[box type=’note’ fontsize=’16’] తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు. [/box]
రకరకాల అవధానాలు:
[dropcap]సం[/dropcap]ఖ్యాపరంగా వున్న అష్టావధాన, శతావధానాలు గాక సాహిత్య సంబంధమైన మరికొన్ని అవధానాలు కొంతమంది నిర్వహించారు. అవి: నవరసనావధానం, అలంకార అష్టావధానం, సాహిత్య ప్రక్రియావధానం, వచన కవితావధానం, ఘటికాశతగ్రంథకరణం, సమయలేఖిని, శత లేఖినీ పద్య సంధానం, చతుర్విధ కవిత్వ విద్యావధానం, అష్టభాషావ్యస్తాక్షరరావధానం, హాస్యావధానం, నవఘంట లేఖనం, కావ్యావధానం, అక్షరావధానం, ధారణావధానం.
వీటిలో సాహిత్య పరంగా పృచ్ఛకులు అవధానిని పరీక్షించి నిగ్గు తేలుస్తారు. ఆధునిక కాలంలో ‘ఏదో పోనీలే’ అనే ధోరణితో అవధానం కిట్టించడానికి పృచ్ఛకులు సహకరిస్తారు. పాతకాలం పండితులు అతడి తోలు వొలవాలని పట్టుబట్టేవారని పరిశోధకులు తెలిపారు.
గద్వాల సంస్థానం:
గద్వాల సంస్థానాధీశులైన సీతారామభూపాల్ గారి సభలో పిశుపాటి చిదంబరశాస్త్రి ప్రభువును ప్రస్తుతిస్తూ ఆశువుగా ఒక పద్యం చెప్పారు. రాజావారు పండిత సన్మానం చేశారు. సంస్థానంలో వున్న ఉన్నతోద్యోగి ఆదిపూడి ప్రభాకరరావు అసూయతో ఏవో కల్లబొల్లి కబుర్లు రాజావారికి చెప్పారు. కవితా పరీక్ష పేరుతో మరొకనాడు చిదంబరశాస్త్రిని కవ్వించి 16 అతి కఠినమైన ప్రశ్నలు గుప్పించారు. చిదంబరశాస్త్రి గెలిచారు.
ఏ విధంగానైనా చిదంబరశాస్త్రిని ఓడించాలని 1924 ఏప్రిల్ 20వ తేదీ చిదంబరశాస్త్రిచే సంపూర్ణ శతావధాన సభ ఏర్పాటు చేశారు. మూడు రోజులు జరగవలసిన సభ వ్యవధి లేదని రెండు రోజులలో పూర్తి చేయమని కోరారు. సమయాభావం వల్ల అవధానం పూరణలు పూర్తి కాలేదు. న్యాయము చేయమని చిదంబరశాస్త్రి ప్రభువు నర్థించారు. మత్సరగ్రస్థులైన అధికారులు ప్రభువు చెవి కొరికారు. అవధాని నిరాశతో చెన్నకేశవ స్వామి ఆలయంలో మిగతా పూరణలు పూర్తి చేసి గద్వాల వదిలి ఆదోని కేగారు. కొద్ది రోజులకే ప్రభువునకు సన్నిపాత జ్వరము వచ్చి 1924 మే 26న స్వర్గస్థులైనారని గద్వాల సంస్థాన సాహిత్య సేవపై పరిశోధనా గ్రంథం వెలువరించిన డా. హరిశివకుమార్ ఉదహరించారు (పుట 85).
మంత్రశక్తి:
అవధానికి మంత్రశక్తి తోడ్పడుతుందనే నమ్మకం ప్రబలంగా వుంది. పూర్వకవులు తమ మంత్రశక్తిని గూర్చి అక్కడక్కడ ప్రస్తావించారు.
