విశ్వైక గీతం- జాతి విపంచీగానం

1
4

[dropcap]సం[/dropcap]స్కృతీ సంపన్నమైన హృదయం తాను, తన కుటుంబం, తన దేశం, తన జాతి అనే పరిధులను దాటి వినీల విహాయసంలో సంచరిస్తూ విశ్వ చైతన్యంలో తాను అంతర్భాగమేననే స్ఫురణను కలిగి ఉంటుంది. ఈ దేశ జాతీయతకు పునాది ఆధ్యాత్మికత. పరిణతి చెందిన మనసు, వయసు ఆ పునాదులను పరిశీలిస్తుంది. జాతీయ సౌధంపైన నిలచి వినువీధిలో సగర్వంగా రెపరెపలాడుతున్న ధ్వజం ప్రపంచానికి మార్గదర్శనం చేయగలుగుతుంది. సంకుచితత్వంతో ముడుచుకుపోయిన హృదయ కుసుమం పరిమళాలను వెదజల్లలేదు. విస్తృతమైన అధ్యయనం, నిరంతర సాధన, అపారమైన అనుభవం ఈ భావాలకు తోడైతే — ఇదిగో ఇలా జాతి విపంచి తీగలను సవరించుకుని విశ్వమోహనంగా ఆలపిస్తుంది. సహృదయ హృదయాలలో ఆ వీణాస్వనం ప్రతిధ్వనిస్తుంది. జాతి విపంచీ తంత్రులను మీటుతూ మధుర గానాన్ని ఆలపించిన ఆ వైణికుడు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు.

శివభారతం, రాణా ప్రతాపసింహ చరిత్ర వంటి కావ్యాలు ఆ కాలానికి అవసరమని గ్రహించిన కవులు చారిత్రక సత్యాలకు తమ భావనాబలాన్ని జోడించి అద్భుతంగా రచించారు. ప్రస్తుత పరిస్థితులలో ఈ ‘జాతి విపంచీగానం’ అవసరం కూడా అటువంటిదే. ఆచార్య వీరభద్రయ్య గారు మ్రోయించిన ఈ జాతి విపంచి, ఆ వల్లకీ తంత్రులపైన వారు ఆలపించిన గీతం భరతజాతి వైశిష్ట్యాన్ని వివరిస్తూ జాతి అలవరచుకోవలసిన దృక్పథాన్ని బోధిస్తుంది. వీరభద్రయ్య గారికి సంగీత సాహిత్యాలు రెండు కళ్ళు. వీణపైన మధురమైన రాగాలను పలికించగల గొప్ప వైణికులు. ఆ వీణానాదాన్ని తమ కావ్యంలోనూ అంత చక్కగా వినిపించారు.

ఆచార్య వీరభద్రయ్యగారు రచించిన ఈ జాతీయ కావ్యాన్ని తెలుగు విజ్ఞానపరిషత్తు ప్రచురించింది. కవి ఈ జాతీయతాగర్భ అంతర్జాతీయతా సువర్ణపుష్పాన్ని కవి పండిత శ్రేష్ఠులైన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారికి అంకితమిచ్చారు. తెలుగునాట పాత్రికేయ రంగంలో సుప్రసిద్ధులైన శ్రీ చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఈ కావ్యానికి ప్రథమ శ్రోత. ‘జాతి విశ్వ చైతన్య గీతం ఈ కావ్యం’ అంటూ తెలుగు విజ్ఞాన పరిషత్తు అధ్యక్షులైన ఆచార్య యాదగిరి గారు, ‘కళ్ళు తెరిపించే కావ్యం’ అంటూ అఖిల భారతీయ సాహిత్య పరిషత్తు అధ్యక్షులైన ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ జాతి విపంచీగానాన్ని పరిచయం చేసారు. శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని గారు ఈ కావ్యాన్ని హిందీలోకి అనువదించారు. ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు గారు సాహిత్యలోకంలోకి దీనిని తీసుకువస్తున్నారు. ఇంతమంది ఆచార్యుల మధ్య కూర్చుని ఈ మధురగానాన్ని విని ఆనందించిన శ్రోతగా, ‘ఆజాదీ కీ అమృతోత్సవ్’ సందర్భంగా నావీ నాలుగు మాటలు.

కవిగారు ముందుగా భరతజాతి వైశిష్ట్యాన్ని గురించి తెలియజేసారు. ఒక వ్యక్తిగాని, జాతిగాని గురుస్థానంలో నిలవాలంటే ఒక అర్హత ఉండాలి. తన మాటల వలనగాని, చేతల వలనగాని ఇతరులకు మార్గనిర్దేశం చేయగలిగే స్థాయి ఉండాలి. అందుకే కవి

“ఎన్నెన్నో రకాల పూల మొలకలున్నా

వాటి ప్రసూనాలు ప్రసరించే సుగంధాల ఏకతనే

ఆదర్శంగా తీసికొని నిరంతరం యత్నిస్తున్న జాతి”

అంటూ భరతజాతి ప్రత్యేకతను చెప్పారు.

