కరనాగభూతం కథలు – 10 పిల్లికి చదువు

0
3

[box type=’note’ fontsize=’16’] బేతాళ పంచవింశతి లాగే కొత్త థీమ్‌తో కరనాగభూతం అనే శీర్షికతో వసుంధర సృజించిన పిల్లల కథలను అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి కాగానే రాజు పింగపాంగుడు పక్కమీంచి లేచి జిట్టీభనాథుడి ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ అతడికోసం ఎదురుచూస్తున్న కొండచిలువ వెంటనే నిలువెత్తున లేచి, “రాజా! నీకు ఆత్మవిశ్వాసం ఎక్కువే. కానీ అది మరీ ఎక్కువైతే, అహంకారంగా మారొచ్చు. అహంకారం పతనానికి దారి తీస్తుంది. ఒకప్పుడు వేదనాథుడనే పండితుడికి కూడా ఆత్మవిశ్వాసం విషయంలో ఇలాంటి సమస్యే వచ్చింది. ఇప్పుడు నీకా కథ చెబుతాను. విను” అంటూ కథ చెప్పసాగింది.

విగంధ దేశం విలక్షణం. అనేక వజ్రాల గనులతో సుసంపన్నం. పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడ్డ పొరుగు రాజ్యాల్లో అడపా తడపా కరువొస్తే, ఆదుకుందుకు ముందొచ్చేది విగంధరాజులే! అందుకని పొరుగు రాజ్యాలకు ఆ దేశమంటే గౌరవం, అభిమానం.

విగంధ పౌరులు పేదరికం ఎరుగని సుఖజీవులు. వారిలో అధికులు సోమరులు, చదువులేని మూర్ఖులు. వారికి రాజే దేవుడు. రాజు మాట శిలాశాసనం. మిగతావారిలో ఎవరైనా రాజు గురించి తప్పుగా మాట్లాడితే గట్టిగా మందలిస్తారు. వినకపోతే శిక్షిస్తారు. అందువల్ల అక్కడ ఎలాంటి రాజశాసనానికైనా ప్రతిఘటన ఉండదు. రాజశాసనాల వల్ల జనం ఇబ్బంది పడిందీ లేదు – విరాముడు రాజయ్యేవరకూ!

విరాముడికి చాలాకాలం పిల్లలు లేరు. ఎన్నో నోములు, వ్రతాలు చేయగా చేయగా పుట్టాడు హఠరాముడు. అందుకని తలిదండ్రులు అతణ్ణి ఎంతో గారాబంగా పెంచారు. దాంతో అతడు చిన్నప్పట్నించీ మొండివాడుగా తయారయ్యాడు. ఓ పట్టాన స్నానం చేసేవాడు కాదు, భోంచేసేవాడు కాదు. అలాంటప్పుడు ఓసారి అంతఃపురదాసి అతడికో పిల్లిని చూపించి, “ఇది నిన్ను స్నానం చెయ్యమంటోంది” అంది. అతడు వెంటనే స్నానం చేశాడు. తర్వాత పిల్లి చెప్పిందంటే భోంచేశాడు. అప్పట్నించీ అతడిచేత ఏ పని చేయించాలన్నా పిల్లి చెప్పిందనడం రివాజయింది. హఠరాముడు కూడా ఆ పిల్లి అంటే ఇష్టపడి, ఎప్పుడూ దగ్గరే ఉంచుకునేవాడు.

హఠరాముడికి ఐదేళ్లు నిండగానే, చదవెయ్యబోతే, చదువొద్దన్నాడు. అప్పుడు పిల్లి చదువుకోమందని చెప్పిచూశారు. ఐతే, ఆ మాట పిల్లి నోటితో చెప్పించమని మొండికేశాడు. కాస్త పెద్దవాడైతే మారకపోతాడా అని విరాముడు ఆశపడ్డాడు కానీ పదేళ్లు నిండినా అతడిలో ఏ మార్పూ లేదు. చదువుకోకపోతే జ్ఞానం అబ్బదనీ, రాజయ్యే అర్హత ఉండదనీ తండ్రి అతడికి నచ్చజెప్పబోయాడు. దానికి హఠరాముడు, “నాకు చదువెందుకు? పుట్టుకతోటే మహాజ్ఞానిని. ఎవరైనా కాదనగలరా?” అని సవాలు చేశాడు. తలిదండ్రులెలాగూ కొడుకు మనసు నొప్పించరు. యువరాజును జ్ఞాని కాదనడం దుస్సాహసమని మిగతావారికి తెలుసు. దాంతో అంతా అతణ్ణి మహాజ్ఞాని అన్నారు.

