[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]
[dropcap]ఈ[/dropcap]లోపు వాగ్దేవి అక్కను రామ్మూర్తి బావను చూసి రావాలనుకున్నాడు. తండ్రి అనుమతి తీసుకున్నాడు. అక్కకు ప్రస్తుతం మూడో నెల. వర్ధనమ్మ కూతురికి చింతకాయ తొక్కు, నిమ్మకాయ ఊరగాయ, మజ్జిగ మిరపకాయలు, పేలాల వడియాలు, కారాలు (జంతికలు) కజ్జికాయలు, అన్నీ చేసి ఒక సంచిలో సర్దియిచ్చింది.
బస్టాండుకు వెళ్లి నజీర్‌నడిగాడు. “చిత్తూరుకు పోవాలంటే ఎట్లారా సాయిబూ” అని.
“కర్నూలు నుంచి ఎమ్.జి బ్రదర్స్ వారిది నెల్లూరుకు బస్సుంది సామీ. అది మన ఊర్లో నిలబడదు. బైపాస్‌లో ఎల్లిపోతాది దానెమ్మ. పొద్దున్నే ఆరుగంటలకు కర్నూల్లో ఇడుచ్చాడు. డోన్‌లో నిలబడతాదిలే. నీవు 7 లోపల డోనుకు పోతే అందుతాది. అది చిత్తూరు దాటే గదా బోయేది” అన్నాడు నజీర్. వాడి విషయ పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయాడు పతంజలి.
“పొద్దున్నే ఆరుకు కర్నూలు నుండి ప్యాపిలి బొయ్యే బస్సొచ్చాది. దాంట్లో డోన్‌కు బోసామి, డోన్‌లో వెల్లూరు బస్సు పట్టుకోవచ్చు. నీలంరంగు డీలక్స్ ఎక్స్‌ప్రెస్ బస్సు. బలె ఉంటాదిలే. ‘శ్రీ నీలకంఠేశ్వర బస్ సర్వీస్’ అని రాసి ఉంటాది. బలె స్పీడు కొడతాడు” అన్నాడు నజీరు. “నీకివన్నీ ఎలా తెలుస్తాయిరా” అన్నాడు పతంజలి.
“నిచ్చం బస్టాండులోనే పడుంటాం. తెలియక సచ్చాయా” అన్నాడు వాడు.
మరుసటి రోజు ఉదయం తెల్లవారు ఝామునే లేచాడు పతంజలి. స్నానం, సంధ్య ముగించి కాఫీ తాగి బట్టలు బ్యాగు, తినుబండారాల బ్యాగు విశ్వనాధవారి ‘పులిముగ్గు’ నవలతో సహా బస్టాండుకు వెళ్లి ప్యాపిలి బస్సు ఎక్కాడు. ‘పాలబస్సు’ అంటారు దాన్ని. దాని టాపు మీద ఎప్పుడూ పాలక్యాన్లుంటాయి. ఏడులోపే డోన్ బస్టాండులో దిగాడు. ఇంకా వేలూరు బస్సు రాలేదు. ‘హిందూ’ పత్రిక, ‘ఇలస్ట్రేడెడ్ వీక్లీ’ కొనుక్కున్నాడు.
ఇంతలో హారన్ కొడుతూ రానేవచ్చింది ‘శ్రీ నీలకంఠేశ్వర బస్ సర్వీసు’. కర్నూలు – వెల్లూరు అని తెలుగులో తమిళంలో రాసి ఉంది. క్రింద వయా, గుత్తి, అనంతపురం, కదిరి, మదనపల్లె, పలమనేరు, చిత్తూరు అని రాసి ఉంది. ఎవ్వరూ దిగలేదు. పతంజలి ఒక్కడే తలుపుదగ్గరికి వెళ్లి ఎక్కబోతుండగా డోర్ వేసి, “సీట్లు లేవు” అని చెప్పి “రైట్” అన్నాడు కండెక్టరు.
“అన్నా, అన్నా, నేను చిత్తూరు వెళ్లాలి! ప్లీజ్ చూడవా?” అని అరిచాడు పతంజలి. “హోల్డాన్” అని అరిచి, “చిత్తూరికా? అనంతపురం వరకు సీట్లు ఖాళీకావు అంతవరకు ఇంజనుమీద కూచుంటావా?” అని అడిగాడు కండక్టరు. “సరే” అన్నాడు పతంజలి. కండక్టరు డోరు తెరిచి, పతంజలి చేతుల్లోని సంచులు అందుకొని పైన ర్యాక్‌లో పెట్టాడు. వెనక డోరు ఒక్కటే ఉంది. ముందుకు వెళ్లి ఇంజను బోనెట్ మీద కూర్చున్నాడు. బోనెట్ చుట్టూ ఉన్న రెయిలింగ్ లోంచి దూరి. అంత దగ్గరగా డ్రయివింగ్ చూస్తూ రోడ్డును గమనిస్తూ వెళ్లే అవకాశం కల్గినందుకు సంతోషించాడు.
