కశ్మీర రాజతరంగిణి-68

4
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]రా[/dropcap]ణి సూర్యమతి ఆవేశంలో విచక్షణను మరచిపోయింది. అనంతుడు తన శీలాన్ని శంకించే మాటలనటంతో ఆమె అనంతుడిని దూషించింది. అనంతుడు జీవితంలో పరాజితుడని, ఎందుకూ పనికిరానివాడని దెప్పి పొడిచిండి. తనని వివాహం చేసుకున్న తరువాతనే అతనికి అదృష్టం మారిందని, తాను లేకపోతే, అతను ఎందుకూ పనికిరానివాడని అనటమే కాదు, వ్యంగ్యంగా, ఏ పని చేయకుండా వృద్ధుడయి పోయాడని విమర్శించింది. ఎంతగా పనికిరాని వాడంటే అతని కొడుకే అతడిని దేశం నుంచి తరిమివేశాడని ఎద్దేవా చేసింది.

సూర్యమతి మాటలు అనంతుడిని ఎంతగా బాధించాయంటే, ముఖంలో ఎలాంటి భావాలు, బాధను కనబరచలేదు కానీ తనని తాను కత్తితో పొడుచుకున్నాడు. అతడి శరీరం నుంచి రక్తం కారటం చూసి సూర్యమతి భయకంపిత అయింది. ఏం చేయాలో ఆమెకి తోచలేదు. పక్కనే ఉన్న ధక్కన్న అనంతుడిని కాపాడబోయాడు. కానీ అనంతుడిలో జీవితేచ్ఛ నశించింది. ‘అనారోగ్యంతో అనంతుడు మరణించాడ’న్న వార్తను ప్రచారం చేశారు. అంతే తప్ప అనంతుడు ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తను బయటకు పొక్కనీయలేదు. ఈ సందర్భంగా చక్కటి శ్లోకం రాశాడు కల్హణుడు, ప్రపంచ రీతిని వివరిస్తూ.

‘పాలన రాని రాజు మహిళ ప్రభావంలో చిక్కుకుంటే, పుత్ర ప్రేమతో గుడ్డిగా ఆమె కొడుక్కి రాజ్యం కట్టబెడితే, ఆ సంతానం చేతకాని వాడై, సేవకులపై రాజ్యభారం మోపితే, అది చెడ్డ పేరుకు కారణమవుతుంది తప్ప గొప్పతనం కాదు’ అంటాడు కల్హణుడు. ఇది కూడా మనకు అనుభవమే. అర్హత, ఆసక్తి లేనివాడు అధికారి అయితే, అధికారంపై మక్కువ తప్ప ప్రతిభ లేకపోతే, అతడు సేవకులపై ఆధారపడతాడు. వారు తమ ఇష్టానుసారం అధికారిని ఆడిస్తారు. నష్టపోయేది రాజ్యం. కష్టపడేది ప్రజలు. రాజ్యం బలహీనమవటం వల్ల అది శత్రువులకు సులభంగా వశమవుతుంది. ఇక్కడ శత్రువు అంటే అధికారంపై ఆశ ఉన్న ప్రతి ఒక్కడూ. ఈ రకంగా క్రీ.శ. 1085లో అనంతుడు మరణించాడు. ఆవేశం అనర్థదాయకం. ఒక్క క్షణం సేపు విచక్షణ మరచి నియంత్రణ కోల్పోవటం ఎంత అనర్థానికి దారితీసిందో సూర్యమతి అర్థం చేసుకుంది. విచారించింది. కానీ కాలానికి ముందుకే తప్ప వెనక్కు మరలే అలవాటు లేదు. దాంతో జరిగిన దానికి విలపిస్తూనే, రాణి సూర్యమతి కర్తవ్యం నిర్వహించింది. అనంతుడు ఎవరెవరికి ఏమేమి బాకీలు ఉన్నాడో అవన్నీ చెల్లించింది. వారందరూ హర్షుడిని సంరక్షించాలని, అతడిని వెన్నంటి ఉండాలని వాగ్దానాలు తీసుకుంది. హర్షుడి రక్షణ కోసం వందపైగా అశ్వికులను నియమించింది.  ఈ సమయంలో కూడా ఆమె కలశుడి కోసం ఎదురు చూసింది. “కలశుడు వచ్చాడా?” అని పదే పదే ప్రశ్నించింది. తండ్రి అంతిమ సంస్కారాల కోసం వెళ్ళాలనుకున్న కలశుడిని అతడి చుట్టూ ఉన్న దుష్టశక్తులు ఆపేయి. తన కర్తవ్యం ఏమిటో తెలిసినవాడు, ఎవరెన్ని రకాలుగా అడ్డు పడ్డా కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. తన కర్తవ్యం తెలియనివాడు, తెలిసినా, స్వీయవ్యక్తిత్వం లేనివాడు ఇతరుల మాటలు వింటాడు. వారి ప్రభావంతో కర్తవ్యాన్ని విస్మరిస్తాడు.

