సాఫల్యం-9

4
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సే[/dropcap]ల్స్‌‌మన్‌ ముందు ప్యాంట్లు చూపించాడు. టేపుతో పతంజలి నడుము కొలత చూచాడు. ఏడెనిమిది రకాల ప్యాంట్లు చూశాడు రామ్మూర్తి ‘బాటిల్‌ గ్రీన్‌’ కలర్‌ ప్యాంటు సెలెక్ట్‌ చేశాడు.

“చూడు! ఇది నచ్చిందా!”అని అడిగాడు. డార్క్‌ గ్రీన్‌ కలర్‌ చాలా బాగుంది నచ్చినట్లు తల ఊపాడు పతంజలి. దాన్ని పక్కన పెట్టించారు. టీషర్టు చూపించసాగాడు. తెల్లని తెలుపు మీద ఆకుపచ్చని గళ్లున్న టీషర్ట్‌ సెలెక్ట్‌ చేశాడు రామ్మూర్తి. “దానిమీదకు ఇది పర్‌ఫెక్ట్‌ మ్యాచింగ్‌ చూడు. నీకు నచ్చడం ముఖ్యం” అన్నాడు.

ఆ టీషర్టు కూడ నచ్చేసింది పతంజలికి.

“ట్రయల్‌ రూములోకి వెళ్లి వేసుకుని రాపో” అన్నాడు బావ.

ట్రయల్‌ రూంలో నాలుగు వైపులా నిలువుటద్దాలు బిగించి ఉన్నాయి. పైన చిన్న సీలింగ్‌ ఫ్యాన్‌. బట్టలు తగిలించుకోవడానికి స్టీలు హాంగర్స్‌.

ప్యాంటు, టీషర్టు సరిగ్గా సరిపోయినాయి. అద్దంలో తను తాను చూసుకుంటుంటే ‘తానేనా?’ అని ఆశ్చర్యం కలిగింది. బయటకు వెళ్లి బావకు చూపించాడు “వెరీగుడ్‌” అన్నాడతడు.

“ఎంత స్మార్ట్‌గా ఉన్నావురా చిట్టిబావా! ఐదారేళ్ల క్రిందట మీ అక్కకు ప్యాంటు టిషర్టు వేస్తే ఇలాగే ఉండేదేమో!” అన్నాడు. నిజమే. తనకూ అక్కకూ చాలా పోలికలున్నాయి.

“లోపలికి పోయి మార్చుకో. ప్యాక్‌ చేయిద్దాం” అన్నాడు బావ.

ప్యాక్‌ చేసి, క్యాష్‌ కౌంటర్‌ వద్దకు తెచ్చాడు సేల్స్‌మన్‌.

“అరవై ఎనిమిది రూపాయలివ్వండి సార్‌” అన్నాడు కౌంటర్లో అతను బిల్లు చెల్లించి, బట్టలపాకెట్‌ పట్టుకుని బయటకు వచ్చారు. రోడ్డు ప్రక్కన బండిలో బజ్జీలు వేస్తున్నాడు ఒకతను.

“ఏదైనా తిందాంపద” అని అక్కడికి దారితీశాడు.

“ఒక ప్లేట్‌ మిరపకాయ బజ్జీలు ఇవ్వు” అన్నాడు.

ఒక ప్లాస్టిక్‌ ప్లేట్‌లో న్యూస్‌ పేపర్‌ ముక్క మీద నాలుగు వేడి వేడి బజ్జీలు వేసి వాటిమద ఏదో పొడి చల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయ కొత్తమీర మిశ్రమాన్ని ప్రక్కన వేసి యిచ్చాడు.

ఇద్దరూ అదే ప్లేట్‌ లోనే చెరో రెండు తిన్నారు. అద్భుతంగా ఉన్నాయి.

“ఇంకా ఏమయినా తింటావా?” అని అడిగి పతంజలి జవాబు చెప్పకముందే “వందగ్రాములు మెత్త బుగ్యాలు ఇవ్వండి” అని చెప్పాడు. మరో ప్లేట్‌లో వేడివేడి బుగ్యాలు వచ్చాయి. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతున్నాయి. తిన్న తర్వాత, చేయి కడుక్కోడానికి ఒక క్యాన్‌, త్రాగటానికి ఒక క్యాన్‌ నీళ్లు బెంచి మీద పెట్టి ఉన్నాయి. వాటి దగ్గర చేయి కడుక్కొని నీళ్లు తాగారు.

“మీ అక్కయ్యకు చెప్పేవు! బయట తిళ్లు తినకూడదని తిడుతుంది! నాకేమో జిహ్వచాపల్యం ఎక్కువ” అన్నాడు బావ.

