[dropcap]17[/dropcap]-01-2022 తేదీన విశాఖ సాహితి ఆధ్వర్యంలో విశాఖ సాహితి అధ్యక్షులు ఆచార్య కోలవెన్ను మలయవాసిని అధ్యక్షతన, సుప్రసిద్ధ కథకులు శ్రీ చాసో గారి 107వ జయంతి సభ అంతర్జాల మాధ్యమంలో జరిగినది. ప్రార్థనగా గురజాడవారి ‘దేశమును ప్రేమించుమన్నా’ గీతాన్ని ఆచార్య కోలవెన్ను పాండురంగ విఠల్ మూర్తి, డా. కె.కమల వినిపించారు.
ఆచార్య మలయవాసిని, కథకులకు మార్గదర్శి శ్రీ చాసోగారి జయంతి సభ విశాఖ సాహితి వేదికగా జరుపుకోవడం ఆనందదాయకంగా ఉన్నదని, ఈ సభలో శ్రీ చాసోగారి కుమార్తెలు డా. చాగంటి తులసి, డా. చాగంటి కృష్ణకుమారి పాల్గొన్నందులకు వారిని అభినందించి, శ్రీ చాసో కథా రచన ఒక సాధనగా భావించారని పేర్కొన్నారు.
సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు తమకు చాసోగారితో గల పరిచయాన్ని గుర్తుచేసుకొని, శ్రీ చాసో సప్తతి సందర్భంగా వారు విశాఖ వచ్చినపుడు రెండు రోజులు తమ ఆతిథ్యాన్ని స్వీకరించినందులకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. ఆ సమయంలో శ్రీ చాసోగారితో జరిగిన సంభాషణలు కొన్ని రికార్డు చేసి పదిలపరిచామని చెప్పి, ఆ సంభాషణలు కొన్ని సభకు వినిపించారు.
శ్రీ చాసోగారి కుమార్తె డా. చాగంటి కృష్ణకుమారి గారు 1943లో ప్రచురించబడిన రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో వ్రాసిన శ్రీ చాసోగారి ‘భల్లూక స్వప్నం’ కథ వినిపించారు.
‘శ్రీ చాసో గారి రచనలలో మహిళలు’ అనే అంశంపై మాట్లాడుతూ ఢిల్లీ నుంచి పాల్గొన్న ప్రముఖ రచయిత శ్రీ దాసరి అమరేంద్ర చాసో గారి కథలలో స్త్రీలు ముఖ్యపాత్ర వహించిన కొన్ని కథలలో స్త్రీ పాత్ర చిత్రణ సోదాహరణంగా వివరించారు.
ఢిల్లీ నుంచి పాల్గొన్న శ్రీమతి కల్యాణి ఎస్.జె. ‘శ్రీ చాసో గారి రచనలో బాలల చిత్రణ’ అనే అంశంపై మాట్లాడుతూ చాసోగారు బాలలు ప్రాధాన్యంగా వ్రాసిన కొన్ని కథలను విశ్లేషించారు. హైదరాబాదు నుంచి పాప్యులర్ సైన్స్ రచయిత డా. కారంచేడు బుచ్చి గోపాలం తమ ప్రసంగంలో శ్రీ చాసో గారి రచనలలో భాషా సౌందర్యాన్ని ఆవిష్కరించారు.
సభాంతంలో ప్రముఖ రచయిత్రి, శ్రీ చాసోగారి కుమార్తె డా. చాగంటి తులసి, చాసోగారి జయంతి సభ విశాఖ సాహితి వేదికగా జరిపినందుకు అభినందనలు తెలియజేసారు.
దేశ విదేశాల నుండి పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్న ఈ సభలో విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం సభా ప్రారంభంలో స్వాగత వచనాలు పలికి, సభాంతంలో వందన సమర్పణ చేశారు.