కలశుడు ఎంతకీ రాకపోవటంతో సూర్యమతికి విషయం అర్థమయింది. కలశుడిని తప్పుదారి పట్టించినవారంతా సర్వనాశనమవుతారని శపించింది. అనంతుడితో పాటు తానూ అదే చితిలో దగ్ధమయింది. ఆమె చితాగ్నిలో భస్మం అవటం చూసి భరించలేని కొందరు సేవకులు కూడా ప్రాణత్యాగం చేశారు. ఈ సందర్భంగా కల్హణుడు చక్కని భావనలను ప్రదర్శించే శ్లోకం రాశాడు.

మనిషి మౌలికంగా బలహీనుడు. అతని జీవిత కాలం తక్కువ. శరీరం నశిస్తుంది. కానీ మనస్సులో ప్రవేశించిన గాథ చిరకాలం జీవిస్తుంది. మానవ శరీరం అంతరించినా ఆ గాథ చిరంజీవిగా నిలుస్తుంది. గంగానది నీటిని ఓ పాత్రలో బంధిస్తే, ఎలా అది ఎప్పటికీ స్వచ్ఛంగా ఉంటుందో, అలాగే మానవ గాథలు కూడా నిలుస్తాయి. శరీరం నశిస్తుంది. కానీ దానికి సంబంధిచిన కథలు, గాథలు నశించవు.

ఇక్కడి నుంచీ మరో విషాద గాథ ఆరంభమవుతుంది.

తాత అనంతుడి ద్వారా అందిన ధనం, సైన్య సంపద ఆధారంగా హర్షుడు తండ్రి కలశుడితో వైరం పూనాడు. విజయేశ్వరంలో ఉంటూ తండ్రిని ఎదిరించేందుకు సర్వసన్నాహాలు చేశాడు.

అధికారం కోసం తండ్రీకొడుకులు పోరాడుకోవటం భారత చరిత్రలో ఒక కొత్త విషయం. అధికారం దైవదత్తంగా, బాధ్యతలా భావించే కాలం పోయింది. అధికారం ‘హక్కు’లా, ఐశ్వర్యాన్ని అనుభవించేందుకు, ప్రజలను పీడించేందుకు ఒక సాధనంలా  భావించే రోజులు వచ్చేశాయి. అధికారం కోసం తండ్రీకొడుకులు పోరాడుకునే రోజులు వచ్చేశాయి. ఇక్కడ కూడా కల్హణుడు గమ్మత్తయిన శ్లోకం రాశాడు. తండ్రికి కొడుక్కు వైరం ఏర్పడినప్పుడు కొడుకు శ్రీనగరంలో ఉన్నాడు. తండ్రి విజయేశ్వరంలో ఉన్నాడు. మళ్ళీ తండ్రికీ, కొడుక్కు నడుమ వైరం చెలరేగినప్పుడు, తండ్రి శ్రీనగరంలో ఉన్నాడు. కొడుకు విజయేశ్వరంలో ఉన్నాడు అంటాడు కల్హణుడు. కానీ వైరం మాత్రం అంతరించలేదు.