ఇదే ‘భిన్నత్వంలో ఏకత్వం’.ప్రపంచంలో ఎన్నో జాతులున్నాయి. భరతజాతి త్రిగుణాలలో సత్వానికే ప్రాధాన్యమిస్తుందని అంటారు కవి.

“రజస్తమస్సుల ననుక్షణం అణచివేస్తూ

కేవల సత్వాన్నే భజించి లోకానికి

ఆదర్శాన్ని ఇచ్చిన అద్భుతజాతి భరతజాతి”

ఏ విషయాన్నైనా చెప్పే వ్యక్తికి ఉన్నట్లే వినే వారికి కూడా యోగ్యత ఉండాలి. కాళిదాసు అన్నట్లు ‘తం సంతః శ్రోతుమర్హంతి’. అందుకే కవి తన గానం

“జాతిని బలిష్ఠంచేస్తూ కొత్త వాటిని

సహృదయంగా స్వీకరిస్తూ

అంతర్జాతీయతను నిజంగా లక్ష్యం చేసికొన్న

నిజాయితీపరుల కోసం” అని చెప్పారు.

జగత్తుకి వెలుగు రవ్వలు పంచిన జ్ఞానజ్యోతి, భరత ధరిత్రి యోగ సమాధిలోమునిగిపోయి శత్రువులు జాతి శరీరానికి తూట్లు పొడిచినా పట్టించుకోలేదంటారు కవి. ప్రతిక్రియ చేయవచ్చు కదా! అనిపిస్తుంది మనకు. అందుకే కవి వెంటనే ఇది యోగభూమి అని దానికి కారణాన్ని చెప్పారు. యోగి తపస్సమాధిలో మునిగిఉండి శరీరాన్ని పట్టించుకోడు. భౌతికంగా ఉన్న చోటనే ఉన్నా మనసు, బుద్ధి ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహిస్తాయి. శారీరక శక్తి గొప్పదే. కానీ మానసిక స్థైర్యం, ఆధ్యాత్మిక శక్తి అంతకంటే గొప్పవి. లక్ష్యసాధన కోసం చేసేది అంతర్ముఖ ప్రయాణం. ఆధ్యాత్మికతీరం సుదూరంగా ఉన్నా అంతర్ముఖత్వంతో పరమ గమ్యమైన ఆ తీరానికి జాతి చేరుకున్ననాడు ఇక తిరుగులేదు. అందుకే ఈ ప్రశాంతజాతిని శతాబ్దాలుగా ముష్కరులు ఎంతగా కొల్లగొట్టినా ‘తరగని ఐశ్వర్యంతోనే కాదు, తరగని ప్రశాంతితో కూడా నిలిచి ఉన్న జాతి’ అంటారు కవి. ముష్కరులు దోచుకోవటాన్ని తేనె దొంగతనాని కోసం తుట్టె కింద మంట పెట్టటంతో పోల్చారు. ముష్కరులు కొల్లగొట్టటంతో ఆగలేదు. వెన్నెముకను విరిచారు; క్లైబ్యమాపాదించారు; భూమిలో పాతిపెట్టారు. అయినా జీవమున్న ఈ జాతి మర్రిచెట్టులా పైపైకి బలంగా,నిటారుగా అనేకానేకమైన ఊడలతో విస్తరించిందన్నారు.

రాణా ప్రతాపసింహుడు రాజర్షి, ఈ కాశ్యపీఖండం ప్రసవించిన వీరఖడ్గం. మన మహాపూర్వుడు ధర్మజుడు సోదరులతో కలసి పాచికల మోస ఫలితంగా అరణ్యవాసం చేసాడు. ఇంతటి మహానుభావులు ఇడుములనన్నిటిని ఓపికతో సహించారు. ఒక్కొక్కసారి వెంటనే చేసే ప్రతిక్రియ కంటే సహనమే గొప్ప ఆయుధమవుతుందనే సత్యాన్ని వీరభద్రయ్యగారు ఈ ఉదాహరణలతో ధ్వనింపజేసారు. ఆ సహనమే ఈ జాతికి ఆదర్శమని తేల్చి చెప్పారు.

“గజదొంగ గజినీదా వాని వారసులదా ఈ దేశం?

వాని మోసానికి జైకొట్టే పిచ్చివాళ్ళా ఆదర్శం

ఈ జాతికి?”

