[dropcap]ర[/dropcap]చయిత అనామకుడికి దర్శకుడు విశ్వనాథ్ గారంటే తీవ్రమైన అభిమానం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘ఆయన (విశ్వనాథ్) సినిమాలు చూస్తూ, ఆనందిస్తూ కన్నీళ్ళు కారుస్తూ – నేను పొందుతున్న అనుభూతిని అక్షరబద్ధం చెయ్యాలని ఆలోచించడం మొదలుపెట్టాను’. ఆ ఆలోచన కార్యరూపం దాల్చటం ఫలితమే – ‘విశ్వనాథ్ విశ్వరూపం’ అన్న పుస్తకం.
తనికెళ్ళ భరణి ఈ పుస్తకం ముందుమాటలో “విశ్వనాథ్ గారి సినిమాలను… పరమ పవిత్రమైన మనస్సుతో చూసి… పరిశీలించి… పరీక్షించి… పరామర్శించి… పరవశం చెందిన తర్వాత తప్ప ఇలాంటి… పుస్తకం రాయడం అసాధ్యం….” అని వ్యాఖ్యానించారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి తన ముందుమాటలో “శ్రీ విశ్వనాథ్ గారి నిర్దేశకత్వంలో, దర్శకత్వంలో, దార్శనికతలో సాకారమైన భావాలను అంతశ్చక్షువులతో చూడగలగాలి. ఆత్మసాక్షిగా దర్శించగలగాలి. మనస్సుతో అనుభూతించగలగాలి. అలాచేసి, శ్రీ రామశాస్త్రి గారు శ్రీ విశ్వనాథ్ గారి తపస్సునీ, ఆ తపః ఫలాల్ని తెలుగు ప్రజలకి, చలనచిత్ర వీక్షకులకి సముచితంగా అందించగలిగారు.” అన్నారు.
రచయిత రాసిన ‘ప్రేరణ’లో “ఆయన (విశ్వనాథ్) చలన చిత్రాల ఉద్యానవనంలో విహరిస్తూ నా మనస్సుకి ఆహ్లాదాన్నో, ఆనందాన్నో, ఆర్ద్రతనో ఇచ్చిన కొన్ని పువ్వులను కోసుకుని ఆయనకి సమర్పించుకుంటున్న మాల ఇది. ఈ మాలలో ఆయన మీద నాకున్న గౌరవం, ప్రేమ, అభిమానం మాత్రమే ఉన్నాయి” అని స్పష్టం చేశారు. అంటే ఒక రకంగా ఈ పుస్తకం రచయిత, దర్శకుడు విశ్వనాథ్ గారికి సమర్పిస్తున్న వ్యక్తిగత నీరాజనం అన్నమాట. ఈ పుస్తంలో రచయిత వ్యక్తిగత భావనలు, అభిప్రాయాలు, ఆనందాలు, ఆవేశాలు, సంతృప్తులు పొందుపరిచి ఉన్నాయి తప్ప, ఎవరయినా, ఇతర అంశాల కోసం వెతకవద్దని ఆయన స్పష్టం చేశారు. “ఈ పుస్తకం చదివే పాఠకుల కన్నా విశ్వనాథ్ గారి చిత్రాల గురించి నాకు ఎక్కువ తెలుసునేమోనన్న భ్రమ కానీ, తెలుసునన్న అహంకారం కానీ అణువంత కూడా లేవు నాకు. ఆయన దర్శకత్వ సౌందర్యాన్ని ఆయన అభిమానులం అందరం కలిసి ఆస్వాదించడానికి ఈ చిరు పుస్తకం ఒక ఉపకరణం అవుతుందనీ, అవాలనీ ఆశ” అని ఆయన తన ముందుమాటలో ‘స్పష్టం’గా చెప్పారు.
