[dropcap]భా[/dropcap]రతదేశం గొప్ప ఆధ్యాత్మిక దేశం. ఎందరో మహానుభావులు పరమాత్మకు ప్రతీకలుగా భారతావనిపై నడయాడారు. భక్త దురంధరులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలకూ కూడా దైవాన్ని పొందే యోగ్యత ఉందని భరోసా ఇచ్చిన దివ్యులెందరో ఈ గడ్డ మీద తిరుగాడారు.
మానవాళి ఆర్తి తీర్చి, దైవానుగ్రహం వైపు నడిపిన పరమాత్మ ప్రతినిధులు భారతీయ యోగులు. ఎందరో యోగులు గుప్తంగా ఉన్నా, వారి లక్ష్యం సమాజ హితమే తప్ప వ్యక్తిగత మేలు కానే కాదు. అలాగే జనబాహుళ్యంలో తిరిగిన యోగులు సైతం సామాన్యులను ఈతిబాధల నుంచి తప్పించి పరమాత్మ వైపు మళ్ళించడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. యోగులు స్వీయ ఉన్నతికి కాకుండా ఇతరుల అభివృద్ధికి తోడ్పడి భగవంతుడికి ప్రతినిధులయ్యారు.
దాదాపు ప్రతీ యోగి జీవితంలోనూ కొన్ని అద్భుతాలుంటాయి, కొన్ని అబ్బురపరిచే విషయాలు ఉంటాయి. అయితే వారు వాటి దగ్గరే ఆగిపోక, పరమపథంలో ముందుకుసాగారు. శిష్యకోటి గాని లేదా స్వయంగా దర్శించిన వారు గాని ఆ అద్భుతాలను వీలును బట్టి వెల్లడి చేసుకుంటూ రావడం వల్ల భారతీయ యోగులు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది.
అటువంటి మహనీయుల గురించి, వారు ప్రదర్శించిన మహత్యాల గురించి ఎన్నో వివరాలు సేకరించి పాఠకులకు అందించిన శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ గారు ధన్యులు.
ఈ పుస్తకంలో సంధ్య గారు 45 మంది భారతీయ యోగులను పాఠకులకు పరిచయం చేస్తారు. యోగుల చరిత్రలు చదివితే మనకు మార్గం కనబడుతుంది. అది ముక్తికి హేతువవుతుంది అని నమ్మారు రచయిత్రి.
మొదటి వ్యాసం ఆది శంకరాచార్యుల వారిపై. ధర్మోద్ధరణకి శంకరుల వారు చేసిన కృషిని, దేశమంతా తిరిగి పీఠాలు స్థాపించి ధర్మం నాలుగు పాదాల నడించేందుకు వారు సలిపిన కృషిని వివరిస్తూ – వివిధ దేవాతామూర్తులకు మనం నిత్యం చేసే పూజా విధానాలు కూడా ఆయన అందిచ్చారని తెలుపుతారు.
“ఒక్కొక్క మనిషి ఒక పుస్తకం వంటివాడు. గర్భవాసం అట్ట, కర్మఫలం విషయ సూచిక, దీక్ష గ్రహణం విజ్ఞానము, కౌమారం, యవ్వనం, వార్దక్యం అందులో అంశాలు. జీవితంలో మంచి చెడులు పాఠ్యాంశాలు” అని బోధించిన త్రిలింగ స్వామి గురించి చదవడం గొప్ప అనుభూతి.
మహాతపశ్శక్తి సంపన్నులు, కలియుగంలో మన మధ్య నడయాడిన మహర్షి శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి గారి జీవితం ఆసక్తిదాయం. నేటికీ భక్తులను ఆయన కనిపెట్టుకు ఉంటున్న వైనం విశేషం. ‘పిబరే రామరసం’, ‘మానస సంచరరే’ వంటి కీర్తనలు వీరు రచించినవే!
శ్రీ అక్కల్‌కోట స్వామి సమర్థ గురించి తెలియజేస్తూ వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు రచయిత్రి. పూర్ణ దత్తావతరమైన స్వామి ఎందరెందరికో ఆత్మోన్నతి నొసగారని అంటారు.
‘సర్వులు ఒక్కటే, హెచ్చుతగ్గులు లేవ’ని సదా భక్తులకు చెప్పిన నీమ్ కరోలీ బాబా చరిత్ర గొప్పది. పూర్ణ హనుమంతుని అవతారమైన ఈ బాబా బోధించినది సరళమైన భక్తిమార్గమని రచయిత్రి వివరిస్తారు. అందరికి తగినంతగా, కుదిరినంతగ సహాయము చేసి, ఆదుకోమని బోధించారు బాబా.
గురువు కాని, ఉపదేశం కాని లేని యోగిని ఆనందమయి మా. ఆమె బోధ చాలా సరళంగా ఉండి సామాన్యులకు సైత అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టుగా అర్థమవుతుందని అంటారు రచయిత్రి.