అని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తడుముకోకుండా జవాబు చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. అందుకే ముందు పేర్కొన్న జాతీయ కావ్యాలవలె ఈ కావ్యం కూడా చారిత్రక అవసరం. ఈ జాతి అంతశ్చేతనలో, ఈ జాతి జ్ఞాననేత్రానికి అగుపించిన శాశ్వతసత్యమే దీనికి దృఢమైన వెన్నెముక. ఇది శక్తివంతంగా రూపొందిన దధీచి వెన్నెముక వంటిది. లౌకిక సంపదలను కోల్పోయినా ఆర్జించిన ఆధ్యాత్మిక సత్యజ్ఞానంతో పరతంత్రానికి మనసు బానిస కాలేదు. ఆ సత్యదర్శనమే రాజకీయ స్వాతంత్ర్యాన్ని కూడా కలిగించింది. వీరభద్రయ్యగారి విపంచి వినిపించిన గానం ఈ ఆశావహ దృక్పథమే. అందుకే వేవెలుగుల రేడు, జ్ఞానసూర్యుడు ప్రకాశిస్తుంటే ‘జాతిచైతన్యం ఇక తిరోగామి అవనే అవదు’ అని నిర్ద్వంద్వంగా చెప్పారు.

వీరభద్రయ్యగారు విషయ ప్రతిపాదనకు ప్రయోగించిన ఉపమానాలు అపూర్వమైనవి. చరిత్ర పాఠాలను రక్తనిష్ఠం చేసుకోవాలంటే శ్రమపడక తప్పదు. మొలకపై పూసిన పూవు తేలికగా చేతికందుతుంది. కానీ వృక్షంపైన పూసిన పూవును అందుకోవాలంటే చెట్టెక్కాల్సిందే అంటారు. అదీ జాగ్రత్తగా. నిజమే మరి – చెట్టును ఎక్కేటప్పుడు చూపు చెదిరినా, కాలు జారినా కింద పడిపోతాం. చారిత్రక సత్యాలను అవగతం చేసుకోవాలంటే మనని తప్పుదారి పట్టించేవి, సత్యాలను మరుగుపరచేవి అయిన అసత్య, స్వార్థపూరిత కథనాలు ఉంటాయిగా! అందుకే జాగ్రత్త అవసరం. మహర్షులు సన్మార్గాన్నే చూపుతారు – వారు ప్రాచ్యులైనా పాశ్చాత్యులైనా. కానీ శిష్యులు దానిని పట్టించుకోకుండా, ఆ జ్ఞానమార్గానికి ప్రాధాన్యం ఇవ్వకుండా తమ కండకావరానికి ప్రాధాన్యమిస్తే, దానికి వ్యాప్తి కలిగిస్తే ఏ జాతి అయినా తిరోగమన పథంవైపే పయనిస్తుంది. దీనికి ఉదాహరణగా వీరభద్రయ్య గారు గ్రీకుల పతనాన్ని ప్రస్తావిస్తూ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ లను, వారి శిష్యుడైన అలెగ్జాండర్‌ను పేర్కొన్నారు. చరిత్రలో బలానికి, బలహీనతకూ కూడా స్థానం లేదని చెపుతూ దాడి చేసిన పులిని, దానికి ఆహారమైన లేడిని నిదర్శనంగా చెప్పారు. వారు చరిత్రకు ఇచ్చిన నిర్వచనాన్ని చూడండి.

“చరిత్ర అంటే జ్ఞానం యొక్క రికార్డు

చరిత్ర అంటే మానవ జ్ఞాన పురోగతి

చరిత్ర అంటే మానుష మానవుడు

దివ్యునిగా పరిణమించే కథనం”

“నాయకులు విజ్ఞానులవుతే

భూగోళం మీదున్న ప్రతి దేశమూ

ఒక యోగభూమే!” అంటారు.

ఆశ వేరు,ఆశయం వేరు. ఏ జాతికైనా వ్యక్తికైనా ఆశలుండటంలో తప్పులేదు.కానీ ఆ ఆశల చిగుళ్లను ఆశయాల హరితపత్రాలుగా పరిణమింప జేయాలని బోధించారు కవి.

“అవసరానికి మించిన ఆశలు సుడిగుండాలయి

నదీగర్భందాకా ముంచుతవని చరిత్ర చెప్పిన పాఠం”

అని హెచ్చరించారు.