“ఇప్పుడు ‘టీ’ తాగుదాం!” అంటూ కొంత దూరంలో ఉన్న ‘రాజస్థాన్‌ టీ స్టాల్‌’కు దారి తీశాడు.

“దో చాయ్‌ బోలో రే ఛోటూ, ఏక్‌ దమ్‌ కడగ్‌ రహనా దేఖో” అంటూ ఆర్డరిచ్చి బయట వేసిన బెంచీ మీద కూర్చున్నారు. టీ వచ్చింది. పరమ రుచిగా ఉంది. టీ తెచ్చిన కుర్రవాడికి పదేళ్లుంటాయి. “సలామలేకుం సాబ్‌” అన్నాడు రామ్మూర్తికి టీగ్లాసందిస్తూ

“క్యారే, జహంగీర్‌ ! కైసా హై” అంటూ జేబులోంచి వాడికొక అర్ధరూపాయ తీసిచ్చాడు.

“చూడరా పతంజలీ! పొట్టకూటి కోసం చిన్నవయసులోనే పని చేస్తున్నాడు పాపం. చిన్నపిల్లవాడు!” అని జాలి పడ్డాడు.

బావ వ్యక్తిత్వంలోని ఒక్కొకకోణం బయటకు పడుతున్నకొద్దీ ఆయన మీద గౌరవం పెరిగిపోతూంది. తాను కూడ ఎలా వుండాలో అవగతమౌతుంది.

అక్కడ నుండి ‘విశాలాంధ్ర బుక్‌ హౌస్‌’ తీసుకుని వెళ్లాడు రామ్మూర్తి. చాలా పెద్ద షాపది. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య పట్టణాలన్నింటిలో దాని బ్రాంచీలున్నాయి.

“ఏదయినా మంచి పుస్తకం కొనుక్కో బుజ్జి బావా!” అన్నాడు.

“ఇప్పుడెందుకులే బావా! ఇప్పటికే చాలా ఖర్చుపెట్టావు” అన్నాడు బుజ్జిబావ. “నీ మొహం! ఇదో ఖర్చా? నీవు సాహిత్యం బాగా చదువుతావని నాకు తెలుసు. అందుకే నీకేదైనా పుస్తకం బహుమతి ఇవ్వాలనుకుంటున్నా”

ర్యాక్ లన్నీ వెదికి, వడ్డెర చండీదాస్‌ నవల’ ‘అనుక్షణికం’ తీసుకున్నాడు. ఈలోపు బావ “ది కంప్లీట్‌ షార్ట్‌ స్టోరీస్‌ ఆఫ్‌ ఓ హెన్రీ” అనే పుస్తకం తీసుకొచ్చాడు. రెండింటికీ బిల్లు చెల్లించి బయటకువచ్చారు.

తోడు దొంగలిద్దరూ ఇల్లు చేరేసరికి ఎనిమిదవుతూ ఉంది. “ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నారు” అంటూ బయటకువచ్చింది. పతంజలి చేతుల్లో బట్టల కవరు తీసి ప్యాంటు షర్టు చూసింది.

“ఎంత బాగున్నాయో! నాకు ఒకసారి వేసుకొని చూపించు” అనడిగింది. “పుస్తకాలు కూడ కొనిచ్చారా మీ బావ. నీవంటే ఎంతిష్టమో చూడరా ఆయనకు” అంది.

“బయట ఏదైనా తిని వచ్చారా? వచ్చే ఉంటారు. అదేమిటో ఈ మనిషి! ఎంత చెప్పిన వినరు కదా! మీరు చెడిపోయింది కాక మా తమ్ముడిని కూడ చెడగొడుతున్నారు.” అన్నది కోపంగా.

“లేదు లేవే! పతంజలి రుచి చూస్తాడనీ!” అని గొణుగుతున్నాడు బావ. “వాడిమీద నెపం వేయకండి! వద్దు! తినకండి! ఆరోగ్యం పాడవుతుంది! అని ఎంత చెప్పినా అర్థం కాదదేం ఖర్మో!” అన్నది నుదుటి మీద మెల్లగా కొట్టుకుంటూ.

బుద్ధిమంతుడిలా ఆమె ఎదుట నిలబడి, ఆమె చేతులు పట్టుకొని, “వాగ్దేవీ! నా హృదయదేవీ! అత్యంత కఠినములయిన నీ వాగ్బాణములతో నన్ను బాధించకు. తప్పయినది. క్షంతవ్యుడను” అన్నాడు గ్రాంథికంలో. తంగేడుపూలు వికసించినట్లు నవ్వింది అక్కయ్య.

