కొబ్బరయిస్

0
3

[dropcap]”శం[/dropcap]కరా…, శంకరా”

‘ఎంత పిలిచినా పలికి చావడే వెధవ….’ ఇంకా నోరు నొప్పి పుట్టి పిలవడం మానేసింది, పెరట్లో పెసర పచ్చడి రుబ్బుతున్న రాజ్యం. సరిగ్గా అప్పుడే వచ్చింది తుఫాను. దాని పేరే కాంతమ్మత్త. ఆవిడ వూరందరికి కాంతమ్మత్తే. ఎపుడు ఊరికే రాదు, ఏదో ఒక వార్త మోసుకొస్తుంది. వాళ్ళు అలా అట, వీళ్ళు ఇలా అట అని ఏవేవో గాలి వార్తలు తెస్తుంది.

“ఇది విన్నావా రాజ్యం” అనే లోపు శంకరుడు మోకాలికి దెబ్బ తగిలించుకొని వచ్చాడు.

“అయ్యో! పిల్లాడి కాలి నిండా రక్తం.”

“ఏమయిందిరా? వీధిలో ఆడొద్దురా అంటే వింటావా? వినవు. ఆ సుబ్బుగాడితో కలిసి వీధులంతా తిరిగి తిరిగి వస్తావు. ఇదిగో ఇలా దెబ్బలు తగిలించుకుంటావు.” కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా అంది.

“వీడి అల్లరి నేను భరించలేను కాంతమ్మత్త. అపుడపుడు వాళ్ళ నాన్నతో తిట్లు తినలేక ఇల్లు వదిలి పారిపోవాలనిపిస్తుంది. ఇంతకీ ఎక్కడ పడ్డావో చెప్పు? ఇది ఆ బాచిగాడి పనే కదా చెప్పు?”

పిల్లాడికి దెబ్బ తగిలిందన్న బాధ, అల్లరివాడు అయిపోతున్నాడనే కోపమూ కలగలిసి పోయాయి రాజ్యంలో.

“ఆగవే రాజ్యం! పిల్లాడిని భయపెట్టి చంపేస్తావా ఏంటి? ఊరుకో నాన్నా, నా బంగారం కదూ. ముందు వాడి కాలికి పసుపు పెట్టు” అంది కాంతమ్మత్త.

ఏడుస్తున్న శంకర్ చెయ్యి పట్టుకొని “ఊరుకో నాన్న అదిగో పద వీధి చివర పుల్ల ఐస్ వాడు వున్నాడు, నీకు పుల్ల ఐస్ కొంటాను.” కాంతమ్మత్త చొరవగా అంది.

“మ్ మ్….. నాకు పుల్లయిస్ వద్దు మామ్మా, కొబ్బరయిస్ కావాలి” చిన్నగా ఏడుస్తూ అన్నాడు శంకర్.

“ఆరీ భడవా, ఐస్ అనగానే ఏడుపు ఆపేసావా. సరేలే పద వెళ్లి కొనుకుందాం” పసుపు వేసి, కట్టుకట్టి తనతో ఐస్ బండి దగ్గరకు తీసుకొని వెళ్లింది కాంతమ్మత్త శంకరును.

***

ఒక్కసారిగా మెలకువ వచ్చింది శంకరానికి. బాల్యస్మృతులు తియ్యని కలలా రావడం భలే గమ్మత్తుగా అనిపించి కళ్ళు తిప్పి పక్కకు చూశాడు. సుధ మంచి నిద్రలో ఉంది.

“సుధా లే, బారెడు పొద్దెక్కింది” అటుతిరిగి మరలా పడుకోబోతున్న సుధను మరోసారి నిద్రలేపి మంచం దిగుతూ చెమర్చిన కళ్ళను తుడుచుకొని, ఆనందంగా ఆ అయ్యప్పను తలుచుకొని తన రోజు వారి పనులు ప్రారంబించాడు. ఆదివారం కావడం మూలాన తీరికగా కాఫీ త్రాగుతూ, పేపర్ చదువుతున్నాడు శంకరం.

శంకరం స్నానం చేసి పూజ ముగించుకొని టిఫిన్ తిని సోఫాలో కూర్చున్నాడు. అప్పటికీ ఇంకా కొడుకు నిద్ర లేవలేదు.

“సుధా! ఏం ఇంకా కార్తీక్ నిద్ర లేవలేదా? వెళ్లి లేపు” అన్నాడు శంకర్ కోపంగా.

“లేస్తాడు లెండి, ఇపుడు లేచి మాత్రం వాడేమీ చెయ్యాలి? ఆదివారమే కదా” విసుక్కుంటూ వంట గదిలోకి వెళ్ళిపోయింది సుధ.

