పుస్తకంపై కాదు… ప్రదర్శనపై నిషేధం

13
3

[dropcap]17[/dropcap].1.2022 రాత్రి పదిగంటల ప్రాంతంలో టీవీలో వచ్చిన ‘ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం’ అన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనాన్నే కలిగించిందని చెప్పాలి. ఆర్యవైశ్యులు చాలాకాలంగా తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న ఈ నాటక ప్రదర్శనని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధిస్తూ జి.వో. విడుదల చేసింది. అప్పటినుండి నాలుగు రోజులుగా సాహిత్యాభినుల నుండి, నాటక సమాజాల నుండి, కళాకారుల నుండి టి.వి.లలో వాట్సాప్ గ్రూప్‌లలో ముఖ పుస్తకాలలో ఈ నిషేధం ఔచిత్యానౌచిత్యాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

వందేళ్ల క్రితం (1923) శ్రీ కాళ్ళకూరి నారాయణరావు రచించిన ‘చింతామణి’ నాటకం కొన్నివేల ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆనాటి సమాజంలో పాతుకుపోయి వున్న దురాచారాలని వ్యతిరేకిస్తూ నారాయణరావు గారు వరవిక్రయం, మధుసేవ, చింతామణి నాటకాలు రచించి ప్రజలలో చైతన్యాన్ని, ఆలోచనని కలిగించేందుకు కృషిచేసారు.

సంఘంలో వేళ్ళూనుకొని ఉన్న వేశ్యా వృత్తి, వ్యభిచార లాలసతను, ధనవంతులైన పురుషులు ప్రకటితంగా, అప్రకటితంగా వేశ్యలను ఆదరిస్తూ, ‘అనంత’మైన వారి ఆడంబరమైన కోరికలను తీర్చడానికి ఆస్తులను తెగనమ్ముకొని వీథిన పడి, భార్యాబిడ్డలకు అన్యాయం చేస్తున్న తీరును ఎండగడుతూ సంస్కరణవాదానికి ప్రతీకగా రచించబడిన గొప్ప నాటకం ‘చింతామణి’.

ఈ నాటకంలో నాయిక పేరు ‘చింతామణి’. వేశ్యా సంపర్కం వలన కుటుంబాలు సమూలంగా ఎలా నాశనం అవుతున్నాయో తెలియజెప్పే నాటకాలు ఆ రోజుల్లో చాలా వచ్చాయి. సమాజంలో పాతుకుపోయిన ఈ దురాచారానికి చరమమగీతం పాడటానికి గురజాడ, కాళ్ళకూరి వంటి వారు ఎందరో సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని తమ వంతు కృషి చేశారు.

ఇతివృత్తం: బిల్వ మంగళుడు, రాధ ఆదర్శ దంపతులు. బిల్వమంగళుడు మిత్రుడు దామోదరుడు. తండ్రి వార్ధక్యం వల్ల బిల్వమంగళుడు వ్యాపారం చేపట్టి వేగంగా వృద్ధి చేయసాగాడు. అదే నగరంలో చింతామణి అనే వేశ్య ఉంటుంది. ఆమె తల్లి శ్రీహరికి విపరీతమైన డబ్బు పిచ్చి. చింతామణి అందచందాలను ఎరవేసి విటులను ఆకర్షిస్తూ వారి వద్ద నుండి డబ్బు గుంజుతూవుంటుంది. భవానీ శంకరం, సుబ్బిశెట్టి వంటి వారు ఇలా చింతామణి మోజులో పడి తమ సర్వస్వం కోల్పోయిన వారే. వ్యాపారంలో లక్షలు సంపాదిస్తున్న బిల్వ మంగళుడుపై చింతామణి దృష్టి పడుతుంది. ఎలాగైనా అతన్ని తన దగ్గరకు తీసుకువస్తే కొంత సొమ్ము ముట్టజెప్తాను అంటూ చింతామణి భవానీశంకరున్ని ప్రలోభ పెడుతుంది. చివరికి బిల్వమంగళుని తీసుకొనివచ్చి చింతామణికి పరిచయం చేస్తాడు భవానీ.

చింతామణి నాట్య విన్యాసాలు చూసి దాసోహం అయిపోతాడు బిల్వ మంగళుడు. క్రమక్రమంగా ఉన్నదంతా ఆమెకు సమర్పించుకుంటారు. సమాజంలో తన పరువు ప్రతిష్ఠలు పోగొట్టుకుంటాడు. పండంటి కాపురం కూలిపోతుంది. డబ్బు లేని బిల్వమంగళున్ని తమ ఇంటికి రావద్దంటుంది చింతామణి. డబ్బు లేకుండా రావటానికి వీలు లేదంటూ తెగేసి చెబుతుంది శ్రీహరి. ఇక చేసేది లేక డబ్బు కోసం ఇంటికి వెళతాడు. వారించిన తండ్రి మాటను పెడచెవిని పెట్టి, చనిపోయిన తండ్రికి దహన సంస్కారాలు కూడా చేయకుండా ఆస్తి పత్రాలు తీసుకుని చింతామణి దగ్గరకు బయలుదేరుతాడు జోరుగా కురుస్తున్న వర్షంలోనే. చింతామణి ఇంటికి చేరడానికి నావ అంత రాత్రివేళ దొరకకపోవడంతో నదిలో దూకి ఒక ఆధారాన్ని పట్టుకొని చేరతాడు. తీరా చూస్తే తాను పట్టుకున్న ఆధారం ఒక శవం అని తెలుస్తుంది.