“చాల్లెండి! ఈ నాటకాలకేమీ తక్కువ లేదు” అంటూ మగని చేతులు విడిపించుకొని వంటింట్లోకి వెళ్లింది. భోజనం ఏర్పాట్లు చూడటానికి.

మరో రోజు ఉండి ఊరికి బయలు దేరాడు పతంజలి. బస్సులో పగలంతా ప్రయాణం వద్దన్నాడు రామ్మూర్తి. తిరుపతికి వెళ్లి ‘వెంకటాద్రి’ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కుతే డోన్‌లో దిగవచ్చన్నాడు.

తిరుపతికి వచ్చి రైలెక్కించాడు బావ. బయలుదేరుతుంటే అక్కయ్య కళ్ళనిండా నీరు ఊరడం గమనించాడు.

“జాగ్రత్తరా ఊరు చేరగానే ఉత్తరం వ్రాయి” అన్నదామె.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో  ఆ రాత్రి తినడానికి చపాతీలు, వేరుశనక్కాయల పొడి కట్టిచ్చింది అక్క. అక్కడే బయలుదేరుతుంది కాబట్టి జనరల్‌ కంపార్ట్‌మెంటులో సీటు కిటికీ ప్రక్కనే దొరికింది. పైన చెక్క బల్ల మీద టవలు పరచి, రాత్రి పడుకోడానికి ‘బెర్త్‌’ రిజర్వు చేసుకొన్నాడు. ప్లాట్‌ఫారం మీద కొళాయి దగ్గర నీళ్లు పట్టుకున్నాడు. రైలు కదులుతూ ఉంటే బావ చెప్పాడు.

“చదువును మాత్రం నిర్లక్ష్యం చేయకు. మామకు అవగాహన లేదు. పోను పోను ఈ వ్యవసాయాలు భారంగా మారతాయి. వ్యవసాయం తప్ప మరో పని చేయలేని వాళ్లైతే తప్పదు. వెంటనే డిగ్రీకి కట్టు. జాగ్రత్త!” అంటూ అభిమానంగా తల నిమిరి షేక్‌హాండ్‌ యిచ్చి వెళ్లిపోయాడు బావ. ఆయన వెళ్లిపోతుంటే మనసంతా భారమయింది పతంజలికి.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఆ మధ్యే ప్రారంభమయింది. అప్పటికింకా మీటర్‌ గేజ్‌. తిరుపతి, ధర్మవరం, అనంతపురం, గుంతకల్‌, డోన్‌, కర్నూలు, మహబూబ్‌నగర్‌ మీదుగా సికింద్రాబాద్‌ వెళుతుందది. డోన్‌ చేరేసరికి తెల్లవారు ఝామున నాలుగవుతుందన్నారు. వెల్దుర్తిలో ఆగదు. కంపార్టుమెంట్లన్నీ నీలం రంగులో మెరిసిపోతున్నాయి.

కాసేపు ఓ. హెన్రీ కథలు మూడు నాలుగు కథలు చదువుకున్నాడు. ఇంటర్మీడియట్‌, నాన్‌డిటెయిల్డ్‌లో ‘ది లాస్ట్‌ లీఫ్‌’ అనే కథ పాఠ్యాంశంగా ఉండేది. ‘ఎ ట్విస్ట్‌ ఇన్‌ ది టేల్ ’ ఆయన ప్రత్యేకత. మనకూహకందని ముగింపు ఇవ్వడం ఆయనకే చెల్లింది. బావకొనిచ్చింది చాలా పెద్ద పుస్తకం. ఇంచుమించు ఓ.హెన్రీ కథలన్నీ ఉన్నాయి.

బావే గుర్తుకు రాసాగాడు పతంజలికి. చిన్న చిన్న సంతోషాలను తీర్చుకుంటూ జీవితాన్ని ఎలా అందంగా మలచుకోవాలో ఆయన వల్ల తెలిసింది. అక్కయ్యను ఆయన ఎంత ప్రేమగా చూసుకుంటాడో, అసలు కోపమంటేనే తెలియని, జీవితం పట్ల అపారమయిన అవగాహన కలిగిన ఆ మనిషి బావ కావడం తన అదృష్టమనుకున్నాడు పతంజలి. ధర్మవరం జంక్షన్‌ వచ్చింది. రైలు దాదాపు ఇరవై నిమిషాలాగిందక్కడ. చపాతీలు తిని నీళ్లు తాగాడు. బాత్‌రూంకు పోయి వచ్చి పైకెక్కి పడుకొన్నాడు. వెంటనే నిద్రపట్టింది. మెలకువ వచ్చేసరికి రైలు గుంతకల్‌ దాటిపోయినట్లు ఎవర్నో అడిగి తెలుసుకున్నాడు. దిగి సిద్ధంగా కూర్చున్నాడు. నాలుగున్నరకు ‘ద్రోణాచలం’ జంక్షన్‌లో రైలాగింది.