బస్సు డోన్ దాటి హైవే ఎక్కింది. ఎన్.హెచ్ 7 అది కాశీ – కన్యాకుమారి రోడ్డు. విశాలంగా ఉంటుంది. బస్సు వెళ్ళే స్పీడు చూసి భయమేసింది పతంజలికి. తర్వాత అలవాటయిపోయంది. డ్రైవరు విన్యాసాలు చూస్తూంటే అబ్బురంగా ఉంది. పెద్ద పెద్ద లారీలను అవలీలగా ఓవర్‌టేక్ చేసుకుంటూ వెళుతున్నాడు. గుత్తి వరకు స్టాప్ లేదు. గుత్తిలో టిఫిన్‌కి ఆపాడు. పూరీ తిని, ‘టీ’ తాగాడు పతంజలి.
అనంతపురంలో సీటు ఇచ్చాడు కండక్టరు. అప్పటివరకు టికెట్ కూడ యివ్వలేదు. అనంతపురం నుండి చిత్తూరుకు టికెట్ చింపాడు. 38 రూపాయలు. ఎక్కువే అనిపించింది. కాని ఆ బస్సు, సీట్ల కంఫర్ట్, వేగం చూస్తే ఇవ్వొచ్చు అనిపించింది. అంటే డోన్ నుండి గుత్తి వరకు ‘ఫ్రీ’గా తీసుకొచ్చాడా అనుకున్నాడు. అడుగుదామనుకుని మళ్లీ మనసు మార్చుకున్నాడు.
కుదురుగా కూర్చుని ‘పులిముగ్గు’ నవల చదవడం ప్రారంభించాడు. విశ్వనాథవారి పుస్తకమేదైనా, ఒక్కసారి ఇరవై ముఫ్పై పేజీలకంటే చదవలేము. కాసేపు చదివి బ్యాగులో పెట్టి ‘హిందూ’ తెరిచాడు. హిందూ పూర్తిచేసి చూస్తే ‘కదిరి’ వచ్చింది. ఇక్కడ నరసింహస్వామి దేవాలయం ప్రసిద్ధి అని విన్నాడు. జీవితం ముగిసే లోపల నృసింహ క్షేత్రాలను వీలైనన్ని దర్శించాలని అనుకున్నాడు. కదిరి టౌన్‌లోంచి వెళుతుంటే స్వామి ఆలయగోపురం సమున్నతంగా దర్శనమిచ్చింది. నమస్కారం చేసుకున్నాడు. “అహోబిలానికే ఇంతవరకు పోలేదు. స్వామి కృప ఎప్పుడు కలుగుతుందో” అనుకున్నాడు.
మదనపల్లిలో భోజనానికి ఆపారు. అందరితో బాటు దిగి లోపలికి వెళ్లాడు. ఉదయం తిన్న పూరీ కడుపునిండుగా ఉంది. ఆకలిగా లేదు. రెండు ‘పెరుగువడ’ తెప్పించుకొని తిన్నాడు. హాయిగా అనిపించింది. సాయంత్రం 5 గంటలకల్లా చిత్తూరు చేరుకుంది బస్సు. బ్యాగులు తీసుకొని దిగాడు. “వెళ్లొస్తానన్నా” అని చెప్పాడు డ్రయివరుతో. “థాంక్స్ అన్నా” అన్నాడు కండెక్టరుతో. వాళ్ళిద్దరి ముఖాలు ప్రసన్నంగా మారాయి.
మనం పొందిన ప్రతి సేవకూ, సహాయానికి, అవతలివారి హోదాతో నిమిత్తం లేకుండా కృతజ్ఞతలు చెప్పడం పతంజలి వ్యక్తిత్వం. ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడటం, అరమరికలు లేకుండా కలిసి పోవడం అతని ప్రత్యేకత. ఇవన్నీ తాను చదివిన సాహిత్యమే నేర్పిందతనికి.
అక్కయ్య రాసిన ఉత్తరాల్లో ఉన్న అడ్రసు గుర్తుంది. అక్కనూ బావనూ ఆశ్చర్యానికి లోను చేద్దామని ముందుగా ఉత్తరం వ్రాయలేదు. ప్రమీలా టాకీసు సెంటర్ నుండి కొంచెం ముందుకెళ్లి కుడివైపు తిరుగుతే బాలాజీనగర్ వస్తుందని, అక్కడ అటూ ఇటూ రెండు కొబ్బరిచెట్లున్న ఆకు పచ్చ డాబా యింట్లో ఉంటామని, ఇంటి ఓనరు పేరు ‘మొదలియార్” అనీ అక్క చెప్పింది గుర్తుంది. రిక్షాను పిలిచాడు. అడ్రసు చెప్పి ఎంత తీసుకుంటావని అడిగాడు. “రూపాయిన్నర యివ్వండి” అన్నాడు రిక్షా అతను.