హర్షుడు తన దగ్గర ఉన్న ధనాన్ని విపరీతంగా ఖర్చు చేశాడు. శ్రీనగరంలో ఖజానా ఖాళీ. హర్షుడి దగ్గర చాలా ధనం ఉందని గ్రహించిన కలశుడు హర్షుడితో సంధి చేసుకున్నాడు. హర్షుడిని రాజధానికి తీసుకువచ్చాడు. ఆ తరువాత కలశుడికి పలురకాలుగా ధనం చేకూరింది. దాంతో కలశుడు మళ్ళీ చెడుదారి పట్టాడు. ముఖ్యంగా అతడి స్త్రీలోలత్వం అధికమయింది. అతడి ప్రాపకం సంపాదించాలనుకునేవారు వివిధ దేశాల నుంచి తురుష్క సుందరీమణులను కలశుడికి అందించేవారు. ఇది గమనించవలసిన విషయం. సాధారణంగా విదేశీ చరిత్ర రచయితలు భారతదేశంలో ‘బానిస వ్యవస్థ’ ఎప్పటి నుంచో ఉండేదని నమ్మించాలని ప్రయత్నిస్తారు. కానీ భారతదేశంలో అమలులో ఉన్న స్మృతుల ప్రకారం మనిషిని ‘అమ్మటం’ అన్నది నేరం. బ్రిటీషువారు 1841లో భారతదేశంలో ‘బానిసల’ లెక్కలు కట్టారు. ఎప్పటి నుంచో బానిస వ్యవస్థ ఉండేదని తేల్చి చెప్పారు. కానీ బానిస వ్యవస్థ గురించి భారతీయ వాఙ్మయంలో ప్రస్తావన రాదు. శునశ్శేపుడి కథ, హరిశ్చంద్రుడి కథ చూపించి మనుషులను అమ్మటానికి ఆధారాలు అంటారు. దుర్వ్యాఖ్యానం చేస్తారు. ఆ కథల అసలు అర్ధాలు, వాటిలోని ఆంతర్యాలు వేరే. అవి తెలియకపోతే దుర్వ్యాఖ్యానాలే అవుతాయి.  కల్హణ రాజతరంగిణిలో తొలిసారిగా ‘మనుషులను కొనటం’ ప్రసక్తి కలశుడి కాలంలో వస్తుంది. అదీ పదకొండవ శతాబ్దంలో. ఇక్కడ కూడా రాజు స్త్రీలోలత్వాన్ని ఆధారంగా చేసుకుని రాజు ప్రాపకం సంపాదించాలనుకునేవారు వివిధ దేశాలకు చెందిన తురుష్క స్త్రీలను కొని రాజుకు అందించటం కనిపిస్తుంది. తురుష్కులు భారతీయులను తమ దేశాలలో బానిసలుగా అమ్మేవారు. కానీ భారతీయులు తురుష్క స్త్రీలను రాజాస్థానంలో పనిచేయటంకోసం కొని తెచ్చారు కశ్మీరంలోకి. అంటే వీరిని బానిసలుగా కాక, పనికోసం తెచ్చారన్నమాట. వీరికి రాజ అంతరంగ మందిరంలో ప్రత్యేక స్థానం వుండేది. బానిసలుకారు వీరు. కొన్ని సందర్భాలలో వీరు రాజు నిర్ణయాలనూ ప్రభావితంచేసేవారు. ( ఈ విషయం కేంద్రంగా విశ్వనాథ చామరగ్రాహిణి అన్న కథ రాశారు. ధనం కోసం ఒక విదేశీ మహిళ భారత దేశం రాజు దగ్గర సేవకురాలిగా పనిచేసేందుకు వస్తుంది. అత్యంత గౌరవం పొందుతుంది. ) ఇలా తురుష్క స్త్రీలు కశ్మీరంలో పెద్ద ఎత్తున ప్రవేశించారు.  వీరి సంతానం తురుష్కులుగానే కొనసాగేరు.  ఇక్కడి నుంచి నెమ్మదిగా కశ్మీర సామాజిక,  రాజకీయ జీవనంపై తురుష్క ప్రభావం పెరగటం కూడా రాజతరంగిణి ప్రదర్శిస్తుంది.

