జ్ఞాపకాల పందిరి-95

51
3

[box type=’note’ fontsize=’16’]”కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!”అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

తలుపు చప్పుడైన వేళ..!!

[dropcap]‘ఆ[/dropcap]రోగ్యమే మహాభాగ్యము’ అన్న నానుడి అందరికీ తెలిసిందే. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటే, అంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది. కొన్ని తరాలకు సరిపడా సంపద గల వ్యక్తికైనా, అతడు ఆరోగ్యవంతుడు కాకుంటే, ఎంత సంపద వున్నా సంపద లేనివాడి కిందే లెక్క. ఆరోగ్యంగా వుండాలని ఎవరికీ మాత్రం ఉండదు? కానీ అందరికీ ఇది సాధ్యం కాదు. సుఖానికి అలవాటు పడి, శరీరాన్ని అసలు కష్టపెట్టనివారికి ఇది అసలు సాధ్యం కాదు!కొందరు ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కోసారి అవసరానికి మించిన జాగ్రత్తలు సైతం తీసుకుంటారు. అయినా గానీ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రూపంలో అనారోగ్యానికి గురికాకుండా ఉండేవారు బహుతక్కువ. కారణం వారి జీవనశైలిలో, తీసుకునే ఆహారంలో అవసరానికి సరిపడా మార్పులు చేసికొనక పోవడమే! అందుచేతనే సుఖం మరిగిన ఎంతటి ధనవంతుడైన అనారోగ్యానికి బలికాక తప్పడంలేదు.

ప్రతిదినం కష్టపడి పనిచేసుకునే శ్రమజీవుల్లో, ఎప్పటి వంట అప్పుడు చేసుకుని, తాజా ఆహార పదార్థాలు తీసుకునే ఎలాంటి స్థాయి వ్యక్తులకైనా ఆరోగ్యం అంటిపెట్టుకుని ఉంటుంది. ఆధునికత, నాగరికతల పేరుతో, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లు వాడుకునేవారిలో అనారోగ్యం శాతం ఎక్కువగా ఉంటున్నట్లు; నిల్వవుంచిన ఆహార పదార్థాలు, ఒకేసారి అత్యధిక ఉష్ణోగ్రతలో వేడిచేసిన ఆహార పదార్థాలు తినేవారు అనారోగ్యం పాలవుతున్నట్లు అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అందుచేత ఆధునికతగా భావిస్తున్న జీవితం అనారోగ్యం పాలుకాక తప్పడం లేదు.

ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే, కొన్ని వ్యాధులు మనకు సంక్రమిస్తాయి. ఒకప్పుడు కలరా, మశూచి వంటి వ్యాధులు అంటువ్యాధులుగా వ్యాప్తి చెంది, వందలు వేలసంఖ్యలో ప్రాణనష్టం కలిగించేవి. వాటిని కొంతవరకూ అరికట్ట గలిగాము. మలేరియా వంటి సమస్యలతో ఇంకా బాధపడుతూనే వున్నాం. దీనికి తోడు విస్తృతంగా ప్రబలుతున్న కాన్సర్ వ్యాధి, ఎయిడ్స్ మహమ్మారి ప్రజలను ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు కఠినంగా పాటిస్తే, వీటిని దూరంగా ఉంచొచ్చు. కానీ, ప్రపంచమంతా ఒక ఊపు ఊపి గత మూడు సంవత్సరాలుగా, ప్రజలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నది, వైరస్ సంబంధిత వ్యాధి. సులభంగా ఒకరినుండి మరొకరికి అంటుకుని యావత్ ప్రపంచాన్నీ గడగడలాడిస్తున్నది, ‘కరోనా’ మహమ్మారి. కోట్లమంది ఈ వ్యాధి బారిన పడి, లక్షల్లో చనిపోయిన/చనిపోతున్న దురదృష్టకర సంఘటనలు ఈ వ్యాధివల్ల సంభవిస్తున్నాయి. ఆలోచిస్తే మనిషి అత్యాశలను కట్టడిచేయడానికే అప్పుడప్పుడూ హెచ్చరికలుగా ఇలాంటి సమస్యలు మన మధ్యకు వస్తాయేమో అనిపిస్తుంది.

రెండు సంవత్సరాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా పెనుతుఫానులా వ్యాపించిన ‘కరోనా’ ఎన్నో కొత్త విషయాలకు తెరతీసింది. జనుల్లో ఎంతో జ్ఞానోదయాన్ని కలిగించింది. పరిశుభ్రత అంటే ఏమిటో, ఒకరికొకరు ఎడం పాటించవలసిన అవసరం ఏమిటో, గుంపులుగా ఎందుకు తిరగకూడదో, ‘మాస్క్ – దాని అవసరం’ స్పష్టంగా తెలియజెప్పింది. శానిటైజర్‌ను రంగంలోనికి దింపి దాని ముఖ్య అవసరాన్ని తెలియజెప్పింది. ఉద్యోగస్తుల్లో ‘వర్క్-ఫ్రమ్ హోమ్’కు శ్రీకారం చుట్టించింది. తద్వారా దూరంగా ఉంటున్న బంధువులను, రక్తసంబంధీకులను దగ్గరకు చేర్చింది. ప్రజలలో భయభ్రాంతులను కలిగించి లక్షల రూపాయలు ఖర్చుపెట్టించింది, అనేక మంది కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టింది. విదేశ రాకపోకలకు చెక్ పెట్టింది. మనిషిని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది.

ఈ నేపథ్యంలో గుడులు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు కొంతకాలం మూతపడ్డాయి. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు క్షణానికొక రంగు మార్చుకుంటున్నాయి. విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు గల్లంతు అయిపోయాయి. కనీస అవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడి బ్రతుకు సుడిగుండంలో జారిపడింది.