“సుధా! వాడిని నిద్ర లేపుతావా. వాడితో కాసేపు మాట్లాడి, ఆడుకోవాలి” ఎందుకో శంకర్ గొంతు బాధగా పలికింది.

“హవ్వ! మీరేమన్నా చిన్న పిల్లాడా వాడితో ఆడుకోవడానికి, అయినా వాడు రాత్రంతా అదేదో ఆట ఫోన్లో ఆడి, ఆలస్యంగా పడుకున్నాడు. ముందు మీరు బజారులోకి వెళ్లి పంచదార, ఉల్లిపాయలు పట్టుకురండి.”

“అదేమిటే మొన్నేకదా ఆఫీస్ నుండి వస్తూ, రెండు కేజీలు తెచ్చాను. అపుడే అయిపోయాయా ఉల్లిపాయలు. అదంతా నీ వంట మహిమే.”

“మీరేం నన్ను వెటకారం చెయ్యొద్దు. చెప్పినవి పట్రండి” మూతి మూడు వంకర్లు తిప్పింది సుధ.

“అలాగే వాడికి మాగీ ప్యాకెట్లు, చాక్లెట్లు పట్టుకురండి. అలాగే వచ్చే దారిలో వీధి చివరన కొట్టులో చీరలు కుట్టుకిచ్చాను. అయిదువందుల రూపాయిలు ఆవిడకి ఇచ్చి పట్రండి.”

“అమ్మా! తల్లీ! ఇంకా ఏమైనా ఉన్నాయా పనులు? సెలవు రోజు కూడా ప్రశాంతంగా ఇంట్లో ఉండనివ్వవు కదా” రెండు చేతులు పైకెత్తి నాటకీయంగా అన్నాడు శంకర్.

“వెళ్తారా, ఇలాగే కబుర్లు చెప్తూ ఉంటారా?”

“హ, బయలుదేరుతున్నాను. నేను వచ్చేసరికి వాడిని నిద్ర లేపు”

“అలాగే చూద్దాం లెండి” ధీమాగా అంది సుధ. ఆలోచనలతో అడుగులు మార్కెట్ వైపు వేస్తున్నాడు శంకరం.

***

“ఒరేయ్ శంకరా, ఒక్కసారికి ఆగరా.. నా తండ్రి కదూ ఆగరా”

“నేను ఆగనమ్మా, నాకు ఆ ఆవదం వద్దు” దూరంగా జరుగుతూ అన్నాడు చిన్నారి శంకర్.

“వస్తున్నావా, లేదంటే మీ నాన్నని పిలవనా? ఏవండీ చూడండి వీడు నామాట వినటం లేదు” లోపలున్న భర్తను కేకేసింది రాజ్యం. గదిలో నుండి బయటకి వచ్చి కొడుకుని పట్టుకొని ముద్దుపెట్టాడు నరసింహం.

హెడ్ మాస్టర్‌గా పనిచేస్తూ, మంచి విలువలు గల ఆయనంటే వూర్లో అందరికీ భక్తి. ఆయనకు భార్య అంటే ప్రేమ. కొడుకంటే ప్రాణం. కొడుకుని వళ్ళో కూర్చోబెట్టుకొని “నాన్నా నువ్వు బంగారం కదూ, అసలు ఆముదం ఎందుకు తాగుతారో తెలుసా?” కొడుకు గడ్డం పట్టుకొని అడిగాడు.

“తెలీదు నాన్నగారు” తల అడ్డంగా వూపాడు శంకర్.

“చెప్తాను విను, నీ చిన్నిబొజ్జ వుంది కదా, మరేమో అందులో బోలెడు పాములు వున్నాయి.” కొడుకు పొట్టపై మృదువుగా నిమురుతూ అన్నారు నరసింహం.

“పాములా! నా బొజ్జలోనా?” నోరు వెళ్లబెట్టాడు శంకర్.

“హ. నీ బొజ్జలోనే. వాటికీ మరి మందు వేస్తేనే అవి బయటకి వస్తాయి. లేకపోతే నీ బొజ్జలో అవి అటు ఇటు, ఇటు అటు పరిగెడుతూ ఉంటాయి అపుడు నీకు బాగా బొజ్జ నొప్పి వస్తుంది.”

“అంటే నాన్నా, మన సుబ్బుగాడికి వచ్చినట్టా?”

“అవును, అందుకే అమ్మ నాన్న చెప్పినట్టు విన్నావనుకో నీకు బొజ్జ నొప్పి రాదు. పైగా నీకు మన సత్తి గాడి దగ్గర పుల్ల ఐస్ కొనిస్తాను. సరేనా” లాలనగా చెప్పారు నరశింహం.