సమంజసంగానే అనిపించి ‘సరే’ అని ఎక్కి కూర్చున్నాడు సంచులు పెట్టుకొని, కొంత దూరంపోయింతర్వాత పూలు పళ్లు అంగళ్లు కనపడినాయి. రిక్షాను ఆపమని చెప్పి, రెండుమూరలు కనకాంబరాలు, అరడజను కమలాపళ్లు, కొన్నాడు. బేరం చేసి, మళ్లీ రిక్షా ఎక్కాడు. రిక్షా అతను రిక్షాతొక్కుతూనే, ‘సారంగధర’ సినిమాలోదేమో పాట అందుకున్నాడు.
“అన్నానా, భామిని? ఏమని?
లోకానికి రాజునైన, నీ ప్రేమకు దాసుడనని
………. …………. …………
మాటవరసకెపుడైనా,
అన్నానా, మోహన!”
అంటూ మంద్ర స్వరముతో పాడుతున్నాడు. మధ్యలో ఆలాపన కూడ శృతి తప్పలేదు.
ఊరుకోలేక, “ఎంత బాగా పాడుతున్నావయ్యా! నీ గాత్రం బాగుంది!” అన్నాడు అంతే! టక్కున ఆపేశాడతను. సిగ్గుపడుతూ, “ఏందో తీ సారు, మావి గాలిపాటలు” అన్నాడు. పతంజలి ఎంత అడిగినప్పటికి కొనసాగించలేదు పాట. ప్రమీలా టాకీసు సెంటరు దాటింది రిక్షా. గోడలమీద తెలుగు సినిమా పోస్టర్లతో పాటు తమిళ సినిమాల పోస్టర్లు కూడ కనిపించాయి. “తమిళనాడు బార్డరు కదూ” అనుకున్నాడు.
సెంటరు దాటింతర్వాత కుడివైపు సందులోకి తిప్పమన్నాడు. ‘బాలాజీనగర్’ అనే బోర్డు కూడ కనబడింది. కొంచెం ముందుకు వెళ్లింతర్వాత ఆపమని దిగిపోయాడు.
“ఇక్కడ నేను విచారించుకుంటాలే బాబూ, నీవెళ్లిపో” అని రెండు రూపాయల నోటు ఇచ్చాడతనికి. అతను చిల్లర యివ్వబోతూంటే వారించాడు పతంజలి. “ఉండనీలే. నీ పాటకు విలువకట్టలేనుగాని, అద్భుతమయిన గొంతు నీది!” అన్నాడు రిక్షా అతని వదనంలో ఆనందం. అర్ధరూపాయి ఎక్కువిచ్చినందుకు గాదు తనలోని కళను పతంజలి గుర్తించినందుకు, ప్రశంసించినందుకు.
కొంతదూరం నడిచి అక్కడున్న కిరాణా కొట్టులో అడిగాడు. ‘మొదలియార్ గారిల్లు ఎక్కడండీ! వాళ్లింట్లో రామ్మూర్తిగారని ఉంటారు. కెనరా బ్యాంక్‌లో పని చేస్తారు” అన్నాడు.
కొట్టతను బయటకు వచ్చాడు. “తెలుసు తెలుసు. ఆ సారు మా అంగడిలోనే సరుకులు తీసుకుపోయేది. ఆయన భార్య నిండు మనిసి గదూ! కొంచెం ముందుకు వెళితే ఎడమవైపు అయిదోయిల్లు. గేటుకు రెండు దిక్కులా టెంకాయ సెట్లుంటాయిలే” అన్నాడు. “ఆసారుకు నీవేమవుతావు?” అని అడిగాడు.
“బావమరిదినండి. ఆమె మా అక్కయ్య” అన్నాడు.
“అదే అనుకొన్నాలే. ఆయమ్మ పోలికలు నీముకంలో బాగా తెలుస్తున్నాయి” అన్నాడాయన. పతంజలి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ముందుకు కదిలాడు.
అప్పటికే చీకటిపడింది. వీధి దీపాలు వెలిగాయి. కొబ్బరిచెట్లున్న యింటి గేటు తెరుచుకుని లోపలికి ప్రవేశించాడు.
“ఎవరు కావాలి” అంటూ తమిళంలో అడిగాడు ఒకాయన. తెల్లటి లుంగీ, కాలరు లేని చొక్కా ధరించాడు. నుదుట గంధం కుంకుమ.
“మొదలియారు గారిల్లు….” అనగానే
“ఇదే వీడు. నీవు ఎవరు?” అన్నాడాయన.
“రామ్మూర్తిగారు…” అంటుండగానే
“వాగ్దేవమ్మా, మీ యింటికి సుట్టాలు పూడ్సినారు” అని వీధికంతా వినబడేలా కేకపెట్టాడు.