ఇలాంటి పరిస్థితిలో, మా ఇంట్లో నేనూ, నా శ్రీమతి విశ్రాంత ఉద్యోగులమే! నా కుమారుడు అమెరికాలో ఉద్యోగి కావడం మూలాన మా ఇద్దరి సంరక్షణ, మా అమ్మాయి చేతిలో పడింది. ఆమె కూడా ఆకాశవాణి, వరంగల్ కేంద్రంలో అప్పుడు ఉద్యోగినియే. కూతురు ఆన్షితో ఆమె నా దగ్గరే వుంటున్నది. అగ్నిజ్వాలలా ఎగసిపడిన రెండు కరోనా వేవ్‌లను ఆమె ఉద్యోగం చేస్తూనే చాలా దైర్యంగా ఎదుర్కొంది. మా ఆరోగ్యాలను కాపాడింది. సర్వం తానై కష్టపడి పని చేసింది. బయటకు అడుగు వేయకుండా జాగ్రత్తలు తీసుకుని మమ్ములను ఆరోగ్యవంతులుగా నిలిపింది, అంత మాత్రమే కాదు, తన ఆరోగ్యాన్ని కాపాడుకుంది. తన ఉద్యోగ బాధ్యతలను క్రమం తప్పకుండా నిర్వహించింది.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్నీ మనకు ఎప్పుడూ అనుకూలంగా వుండవు. అనుకున్నవి అనుకున్నట్టు జరగవు ఎలాంటివారికైనా ఏదో రూపంలో హెచ్చరికలు వస్తాయి. వాటిని తప్పించుకోలేము. కరోనా 1, 2 వేవ్‌లు తప్పించుకున్న మా కుటుంబం మూడవ వేవ్ నుండి తప్పించుకోలేక పోయింది. అది కూడ మా అమ్మాయి (నిహార)తో ప్రారంభం కావడం విశేషమే!

రచయిత అమ్మాయి నిహార. కానేటి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్, ఆకాశవాణి హైదరాబాద్

అంతా దేవుడి ఏర్పాటు అని పెద్దలు చెబుతుంటారు, మంచి, జరిగినా చెడ్డ జరిగినా. నేను దీనితో ఏకీభవించకపోయినా, ఈ విషయంలో నమ్మక తప్పలేదు. కారణం, కరోనా, మా ఇంటి తలుపు తట్టే సమయానికి, అమెరికాలో ఉంటున్న మా అబ్బాయి, కోడలు, మా దగ్గర ఉండడం. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే మరి! మా అమ్మాయి కరోనా భారిన పడిన మరుసటి రోజు, అందరం ఇంటి దగ్గర టెస్ట్ చేయించుకున్నాం. ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి, నాకూ నా శ్రీమతికి ‘నెగెటివ్’ వచ్చింది. కొడుకు కోడలికి ‘పాజిటివ్’ వచ్చింది. అయితే ఇది తెలిసిన రాత్రికి నాకు ఒళ్ళు నొప్పులు, జ్వరం, తలనొప్పి, దగ్గు మొదలయ్యాయి. వెంటనే నాకు ప్రియమిత్రులు, నాకు ఫిజీషియన్, ఎం.జి.ఎం.లో ముఖ్య వైద్య (మెడిసిన్) అధికారి డా. వి. చంద్రశేఖర్ గారిని ఫోన్ ద్వారా సంప్రదించాను. ఆయన, సాధారణంగా వాడుతున్న మందుల జాబితా పేర్లు పంపించి ’ఆక్సిజన్ – సాచురేషన్’ లెవెల్స్ గమనించమన్నారు.

డా. వి.చంద్రశేఖర్. ఎమ్. డి మెడిసిన్-(హెచ్. ఓ.డి) ఎమ్. జి.ఎమ్. హాస్పిటల్, వరంగల్
రచయిత శ్రీమతి అరుణ. కానేటి

నా శ్రీమతి అరుణకు కరోనా లక్షణాలు లేనందున, మరోసారి టెస్ట్ చేయించాము. ఆవిడకు మళ్ళీ నెగెటివ్ వచ్చింది. అప్పుడు ఆమెను హోమ్ క్వారంటైన్‌లో పెట్టి మేము అందరం ఫ్రీగా వున్నాం. రెండవ రోజుకు కొడుకు – కోడలికి, లక్షణాలు తగ్గాయి. పని మనిషిని మాన్పించి సర్వం తామై మాకు సేవ చేసారు. కరోనా సోకినందున, మా అబ్బాయి రాహుల్ అమెరికా ప్రయాణం వాయిదా వేసుకోవలసి వచ్చింది. కొడుకు కోడలితో కొన్ని ఎక్కువ రోజులు గడిపే అవకాశం కలిగింది.

రచయిత అబ్బాయి రాహుల్. కానేటి
రచయిత కోడలు దివ్య. కానేటి (నామా)
కరోనా నుండి తప్పించుకొన్న రచయిత మనవరాలు బేబి ఆన్షి. నల్లి.

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి వ్యాధి బారిన పడక తప్పదు. వ్యాధి లక్షణాలు లేకున్నా, నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చినా, అప్రమత్తంగా ఉండకతప్పదు. అలా అని ప్రతిదానికీ భయపడకూడదు. ప్రతిదానిని తక్కువగా అంచనా వేయకూడదు. మన బలహీనతనాలను సొమ్ము చేసుకునే వారూ ఎప్పుడు సిద్ధంగా వుంటారు. అందుచేత ప్రతి విషయంలోనూ, ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. కరోనా కష్టకాలం నుండి యావత్ ప్రపంచం అతి త్వరగా బయట పడాలని కోరుకోవడం సామాన్యుడి అత్యాశ కాదేమో!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here