ఓ వైపు అపరిమితమైన స్త్రీలోలత్వాన్ని ప్రదర్శిస్తూనే కలశుడు విజయక్షేత్రాన్ని పునర్నిర్మించాడు. రాజ్యపాలనలో చక్కటి నిర్ణయాలు తీసుకున్నాడు. అసమర్థులను, అవినీతిపరులను తొలగించి వారి స్థానంలో సమర్థులను నియమించాడు. శత్రు రాజులను ఓడించాడు. అయితే వయసు ఎంతగా పెరుగుతున్నా, అతని స్త్రీలోలత్వం తగ్గలేదు. పలు ఔషధాలు సేవిస్తూ మరీ కలశుడు తన అంతఃపురంలో స్త్రీల సంఖ్యను పెంచుకున్నాడు. కలశుడు ఈ రకంగా విలాసాల్లో మునిగి తేలుతూ, మందిరాలను నిర్మిస్తున్న సమయంలో శత్రువులను అణచి సేనాపతులు తామే రాజులుగా వ్యవహరించారు. వారు ఎక్కడ తనపై దాడి చేస్తారో అన్న భయంతో కలశుడు రాత్రిళ్ళు నిద్రపోయేవాడు కాదు. అయితే, సూర్యమతి మరణ సమయంలో ఇచ్చిన శాపం నిజమయినట్టు, కలశుడిని తప్పుదారి పట్టించిన వారంతా హఠాత్తుగా మరణించారు. ప్రజలు సూర్యమతి శాపం నిజమయిందని అనుకున్నారు. ఇలాంటి సమయంలో వామనుడు సర్వాధికారి అయ్యాడు. వామనుడు చక్కటి నిర్ణయాలతో ప్రజలకు లాభం కలిగించాడు. ఇక్కడ ఒక శ్లోకం రాస్తాడు కల్హణుడు. పరిశీలించాల్సిన శ్లోకం అది.

ఉపాంగ గీత వ్యసనం నర్తకీ సంగ్రహదరః।
దేశాంతరో చితం రాజ్ఞా తేనైనేహ ప్రవర్తితం॥
(కల్హణ రాజతరంగిణి 7, 606)

‘ఉపాంగ గీత వ్యసనం’ అన్న పదం కశ్మీరులో సంగీత నృత్యాల స్వరూప స్వభావాలు మారటాన్ని సూచిస్తుంది.   భారతదేశ కళలపై తురుష్క ప్రభావం పడుతున్న సమయంలో సారంగదేవుడు ‘సంగీత రత్నాకరం’ అన్న పుస్తకం రాశాడు. దేవగిరికి చెందిన రెండవ సింఘన ఆస్థానంలో ఉండేవాడు సారంగదేవుడు. యాదవ వంశానికి చెందిన ఈ రాజు క్రీ.శ. 1210 నుండి 1247 నడుమ రాజ్యం చేశాడు. అంటే, 13వ శతాబ్దానికి చెందిన గ్రంథం అన్నమాట సంగీత రత్నాకరం. సంగీత రత్నాకరం ప్రాధాన్యం ఏమిటంటే – ఈ గ్రంథం రచించే సమయానికి భారతీయ సంగీతంపై తురుష్క ప్రభావం అంతగా పడలేదు. భారతీయ సంగీతం హిందుస్థానీ, కర్నాటక సంగీతాలుగా విభజన చెందలేదు. సారంగదేవుడి ప్రకారం సంగీతం అనేది ‘తౌర్యత్రిక’. అంటే మూడు రకాల కళల సమష్టి రూపం. గీతం (గాత్రం), వాద్యం, నృత్యం అన్న మూడు ప్రక్రియలు కలిస్తే ‘సంగీతం’ అవుతుంది. నృత్యం అంటే  గీతం, వాద్యంతో కూడిన నృత్యం అని అర్థం. గీతం అన్నది నాదం, అక్షరాల సమ్మేళనం. గీతం, వాద్యం గురించి కూడా ఇలాంటి లోతైన వివరణ ఉంటుంది సంగీత రత్నాకరంలో.