ఐతే హఠరాముడు, “మహాజ్ఞాని అనగానే చాలదు. రాజ్యపాలనకు నా శాసనాలు అమలు చెయ్యాలి” అన్నాడు తండ్రితో. కొడుకుని నొప్పించలేక విరాముడు సరేనన్నాడు. ఆ శాసనాలు ఎంత విపరీతమంటే – ఓ ఏడాదంతా – రాజ్యంలో ఆడవాళ్లంతా పంచె కట్టి చొక్కా వేసుకుంటే, మగవాళ్లు చీర, రవికె ధరించారు. పండితులు వ్యవసాయం చేస్తుంటే, శ్రమజీవులు కవిత్వం చెప్పారు. వ్యాపారులు వినియోగదారులకి సరుకులు ఉచితంగా ఇవ్వడమే కాదు, వాటి మూల్యాన్ని కూడా ఇచ్చారు. జనం కిమ్మనకుండా శాసనాలు పాటిస్తుంటే హఠరాముడు ఇంకా రెచ్చిపోయాడు. ఏడాదిపాటు పురుషులంతా తలపై ఎడంపక్కా, స్త్రీలు తలపై కుడిపక్కా అరగుండుతో కనబడాలలనీ, దంపతులు కలిసి బయటకొస్తే, ఇద్దరి కేశాలనూ ముడి వేసుకుని కలిసి నడవాలనీ – కొత్త శాసనం చేశాడు.

ఆ సమయంలో వేదనాథుడనే యోగి ప్రపంచసంచారం చేస్తూ, విగంధ రాజ్యంలో ప్రవేశించి కూనవరం అనే గ్రామానికొచ్చాడు. అతడిలా ఊళ్లో ప్రవేశించాడో లేదో, అరగుండుతో ఉన్న ఇద్దరు మనుషులు అతణ్ణి పట్టుకుని పక్కకి లాక్కెళ్లారు. ఓ చెట్టుకింద కూర్చోబెట్టి, “మాకు నీపై కోపం లేదు. నిన్ను అవమానించాలన్న కోరికా లేదు. మమ్మల్ని చూస్తున్నావుగా, పౌరులంతా ఇలాగే ఉండాలని రాజశాసనం” అంటూ అతడికి తలపై ఎడంపక్క సగభాగం గుండు చేసి, “ఇప్పుడు నీ ఇష్టం, ఊళ్లో ఎక్కడికి కావాలన్నా వెళ్లు” అన్నారు.

వేదనాథుడు మహాపండితుడు, తపశ్శక్తిసంపన్నుడు. పరిస్థితిని తొందరగానే ఆకళింపు చేసుకున్న ఆయన వెంటనే గ్రామాధికారి కూనయ్యని కలిసి, “గురువుల్ని సేవించీ, తపస్సు చేసీ ఎంతో జ్ఞానాన్ని సంపాదించాను. జ్ఞానసంపద అన్ని సంపదల్లోకీ గొప్పది. దాన్ని ఉచితంగా పంచాలని దేశాలు తిరుగుతూ ఇక్కడికొచాను. అందుకు నాకు జరిగిన సత్కారం ఈ అరగుండు. పైగా ఇది రాజశాసనమట. రాజశాసనాలు ప్రజాసంక్షేమం కోసం కదా! ఈ శాసనం వల్ల జనాలకి జరిగే మేలేమిటో కాస్త నాకు చెబుతావా?” అనడిగాడు.

గ్రామాధికారి అతణ్ణి గుర్రుగా చూసి, “పరదేశివి కాబట్టి ఇది నీ మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నాను. మా రాజు మాకు దేవుడు. ఆయన చెప్పింది చెప్పినట్లు చెయ్యకపోతే అది దైవద్రోహం. ఇంకెప్పుడూ ఈ దేశంలో రాజశాసనానికి వ్యతిరేకంగా మాట్లాడకు” అని, “మా పౌరులకి చదువంటే ఇష్టమూ లేదు, చదువు అవసరమూ లేదు. నువ్వేమో చదువు గొప్ప సంపద అంటున్నావు. అలాగని మా ఊరి వాళ్లని ఒప్పించగలవా?” అన్నాడు.

వేదనాథుడు సరేనన్నాడు. గ్రామాధికారి ఆ రోజే గ్రామస్థుల్ని సమావేశపర్చి వేదనాథుణ్ణి పరిచయం చేశాడు. అప్పుడు వేదనాథుడు ముందుగా తన తలమీద ఓ క్షణంపాటు కుడిచేతిని ఉంచి తీశాడు. అంతే – అరగుండు మాయమై, తలనిండా జుట్టుంది. ఆ వింతకి నివ్వెరపోయి చూస్తున్న జనాలతో, “ఇది అద్భుతం కాదు. చదువు మహిమ. చదువుంటే తలమీద జుట్టు దానంతటదే మొలుస్తుంది. మఱ్ఱిచెట్టు మామిడిపళ్లిస్తుంది. పక్షులు, జంతువులు మాట్లాడతాయి” అంటూ- ఇంద్రజాల విద్యతో అవన్నీ చేసి చూపించాడు.