దిగి, సామాన్లు తీసుకొని వెయిటింగ్‌ రూంలోకి వెళ్లాడు. కాలకృత్యాలు తీర్చుకుని, ముఖం కడుక్కున్నాడు. ఒకాయనను తన బ్యాగులు చూస్తూండమని చెప్పి, స్టేషన్‌ బయట టీ స్టాల్‌లో టీ తాగి వచ్చాడు.

ఆరుగంటలకు ద్రోణాచలం – కర్నూలు టవున్‌, లోకలు ట్రైన్‌లో ఎక్కి, వెల్దుర్తిలో దిగాడు. మిత్రులందరూ కనబడ్డారు. అందరూ డిగ్రీలో చేరారు. రోజూ వెళ్లివస్తారు. అగస్టీన్‌ గవర్న్మెంట్ కాలేజిలో, అల్లాబక్ష్‌ ఉస్మానియా కాలేజీలో చేరారట. ఇద్దరూ బి.ఎస్సీ. తీసుకొన్నట్లు చెప్పారు. దశరథ నరసరావు పేటలో బి.ఏ.లో చేరాడని చెప్పారు.

ఇల్లు చేరుకుని అమ్మానాన్నలకు చిత్తూరు విశేషాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు. కూతురి సంసారం అంత బాగున్నందుకు వర్ధనమ్మ, మార్కండేయశర్మ సంతోషించారు.

“బంగారంలాంటి భర్త దొరికాడు మన బంగారుతల్లికి” అన్నాడు తండ్రి.

డ్రస్‌ చూపించాడు. పుస్తకాలు కొనిచ్చినట్లు చెప్పాడు. తమ్ముళ్లు చెల్లెలికోసం తెచ్చిన పార్లే బిస్కెట్‌ పాకెట్‌ వాళ్లకిచ్చాడు.

భోజనం చేసి తోటకు వెళ్లాడు పతంజలి. ఈ వారం రోజుల్లో మల్బరీ పైరు బాగా పెరిగింది. కొమ్మలు నిలువుగా పెరిగాయి. ఆకులు శ్యామలవర్ణంలో పసరు కక్కుతూ నవనవలాడుతున్నాయి. మిరపతోట పూతపెట్టింది. నిమ్మచెట్లల్లో తిరిగి పరిశీలించాడు. మరో వారం రోజుల్లో కాయ దించవచ్చు. ఈసారి నలభై బస్తాలు పైగానే కావచ్చు అని  అంచనా వేశాడు.

‘పైటాల’ భోజనాలు చేసి జీతగాళ్లు విశ్రాంతిగా కూర్చున్నారు. “సామీ! నా కొడుక్కు పేరుబెడతానంటివి. మర్సిపోయినావా” అని గుర్తు చేశాడు సుంకన్న. వాడు అడిగిన రోజే పంచాంగం చూసి నక్షత్రం ప్రకారం పేరు అనుకున్న సంగతి గుర్తుకువచ్చింది. మరుసటి రోజే చిత్తూరు వెళ్లాడు.

“చూసి పెట్టినాలేరా. వాడికి ‘సుధాకర్‌’ అని పేరు పెట్టండి. నక్షత్రం ప్రకారం సరిపోతుంది” అన్నాడు.

“సుధాకర్‌!” బాగుంది సామీ” అన్నాడు సుంకన్న.

తోకోడు అడిగాడు “సుధాకరంటే యాదేవుడు సామీ” అని. “చంద్రుడురా” అన్నాడు పతంజలి.

“సామీ! మంచి ఊపున్న పాట బాడు. శాన్రోజులాయ దరువేసుకుందాం” అన్నాడు సుంకన్న.

అందరూ ఇంజను రూములోకి పోయినారు.

“ముందు నీవు పాడరా హనుమంతూ” అన్నాడు పతంజలి. సుంకన్న కుండతో రడీగా ఉన్నాడు. రెండు వేళ్లతో ఒక పావలా నాణెం పట్టుకున్నాడు. ఒక చేతివేళ్లతో ఒక చేతిలో నాణెంతో కుండమీద వాయిస్తాడు. వాడికి జన్మతః లయజ్ఞానం అబ్బింది.

“సంగీత కచేరీలలో ఈ  దరువునే ‘ఘటవాయిద్యం’ అంటారు” అన్నాడు పతంజలి.

“గటవాయిద్దెంలో మనోడు పనోడు” అన్నాడు తోకోడు అని పాట ఎత్తుకున్నాడు.