వాగ్దేవి, రామ్మూర్తి, వెనకవైపు వాటానుండి బయటకు వచ్చారు. పతంజలిని చూస్తూనే ఒక్క ఉదుటున పరిగెత్తుకొచ్చి తమ్మున్ని వాటేసుకుంది అక్క. “ఏమిట్రా, ఎలా వచ్చావు? ఉత్తరమయినా రాయకుండా! ఊర్లో అందరూ బాగున్నారు కదా!” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది వాగ్దేవి.
“వాడిని ముందు లోపలికి రానివ్వు.” అన్నాడు రామ్మూర్తి చిరునవ్వుతో. ముగ్గురూ లోపలికి వెళ్లారు. ముచ్చటయిన యిల్లు. వరుసగా మూడు రూములు. చివరి రూము వంటిల్లు. వంటింట్లోంచి తలుపుగుండా వెళితే చిన్న పెరడు. మున్సిపాలిటీ వారి కొళాయి. దాని క్రింద అంట్లు తోముకోడానికి, బట్టలు ఉతుక్కోడానికి చిన్న గట్టు కట్టారు. మధ్యగది బెడ్‌రూం. ఇద్దరికి సరిపోయే, నవారు అల్లిన పట్టిమంచం గోడవైపు ఆనించివుంది. ఒక మూల చిన్న టేబుల్ మీద ఎంబ్రాయిడరీ కుట్టిన తెల్లని టేబుల్ క్లాత్ మీద మర్ఫీ రేడియో. ఒకవైపు టేబుల్ మీదే అక్కాబావల బ్లాక్ అండ్ వైట్ ఫోటో. నవ్వుతున్నారు. ప్రపంచంలోని సంతృప్తి అంతా వాళ్ల కళ్లల్లో ప్రతిఫలిస్తూంది. ముందుగది చాలా చిన్నది. రెండు గాద్రెజ్ కుర్చీలు వేసి ఉన్నాయి. ఒక వైపు గోడకు బావగారి సైకిలు స్టాండ్ వేసి ఉంది. రోజూ ఆయిల్ వేసి తుడుస్తాడేమో మెరుస్తూ ఉంది. ముదురు ఆకుపచ్చరంగు ‘హెర్కులిస్’ సైకిలు ముందుగదిలో గుమ్మం మీద గోడకు లక్షీనరసింహస్వామి వారి పెద్ద ఫోటో. దానికి చిన్న లైటు ప్రేము పై భాగాన అమర్చి ఉంది. గుమ్మాలకు కర్టెన్లు వేలాడుతున్నాయి. అవి అక్కయ్య పాత చీరలనే అలా తయారు చేసిందని గ్రహించాడు.
వంటింట్లో చిన్న టేబుల్ ఉంది ఇనుపది. దానిమీద రెండు కిరసనాయిలు స్టవ్వులు. టేబుల్ క్రింద కిరసనాయిలు క్యాను. గోడకున్న గూట్లో ఉప్పులు, పప్పులు అన్నీ స్టీలు డబ్బాల్లో నీట్‌గా సర్దుకొని ఉంది అక్కయ్య. కింది గూట్లో పేపరు పరచి దేవుళ్లను పెట్టుకున్నారు. తాను వచ్చేముందే అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసిందేమో, దేవుని గూడు ప్రకాశవంతంగా ఉంది.
“మాట్లాడకుండా ఇల్లంతా అలా చూస్తున్నావేమిరా?” అన్నది అక్కయ్య.
“మీ యిల్లు చాలాబాగుందే” అన్నాడు.
“బాడుగ నలభై రూపాయలు” అన్నాడు రామ్మూర్తి.
“అమ్మో! చిత్తూరులో బాడుగలు ఎక్కువేనేవ్” అన్నాడు పతంజలి.
“కాళ్లు కడుక్కొని రాపో. పంచె యిస్తా కట్టుకుందువుగాని, ఎప్పుడు తిన్నావో ఏమో! వంట చేస్తా! తొందరగా భోంచేద్దాం” అన్నది వాగ్దేవి.
పెరట్లో ఒకవైపు స్నానాల గది. పక్కనే లెట్రిన్ ఉన్నాయి. కొళాయి పక్కన రేకు డబ్బాలో మట్టిపోసి చిన్న తులసి మొక్క పెంచుకుంటూంది.
కాళ్లు చేతులు కడుక్కొని వచ్చాడు పతంజలి. వేడిగా కాఫీ కాచి భర్తకు తమ్మునికి ఇచ్చింది.
“నీవు తాగలేదేం’ అని అడిగితే తాను కాఫీ మానేసినాననీ, ఉదయం మాత్రం గ్లాసుపాలు తాగుతాననీ చెప్పింది.
అక్కయ్య కొద్దిగా ఒళ్లు చేసి నిండుగా ఉంది. మాతృత్వం పొందబోయే ఒక సంతృప్తి ఆమె ముఖం నిండా పరచుకొని ఉంది. బావకూడ కొంచెం లావయ్యాడు. చిరు బొజ్జ కూడ పడింది. అదే ఆయనతో అంటే “ఏం చేస్తాం. నాకిష్టమని మీ అక్క అవీ ఇవీ చేసిపెడుతూంటూంది. వద్దంటే వినదు. తినకుండా పారెయ్యలేంకదా” అన్నాడు బావ తన తప్పేమీ లేనట్లు. అక్కయ్య నవ్వుతూ బావపైపు చూసింది.