“కాదు నాన్నా, నాకు కొబ్బరి ఐస్ కావాలి” ముద్దుమాటలు శంకర్లో.

నరసింహం గారికి నవ్వొచ్చింది. ఇంతలో వచ్చింది కాంతమ్మత్త. “ఏమిటిరా నరసింహం! నీ కొడుకు ఏదో వరం అడుగుతున్నాడు” నవ్వింది కాంతమ్మత్త.

“అదేం లేదు పిన్ని! ఆముదం తాగమంటే లంచంగా కొబ్బరి ఐస్ అడిగాడులే, కాదు కాదు నేనే ఇస్తా అన్నాను.”

“ఓరి నీ అసాధ్యం కూలా! మొన్నోసారి దెబ్బ తగిలించుకొని వచ్చి ఏడుస్తూ ఇదే కొబ్బరి ఐస్ అడిగాడు. అంత ఇష్టమేమిటిరా నీకు, మీ నాన్న కాదు నేను కొంటాను. ఒంటికి నలుగు పెట్టుకొని స్నానం చేయాలి మరి సరేనా” తర్జని చూపిస్తూ అంది. శంకరంటే కాంతమ్మత్తకు చాలా ఇష్టం.

“అలాగే మామ్మ” బుద్ధిగా తలూపాడు శంకర్.

***

శంకరం తన ఆలోచనల నుండి బయటకి వచ్చి తన కొడుకు బాల్యాన్ని తానే పాడు చేస్తున్నానా అని అనుకున్నాడు. బజారులో కావలసినవి అన్ని కొనుక్కొని ఇంటికి రాగానే కొడుకు సోఫాలో కూర్చొని సెల్ ఫోన్‌లో గేమ్ ఆడుతున్నాడు. సుధ పెరటి పిట్టగోడ దగ్గర పక్కింటి ఆవిడతో ముచ్చట్లో ఉంది.

“సుధా! సుధా!” కబుర్ల కడలి హోరులో మునిగిపోయిన సుధ చెవిన చేరలేదు శంకర్ పిలుపులు. చిరాకుతో సోఫాలో కూలబడ్డాడు శంకరం.

ఆ పక్కనే కూర్చుని సెల్‌లో గేమ్స్ ఆడుతున్న కొడుకు వైపు ప్రేమగా చూస్తూ చూడసాగాడు, అయినా అది గమనించే పరిస్థితిలో లేదు కొడుకు కార్తీక్.

“బాబు, హోం వర్క్ అయిపోయిందా?” ప్రేమగా అడిగాడు.

పిలిచినా పలకనంతగా ఆటలో మునిగి పోయాడు. ఈసారి శంకరానికి బాగా కోపం వచ్చింది. “సుధా!” గట్టిగా అరిచాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, “ఏం కొంపలు మునిగాయని ఆలా అరుస్తున్నారు.” అంది.

“ఎందుకో అరుస్తున్నానో నీకు తెలియదా కొడుకుని ఎంత బాగా పెంచావో కదా అందుకు” చిరాకుగా అన్నాడు.

“వాడికేం బంగారం” కొడుకు వైపు గారంగా చూస్తూ చెప్పింది సుధ.

“సిగ్గులేదు ఆ మాట చెప్పటానికి, వాడు పదో తరగతికి వచ్చాడు. నువ్వేమో వాడిని పట్టించుకోకుండా టీవీ, ఫోన్, పక్క వాళ్ళతో ముచ్చట్లు, కొడుకు భవిష్యత్తుపై ఏమాత్రం బెంగ బాధ ఉన్నాయా నీకు? వాడికి పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు. నీవల్లే వాడు ఇలా తయారయ్యాడు”.

“ఎందుకలా ఏదో ఒకటి వాగుతారు, చదువుతాడులెండి. నా బిడ్డ బంగారం” తననే దోషిలా చూస్తున్న భర్తతో ఆవేశంగా అంది.

అంతగా వారు వాదించుకుంటున్న అక్కడున్న కార్తీక్‌కి మాత్రం ఏం వినపడలేదు. సెల్లో గేమ్స్ ఆడటానికే రోజూ కడుపునొప్పి సాకుతో స్కూల్ ఎగొట్టి, సెల్లో మునిగిపోయిన కార్తీక్ తల్లిదండ్రుల వాదనలు వినపడనంతగా ఆటలో మునిగిపోయాడు.