చదువుంటే అసాధ్యాల్ని సుసాధ్యాలు చెయ్యగలమని నమ్మకం కుదిరి గ్రామస్థులు అతడివద్ద విద్యాభ్యాసానికి సిద్ధపడ్డారు. వేదనాథుడు సులభశైలిలో జ్ఞానపాఠాలు చెబుతుంటే, వారిలో అజ్ఞానపు చీకట్ల మాటున ఉండిపోయిన వివేకం క్రమంగా బయటికొచ్చింది. అది గ్రహించేక అతడొకరోజున, “కంటికి కనబడకపోయినా మనం దేవుణ్ణి నమ్ముతున్నాం. ఆయన మనకి పీల్చుకుందుకు గాలి నిచ్చాడు. తాగడానికి నీరిచ్చాడు. పంటలకోసం సారవంతమైన నేలనిచ్చాడు. అవన్నీ మనకి ఆయన చేస్తున్న ఉచితసేవలు. ఇన్ని చేస్తూ ఆయన ఇబ్బంది పెట్టే శాసనాలేం చెయ్యలేదు. ప్రశ్నించాల్సిన అవసరం లేని మంచిపనులే చేస్తున్నాడు కాబట్టి ఆయన కంటికి కనబడకపోయినా ఫరవాలేదు. మరి మన రాజు కంటికి కనిపించే దేవుడు. ఈ దేవుడు మనకి ఉచితంగా ఇచ్చిందేమిటి, చేస్తున్న సేవలేమిటి? ఆయన శాసనాలవల్ల ఇబ్బంది తప్ప వేరే ప్రయోజనమేమిటి? ప్రత్యక్షదైవం కాబట్టి ఇవన్నీ ఆయన్నడిగి తెలుసుకోవద్దూ?” అన్న వేదనాథుడి మాటలు గ్రామస్థులకి తలకెక్కాయి.

అప్పుడు గ్రామాధికారి వేదనాథుడితో, “రాజునడిగి ప్రయోజనం లేదు. ఈ శాసనాలన్నీ యువరాజు చేయిస్తున్నాడు. రాజు కొడుకు మాట కాదనలేడు. యువరాజు చదువుకోలేదు కాబట్టి, శాసనాల విషయంలో వివేకం పాటించలేక పోతున్నాడు” అన్నాడు.

వేదనాథుడు వెంటనే, “యువరాజయుండీ చదువుకోకపోతే ఎలా? అతడికి చదువు చెప్పే గురువే దొరకలేదా?” అన్నాడు ఆశ్చర్యంగా.

“ఎలా దొరుకుతాడు? ముందు తన పిల్లిని మాట్లాడించి అప్పుడు చదువు చెప్పాలంటున్నాడు యువరాజు” అని ఒక్క క్షణమాగి, “అన్నట్లు తమరైతే పిల్లిచేత మాట్లాడించగలరు కదా! వెళ్లి యువరాజును కలిసి చదువు చెప్పే ప్రయత్నం చెయ్యొచ్చు” అన్నాడు గ్రామాధికారి.

ఈలోగా రాజే వేదనాథుడి కోసం కబురంపాడు. ఎందుకంటే – కొడుకంటే బలహీనత ఉన్నదే తప్ప విరాముడు స్వతహాగా మంచివాడు. తన పౌరుల్లో ఎక్కువమంది మూర్ఖులనీ, అందుకే తనయుడి ఆగడాలు భరిస్తున్నారనీ ఆయనకు తెలుసు. చారుల ద్వారా కూనవరం పౌరుల్లో వేదనాథుడు చైతన్యం కలిగించిన విషయం తెలిసిందాయనకు. అలాంటి మూర్ఖుల్లో చైతన్యం కలిగించిన వేదనాథుడు సామాన్యుడు కాదనీ, అతడివల్ల తన కొడుకు కూడా వివేకవంతుడౌతాడనీ ఆశ పుట్టింది. అందుకే వేదనాథుణ్ణి రప్పించుకున్నాడు.

వేదనాథుడు రాజుని కలిశాడు. హఠరాముడు తన పిల్లిని తీసుకుని రాగానే అతడు ఇంద్రజాలం ప్రయోగించి, పిల్లి నోట, “యువరాజా! బాగా చదువుకో” అని చెప్పించాడు.