మహావతార్ బాబాజీ వెల్లడించిన క్రియా యోగాన్ని సామాన్యులకు చేరువ చేసిన మహా గురువు శ్రీ లాహిరి మహాశయ. మానవులకు వారి వ్యక్తిగత నిబద్ధత ఎంతో ముఖ్యమైనదనీ, దానికై ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేవారని అంటారు రచయిత్రి.
‘అపర వాల్మీకి’ అని పేరుపొందిన తులసీదాసు సైన్సు కందని ఎన్నో అద్భుతాలు చేశారనీ, రామ్‍చరిత్ మానస్, హనుమాన్ చాలీసా భక్తులకు అందించారని చెబుతారు.
ఎందరికో మంత్రోపదేశం చేసి, ఎందరికో రమణమహర్షిని పరిచయం చేసిన ఘనత నాయనదేనంటూ కావ్యకంఠ గణపతి ముని గురించి వివరిస్తారు.
పరమేశ్వర స్వరూపమయిన శ్రీపాకలపాటి గురువుగారిని పరిచయం చేసింది శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారని తెలియజేస్తూ, గురువుగారి గొప్పతనాన్ని వెల్లడిస్తారు రచయిత్రి. మనకు చేతనయినంతగా, ఆర్భాటం లేకుండా చేయాలని వారి బోధ.
ఆధునిక అవధూత శ్రీ వెంకయ్య స్వామి. ఆయన బోధలు చాలా సులువైన భాషలో ఉన్నప్పటికీ, లోతైన తత్వాన్ని వివరిస్తాయని అంటారు రచయిత్రి.
తన జీవితమే సూక్తిగా ఎందరికో బోధనిచ్చిన శ్రీ తాజుద్దీన్ బాబా చరిత్ర విశిష్టం, ఆయన మార్గం అనుసరణీయం.
అందరినీ సమానంగా ప్రేమించమని చెప్పిన యోగి శ్రీ మెహెర్ బాబా. ఎందరినో అయస్కాంతంలా ఆకర్షించిన మెహర్ బాబా – ఎదుటివారి లోపాలు చూపటం కన్నా మనలోని వంకర సర్దుకోమని చెప్పేవారని అంటారు రచయిత్రి.
విలుప్తమైన సన్యాస మార్గాన్ని పునరుద్ధరించడానికి మానవ జన్మనెత్తిన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి యతివరేంద్ర మహాస్వామి చరిత్ర అవశ్యం పఠనీయం. ఎంత దూరంగా ఉన్నా నిజమైన భక్తితో, ఆర్తితో కొలిచిన భక్తులను మహాస్వామి కాపాడిన సందర్భాలెన్నో ఉన్నాయంటారు రచయిత్రి.
జడమైన బ్రహ్మం గురించి అలతి పదాలలో చెప్పే జిల్లేళ్ళమూడి అమ్మ గురించి తెలుసుకోడం ఆసక్తిదాయకం. అమ్మ మనలా పనులు చేసినా వాటిలో దైవత్వం ప్రకటితమయ్యేదంటారు రచయిత్రి. భక్తులనూ, సర్వులనూ ఆదరించిన తల్లి అంటారు.
పూర్వపు ప్రహ్లాదుడే శ్రీ రాఘవేంద్ర స్వామి రూపంలో జన్మించారని భక్తుల విశ్వాసమని చెబుతూ, స్వామివారి మహిమలు, మంత్రాలయ దివ్యక్షేత్రం గురించి వివరిస్తారు రచయిత్రి.
ఆధునిక కాలంలో మనకు ఋషిగా దర్శనమిచ్చినవారు శ్రీ సద్గురు శివానందమూర్తి గారని చెబుతూ వారి జీవన విశేషాలను వెల్లడించారు రచయిత్రి. సర్వుల హృదయాలలో ఈశ్వర చైతన్యాన్ని దర్శించిన పరమ యోగి ఆయనని అంటారు.
‘మౌనస్వామి’గా ప్రసిద్ధులైన కుర్తాళం పీఠ స్థాపకులు శ్రీ శివచిదానందస్వామి గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. గురువాజ్ఞ మీదట, ఆయన జీవన పర్యంతం మౌనం ఎందుకు వహించారో ఈ వ్యాసంలో తెలుస్తుంది.
పూర్వాశ్రమంలో గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన డా. ప్రసాదరాయ కులపతి సన్యాసం స్వీకరించి కుర్తాళం ‘శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి’ పేరిట శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులయ్యారు. స్వామివారు రచయిత్రికి స్వయంగా మంత్రోపదేశమిచ్చిన వైనాన్ని రచయిత్రి ఈ వ్యాసంలో వివరిస్తారు.
గురుత్వం, మాతృత్వం కలగలపిన దివ్యత్వం శ్రీ శారదామాత అంటారు రచయిత్రి. ‘మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరులలో తప్పులు వెతకడం మానండి. మీలోనే తప్పులెంచి సరిదిద్దుకోండి’ అనే మాత సందేశం ఆచరణీయమైనది.