కొడుకును మూర్ఖంగా వెనకేసుకొచ్చే భార్య, మారని కొడకును ఒరకంటితో చూస్తున్న శంకర్ గుండె బాధగా మూలిగింది.

సరిగ్గా చదవని కార్తీక్ పదో తరగతి తప్పాడు. కొడుకుకు నచ్చచెప్పి పది పాసయ్యేలా చెయ్యడానికి సుధ మూడు చెరువులు నీళ్ళు తాగింది. ఆ తరువాత ఇంటర్ రెండేళ్ళు వాడు గేమ్స్ ఆడుకోటానికే సరిపోలేదు. ఫలితం ఇంటర్ తప్పాడు. ఈసారి కొడుకు భవిష్యత్ ఏంటో సుధకి అర్థం కాలేదు. చదువు లేదు ఇంట్లోనే వుండి, తినడం గేమ్ ఆడడం ఇదే పని.

అపుడు సుధకి అర్థమయింది. తాను ఎంత తప్పు చేసిందో అని, అప్పటికే కొడుకు జీవితం అంధకారం లోకి వెళ్ళిపోయింది. ఒక్కడే కొడుకని గారం చేస్తే ఇలా పాడయిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొడుకేమో మన మాట వినే స్టేజి దాటిపోయాడు. గట్టిగా ఏదైనా అంటే అమ్మనాన్నలని కూడా కొట్టేలా వున్నాడు. లేదా అఘాయిత్యం చేసుకొనేలా ఉన్నాడు.

ఇదంతా శంకరం బాదతో చూస్తూ వున్నాడు. కానీ ఎవ్వరిని ఏమి అడగలేడు. అనలేడు. ఆలోచనా బాధా కలిపి శంకరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

తన చిన్నతనంలో తాను తప్పు చేస్తే తన తల్లి తండ్రి తనని కూర్చోబెట్టి తప్పుకి ఒప్పుకి తేడా చెప్పేవారు. ఏది చేయాలో చేయకూడదు చెప్పేవారు. ఆ రోజుల్లో ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉండేవాళ్ళం. ఎన్ని కష్టాలు వున్నా నాన్న మొహంలో ధైర్యం, అమ్మ మొహంలో చిరునవ్వు కనపడేది. అవే పిల్లలకి వరం, బలం అయ్యేవి. కానీ ఇపుడు ఆ రోజులు లేవు ఇంకా రావు.

శంకరం బాధలో నుండి బయటకి వచ్చి ‘కొడుకుకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. తండ్రిగా అది నా బాధ్యత’ మనసులోనే ప్రతిన పూనాడు. కొడుకు చేసే తప్పు తనకి తెలియాలి అనుకున్నాడు. శంకరం తన తండ్రి తనతో ఎలా ఉండేవాడో గుర్తుచేసుకొంటూ రోజూ కొడుకు పక్కనే వుండి, సమయాన్ని గడుపుతూ, మంచి చెడ్డలు, అసలు జీవితం అంటే ఏమిటో కార్తీక్‌కి అర్థం అయ్యేలా చెప్పసాగాడు. తండ్రిగా తను చేసిన తప్పును దిద్దుకోసాగాడు శంకరం. స్నేహితులు అందరూ డిగ్రీలో జాయిన్ అయిపోయారన్న బాధలో ఉన్న కార్తీక్‌పై తండ్రి మాటలు ప్రభావం చూపించాయి.

ఇపుడు కార్తీక్ తన తండ్రి సహాయంతో ఇంటర్ పూర్తి చేసి, తనకిష్టమైన గేమ్స్ సంబందించి కంప్యూటర్ కోర్స్ చేసి, బెంగళూరులో ఒక మంచి స్థాయిలో వున్నాడు. ఈరోజు శంకరం తన కొడుకుని చూడటానికి భార్యతో సహా వస్తున్నాడు. కొడుకును ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన భర్తపై గౌరవం, ప్రేమ పెరిగాయి సుధకు. ఇపుడు సుధకి భర్త ఎంత చెప్తే అంత.

కార్తీక్ రైలు కోసం స్టేషన్‌లో ఎదురుచూస్తున్నాడు. రైలు వచ్చింది తండ్రి రైలు దిగి, అమాంతం కొడుకుని కౌగిలించుకున్నాడు. చేతిలో ఉన్న చిన్న బాక్స్ తీసి, కొబ్బరయిస్ తండ్రి నోటికి అందించాడు కార్తీక్. శంకర్ ముఖం వెలిగిపోయింది. సుధ మురిసిపోతూ కొడుకు తలపై చెయ్యివేసింది. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది ఏ తల్లి తండ్రులకైనా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here