సినిమా అన్నది ఒక సామూహిక కళ. పలు కళాకారులు తమ సృజనాత్మకతను దర్శకుడి మార్గదర్శకత్వంలో, ఆయన అభిరుచి, ఆలోచన, ఉహలకు తగ్గ రీతిలో ప్రవహింప చేసి ప్రదర్శించే సామూహిక కళ. విభిన్న కళాకారుల వైవిధ్యమైన సృజన మిళితమై కలిసి ‘ఒకటి’గా అందే పరమాద్భుతమైన కళాస్వరూపం ‘సినిమా’. సినిమా గొప్పతనం ఏంటంటే, సినిమా దర్శనం సామూహిక దర్శన అనుభవం అయినా, ‘అనుభూతి’ మాత్రం ఎవరికి వారికే ప్రత్యేకం. తెరపై కనబడే దృశ్యాన్ని అనుభవించటం, అర్థం చేసుకోవటం, అన్వయించుకోవటం, ఆనందించటం ఎవరికి వారికి ప్రత్యేకం. ఒకరికి నచ్చిన దృశ్యం మరొకరికి నచ్చాలని లేదు. ఒకరికి మరపురానిదిగా అనిపించిన సంభాషణ ఇంకొకరు మెచ్చాలని లేదు. ఒకరి హృదయాన్ని కరిగించిన సంఘటన మరొకరికి హాస్యాస్పదం అనిపించవచ్చు. కాబట్టి ‘సినిమా’ విషయంలో ఎవరి అభిరుచి వారిది. ఎవరి అవగాహన వారిది. ఎవరి ఆనందం వారిది. ఈ పుస్తకం రచయిత అనామకుడి అనుభూతి, అవగాహన, అభిరుచి, ఆనందాలకు ప్రతిరూపం. విశ్వనాథ్ సినిమాల పట్ల వారికే ప్రత్యేకమైన దర్శనానుభూతికి దర్పణం పడుతుందీ పుస్తకం. పుస్తకం చదివేవారు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ‘దీనికన్నా అది చక్కటి సినిమా’, ‘ఆ గొప్ప దృశ్యం ఈ పుస్తకంలో లేదు’, ‘ఆ పాట లేదు’ అన్న ఆలోచనలకు తావివ్వకుండా ఈ పుస్తకాన్ని పఠించి అనుభవించాల్సి ఉంటుంది.
విశ్వనాథ్ విశ్వరూపాన్ని రచయిత ఏడు అధ్యాయాలలో ప్రదర్శించారు. పది ప్రత్యేకతలు, శంకరాభరణం, అటూ ఇటూ ఐదేసి చిత్రాలు, పది చిత్రాలు – పది పాటలు, మరపురాని సన్నివేశాలు, సహ కళాకారులు, అందానికి అందాలు అన్నవి ఈ ఏడు అధ్యాయాలు. చివరలో ‘అనుబంధం’లో విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాలు, నటించిన సినిమాల జాబితాలున్నాయి. అతి చక్కని కాగితంపై ఎంతో ముచ్చటయిన అక్షరాలతో, అలరించే అందమైన అరుదైన బొమ్మలతో ఉన్న ఈ పుస్తకం ‘కలెక్టర్స్ ఐటమ్’గా నిలుస్తుంది. విశ్వనాథ్ అభిమానులు, సినిమా పట్ల ఆసక్తి కలవారు తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాల్సిన రిఫరెన్స్ పుస్తకం ఇది.
‘ప్రవేశిక’ అధ్యాయంలో రచయిత ‘సినిమా’ అన్న శీర్షికన సినిమాతో, విశ్వనాథ్ సినిమాలతో తన పరిచయాన్ని నెమరు వేసుకున్నారు. దర్శకుడు అంటే తన అవగాహన ఏమిటో వివరించారు. తరువాత విశ్వనాథ్ గారి వ్యక్తిత్వాన్ని, కళాసృజన పట్ల ఆయన నిబద్ధతని వివరించారు. విశ్వనాథ్ సినిమాలలో ఐదు ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా ‘విశ్వనాథ్ గారి చిత్రాలు అమ్మ ఆప్యాయంగా వండి వడ్డించే భోజనాలు. కుటుంబం అంతా హాయిగా కూచుని కలసి తినే ఇంటి భోజనాలు. అందుకే ఎన్ని సార్లు తిన్నా రుచిగా తృప్తిగా అనిపిస్తాయే తప్ప విసిగించవు, వెగటుపుట్టవు’ అన్న వ్యాఖ్యతో ఏకీభవించనివారు అరుదు. తరువాత పుస్తక రచనలో తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలుపుతారు. ‘ఈ పుస్తకం నేను రాసుకున్నది నా ఆత్మానందం కోసమే’. రాసినందుకు నాకెంతో తృప్తిగా ఉంది అంటారు. ఇకపై పుస్తకం ఆరంభమవుతుంది. పుస్తకం ఆరంభంలోనే పఠితకు ఎలాంటి సందేహాలు, అపోహలు లేకుండా ఇది తన ఆత్మానందం కోసం రాసిన పుస్తకం అని స్పష్టం చేయటం అభినందనీయం.
మొదటి అధ్యాయం విశ్వనాథ్ సినిమాలలోని పది ప్రత్యేకంగా కనిపించే అంశాలను తెలిపి, ఒక్కో అంశం గురించి ఉదాహరణలు చూపుతుంది. ‘శంకరాభరణం’ గురించి ఓ ప్రత్యేక అధ్యాయం సముచితం. ఈ అధ్యాయంలో శంకరాభరణం చూస్తూ తను పొందిన అనుభూతులను పది సన్నివేశాల ఆధారంగా వివరించారు. ‘అటూ ఇటూ ఐదేసి చిత్రాలు’ అంటే శంకరాభరణం ముందూ తరువాత అయిదయిదు చిత్రాలన్న మాట. ఈ విభజన సరైనదే. ఎందుకంటే ‘శంకరాభరణం’ సినిమా తరువాత విశ్వనాథ్ సినిమాలు వేరు. అంతకు ముందు సినిమాలు వేరు. చెల్లెలి కాపురం, కాలం మారింది, నేరము శిక్ష, ఓ సీత కథ, సిరిసిరిమువ్వ సినిమాలు శంకరాభరణం కన్నా ముందు సినిమాలు. సప్తపది, శుభలేఖ, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వాతికిరణం – శంకరాభరణం తరువాత సినిమాలు. ఈ పది సినిమాల ప్రత్యేకతలను, తనకు నచ్చిన అంశాలను సూటిగా, సరళంగా ఈ విభాగంలో వివరిస్తారు.