‘చింతామణీ మంత్ర సిద్ధుం డుపాధ్యా భట్ట హర్షుడు’ అని శృంగార నైషధంలో శ్రీనాథుడు నైషధం రచించిన శ్రీహర్షుని ప్రస్తుతించాడు. ఏనుగు లక్ష్మణకవి శ్రీనాథుని ఇలా ప్రశంసించాడు.
‘మహిత చింతామణీ దివ్యమంత్రసిద్ధు
నైషధాది ప్రబంధ సందర్భ నిపుణు
సకల విద్యా విశారదు సత్కవిత్వ
పట్టభద్రుని శ్రీనాథు ప్రస్తుతింతు’ (రామేశ్వర మాహత్యం).
కందుకూరి వీరేశలింగం పంతులు తమ స్వీయ చరిత్ర (పుట 92)లో ఒక చమత్కార విషయం ప్రస్తావించారు: “అష్టావధానము చేయుట ధారణాశక్తి చేత ననుకోక, సామాన్యజనులు మంత్రశక్తి యని భ్రమించి, కాదని నా మిత్రులు చెప్పినను నమ్మక, నాకు ఉచ్చిష్ట గణపతి ఉపాసన ఉన్నదనీ, నేను గోచి పెట్టుకొంటినో లేదోయని నా వెనుకకు వచ్చి కొంచరు చూడసాగిరి”.
తిరుపతి వెంకట కవులిలా అన్నారు: “మున్నెవరికేని అవధానము ఏ ఉపాసనము వలననైన లభించియుండెనేమో మాకు తెలియదు గని, మాకు మాత్ర మట్లు రాలేదని యథార్థముగా వక్కానించుచున్నారము”.
శతలేఖినీ పద్య సంధాన ధౌరేయుడైన రామరాజభూషణుడు హనుమదుపాసకుడు. హరిశ్చంద్ర నలోపాఖ్యానంలో ఆయన ఇలా పేర్కొన్నారు: “వనధి లంఘన కృపా వర్ధితోభయ కవితాకళారత్నాకరుండు”.
– ఈ ఉదాహరణల వల్ల కవితాశక్తి భగవద్దత్తమేననీ, అవధాన విద్య అభ్యాసబలంలో సమకూరుతుందనీ తెలుస్తోంది.
సాహిత్య వివాదాలు:
అవధానుల మధ్య సాహిత్య స్పర్థలు కలిగి అవి దూషణభూషణలకు దారి తీశాయి. తిరుపతి వేంకట కవులు – వేంకట రామకృష్ణ కవుల మధ్య; అలానే తిరుపతి వేంకట కవులు – కొప్పరపు సోదర కవుల మధ్య వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి. తిరుపతి కవులకు – వారి గురువులు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారికి మధ్య వాగ్వివదాలు ప్రశస్తం. కాళహస్తి మాహత్యంలో శివునకీ, నత్కీరునికీ మధ్య గొడవ జరిగింది.
గీరతం అనే గ్రంథం ఈ వివాదాల ఫలితంగా తిరుపతి కవులు ప్రకటించారు. వేంకట రామకృష్ణ కవులు తమ గురువు గురించి మహాభారతంలో ఇలా పేర్కొన్నారు:
“ఎట్టా చదివితి మూన్నాళ్ళు పట్టపవలు
పట్టుమని రెండు ముక్కలు పలుకకున్న
తిరుగ డిక ఎన్ని చెప్పిన గురుడనంచు
తగులుకొన్నాడు నన్ను సైతాను లాగ.”
ఒకరినొకరు తిట్టుకుంటూ గ్రంథాలు వ్రాసుకొన్నారు. ఒకరు మహాభారతము వ్రాస్తే (రామకృష్ణకవులు), తిరుపతి కవులు గీరతం వ్రాశారు.
వేంకటరామకృష్ణ కవులు తిరుపతి వేంకట కవులకు వ్యతిరేకంగా కోకిల కాకము; వేంకటేశార్ధ శతకములకు ప్రతిగా వేలూరి శివరామశాస్త్రి బిడాలోపాఖ్యానం ప్రచురించారు.