మామిడికాయ ముక్కలు తరిగి పెట్టుకొంది. పెసరపప్పులో రెండు నేతొట్లు (నేతిచుక్కలు) వేసి దోరగా వేయించింది.
“కమ్మని వాసనొస్తుందా” అని భర్తనడిగింది.
బొటనవేలు చూపుడు వేలు కలపి చూపించాడు బావ ‘అమోఘం!’ అని దానర్థం. పెసరపప్పు మామిడికాయ పప్పు పులుసు చేసింది. ఒక స్టవ్ మీద అన్నానికి పెట్టింది. “వడియాలు వేయిస్తా” అంటే “వద్దొద్దు మిక్చరుంది కదా!” అన్నాడు భర్త.
అన్నంగిన్నె పప్పు గిన్నె మజ్జిగ గిన్నె మధ్యలో పెట్టుకుని చుట్టూ కంచాలు పెట్టుకుని కూర్చున్నారు. పప్పు అమ్మ చేసినట్లుగానే ఉంది. అదే అంటే “అమ్మ దగ్గర నేర్చుకున్నదే గదరా!” అంది. భోజనాలయింతర్వాత బావే కంచాలు తీసి, అంట్ల గిన్నెలు బయట వేసి, నీళ్లు చల్లి, పాత గుడ్డతో తుడిచాడు. పతంజలి గమనిస్తూంటే అన్నాడు. “మీ అక్కయ్య గర్భవతి కదరా. మాటిమాటికి వంగి లేవడం ఎందుకని?” అన్నాడు. “స్టవ్వులు కూడ క్రిందనే ఉండేవి. నాకు కష్టమని నిలబడి చేసుకునేందుకు వీలుగా ఈ టేబులు కొన్నారు” అన్నది భర్తవైపు మురిపెంగా చూస్తూ. “సర్లే కాకి భార్య కాకికి ముద్దు” అన్నాడు బావ.
‘వీళ్లిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారు!’ అనుకున్నాడు పతంజలి. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇంటరు పరీక్షలు బాగా రాసినట్లు ఉత్తరం రాసినా అక్కాబావలతో మద్రాసు విశేషాలన్నీ ఏకరువు పెట్టాడు. చివర్లో అన్నాడు. “అంతా నీదయే బావా! నీవు దారి చూపించకపోతే ఏమయిపోయేవాణ్ని” అన్నాడు పతంజలి. అలా అంటునపుడు గొంతు గద్గదమయింది.
బావమరిది భుజంమీద చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు రామ్మూర్తి. “డోంట్ బి ఎమోషనల్, మై బోయ్. అ యామ్ ఓన్లీ ఇన్‌స్ట్రుమెంటల్ ఇన్ యువర్ సక్సెస్. డోంట్ స్టాప్. కంటిన్యూ యువర్ స్టడీస్. వన్ డే ఐ వాంటు సీయు యాజె పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ లేటర్ సెటిల్ ఇన్ ఎ గుడ్ జాబ్” అన్నాడు.
“మీ బావ డిగ్రీ ఈ సంవత్సరం అయిపోతుందిరోయ్. తర్వాత డిపార్టుమెంటు పరీక్షలు పాసయితే ఆఫీసరవుతారు” అన్నది వాగ్దేవి మెరుస్తున్న కళ్లతో.
“అన్నీ అవుతాయి. మన ప్రయత్న లోపం లేకుండా, భగవంతుని మీద భారం వేసి, ఓపిగ్గా ఎదురు చూడాలి. ‘డెస్టినీ లీడ్స్’ అని కదా పెద్దలన్నారు.” అన్నాడు రామ్మూర్తి. బావకు ఇంగ్లీషులో కూడ మంచిపట్టున్నట్లు అర్థమయింది.
“సరేగాని ఎన్నిరోజులుంటావు?” అనడిగాడు బావ.
“మీకేం మాట్లాడాలో తెలియదు. ఇంటికి వచ్చిన వాణ్ణి పట్టుకుని అదేం ప్రశ్న. వాడు కాబట్టి సరిపోయింది. అదే వేరేవాళ్లయితే ఇంకో రకంగా అనుకోరూ?” అన్నది వాగ్దేవి చిరుకోపంతో “అదే నీకు నాకు తేడా. వాడి పోగ్రాం తెలుసుకుని, వాడికి చూపించవలసినవి నాలుగూ ఒక ప్లాన్ ప్రకారం తీసుకుపోదామనేగాని నాకు వేరే ఉద్దేశముంటుందా?” అన్నాడు రామ్మూర్తి. “ఎల్లుండి ఆదివారం నాకు సెలవు. మనకు తిరుపతి, షోళింగర్ రెండూ దగ్గరే. ఇంచుమించు సమాన దూరంలో ఉన్నాయి. ఉదయాన్నే వెళ్లి సాయంత్రానికి తిరిగిరావొచ్చు. రేపు శనివారం బ్యాంకు మధ్యాహ్నం వరకే. సాయంత్రం ఏదైనా సినిమాకు వెళదాం.”
