటం బదులు కలశుడి కొడుకు, అంటే, వాళ్ల మనవడు హర్షుడికి మద్దతునిచ్చి అతడిని రాజుగా నిలుపుదామని బోధించింది. అప్పటికే తన కొడుకు హర్షుడు తనకు పోటీ అవుతాడేమోనని కలశుడు అతని ఇంటి చుట్టూ కాపలా ఉంచాడు. తాతగారి నుంచి సమాచారం అందుతూనే హర్షుడు కాపలావారిని తప్పించుకుని విజయేశ్వరక్షేత్రం చేరుకున్నాడు. తాతగారి కాళ్ళ మీద పడ్డాడు. ఇది తెలిసిన కలశుడు తల్లి సూచనలను అనుసరించి తన క్రోధం కానీ భయం కానీ బయటపెట్టలేదు. ఏమీ కానట్టు కొడుకుతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపాడు. కానీ ఇద్దరి మధ్య వైరం రగులూతూనే ఉంది. ఈ అంతర్యుద్ధం వల్ల కశ్మీరం బలహీనమవటం గమనించిన ఇరుగుపొరుగు రాజులు కశ్మీరు వ్యవహారాల్లో తల దూర్చటం ఆరంభించారు. సరిహద్దు గ్రామాలను దోచుకోవటం ప్రారంభించారు. ఈ ఇరువురి వైరం కశ్మీరుకు ప్రమాదకరంగా పరిణమించటం చూసిన బ్రాహ్మణ సమూహం ఇద్దరూ వైరం వదలి ఏకమవ్వలని ‘నిరసన వ్రతం’ ఆరంభించింది. ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా కనిపిస్తాయి.
కశ్మీరు రాజకీయాలను ఒక మహిళ – సూర్యమతి – నిర్దేశించిన విధానం గొప్పది. భర్త రాచకార్యాలు పట్టించుకోనప్పుడు ఆమె రాజ్య కార్యభారం సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలందుకుంది. కానీ పుత్ర ప్రేమ వల్ల రాజ్యం అతనికి ఇంకా బాల్యంలోనే కట్టపెట్టింది. అతడి అన్ని దుశ్చర్యలను భరించింది. భర్త ఆవేశాన్ని అణచింది. పుత్రుడు దుష్టుడని తెలిసినా, తమకు అన్యాయం చేస్తున్న అతడిని సమర్థించింది. ఈ రకంగా ఆమె కశ్మీరు అంతః కలహాలతో బలహీనమవటంలో తన వంతు తోడ్పడింది. కశ్మీరులో సామాజిక రాజకీయ జీవనంలో బ్రాహ్మణ సమూహాలు నిర్ణయాత్మకంగా వ్యవహరించటం – ఇప్పటి ‘ఆందోళన జీవుల్లా’, రాజకీయ లబ్ధి కోసం బ్రాహ్మణ సమూహాలను వాడుకోవటం – ఎవరు అధిక ధనం ఇస్తే వారిని వీరు సమర్థించటంతో పాటుగా, రాజ్య పరిస్థితి మెరుగుపడటం కోసం నిరసన వ్రతానికి దిగి ఈ పోరుకు దిగుతున్న పక్షాల నడుమ సంధి నెరపి, పరిస్థితులను చక్కబెట్టటం గమనించవచ్చు. ఇది ఆనాటి సమాజంలో బ్రాహ్మణ సమూహాల ప్రాధాన్యం స్పష్టం చేస్తుంది. వారొక శక్తివంతమైన కూటమిలా నిలిచి రాజ్యానికి మనస్సాక్షిలా వ్యవహరించేవారనీ, అది వారి ప్రాధాన్యం అని తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదో, అప్పుడప్పుడు వారిని ప్రజలు దూషించేవారని తెలుస్తోంది. కొద్ది కాలం కశ్మీరంలో శాంతి నెలకొంది. అనంతుడు శ్రీనగరంలో ఉన్నాడు. కానీ కలశుడు తమని బంధించేందుకు పన్నాగాలు పన్నుతున్నాడని తెలిసిన అనంతుడి మనసు మళ్ళీ విరిగింది. సూర్యమతి ఎంత చెప్తున్నా వినకుండా విజయేశ్వరక్షేత్రం బయలుదేరాడు.
అనంతుడు, సూర్యమతిల కథ అపరిమితమైన పుత్రప్రేమ వల్ల కలిగే అనర్థాలను ప్రదర్శిస్తుంది. వారు రాజులు అవటం వల్ల దేశం అల్లకల్లోలమయింది. ఆధునిక సమాజంలో కూడా పుత్ర ప్రేమతో వారెన్ని దుష్టుపు పనులు చేసినా నాయకులయిన తల్లిదండ్రులు వారిని రక్షించటం, వారికి అధికారం కట్టబెట్టటం కోసం దేశాన్ని అల్లకల్లోలం చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రజాస్వామ్యంలో కూడా వంశ పారంపర్య పాలన కొనసాగించాలని తపన పడటం, ప్రజలు కూడా ఆ వంశం వారికి మాత్రమే పాలనార్హత ఉన్నట్టు భావించటం, కాలం మారినా, వ్యవస్థ మారినా, మారని సామాజిక మనస్తత్వాన్ని స్పష్టం చేస్తుంది. ఇదంతా ప్రాచీన భారతంలో లేనిది, మధ్య భారతంలో మొదలై నుంచి ఆధునిక భారతానికి సంక్రమించిన వికృతి అనీ కశ్మీరు చరిత్రను గమనిస్తే తెలుస్తుంది.