తరువాతి అధ్యాయంలో పది సినిమాల నుంచి పది ఎంపిక చేసిన పాటలు, పాటల చిత్రీకరణలో ప్రత్యేకతలు, పాటల్లోని పదాల వైశిష్ట్యం వివరిస్తారు రచయిత. ఈ ఎంపిక రచయిత అనుభూతి ప్రకారమే తప్ప పాట పాపులారిటీని అనుసరించి కాదన్నది పాఠకుడు దృష్టిలో ఉంచుకోవాలి. పది మరపురాని సన్నివేశాలను చదివి అనుభవించేటప్పుడు కూడా రచయిత ఆరంభంలోనే స్పష్టం చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సహ కళాకారులు అధ్యాయంలో విశ్వనాథ్‌తో కలిసి పని చేసిన కళాకారులు; ‘అందానికి అందాలు’ అధ్యాయంలో విశ్వనాథ నాయికల వివరాలున్నాయి. పుస్తకం చివర్లో కొన్ని అరుదైన ఫొటోలు ఉన్నాయి.
విశ్వనాథ్‍కు సంబంధించిన వివరాలు, సినిమాల విశ్లేషణతో పాటు ఆయనతో పనిచేసిన కళాకారుల వివరాలు పొందుపరచటం వల్ల పుస్తకం కేవలం వ్యక్తిగతానుభూతి స్థాయిని దాటి రిఫరెన్స్ బుక్‍లా ఎదుగుతుంది. దర్శకుడు విశ్వనాథ్ సినిమాల పట్ల ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా, ఆయన ప్రతిభ, నైపుణ్యం, సృజనాత్మకత్త, నిబద్ధతల పట్ల ఎలాంటి అనుమానాలు సందేహాలు ఉండవు. అలాంటి ఉత్తమ దర్శకుడికి వ్యక్తిగత నీరాజనం లాంటి ఈ పుస్తకం ఆహ్వానించదగ్గది.
విశ్వనాథ్ అభిమానులు ఈ పుస్తకంలోని పలు అంశాలు చదువుతూ ఆ సినిమాను మళ్ళీ చూస్తున్న అనుభూతిని, ఆనందాన్ని అనుభవిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాల పట్ల ఆసక్తి ఉన్న వారంతా చదవాల్సిన పుస్తకం ఇది. ధర కాస్త ఎక్కువ అనిపించినా, పుస్తకాన్ని ఖరీదైన కాగితంపై ముద్రించి అందించటం గమనిస్తే రచయిత శ్రమ, ఖర్చులు అర్థమవుతాయి. విశ్వనాథ్ పట్ల రచయిత ప్రేమాభిమానాలు కూడా స్పష్టమవుతాయి. అయితే ఇంతగా శ్రమకోర్చి, ఖర్చు భరిస్తూ తయారు చేసి అందించిన ఈ పుస్తకం గురించి పాఠకులకు ఇంకా సంపూర్ణంగా తెలియకముందే పుస్తకం పిడిఎఫ్‍లు అందుబాటులోకి రావటం ఖండించవలసిన విషయమే కాక శోచనీయమైన విషయం కూడా. ఒక రకంగా చూస్తే రచయిత శ్రమని హేళన చేసి వెక్కిరించటం లాంటిది. కాబట్టి పిడిఎఫ్‌లా కాక పుస్తకంలానే చదవండి. పిడిఎఫ్ అందుకున్నవారు విధిగా పుస్తకం కొని చదివితేనే భవిష్యత్తులో ఇలాంటి పుస్తకాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే, త్వరలో పుస్తకం అదృశ్యం అవుతుంది. పుస్తకం లేకపోతే పిడిఎఫ్‍లూ ఉండవు. తానున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖత్వాన్ని విడనాడి పుస్తకం కొని ఒక్కో పేపరు తిప్పుతూ చదువుతూ ఆనందించండి. మరిన్ని ఇలాంటి పుస్తకాలు ప్రచురించే ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వండి.
***
విశ్వనాథ్ విశ్వరూపం
రచన: అనామకుడు
పేజీలు: 214
వెల: ₹ 1000/-
ప్రచురణ: అపరాజితా పబ్లికేషన్స్,
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
80085 99901