సింతసిగురు కోయనీకె
సింతసెట్టు ఎక్కినాది
ఈడిగోల్ల సిన్నక్క
పచ్చకోక ఎర్రరైక
పడుసుదనం పట్టనీకె
సెక్కెంకాకుండా
‘సింతసిగురు’
పిక్కల నిగనిగ అబ్బో
పొట్టేమోపు గ్యాలగంప
నేరెడు పండ్లు కన్నులు
సూడనీకె రొండు కల్లు
సాలవులే దానెక్క
‘సింతసిగురు’

కర్నూలు జిల్లాలో ఆడపిల్లను ‘సిన్నక్క’ అని సంబోధిస్తారు. పాటకనుగుణంగా కుండ మీద వాయించాడు సుంకన్న.

“ఈడిగోల్లు (కల్లుగీతవారు, గౌడ్లు) గీన నీ పాటింటే నీ ఈపు ఇమానం మోతేరోయ్‌ తోకనాకొడకా” అన్నాడు సుంకన్న.

తోకోడు ముసిముసిగా నవ్వాడు.

“నేనేమన్నా రాసినానా దాన్ని ఎప్పుడో పెద్దలు రాసినపాట” అన్నాడు.

“ఇంగ నీవు పాడు స్వామీ” అన్నాడు “ఏ పాట పాడతావో సెప్పుముందల” వాడికి ముందే పాట చెప్పాలి. దరువు వేయటానికి అనుకూలంగా ఉందో నిర్ణయిస్తాడు.

“భార్యా బిడ్డలు” సినిమాలో “ఆకులు పోకలు ఇవ్వద్దూ! నా నోరు ఎర్రగ చెయ్యొద్దూ అనే పాట పాడతా”

“ఏదీ ఒక ‘నుడుగు’ అను”

పల్లవి పాడి వినిపించాడు పతంజలి

“ఊహు అంత ఊపులేదు సామి” అన్నాడు సుంకన్న

“నీవే చెప్పు నాకు తోచటం లేదు”

“పల్లెటూరి బావ సినిమాలోది పాడతావే, ‘ఒసే వయ్యారి రంగీ, వగలమారి బుంగీ, ఊగిందే నా మనసు ఉయ్యాల’ అది పాడు కుండమీద సంపుకుంటా” అన్నాడు. పతంజలి ఆ పాటెత్తుకున్నాడు. చాలా ఉషారైన పాటది ఐదారు నిమిషాల పాట పతంజలి గాత్రం, సుంకన్న వాద్యంతో ఇంజను రూము మోతెక్కిపోయింది. అయిపోయింతర్వాత సుంకన్న అన్నాడు.

“పాటంటే యిట్టుండాల” తోకోడన్నాడు. “ఉండాల్సినోల్లు మీ యిద్దరు”

మరుసటి రోజు డోనుకు పోయి చలపతిసారును కలిశాడు. మరో పదిహేను రోజుల్లో మల్బరీ పంట మేతకు సిద్ధమయితుందని చెప్పాడు.

“స్వామీ! విత్తనం కోసం మనం హిందూపురానికి పోవాల్సిన పనిల్యా. డోన్‌కే తెప్పిస్తున్నాం. సరిగ్గా పదిహేను రోజుల తర్వాత రాండి. విత్తనమిస్తాము. అది కూడ ఫ్రీగా” అన్నాడాయన.

చిన్నాన్న వాళ్లింటికి పోయి భోంచేసి, కాసేపుండి, వెల్దుర్తికి వచ్చేశాడు. ఈలోపు నాయుడి నుండి జవాబు వచ్చింది కోడూరు నుంచి. హైద్రాబాదులో కూడ నిమ్మకాయల మండీ పెద్దది ఉన్నదనీ, మంచిరేటు పలుకుతూన్నదనీ, ఈసారి ఏడెనిమిది మంది కలిసి ఒక లారీ మాట్లాడుకొని హైదరాబాదుకు పోతామనీ, నీవు కూడా ఈసారి హైద్రాబాద్‌కు వేసుకురమ్మనీ రాశాడు. సిద్ధియంబర్‌ బజారులో రాజధాని హోటల్‌ వెనుక సందులో మండీ ఉంటుందని. ‘అహమ్మద్‌ షరీఫ్‌’ మండీ అంటారనీ రాశాడు. వెల్దుర్తి నుండి రైల్లో బుక్‌ చేసుకొని రావద్దనీ, బైపాస్‌లో వస్తూన్న లారీల లోడ్‌ మీద వేసుకుని వచ్చి ‘నయాపూల్‌’ బ్రిడ్జి వద్ద దింపుకుంటే అక్కడికి దగ్గరనీ, మనమే అక్కడ నుండి ట్రాలీ రిక్షాల్లో మండీకి తీసుకొనిపోవచ్చుననీ చాలా వివరంగా వ్రాశాడు.