ఈ స్పర్థలకు ప్రధానంగా రెండు కారణాలు:
- అవధానాలకు సంబంధించినది.
- శాఖా భేదానికి సంబంధించినది.
గురుశిష్యుల మధ్య వివాదం లేచినప్పుడు జయంతి రామయ్య పంతులు మధ్యవర్తి. చెళ్లపిళ్ల వారి చెరలాటం, జయంతి అనే గ్రంథాలు వెలువడ్డాయి. ‘స్పర్థయా వర్ధతే విద్యా’ వంటిది కాదిది. ఆదిభట్ల నారాయణదాసుగారు బందరులో అష్టావధానం చేసినప్పుడు కొందరు ఈర్ష్యాపరులు విమర్శ వ్రాయిస్తే దాసుగారు ప్రతిగా పద్యాలు ప్రచురించారు.
తెలుగుదేశ ఖ్యాతి:
ఎక్కడ చూచినా ఒకప్పుడు అవధానాలే. శతావధాని వేలూరి శివరామశాస్త్రి ఇలా అన్నారు:
“ఎక్కడ చూచినన్ కవులె, ఎక్కడ చూడ శతావధానులే
ఎక్కడ చూడ ఆశుకవు, లెక్కడ చూడ ప్రబంధ కర్తలే
దిక్కరులంచు పేర్వడిన తిర్పతి వేంకట సూరు లేగు నా
ప్రక్కల నెల్ల నీ కడుపు పండినదమ్మ! తెలుంగు దేశమా!”
డా. రాపాక ఏకాంబరాచార్యులు 2016 జూన్‍లో ‘అవధాన విద్యాసర్వస్వము’ అనే 1050 పుటల బృహద్గ్రంథం వెలువరించారు. వారు ఇలా పేర్కొన్నారు:
“అవధానముల ప్రదర్శన వలన అవధానికే కాకుండా పృచ్ఛకులకు, ప్రేక్షకులైన కవి పండితులకు, విద్యార్థులకు, అక్షరజ్ఞానం కలిగిన సామాన్యులకు అనేక ప్రయోజనాలున్నాయి. మాడభూషి వేంకటాచార్యుల వారి నుండి ఈనాటి వరకు మూడువెళ మంది అవధానులున్నారు. వారు లక్ష వరకు అవధానాలు ప్రదర్శించి ఉంటారు. తిరుపతి వేంకట కవుల కాలంలో అవధానం దివ్య తీర్థరాజమై వరలింది. ఆనాడు ఎక్కడ చూసినా అవధానములే!”
ఇది అక్షర సత్యం. ఇటీవలి కాలంలో పలువురు యువకులు విద్యార్థి దశలోనే అవధాన ప్రదర్శనలు ప్రారంభించారు. అవధానికి ప్రయోజనం ఏమిటనే ప్రశ్న వస్తుంది.
కీర్తి ప్రతిష్ఠలు:
అవధాని గొప్ప కీర్తిని పొందుతాడు. సత్కారాలు, సన్మానాలు, బిరుదులు పొందుతాడు. సామాన్య కవి కంటే అవధానికి మంచి ఖ్యాతి వస్తుంది. ధనార్జన కూడా సాధ్యం. లక్షలు సంపాదించకపోయినా, దారి భత్యము, నగదు సత్కృతి రూపంలో లభిస్తాయి. పలువురు అవధానులు బృహత్ గ్రంథాలు కూడా వెలయించారు. ప్రాచీనులలో తిరుపతి వేంకట కవుల ‘పాండవోద్యోగ విజయాలు’, దుర్భాక రాజశేఖర శతావధాని ”రాణాప్రతాపసింహచరిత్ర’, గడియారం వేంకట శేషశాస్త్రి ‘శివభారతము’ ఈ కోవలేనివే. అందువలన అవధాన పరంపర సాహిత్య విలువలను పెంచుతూనే వుంది.
(మళ్ళీ వచ్చే వారం)