సంగీత రత్నాకరంలో ఏడు అధ్యాయాలున్నాయి. అవి నాదం, రాగం, ప్రకీర్ణ, ప్రబంధ, మార్గ, దేశి, తాళల గురించి చర్చిస్తాయి. సంగీత రత్నాకరంలో సారంగదేవుడు పూర్వ ప్రసిద్ధ సంగీతం, ఆధునిక ప్రసిద్ధ సంగీతాలను వేర్వేరుగా చర్చించాడు. అంటే, ఆ కాలం ప్రకారం ప్రాచీన సంగీత పద్ధతులను, ఆధునిక పద్ధుతులను వేరు చేసి చూపించాడన్న మాట సారంగదేవుడు. భారతీయ సంగీతం, విదేశీ కళల ప్రభావంతో నూతన రూపు ధరించి, సరికొత్త దారులలో ప్రయాణించే సమయంలో అసలు సిసలైన భారతీయ సంగీత స్వరూపాన్ని భావితరాలకు అందించే ప్రయత్నం సంగీత రత్నాకరం. విశ్వనాథ సత్యనారాయణ ‘మ్రోయు తుమ్మెద’ అన్న నవలలో ఈ విషయాలను అతి గొప్పగా చర్చిస్తాడు. ఆయన హిందుస్థానీ సంగీతాన్ని తురుష్క ప్రభావంతో కలుషితమైన సంగీత స్వరూపంగా భావిస్తాడు.

సంగీత రత్నాకరం ప్రకారం సంగీతం రెండు విభాగాలు – మార్గ, దేశి.  ‘దేశి’ అన్నది సమకాలీనం. ‘మార్గ’ అన్నది ప్రాచీనం. దేశీ రాగాలు నాలుగు రకాలు. రాగాంగ, ఉపాంగ, భాషాంగ, క్రియాంగ. రాగాంగ విభాగానికి చెందిన రాగాలను గ్రామ రాగాలంటారు. ఇవి మార్గ రాగాల విభాగంలోకి వస్తాయి. అంతే ప్రాచీన కాలం నుంచి అమలులో ఉన్నవి. ఉపాంగ రాగాలు ‘జన్య’ రాగాలు. జన్య రాగాలంటే మేళకర్త రాగాలు. అంటే, మౌలిక రాగాల ఆధారంగా సృజించిన  రాగాలు. అంటే మేళకర్త రాగాలు జనక రాగాలు. వాటి నుంచి వచ్చినవి జన్య రాగాలు. అంటే అంతవరకూ కశ్మీరులో అమలులోవున్న సాంప్రదాయిక సంగీతం కాక, విదేశీయుల కొత్త సంగీతాన్ని, నృత్యాన్ని కలశుడు మెచ్చాడనీ, అది అతనికి వ్యసనంగా మారిందనీ సూచిస్తున్నాడు కల్హణుడు.  వ్యసనం అనటంతో ఈ కొత్తం గీతం, నృత్యం అంత మంచివి కావనీ భావన.  కాబట్టి కల్హణుడు ‘ఉపాంగ గీతం’ అన్న పదం ప్రాచీన కాలం నుంచి అమలులో ఉన్న సంగీతాన్ని సూచించేందుకు కాక, మౌలిక రాగాలనుంచి సృజించిన గీతాలను సూచించేందుకు వాడేడని అనుకోవచ్చు. ఆ తరువాత ‘దేశాంతర’ అని సూచించటంతో కల్హణుడు వాడిన ‘ఉపాంగ’ అన్న పదం ఇతర దేశాల నుంచి వచ్చిన సమకాలీన సంగీతాన్ని సూచించేందుకు వాడినట్టు భావించవచ్చు. ఎందుకంటే సంగీత రత్నాకరం రాసేందుకు రెండు వందల ఏళ్ళ ముందే కల్హణుడు ఈ పదం వాడేడు. బహుశా కల్హణుడి కాలంలో అప్పుడప్పుడే అందుతున్న పరదేశాల సంగీతం – సారంగదేవుడి కాలానికి భారతీయ సంగీతంలో ఓ బాగమై సమకాలీన, ఆధునిక సంగీతంలా చలామణీలోకి వచ్చి ఉంటుంది. కాబట్టి కల్హణుడి ఉపాంగ గీతానికి, సారంగదేవుడి ఉపాంగ గీతానికి అర్థంలో తేడా ఉండి ఉంటుందని ఊహించాల్సి ఉంటుంది. ఎందుకంటే కల్హణుడు ‘ఉపాంగ’ అన్న వెంటనే ఇతర దేశాలనుంచి కళాకారులను రప్పించటం ప్రస్తావించాడు. కాబట్టి కలశుడికి కశ్మీరానికి చెందిన సంగీత, నృత్యాల కన్నా ఇతర దేశాల కళాకారులు ప్రదర్శించే సంగీత నృత్యాలు నచ్చాయని, అతడిని మెప్పించటం కోసం, అతడి ప్రాపు సంపాదించటం కోసం ఇలాంటి సంగీత, నృత్య ప్రదర్శన లిప్పించేవారని ఊహించటం కష్టం కాదు. దాంతో కశ్మీరంలో పరదేశాల సంగీత నృత్యాలు పెద్ద ఎత్తున ప్రవేశించాయి. కశ్మీరంలో విదేశీ నాట్యాలను ఆరంభించిన రాజు కలశుడు అని కల్హణుడు స్పష్టం చేస్తాడు. ఈ ఉపాంగ గీతం ‘opera’ అని, నృత్య పద్ధతులు ‘ballet’ లని కొందరు వ్యాఖ్యానిస్తారు. ఏది ఏమైనా కశ్మీరం రూపాంతరం చెందుతోంది. రాజకీయంగా, సామాజికంగా, ధార్మికంగా కశ్మీరు తన పాత రూపును వదిలి సంపూర్ణంగా రూపాంతరం చెందేందుకు సిద్ధమవుతోంది.