నాన్నకిదంతా చెపితే, “ఒకసారి పోయొస్తే తెలుస్తుంది గద నాయన, రాముడో, రాక్షసో” అన్నాడాయన. పట్టుపురుగుల పెంపకం స్టార్టయ్యే లోపల హైదరాబాదుకు పోయి వస్తే మంచిదనుకున్నారు.

నాల్రోజుల్లో కూలీలను పెట్టి కాయ తెంపించాడు పతంజలి. గ్రేడింగ్‌ చేసి, బస్తాల్లో ప్యాకింగ్‌ చేశారు వరిగడ్డితో పతంజలి అంచనా వేసినట్టే నలభై మూడు బస్తాలయ్యాయి. గ్రేడింగ్‌ ప్రకారం నంబర్లు వేసి, పైన AS అనీ క్రింద VDI-PL అనీ రాశాడు. గ్రీన్‌ యింక్‌ పౌడరు దొరికితే తెచ్చుకొని చిక్కగా కలుపుకొని, చిన్న బ్రష్‌తో రాశాడు అందంగా AS  అంటే ‘అహ్మద్‌ షరీఫ్‌’ అని VDI అంటే వెల్దుర్తి PL అంటే పతంజలి.

రాత్రి భోజనం చేసి పదిగంటలకల్లా, ఎద్దుల బండిలో బస్తాలు వేసుకొని, సుంకన్న, తోకోడు, పతంజలి, రైల్వేస్టేషన్‌ వెనక నేషనల్‌ హైవే మీద బండి ఆపుకొని ఉన్నారు. ఎద్దులను విప్పి పక్కన కట్టేశారు. ‘వెల్దుర్తి బైపాస్‌’ అంటారు దాన్ని.

బెంగుళూరు వైపు నుండి హైదరాబాదుకు వెళ్లే లారీలను ఆపసాగారు. ఫుల్‌ లోడున్నవి పనికిరావు. బాడీ వరకు లోడ్‌ చేసినవయితే సులభం. నిమ్మకాయల బస్తాలు ఎక్కించొచ్చు. కొంతమంది డ్రైవర్లు బస్తాలు చూసి వాళ్లే ఆపి అడుగుతున్నారు. ఐదారు బళ్లను విచారించి ఎవరు తక్కువకు తీసుకుబోతే వారి లారీలో లోడ్‌ చేద్దామని చూస్తున్నారు.

కొంతమంది బస్తాకు ఐదు రూపాయలిచ్చి, మనిషికి పదిరూపాయలిమ్మంటున్నారు. ట్రెయిన్‌తో పోలిస్తే చాలా ఎక్కువనిపిస్తుంది పతంజలికి. మూటకు రెండు రూపాయలు, తనను ఫ్రీగా తీసుకుపోయేవాళ్ల కోసం చూస్తున్నాడు. ఏడెనిమిది లారీలు వదిలేశారు. చివరికి ఒక డ్రైవరు అతనే ఆపాడు.

“ఏంటియి? యాడికి బోవాల” అనడిగాడు బయటకు తలపెట్టి.

“నిమ్మకాయలు. అయిదరాబాదుకు” అన్నాడు తోకోడు.

లారీ లోడ్‌ కూడ బాడీ వరకే ఉంది. ఇనుప స్క్రాప్‌లా ఉంది.

“ఎక్కించండి. ఏస్కపోతా” అన్నాడతను. “మీరు ఎంతమందొచ్చారు?” అన్నాడు.

 ‘నేను ఒక్కడినే” అన్నాడు పతంజలి. “బస్తాకెంతివ్వాలి” అనడిగితే

“ఎంతో కొంతిచ్చువులే. అదే మన్న పెద్దలోడా! యాభై మూటలు గూడ ఉండవు.    ఒక మూలకు గూడ రావు” అన్నాడు డ్రైవరు

“అట్లగాదులేన్నా. నీవకటి నేనొకటి అనుకొని దిగింతర్వాత….”

“నీవే చెప్పయితే”

“మూటకు రెండు రూపాయలు. నన్ను ఫ్రీగా తీసుకెళ్లాలి”

“సరే లేబ్బా. నీకు డబ్బులెవరడిగినారు. అట్లేగాన్లే, ఎత్తండిమరి.”

లారీ వెనుకవైపు, బండి చివరి భాగం పైకి వచ్చేలా ఉంచి సుంకన్న అందిస్తూంటే, తోకోడు క్యాబిన్‌ గోడకు బస్తాలను అమర్చసాగాడు. అన్నీ ఎక్కించే సరికి అరగంటపట్టింది.

