కైంకర్యము-20

0
3

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]‘పా[/dropcap]లెం’ అన్న ఆ ఊరు గ్రామం కన్నా పెద్దది, టౌను కన్నా కొద్దిగా చిన్నది.

దాని చుట్టూ ప్రక్కల వేపచెట్లు, చింత చెట్లు విరివిరిగా ఉంటాయి. ఊరికో చెరువు, చెరువుకు కొద్ది దూరంలో కోవెల ఉన్నాయి. ఆ చెరువు క్రిందన పంటలు పండుతాయి.

కోవెల కోదండరామునిది. పాలెంలో కొన్ని సంపన్న వైశ్య కుటుంబాలు ఉన్నాయి. వారు కోదండరాముని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. వారు ఆ కోవెలకు భూరిదానాలు చేస్తూ ఉంటారు. వారు రంగరాజన్ దగ్గర సమాశ్రయమై వైష్ణవాన్ని పాటించే భక్తజనము.

కోవెల చుట్టూ అర ఎకరం ప్రాంగణం.

మూలవిరాట్ ఉన్న గర్భాలయానికి ముందర ఒక విశాలమైన మండపము, ఎదురుగా హనుమ, బయట ధ్వజస్తంభం.

కోవెల ప్రాంగణంలో మర్రి చెట్టు ఊడలు దింపి నిలబడింది. మరో ప్రక్కగా గన్నేరు, మందారాలు, దేవగన్నేరు, పచ్చగన్నేరు పూల మొక్కలు స్వామికి అర్చనకు పనికొస్తాయి. మరో వైపుగా తులసి వనం పెంచుతున్నాడు రంగరాజన్. స్వామికి తులసీదళ్ళాలతో ప్రత్యేక అర్చనలు అక్కడ సామాన్యమే.

కోవెల మండపంలో చిన్న పిల్లలకు సాయంకాలాలు పాఠాలు చెబుతాడు రంగరాజన్ రెండవ కొడుకు సౌందర్యరాజన్. ఉదయం వేదం నేర్పుతాడు రంగరాజన్. గన్నేరు మొక్కల నడుమ బావి. బావికి చుట్టూ చప్టా కట్టి ఉంది. ఆ బావికి కొంత దూరంలో ఒక చక్కటి చిన్న మేడ. అదే రంగరాజన్ గృహం.

రాఘవ నడుపుతున్న కారు వచ్చి కోవెల వద్ద ఆగింది.

రంగరాజన్ దిగుతూ “నీవొచ్చి చాలా కాలమైయింది కదరా!” అంటూ రాఘవ నుద్దేశించి అన్నాడు.

“అవును…” చెప్పాడు రాఘవ.

కారు వచ్చిన చప్పుడుకు రంగరాజన్ భార్య వల్లి బయటకొచ్చింది.

కారు లోంచి దిగుతున్న ఆడబిడ్డను, మేనల్లుడిని చూసింది.

“రండి…రండి” నవ్వుతూ స్వాగతం చెబుతూ ఎదురొచ్చింది.

ఆండాళ్ళును కౌగలించుకుంటూ రాఘవతో, “బాగున్నావా రాఘవా…” అంటూ వాళ్ళను అప్యాయంగా ఆహ్వానించింది.

“నీవు ఎన్ని రోజులైనా మారవు. వయస్సు రాదు. వన్నే తగ్గదు…” అంది ఆడబిడ్డను చూస్తూ.

ఆండాళ్ళు నవ్వుతూ “ నీ కళ్ళకెప్పుడూ మారను వదినా…” అంది.

“అది కాదే… ఆరుగురు పిల్లలు కన్నావు. మనవలు మనవరాళ్ళు ఉన్నారు. అయినా చూడు ఎక్కడన్నా ఒక్క వెంట్రుక నెరిసిందా… నీ కొడుకు చివరి వాడు కదా వీడు… నీవు చూస్తే వీడికి అక్కలా ఉన్నావు…” అంది ముచ్చటగా. ఆండాళ్ళు నవ్వుతూ తల ఊపింది.

“ఆ…పద…పద లోపలికి. ఇక్కడే కబుర్లా…” అన్నాడు రంగరాజన్ హెచ్చరికగా.

ఆమె అంతే, కబుర్లే కబుర్లు చెబుతూ ఉంటుంది.

నవ్వుతూ “మీ బంగారమేమి కరిగిపోదులెండి…” అంటూ “రావే…” అని లోపలికి నడిచింది.

ముగ్గురూ బావి దగ్గర తొట్టి నుంచి నీరు తీసుకు కాళ్ళు కడుకున్నారు. అక్కడే అరుగు మీద కూర్చున్నారు.

రంగరాజన్ ఇద్దరు కొడుకులలో మొదటి వాడు టౌనులో ఉంటారు. టీచరుగా పని చేస్తున్నాడు. రెండవ వాడు ఇక్కడే ఉంటాడు. అతను స్కూలు టీచరే. అతనికి భార్య పోయింది డెలివరీలో. ఒంటరి వాడు, తల్లి తండ్రుల వద్దే ఉంటాడు.