చందవోలు శాస్త్రులుగా పేరు గాంచిన శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవితం అద్భుతమైనది. శాస్త్రి గారి మహిమ వర్ణించడానికి మన జ్ఞానం చాలదంటారు రచయిత్రి.
అసలు పేరు ఎవరికీ తెలియని ‘మలయాళస్వామి’ గొప్ప యోగి. స్వామివారు మహత్యాలను ప్రకటించకపోయినా, ఎందరెందరో భక్తులను స్వప్న సాక్షాత్కారం ద్వారా కాపాడేవారని రచయిత్రి వెల్లడిస్తారు.
వేదవ్యాప్తికై పాటుపడి వేదాన్ని నిలిపిన ఎందరో మహానుభావులలో శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి వారు ఉత్తమోత్తములని తెలుపుతారు రచయిత్రి.
మానవ రూపం దాల్చిన ఉపనిషత్ స్వరూపం శ్రీ రామకృష్ణ పరమహంస అంటారు రచయిత్రి. రామకృష్ణ పరమహంస సాధన, ఆధ్యాత్మిక ఉన్నతి, వివాహం, శిష్యుల ఆదరణ తదితర వివరాలను అందించారు రచయిత్రి.
టెంబే స్వామిగా ప్రసిద్ధులయిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి దేశమంతా పాదచారియై పర్యటించి దత్త సంప్రదాయ సర్వోత్కృష్టతను చాటారని రచయిత్రి వివరిస్తారు.
ఇంకా ఈ పుస్తకంలో – షేగామ్ గజానన్ మహారాజ్, శ్రీ స్వామి రామ, శ్రీ నిర్గుణ చైతన్యస్వామి, మాస్టర్ సి.వి.వి., శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు, శ్రీ ఎక్కిరాల భరద్వాజ, గౌతమ బుద్ధుడు, శ్రీ ఎమ్, శ్రీ జిడ్డు కృష్ణమూర్తి, శ్రీ మాణిక్ ప్రభు మహరాజ్, పురందర దాసు, ముత్తుస్వామి దీక్షితార్, నాదబ్రహ్మ త్యాగరాజ స్వామి, శ్రీ పరమహంస యోగానంద, శ్రీ అరవిందులు, శ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారయణ రామనుజ పెద్దజియరు స్వామి, అక్క మహాదేవి, శ్రీ అయ్యప్ప దీక్షితులు, అవధూత శ్రీ చిమటం అమ్మ, కాశిరెడ్ది నాయన – వంటి ప్రాచీన, ఆధునిక యోగుల గురించి ఆసక్తిదాయకంగా వివరించారు రచయిత్రి.
కొందరికి అనిపించవచ్చు, ఆయా యోగుల గురించి మాకు తెలుసు, వివిధ పుస్తకాలలో ఎప్పుడో చదివాము – అని. నిజమే, వేర్వేరు పూలను విడివిడిగా చూసినా అందంగానే ఉంటాయి, అవే వేర్వేరు పూలని ఒక కదంబమాలలా ఒక చోట చూడడం మరో సౌందర్యం.. యోగుల గురించి ఎవరెంత చెప్పినా, ఎలా చెప్పినా, తెలుసుకుని చెప్పినా, తెలిసున్నది చెప్పినా చదవడం, వినడం మన భాగ్యం.
నిజానికి భారతీయ యోగుల గురించి, గుప్త యోగుల గురించి అనేక పుస్తకాలు ఉన్నాయి. కానీ ఒక్కో యోగి గురించి విన్నప్పుడు ఒక్కో రచయితకు కలిగే అనుభూతులు, భాగ్యవశాత్తు కొందరు యోగులను స్వయంగా కలిసినప్పుడు కలిగిన అనుభవాలు విభిన్నంగా ఉంటాయి, అందుకే ఆయా యోగుల గురించి భిన్న రచయితలు చెప్పడం పునరుక్తి కాదు, చర్విత చర్వణమూ కాజాలదు.
ఆయా యోగుల చరిత్రలను ప్రాచీన – ఆధునిక యోగులుగా, వారి జీవన కాలాన్ని బట్టి విభజించి ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించినా – ఇదే క్రమం పాటించేందుకు రచయిత్రికి తగిన కారణాలు ఉండి ఉండవచ్చు. మొత్తం మీద ఈ పుస్తకం పాఠకులను ఆధ్యాత్మిక విహారం చేయిస్తుంది.
***
భారతీయ యోగులు (పరమాత్మకు ప్రతినిధులు)
రచన: సంధ్య యల్లాప్రగడ
పుటలు: 240
వెల: ₹ 200/-
ప్రచురణ: క్లాసిక్ బుక్స్, విజయవాడ
ప్రతులకు:
క్లాసిక్ బుక్స్, #32-13/2-3A,
అట్లూరి పరమాత్మ వీధి,
మొగల్రాజపురం,
విజయవాడ 520010
ఫోన్: 8522002536