“మొత్తం నలభైమూడు. లెక్కపెట్టుకో” అన్నాడు పతంజలి.

“ఉండనీలే నీకు తెల్చుకదా” అన్నాడు డ్రైవరు.

“జాగ్రత్త సామీ, చేమంగబొయ్యి లాబంగరా’ అన్నాడు తోకోడు. పతంజలి క్యాబిన్‌లోకి ఎక్కి డోరు వేసుకున్నాడు. ఇద్దరూ బండి దగ్గరకు వెళ్లిపోయారు. ఎద్దులు రెండూ లారీ ఎక్కుతున్న పతంజలినే చూస్తున్నాయి. తమతో రావడం లేదే అని డ్రైవరు కూడ ఎక్కి డోరు వేసుకున్నాడు. లారీ స్టార్ట్‌ చేశాడు.

సుంకన్న డ్రైవరు దగ్గరకొచ్చి, “నీకు గీన దావలో నిద్రొచ్చే, మా సామితో పాటలు పాడిచ్చుకోన్నా. సామి పాటందుకుంటే నీ నిద్రగిద్ర ఎగిరిపోతాది” అని సలహాయిచ్చాడు.

“అట్లనే లేబ్బా” అంటూ లారీ ముందుకు పోనిచ్చాడు డ్రయివరు.

జీతగాళ్ల పిలుపును బట్టి బ్రాహ్మలని అర్థం చేసుకున్నాడు. తాను కూడ ‘సామీ’ అనడం ప్రారంభించాడు.

“సామీ! బాపనోల్లయి కూడ సేద్యం జేచ్చుండావే. నీ పాసుగూల గట్టోనివే” అన్నాడు. “నీ పేరేందయ్యా”

“పతంజలి”

“ఓహో సినిమాయాక్టరు అంజలీదేవి పేరు పెట్టుకున్నావే”

“కాదు కాదు. అది ఒక మహర్షి పేరు”

“మహర్షి అంటే”

“ముని”

“అట్ల జెప్పొచ్చుకద ముందే”

“నీ పేరేమిటన్నా”

“నా పేరు ఓబులేసు. ఆళ్లగడ్డ కాడ ఓళం (అహోబిలం) ఉండ్ల్యా. ఆ సామి పేరేనాది. మాది సంజామలలే”

ఓబులేసుకు ముప్ఫై సంవత్సరాలుంటాయి. నల్లగా బలంగా ఉన్నాడు. గిరజాల జుట్టు. కొనదేరిన ముక్కు. సన్నని మీసం ‘పాతాళభైరవిలో ఎన్టీఆర్‌లా ఉన్నాడు’ అనుకున్నాడు పతంజలి.

కర్నూలు బైపాస్‌లో బళ్లారి చౌరస్తా దగ్గర లారీ ఆపాడు. అప్పటికి పన్నెండవుతూంది. “టీ తాగుదాంరా సామి” అని పిలిచాడు.

ఇద్దరూ దిగి టీ తాగారు. టీకి డబ్బులు పతంజలే ఇచ్చాడు. “నీవిచ్చివా! ఎవరిచ్చే ఏంలే. పోదాంపా” అన్నాడు.

అలంపూరు చౌరస్తా దాటింతర్వాత రోడ్డు పక్కన అక్కడక్కడ ఆడవాళ్లు నిలబడి చెయ్యి ఊపుతున్నారు. వాళ్లను పరీక్షగా చూస్తూ నడుపుతున్నాడు బండిని.

“ఒక్కటి కూడ బాలేదు” అన్నాడు పతంజలితో. అతనికి అర్థం కాలేదు. కాసేపున్న తర్వాత ఒకామె దగ్గర ఆపాడు. దాదాపు నలభై ఏళ్లుంటాయామెకు పుష్టిగా ఉంది. మల్లెపూలు పెట్టుకుంది. ఏదో సెంటు వాసన. క్యాబిన్‌లోకి కొట్టింది గుప్పున.

“సామీ! నువ్వుండు ఇప్పుడే వచ్చా” అని లారీ దిగి ఆమె దగ్గరకు పోయి మాట్లాడాడు. తర్వాత ఇద్దరూ పొలాల్లోకి నడిచారు. ఆమె దగ్గర టార్చిలైటు కూడ ఉంది. పతంజలికర్థమయింది.

దాదాపు అరగంట తర్వాత తిరిగి వచ్చాడు ఓబులేసు. “ఏమనుకోగాకు సామీ! రోజుల తరబడి డూటీ మీదుంటాంగదా! ఇట్లాంటివి తప్పవు” అన్నాడు.