మొదటి నుంచి కొద్దోగొప్పో కొంత సదాలోచనాపరురాలైన చింతామణి జరుగుతున్న పరిణామాలకి విరక్తి చెంది విరాగి లాగా మారుతుంది. ఆభరణాలని విసర్జించి నార చీర కట్టి నుదుట విభూతితో దైవారాధనలో మునిగి పోతుంది. శారీరక అనురక్తి కంటే దైవభక్తి మానవ జీవితానికి పరమార్థం అన్న సందేశంతో నాటకం ముగుస్తుంది.

వేశ్యా వ్యామోహం ఎంత పతనావస్థకు దారితీస్తుందో కాంతాసమ్మితంగా వివరిస్తూ, దాని పట్ల పాఠకులకు విరక్తి కలగటానికి కాళ్ళకూరి నారాయణరావు గారు ఈ రచన చేశారు.

అశ్లీలత, అసభ్యాలతో బూతుల బుంగగా తయారవడం:

సంఘ సంస్కరణాభిలాషతో, సమకాలీన సమాజంలోని దురాచారాలను రూపుమాపాలనే సదుద్దేశంతో, ప్రజలలో చైతన్యం కలగడానికి, పండిత పామర జనరంజకంగా రచింపబడిన ఈ నాటకం – అశ్లీల అసభ్య డైలాగులతో నిండి పోవటానికి కారణం ఏమిటో ఆలోచించాల్సిన అవసరం — కనీసం ఈ నిషేధం విధించిన సమయంలోనైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ‘తెలుగు సాహిత్యానికి అన్యాయం జరిగిపోయింద’ని బాధపడుతున్న ఎందరో సాహిత్యాభిమానులైన ‘మిత్రులు’ నిస్సంకోచంగా, నిర్భయంగా, ముసుగులు తొలగించుకొని ఆలోచించాలని మనవి.

కారణాలేమిటి?:

సినిమాలు విస్తృతంగా దూసుకొని వచ్చి నాటకరంగానికి ద్రోహం చేస్తున్న రోజుల్లో ప్రేక్షకుల్ని ఆకర్షించాలంటే, మరీ ముఖ్యంగా పల్లెటూరు లోని పామర జనాన్ని ఆకర్షించాలంటే, అశ్లీలకర అసభ్యకర డైలాగ్స్ ప్రవేశ పెట్టడం తప్ప మరొకదారిలేదు అనేటువంటి పరిస్థితి ఏర్పడిందని కొందరి అభిప్రాయం. ఉద్యోగ విజయాలు లాంటివి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నా, టిక్కెట్లు తెగాలంటే డబ్బులు కురవాలంటే చింతామణి లాంటి కొన్ని నాటకాలను నాటక సమాజాలు తమ పొట్టకూటి కోసం, తమ మనుగడ కోసం ఎంచుకున్నారు. పనులన్నీ పూర్తి చేసుకొని, భోజనాలు చేసి, రాత్రి పదింటికి ఆనందం కోసం వచ్చి కూర్చున్న వారికి ఆహ్లాదం కలిగించడానికి, అప్పటికప్పుడు కొత్త కొత్త బూతులు ప్రవేశపెట్టడానికి కూడా వెనుకాడలేదు. ముఖ్యంగా చింతామణి, శ్రీహరి, సుబ్బిశెట్టి పాత్రలకు ఇష్టానుసారంగా – చప్పట్లు ఈలలు కొట్టేకొద్దీ మరీ విజృంభించి డైలాగ్స్ విసిరేవారు. చివరికి చింతామణి నాటకం అని పేరు వినగానే నాగరికులు సంస్కారవంతులు నొసలు చిట్లిస్తారు అనే పేరు కూడా పడింది. సుబ్బిశెట్టి, చింతామణి, శ్రీహరి పాత్రల ఆహార్యం వాచకం అభినయం పూర్తిగా ‘దిగజారుడు పద్ధతి’లో మారిపోయింది. సమాజంలోని దురాచారాన్ని నిరసిస్తూ రాసిన ఆ రచయిత ఇంత అశ్లీలంగా రాస్తారా!?