అనంతుడిని కారాగారంలో బంధించటం వీలు పడదని గ్రహించిన కలశుడు, అతడి ప్రయాణాన్ని ఆపుచేయాలని ప్రయత్నించాడు. గుర్రాలు తినే గడ్డికి నిప్పు పెట్టాడు. అతడి సైనికులు, సేవకులకు విషం ఇప్పించాడు. మిగిలిన వారిని చంపించాడు. ఇలా ఇరువురి మధ్య వైషమ్యాలు పెరుగుతున్నా, కలశుడు, అనంతుడిని కష్టపెడుతున్నా, సూర్యమతి అధిక ప్రేమతో – కలశుడికి వ్యతిరేకంగా అనంతుడు ఎలాంటి చర్యలు చేపట్టకుండా – అనంతుడికి అడ్దు పడుతూ వచ్చింది. అనంతుడు, సూర్యమతి తమ వద్ద ఉన్న ధనాన్ని దానధర్మాలలో వినియోగించటం వల్ల ప్రజలలో వారి పట్ల అభిమానం అధికమవుతూ అది తన పట్ల వ్యతిరేకతగా పరిణమిస్తోందని గ్రహించిన కలశుడు వారు ఉంటున్న నివాసాలకు నిప్పు పెట్టించాడు. తమ సర్వం పరశురామ ప్రీతి కాగా, ఆస్తి అన్నదంతా బూడిద అయిపోగా, కట్టుబట్టలు తప్ప మరేమీ లేక నడివీధిలో నిలబడ్డారు అనంతుడు, సూర్యమతి. ఆకాశం తప్ప కప్పుకోవటానికి మరొకటి లేక నడివీధిలో నిలబడ్దారు ఆ దంపతులని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు. ఇదంతా జరుగుతున్నప్పుడు తన భవనం పైన నిలబడి కలశుడు భుగభుగలాడుతూ సర్వం కబళిస్తున్న అగ్నిశిఖల కదలికలను అనుసరించి ఆనందంతో నృత్యం చేశాడు. ఈ సమయంలో శోకంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సూర్యమతిని నివారిస్తారు. ఇంత జరిగినా ఆమె కలశుడిని ద్వేషించదు.
దుఃఖభారంతో కట్టుబట్టలతో శ్రీనగరం విడిచి నది దాటారు దంపతులిద్దరూ. నదినయితే దాటారు కానీ వారిద్దరూ శోక సముద్రంలో మునిగిపోయారని వ్యాఖ్యానిస్తాడు కల్హణుడు. తెల్లారి బూడిదలో రాణికి వజ్రాల శివలింగం కనిపిస్తుంది. దాన్ని అమ్మి ఆమె ఆహారాన్ని కొన్నది. ముందు పరివారంలోని వారందరికీ ఆహారాన్ని అందించింది. ఇటువంటి పరిస్థితులలో కూడా సేవకులు, వెన్నంటి ఉన్నవారికి ఆహారాన్ని, బట్టలను ఇచ్చిన తరువాతనే ఆమె తన గురించీ, తన భర్త గురించీ ఆలోచించింది. ఇంత గొప్ప కర్తవ్య పరాయణత కల మహిళలు భారతదేశానికే ప్రత్యేకం. అయితే అంధ పుత్ర ప్రేమ ఆమె బలహీనత. ఇది కూడా భారతీయ మహిళలకు ప్రత్యేకం.
సేవకులంతా బూడిదలో వెతికి మణిమాణిక్యాలను తీసి అమ్మగా వచ్చిన ధనంతో గుడారాలు నిర్మించుకున్నారు. ఒకప్పటి కశ్మీరు సామ్రాజ్యాధీశుడు, తన కొడుకు రాజుగా ఉన్న రాజ్యంలో, ఓ మైదానంలో, కాందిశీకుల్లా నివసించాల్సిన దుస్థితిని అనుభవించటం, అతి దుర్భరమైన దుస్థితి. తమ దేశంలోనే కాందిశీకుల్లా నివసించాల్సి వచ్చిన కశ్మీరు పండితుల దుర్భర దుస్థితితో ఆనాటి అనంతుడి దౌర్భాగ్యాన్ని పోల్చవచ్చు. అయితే కలశుడు అలా కూడా అనంతుడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. మాటిమాటికీ రాజధానికి దూరంగా ‘పర్ణోత్స’కు వెళ్ళిపోమని సందేశాలు పంపించేవాడు. సూర్యమతి సైతం ‘పర్ణోత్సకు వెళ్ళిపోదాం కలశుడు చెప్పినట్టు’ అని చెవినిల్లు కట్టుకుని పోరటంతో, ఓ రోజు అనంతుడు విచక్షణను కోల్పోయాడు. అందరిముందూ సూర్యమతిని నానా దుర్భాషలాడేడు. చివరికి ప్రజలనుకుంటున్నట్టు కలశుడు ఆమెకు హలధరుడితో సంబంధం వల్ల పుట్టినవాడు కాబట్టే తండ్రికాని తనను ఇంతగా వేధిస్తున్నాడని నోరు జారాడు. దాంతో సూర్యమతి కూడా అవమానంతో, ఆవేశంతో విచక్షణ కోల్పోయింది. ఒక మహిళను మానసికంగా దెబ్బ తీయాలంటే పురుషుడి దగ్గర ఉన్న తిరుగులేని వజ్రాయుధం ఆమె శీలాన్ని శంకించటం. ఆమె వ్యక్తిత్వంపై బురద చల్లటం. అనంతుడు అదే చేశాడు. దాంతో సూర్యమతి కూడా అంతవరకూ ఉన్న సంయమనాన్ని కోల్పోయింది. ఒక మహిళ పురుషుడి బలహీనతపై దెబ్బ కొట్టేందుకు ఏం చేస్తుందో అదే చేసింది.
(ఇంకా ఉంది)