“అయితే పులిహోర, పెరుగన్నం కలుపుతాను. చపాతీలు కూడ. అక్కడ తినవచ్చు” అన్నది అక్కయ్య.
“అవేం పెట్టుకోవద్దు. శ్రమపడతావు. అక్కడే ఏదో తిందాములే. ఇంతకూ ఎక్కడికెళదాం?”
“షోళింగర్‌లో దేవుడు ఎవరు బావా?” అని అడిగాడు పతంజలి.
“అయ్యో! నీకు తెలియదా? మన నరసింహస్వామే. యోగానందుడు” అన్నాడు బావ.
“అయితే అక్కడికే” అని తేల్చేశాడు పతంజలి.
“కానీ మీ అక్క అన్ని మెట్లెక్కగలదా! అసలే గర్భవతి”
“లక్షణంగా ఎక్కుతా. ఇంకా మూడో నెలే కదా! మీరు మరీ అపురూపం చేయకండి. ఆయాసం వస్తే తీరే దాకా కాసేపు కూర్చుంటే సరి”
శనివారం మధ్యాహ్నమే వచ్చేశాడు బావ బ్యాంకునుండి. బ్యాంకు కూడ దగ్గరే సైకిలు మీద పదినిమిషాలు కూడ పట్టదు. బావ సైకిలు తీసుకుని పతంజలి కూడ తిరిగాడు.
“నీ సైకిలు బలే వుంది బావా” అంటే “మీరిచ్చిందే కదరా” అంటాడు.
శనివారం సాయంత్రం సినిమాకు వెళ్లారు “తల్లా? పెళ్లామా?” యన్.టి.ఆర్. సినిమా. గురునాథ్ టాకీసులో ఆడుతుంది. నడిచే వెళ్లారు పెద్ద దూరంలేదు కాబట్టి. అక్కయ్య నేరేడు రంగు చీర కట్టుకుంది. పింక్‌కలర్ జాకెట్టు వేసుకుంది. పచ్చని మెడలో మంగళసూత్రాలు మెరుస్తున్నాయి. మల్లెపూలు పెట్టుకుంది. బావ క్రీం కలర్ ప్యాంటు, స్నఫ్ కలర్‌ఫుల్ షర్టు వేసుకున్నాడు. బ్రౌన్ కలర్ బాటా చెప్పులు వేసుకుని గాగుల్స్ పెట్టుకున్నాడు.
“ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్” లా ఉన్నారు అన్నాడు పతంజలి. “అంతేకాదు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కూడ రోయ్” అన్నాడు బావ. “నాకేం మీరంటే అంత పిచ్చేం లేదులే” అంది వాగ్దేవి అతన్ని ఉడికించటానికి.
“అంత లేదుగాని కొంతైతే ఉందిగద!” అన్నాడామెను చిలిపిగా చూస్తూ.
వాళ్ళీద్దరి సరాగం చూసే కొద్దీ మరీ బాగుంది పతంజలికి. ధియేటర్ చేరుకున్నారు. శనివారమేమో బాగా రష్‌గా ఉంది. నేల క్లాసు బెంచీ క్లాసు క్యూలు క్రిక్కిరిసి పోయాయి. ఇద్దరు పోలీసులు కూడ వచ్చారు జనాన్ని అదుపు చేయడానికి.
“టిక్కెట్లు నేను తెస్తాను బావా!” అన్నాడు పతంజలి.
పదిరూపాయల నోటు ఇవ్వబోయాడు బావ.
“నా దగ్గరున్నాయిలే”
“ఉంటే ఉన్నాయిలే మా ఊరికొచ్చినావు కాబట్టి మా డబ్బే ఖర్చుపెడతాం” అంటూ బలవంతంగా నోటు చేతులో పెట్టాడు.
క్యూలో నిలబడి మూడు టికెట్లు తెచ్చాడు బాల్కనీవి. మెట్లెక్కి పైకి వెళ్లి ఫ్యాను క్రింద సీట్లు చూసుకుని కూర్చున్నారు. ఇద్దరికీ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు పతంజలిని. గ్రోమోర్ ఎరువులు. ఇండియన్ న్యూస్ రీల్, మారాబోవు చిత్రములు. దయచేసి ముందుసీట్లపై కాళ్లు పెట్టరాదు. పొగత్రాగరాదు. నిశ్శబ్దం అన్న స్లయిడ్లన్నీ వేసిన తరువాత సినిమా ప్రారంభమయింది. ముగ్గురూ సినిమాలో లీనమయ్యారు.