ముఖానికి నల్లటి పెయింట్ వంటి రంగు మేకప్ పూసి, నామాలు పెట్టి, విపరీతంగా పెంచిన పొట్టతో, బొంగురు గొంతుతో ఒక వర్గానికి చెందిన వారిని కించపరుస్తూ, అశ్లీల డైలాగులు చెప్పిస్తూ నాటక విలువలకు తిలోదకాలు ఇవ్వడం ఎంతవరకు సబబు! ఒకరి మనోభావాలను దెబ్బదీసే అధికారం ఎవరికీ లేదు కదా!

ఫోటో సౌజన్యం – ఇంటర్‍నెట్

చింతామణి, శ్రీహరి పాత్రలకు ద్వంద్వార్ధాల అసభ్య డైలాగులు కల్పించి స్త్రీల వ్యక్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధమైన సంభాషణలతో, స్త్రీలు సిగ్గుతో తలదించుకునే విధంగా పచ్చి బూతులు జొప్పించి, నేలబారు అభినయంతో సాగదీస్తూ నాటక ప్రదర్శన ‘విజయవంతం’ అయిందని సంతోషించే కొన్ని నాటక కంపెనీలు కనువిప్పు ఈ ‘నిషేధాజ్ఞలు’. ఈ జి.వో. వచ్చిన తర్వాత 19వ తేదీన ఎమ్మిగనూరులో ప్రదర్శించాల్సిన చింతామణి నాటకం రద్దు చేయబడింది.

ఆనాటి రచనలను ‘ఈనాటి’ దృష్టితో చూస్తే ఏవో అభ్యంతరాలు రావడం సహజమే. కానీ, కాలక్రమేణా ఎన్నెన్నో అభ్యంతరకర మార్పులకు లోనైన ఈ నాటకం వల్ల మూల రచయిత మహానుభావుడు శ్రీ కాళ్ళకూరి నారాయణరావు గారికి చెడ్డపేరు తెచ్చే పరిస్దితి వచ్చింది. మౌలిక చింతామణి నాటకంలో ‘ఇవి’ లేవు. ఇప్పటికీ ఏదో ఒక ఊరిలో నిత్యం ప్రదర్శించబడుతున్న ఈ ‘బూతుల కల్పిత’ నాటక ప్రదర్శనకి ఆయన ఆత్మ క్షోభిస్తుందేమో!

ఫోటో సౌజన్యం – ఇంటర్‍నెట్

ఒకప్పుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (చింతామణి), అర్వపల్లి సుబ్బారావు (సుబ్బిశెట్టి), షణ్ముఖ (బిల్వమంగళుడు) కనకం (శ్రీహరి) వంటి ఉద్దండ నటులతో ఎందర్నో అలరించిన ఈ నాటకం ప్రదర్శనలో… ముతక హాస్యాన్ని, చవకబారు సంభాషణల్ని ఎవరు చేర్చారో ఎందుకు చేర్చారో కానీ ఇప్పుడు నిషేధానికి గురవ్వడం నిజంగా బాధాకరం. ఇలా ఏదో ఒక కారణంతో, ఎవరి మనోభావాలను దెబ్బదీసాయనో నిషేధించుకొంటూ పోతే కళల మనుగడ ప్రశ్నార్థకమే.

అశ్లీలాన్ని పూర్తిగా నిషేధించడం ప్రభుత్వం కాదు…. ‘ప్రజలు నిషేధించాలి’. చైతన్యవంతంగా ఆలోచించాలి. అదే ఈ సమస్యకు సరియైన పరిష్కారం.

సదుద్దేశంతో సంస్కరణాభిలాషి శ్రీ కాళ్ళకూరి నారాయణరావు రచించిన అసలైన ‘చింతామణి’ నాటకం ప్రదర్శనకి అభ్యంతరాలుండకుండా, కళాకారుల ఒడంబడికతో ‘వాద వివాద రహితులైన’ కొందరితో చర్చించి, రచయితకి నాటకానికీ అన్యాయం జరగకుండా తుది నిర్ణయానికి రావాలి.

“అసలే నాటకాలను ఎవరూ చూడడం లేదు, ఇంకా ఈ మాత్రం మొరటు హాస్యం లేకపోతే ఎవరు చూస్తారు” అనే అభిప్రాయం ఉండకూడదు. వెకిలి హాస్యం, ‌పచ్చి శృంగార వర్ణనలతో తాత్కాలిక విజయం లభించవచ్చు అవార్డులు పొందవచ్చు కానీ, శాశ్వతంగా ‘సాహితీ లోకం’లో నిలబడలేవు.

తెలుగు భాషా సంస్కృతులు కలకాలం వర్ధిల్లాలి. కళారూపాలు జీవించాలి. ఆ బాధ్యత ప్రజలు తీసుకోవాలి. ప్రభుత్వాలు సహకరించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here