పంచభూతాలను దేవతామూర్తులుగా ఆరాధించే జాతి భరతజాతి. సూర్యుని ఒక గ్రహంగానే కాక తమ కర్మలన్నిటికీ సాక్షిగా, నారాయణునిగా భావించి పూజించే జాతి ఇది. సూర్యకిరణాలు ఆరోగ్య ప్రదాలనే కాదు- ఆ తేజస్సు మన బుద్ధిని సక్రమ మార్గంలో ప్రచోదితమయ్యేటట్లు చేయమని ‘ధియోయోనః ప్రచోదయాత్’ అని ప్రార్థిస్తాం. కవి ఆ సవితృతేజాన్నీ ప్రస్తావించారు.నక్షత్రాలు ప్రసాదించే వెలుగును, అస్తమయానంతర ప్రదోషవేళలో ప్రకృతి బోధిస్తున్న పాఠాలను జాతులు నేర్వాలని ఉపదేశించారు. భావ దాస్యంతో తమ జాతి మహత్వాన్ని గుర్తించని వారికి, లోపాలనే చూసేవారికి క్రింది మాటలు మంచి చురకలు.

“ఎలుకలు పడ్డవని ఇంటినెవ్వరూ తగులబెట్టుకోరు

లోపాలు తలెత్తినవని జాతినెవ్వరూనశింపజేసికోరు”

జాతి ప్రతిష్ఠాపనకు ఇచ్చిన నిర్వచనం చూడండి.

“భిన్నభిన్న వ్యక్తుల అదృశ్య ఆత్మగా

ఏకీకృత ఏకాత్మగా

భాసించటమే జాతి ప్రతిష్ఠాపన”

అంపశయ్య మీద ఉన్న భీష్మునికి దప్పిక తీర్చినది స్వచ్ఛమైన భూగర్భ జలమే. అలాగే కావ్య సరస్సులు కూడా.

“జీవితానుభవాల బాణం నేలలోకి ప్రయోగిస్తే

చిమ్మిన కవితామృతమే కావ్య సరస్సులయినవి.”

అనుకరణ మంచిది కాదని స్పష్టంగా చెప్పారు. అనుకరణ వ్యామోహంతో ఉండేవాడరు తాము అస్తిత్వాన్ని కోల్పోవడమే కాక తరతరాలకు ఆ విషఫలాల్ని అందిస్తారని హెచ్చరించారు. భరతజాతి తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఎల్లలు దాటి అంతర్జాతీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. ‘లోకాః సమస్తాః సుఖినోభవంతు’ అనే వేదఋషి వాక్కు ఇది.

ఆచార్యులవారు ‘అశుభ మలిన వాసనలతో జన్మలు వ్యర్థమౌతాయని భయపడండి’ అన్న ఒక్క వాక్యంతో కర్మసిద్ధాంతాన్ని గుర్తు చేసారు. వీటితో ఒకటి కాదు- జన్మలు వ్యర్ధమవుతాయి. అందుకే నిత్యం జాగరూకులై ఉండాలని ఉద్బోధించారు. అహంకారం విషమని, అది జ్ఞానానికి ఫలితం కాదని నిష్కర్షగా చెప్పారు. గతంలో ఉన్నదాన్ని అవసరమైనంత మేరకు వర్తమానంలో ఉపయోగించుకోవాలని, అలాగే లేనిదాన్ని ఉన్నదని భ్రమపడటం వలన సత్యానికి దూరమవుతామని ఖండితంగా చెప్పారు. భరతజాతి సాధించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఔన్నత్యాన్ని వివరిస్తూ నచికేతుడు, సావిత్రి, మార్కండేయుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు మొదలైన వారి నుండి రామకృష్ణ, వివేకానంద, రమణ, సత్యసాయి, అరవిందుల వరకు ఎంతో మందిని స్మరించారు.

ఈ విధంగా భరతజాతి విశిష్టతను వివరిస్తూ, భావదాస్యం, అనుకరణలు కూడవని హెచ్చరిస్తూ, చరిత్ర పఠనం ఎలా సాగాలో నిర్దేశిస్తూ, చరిత్ర, జాతి, జాతీయత, జాతి ప్రతిష్ఠాపనలకు నిర్దుష్టమైన నిర్వచనాలిస్తూ, సంకుచితత్వాన్ని వీడమని బోధిస్తూ అనేక విషయాలను అనేక రాగాలుగా పలికిస్తూ సాగిన విపంచీగానమిది. ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు విశ్వ సంగీతంతో మేళవించి వినిపించిన మన జాతి విపంచీగానమే ఈ జాతీయ కావ్యం. ఈ కావ్యాన్ని సాహితీలోకంలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను.

***

జాతి విపంచీగానం
ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య
పుటలు: 64
వెల: ₹ 70/-
ప్రచురణ: తెలుగు విజ్ఞాన పరిషత్తు, హైదరాబాదు
ప్రతులకు:
రచయత: ముదిగొండ వీరభద్రయ్య
92462 76573
డా. అప్పం పాండయ్య
కార్యదర్శి, తెలుగు విజ్ఞాన పరిషత్తు
ఫోన్ నెం. 97030 79900

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here