ఇంటర్వెల్‌లో లైట్లు వెలిగాయి. పతంజలిని తీసుకొని బయటకు వెళ్లాడు రామ్మూర్తి. బ్రూ కాఫీ తాగించాడు. వేరుశనగ విత్తనాలు, నువ్వుల ఉండలు కొనుక్కున్నారు. ‘కిస్మత్’ అనే కూల్‌డ్రింక్ బాటిళ్లు మూడు తీసుకున్నాడు బావ.
“అవి చాలా ఖరీదేమో బావా?”
“ఫరవాలేదులే. రాకరాక వచ్చావు. బావమరిదికి ఆ మాత్రం మర్యాదలు చేయకపోతే ఎట్లా?” అన్నాడు బావ.
కూల్‌డ్రింక్ ధర అర్ధరూపాయి. ‘అమ్మో’ అనిపించింది పతంజలికి.
ఇవన్నీ చూసి కోప్పడింది వాగ్దేవి.
“మీ బావకు దుబారా ఖర్చు ఎక్కువ” అంది.
“నీ కోసం కాదులేవే. మా చిన్న బంగారు బావకోసం” అన్నాడు రామ్మూర్తి. అక్క ఎంత విసుక్కున్నా, కోప్పడినా అస్సలు కోపం రాదు బావకని గమనించాడు పతంజలి.
‘కిస్మత్’ బాగుంది. పుల్లపుల్లగా, తీయతీయగా, చల్లచల్లగా గొంతులోకి దిగుతుంటే, మొదటిసారి జీవితంలో కూల్‌డ్రింక్ తాగడం.
సినిమా అయ్యాక మళ్లీ నడుచుకుంటా యిల్లు చేరుకున్నారు. బట్టలు మార్చుకొన్న తర్వాత వాగ్దేవి అడిగింది.
“ఈ రోజు శనివారం కదా! ఇడ్లీ పెడతాను. మధ్యాహ్నం చేసిన అన్నం కొద్దిగా ఉంది. మజ్జిగాన్నం కొంచెం తీందువుగాని”
“సరే” అన్నాడు పతంజలి.
ఇడ్లీ, పుట్నాలపప్పు చట్నీ చేసింది. ఇడ్లీలు మృదువుగా బాగున్నాయి. ఐదారిడ్లీలు తిన్నారు. కొద్దిగా మజ్జిగాన్నం తింటే గాని ఊరుకోలేదక్కయ్య.
ముందు రూములో కుర్చీలు మడచి గోడకు ఆనించి, సైకిలు బయటపెట్టి తాళం వేసి క్రింద చాప, బొంత, దుప్పటి పరచి తమ్మునికి పక్క ఏర్పాటు చేసింది వాగ్దేవి.
మరుసటి రోజు ఉదయం ఐదున్నరకల్లా నిద్రలేచి, స్నానాలు చేసి తయారయ్యారు. బస్టాండుకు రిక్షాల్లో వెళ్లారు.
“నేను నా తమ్ముడు ఒక రిక్షా. మీరు ఒకరూ ఒక రిక్షా సరేనా!” అన్నది వాగ్దేవి. “నాకేం అభ్యంతరం లేదు. ఎంతయినా మీరు మీరు ఒకటి. నేను పరాయివాణ్ణేగా” అన్నాడు రామ్మూర్తి. అందులో హాస్యం తప్ప నిష్ఠూరం లేదు. ఆయన సౌజన్యం, సంస్కారం పతంజలిని ముగ్ధుడిని చేస్తున్నాయి.
చిత్తూరు బస్టాండులో షోలింగర్ బస్సు రడీగా ఉంది. ఎక్కి కూర్చుని టికెట్లు తీసుకున్నారు. ఎనిమిది గంటలకల్లా షోలింగర్ చేరుకున్నారు. పెద్ద ఊరే. గుడి ఎత్తయిన కొండమీద ఉంది. దాదాపు పదిహేనువందల మెట్లున్నాయి. కాని ఎక్కటానికి అనువుగా, ఎత్తు తక్కువగా, వెడల్పుగా ఉన్నాయి. ప్రతి యాభై మెట్లకు సమతలంగా కొంత స్థలం వదిలారు. మధ్యలో కూర్చోడానికి మంటపాలు ఉన్నాయి.
క్రిందనే కొబ్బరికాయ, పూలు, పూజా సామాగ్రి కొనుక్కున్నారు. పూజా సామగ్రితో బాటు ఒక కర్ర కూడ ఇచ్చారు. కొండ ముచ్చులు ఎక్కువట కొండమీద చేతులో కర్రతో బెదిరించకపోతే చేతిలోనివి లాక్కుపోతాయట. అందుకే ఈ ఏర్పాటు.