ఓబులేసు తనకు సంజాయిషీ ఇవ్వడం ఎందుకో అర్థంకాలేదు. గిల్టీఫీలింగ్‌ ఏమో అనుకున్నాడు. ఆమెను తల్చుకుంటే జాలేసింది పతంజలికి. పొట్టకూటి కోసం, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా రోడ్డు ప్రక్కన కాచుకొని ఉండి, డ్రయివర్ల కోరిక తీర్చి, కుటుంబాన్ని పోషించుకోవాలి. పతంజలి మనస్సు ఒక విధమయిన ఆవేదనకు లోనయింది.

అక్కడినుండి లారీ వేగంగా నడపసాగాడు ఓబులేసు. దాదాపు ఒకటిన్నర ప్రాంతంలో పెబ్బేరులో బండి ఆపాడు. పెబ్బేరుకు బైపాస్‌ లేదు. ఊర్లోంచి అన్ని వాహనాలు వెళతాయి.

“ఆకలేస్తుంది. సామీ నేను బోంచేచ్చా” అన్నాడు.

“ఈ టైంలో భోజనమా!” అన్నాడు పతంజలి ఆశ్చర్యంగా.

“మాకు యాలాపాలా యాడుంటాది” అంటూ ఎదురుగ్గా ఉన్న హోటల్లోకి నడిచాడు. పతంజలి కూడ దిగి, చాటున పాస్‌ పోసుకుని, తానూ హోటల్లోకి వెళ్లి ఓబులేసు ఎదురుగా కూర్చున్నాడు.

“నీవేమయిన తింటావా సామీ!” అనడిగాడు ఓబులేసు.

“నాకేమీవద్దు. ఊరికే నీకు తోడుగా” అన్నాడు పతంజలి.

చాలామంది ఆ హోటల్లో భోంచేస్తున్నారు ఆ టైంలో డ్రైవర్లు, క్లీనర్లు ఎక్కువమంది. సర్వర్‌ విస్తరాకు వేసి, “నాన్‌ వెజ్‌ ఏమయినా కావాలా” అని అడిగాడు.

“వద్దు. ఎదురుగా సామిని బెట్టుకొని, నీసు ఎట్ల తింటా?” అన్నాడు.

ఆ టైంలో కూడ పదార్థాలు వేడి వేడిగా ఉండటం గమనించాడు పతంజలి. ఏదో ఆకుకూర పప్పు, పల్చగా ఉంది. వంకాయ కూర. టమేట ఉల్లిపాయ కలిపి నూరిన పచ్చడి. చారు. చిన్న కప్పుతో పెరుగు ఇచ్చాడు.

“మజ్జిగ తాగకూడదూ స్వామీ, సల్లగ!” అంటూ “ఒక గ్లాసు మజ్జిగ తెచ్చియ్యి” అని సర్వరుతో చెప్పి తెప్పించాడు.

మజ్జిగ ఒక స్టీలు గ్లాసులో తెచ్చిస్తే తాగాడు. బాగుంది.

ఓబులేసు పెరుగన్నం తింటూండగానే కౌంటర్‌ దగ్గరకెళ్లి, బిల్లు కట్టేశాడు పతంజలి. ఓబులేసు చెయ్యి కడుక్కొని వచ్చి డబ్బు తీయబోతూంటే కౌంటర్లో కూర్చున్నతను అన్నాడు “ఈన ఇచ్చేసిండ్ల్యా”

“నీతో బో సిక్కొచ్చిపడిరదే, సామీ! యాడగూడ్క నన్ను డబ్బులియ్యనియ్యవు. నీ పాసుగూల” అన్నాడు ఓబులేసు.

“దాందేముందిలే. పద వెళ్దాం అన్నాడు పతంజలి. బస్తాల విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించినందుకు తను ఆ మాత్రం చేయడం ధర్మం అనుకున్నాడు.

‘కొత్తకోట’ దాటింది లారీ. “యాదయినా పాట బాడు సామి” అన్నాడు.

“నీకు ఎటువంటి పాటలిష్టం?” అని అడిగితే,

“దేవదాసు”లో పాట ఏదయినాసరే” అన్నాడు.

“కుడి ఎడమయితే పొరపాటులేదోయ్‌, ఓడిపోలేదోయ్‌” అనే పాటపాడాడు పతంజలి. పాడడం పూర్తయిన తర్వాత “ఏం పాట సామీ, ఏం బాడ్తివి, ఏంబాడ్తివి. గంటసాల లెక్కనే ఉండాది నీ గొంతు. వానెమ్మ నాగేస్సర్రావు ఆ సినిమాలో ఏడిపించి సంపిడ్ల్యా” అన్నాడు ఓబులేసు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here