హఠరాముడా అద్భుతానికి ఆశ్చర్యపోయాడు. ఐతే చదువుకుందుకు వెంటనే ఒప్పుకోలేదు, “నా పిల్లి నోట మాట వినడం నాకెంతో ఆనందంగా ఉంది. నువ్వు పక్కన ఉన్నప్పుడే కాక, నాకు తీరుబడి ఉన్నప్పుడల్లా నా పిల్లితో కబుర్లాడాలనుంది. రోజూ రాత్రి దాని నోట జోలపాట వింటూ నిద్ర పోవాలనుంది. కాబట్టి ముందు దానికి భాష నేర్పు. తర్వాతే నేను నీ వద్ద చదువుకుంటాను” అన్నాడు.

వేదనాథుడు ఏమాత్రం తడబడకుండా, “నీ పిల్లి మాట్లాడ్డమే కాదు. కవిత్వం కూడా చెబుతుంది. ఆ కవిత్వం నీకు అర్థం కావాలంటే ముందు నువ్వు పండితుడివి కావాలి. కాబట్టి నీ చదువయ్యేకనే, నీ పిల్లికి చదువు. ఆపైన నీ ఇష్టం” అన్నాడు.

తన పిల్లి కవిత్వం చెబుతుందనగానే హఠరాముడిలో కుతూహలం పుట్టింది. అతడు వేదనాథుడివద్ద చదువుకుందుకు ఒప్పుకుని, “నా చదువయ్యేక మాట తప్పావో, నీకు ఉరిశిక్ష తప్పదు” అని హెచ్చరించాడు.

పిల్లిని మాట్లాడించడం ఇంద్రజాలమని విరాముడు గ్రహించాడు. కాబట్టి వేదనాథుడు పక్కన లేకుండా, పిల్లిచేత నిత్యం మాట్లాడించడం అసాధ్యమనీ ఆయనకు తెలుసు. అప్పుడు ఉరిశిక్ష తప్పదు కాబట్టి, వేదనాథుడు తన కొడుక్కి చదువు చెప్పడానికి ఒప్పుకోడని ఆయన భయపడ్డాడు. ఐతే ఊహించని విధంగా వేదనాథుడు శిక్షకు ఒప్పుకుని హఠరాముడికి చదువు చెప్పడం మొదలెట్టాడు.

కొండచిలువ ఈ కథ చెప్పి, “వేదనాథుడు తపోశక్తిసంపన్నుడే ఐనప్పటికీ, ప్రకృతిధర్మానికి వ్యతిరేకంగా ఓ పిల్లికి భాషాపాండిత్యం కలిగించగలడా? అతడిది ఆత్మవిశ్వాసమా? మూర్ఖత్వమా? లేక కొన్నాళ్లలో విగంధ పౌరులు వివేకవంతులై హఠరాముణ్ణి పదవీచ్యుతుణ్ణి చేస్తారన్న ఆశ అనుకోవాలా? తెలిస్తే నా ఈ సందేహాలకి సరైన సమాధానం చెప్పి నా ఆకలి చల్లార్చు. లేదా నగరంలోకి వెళ్లి నీ పౌరుల్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను” అంది.

దీనికి పింగపాంగుడు ఏమాత్రం తడుముకోకుండా ఇలా బదులిచ్చాడు: “సమర్థులకు ఆత్మవిశ్వాసమే తప్ప, తమ చేతిలోలేని భవిష్యత్తుపై ఆశ ఉండదు! వేదనాథుడు సమర్థుడు కాబట్టి, తను హఠరాముణ్ణి వివేకవంతుణ్ణి చెయ్యగలనని నమ్మాడు తప్ప, పిల్లిని పండితుణ్ణి చెయ్యాలని అనుకోలేదు. వివేకం వల్ల హఠరాముడి మూర్ఖత్వం తొలగి – గతంలో తను చేసిన శాసనాలకు కించపడతాడు. వేదనాథుడి వంటి మహాపండితుణ్ణి, పిల్లికి భాష నేర్పమన్నందుకు సిగ్గు పడతాడు. అలాంటి వివేకం కలిగించే చదువు చెప్పడం తనవల్ల ఔతుందని కూనవరంలో ఋజువైంది. ఆ ఆత్మవిశ్వాసమే అతణ్ణి హఠరాముడి షరతుకి ఒప్పుకునేలా చేసింది” అన్నాడు.

అది సరియైన సమాధానం కావడంతో కొండచిలువ నేలకు వ్రాలి చుట్టలు చుట్టుకుని నిద్రకు పడింది. రాజు తన అంతఃపురానికి తిరిగి వెళ్లాడు.

(వచ్చే ‘సంచిక’లో కరనాగభూతం 11వ కథ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here