[dropcap]మె[/dropcap]దడు మోకాళ్ళలో ఉన్నప్పుడు
మోకాళ్ళ పైనున్న చర్మపు సంచీ మీద
నేరం మోపడం సహజమే కదా
మెదళ్ళు మారాల్సిన చోట
మొగతనం నూర్చాలనేదెవరైనా
మౌకావాదమంటాను నేను
సామన్యులు అసమాన్యంగా ఆశించలేక
కాస్ట్రేషన్ అడిగుంటారులే
కానీ..
ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష నాయకులు
అతి సామాన్యంగా
సినిమాటిక్ కోరిక కోరితెట్లా
మూడు దశాబ్దాల నేరచరిత్ర
ఈరోజే కన్ను తెరిచింది
సకుటుంబ సమేత సజీవదహన సాక్ష్యంగా
నూరు గోదలతిన్న రాబందు కత పాతదే
ఇప్పుడిక్కడ కొత్త ‘పాడి’ఎట్లనో
అరాచక వెండితెరపై వేచిచూడాలి
చట్టం చేతుల కొలతలు తేలాలి
సస్పెండయితే పదోన్నతి తప్పనిచర్య
అరెస్టయిన వెంటనే బైల్ అతి సహజం
విచారకర సత్యం ఏమిటంటే
వేటయ్యేందుకు ఎంపిక చేసింది సొంతరక్తమే
అమాయకపు ఆశలకు ఆసరాలనుకున్న కీచకం
చిన్న చేపను పెద్దచేప మింగుడే దినచర్య
ఇక్కడన్నీ తిమింగలాలుగా మారినంక
ప్రజలే బలిపశువులు ప్రజాస్వామ్యం నైవేద్యం
అమ్మలే.. అమ్మాయిలే.. జాగ్రత్తగా ఉండాలట
నిజమే..
ఉంటే అమాయకం లేకుంటే అరాచకం కాదు
తెలివిడిగా కలివిడిగా అవసరమైతే కాళికలా
ఉండుమరి.. నికార్సయిన ఓటరులా…