రాజుల స్వభావాలు మారిపోయాయి. లక్షణాలు మారిపోయాయి. భార్యభర్తల సంబంధ స్వరూపం మారిపోతోంది. దిద్దారాణి తాను రాజ్యం చేసినా భర్తను దూషించలేదు. సూర్యమతి అందరి ముందు భర్తని దూషించింది. కానీ భర్తను దూషించటం ఇంకా అలవాటుగా మారకపోవటంతో పశ్చాత్తాప భావనతో ఆత్మహత్య (సతీసహగమనం) చేసుకుంది. రాజును గౌరవించే లక్షణం పోయి, అధికారం కోసం ఎవరినీ లెక్క చేయనితనం ప్రవేశించింది. తమ సౌఖ్యం కోసం తురుష్క స్త్రీలను ‘కోరటం’ మొదలైంది. అలా మొదలయిన తురుష్క ప్రభావంతో నృత్యం, సంగీతం రూపాంతరం చెందటమూ మొదలయింది. విదేశీ సంపర్కంతో నైతిక విలువలు దిగజారి మౌలిక విలువలను విడిచి కశ్మీర సమాజం వినాశనం వైపు పరుగుపెట్టడం వేగవంతమయింది. తురుష్కులు బలవంతంగా గెలవని కశ్మీరంలోనే ఇలాంటి మార్పులు కాలక్రమేణా సంభవించటం చూస్తూంటే, తురుష్క ముష్కరుల కరవాల ధారలకు బలై, వారి దుష్కృత్యాలకు, అధికార దౌష్ట్యానికీ బలయిన ఇతర ప్రాంతాలలో ఎలాంటి మార్పులు హఠాత్తుగా సంభవించాయో, అక్కడి సమాజం వీటిని ఎలా తట్టుకుందో, తత్ఫలితంగా భారతీయ సమాజం మానసికంగా ఎలా మార్పుచెందిందో ఇంకా అధ్యయనం చేయాల్సివుంది. ఈ దిశగా ఇంతవరకూ లోతయిన, నిష్పాక్షికమయిన అధ్యయనాలు జరగకపోవటం భారతీయ చరిత్ర అధ్యయనంలో అతి పెద్ద లోపం!!!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here