రాఘవ అటు ఇటూ చూడటం మొదలెట్టాడు. “బావా లేడా?” అన్నాడు చివరకు.

“వస్తాడురా. సాయంత్రం స్కూలు అయింది. ఎటో వెళ్ళి ఉంటాడు…” అంది వల్లి.

“టీ ఇస్తా…” అంటూ వంటగదిలోకి నడిచింది. వంటగది బయట ఉన్న అరుగు మీద ఆండాళ్ళు కూర్చొని మాట్లాడుతోంది.

కాసేపటికి రంగరాజన్ రెండవకొడుకు సౌందర్యరాజన్ వచ్చాడు.

కారును చూస్తూ లోపలికొచ్చి, అరుగు మీద అత్తను, బావి గట్టు దగ్గర రాఘవను చూసి నవ్వుతూ పలకరించాడు.

వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కోవెల వైపు నడిచారు.

“నీ ట్యూషన్ లేదా బావా? ఎటో వెళ్ళావే…”

“ఈ రోజు లేదు. ఈ మధ్య హోమియో సాధన చేస్తున్నాలే. ఊర్లో ఎవరికో బాలేదంటే చూసి మందివ్వటానికి వెళ్ళాను. నీవేంటి మెరుపు ఉరుము లేని పిడుగల్లే ఊడిపడ్డావే…”

“అమ్మని దింపటానికి వచ్చాలే…”

“అయితే అత్తను వదిలేసి వెళ్ళిపోతావా…”

“పండక్కి నాన్న, బామ్మతో కలిసి వస్తాను లేరా…”

“సరే నీ ఇష్టం… ఇంతకీ ఏం చేస్తున్నావు ఇప్పుడు…”

గొంతులో ఏదో అడ్డం పడ్డట్లు అయింది రాఘవకు. తేరుకోని.. “డిగ్రీ అయింది. ఎంబిఏ అంటే నాన్న ‘లా’ అంటున్నారు. ‘లా’ నాకు పరమ బోరురా బాబు” అన్నాడు.

“మామయ్య లాయరు కాబట్టి నీవు తన ప్రాక్టీసు తీసుకుంటే బెటరని చెప్పి ఉంటారు. మీకు అర్థం కాదులే పెద్దవాళ్ళ ఆలోచనలు…”

“అరే జ్ఞానం పంచకు బావా. కొంచం అట్టేపెట్టుకో. భవిష్యత్తులో పనికొస్తుంది…”

“సరేరా… నీ ఇష్టం.. కానీ.. పద అలా చెరువు గట్టుకు నడకకెళ్ళదాం…”

అలా వాళ్ళు మాట్లాడుకుంటూ నడక సాగించారు.

***

శ్రీవైష్ణవంలో పురుషులు వారే పెరుమాళ్ళుకు భోగం(నైవేద్యం) వండుతారు. స్త్రీలను తాకనివ్వరు.

ఉదయమే మూడు గంటలకు లేచి తన సంధ్యాది కత్రువులు పూర్తి చేసి, స్వామికి కొద్దిగా నివేదన సిద్ధం చేసుకొని వెళ్ళి కోవెల తలుపులు తీస్తాడు రంగరాజన్.

అన్నీ అలవాటుగా భక్తితో పూర్తి చేసుకునే సరికే వేదాధ్యాయులు వస్తారు.

వారితో వేదం చదువుతూ మధ్యహ్నం వరకూ ఉంటాడు. అటు తరువాత మరల స్వామికి నివేదనా తదనంతరం స్వాత్మారామునికి నివేదన.

కొడుకులకు వేదం నేర్పినా, వారు అర్చకత్వం చెయ్యరు, ఇద్దరూ టీచర్లుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు.

***

రాఘవను మరుసటి రోజు దగ్గరలో ఉన్న పురాతనమైన దేవాలయానికి తీసుకుపోతానన్నాడు రాజన్.

సరే నన్నాడు రాఘవ. ఉదయమే రంగరాజన్ గోదాదేవికి పూజకు తిరుప్పావై చదువుతూ ఉంటే ఆండాళ్ళూ పరవశంగా పాడుతోంది. రాఘవకు ఇందతా చెడ్డ చిరాకు వేసింది. అతనికి ఈ వేదగానం, తిరుప్పావై నచ్చవు. ప్రసాదాలు మాత్రం కావాలి. అందుకే ఉదయం ఎలాగో బాలభోగం అయ్యే వరకూ కాలక్షేపం చేసి, కాస్త తిని బయటపడ్డారు. అలా వాళ్ళు మరుసటి రోజు అక్కడ దగ్గర్లో ఉన్న పురాతన దేవాలయాలకు సందర్శన పేరుతో ఉదయమే రాజన్ బండి మీద వెళ్ళారు.

రోజంతా తిరిగి సాయంత్రానికి మళ్ళీ ఇల్లు చేరారు.

తల్లి ఎంత అడిగినా వినకుండా ఆ మరుసటి రోజు బయలుదేరి సిటీ కొచ్చేసాడు రాఘవ.

ఆండాళ్ళు చేసేది లేక గోదా వత్రం చేస్తూ ఊర్లో ఉండిపోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here