మెట్లెక్కసాగారు. చుట్టూ పచ్చనిపొలాలు. చల్లగా వీస్తున్నగాలి. ఒక గంటన్నర పట్టింది పైకి చేరుకోడానికి. స్వామికి గోత్రనామాలు చెప్పి అర్చన చేయించారు. యోగ ముద్రలో ప్రశాంతంగా ఉన్నాడు నరసింహస్వామి. కళ్లు మూసుకొని నమస్కరించుకున్నాడు. ఎందుకో దుఃఖం వచ్చింది. వెక్కివెక్కి ఏడ్చాడు. కళ్లముందు స్వామి రూపం.
గర్భగుడి వెలుపలికివచ్చినా, దుఃఖం ఆగలేదు. వాగ్దేవి గాభరాపడింది. “ఎందుకురా! నాయనా! పతంజలీ!” అంటూ దగ్గరకు తీసుకొని ఓదార్చసాగింది.
రామ్మూర్తి అన్నాడు. “వాగ్దేవీ! అది ఏడుపు కాదు స్వామిని చూసిన పారవశ్యం. కాసేపటికి తేరుకుంటాడు. ఎంత పుణ్యం చేసుకుంటే గాని ఆ స్థితి కలుగదు. ధన్యుడు మీ తమ్ముడు”
కాసేపటికి మామూలయ్యాడు పతంజలి. గుళ్లో దొన్నెలతో ప్రసాదం పెట్టారు. వేడి వేడి చక్కెరపొంగలి. ఊదుకుంటూ తిని నీళ్లుతాగారు కొళాయిదగ్గర. లడ్డూ ప్రసాదం కొనుక్కున్నారు. మెల్లిగా క్రిందికి దిగివచ్చారు. “నాకు ఆకలి అవుతుంది. టిఫిన్ చేద్దాం” అన్నది వాగ్దేవి. ‘పదండి’ అంటూ ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్లారు.
వడసాంబార్, సింగిల్ పూరీ తిన్నారు. అంత పెద్ద పూరీలు ఎక్కడా చూడలేదు. కాఫీ తాగారు. అప్పటికి 11 దాటింది.
బస్సులో చిత్తూరు చేరుకునేసరికి ఒంటిగంటయింది. “యిప్పుడు యింటికి పోయి వంటేం జేస్తావుగాని, ఇక్కడే ఏదయినా తిందాం పదండి.”
“టిఫిన్ లేటుగా తిన్నాం. నాకంత ఆకలిలేదు” అంది వాగ్దేవి.
“నేనూ డిటో” అన్నాడు పతంజలి.
“మాట్లాడకుండా నా వెంటరండి’ అంటూ ఒక హోటల్‌కు తీసుకొని వెళ్లాడు.
‘శరవణ భవన్’ ఫ్యామిలీ రూములో కూర్చున్నారు.
సర్వరు వచ్చి మంచినీళ్లు పెట్టాడు. “ఏంకావాలిసార్” అనడిగాడు సర్వరు.
“మూడు వెజిటబుల్ పలావు తీసుకురా” అన్నాడు రామ్మూర్తి.
పావుగంట తర్వాత పింగాణీ ప్లేట్లలో పొగలు కక్కుతున్న వెజిటెబుల్ పలావు, కప్పులతో రైతా (పెరుగుపచ్చడి) వచ్చాయి. పతంజలికి ఈ అనుభవం కూడ కొత్తదే. పలావులో బంగాళాదుంప, క్యారేట్, బీన్స్, పచ్చిబటాణీ, జీడిపప్పు, నేతిలో వేయించిన బ్రెడ్ ముక్కలు, చాలా రుచిగా అనిపించింది. కడుపు నిండకుండా పరిమితంగా ఇచ్చాడు కాబట్టి రుచి మరింత పెరిగిందేమో అనిపించింది.
తిన్న తర్వాత ఇల్లు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. వాగ్దేవి బాగా అలసిపోయింది. సాయంత్రం నిద్ర లేచి కాఫీలు తాగాక, పతంజలిని బయటకు పోదాం తయారు కమ్మన్నాడు బావ. ఇద్దరూ మెయిన్ రోడ్డుకు వెళ్లారు ‘షాలిమార్ గార్మెంట్స్’ అని బోర్డు ఉన్న పెద్ద రెడీమేడ్ షాపులోకి తీసుకొని వెళ్లాడు బావ. ‘మెన్స్ వేర్’ అన్న బాణం గుర్తు చూపించిన వైపు వెళ్లారు.
కౌంటరు వెనక ఉన్న సేల్స్ మెన్‌తో చెప్పాడు బావ. “అబ్బాయి సైజు ప్యాంటు, టీషర్టు చూపించండి” అని.
అప్పుడర్థమయింది పతంజలికి తనకు బట్టలు కొనబోతున్నాడని. “బావా! వద్దు! యిప్పుడెందుకు అనవసరంగా!” అంటూ అభ్యంతరం తెలిపాడు. “అదేం కుదరదు. తీసుకోవాల్సిందే” అన్నాడు బావ ఖరాఖండీగా. నిస్సహాయంగా ఉండిపోయాడు పతంజలి.
(సశేషం)